13, ఏప్రిల్ 2022, బుధవారం

గురు మహిమ

దత్తాత్త్రేయం గురుం శాంతం అవధూతం దిగంబరం।
భక్తాభీష్ట వరప్రదం వందే దేవ దేవేశమవ్యయం।।

త్రిమూర్తి స్వరూపుడైన శ్రీపాద శ్రీవల్లభ శ్రీనృసింహ సరస్వతీ శ్రీగురు దత్తాత్రేయ స్వామివారికి నమస్కరించి గురు మహిమను చెప్పప్రారంభించెదను. శ్రీగురుడు సాక్షాత్తు పరబ్రహ్మయే. ఎన్నియో పాపములను చేసిననూ శ్రీగురు దర్శనముతో అవి అన్నియూ భస్మీపటలము కలగలవు.  గురువు అనుగ్రహమునకు పాత్రులైన వారి పాపములు, అగ్ని స్పర్శచే క్షణములో దగ్ధమైన గడ్డి కుప్పవలె, దగ్ధమైపోవును. గురు మహిమ అపారము. అనిర్వచనీయము.   “చరణం పవిత్రం వితతం పురాణం”  అని శ్రీగురు చరణములను గురించి సమస్త వేదశాస్త్రములు ఘోషించుచున్నవి.  శ్రీగురుచరణ సరోజములను సేవించవలెను. గురువుతప్ప వేరొక దైవము లేనేలేదు. “దేవుడే గురుదేవుడు”.  లలాటముపైబ్రహ్మదేవుడులిఖించిన దుష్టాక్షరములు సైతము శ్రీగురు చరణములు తగిలిన వెంటనే అవి పూర్తిగా తుడుచుకొని పోయి, శుభాక్షరములుగా మారగలవు. కాబట్టి కృపానిధియైన గురువును గుర్తించి  ఆశ్రయించవలెను.  గురువును భజించుడు,సేవించుడు. తద్ద్వారా  సమస్త సౌఖ్యములు, సకల జ్ఙానసంపదను పొంది తుదకు పరమ పదమునుచేరుకొందురు. ఇందులో ఇసుమంతయు సందేహము లేదు.  

                  దత్తో నామస్మరణ మమలం కుర్వతాం సన్నిధానే।
గూఢాకారశ్చరతి సహసా వాంఛితం దాతుకామః।
నిత్యాకారం నిరుపమ యశస్సంపదామాది హేతుం।
దత్తాత్రేయం వరద మనిశం భావయామి ప్రపన్నమ్।।