17, నవంబర్ 2025, సోమవారం

                                                                     శ్రీ గురు చరితము

రెండవ అధ్యాయము

శ్రీగురుభ్యో నమః  శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురు దత్తాత్రేయాయ నమః శ్రీ మహా లక్ష్మ్యై నమః

          నామధారకుడను భక్తుడు భగవంతుననుగ్రహమునొంది లేచి గాణగాపురమును గూర్చి పోవుచు శ్రమచే నొక చెట్టు క్రింద నిద్రించెను.  నిద్రలో భస్మమును ధరించి జటాధారియై, వ్యాఘ్రచర్మధరుడైన నొక సాధువును చూచెను.  వెంటనే నిద్ర నుండి మేల్కాంచి పోవుచుండగా స్వప్నములో చూడబడిన సత్పురుషుడు అతనికి దృష్టి గోచరుడయ్యెను.  అప్పుడాతనికి సాష్టాంగము నమస్కరించి మీ దర్శనముచే ధన్యుడనైతిని.  తమరెక్కడనుంచి వచ్చుచున్నారు?  మీ నామమేమి? సెలవిండని ప్రశ్నించ నాసాధువిటుల చెప్పదొడంగెను.  నాపేరు సిద్ధుడందురు.  తీర్ధ యాత్రలు చేయుచు వచ్చుచున్నాను.  మా గురువులైన నరసింహ సరస్వతీ స్వామి వారు భీమా అమరజా నదీ సంగమమున గల గాంధర్వ నగరమున నుందురు.  వారు త్రిమూర్తి స్వరూపులు.  భక్తులకు సమస్త సౌఖ్యములను ఐశ్వర్యములనిచ్చుటకు సమర్థులు.  వారి భక్తులకు దైన్యము ఎప్పుడునుండదు అని చెప్పెను. ఆమాటలు విని నామధారకుడు నేను కూడా స్వామి వారి భక్తుడనే.  నేనే కాక మా పూర్వీకులు కూడా స్వామి వారి భక్తులై ఉన్నారు.  అయిననూ నేను మిక్కిలి దీన స్థితిలో నుండుటకు కారణమేమి? అని ప్రశ్నించ సిద్ధముని ఇట్లు చెప్పుచున్నాడు. 

          గురుమూర్తి భక్త వత్సలుడు.  ఈ విషయమున సంశయము లేదు.  నీకు దృఢమైన భక్తి వారియందు లేకపోవుటయే నీదైన్యమునకు కారణమని తెలిసికొనుము.  నిజమైన గురు భక్తి ఎవరికి కలదో వారికి దేవతలు కూడ నపకృతి చేయజాలరు.  గురువు యొక్క కోపమునకు గురిఐనవారిని దేవతలు కూడ రక్షించప సమర్ధులు కారు.  అని సిద్ధముని యన నామధారకుడు సిద్ధమునితో స్వామీ! మీరు గురువు త్రిమూర్తి స్వరూపుడనియు గురుభక్తుని జోలికి దేవతలు కూడా రాజాలరనియు చెప్పితిరి.  ఈ విషయము స్పష్టముగ నాకు బోధపడునట్లు విశదీకరింపుడు అని ప్రార్ధించ సిద్ధముని ఇట్లు చెప్పెను.

          నామధారకుడా! వినుము.  మంచి ప్రశ్న వేసితివి.  సృష్ట్యాదియందు విష్ణుమూర్తి నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించెను.  అతని నాలుగు ముఖములనుండి నాలుగు వేదములుద్భవించెను.  ద్వాపర యుగాంతమున విష్ణువు వేద వ్యాసుడయి జన్మించి ఆ వేదములలోని ధర్మములను పద్ధెనిమిది పురాణములుగ రచించెను.  అందు బ్రహ్మ వైవర్తమను పురాణమున చెప్పబడిన విషయములను నీకు చెప్పుచున్నాను. ఆ పురాణమందు బ్రహ్మ దేవుడు కలిని గూర్చి గురువు యొక్క మహాత్మ్యమును గూర్చి చెప్పెను.  అదియే చెప్పుచున్నాను.  వినుము.  బ్రహ్మ దేవుడు నారాయణుని ఆఙ్ఞననుసరించి వేదములలో చెప్పబడిన విధానమున జగత్తును సృజించి కాలమును, కృతయుగమును, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అను నాలుగు యుగములుగా విభజించెను.  అందు కృతయుగ దేవతను ప్రథమమున పిలిచి భూలోకమునకు వెళ్ళి నీవు నీ ధర్మమును ప్రకాశింప చేయుమనెను.  ఙ్ఞాన వైరాగ్యములు కలిగి, అసత్యమన్ననెంతమాత్రము నెఱుగని యఙ్ఞోపవీతము, రుద్రాక్షలు ధరించి ఉన్న ఆ కృతయుగ దేవత బ్రహ్మకు నమస్కరించి ఇట్లనుచున్నది.  స్వామీ, మీరు నన్ను భూలోకమునకు పొమ్మను చున్నారు.  భూలోకమున  ప్రజలు సామాన్యముగా అసత్యపరులును, మూఢులును, నిందాపవాదములు చేయువారుగ నుందురు.  అట్టి స్థలమునకు నేను ఎట్లు పోగలననెను.  అప్పుడు బ్రహ్మ కృతయుగ దేవతతో త్రేతాయుగము వచ్చు పర్యంతమే నీవు భూలోకమున నుండుము.  నీకేమియు కష్టము కలుగనీయనని చెప్పి పంపెను.  కృతయుగము పూర్తి కాగా త్రేతాయుగ దేవతను పిలిచి భూలోకమునకు పొమ్మనెను.  యఙ్ఞ సామగ్రుల హస్తములయందు ధరించి బ్రహ్మ ఆఙ్ఞను శిరసావహించి భూలోకమునకు వచ్చెను.  ఆ కాలమున ప్రజలు యఙ్ఞములనాచరించు వారై ధర్మ రతులై యుండిరి.  త్రేతా యుగ కాలము పూర్తికాగా మిశ్ర రూపమైన ద్వాపరయుగ దేవతను బ్రహ్మ ఆహ్వానించి భూలోకమునకు పంపెను.  ఆ దేవత ఉగ్రతయు, శాంతియు, దయయు, పుణ్య పాపముల మిశ్రమమై ఉండుటచే ఆకాలమున ప్రజలు కూడా మిశ్రమ  స్వభావము కలవారుగానే ఉండిరి.  ద్వాపరయుగ కాలము పూర్తి కాగానే బ్రహ్మ కలియుగ దేవతను ఆహ్వానించెను.  అప్పుడు ఆ కలిదేవత విచారముతో నీచమైన పిశాచము వంటి కళావిహీనమైన ముఖముతో అశుభమై అడుగడుగునకు తొట్రుపాటు పడుచు కలహ ద్వేషముల వెంటనిడుకొని కుడిచేత నాలుకను ఎడమ చేత గుహ్యేంద్రియమును ధరించి, నవ్వుచు ఏడ్చుచు కోతివలె అనాకారమైన రూపముతో బ్రహ్మను సమీపించి ఏమి ఆఙ్ఞ అని అనెను.  అప్పుడు బ్రహ్మ ఆ కలియెక్క రూపమును చూచి పక పక నవ్వి నీవు ఒక చేతితో నాలుకను వేరొక చేతితో లింగమును ధరించి వచ్చిన కారణమేమి?అనెను.  ఆ మాట విని కలి ఇట్లనెను.  నేను ఎంతటి వారినైనను లింగము చేతను,  జిహ్వ చేతను జయించెదను.  ఇది నా ప్రతిఙ్ఞ.  అందుకనియే నేను వాటిని పట్టుకొంటిని.  నాకు ఎవరన్ననూ భయము లేదు అని అనెను.  అప్పుడు బ్రహ్మ కలితో మంచిది.  నీవు భూలోకమునకు వెళ్ళి కొంతకాలము నీ ప్రభావమును చూపుమని ఆఙ్ఞాపించెను.  దానికి కలి ఇట్లనెను.  స్వామీ!  నన్నెందులకు భూలోకమునకు పంపెదరు.  నేను ధర్మమును నశింప చేయువాడను.  సిగ్గు అనునది నాకు లేదు.  నిద్ర కలహ శోకములు నా అనుచరులు.  పరద్రవ్యాపహారులు, పరస్త్రీరతులు నా  సోదరులు.  దంభమాత్సర్యములు నా ప్రాణ స్నేహితులు. కొంగల వలె పైకి మాత్రమే యతుల వేషమును ధరించిన దాంభికులన్న నాకు పంచ ప్రాణములు.  భూత ద్రోహులు నాకాత్మీయులు.  పుణ్యమాచరించువారు నాకు పరమ శత్రువులు.  పవిత్రమైన భూలోకమునకు ఇట్టి నన్నెందులకు పంపెదరు? అని అనెను.  అప్పుడు బ్రహ్మ ఇట్లు చెప్పెను.  ఇతర యుగములయందు మానవునకు ఆయుష్యము మెండగుటచే వారు దీర్ఘకాలము తపమాచరించి సిద్ధినొందుదురు.  కలియుగమున మానవులు స్వల్పాయుష్మంతులగుటచే స్వల్పకాలముననే భగవద్భజన మాత్రముననే మానవులు కృతార్థులగుదురు.  కావున నీవు నా ఆఙ్ఞ ప్రకారము భూలోకమునకు పొమ్ము కానీ, బ్రహ్మ ఙ్ఞానులు, పుణ్యాత్ములు, భక్తులు మొదలగువారికి మాత్రము విఘ్నము చేయకుము.  అని అనెను.  ఆ మాట విని కలి ఇట్లనెను.  స్వామీ! మీరు చెప్పిన వారు నాకు పరమ శత్రువులు.  అట్టి చోటికి నేనెట్లు పోగలను. వారి పేరు వినగానే నాకు భయమగుచున్నది.  భూమండలమున భారతదేశము పుణ్యాత్ములచే నిండి ఉన్నది.  నేనక్కడికి పోయిన వారు నన్ను సంహరించెదరు.  నా గతి ఏమి ? అని అనెను.  అప్పుడు బ్రహ్మ నవ్వుచూ భయపడకుము.  కాలము నీకు తోడగును.  నీవు భూలోకమున నడుగిడినంత మాత్రముననే పుణ్యాత్ములకు కూడా పాపపు బుద్ధులు కలుగును.  ధర్మ వాసన నశించును.  కాన వెడలుమనెను.  ఆ మాట విని కలి ఇట్లనెను.  భూలోకమున తీర్ధ క్షేత్రములయందు శివ భక్తులు, ధ్యాననిష్ఠులు, ధార్మికులు నివసింతురు.  వారు నాకు శత్రువులు.  అట్టి వారిని చూచినంతమాత్రముననే నాకు శరీరము కంపించును.  నాసాగ్ర దృష్టి నిలిపి జపాదుల చేయువారిని చూచినంతనే నా ప్రాణములెగసి పోవును.  దారాపుత్రాదుల యందు ఆసక్తి గలవారై మోహజాలమున చిక్కి యున్నవారు నాకు చాలా ఇష్టులు.  వేదములను ద్వేషించువారు,  హరిహరుల  భేదభావమున చూచు వారు నాకు చాలా ఆప్తులు.  జితేంద్రియులు, రాగ ద్వేష రహితులునగువారు నాకు పరమ శత్రువులు.  అట్టి స్థలమునకు నేనెట్లు పోగలను? అప్పుడు బ్రహ్మ ఇట్లనెను.  నీ కోర్కె నెరవేరును.  జనసామాన్యము  నీకే వశులగుదురు.  కానీ కొందరు పుణ్యాత్ములు అనగా హరి హరులనభేద దృష్టితో భజించువారును, నిజమైన గురు భక్తులను, తల్లి తండ్రులను సేవించువారు కొందరుందురు.  నా ఆఙ్ఞను శిరసావహించి అట్టి వారి జోలికి నీవు పోకుము.  ముఖ్యముగా గురుసేవా నిరతులగువారిని నీవు పీడించకుము.  అని చెప్ప కలి  బ్రహ్మను గూర్చి స్వామీ! గురువననెవడో, ఆ గురు సేవలోనున్న మహిమ ఏమియో నాకు విశదముగా సెలవిండని ప్రశ్నించ బ్రహ్మ ఇట్లనుచుండెను.

           ఓ కలీ!  నీకు గురు మహిమ చెప్పుచున్నాను.  సావధానుడవై వినుము.  గురు అను శబ్దము నందు గ, ర, ఉ అను అక్షరములు కలవు.  ''గ'' అనగా సిద్ధినిచ్చు గణపతి, ''ర'' అనగా అగ్ని, ''ఉ'' అనగా విష్ణువు.  కావున ''గురు'' అను మంత్రము భక్తులకు సర్వాభీష్టములనొసంగును. గురువు త్రిమూర్తి స్వరూపుడు.  ఎట్లన గురువు జీవునకు బ్రహ్మ తత్త్వమును ప్రకాశింపచేసి  అఙ్ఞానమను శత్రువునుండి రక్షించును.  సంసార బంధమును నశింప చేయును.  భక్తునకు దేవుడు ప్రసన్నుడైన ఆదేవుని వలన అతడు సద్గురు సమావేశమును వరముగా కోరును. గురువే ప్రసన్నుడైనచో సర్వదేవతలు కోరకుండగనే ప్రసన్నులగుదురు.  గురువు యొక్క అనుగ్రహమునకు పాత్రులు కానివారలకు దేవతల అనుగ్రహము స్వప్నము నందును లభించదు.  కాన గురువును ప్రతివారు భక్తితో సేవించ వలయును.  అని బ్రహ్మ చెప్ప, గురువునకు అంత గొప్పతనమెందులకు వచ్చెనని కలి ప్రశ్నించెను. 

          దానికి బ్రహ్మ ఇట్లు చెప్పుచుండెను.  గురువు వలననే మనము తెలియని శాస్త్రవిషయములను తెలిసికొనగలుగుచున్నాము.  సంసారము నుండి మనల గురువే తరింపచేయగలడు.  గురు సేవచే సర్వమూ సిద్ధించుననుటకు నీకు ఒక కథను చెప్పుచున్నాను. వినుము. 

          పూర్వము గోదావరి తీరమున అంగిరసుడను మహర్షి యొక్క ఆశ్రమము కలదు.   పైలుడను  మహర్షి యొక్క పుత్రుడైన వేద ధర్ముడను ఒక మహాత్ముడు నివసించుచుండెను.  అతని వద్ద చాలా మంది శిష్యులు వేదాధ్యయనమొనర్చు చుండిరి.  ఒకనాడు వేదధర్ముడు తన శిష్యుల భక్తిని పరీక్షించ దలచి వారలతో  ఓ శిష్యులారా! నేను మీకొక  విషయము చెప్పు చున్నాను. నేను ఎన్నియో జన్మల క్రింద పూర్వమొక పాపము ఆచరించితిని.  నా తపస్సుచే అందు కొంత నశించెను. కొంత ప్రారబ్దము మాత్రము నేనుభవించక తప్పదు.  అట్టి  పాప ఫలమును  ఈ జన్మలో అనుభవించనేని నాకు మోక్షమునకు విఘ్నము వాటిల్లును.  ఆ పాప ఫలము అనుభవించుటకు సర్వ పాపముల నశింపచేసెడి కాశీపట్టణమునకు పోదలచితిని.  మీలోనెవరికైనను నా యందు భక్తి విశ్వాసములున్నచో నన్ను కాశీ పట్టణమునకు తీసికొని పొండు అని చెప్ప శిష్యులందరు ఒకరి మొగమొకరు చూచుకొనుచుండిరి.  కానీ అందు దీపకుడను ఒక శిష్యుడు మాత్రము గురువును సమీపించి నమస్కరించి స్వామీ! మీరు చెప్పినది సత్యము.  శరీరము స్వస్థముగా ఉండగనే  పాపమునకు ప్రతిక్రియ చేసికొనుట ధర్మము.  ఉపేక్షించితిమేని ఆ పాపమే విషముతో సమమై అనేక జన్మలకు కారణమగును. కాన మీ వెంట వచ్చి మీరు ఆ పాపము అనుభవించు సమయములో నేను మీకు సేవ చేసెదను.  అప్పుడు వేదధర్ముడు దీపకునితో ఇట్లు చెప్పు చుండెను.  దీపకా! ఇరువది ఒక్క సంవత్సరములు కుష్టురోగినై కండ్లు, కాళ్ళు కూడా స్వాధీనములో లేక పడి ఉందును.  నీవు అట్టి సమయములో నన్ను రక్షించగల శక్తి యుండిననే ఈ కార్య భారమున కొడంబడుమనెను.  ఆ మాట విని  దీపకుడు గురువుతో స్వామీ మీకు బదులు ఆ పాప ఫలమును నేనే అనుభవించెదను.  మీకు శ్రమ వద్దు.  ఆకుష్టురోగము నకే వచ్చునట్లుగా సెలవిండనెను.  ఆ మాట విని వేదధర్ముడు సంతోషించి కుమారా! ఎవరి పాప ఫలము వారే అనుభవించవలెను.  ఒకరు మరియొకరి పాప ఫలము అనుభవించుట ధర్మము కాదు.  కాన నేను ఈ శరీరమతోడనే ఆ పాప ఫలముననుభవించెదను.  రోగమునునభవించుట ఎంత కష్టమో అట్టివారికి సేవ చేయుటయు  అంతకంటెయు ఎక్కువ కష్టము.  కనుక ఈ విషయములో ఆలోచించి  నీకు శక్తి కలదేని నన్ను కాశీకి తీసికొని పొమ్ము.  ఇంతమాత్రము సహాయము చేసితివేని నాపాప ఫలమచ్చట అనుభవించి శాశ్వత విముక్తి పొందెదను.  అప్పుడు, దీపకుడు గురువుతో స్వామీ మీరు నాకు కాశీ విశ్వేశ్వరునితో సమానము గాన అట్లేయొనర్చెదననగా గురుశిష్యులిద్దరు కాశీ చేరి గురువు మణికర్ణికలో స్నానమొనర్చి విశ్వనాధుని పూజించి తన సంచిత పాప ఫలమనుభవించుటకు సన్నద్ధుడై కంబళాశ్వతరమను ఒక దేవాలయమున నివసించిరి.  వెంటనే అతని శరీరము కుష్టురోగముచే నాక్రాంతమయ్యెను.  నేత్ర హీనుడయ్యెను.  కానీ దీపకుడు శ్రద్ధతో సేవించు చుండెను.  శరీర అవయవముల నుండి చీము, నెత్తురు కారు చుండెను.  అందుండి క్రిములుకూడ బహిర్గతములగుచుండెను.  వేదధర్మునకు రోగ బాధచే స్మృతి నష్టమయ్యెను.  ఇట్టి స్థితిలో దీపకుడు గురువును విశ్వనాథునిగా భావించి బిచ్చమెత్తి అన్నము తీసికొని వచ్చి పెట్టుచుండెను.  రోగముచే పీడింపబడినప్పుడు సాధువులు కూడను శాంతిని కోల్పోయి కౄరస్వభావులగుట సహజమగుటచే శిష్యుడు తెచ్చిన భిక్ష మంచిదిగ లేదని తిరస్కార భావమున చిమ్మివేయును.  శిష్యుని కొట్టును.  అనరాని మాటలాడును. కాని ఒక్కొక్కప్పుడు మాత్రము కనికరించి శిష్య శిఖామణి నా నిమిత్తము ఇంత కష్టము అనుభవించుచుంటివా అని ఓదార్చును.  వెంటనే  బుద్ధి మారి నన్ను ఈగలు బాధించు చున్నవి.  వ్రణములను సరిగ కడుగుటయైనను లేదు.  అని అధిక్షేపించును.  సేవ చేయుచున్న అతనిని భిక్ష తేక కూర్చుంటివేమని విసిగికొనును.  ఇట్లెన్ని విధముల పరీక్షించిననూ శిష్యుడదియేదియు మనసున నుంచికొనక గురువునే మహేశ్వరునిగా భావించి సేవ చేయు చుండెను. కాశీ క్షేత్రమందున్ననూ తీర్ధయాత్రలు చేయుటకానీ, విశ్వేశ్వరుని దర్శించుట గానీ చేయక గురుసేవా నిరతుడు మాత్రమే అయి ఉండెను.  ఇట్లు కొంతకాలము జరుగ విశ్వనాథుడితని గురుభక్తికి మెచ్చి సమీపించి దీపకా నీకిష్టమైన వరమును అనుగ్రహించ వచ్చితి.  వేడుమనెను.  అప్పుడు దీపకుడు మృత్యుంజయా! మా గురువును విచారించి వారినభిమతమైనచో నీవలన వరము కోరెద.  అని చెప్పి దీపకుడు గురువు చెప్పి వినయముతో గురువరేణ్యా!  విశ్వనాథుడు నాకు వరములీయ వచ్చెను.  మీ ఆఙ్ఞ అయినచో మీ రోగము ఉపశమించునట్లు వరమడిగెదనని చెప్పెను. ఆ మాట విని గురువు ఓరీ నాకు సేవ చేయుట నీకు కష్ట మయ్యెనా! నాకీశ్వరుని వరముతో పనిలేదు.  నా పాప ఫలము పూర్తిగా నేనే అనుభవించెదను.  వరములచే తాత్కాలికముగా తగ్గినటులుండుటయే కానీ ఎప్పటికైననూ కర్మ శేషము అనుభవించక తీరదు అనెను.  ఆ మాట విని దీపకుడు ఈశ్వరుని సమీపించి శంకరా! మీ వరములతో మాకు పనిలేదు.  మా గురువునకు అభిమతము గాని వరము నేనెటుల కోరెదను?  కాన తమరు వెళ్ళుడనెను.  ఆ మాటవిని విస్మితుడై శివుడు కైలాసమునకు వెళ్ళెను.  మరియొక దినమున విష్ణువు కైలాసమునకు రాగా శివుడు దీపకుని యొక్క గురుభక్తిని  గూర్చి ప్రస్తావించెను.  శివుని వాక్యములు విని విష్ణుమూర్తి  అట్టి నిజమయిన గురుభక్తుని చూడ నుత్సహించి ఆ గురు శిష్యులున్న కంబళేశ్వర దేవాలయమునకు వచ్చి దీపకుడు చేయు గురు శుశ్రూష కచ్చెరువొంది దీపకుని పిలిచి దీపకా! నీ గురు భక్తికి సంతసించితిని.  వరము కోరుకొనమనెను.  అప్పుడు దీపకుడిటులనెను.  కోరికలే లేని నాకు మీరు వరములిచ్చుట యెందులకు.  నేనేమియు మిమ్ముల గూర్చి తపము చేయలేదు.  కోట్ల కొలది సంవత్సరములు మునులు మీవలన వరములనపేక్షించి తపమాచరించుచున్నారు.  అట్టి వారికే మీరు వలములనొసగుడు అని అనెను.  అ మాటలు విని విష్ణుమూర్తి  నాయనా! ఎవడు గురు భక్తుడో వాడే మాకు భక్తుడు.  కాననే నీ భక్తిచే ఆకర్షించబడి వచ్చితిని.  తల్లి దండ్రుల సేవించువారు, భర్తను సేవించు పతివ్రతలు మాకు భక్తులే.  యోగీశ్వరులను, సాధువులను పూజించుటయు మమ్ములను పూజించుటయే గాన నీ భక్తికి సంతసించితిని వరము కోరుకొనమనెను.  అప్పుడు దీపకుడు విష్ణుమూర్తితో మీరిచ్చు వరములు మా గురువే మాకునీయ సమర్థుడు.  గురువే మాకు సర్వస్వము.  అట్టి గురువునుపేక్షించి మీవలన వరములు కోరువాడను కాననెను.  అతని భక్తికి మిక్కిలి సంతసించి విశ్వనాథుని త్రిప్పి పంపినటుల నన్ను కూడ పంపకుము.  ఎట్లయినను నీకు వరములీయ వేడుక కలుగుచున్నది అని మిక్కిలి నిర్బంధించ దీపకుడు అట్లయినచో నాకు వెనుకటికన్న అత్యధికమగు గురుభక్తిని మాత్రము అనుగ్రహింపుమని ప్రార్థించుచు విష్ణుమూర్తి పాదములపై బడెను.  విష్ణుమూర్తి అట్టి వరమిచ్చి దీపకుని లేవనెత్తి, కౌగలించుకొని, ఆశీర్వదించి వెడలిపోయెను.  అంత దీపకుడు  గురువును  సమీపించి నమస్కరించ శిష్యుడా నీవు ఇంతవరకు విష్ణువుతోనేమి ప్రసంగించితివి.  వారివలన నేమి యాశించితివి అని అడుగ దీపకుడు స్వామీ! నేనేమియు కోరలేదు.  వరము కోరుమని మిక్కిలి నిర్బంధించగా మీ పాదములయందు దృఢభక్తిని మాత్రమే యాచించితిని అనెను.  ఆ మాటలు విని వేదధర్ముడు సంతసించి నీవు చిరంజీవివయి కాశీయందుండుము.  సమస్త సిద్ధులు నీయింట నుండును.  విశ్వనాథుడు నీ అధీనముననే యుండును.  నిన్ను ఎవరు కష్టకాలమున స్మరింతురో వారి కష్టములు తొలగును.  నిన్ను స్మరించువారు దారాపుత్రులతోడను, ధనకనక వస్తువాహనాదులతోడను సుఖముగ జీవింతురు అని చెప్పి మిక్కిలి ప్రేమతో దీపకు నాలింగనమొనర్చెను.  దీపకుడు గురు స్పర్శమాత్రముననే సమస్త విద్యాపారంగుడయ్యెను.  వేదధర్ముని శరీరము కుష్టురోగ రహితమై దివ్య శరీరమయ్యెను.  శిష్యుని భక్తిని పరీక్షింప గలందులకుగాను మహాఙ్ఞానియై గొప్ప తపస్వియైన వేద ధర్ముడు కుష్టురోగిగ కనబడెనే కాని అట్టి మహాత్మునకు పాపము శంకించ కూడ వీలు పడదు.  అట్టి మహాత్ములు కాశీ యాత్ర సలుపుట కూడ కాశీ క్షేత్రమహిమను లోకమునకు ప్రదర్శించుట మాత్రమే అని ఇట్లు కలితో బ్రహ్మ గురుభక్తి ప్రభావము చెప్పెనని సూతుడు శౌనకాది మహర్షులతో చెప్పినటుల బ్రహ్మ వైవర్త పురాణమున గలదు.  బ్రహ్మ వాక్యము విని కలి భూలోకమునకు వచ్చెనని  సిద్ధమునీశ్వరుడు నామధారకునకు గురుభక్తి ప్రభావము ఈ రెండవ అధ్యాయమున చెప్పెను.

ఇది గురుచరిత్ర యందలి గురుభక్తి ప్రభావమను రెండవ అధ్యాయము సమాప్తము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి