శ్రీ గురు చరితము
పదమూడవ అధ్యాయము
ఓం శ్రీ గురుదేవదత్త
జయ జయ నృసింహ సరస్వతి శ్రీగణాధిపతయేనమః
శిష్యుడా
నామధారకా! నీవును కడుధన్యుడవు కావుననే అత్యాసక్తితో గురులీలల ప్రశ్నించుచుంటిని
కాన నానందమయ్యెను, వినుము. స్వామివారు ఆప్రయాగ క్షేత్రముననే కొంత కాలముండి
ఇంకననేక మందికి సన్యాపాశ్రమ దీక్ష నిచ్చిరి. ఇది అంతయు వివరించి చెప్పవలయునన నది
గొప్ప గ్రంథమగును. గాన సంక్షేమముగ చెప్పుచున్నాను వినుము. స్వామివారి శిష్యులలో
ప్రఖ్యాతి గాంచిన శిష్యులు ఏడుగురు. 1. బాలసరస్వతి. 2కృష్ణసరస్వతి. 3.ఉపేంద్రసరస్వతి. 4. మాధవసరస్వతి. 5. సదానందసరస్వతి. 6. జ్ఞానజ్యోతి సరస్వతి, ఏడవవాడను
సిద్ధుడను పేరు తో వ్యవహరింపబడు నన్నుగా తలంపుము. వీరు ఒకరి కంటె ఒకరు
అధికులు. ఇట్లు గురుదేవులు శిష్యసమేతు లయి దక్షిణ దిక్కుగా పయనమొనర్చి తమ జన్మ
స్ధానమగు కరంజ నగరమునకు వచ్చిరి. తల్లితండ్రులు గుర్తించి పూజించిరి. అప్పటికి
వారికి స్వామివారు చెప్పినటుల నలుగురు కుమారులును ఒక కుమార్తెయు కలిగిరి. నగర
వాసులందరు స్వామివారి రాక తెలియుట తోడనే వచ్చి దర్శించి పూజించిరి. ప్రతివారును తమ
యింటికి భిక్షకు దయ చేయుడని ప్రార్థించిరి సర్వేశ్వరుడగుటచే స్వామివారు బహురూపముల
ధరించి ఆహ్వానించిన ప్రతివారియింటను భిక్షల ఏకకాలమున స్వీకరించిరి. అందరును స్వామివారిని చూచి శ్రీ మహావిష్ణునే యతి
రూపమున వచ్చెనని గ్రహించిరి. ఇట్టి మహాత్ముని సామాన్య మానవునిగ నెవ్వరు తలతురో
వారు నిశ్చయముగ నరకమునే పొందెదరు. త్రిమూర్తిస్వరూపుడగు దత్తాత్రేయుడే
కార్యార్థముగ నిట్లవతరించెనని తల్లిదండ్రులు భావించి భక్తితో పూజించిరి. పూజించు
సమయమున వారలకు పూర్వజన్మ స్మృతి కలుగగలందులకు తాము తమ వెనుకటి అవతారమయిన శ్రీపాద
శ్రీవల్లభుల రూపమున దర్శనమిచ్చిరి. తల్లి వారి పాదములు శిరముంచి నమస్కరించి, సర్వేశ్వరా మేము చేసిన ప్రదోష వ్రతమిట్లు ఫలించెను.
అని భావించి తన భర్తతో నేను పూర్వజన్మమున ఈదేవుని ఆరాధించితి గాననే మనకు ఈజన్మమున
వీరు పుత్రులయి జన్మించిరి అని చెప్పెను. అప్పుడు భార్యా భర్తలిరువురు వారిని
శరణుపొంది యతిరాజా! మమ్ముల సంసార మహాసముద్రము నుండి కడతేర్చుడని దీనులయి
ప్రార్థించిరి. అప్పుడు స్వామివారు ఇట్లు చెప్పుచుండిరి. ఏకులమున నెవ్వరయిన
సన్యసించిన ఆకులమున నలుబది రెండు తరముల వారుద్ధరింపబడుదురు. ఆవంశము వారికి
యమభయములేదు. పూర్వమున నరకమున నున్నవారు గూడ నరకము నుండి విముక్తులగుదురు. నేనే
మీవంశమున జన్మించ ఇక మీవిషయము చెప్పనేల మీకు యమభయము లేదు. బ్రహ్మ పదవి మీకు
లభించును. మీ పుత్రులు శతాయుష్మంతులయి అష్టైశ్వర్యములతో తులతూగెదరు. వీరికి పుత్ర
పౌత్రులను గూడ మీరు చూడగలరు. ఇట్లు ఇహలోకమున సుఖములననుభవించి అంత్య కాలమునకు
ముక్తి క్షేత్రమయిన కాశీ పట్టణము చేరి
అచ్చట భౌతిక దేహముల త్యజించి శాశ్వతపదవినొంద గలరు. కాన చింతింపకుడు అని వారల
నోదార్చిరి. ఆ సమయమున స్వామివారి పూర్వాశ్రమపుచెల్లెలు 'రత్న'
యనునామెవారిని
సమీపించి స్వామీ నేను తాపత్రయులచే తపించుచున్నాను. సంసార మహాసముద్రమున కామము
మొదలగు మొసళ్లు నన్ను పీడించుచున్నవి. స్వామీ నాకయితే తపమాచరించి సంసారము నుండి
విముక్తురాలను కావలయునను సంకల్పము దృఢముగ కలదు. కాన నాకేమయిన ఉపదేశింపుడనెను.
అప్పుడు స్వామివారు నవ్వుచు ఇట్లునిరి, అమ్మా స్త్రీలకు తపస్సుతోనేమి ప్రయోజనము? భర్తయొక్క సేవచేతనే స్త్రీలు ఉత్తమగతి పొందగలరు.
పతివ్రతయొక్క పాతివ్రత్యముచే ఈశ్వరుడు సంతసించి ఆమెకు సద్గతినొసంగును. కాన భర్తనే
మనస్సు స్థిరముగ చేసికొని శివునిగా భావింపుము. సేవించుము. నీవు ఉద్ధరింపబడుదువు.
అని చెప్పవారి మాటలువిని స్వామి మీరు బ్రహ్మ జ్ఞానులు . గురువులు. మీకు నమస్కారము.
మీరు భూత భవిష్యద్వర్తమానములు తెలిపిన వారు గాన ముందు జరుగబోవు నాజీవిత
ప్రారబ్ధమును దయచేసి సెలవిండని ప్రార్థించెను. అప్పుడు స్వామివారు అమ్మా
నీప్రారబ్ధము మంచిరిగాదు. పూర్వజన్మమున ఒక ఆవును తన్నితివి. నీ సమీపస్థులగు
దంపతులకు అన్యోన్య కలహమును పుట్టించి వారల నెడబాపితివి. ఈరెండు దోషములయొక్క ఫలమును
ఈజన్మలో నీవు అనుభవించనున్నావు. ఆవును తన్నిన దోషముచే కుష్ఠురోగము సంప్రాప్తము
కాగలదు. దంపతులకు విరోధము కలిగించిన దోషముచే నీ భర్త నిన్ను త్యజించును. సన్యాసి
యగును నిన్ను విడిచి వెళ్లిపోవును అని చెప్పిరి. ఆమాటలను విని ఆమె కడు దుఃఖించి
వారి పాదముల మీద పడి స్వామీ నన్నుద్ధరింపుడని ఏడవసాగెను. అప్పుడు స్వామి వారు
ఆమెనోదార్చుచు మంచిది. నీకు వృద్ధాప్యము వచ్చిన తరువాతనే నీభర్త నిన్ను
త్యజించును. అప్పుడు నీకు కుష్ఠురోగము సంప్రాప్తమగును. అప్పుడు నీవు భీమానదీ
తీరముననున్న గాణగాపురమను క్షేత్రమునకు రమ్ము. అచట నీవు నన్ను దర్శించెదవు.
అచటనున్న పాపవినాశనమను తీర్థమున స్నానమొనర్చినంతనే నీకు కుష్ఠురోగము పోవును అని
చెప్పి వారల సమాధాన పరచి శిష్య సమేతముగా బయలురేరి గోదావరీ తీరముననున్న
నాసికాత్య్రంబకమను క్షేత్రమునకు వచ్చిరి. నామధారకా! ఆక్షేత్రమును
పవిత్రమొనర్చుచున్న గోదావరీ మహానదియొక్క మాహత్మ్యమును సంక్షేపముగా చెప్పెద వినుము.
పూర్వము ఈశ్వరుని జటాజూటమున నున్న గంగను ఋషీశ్వరులు
ఉపాయముచే భూమికి తీసికొని రాగలిగిరి. పూర్వము గౌతముడను మహర్షి గలడు. గొప్ప క్షామము
రాగా ఋషులందరు క్షుద్భాధితులయి గౌతములవారి ఆశ్రమమునకే వచ్చిరి. గౌతముడు నిత్యము
పిడికెడు ధాన్యము ఉదయమున ఆశ్రమ ప్రాంతమున చల్లి తపమునకు కూర్చుండును. మధ్యాహ్న
కాలమునకు ఆ బీజములు ఫలించ ఋషులందరు నట్టి ధాన్యమును భక్షించిసుఖముగ
జీవించుచుండిరి. కొన్నాళ్లకు ఋషులు ఏకాంతమున కలసి మనము ఏవిధముగ నయినను ఈగౌతమునకు
గొప్ప సంకటమును కలిగించవలయును. అట్లొనర్చితిమేని ఈఋషి గొప్ప ఈశ్వర భక్తుడు గాన
గంగను భూమండలమునకు రప్పించ గలడు. మనకు అట్టి మహానదీ స్నానము చేయు పుణ్యము
లభించును. గంగ భూమికి ఏతెంచుటవలన ప్రస్తుత క్షామము గూడ నశించును. అని యోచించి వారు
దర్భతో ఒక మాయ గోవును సవత్సముగ నిర్మించి గౌతముడు వెదజల్లిన పైరు మీదికి పోవునట్లు
చేసిరి. గౌతముడది చూచి తన చేతనున్న దర్భ పవిత్రమును పైరు మేయుచున్న గోవుమీద
విసరివేసెను. వెంటనే వజ్రముచే కొట్టబడినటుల ఆగోవు క్రిందపడి మరణించెను. అచటనున్న
ఋషులందరు గౌతముని సమీపించి నీవు గోహత్యా పాతకమొనర్చితివి. శివుని జటాజూటమందలి
గంగనుభూమికి రప్పించి అందు స్నానమొనర్చిననే నీ పాపము పోవుననిరి. గౌతముడు అందుకు
