19, నవంబర్ 2025, బుధవారం

 

శ్రీ గురు చరితము

మూడవ అధ్యాయము

            సిద్ధముని వలన గురుభక్తి  ప్రభావమునంతయు వినిన నామధారకుడు స్వామీ! నేను మీదాసుడను.  మీ నివాసమెక్కడ  అని ప్రశ్నించ  సిద్ధముని అతనిని ఆలింగనమొనర్చి ఇట్లు చెప్పతొడగెను.  మా గురువు యొక్క నివాస గ్రామమే మా గ్రామము.  గురు మహిమామృత పానమే మాకు జీవనాధారము.  ఈ పుస్తకమును చూడుము.  ఇది గురు చరిత్రము.  దీనిని పఠించువారికి  భుక్తి ముక్తులు కరతలామలకములు.  పుత్రార్థికి పుత్రుడును, ధనార్థికి ధనము, ముముకక్షువునకు ఙ్ఞాన ప్రాప్తియు దీనిని పఠించుట వలన సిద్ధించును.  ఈ గ్రంథమునెవరు శుచియై భక్తితో సప్తాహములో పఠింతురో వారి మనో రథములు నెఱవేరును.  అట్టి వారికి గ్రహబాధలు కాని రోగపీడలుగాని కలుగవు.  అట్టివారు శతాయుష్మంతులగుదురు.  బ్రహ్మ హత్యాది పాపములు కూడ ఈ గ్రంథము పఠించినవారికి నశించును. అని సిద్ధముని చెప్పగా నామధారకుడు స్వామీ! ఎంతకాలము నుండియో ఈ గ్రంథమును పఠించ నిశ్చయించితిని.  దప్పికకొన్నవారికి  అమృతము లభించినట్లు నేటికి మా దర్శనమయ్యెను.  ఈ గ్రంథమును మీరే దయతో నాకు శ్రవణము చేయించి నన్ను ధన్యుని చేయుడని ప్రార్థించెను.  అప్పుడు సిద్ధముని అతనితో ఇంత పర్యంతము నీకు దృఢమైన గురుభక్తి  లేకపోవుటచే కష్టములననుభవించుచుంటివి.  దృఢమైన గురుభక్తి కలవానికి ఎట్టి కొరతయు నుండదు.  అని చెప్పి తన యొక్క హస్తమును అతని శిరమున నుంచి నామధారకా భయపడకుము. చింత వదలుము.  లెమ్ము.  సంశయమును విడనాడి గురువును భజింపుము.  గురుమూర్తి ఎన్నడును తన భక్తుని ఉపేక్షించడు.  గురువన దయాసముద్రుడని తెలిసికొనుము.  గురుచరణముల శరణు పొందిన వారికి లభించని దెద్దియు లేదు.  మేఘము అంతటా వర్షించును.  దానికి పక్షపాతము లేదు.  కాని ఆ ఉదకము ఎత్తు ప్రదేశమున నిలువజాలదు.  తటాకములయందే వచ్చి చేరును.  దాంభికుడయిన భక్తుని చిత్తము ఎత్తు ప్రదేశము వంటిది.  అక్కడ భక్తికి  తావుండదు.  కాన ఇప్పటికైనను నిశ్చలమైన భక్తితో గురువును భజింపుము.  గురువును కల్పవృక్షము తోడను పోల్చుటకు వీలుకాదు.  కల్ప వృక్షము సంకల్పించిన ఫలములనే ఇచ్చును.  గురువన్నచో శిష్యున కేది హితమో అదియే యొసంగును.  అని చెప్ప స్వామీ! నేనొక ప్రశ్న చేయుచున్నాను.  భగవంతుడు భూలోకమున మానవుడై అవతరించుటకు కారణమేమి?  అని ప్రశ్నించెను.  అప్పుడు సిద్ధముని శిష్యోత్తమా ఈ గురుచరిత్రమును శ్రవణము చేయుము.  నీ సంశయములన్నియు తీరును.  భగవంతుడు రూపరహితుడైనను ధర్మమును పాలించుటకుగాను భక్తులనుద్ధరించుటకుగాను అప్పుడప్పుడు భూలోకమున నవతరించుచుండును.  బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి సంహారముల జరుపుచుండుదురు.  ఈ ముగ్గురు పరస్పర భేదము లేనివారయ్యు కార్యానుసారముగ రూపముల స్వీకరింతురు.  అందులో విష్ణుమూర్తి  జగత్తును పాలించ వలసిన యధికారము గలవాడై ఉన్నందున విశేషించి యవతారముల ధరించుచుండును.  అట్టి విష్ణువు యొక్క యవతారములకు కారణము ఈక్రింది విధముగ చెప్పబడినది. వినుము. 

          పూర్వము సూర్య వంశమున అంబరీషుడను నొక విష్ణు భక్తుడు దృఢవ్రతుడై ఏకాదశీ వ్రతము నియమముతో జరుపుచుండెను.  ఒక రోజున అతని యింటికి దుర్వాసుడు అతని వ్రతభంగనిమిత్తమో యనునటుల వచ్చెను.  ఆరోజు ద్వాదశి ఒక ఘడియ మాత్రమే యుండెను.  అంబరీషుడు ద్వాదశి ఘడియలలోనే  పారణ చేయు నియమము గలవాడు.  అతడు దుర్వాసుని చూడగనే లోపల భయము నొందెను.  కాని అతను అతిథి సత్కారము చేయువాడు గాన విధిపూర్వకముగా దుర్వాసునెదుర్కొని  పాద ప్రక్షాళనమొనర్చి స్వామీ! ఈ రోజున ద్వాదశి స్వల్పముగనే కలదు.  తమరు శీఘ్రముగ అనుష్ఠానము పూర్తిచేసి పారణమునకు దయచేయుడని వేడెను.  దుర్వాసుడు నదికేగి ఎంతకాలమునకు రాకపోయెను.  అంబరీషుడు చేయునదిలేక  ద్వాదశి పారణము పండితుల అనుమతిపై ఉదకముతోడనే ఆచరించెను.  అంతలో దుర్వాసుడు వచ్చి మండిపడుచు అతిథియైన నన్ను అవమానము చేసి పారణ చేసితివి.  ఇదిగో నిన్ను శపించెదనని కన్నులెఱ్ఱ చేసెను. అంబరీషుడు చేయునదిలేక  తన మనస్సును విష్ణువునందు ఏకాగ్రముగ నిలిపెను.  వెంటనే విష్ణువు అదృశ్య రూపమున వచ్చి శరణాగత వత్సలుడు గాన ఇద్దరకు మధ్య నిలిచెను.  దుర్వాసుడు కోపముతో నీవు చేపవుగమ్ము.  పందివిగమ్ము.  రాజ్యార్హత లేని క్షత్రియుడవుగమ్ము.  అని ఎన్నియో శాపముల నిచ్చెను. వెంటనే విష్ణువు ప్రత్యక్షముగ దర్శనమిచ్చి దుర్వాసునితో ఋషీశ్వరా నీ శాపముల నేను వింటిని.  అంబరీషుడు నన్ను ధ్యానించుచు నాలో లయించి ఉండుట వలన నీ శాపములతడు వినలేదు.  కాబట్టి నీ శాపములననుసరించి ధర్మ సంరక్షణార్థము భూభారము తీసివేయగలందులకుగాను భక్తుల రక్షించుటకుగాను నేనే అవతరించెదను.  అని చెప్పెను.

          ఈపైనిమిత్తముచే భగవంతుడు విశ్వాత్ముడై సర్వ వ్యాపకుడైనను మత్స్యకూర్మాద్యవతారములను ధరించి శిష్ట సంరక్షణము, దుష్ట శిక్షణము, చేయుచుండెను.  దశావతారములే కాక ఇంకెన్నియో అవతారములు కలవు.  అట్టి అవతారముల రహస్యములను బ్రహ్మవిదులే తెలిసికొనుటకు సమర్థులు.  మూఢులు గ్రహింపజాలరు.  పూర్వకాలమున త్రిమూర్తులు, అనసూయదేవి అను పతివ్రతా రత్నము యొక్క గృహమునకు మధ్యాహ్న కాలమున అతిథి రూపులై వచ్చి ఉండిరి.  వచ్చి ఆమెను పరీక్ష చేయనెంచి ఆమెకు వారు పుత్రులయిరి.  అని సిద్ధముని చెప్ప నామధారకుడు ఆశ్చర్యముతో స్వామీ అనసూయాదేవి ఎవరో ఆమెకు త్రిమూర్తులు పుత్రులెట్లయినారో ఆ కథా భాగమును మీరు చెప్పుడని ప్రార్థించెను. 

ఇది గురుచరిత్ర మూడవ అధ్యాయము సమాప్తము.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి