26, జనవరి 2022, బుధవారం

                                                                 కాలోహి దురతి క్రమః

కాలము దుస్తరమైనది. కాలమును దాటుటకు ఎవరికీ శక్యము కాదు.  కాల ప్రభావమును  ఎవ్వరూ అడ్డుకొనలేరు.  కాల ప్రభావమున, రాముడు పత్నీ, సోదర సమేతముగా అరణ్యమునకు పంప బడ్డాడు. బ్రహ్మ మానస పుత్రుడైన, పులస్త్య బ్రహ్మ మనుమడుయైన, ఎంతో తపశ్శాలియైన  రావణుడు కాలమునకు లొంగి పర స్త్రీ వ్యామోహముతో బంధు మిత్ర సపరివార సమేతముగా, యుద్ధములో నశించినాడు. వాలియంతటి మహాబలశాలి కూడా యుద్ధమున మరణించెను. సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణడు తమ చెంత నుండగా కూడా, పాండవులు జూదములో ఓడిపోయి, అరణ్యముల పాలై, నానా కష్టముల పాలైరి.  కౌరవులతో యుద్ధమున జయించి కూడా విరోధులతో పాటు, స్వజనమును కూడా కోల్పోయిరి.  కురుక్షేత్ర యుద్ధమున కౌరవులందరూ మరణించిరి.  వారితో పాటు పాండవ పక్షమున  కూడా చాలా మంది మరణించిరి. కేవలము పాండవుడు  ఐదుగురు, ద్రౌపది, శ్రీకృష్ణుడు, సాత్యకి మాత్రమే చివరకు జీవించిరి.  చివరకు పాండవులు కూడా కాలమునకు లొంగి నశించిరి.  హరిశ్చంద్రుడంత వాడు చండాలుని గృహమున  నీరు మోసెను.  రామ, కృష్ణాద్యవతారములే కాలమునకు లొంగి సమాప్తిచెందినవి. అనంతావతారములే పుట్టి పుట్టి మరణించును. అనగా కాలము అందరినీ జయించును. కాలమును ఎవ్వరూ జయింపజాలరు. చిరంజీవులుగా  పురాణములు పేర్కొన్న, మార్కండేయుడు, హనుమంతుడూ  ఎవరో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. దేహముతో జన్మించిన వారందరూ ఎప్పుడో  ఒకప్పుడు మరణించవలసినదే అన్నది సత్యము. 

ఈ కాలమనగా నేమి? భగవద్గీతలో శ్రీకృష్ణడు చెప్పిన ప్రకారము అహం కాలః అనగా నేను కాలస్వరూపుడను. అనగా జీవులకు సుఖదుఃఖములు, జనన మరణములు కాలరూపమున కలుగ చేయుచున్నాడను అని  శ్రీకృష్ణడు చెప్పెను. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధః అని శ్రీకృష్ణడు చెప్పినాడు. సర్వలోకములను నశింపచేయుటకు విజృంభించిన కాలమును నేను అని చెప్పినాడు. 

అనగా పరమాత్మయే కాలము. పరమాత్మయే కాలస్వరూపుడై సృష్టి, స్థితి, లయములను చేస్తూంటాడు అని  గ్రహించ వలయును. 

అయితే  ఇట్టి కాలమును జయించగలమా అని ప్రశ్న. దానికి సమాధానముగా శాస్త్రములు దుస్తరమైన కాలమును జయించుటకు గురువును అన్యధా శరణు పొందుటే మార్గమని తెలిపినవి. గురు బ్రహ్మ, గురుర్విష్ణుః, గురు దేవో మహేశ్వరః, గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః అను ప్రార్ధనను అనుసరించి గురువును అనన్యభక్తితో శరణు వేడి తరించవలయును అని శాస్త్రములు తెలియ చేయుచున్నవి. 

కాబట్టి గురువును  సర్వాత్మనా శరణు వేడి తరించగలరు. 

12, జనవరి 2022, బుధవారం

గురువులు ప్రియశిష్యులకుం
బరమ రహస్యములు దెలియఁ బలుకుదు, రచల
స్థిర కల్యాణం బెయ్యది
పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్.

(భాగవతము, 1 వ స్కందము,42 పద్యము)

సూతుని శౌనకాది మహా మునులు ఈ విధంగా ప్రశ్నించినారు. గురువులు తమ శిష్యులకు వేదాంత రహస్యములుతెలియ చేస్తారు. కావున తమరు తమ శిష్యులమైన మాకు ఆ రహస్యములు తెలియచేయవలసినది. ఏది జీవులకు అనంత శాశ్వత సౌఖ్యమును ఇచ్చునో  ఆ విషయమును గూర్చి నిశ్చయించి  తెలియచేయమని ప్రార్ధించిరి. అనగా ఏవిధముగా జీవుడు మోక్షమును పొందగలడో ఆ విషయమును గూర్చి తెలియ చేయమని ప్రార్ధించిరి.

కావున అందరూ గురు సేవ చేసి ముక్తి మార్గమును తెలిసికొని తరించగలరు.