గాను ఈశ్వరుని గూర్చి సహస్రాబ్దములు తపస్సు చేసెను. ఈశ్వరుడు ప్రత్యక్షమయి వరము
కోరుకొనుమన. స్వామీ! చరాచరాత్మకమగు
ఈలోకముయొక్క ఉద్ధారము కొరకు తమ జటాజూటము నుండి భూమికి గంగను ప్రసాదించుడని
ప్రార్థంచెను. శివుడట్లే యొనర్చెను. ఆ ప్రవాహమే గౌతమునిచే కొని రాబడినందున
గౌతమియనియు, గోహత్యా పాతకము నుండి గౌతముని విముక్తు చేసినందున గోదావరి
యనియు ప్రసిద్ధినొంది యున్నది. ఇట్టి మహానది గాననే గురునాధుడు గోదావరి తీరమునందలి
క్షేత్రముల పర్యటింప సాగెను. వారు మంజరీకమను గోదావరీ తీరమందలి ఒక గ్రామమునకు
వచ్చిరి. అచట మాధవారణ్యుడను నొక ముని గలడు. అతను ఆరోజున నిత్యమువలె తన ఇష్ట దేవత
అయిన నరసింహస్వామిని మానసోపచారములచే పూజింపుచుండ అతని చిత్తమున శ్రీనృసింహ సరస్వతీ
స్వామివారు ప్రత్యక్షమయిరి. అదే రోజున స్వామి వారినిప్రత్యక్షమగు దర్శించుటయు
ఘటించినందులకు ఎంతయు, ఆశ్చర్యపడుచు
గద్గదద్వనితో ఈశ్వరస్వరూపులగు మీ పాదద్వంద్వమును నేటికి దర్శింప గలిగితిని.
ధన్యుడనయితిని. అని నమస్కరించెను. స్వామివారును అతని భక్తికి సంతసించిరి. నాయనా
నీవు కృతార్ధుడవైతిని. నీకు ఈసంసారమున యాతాయాతములు (రాకపోకలు) నా ఈదర్శనముచే
పరిసమాప్తముల య్యెను. అని చెప్పుచు తన నిజరూపము నతనికి చూపిరి. అప్పుడు తన
హర్షనిర్భరుడై, వినయావనతుడై స్వామి జయ
జయ, మీరు జగద్గురువులు, లోకదృష్టికి మానవులుగా కనబడుచున్నను మీరు
త్రిమూర్త్యవతారమైన శ్రీదత్తాత్రేయులే, విశ్వతారకులు. మీచరణ దర్శనముచే కృతార్థుడనయితిని. అని స్తుతించెను. స్వామివారు
సంతసించి అతనితో ఓమాధవారణ్యా! నీవు మంత్రసిద్థినొందితిని. శీఘ్రముగనే శాశ్వత
బ్రహ్మ పదవి నొందెదవు. నీవు నిత్యము నరసింహోపాసన చేయుచున్నందున నేడు ప్రత్యక్షముగ
నన్ను దర్శింప గలిగితిని. అని చెప్పి అతనిని ఓదార్చి అచట నుండి శిష్య సమేతముగా
గోదావరీ తీరమున నడచుచు వాసర యను బ్రహ్మేశ్వరీ క్షేత్రమునకు వెళ్లిరి. అచ్చట
గోదావరి యందు స్నానమొనర్చుటకు గాను శిష్య సమేతముగా ప్రవాహమును సమీపించుచుండిరి.
అదే సమయమునకు ఉదరశూలతో భాదపడుచు నొక బ్రాహ్మణుడు నది ఒడ్డున పొర్లును నదిలో పడి
ప్రాణత్యాగమొనర్చ నుద్యుక్తుడయ్యెను. అతనిట్లు అనుకొనుచుండెను. నేను
మహాపాపాత్ముడను. ఈప్రపంచమున నుండి యేమి ప్రయోజనము. ప్రాణులకు అన్నమే కదా
జీవనాధారము, అన్నము తినక యెవ్వరు బ్రతుక జాలరు. అట్టి అన్నము నాకు
శత్రువయ్యెను. ఇట్టి నేను మరణించుటయే శ్రేష్టము. అని అనుకొనుచు గొప్ప పాషాణమును
పొట్టకు కట్టుకొని భగవంతుని స్మరించుచు దేవా! నేను భూమికి భారమైతిని. నేను
పూర్వజన్మమున నెవ్వరికిని అన్నదానమొనర్చ నైతిని గాబోలు, బ్రాహ్మణుని సిద్ధాన్నమును అపహరించితినో కపిల గోవు మేయుచుండ
దానినచట నుండి తరిమి వేసితినో! విశ్వాసఘాత మొనర్చితినో! ఈశ్వరుని పూజించనైతినో!
గురువుల నిందించితినో! తల్లిదండ్రుల నవమాన పరచితినో! ఇంటికి వచ్చిన అతిధిని
ధిక్కరించి వెడలగొట్టితినో! వనమును దగ్ధమొనర్చితినో! తల్లిదండ్రుల త్యజించి
భార్యతో మృష్టాన్నమును గుడిచితినో ఏపాపము వలననో నేనిట్లు కష్ట మనుభవిచుచున్నాను.
స్వామీ నన్ను రక్షించి కాపాడుము. అని పలుకుచు ప్రవాహములోనికి దిగుచుండ అదే సమయమున
శ్రీస్వామివారు అతనిని చూచుట తటస్థించెను. అప్పుడు వారు శిష్యులతో ఎవ్వడో గంగలో
పడి ఆత్మహత్య గావించుకొని బోవుచున్నాడు. మీరు వెళ్లి వెంటనే అతనిని ఒడ్డునకు
తీసికొని రండు అని ఆజ్ఞాపించెను.
శిష్యులు అట్లే పరుగున పోయి వానిని గురు సమీపమునకు తీసికొని
వచ్చిరి అప్పుడు వారు ఓ బ్రాహ్మణా! ఆత్మహత్య మహాదోషము గదా ప్రాణములనిట్లు ఎందులకు
నదిలో త్యాగము చేయ నుద్యుక్తుడవయితిరి. అనిరి. అప్పుడు అతడిట్లనెను. యతీశ్వరా!
నేను చెప్పిన ప్రయోజనమేమి? నేను భూమికి భారముగ
జన్మించితిని. పక్షమునకు గాని,
మాసమునకు
గాని ఒక్కసారి భుజించినను శూలబాధచే మరణ బాధ నొందుచుంటిని. ఆకష్టము భరింపలేక నీ
శరీరమును త్యజింప నుద్యుక్తుడనైతిని. శరీరము అన్నమయము గదా! అన్నము నాకు
శత్రువయ్యెను. ఇక నేను జీవించుట ఎట్లు? అనెను. అప్పుడు గురుమూర్తి ఓయీ భయపడకుము. నీవ్యధ నేటితో తీరెను. నీకు తగిన
ఔషధమిప్పుడే చెప్పెద. ఇక మీదట స్వేచ్ఛగ నీవు మృష్టాన్నమును భుజించ వచ్చును. అని అనుచుండ అదే సమయమునకు
ఆగ్రామాధికారియగు ఒక బ్రాహ్మణుడు స్నానార్థమచ్చటకు వచ్చుట తటస్థించెను. ఆ బ్రాహ్మణుడు
గురుమూర్తిని చూచు తోడనే భక్తితో సమీపించి మనో వాక్కాయ కర్మలతో వందన మాచరించెను.
అప్పుడు స్వామి వారు ఆ బ్రాహ్మణుని చూచి నీ పేరేమి? నీ నివాసమెక్కడ అని ప్రశ్నంప అతను అయ్యా! నేను
అపస్తంబశాఖీయుడను. బ్రాహ్మణుడను. కౌండిన్యన గోత్రమున జన్మించితిని, నా పేరు సాయందేవుడందురు. 'కడగంచి'
మాకు
నివాసస్థానముగ ఉదరపోషణనిమిత్తము ఈగ్రామాధిపతి అయిన యవన రాజు యొక్క సేవ
చేయుచున్నారు. ఇచ్చటకు వచ్చి ఒక సంవత్సరము అయ్యెను. నేడు మీదర్శన మాయెను. నేను
ధన్యుడనైతిని. నాజన్మకృతార్థమయ్యెను. నాజన్మాంతర దోషములు గూడ మీదర్శనముచే
నశించెను మీబోటి మహాత్ముల అనుగ్రహమునకు పాత్రుడయిన వాడు తప్పక భవార్ణవమును
దాటగలడు. అట్టి మీదర్శనము నేడు అప్రయత్నముగ నాకు ఘటిల్లెను. గంగా దర్శనమువలన పాపము. చంద్రుని సాన్నిధ్యముచే
తాపము. కల్పతరువువలన దైన్యము నశించును. మీబోటి సత్పురుషుల దర్శనము పాపముల, తాపముల, దైన్యములను గూడ నశింపచేయ సమర్థము అని చెప్పుచు
భక్తితో వారి పాదముల స్పృశించి నమస్కరించెను. అప్పుడు స్వామివారు అతనిని ఓదార్చి
సమీపము కూర్చుండ బెట్టుకొని అతనితో ఇట్లు చెప్పుచున్నాడు.
నీవు ఈబ్రాహ్మణుని ఇంటికి తీసికొని పోమ్ము. ఇతను
అకలితో బాధ పడుచున్నాడు. శూల వ్యాధిచే పీడితుడు గూడను. అయినను శంకించక ఇతనికి
ఈరోజున మిష్టాన్నమిమ్ము. నేటితో ఇతని బాధ శమించును. అనిరి. ఆమాట విని సాయందేవుడను
ఆ బ్రాహ్మణుడు స్వామీ నిన్నటి దినమున నెలకు గాను ఈగ్రామున నితడు భుజించెను. అందుచే
నింత బాధ నొందుచున్నాడు. నేడితనికి అన్నమిడితినేని తప్పక నాకు బ్రహ్మహత్య ఘటిల్ల
గలదు. ఏమి చేయుదుననెను. అప్పుడు గురుమూర్తి ఈరోజున అన్నమే ఇతనికి ఔషధము కాగలదు.
నాఆజ్ఞ అయ్యెను గాన సంశయించక గారెలు, పరమాన్నము సమేతముగా భోజనమిడుము అనిరి. అందులకు సాయందేవుడు అంగీకరించి స్వామీ
మీరు గూడ శిష్య సమేతముగ మా యింటికి భిక్షకు దయచేయుడని ప్రార్ధించి అందులకు
స్వామివారు అంగీకరించిరి.
ఇది గురుచరితమున పదమూడవ అధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
పదునాలుగవ అధ్యాయము
ఓం దత్తాత్రేయాయ నమః ఓం శ్రీ గణాధిపతయే నమః
జయ జయ సంకటహరణా శ్రీనృసింహ సరస్వతి
నామధారకుడు సిధ్ధమునితో ఓమునీశ్వరా! శ్రీనృసింహ సరస్వతీ
స్వామివారువానర క్షేత్రమున శూల రోగముతో పీడితుడగు బ్రాహ్మణుని రోగవిముక్తుని
చేసిరని చెప్పితిరి. ఆ పై కథ సెలవిండని ప్రశ్నంచ సిద్ధముని సంతోషముతో భక్తులకు
కామధేనువగు శ్రీ గురు చరిత్రమునిట్లు చెప్పుచున్నారు. శిష్య రత్నమా! వినుము.
ఏసాయందేవుని యింట
స్వామివారు శిష్య సమేతముగా భిక్ష చేసిరో అతని గురు భక్తికి అతను చేసిన పూజకు
మిక్కిలి ఆనందించి సాయందేవుని దగ్గరకు పిలిచి నీయొక్క భక్తికి మెచ్చితిని. నీవంశము
వారందరు నాభక్తి చేయుదురు. అని చెప్ప వారి మాటలు విని తన శిరమును వారి పాదముల
మందుంచి స్వామీ జయ జయ. మీమహిమ వేదములకును
వర్ణా నాతీరము. మీరు విశ్వవ్యాపకులు. బ్రహ్మ విష్ణు శివాత్మకులు త్రిమూర్తి
స్వరూపులయ్యు భక్తుల నాద్ధరించుటకు గాను మానవ రూపమున స్వీకరించితిరి. మీరుమమ్ముల
నాశీర్వదించితిరి. నా ప్రస్తుత పరిస్థితి తమకు చెప్పుచున్నాను. దయతో నాలకించుడు. నేడు ఏయవనుని వద్ద సేవ చేయుచుంటినో వాడు
మహాక్రూరుడు. ప్రతి సంవత్సరము తన సేవకుల మీద ఏది యోనెపముంచి ఒక బ్రహ్మ హత్య
గావించును. నేడు అందు నిమిత్తమే అతడు నాయందు మిక్కిలి కోపించి నన్ను వెంటనే రమ్మని
కబురు చేసియున్నారు. వాడు తప్పక నా ప్రాణముల నీరోజున తీయును. మీచరణ దర్శనమయినది.
మిమ్ముల నేను శరణు పొందితిని. ఇక నాకు మరణమున భయము లేదు అనెను. స్వామివారు అతని
వాక్యమును విని తన అభయ హస్తము నతని శరీరమున నుంచి సాయందేవా భయపడకుము. చింతించకుము.
నిర్భయముగ యవనుని యొద్దకు పొమ్ము. అతను నీకు అపకృతి చేయకుండుటయే గాక నిన్ను
బహుకరించి పంపును. నీవు తిరిగి వచ్చు పర్యంతము నేను ఇచ్చటనే ఉండెద. నీవు వచ్చుట
చూచియే నేను ఈ క్షేత్రమును విడిచి వెళ్లెదను నీవు నాభక్తుడవు సర్వాభీష్టముల
నొందెదవు. మీ వంశము వారు గూడను దీర్ఘాయుష్మంతులయి, ఆరోగ్యవంతులయి. నాకు భక్తులయి సుఖముగ నుండగలరు. అని
చెప్పిరి. సాయందేవుడు సంతోషముతో యవనుని సమీపించెను. సాయందేవుని దూరమునుంచి చూచి
కోపముతో కాలాంతకుడు వలె యవనుడు మండిపడుచుండెను. సాయందేవుడు సమీపించుచుండ అతనిని
చూచి దిగ్గన లేచి ఇంటిలోనికి పోయెను. సాయందేవుడు భయపడియు చిత్తమున గురు దేవుని
పాదముల ధ్యానించెను. చదల పురుగునకు ఎంత కోపము
వచ్చినను అగ్నినేమి చేయగలదు?
అట్లే
మ్లేచ్చుడెంత క్రూరుడయినను గురు కృపకు పాత్రుడయిన వానిపట్ల అతని క్రౌర్యమేమి చేయ
సమర్థము? ఎంత విషము క్రక్కు
సర్పమయినను గరుత్మంతుని హింసించ గలదా? గురు కృపకు పాత్రుడయిన వానికి కలికాలము వలననే భయములేదు. గురు స్మృతి
దారుణములయిన భయముల పారద్రోలును. గురుభక్తుని కాలమృత్యునే బాధింపజాలదు. మృత్యుభయమే
లేనప్పుడు యవనుడేను చేయును?గురుభక్తుడు యముని
వలనను భయపడ నవసరము లేదు. యవనుడు ఇంటిలోనికి పోయి శరీరమునుగూడ మరచి అట్లే
క్రిందపడిపోయెను. హృదయమున ప్రాణాంతకమయిన వ్యధను పొందసాగెను. స్మృతి భ్రంశమయ్యెను.
ఏడ్చుచు ఎవరో ఒకరు వచ్చి నన్ను తీక్షణములయిన కత్తులతో పొడుచుచున్నారని అరవసాగెను.
ఇంతలో నతనికి స్మృతి వచ్చెను. బయట నున్న
సాయందేవు డతనికి గుర్తుకు వచ్చెను. వెంటనే లేచి పరుగెత్తుకొని వచ్చి అతని పాదముల
పైబడి స్వామీ మీరెందుకు వచ్చితిరి
నేనేమియు మిమ్ముల పిలువనంపలేదు. అని చెప్పి వస్త్రముల భూషణముల గూడ బహుమానముగ
నిచ్చి మీరు మీగృహమునకు వెడలి సుఖముగ నుండుడని సాగపంపెను. అతడు సంతోషముతో
గంగాతీరమున నున్న గురుమూర్తిని సమీపించి సద్భావముతో నమస్కరించి జరిగిన
వృత్తాంతమంతయు వారితో చెప్పెను. గురుమూర్తియు సంతసించి నేను దక్షిణ దిక్కుగా తీర్థ
యాత్రలు సలుప వెళ్లుచున్నానని చెప్పిరి. వారి వాక్యములు విని సాయందేవుడు చేతులు
జోడించి స్వామీ నేనును పాదసేవకుడనయి మీవెంటవచ్చెద. భవహరములగు మీ చరణముల విడిచి
క్షణమయిన నుండజాల. సగర పుత్రుల నుద్ధరించ గంగవచ్చినట్లు తమరిచ్చటకు వచ్చుట
తటస్థించెను. కాన నన్నును మీ శిష్యునిగా స్వీకరించి వెంటతీసికొని పొండనిచెప్పుచు
వారి పాదముల పైబడెను. వినయావనతుడయిన అతని ప్రార్థనను విని గురుమూర్తి కడు సంతసించి
అతనితో ఇప్పుడిట్లు చేయదగదు. నేను కార్యార్థముగ దక్షిణ దేశమందలి తీర్థక్షేత్రముల
పర్యటించి పదుహేను సంవత్సరములకు మీగ్రామ సమీపమున నొకచోట నివసించెద. నీనప్పుడు
కళత్ర పుత్ర సమేతముగా నాదర్శనమునకు రావచ్చును. చింతించకుము. నీ అరిష్టములన్నియు
తొలగెను. సుఖముగ నుండుమని అతనిని ఓదార్చిఅచ్చట నుండి శిష్య సమేతముగ బయలువెడలి అనేక
తీర్థముల పర్యటించి వైద్యనాథమును క్షేత్రమునకు వచ్చిరి. అచ్చట వారు కొంతకాలము
ఏకాంతముగ నుండ నిశ్చయించిరి.
ఇది గురు చరితమున పదునాల్గవ అధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
పదునైదవ అధ్యాయము
ఓంశ్రీదత్తాత్రేయాయ నమః ఓం శ్రీ గణాధిపతయే నమః
ఓం శ్రీగురుభ్యో నమః
సిద్ధముని నామధారకునితో
గురుమూర్తి వైద్యనాథ క్షేత్రమున కొంత కాలము గుప్తముగ నుండ దలచిరని చెప్పితిరి.
అందులకు కారణమేని యని యడుగ సిధ్ధముని ఇట్లు చెప్పుచున్నారు. స్వామివారి మహిమ నలుదిక్కులు వ్యాపించెను. అనేక మంది సకాములయి
వారి దర్శనార్థము వచ్చుచుండిరి. అందులో సాధువులు కొంతమంది, అసాధువులు కొంతమంది, ధూర్తులు కొంతమంది, దుర్మార్గులు కొంతమంది వచ్చి
మేము మీకు శిష్యులమయ్యెదమని ప్రార్థించ మొదలిడిరి.
పూర్వము పరశురాముడు
దుష్టక్షత్రియుల సంహరించి, భూమి నంతటిని
బ్రాహ్మణులకు దానముచేసి ఒక సముద్రతీరమున తపస్సుచేయ కూర్చొని యుండ అచ్చటికిగూడను
బ్రాహ్మణులు వెళ్శి యాచించ మొదలిడిరి. అప్పుడు ఆప్రదేశమును కూడ వారలకే ఇచ్చి
యాచకుల బారినుండి తప్పించుకొనగలందులకు సముద్రమున నెక్కడో గుప్తముగ నుండిరను పురాణ
కథ గలదు. అట్లే గురుమూర్తి భక్తులకు భుక్తిముక్తుల నొసగుటకు అవతరించినప్పకి, భక్తిలేనివారును సకాములును యాచించవచ్చుట చూచి వారు
గుప్తముగ కొంతకాల ముండదలచిరి. ఈశ్వర స్వరూపయినవారు ఎట్టివరమునయినను. ఎవ్వరికయినను
ఈయసమర్థులు. కాని పాత్రానురూపముగ వరముల నొసంగుట యుచితమని భావించి వారు గుప్తముగ
కొంతకాలముండదలచి ఒకనాడు శిష్యులు రప్పించి నేనీ క్షేత్రమున కొంతకాలము ఏకాంతము
ననుండదలచితిని. మీరందరు తీర్థయాత్రలకు
పొండు. అనగా వారు స్వామివారి పాదములకు
నమస్కరించి స్వామీ, గురురాజా! మమ్ముల
నుపేక్షించుచున్నారెందులకు! మీ పాద దర్శనమువలననే మాకు సమస్త తీర్థయాత్రాఫలము
లభించుచున్నది. గురుపాదములందే సమస్త తీర్థములు కలవని శ్రుతి స్మృతులు రూపించుచున్నవి.
సమీపమున నిధియుండ ఎవ్వడయినను కాననముల కట్టెల కోసము పర్యటించునా? కల్పవృక్షమును వదలి ఎవరయిననూ కంటక వృక్షముల
నాశ్రయింతురా? అని అనిరి. వారి మాటలు
విని స్వామివారిట్లు చెప్పిరి,
మనము
సన్యాసులము. సన్యాసి అయినవారు అయిదురోజులకు మించి ఎచ్చట నుండరాదు. సన్యాసాశ్రమమును
స్వీకరించిన పిదప తీర్థపర్యటనము గావింపవలయును. చిత్తము స్థిరమయి బ్రహ్మానుభవము
కలిగిన తదుపరి ఒక్కచోటనుండుట సమంజసము. కాన నావాక్యముననుసరించి మీయాశ్రమ ధర్మము
ప్రకారము తీర్థక్షేత్రముల పర్యటించి బహుధాన్య సంవత్సరమున శ్రీ శైలక్షేత్రమున
నన్ను కలియుడు అనిచెప్ప వారు స్వామీ!మీ వాక్యము మాకు ప్రమాణము. గురువాక్యము నెవ్వడు
శిరసావహించడో వాడు రౌరవ నరకమును పొందును. వారికి యమపురమే గృహమని పెద్దలు
చెప్పుదురు. కాన మేము మీఆజ్ఞప్రకారము వెళ్ళెదము. కాని ఏయేక్షేత్రముల నెవ్విధమున
యాత్రచేయవయునో అదియును మాకు దయచేసి సెలవిండని ప్రార్థించ స్వామివారు శిష్యులతో
తీర్థయాత్రా విధానమును చెప్పుచుండిరి.
బ్రహ్మండ
గోళమున ప్రసిద్ధిగాంచిన తీర్థరాజము కాశీపట్టణము. అచ్చటకుపోయి భాగీరథియందు
స్నానమొనర్చుడు. ఎన్ని ఆమడలు ఏనదీతీరము వెంబడి యాత్రగావింతురో అన్ని కృచ్చ్ర
చాంద్రాయణాది వ్రతములు చేసిన ఫలము లభించును.
అచ్చటనుండి గంగాద్వారమునకు వెళ్ళుడు. తరువాత యమునానదీ తటాకయాత్ర చేయుడు.
ఇట్లే సరస్వతీనది, వరుణానది, కుశావర్తము, శతుదృవు,
విపాశ, శరావతి, వితస్థ, అశక్ని, మరుద్వృధ, దృతపతియను నదులవెంట యాత్రను సలుపుడు. అట్టి నదులందు స్నానము చేయుటచే
బ్రహ్మహత్యాది మహాపాతకములు నశించును. చంద్రభాగ, రేవతి,
గోమతి, వేదిక, కౌశికి సాహస్రవక్త్ర , పూర్ణ, బాహుదా, నదులను సేవించుడు. నదులు సంగమమెచ్చటనగునో అచ్చట స్నానము చేయుటచే త్రివేణి
స్నానఫలము సిద్ధించును. వైరోచని,
పుష్కరతీర్థము, కురుక్షేత్రము, శ్రీశైలము, శ్రీరంగము, రామేశ్వరము, అనంతశయనము, మహాలయ తీర్థము, నైమిశారణ్యము, కేదారము, నర్మదానది, కోకాముఖమనే క్షేత్రము, గోకర్ణము,
అయోధ్య, మధుర, ద్వారక ఇవి అన్నియు ముక్తి క్షేత్రములు గాన వాటిని గూడ సేవింపుడు. గోదావరీ
తీరమున ఆరు ఆమడలు యాత్రచేయువారు వాజపేయ వ్రతఫలము నొందుదురు. సవ్యముగ గోదావరి నదికి
మూడు పర్యాయములు ప్రదక్షిణముగ యాత్రచేయువారు మహాపాపములనుండి విముక్తి పొందుదురు.
భీమేశ్వరము వజ్ఞర ఈరెండు క్షేత్రములు ప్రయాగతో సమానములు. కుశతర్పణమును క్షేత్రము
బహుఫలప్రదము. గోదావరీ సాగరసంగమమున స్నానము చేయుటచే ముప్పదియారు కృచ్చ్రములు చేసిన
ఫలము లభించును. పూర్ణనదీయాత్రయు కృష్ణవేణీ నదీయాత్రయు సలువుడు. తుంగభద్రానదియందు
స్నానమొనర్చుడు. పంపా సరోవరము కడుపవిత్రమయినరి. హరిహర క్షేత్రము సర్వపాపహరము.
భీమానదీ తీరమున నున్న పాండురంగని దర్శించుడు. భీమా అమరజానదీ సంగమమున గంధర్వపురమును
(గణగాపురము) క్షేత్రముగలదు. అచ్చట కోటితీర్ధములు కలవు. అచ్చటి అశ్వత్థవృక్షము
కల్పవృక్షముతో సమానము. అశ్వత్థ సమీపమున నృసింహతీర్థము దానికి ఉత్తరమున క్రమముగా
పాప నాశనము, వారణాసి తీర్థము, రుద్రపాదతీర్థము, చక్రతీర్థము, కోటి తీర్థము, మన్మథతీర్థము మొదలగు
తీర్థములు కలవు. అచ్చట కళ్ళేశ్వరుడను ఈశ్వరుడు కలడు. ఈక్షేత్రము గోకర్ణముతో
సమానము. ఆక్షేత్రమునకు వెళ్ళి అనుష్ఠానమొనచ్చువారి మనోరథములు తప్పక ఫలించును. కాన
నాక్షేత్రము సిద్ధభూమియని ప్రసిద్ధినొందినది.
కనుక ఓ శిష్యులారా! నేను చెప్పినటుల మీరు
తీర్థయాత్రలు సలుపుడు. మీజన్మాంతర పాపములన్నియు నశించగలవు. బృహస్పతి సింహరాశికి
వచ్చినపుడు గంగ గోదావరి యందు సంగమించును. దానినే పుష్కరమందురు. అట్లే బృహస్పతి
కన్యారాశికి వచ్చినపుడు గంగ కృష్ణానదిని చేరును. ఇట్లు మహానదులకు పన్నెండు
సంవత్సరముల కొకసారి పుష్కరమను పుణ్యకాలమునచ్చుటచే ఆ నదులయందప్పుడు స్నానములు
మొదలగు పుణ్యకర్మల నాచరించులచే నత్యధిక ఫలము లభించును. భీమానదీ కృష్ణానదియందు
కలియుచోట ఎవ్వడు స్నానమొనర్చునో వాడు శుద్ధుడయి ఆరువది (60) పర్యాయములు వరుసగా విప్రుడయి జన్మించును. పాతాళ గంగయందు
స్నానమొనర్చి మల్లికార్జునుని దర్శించువారికి ముక్తియే సిద్ధించును. కృష్ణాసాగర
సంగమము, కావేరీసాగర సంగమము
సర్వపాపముల నశింపచేయ సమర్థము. శేషాద్రి, కుంభకోణము, కన్యాకుమారి.
మత్స్యతీర్థము, పక్షితీర్థము, రామేశ్వరము,ధనుష్కోటి,
మహాలక్ష్మికి
నివాసస్థానముయిన కోల్హాపురము (కరవీరము) ముఖ్యక్షేత్రము గాన ఆక్షేత్రమును
సేవింపుడు. అట్లే కృష్ణానదీ తీరమున భిల్లవటియను గ్రామము కలదు. అక్కడ భువనేశ్వరియను
అమ్మవారు కలరు. ఆక్షేత్రమును సేవింపుడు. కృష్ణానదీతీరమున అమరపురమును నొక క్షేత్రము
కలదు. అచట నదులు కృష్ణతో సంగమించును. యుగాలయమను తీర్థము. శూర్పాలయమును మరియొక
తీర్థము. ఇవి పరమపవిత్రములు మలాపహా అనేనది కృష్ణతో సంగమించును. అది విశ్వామిత్రుడు
తపమొనర్చిన స్థానముగాన పరమపాపనము. కపిలా క్షేత్రమున కృష్ణానది ఉత్తరవాహిని అయి
ప్రవహించును. అచ్చట చేసిన మంత్రజపము కోటిరెట్లుగా ఫలించును. పిఠాపురము
దత్తాత్రేయులకు నివాసము. మణిగిరియను క్షేత్రమున సప్తఋషులు తపమొనర్చిరి. అహోబలమును
క్షేత్ర దర్శనముచేతనే ఆరువది (60)
యజ్ఞములు
చేసిన ఫలములభించును. ఇవ్విధమున పైన చెప్పబడిన తీర్థక్షేత్రములయాత్ర గావింపుడు.
వర్షాకాలమున ప్రతినదికి రెండు నెలలు రజస్వలాదోషము తటస్థించునుగాన ఆదినముల ఆనదీ
స్నానము చేయరాదు. భాగీరథి, చంద్రభాగ, సింధునది, గోదావరి, సరయు, నర్మద మొదలగు మహానదులకు మూడుదినములు మాత్రమే
రజస్వలాదోషము వాటిల్లెనని గ్రహించవలయును. వాపీకూప తటాకములకు ఒకదినము మాత్రమే
రజోదోషము. ఈనియమము యాత్రచేయు వారికి వర్తించునుగాని ఆతీరస్థులకు వర్తించదు.
సాధారణమయిన యాత్రా విధిని చెప్పితిని.
ఇంకను ఆయా క్షేత్రములకు వెళ్ళినపుడు చేయవలసిన క్షౌర ఉపవాసాది నియమముల
పాటించ వలయును అని చెప్పి శిష్యుల తీర్థయాత్రకు సాగనంపిరి.
నేను మాత్రము స్వామివారి సేవచేయుచు
వారివద్దనే ఉంటిని అని సిద్ధముని నామధారకునితో చెప్పెను.
ఇది గురుచరిత మందలి పదునయిదవ అధ్యాయము సమాప్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి