శ్రీ గురు చరితము
ఇరువది రెండవ అధ్యాయము
ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః ఓం శ్రీ గణాధిపతయే నమః ఓం శ్రీ గురుభ్యో నమః
నామధారకుడు సిద్ధముని పాదములకు నమస్కరించి
చేతులు జోడించి సిద్ధమునీంద్రా! నరసింహసరస్వతీస్వామివారు అమరపురము విడచి
గంధర్వనగరము ప్రవేశించిరని చెప్పితిరి. అచ్చటి వృత్తాంతమును నాకు సెలవిండని
ప్రార్థించెను. అప్పుడు సిద్థముని ఇట్లు చెప్పచుండెను.
నామధారకా! నీవు
గురుకృపకు పాత్రుడవయితివి. నీ జీవితము కడు ధన్యము. నీ ప్రశ్నవలన నాకు
సంతోషమయ్యెను. కామధేనువుతో సమమగు గురుచరిత్రమును నీకు చెప్పచున్నాను. స్వామివారు గంధర్వనగరమున సంగమమున గుప్తరూపముగ
నుండిరి. అచ్చట భీమానది ఉత్తరవాహిని అయి ప్రవహించును. అమరజాయను మరియొక నది అందు
కలియుటచే ఆసంగమ స్థానము గొప్ప
తీర్థక్షేత్రముగ పరిగణించతగియున్నది. అచ్చట నొక అశ్వత్థవృక్షముకలదు ఆక్షేత్రము
ప్రయాగతో సమానము. ఇంకను ఆక్షేత్రమున అష్టతీర్థములు కలవు వాటి మహిమ ప్రసంగవశమున
నీకు ముందు చెప్పబడును. సమస్త తీర్థములును శ్రీ గురుమూర్తి పాదములయందే గలవు.
అయినను వారు తీర్థక్షేత్రపర్యటనము చేయుటయు అచ్చట నివసించుటయు, కేవలము భక్తజనుల తరింపజేయుటకు మాత్రమే. వారా
సంగమమున గుప్తముగ నున్నను వారి మహిమ అచిరకాలముననే ప్రకటితమయ్యెను. సూర్యుడు ఎంత
గుప్తముగనుండదలచినను అతని ప్రకాశము బహిర్గతము కాకుండునా! స్వామివారు సంగమమున
అరణ్యమున నివసించియు భిక్షార్థము మధ్యాహ్నకాలమునకు గంధర్వనగరమునకు వెళ్లుచుండిరి.
ఆగ్రామమున నూరు బ్రాహ్మణ గృహములు కలవు. అదియొక బ్రాహ్మణ అగ్రహారము. వేదపాఠకులు
అందు ఎందరో గలరు. అట్టి నగరమున మిక్కిలి బీదవాడగు బ్రాహ్మణుడొకడు కలడు. వారి యింట
ఒక గొడ్డుబోతు ముసలి బఱ్ఱె కలదు. దానిని ఆ గ్రామస్థులయిన కర్షకులు మట్టి మోయుటకు
ఇంకను అనేక పనులకు బాడుగకు కొనిపోవుచుందురు. ఈ బ్రాహ్మణుడు భిక్షాటనముతో
జీవించును. దానితోపాటు ఈబఱ్ఱెవలనవచ్చు బాడుగను కూడ తన ఖర్చులకు
ఉపయోగించుకొనుచుండెను. స్వామివారు ఆ దంపతులు సాత్విక స్వభావము కలవారగుటచే తరచుగా
వారియింటికే భిక్షకు పోవుచుండిరి. గ్రామములోని ధనికులగు బ్రాహ్మణులు మనము
శ్రోత్రియులము ఆ యతీశ్వరుడెవరో తరచుగా అబీదబ్రాహ్మణుని గృహమునకే భిక్షకు
పోవుచున్నాను. మన యిండ్లకు వచ్చిన షడ్రసాన్నము లభించునుగదా అని పరిపరివిధముల
విందావాక్యముల పలుకుచుండిరి. భక్తవత్సలుడగు గురుమూర్తి ప్రపంచాతీతుడు. సేవకుల
హితమునుద్దేశించి వారివారి గృహముల పవిత్రమొనర్చుటకుగాను భిక్షాటనమును మిషతో
వెళ్లుచుందురేగాని భక్తిలేనివారియింట నడుగయిన నిడరు. నిత్యతృప్తుడగు గురుమూర్తికి
షడ్రసాన్నములచే ఏమిప్రయోజనము. కృష్ణుడు బీదవాడగు విదురుని గృహమున విందు
స్వీకరించెనా! గురుకృప సాత్విక స్వభావము కలవారియందు మాత్రమే ప్రసరించును.
గురుకృపకు ప్రాతుడయినవాడు ఇహపరసుఖముల చూరగొనును. శ్రీమంతులతో వారికేమి ప్రయోజనము.
వారు తలచిన క్షణార్థమున కడు బీదవానిని చక్రవర్తిగ చేయగలరు. కోపించినచో ఇంద్రునంతవానిని
భస్మమొనర్చ సమర్థులు. తన భక్తులనొసట వ్రాయబడిన దుష్టలిపిని సహితము తమ
పాదస్పర్శమాత్రముచే మార్చివేయగలరు. అట్టి గురుమూర్తియొక్క బిరుదావళుల నేనెంత
వర్ణించగలను.
ఆబ్రాహ్మణుడు ఎన్ని జన్మలయందో ఎంతయో
పుణ్యయొనరించెను గాననే గురుమూర్తి వారియింటికి భిక్షకు వెళ్లుట తటస్థించెను. వైశాఖమాసము. మధ్యాహ్నసమయము. బ్రాహ్మణుడు
భిక్షాటనకు వెళ్లి యుండెను. ఆదినమున దైవవశమున నెవ్వరును ఆముసలి బఱ్ఱెను
బాడుగకుగాను తీసికొనిపోరయిరి. అది వారి యింటిబయిట కట్టివేయబడి యుండెను. అదేసమయమునకు గురుమూర్తి వారి యింటికి వచ్చి
భిక్షాందేహియని అనిరి. వారి మాట వినుటతోడనే. పతివ్రతయగు ఆబ్రాహ్మణుని భార్య
దిగ్గున వచ్చి స్వామివారికి నమస్కరించి స్వామీ నాభర్త యాయావరమునకుగాను
వెళ్లియున్నారు. శీఘ్రముగ మంచిధాన్యము తీసికొనిరాగలరు. ఈఆసనమున కూర్చుండి అంతవరకు
అనుష్ఠానమొనర్చుచుండుడని వినయముతో ప్రార్థించెను. వారు అట్లే ఆసనమున కూర్చొని
ఆమెతో అమ్మా! భర్తవచ్చెదరని చెప్పుచున్నావు. అంతవరకు నుండజాలను. నీయింట
బఱ్ఱెకలదుకదా! పాలు ఇచ్చిన త్రాగిపోయెదమనిరి. అప్పుడు ఆమె స్వామీ! ఏమిచెప్పుదును.
ఈగేదె పుట్టుకనుండియు మాయింటనే పెరిగినది. కట్టుట ఈనుట ఎరుగదు ముసలిదయినది.
దీనినిబాడుగకు తీసికొనిపోవుచుందురు. ఆద్రవ్యము మాకు కొంచెము ఆధారమగుచున్నది. నేడు
మాదురదృష్టమున దీనిని ఎవ్వరును బాడుగకుతీసికొని పోలేదు. అందువలన నిది యింటియందే
ఉన్నది అనెను. అప్పుడు గురుమూర్తినవ్వుచు అబద్ధములాడెదవేల! అది పాలనీయుగలదు.
నామాటనమ్మి పాలుపిండుము.ఆ క్షీరములనే నేనుత్రాగి పోయెదను అనిరి. అంత ఆమె
వారివాక్యముల విశ్వసించి పాత్రను తీసికొని ఆబఱ్ఱెను సమీపించ దానిరూపమే మారెను.
రెండు పాత్రముల నిండ క్షీరమిచ్చెను. ఆబ్రాహ్మణుని భార్య అది చూచి ఏమిచిత్రము. వీరు
ఈశ్వరులే కావచ్చును అని భావించి ఆక్షీరముల వేడిచేసి స్వామివారికి భిక్ష నొసగెను.
గురుమూర్తి సంతసించి పోవుచు మీర
ఖండలక్ష్మీసంపన్నులు కాగలరు. పుత్ర పౌత్రాభివృద్ధిగా ఇహపర సౌఖ్యముల నొందగలరు. అని
ఆశీర్వదించి తమ నివాస స్థానమయిన సంగమమునకు వెడలిది. అప్పుడు గృహయజమాని యింటికి
రాగా ఆమె జరిగిన వృత్తాంతమును అతనితో చెప్పెను. అప్పుడు అతను చాలా సంతసించి మన
పుణ్యము మంచిది. నేటికి గురుమూర్తి అనుగ్రహము లభించెను. అని చెప్పుచు భార్యా
సమేతముగ పూజాద్రవ్యముల వెంటవిడుకొని సంగమమునకు వెళ్లి, అచ్చట అశ్వత్థవృక్షమూలమున కూర్చొనియున్న గురుమూర్తిని
పూజించి స్తుతించెను. గురుమూర్తియు వారిని ఆశీర్వదించిరి. వారివలన వరముల నొంది
అదంపతులు తమ గృహము చేరిరి. కాన నోనామధారకా! గురుకృపకు పాత్రుడయినవారు దారిద్య్రము
నొందక అష్టైశ్వర్యములతో తులతూగుననుటలో నెట్టిసంశయము లేదు. ఈ ఆధ్యాయము నెవరు
పఠింతురో విందురో వారు గురు కృపకు పాత్రులు కాగలరు.
ఇది గురు చరితమున ఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
ఇరువది మూడవ అధ్యాయము
ఓం శ్రీ గణాధిపతయే నమః ఓం జయ శ్రీగురుదేవదత్త ఓం శ్రీ
గురుభ్యో నమః
సిద్ధముని నామధారకునితో పైకథావృత్తాంతమునిట్లు
చెప్పుచున్నారు. నామధారకా! గురుమూర్తి
బీదబ్రాహ్మణుని గృహమున మహిషీ క్షీరముల భిక్షగ గ్రోలి వెళ్లిన సంగతి వింటివి. ఆ
బఱ్ఱె తిరిగి సాయంకాలమునకు మరునాడుదయమునకు గూడ మామూలు పాడిగేదెలవలె సమృద్ధిగ
క్షీరములనిచ్చుచునేయుండెను. మామూలు ప్రకారము గ్రామస్థులయిన కర్షకులు ఆగేదెను
బాడుగకుగాను కొనిపోవవచ్చిరి. అప్పుడా బ్రాహ్మణుడు వారలతో మా బఱ్ఱె సమృద్థిగ
క్షీరములనిచ్చుచున్నది. ఇప్పుడే ఈ రెండుపాత్రలనిండ పాలుపిండితిమి. కాన ఇట్టి
బఱ్ఱెను బాడుగ కెందులకిచ్చెదము. పొమ్మనిరి. వారు ఆశ్చర్యపడి ఇదిఏమి ఆశ్చర్యము, కట్టనయినలేదు. ఈననయినలేదు. పాల నెటులనిచ్చెను?అని అనుకొనుచు తిరిగి వెళ్లిరి. ఈ వార్త గ్రామమంతయు
వ్యాపించెను. ఆ గ్రామాధికారియగు రాజు ఈచిత్రమువిని ఆశ్చర్యముతో బ్రాహ్మణుని
గృహమునకు వచ్చి అతనికి నమస్కరించి గొడ్డుబోతు బఱ్ఱెవలన పాలనెట్లు నెట్లు పిండితిరి
అని ప్రశ్నించెను. అప్పుడా బ్రాహ్మణుడు రాజుతో రాజా! ఒక స్వాములవారు
సంగమక్షేత్రమున వచ్చియున్నారు. ఇది వారి మహిమ. వారు ఈశ్వరులయి ఉండువచ్చును.
కొన్నిరోజులుగ మా యింటికి భిక్షకు వచ్చుచుండిరి. నిన్నటి రోజున నేను ఇంట
లేనిసమయమున వారు మాయింటి భిక్షకేతెంచిరి. ఆసమయమున మాగేదె యింటనే కట్టబడియుండెను.
వారు క్షీరముల భిక్షగ యాచించిరి. క్షీరములు మాయింటలేవని నాభార్య చెప్ప మీయింట
ఈగేదె కలదు కదా క్షీరములేదనుట ఎందుకు. దానిపాలు పితికి ఇమ్ము అని ఆజ్ఞాపించిరి.
వారి వాక్యమే కామధేనువయ్యెను. అప్పటినుండియు మాగేదె క్షీరముల నిచ్చుచునేయున్నది.
ఇది అంతయు ఆ మహాత్ముని ప్రభావమని చెప్పెను.
ఆ బ్రాహ్మణుని మాటలు విని రాజు పుత్రమిత్ర కళత్రాదులతో కలసి
చతురంగ సైన్యమును వెంటనిడుకొని సంగమమునకు వెళ్లి అచ్చటనున్న స్వామివారి పాదములకు
నమస్కరించి ఇట్లు నుతించెను. జగర్గురో!
జయజయ! మీరు త్రిమూర్తిస్వరూపులు. అపారమయిన మీమహిమను వర్ణించ నేనెంతవాడను, మీరు విశ్వతారకులు మాయామోహాంధకారములో పడియున్న
నన్నుద్ధరించుడు. ఇచ్ఛామాత్రముచేతనే విశ్వమును సృజించ సమర్థులు. సామాన్యుల
దృష్టికి మనుష్య రూపముతో నగుబడుచున్నారు. మీరు విశ్వాతీతులు. ఇట్లు భక్తితో ఎంతయో
స్తుతించెను. మాటిమాటికి వారి పాదములందు శిరముంచి నమస్కరించెను. అప్పుడు స్వామివారు
అతని భక్తికి లోపల సంతసించి ఓదార్చి రాజుతో ఇట్లనుచున్నారు ఓరాజా! మేము అరణ్యమందు
నివసించెడి తాపసులము. యతులము. నీవింత
సంభ్రమముతో దారాపుత్రులతో సపరివారముగ నిచ్చటకు వచ్చుటకు కారణమేమి? అని ప్రశ్నించిరి. అప్పుడా రాజు చేతులు జోడించుకొని
స్వామీ మీరు విశ్వతారకులు. భక్తుల నుద్ధరించు నిమిత్తము అవతరించిన నారాయణులే మీరు.
ఇట్టి అవతార పురుషులైన మీరు ఈ అరణ్యమున నుండుట ధర్మముగాదు. మీమహిమును వేదములుగూడ
వర్ణింపజాలవు మీరు మాయందు దయయుంచి మానగరమునకు దయచేసి మమ్ముల పావనమొనర్చుడు.
మీకచ్చట నొక మఠమును నిర్మించెదము. అచ్చట నివసించి మీరు అనుష్ఠానమొనర్చుచు
మమ్ములనుద్ధరింపుడని కడు భక్తితో
ప్రార్థించెను. స్వామివారు ఆ రాజు యొక్క అవ్యాజమైన భక్తికి సంతసించి తమలోతాము
పరేచ్చతో కొంతకాలమీ గ్రామమున నుండవలసిన సందర్బము కనబడుచున్నది. ఈ శరీరముద్వారా
కావలసిన కొన్ని కృత్యములు కలవు గాన ఇతని మనోరథమును నెరవేర్చెదను అని మనమున
నిశ్చయించుకొని ఆరాజుతో నీ భక్తికి మెచ్చితి, నీమనోరథమెట్లో అటులనే ఆచరించుమనిరి. రాజు గురుమూర్తి వాక్యములకు కడు సంతసించి
వారిని చక్కని పల్లకిలో కూర్చుండబెట్టి బ్రాహ్మణులు వేదఘోషచేయుచుండ మృదంగాది
నానావిధవాద్య ఘోషములతో గణగాపుర గ్రామమునకు తీసికొనివచ్చుచుండ గ్రామస్థులందరు
నీరాజనములుచేత పూని స్వామివారి కెదురై ఆహ్వానించిరి. గ్రామమునకు పశ్చిమభాగమున నొక
ఉన్నతమైన అశ్వత్థవృక్షము గలదు. ఆ వృక్షమున ఎంతకాలము నుండియో ఒక బ్రహ్మరాక్షసి
నివసించుటచేత దాని భయముచే ఆచుట్టు ప్రక్కల గృహములన్నియు పాడుబడి
యుండెను.స్వామివారు ఆవృక్ష సమీపమునకు వచ్చుటతోడనే ఆబ్రహ్మరాక్షసి చెట్టునుండిదిగి
గురుమూర్తిని సమీపించి చేతులు జోడించి స్వామీ! గాఢాంధకారమున పడియున్నాను. మీ
దర్శనమాత్రముచే నా పూర్వదోషములన్నియు నశించెను. మీరు నన్నుద్ధరించుడని
ప్రార్థించెను. స్వామివారు తమ హస్తమును దాని శిరముననుంచగా నది మనుష్యరూపము నొంది
స్వామివారి పాదములకు నమస్కరించెను. స్వామివారు దానితో నీకు సంగమమునకు
వెళ్లిస్నానమొనర్చుము. స్నానమాత్రముచేతనే
ముక్తి నొందగలవనిరి. అదియు నట్లొనర్చెను. స్నానమాత్రముచేతనే దానికి ఆ కళేబరము పోయి
జ్ఞానము కలిగి ముక్తి నొందెను. అందరును
ఆశ్చర్యమునొంది స్వామివారు మనుష్యమాత్రుడు కాడనియు, త్రిమూర్తిస్వరూపుడనియు నిశ్చయించుకొనిరి. రాజు ఆ అశ్వత్థ
సమీపముననే స్వామివారికి ఒక మఠము నిర్మించెను. నిత్యము భక్తితో నానావిధోపచారములతో
స్వామివారిని పూజించుచుండెను. స్వామివారు
మఠము నుండి నిత్యము అనుష్ఠానము కొరకు సంగమమును గూర్చి పోవుచుండ రాజుగూడను వారి
వెంట సైన్యముతో పోవుచుండెను. తిరిగి మధ్యాహ్నకాలమునకు వారిని మఠమునకు తీసికొని
వచ్చుచుండెను. అప్పుడప్పుడు స్వామివారిని పల్లకిలో కూర్చుండబెట్టివారితోకలసి
వనవిహారమునకు పోవుచుండును. స్వామివారు భక్తాధీనులు గాన భక్తునికెట్లు సంతోషమో
అట్లే వారును ఆచరించుచుండిరి. స్వామివారి మహిమ దేశదేశాంతరములు వ్యాపించెను.
ఎంతోమంది స్వామివారి దర్శనార్థము వచ్చుచుండిరి. బ్రహ్మణ సంతర్పణములు భక్తులచే
అవిచ్ఛిన్నముగా జరుగుచుండెను. గాండ్గాపురమునకు కొలదిదూరమున కుమసియను గ్రామముగలదు.
అచ్చట త్రివిక్రమభారతియను నొక స్వామివారు గలరు. ఆయన వేదశాస్త్రములయందు
గొప్పపాండిత్యముగలవారు. నిత్యము నృసింహస్వామిని మానసికముగా నర్చించువాడు. అట్టి
త్రివిక్రమభారతి ఇతరులవలన శ్రీనృసింహనరస్వతీస్వామి వారి యొక్క మహిమను వినుట
తటస్థించెను. అతనికి వీరియందు అసూయ భావము
కలిగి స్వామివారిని దాంభికుడనియు, యత్యాశ్రమము నకు వారుద్ధముగ ప్రవర్తించుచున్నాడనియు
పరిపరివిధముల ఇతరులతో దూషణవాక్యములు పలుకసాగెను. సర్వసాక్షియగు గురునాథుడు
త్రివిక్రమభారతీస్వామి చేసిన స్వనిందను వినుట తటస్థించెను. పైఅధ్యాయమును ఆ
రాబోవుకథను వినగలరు.
ఇది గురుచరితమున ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
ఇరువదినాల్గవ అధ్యాయము
ఓం శ్రీ గురుదేవదత్త శ్రీ గణేశాయనమః ఓం జయ జయ
శ్రీగురుదేవదత్త.
సిద్ధముని నామధారకునితో పైకథా వృత్తాంతమునిట్లుచెప్పుచుండిరి. శ్రీనరసింహసరస్వతీస్వామివారు, వారి దర్శనము నిమిత్తము మామూలు ప్రకారము
ఆగ్రామాధిపతి ఒక దినమున రాగా అతనితో కుమసీగ్రామమున నొక యతి నన్ను నిందించుచున్నటుల
తెలియవచ్చినది. రేపటిదినమున మనమచ్చటకు పోవుదమని చెప్పిరి. స్వామివారి వాక్యమును విని ఆరాజు సంతోషముతో
మరునాడుదయమున హస్త్యశ్వరథపదాతిసమేతిగా స్వామివారిని సమీపించి వారి నొక ఆందోళికయందు
కూర్చుండ బెట్టి గీతవాద్యపురస్కృతముగ మహోత్సవముతో కుమసీగ్రామమును గూర్చి తీసికొని
వెళ్లెను. అచ్చట నున్న త్రివిక్రమ భారతీస్వామివారు నిత్యమువలె స్నానమెనర్చి తన
ఇష్టదైవమైన నృసింహస్వామియొక్క మానసికారాధనకు కూర్చుండిరి. కాని ఆనాడు వారి
చిత్తము ఏకాగ్రము కాకుండెను. అప్పుడు వారు భగవంతునిగూర్చి నృహరే నన్ను ఈనాడు
ఉపేక్షించితిరేల. నాతపమంతయు వ్యర్థమాయెగదా
ఏమిచేతును అని చింతించుచుండ అతని మనమునొక యతీశ్వరుడు నదీతీరము నుండి వచ్చుచుండుట
గోచరమయ్యెను.
అప్పుడు వెంటనే దిగ్గున లేచి గ్రామ బాహ్యమునకు పోయి చూడ
వచ్చుచున్న స్వామివారేమి, రాజు అతని పరివారమేమి, గుఱ్ఱములు, ఏనుగులు సర్వము తనకు మానసికార్చన కాలమున గోచరించిన యతి
రూపమున గానవచ్చెను. అప్పుడతను
విభ్రాంతినొంది సాష్టాంగ నమస్కారమొనరించి స్వామీ!
త్రిమూర్తి స్వరూపా! మీ మహిమ
తెలియజాలక నేను మిమ్ముల నిందించితిని.
ఇట్లనంతరూపములతో మీరు కనబడి, ఇంతమందిలో జ్యేష్టులెవరో కనిష్టులెవరో, ఎవరిని నిజముగ శరణునొందవలెనో తోచకున్నది. ఈ చర్మచక్షస్సుచే మిమ్ముల పరీక్షించ సమర్ధుడకాను. మీరు సర్వ వ్యాపకులు. ఓ నృసింహ సర్వతీ త్రిమూర్తి
స్వరూపా! మీ నిజరూపము నాకు ప్రదర్శించి
ధన్యుని చేయుడు. నేను ఇంతకాలము నుండి
చేసిన తపస్సు నేటికి ఫలించినది. కాననే మీ దర్శనమయ్యెను. మీరు విశ్వ తారకులు. అని కడు దీనుడై ప్రార్ధించ గురుమూర్తి
ప్రసన్నుడై తన నిజరూపమున అతనికి దర్శనమిచ్చిరి.
అప్పుడు త్రివిక్రమభారతి చతురంగ సైన్యమును, ఆందోళిక యందు గురుమూర్తిని చూచెను. అప్పుడు స్వామివారు అతనితో నీవు నన్ను
దాంభికుడని, నిత్యము
నిందించుచుంటివని విని ఆ విషయమే నీతో ప్రసంగించ వచ్చితిని. నీవును నరహరి భక్తుడవు. లోకమున సత్పురుషుడవని ఖ్యాతినొందియున్నావు.
నీచిత్తమున శ్రీహరి కలడు. అతనే నీకు
నిజమును జ్ఞప్తికి తేగలడు అని చెప్పిరి.
గురుమూర్తి వాక్యములు విని ఆ త్రివిక్రమయతి నేను అజ్ఞానినై మూఢత్వముతో
ఒనర్చిన అపరాధముల క్షమింపుడు. మీరు
త్రిమూర్తి స్వరూపులు. మీ మాయలో
నిమగ్నుడనై యుంటిని. అట్టి నేను గుడ్లగూబ
సూర్యుని ప్రకాశమును చూడలేనట్లు మీ మహిమ గుర్తింపజాలనైతిని. గురుదేవా ! నా అపరాధము క్షమించి నన్ను మీ
సేవకునిగా స్వీకరింపుడు. అగాధమైన
అవిద్యయను మహా సముద్రమున ప్రాక్తనకర్మలనెడు తరంగములచే అటునిటు కొట్టబడుచున్న నన్ను
జ్ఞానమను నావయందు కూర్చుండబెట్టి మీ కృపయను అనుకూలవాతముచే నన్ను ఈ సంసారమను
మహాసముద్రముయొక్క ఒడ్డుకు చేర్చుడు. ఎవడు
మీదయకు పాత్రుడో వాడి పురాతన దోషములు, దుఃఖములు నశించును. వాడు ఈ కలిని
జయించి పరమార్ధము నొందగలడు.
పూర్వము కృష్ణుడు
అర్జునునకు విరాడ్రూపమును ప్రదర్శించెనని వింటిని. నేడు మీరు ప్రత్యక్షముగా నాకు
విశ్వరూపమును ప్రదర్శించితిరి. భక్తవత్సలా! మీమహిమయపారము. మీ పదదర్శనముచే నేను
కృతార్థుడనైతిని. గంగ సగర చక్రవర్తి
కుమారులనుద్దరించినటుల తమరు దీనుడనైన నన్ను ఉద్ధరించుటకొరకు ఇటు విచ్చేసితిరి.
అని పరిపరి విధముల స్తుతించ గురుమూర్తియు అతని భక్తికి సంతసించి నీకు ఈజన్మతో
సద్గతి సిత్థించెను. స్వస్థముగా నుండుమని అతనిని ఓదార్చి క్షణకాలమున సైన్యసమేతముగ
గంధర్వపురము చేరిరి.
నామధారకా! గురుమూర్తి
యొక్క మహిమ వర్ణించ నెవ్వరితరము? అట్టిమహాత్ముని ఎవ్వరు సామాన్య మనుష్యమాత్రునిగా తలతురో
అట్టి పాపులు ఏడుజన్మల పర్యంతము యమయాతనల ననుభవింతురు. గురువు బ్రహ్మ అనియు, విష్ణువు అనియు, శివుడనియు వేదశాస్త్రములు ఘోషించిచెప్పుచున్నని. కాని
ఓనామధారకా! అట్టి గురుపాదములయందు విశ్వాసముంచినవారు ఇహపరసౌఖ్యముల నొందగలరు.
ఈగురుచరిత్రమను చలివేంద్రమును భగవంతుడు మనకు ప్రసాదించెను. కాన
పూర్వసుకృతముగలవారు. అనాయాసముగా సులభముగా లభించుచున్న కథామృతమును పానమొనర్చి
ధన్యులగుదురు గాక.
ఇది గురుచరితమున ఇరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.
ఇంతలో గురుచరితమున జ్ఞానకాండము సమాప్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి