22, నవంబర్ 2025, శనివారం

 

                                                                శ్రీ గురు చరితము

ఆరవ అధ్యాయము

శ్రీ గురుదేవ దత్త

            నామధారకుడు,  శ్రీపాదుల వారు గోకర్ణ క్షేత్రమున ఎంత కాలముండిరి? అనేక క్షేత్రములుండ ఆ క్షేత్రమును వారు మిక్కిలి ప్రేమించుటకు కారణమేమి? సెలవిండని ప్రశ్నించెను.  సిద్ధముని ఇట్లు చెప్పుచుండెను.

            శ్రీపాదుల వారు స్వయముగ తీర్థ స్వరూపులయినను భక్తుల నుద్ధరించుటకుగాను పుణ్యక్షేత్రముల సంచరించిరి.  గోకర్ణక్షేత్రము భూతలమందలి అన్ని క్షేత్రములకన్న శ్రేష్ఠమగుట వలన అచ్చట వారు మూడు సంవత్సరములుండిరి.  అట్టి క్షేత్రము యొక్క నిరుపమానమగు మహాత్మ్యమును చెప్పుచున్నాను.  సావధానుడవై వినుము.

            ఆ క్షేత్రమందు సాక్షాత్తు శివస్వరూపమయిన''మహాబలేశ్వరుడు'' అను పేరుగల లింగము విష్ణుమూర్తి ఆఙ్ఞననుసరించి గణపతిచే ప్రతిష్టింపబడెను.  ఆ సందర్భమెట్టిదన పులస్త్య బ్రహ్మకు కైకసియను భార్య కలదు.  వారి పుత్రుడు రావణుడను రాక్షసుడు.  ఆమెకు నిత్యము శివపూజనొనర్చు ఆచారముగలదు.  శివుని పూజించనిదే ఆమె భుజించదు.   ఒక దినమున ఆమెకు శివలింగము లభించనందున మట్టితో లింగము చేసి పూజించుచుండెను.  ఇంతలో రావణుడు తల్లిని దర్శించుటకు వచ్చి వందనమొనర్చి నాకు తల్లివైయుండియు ఈ మట్టి లింగమును పూజించుటకు కారణమేమి అన నామె అతనితో శివుని పూజించుటచే  కైలాసము ప్రాప్తించుననెను. అప్పుడు రావణుడు వ్యర్థముగా నీలింగమునెందుకు పూజించెదవు.  నేను నీకొఱకు పార్వతీ పరమేశ్వర సహితముగా కైలాసమునే కొనివచ్చి మన లంకలో ఉంచెదను.  నీవు నిత్యము యథేష్టముగ శివుని పూజించుకొనవచ్చునని చెప్పి కైలాసమునకు పోయి తన పది శిరస్సులు కైలాసమునకు  మోకరించి ఇరువది భుజములతో కైలాస పర్వతమును ఎత్తుటకు యత్నించెను.  కైలాసము చలించెను.  అప్పుడు పార్వతి భయకంపితురాలై శివుని సమీపించి కైలాసము పడిపోవుచున్నది.  మీరు స్వస్థముగనుంటిరేల? తగిన ప్రతిక్రియ చేయుడని ప్రార్ధించెను.  అప్పుడు శివుడు పార్వతితో ఏమియు భయపడకుము.  మన భక్తుడగు రావణుడు విలాసముగ క్రీడించుచున్నాడు.  అని చెప్పి నవ్వుచు పార్వతి భయమును నివారించుటకు గాను తన ఎడమ చేతితో కైలాసమును కొంచెము క్రిందికి  నొక్కెను.  అప్పుడు రావణాసురుడు కైలాసము క్రిందపడి ప్రాణసంకటవస్థ నొంది ఎట్లో తప్పించుకొని బయిటకు వచ్చి శివుని అఖండముగ స్తుతించెను.  తన శిరస్సును కొసి వీణగా చేసి ఒక భుజమును వీణాదండముగాను తన ప్రేవులను వీణకు తంత్రులుగాను చేసి అఖండమైన భక్తితో సప్తస్వర సహితముగా రాగముతో అద్భుతముగ సామగానమెనర్చెను.  అట్టి రావణుని నిరుపమానమైన భక్తికి సంతసించి శంకరుడు నీకు వరమిచ్చెదను. ఏమి నీ కోరిక అని అడుగ రావణుడు ఇట్లనెను. శంకరా! మీయనుగ్రహము వలన నాకెట్టి కొదువయు లేదు. లక్ష్మి మాయింట దాన్య మొనర్చును. నవనిధులు మా లంకలో కాపురము చేయుచున్నవి. బ్రహ్మనాకు వశవర్తియై నిత్యము మా యింట పంచాంగ శ్రవణము చేయును. ముక్కోటి దేవతలు నాకుసేవకులే. అగ్నిదేవుడు మాయింట బట్టలనుతుకును. యముడు గూడ నా యజ్ఞాలేనిదే ఎవ్వరిని ముట్టజాలడు. కుంభకర్ణుడు నా సోదరుడు ఇంద్రుని జయించినట్టి ఇంద్రజిత్తు నా కుమారుడు నాస్థానమా ఇతరులకు అజేయమగు లంకా పట్టణము, కామధేనువు మాయింటనే నివసించును. కాని మాతల్లికి నిత్యము మిమ్ముల పూజించు కోరిక కలదు. కాన కైలాస సమేతముగ మిమ్ముల  మా లంకకు తీసికొని పోవచ్చితిని. ఇదియే నాకోరిక. నా మనోరథమును సఫలము చేయుడు అనెను. ఆ మాట విని శివుడు రావణా ఈ కైలాసముతో నీకేమి ప్రయోజనము. నా ఆత్మ లింగమును నీకీయదలచితిని. అట్టి లింగమును త్రికాలములయందు పూజించి నా మంత్రమును జపించుము. మూడు సంవత్సరములట్లు ఒనర్చితివేని నీవే శివుడవగుదువు. నీ లంక కైలాసమగును. ఈ లింగమున్న చోట మృత్యు భయములేదు. ఇట్టి లింగమునుదర్శిరచినంత మాత్రమున సమస్తదోషమును నశించును. ఈ లింగమును మధ్యమార్గమున నెచ్చట నుంచక లంకకు గొనిపొమ్ము అనగా రావణుడు సంతసించి శివునకు సాష్టాంగముగ నమస్కరించి శివునివలన ప్రాణలింగమును స్వీకరించి లంకకు పయనమయ్యెను. ఈవిషయము నారదుడు గ్రహించి చింతనొంది వెంటనే స్వర్గమునకు పోయి దేవేంద్రునితో ఇంద్రా! స్వస్థముగ కూర్చున్నావు. రావణునిచే నీ ఐశ్వర్యము అపహరింపబడెను. అతను శివుని మెప్పించి వారి వలన ప్రాణలింగమును వరముగ పొంది పోవుచున్నాడు. ఇదివరకే రావణుని వలన బాధనొందుచున్నాము. ఈ లింగమే లంకకు చేరెనేని మనకతడ జేయుడగును. మీరందరు ఆయనకు కింకరులై దాస్యము చేయవలసిన గతిపట్టును. అనగా ఇంద్రుడు భయపడి ఇట్టి స్థితిలో నాకర్తవ్యమేమియో చెప్పుమని నారదుని ప్రార్థించెను. నారదుడు ఇప్పుడు మనము బ్రహ్మను శరణు వేడవలయును. తగిన ఉపాయమువారు చెప్పగలరు.  అని చెప్పి ఇంద్రుని వెంటనిడుకొని నారదుడు బ్రహ్మ లోకమునకు పోయి వారితో జరిగిన వృత్తాంతమంతయు చెప్పెను. బ్రహ్మయు తాను చేయునది ఏమియులేనందున నారదుని ఇంద్రుని వెంట పెట్టుకొని వైకుంఠమునకుపోయి జరిగిన వృత్తాంతమంతయు విష్ణుమూర్తితో చెప్పి ఇట్లనెను. ప్రాణలింగమే లంకను చేరినచో రావణుడు మీకును నవధ్యుడగును. కాన ఎట్టి ఉపాయముతోనైన ఇట్టి సంకటము నుండి త్రిభువనములను రక్షించి కాపాడుమని ప్రార్థించెను.

     అంతట విష్ణువు మిక్కిలి కోపించి ఎంత నష్టము వాటిల్లెనని వెంటనే కైలాసమునకు పోయి శంకరా! ఎట్టి పనిచేసితివి. రావణుడు క్రూరుడుగదా. పాముకు పాలుపోసినటుల దురాచారుడైన అతనికి ప్రాణలింగమును ఎట్లిచ్చితివి, దేవతల గతియేమి?  అని అనెను. అప్పుడు శివుడు నేనేమి చేయుదును. అతని భక్తికి నేను పరవశుడనైతిని. రావణుడు  తన శిరమును ఛేదించి వీణగ చేసి సామగాన మొనర్చెను. అతడడిగిన నా పార్వతినైనను ఇవ్వసమకట్టితిని. కాని నా ప్రాణలింగమే యాచించెను. అని అనెను. అప్పుడు విష్ణువు శివునితో ఇట్లు మీకు రాక్షసులకు దుర్లభములైన వరములనిచ్చుచుందురు. వారు దేవతల బ్రాహ్మణుల పీడించుచుందురు. అట్టి వారల సంహరించుటకు కష్టముల నేను పడుచుండ వలయును. అయినదేమో అయినది. ప్రాణలింగమున తనికిచ్చి ఎంతకాలమయినది! అతడు లంకను చేరియుండునా? అని ప్రశ్నింప శివుడు అయిదు గడియలయ్యెను. అతడు మార్గమధ్యమున నున్నాడు. మీరేదైన ఉపాయమొనర్చి దేవతల సంకటమునుండి తొలగించుడనెను. వెంటనే విష్ణువు సూర్యుడు కనపడకుండునటుల తన సుదర్శన చక్రమును సూర్యునకు అడ్డు పరచి నారదుని పిలిచి నారదా! నీవు మనోవేగమున పోయి రావణుని గమనమునకు విలంబమగు నటుల చేయుము. నేను నా సుదర్శన చక్రముచే సూర్యుడస్తమించి నటుల చేసితిని. రావణునకు సకాలమున సంధ్యానందనము చేయు నియమము గలదు. పై విషయము నేనాలోచించెదనని చెప్పి నారదుని పంపెను తరువాత గణపతిని స్మరించెను.  వెంటనే గణపతి రాగా అతనితో విష్ణుమూర్తి ఇట్లనెను. గణనాథా! నిన్ను పూజించువారి కార్యములన్నియు ఫలించునట్లు చేసెదవు.  నిన్ను ఉపేక్షించువారి కార్యములకు విఘ్నములు కలుగ చేసెదవు. రావణుడు నిన్ను పూజింపక శివుని ఎట్లో మోహింపచేసి అతని వలన ప్రాణలింగమపహరించి లంకకు పోవుచున్నాడు. నీవు బాల వేషము ధరించి అతనిని మోసము చేయుము. అతనికి సంధ్యాకాలమున సంధ్యవార్చు నియమము కలదు. నేను నారదుని ముందుగా రావణునకు కాలవిలంబమగునటుల చేయుమని పంపితిని. మూత్ర విసర్జన కాలమునరావణుడు పవిత్రమగు ప్రాణలింగమును తన వద్దనుంచుకొనడు. శివుడు ప్రాణలింగమును మార్గమధ్యమున నెచ్చటను భూమిమీద నుంచవలదని చెప్పెను. ఇట్టిస్థితిలో నీవు బాలుడవయి అతని దృష్టిపథమున బడుము. నిన్ను నమ్మి యతడు ప్రాణలింగమును నీచేతికి నిచ్చి సంధ్యా నందన మొనర్చుటకు వెడలును. అప్పుడు నీవాలింగమును భూమియందు ప్రతిష్ఠించుము. అని చెప్పి విఘ్నేశ్వరునకు ఫలములు మొదలగు భక్ష్యములనొసంగి పంపెను. నారదుడు మనోవేగమున వెళ్లి రావణుని సమీపించి ఏమియు తెలియని వానివలె వినయముతో రావణా తొందరగ పోవుచున్నావు. ఎక్కడనుండి వచ్చుచున్నావు? ఏమి వృత్తాంతము? చెప్పుమనెను. అప్పుడు రావణుడు నేనుకైలాసమునకు వెళ్లితిని. శివుడు ప్రసన్నుడయి నాకు ఆత్మలింగమునొసంగెను. అనగా నారదుడు నీవు గొప్పఅదృష్టవంతుడవు. ఆలింగము యొక్క మహిమ నాకు పూర్తిగ తెలియును. నిజముగ అది ఆత్మలింగమో కాదో నాకు చూపుమనెను. రావణుడు శంకించి దూరముగ చేతిలోనున్న లింగమును చూపెను. నారదుడు దానిని చూచి ఇది ప్రాణలింగమే. పూర్వము ఒక భయంకర మృగముండెను. దానికి మూడు శృంగమును కలవు. అట్టి మృగమును త్రిమూర్తులు వేటాడి సంహరించిరి. మూడు శృంగములందును మూడు లింగములు వారలకు లభించెను. అట్టి లింగమును మూడు సంవత్సరమును ఎవ్వడు పూజించునో వాడు ఈశ్వరుడే కాగలడు. ఈలింగమున్న స్థానము కైలాసమే కాగలదు. ఇంకను దీనిమహిమచెప్పెదనని చెప్పబోవుచుండ రావణుడు నాకిప్పుడు సమయము లేదు.   తొందరగ లంకకు పోవలసియున్నది అనగా నారదుడు నీవు అనేక వేదములనెరిగిన వాడవు. సంధ్యాకాలమా సంప్రాప్తమయ్యెను. సంధ్యా కాలమున మార్గమున నడచుటధర్మము కాదు నేను నాకు తోచిన విషయమును నీకు చెప్పితిని. నేను మాత్రము సంధ్యవందనము కొరకు సముద్రమునకు పోవుచున్నాను. అని చెప్పి నారదుడు పోయెను. అదే సమయమున గణపతి బ్రహ్మచారి వేషమును ధరించి రావణునకు కనబడునంత దూరములో సమిధలనేరుచున్న వానివలె కనబడెను. రావణుడు “నేను సకాల సంధ్యావందనము చేయు నియమము గలవాడను. వ్రతభంగము కాకూడదు. ఈలింగమును దగ్గరనుంచికొని సంధ్యావందనముచేయ వీలుగాదు. ఇచ్చటనొక బాలుడు తిరుగుచున్నాడు. బ్రహ్మచారిగ కనబడుచున్నాడు. కాన ఇతని చేతికి లింగమిచ్చి సంధ్యావందన మొనర్చెదను”. అని విచారించి ఆబ్రహ్మచారిని సమీపించెను.

      గణపతి రావణుడు తన దగ్గరకు వచ్చుటచూచి భయపడిన వాని వలె పరుగెత్తసాగెను. రావణుడు ఆ బాలునకు ధైర్యము చెప్పిబాలుడా భయపడకుము. నీతల్లిదండ్రులెవరు? అని ప్రశ్నించెను. అప్పుడు ఆ బాలుడు మా తల్లిదండ్రులు నీకేమయిన ఋణముండిరా వారితో నీకేమి పని అని అనెను. మా తండ్రి భస్మరుద్రాక్షల ధరించును. బిచ్చమెత్తి జీవించును. ఆయన పేరు శంకరుడందురు. మా అమ్మను ఉమయని పిలిచెదరు. నన్ను వదులుము. నాకు భయమగుచున్నది. మాయింటికి నేను పోయెదననెను. అప్పుడు రావణుడు బాలకా! మీతండ్రి బిచ్చమెత్తునని చెప్పితివి మీకు సుఖమెక్కడిది. నా వెంట రమ్ము నాది లంకా పట్టణము మా యింట దేవతార్చనము చేయుచుండుము. నీకు మృష్టాన్నము లభించగలదు అనగా నామాట విని యాబాలుడు నన్ను వదులుము. మీలంకలో రాను. నాకాకలియగుచున్నది. మాయింటికి వెళ్లి శెనగలు తిని యాకలి తీర్చికొనియెదను. అనగా రావణుడు అతనినెట్లో బ్రతిమిలాడి బాలకా ఇపుడే సంధ్యవార్చి వచ్చెదను. అంతవరకు ఈ లింగమును పట్టుకొనియుండుము. అన అప్పుడా బాలుడు నేను బాలుడను బ్రహ్మచారిని ఇంత బరువైన లింగమును మోయజాలను. నాచేయివదులును. పుణ్యముండును అని నిరాకరించినను ఎట్లో ఆబాలుని బ్రతిమిలాడి అతని చేతికి లింగమునిచ్చి రావణుడు సంధ్యావందనము కొరకు సముద్రతీరమునకు పోవుచుండ గణపతి రావణా నీవు శీఘ్రముగ రమ్ము మూడు పర్యాయములు పిలిచెదను. అంతలో నీవు రావేని లింగమును భూమి యందుంచెదను. సంశయింపబనిలేదు. అని కేకపెట్టెను. అప్పుడు దేవతలు ఏమి జరుగునో యని విమాన ములయందుండి నిరీక్షించుచుండిరి. రావణుడు అర్ఘ్యప్రదాన మొనర్చుచుండ లింగము బరువగుచున్నది. శీఘ్రముగరమ్మనెను.  రావణుడు హస్తసంకేతముతో వచ్చెదనని సూచించి అంగన్యాస పూర్వకముగా గాయత్రి అనుష్ఠానమును మౌనముగా చేయుచుండ  వెనుకటి వలెనె రెండు పర్యయములు పిలిచి రావణుడు ధ్యానమగ్నుడై వినియో వినకయో రానందున ఆకసమున విమానములందుండి. నిరీక్షించెడి దేవతలు సాక్షులుగా నుండ విష్ణుమూర్తిని మనసా స్మరించి సముద్ర తీరమందలి భూభాగమున నాలింగమును నాలింగమునుస్థాపించెను. దేవతలు సంతోషముతో పుష్ప వర్షము గురిపించిరి.

            ఇంతలో రావణుడు సంధ్యవార్చి శీఘ్రముగ వచ్చి లింగము భూమియందుండుట చూచి ఓరీ మూర్ఖా! వంచకా! నీవు బుద్ధిపూర్వకముగ నిట్లొనర్చితివి.  అని ఆ బాలుని కొట్టబోవగా నేనేమి తప్పు  చేసితిని? నన్నెందులకు కొట్టెదవు? మానాయనతో చెప్పెదనని భయపడి ఏడ్చుచున్న వానివలె తప్పించుకొ పాఱిపోయెను.  రావణుడు చేయునది ఏమియులేక తన ఇరువది చేతులతోను లింగమును పెకలించ యత్నించెను.  భూమి కంపించెనే కాని లింగము కదలదాయెను.  అంత బలశాలియైన రావణుని బలము సైతము ఆ ప్రాణలింగము పట్ల నిరర్ధకమైనందున ఆ ప్రాణలింగమునకు మహాబలేశ్వరుడను సార్ధకనామము లోకవిఖ్యాతమయ్యెను.  అతని చేతి యెరిపిడికి ఆ లింగము గోకర్ణముయొక్క (ఆవు చెవియొక్క) ఆకృతినొదినందున, గోకర్ణాకృతి లింగమచట నుండుటచే ఆక్షేత్రమునకు గోకర్ణమను  నామముకూడ సిద్ధించెను.  రావణుడు చేయునదిలేక అచటనే శివుని గూర్చి  తపమాచరించి వరములనొందెను.  అప్పటి నుండియు దేవతలందరు శివునినచట భక్తితో ఆరాధించు చున్నారు.  ఈ క్షేతత్రము యొక్క మహిమ స్కాందపురాణమున విపులముగ వర్ణింపబడినదని సిద్ధముని నామధారకుని గూర్చి గోకర్ణ క్షేత్రము యొక్క చరిత్రమును వర్ణించెను. 

ఇది సిద్ధముని నామధారక సంవాదరూపమగు గురుచరిత్రయందు ఆరవ అధ్యాయము సమాప్తము.

 

 

  

శ్రీ గురు చరితము

ఏడవ అధ్యాయము

మహాదేవం మహేశానం మహేశ్వర ముమాపతిం

మహాసేనగురుం వందే  మహా భయనివారణం||

హర హర మహాదేవ

            నామధారకుడు సిద్ధమునిని గూర్చి స్వామీ గోకర్ణ క్షేత్రమును నెవ్వరయిన వరములనొందిరా! చెప్పుడని ప్రశ్నించ  సిద్ధమునీశ్వరు డిటుల చెప్పుచుండెను. నామధారకా! శిష్యశిరోమణి! గోకర్ణ క్షేత్రమహిమను చెప్పుచున్నాను, వినుము. పూర్వము ఇక్ష్వాకు వంశమున మిత్రసహుడను రాజు ఒకడుగలడు. అతడు శూరుడు. స్వధర్మతుడు, బలాఢ్యుడు. దయానిధియు. అతనొకనాడు అడవికి వేట నిమిత్తము వెడలెను. అచ్చట నొక భయంకరుడైన దైత్యుని చూచెను.  తాను ధనుస్సును ధరించి అతని మీద బాణముల వర్షింపజేసెను. ఆ రాక్షసుడు నేలకూలెను. ఆతను చచ్చుచు తన సమీపముననున్న తన సోదరునితో నేనా చనిపోవుచున్నాను నన్ను చంపిన ఈరాజునకు నీవు ఎటులయిన అపకారము చేయుము. అట్లు చేసితివేని నాఆత్మ శాంతించునని చెప్పి వాడు మరణించెను. వాడి సోదరుడు కామరూప ధరుడుగాన నొక మానవ రూపము ధరించి రాజు వేట నుండి తన నగరమునకు వచ్చుచుండ రాజును కలసి నమ్రభావముతో మీవద్ద సేవచేయుచు భృత్యుడనై ఉండెను. అంగీకరించుడని ప్రార్థించెను. రాజు అతను కపటియని గ్రహించక అతని సేవకు అంగీకరించెను. వాడు రాజునకు నమ్మకము కలుగునటుల ప్రవర్తించుచు వినయముతో సేవించుచుండెను. ఇట్లుండ మిత్రసహుని యింట పితృశ్రాద్థము సంప్రాప్తమాయెను. అతను వశిష్ఠాదుల భోక్తలుగ నియంత్రణము చేసెను. శ్రార్ధమునకు కావలసిన శాకపాకముల సమకూర్చు అధికారము నీ కపట సేవకుని పైనుంచెను. వాడు ఇదియే సమయమని గ్రహించి వంట వానిని వశపర్చుకొని నరమాంసమును శాకములలో నొకటిగ తయారు చేయించెను.  భోజన కాలమున పత్రములయందు శాకపాకములు వడ్డింపబడెను. వశిష్ఠుడు నరమాంసము శాకముగ వడ్డింపబడుట గ్రహించి రాజును గూర్చి మహర్షులమైన మాకు నరమాంసము వడ్డిచితివి. కాన నీవు నరమాంసము భక్షించు బ్రహ్మ రాక్షసివి అగుమని శపించెను. అప్పుడు రాజు నాకావిషయము తెలియదు. నేను బుద్ధిపూర్వకముగ నాపని చేసియుండలేదు. నిష్కారణముగ నన్ను ఇట్లు శపించితిరి గాన తిరిగి శపింతునని ఉదకము పట్టుకొని శపింప నుద్యుక్తుడయ్యెను. అప్పుడు అతని భార్యయగు మదయంతి గురువును శపించు అధికారము మనకు లేదు అని చేయి పట్టుకొని వారించ రాజు చేయునది లేక మంత్రించబడిన ఆశాపోదకమున వేరొకచోట పోసిన భూతహింస యగునని భావించి తన పాదముల మీదనే పోసికొనెను. అందుచే అతనికి ఆనాటి నుండియు కల్మాషపాదుడను నామమువచ్చెను. అప్పుడు అతని భార్యయగు మదయంతి వశిష్ఠుని గూర్చిస్వామీ మమ్ముల నుద్దరించుడు. శాపమునకు అంతము శెలవిండని ప్రార్ధింప వశిష్ఠుడు కొంత శాంతినొంది పన్నెండు సంవత్సరములకు ఇతను శాపము నుండి విముక్తి పొందగలడు అని చెప్పి వెడలెను.

                        మిత్రసహుడు బ్రహ్మరాక్షస రూపము ధరించి నిర్మానుష్యమైన అరణ్యమున మనుష్యులను, పశువులను  భక్షించుచు కాలము గడుపుచుండెను. ఒకరోజున అతను అరణ్య మార్గమున పోవుచున్న ఒక బ్రాహ్మణదంపతుల చూచి, వ్యాఘ్రము పశువుమీద పడునట్లు అందరి బ్రాహ్మణుని మీద పడెను. అప్పుడు అతని భార్య గడగడ వణకుచు ఆబ్రహ్మ రాక్షసుని పాదములపైబడి తండ్రి నా సౌభాగ్యమును కాపాడుము. నా ప్రాణేశ్వరుని వదులుము. నన్ను భక్షించుము. భర్తలేని స్త్రీ జన్మ వ్యర్థముగదా, వేథాస్త్ర పారంగతుడయిన ఈనా భర్తను రక్షించినచో పుణ్యము ఘటిల్లును. నన్ను నీ కుమార్తెగా భావించుము, అని ఎంత ప్రార్థించినను ఆమె వాక్యమును పెడచెవిని పెట్టి ఆ బ్రాహ్మణుని భక్షించెను. అప్పుడామె తన భర్త మరణించుట చూచి ఆ బ్రహ్మరాక్షసునితో ఓరీ నీవు సూర్యవంశపు రాజువు. శాపమువలన బ్రహ్మరాక్షసివైతివి. పన్నెండు సంవత్సరములకు నీకు శాపవిమోచనమగును. నా భర్తను హింసించి నా సుఖమునకు భంగమొనర్చితివి. కాన శాపాంతమయినను నీ భర్యతో నీవు కలసిన యెడల మరణించెదవు గాక అని శపించి తన భర్త ఎముకలతో సహగమనము చేసెను. పండ్రెండు సంవత్సరములకు శాపవిముక్తినొంది తన పట్టణమునకు వెడలెను అప్పుడు అతని భార్య మదయంతి కామాతురురాలై సమీపించ తాను బ్రహ్మరాక్షసియైయున్న సమయమున బ్రాహ్మణ స్త్రీచేత శపింపబడిన వృత్తాంతమును భార్యకు తెలియజేసి ఆమెను నివారించెను.  ఆమె కడు దుఃఖించెను. అతనిచే సంహరింపబడిన బ్రహ్మణుడు బ్రహ్మ పిశాచమై వెంటబడెను. ఆరాజు ఎవ్వరు ఏమి చెప్పిన ఆదానముల చేసెను. తీర్థక్షేత్రముల పర్యటించెను. కాని బ్రహ్మరాక్షసి ఘోరరరూపమున అతనిని వెంబడించుచునే యుండెను. ఒకనాడు ఆ రాజు దైవ వశమున మిథిలా నగర సమీపమున సంచరించుచు శ్రమచే ఒక వృక్షపు నీడ కూర్చుండెను. అచ్చటికి సాక్షాత్తు రుద్రుడా అనునట్లు ప్రకాశించు గౌతముల వారు శిష్య సమేతముగా వచ్చిరి. రాజు వారి పాదములకు దీనుడై నమస్కరించ గౌతముడు రాజునుగూర్చి మీ రాజ్య మేమయ్యెను. నీవు చింతాక్రాంతుడవై ఇట్లు వనముల సంచరించుటకు కారణమేమి అని యడుగ రాజు దుఃఖితుడై తనకు బ్రహ్మ హత్యాపాతకము ఘటించిన వృత్తాంతమంతయు తెలియచేసి ఇట్లు చెప్పెను. స్వామీ ఈ బ్రహ్మహత్య నివృత్తి కొరకు నేను ఎన్నియో వ్రతములాచరించితిని. అనేక క్షేత్రముల పర్యటించితిని. కాని ఈ బ్రహ్మహత్య నన్ను ఘోరరూపమున వెంబడించుచునే యున్నది. నేడు మీదర్శనమయ్యెను. నా జన్మ ధన్యమయినది. నాకష్టములు నేటికయినను తొలగునని నమ్ముచున్నాను లని చెప్పుచు వారి పాదముల మీదపడి దుఃఖించ దయా సముద్రుడగు గౌతముడు అతనితో ఓరాజా! భయపడకుము, శంకరుడు మృత్యుంజయుడు. నిన్ను రక్షించును. మహా పాపముల నశింపజేయు పరమపావనమయిన ఒక క్షేత్రము గుఱించి నీకు చెప్పుచున్నాను  వినుము.  గోకర్ణమను క్షేత్రమొకటి కలదు.  దానిని స్మరించినంతనే బ్రహ్మ హత్యాది పాతకములన్నియు నశించును.  అది శివునకు నివాస స్థానమగు కైలాసముతో సమానము.  గోకర్ణ క్షేత్ర దర్శనమువలననే పాతకములు నశించును.  ఇంద్రాది దేవతలందరు అచ్చట తపస్సు చేసి సిద్ధినొందిరి.  అచ్చట చేసిన తపస్సు క్షేత్ర ప్రభావము వలన లక్ష గుణితమగును.  విష్ణుమూర్తి ఆఙ్ఞననుసరించి గణపతి అక్కడ శివుని ప్రతిష్ఠించెను.  బ్రహ్మ, విష్ణువు, అష్ట వసువులు గోకర్ణము యొక్క పూర్వ ద్వారమున వసించి శివుని పూజించు చుందురు.  వరుణుడు మొదలగు దేవతలు పడమటి ద్వారమున నివసించి చంద్రమౌళిని ప్రేమతో అర్చింతురు. కుబేరుడు, భద్రకాళి, సప్త మాతృకలు మొదలగు వారు ఉత్తరపు ద్వారమున నివసించి అచ్చట మహాబలేశ్వరుని ఆరాధింతురు.  విశ్వామిత్రుడు, జాబాలి, జైమిని అచ్చట శివుని ఆరాధించి తపస్సిద్ధి కాంచిరి.  శౌనకాది మహర్షులు, నారదుడు మొదలగు దేవఋషులు, సిద్ధులు, సాధ్యులు, అచ్చట శివుని ఉపాసింతురు.  అచ్చట శివుని పూజించు వారికి మహాబలేశ్వరుడు వారి మనోరథముల తప్పక నెఱవేర్చును.  రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు మొదలగు వారును నిత్యము వచ్చి శివుని ఆరాధించి పోవుచుందురు.  భక్తులు తమపేర్లతో అచ్చట శివలింగములనుగూడ స్థాపింతురు.  అందు అసంఖ్యాకములగు లింగములు గలవు.  వేయేల ఆక్షేత్రమందలి పాషాణములన్నియును లింగములే.  అందలి ఉదకమంతయు తీర్థమే.  ఆలింగము సప్త పాతాళములనుండి మహోన్నతమై పూర్వ యుగములందు ప్రకాశించెడిది.  కలియుగమున సూక్ష్మ రూపముగ కనబడును.  ఈ గోకర్ణ క్షేత్రము పశ్చిమ సముద్ర తీరమున  కలదు. అచ్చట చేయబడిన శివపూజలేమి, వ్రతములేమి, బ్రాహ్మణ సంతర్పణలేమి స్వల్పముగ చేయబడినను అనంత ఫలప్రదములగును.  శివరాత్రి మొదలగు పుణ్య కాలములందు అచ్చట మహాబలేశ్వరుని పూజించుట వలన వచ్చు ఫలము ఎవరికేనియు చెప్ప శక్యము కాదు.  మాఘమాసమున శివరాత్రియందు నిశీధకాలమున ఒక బిల్వ పత్రమును శివునకు అర్పించుట వలన వచ్చెడి పుణ్యమును ఆదిశేషుడైనను చెప్పజాలడు.  ఇట్టి నిరుపమానమగు క్షేత్రమున్నను దీని మహిమ నెవ్వరు వినరో అట్టివారు బధిరులుగ, మూఢులుగ భావింప బడుదురు.  శివరాత్రి నాడు అచ్చట చేసిన ఉపవాసము, జాగరణము, స్వర్గమార్గమునకు సోపానమనవచ్చును.  అచ్చట తీర్థముల స్నానమొనర్చి మహాబలేశ్వర లింగమును పూజించు మానవుడు నిస్సంశయముగ పాప విముక్తుడు కాగలడు.  అని గౌతముడు చెప్ప మిత్రసహుడు ఆ మునితో స్వామీ! గోకర్ణ క్షేత్ర మహాత్మ్యమును మీరు విస్తరించి సెలవిచ్చితిరి.  ఆ క్షేత్రమున ఎవరైనా పాప విముక్తి నొందినటుల నిదర్శనమేమైనా కలదా కృపతో సెలవిండని ప్రశ్నించ గౌతముడిట్లనెను. 

            రాజా వినుము.  అనేక వేలమంది అచ్చట పాప విముక్తి నొందుట నాకు తెలియును.  అందు నేను ప్రత్యక్షముగా కాంచిన ఒక దృష్టాంతము నీకు చెప్పుచున్నాను వినుము. నేనొక సంవత్సరము శివరాత్రికి అచ్చటకు యాత్రకు పోయితిని.  అనేక వేలమంది యాత్రికులు వచ్చిరి.  మధ్యాహ్నకాలమున నేనొక వృక్ష ఛాయ యందు కూర్చుని ఉంటిని.  అచ్చటకొక చండాల స్త్రీ, వృద్ధురాలు, అంధురాలు, కుష్టురోగముచే పీడితురాలై ఎండలో తూలుచు వచ్చి నాకు కొంత సమీపమున చెట్టునీడను క్రింద పడి ప్రాణముల త్యజించెను.  అదే సమయమునకు కైలాసము నుండి సూర్యుని వలె ప్రకాశించు ఒక విమానము వచ్చెను.  అందుండి శివదూతలు నలుగురు మణికుండల, కిరీటముల ధరించి శూలములు చేత పూని దేదీప్యమానమగు కాంతితో ప్రకాశించుచు ఆ మరణించిన చండాల స్త్రీని కైలాసమునకు కొనిపోవ నుద్యుక్తులయిరి.  నేను విభ్రాంతి నొంది వారినిట్లు ప్రశ్నించితిని.  శివదూతలారా! కుక్కను సింహాసనమున కూర్చుండబెట్టుదురా? ఇట్టి చండాల స్త్రీని మీరు విమానములో కైలాసమునకెట్లుతీసికొని పోవుదురు. ఈమె జన్మాదిగా పరమ పాపి.  పశుమాంసము భక్షించు చండాలురాలు.  అంతియేకాక కుష్టురోగముచే పీడింపబడుచున్నది.  ఈమె ఎక్కడ కైలాసమెక్కడ? జ్ఞానముకాని, జ్ఞానసాధనముకాని, దయాసత్యములుకాని ఈమెయందు వెతికినను కనరావు.  శివపూజ ఎరుగదు.  శివ మంత్ర జపమనిన ఏమియో ఈమెకు తెలియదు.  దాన ధర్మములు కాని, శివరాత్రి ఉపవాసము కానీ ఆచరించినది కాదు.  ఇట్టి స్త్రీకి కైలాస ప్రాప్తి ఎట్లు? ఇది నాకు కడు ఆశ్చర్యముగా ఉన్నది.  నా సంశయమునకు తగిన సమాధానమును చెప్పుడని శివదూతల నడుగగా వారు నాతో ఆమె పూర్వ జన్మ వృత్తాంతమునిట్లు చెప్పదొడగిరి. 

                           గౌతమ మహర్షి ''వినుము పూర్వ జన్మమున నీమె ఒక బ్రాహ్మణ కన్య.  పేరు సౌదామిని.  చక్కని ఆకారము కలది.  యుక్త వయసు రాగా తండ్రి ఈమెను ఒక సామాన్య బ్రాహ్మణునికిచ్చి  వివాహము చేసెను.  కొలది కాలమునకు భర్త మరణించెను.  అప్పుడు ఈమె తల్లితండ్రుల గృహమున నివసించి యవ్వనములో నున్నందున కామవికారము నాపుకొనలేక రహస్యముగ వ్యభిచారము చేయ ప్రారంభించెను.  కొంత కాలమునకు తల్లిదండ్రులు ఈమె దుర్వుృత్తిని గ్రహించి కులము నుండి బహిష్కరించి తాము ప్రాయశ్చిత్తము చేసికొని శుద్ధులయిరి.  అచ్చట నుండి ఈమె సిగ్గు విడిచి ఆ నగరమందే ఒక వైశ్యనితో రమించుచు, మద్య మాంసముల భక్షించుచు స్వేచ్చగ సంచరించుచుండెను. ఒక రోజున కల్లు ద్రాగి ఒడలు తెలియక మాంసమును భక్షించనుద్దేశించి కత్తి చేతబూని తన పశువుల దొడ్డిలోనికి వెళ్లి చీకటిలో మేకయని భ్రమించి ఆవు దూడను వధించి కొంత భక్షించి దాని తల మాత్రము ఇంట దాచెను. మరునాడుదయము ఆవును పాలు పితుకతలందులకు వెళ్లి చూడ మేకయే కనబడెను. ఆవుదూడ లేదు. ఇంటి లోనికి పోయి శిరమును చూడ అది ఆవు దూడ తలగా గోచరించెను. ఆసమయమున దాని నోటి నుండి పశ్చాత్తాప పూర్వకముగ శివా! చంద్రమౌళి పాపమాచరించితిని. అను వాక్కువెలువడెను. భర్త చూచి కోపించునని భావించి ఆ శిరస్సును, ఎముకలు, చర్మమును దూరముగ భూమిలో పాతివేసి ఏడ్చుచు భర్త రాగా రాత్రి పెద్దపులి వచ్చి ఆవుదూడను మ్రింగివేసినని అబద్ధమాడెను.  ఇట్లెన్నియో పాపములాచరించి మరణించెను.  యమదూతలు ఈమెను యమలోకమునకు తీసికొని వెడలిరి.  అచట యమయాతనల ననుభవించి గోహత్య పాపమువలన చండాల స్త్రీ అయి ఈ జన్మలో జన్మించెను.  సరిగా చూడని దోషముతో అంధురాలయ్యెను.  వ్యభిచార దోషమునుబట్టి కుష్టురోగి అయ్యెను.  కొలది కాలము తల్లిదండ్రులు పోషించిరి.  వారును మరణించిరి.  అచ్చటచ్చట యాచించి ఉదర పోషణము చేయుచుండెను.  మార్గమున పడి ఉండి వచ్చి పోవు వారల యాచించుచుండెను.  ఇట్లుండ వృద్ధాప్యము సమీపించెను.  మాఘమాసము వచ్చెను.  ఎంతో మంది దారాపుత్ర సమేతముగ శివ భజనలొనర్చుచు గోకర్ణ క్షేత్రమును గూర్చి పోవుచుండిరి.  ఈమె గూడ వారితో పూర్వ జన్మలో ఆవుదూడను చంపినపుడు శివ శివ చంద్రమౌళి అని ఉచ్ఛరించిన పుణ్య విశేషముచె గోకర్ణము పోవ సంకల్పించెను.  వారలతో కలసి ఎట్లో గోకర్ణము చేరెను.  అచ్చట ఒక చోట కూర్చొని పుణ్యాత్ములారా! నేను పాపాత్మురాలను.  ఆకలి అగుచున్నది.  ఏమిఅయన ధర్మమొనర్చుడు. అని చేతులు చాచి శివరాత్రినాడు శివుని పూజించ వెడలు యాత్రికుల దీన స్వరముతో యాచించు చుండెను.  శివరాత్రి అగుటచే యాత్రికులు ఉపవాస నియమము కలవారుగాన ఎవరును ఏమియు ఈమెకు తినుటకు ఆహారము ఇవ్వరయిరి.  ఇంతలో రాత్రి అయ్యెను. ఒక భక్తుడు శివపూజకు పోవుచు ఈమె దీనాలాపము విని తన చేతిలోనున్న మారేడు దళములలో ఒకదానిని ఇదియే నా వద్ద కలదు.  ఇకనేమియు లేదని చెప్పుచు ఆమె చేతిలో పడవేసెను.  అప్పుడామె గ్రుడ్డిదగుట వలన చేతితో తడిమి భక్ష్య పదార్థము కాదు గదా నాకెందులకని విసరి వేయ దైవయోగముచే ఆ బిల్వదళము అచ్చనున్న శివలింగముపై పడుట తటస్థించెను.  ఆ రోజున ఆహారము లేకపోవుటచే ఉపవాసము సంభవించెను.  ఆకలి బాధచే నిద్ర పట్టనందున జాగారము గూడ సంప్రాప్తమయ్యెను.  ఆబిల్వదళముచే శివుని పూజించిన ఫలము గూడ ఆమెకు సిద్ధించెను.  ఈవిధముగా అప్రయత్నముగా  ఆమె శివరాత్రి వ్రతము ఆచరించు భాగ్యము లభించెను.  ఇప్పుడీమె కీవిధముగ మరణ కాలము సంప్రాప్తమయినది.  కాన శివుడు సంతసించి ఈమెను కైలాసమునకు తోడుకొని రాగలందులకు ఈ విమానమునిచ్చి మమ్ములను పంపెను.  ఈమె పాపములన్ని నశించెను.  శివుని ప్రేమకు పాత్రురాలయ్యెను.  అని చెప్పుచు శివదూతలు కొంత అమృతమును ఆమెపై చిలకరించగా ఆమె దివ్య దేహమును ధరించెను.  వారు అప్పుడామెను విమానము నధిష్టింపజేసి కైలాసమునకు కొనిపోయిరి.  ఇది అంతయు నేను ప్రత్యక్షముగ చూచిన విషయము.  కావున ఓ రాజా! నీవు  సంశయమును విడనాడి గోకర్ణమునకు పొమ్ము.  నీ పాపము క్షయించును.  బ్రహ్మ హత్య నిన్ను వదలును అని చెప్ప గౌతముని ఆఙ్ఞతో నామిత్రసహుడు గోకర్ణ క్షేత్రమునకు వెడలెను.  అతను ఆక్షేత్రమును ప్రవేశించినంతనే ఆబ్రహ్మ హత్య అతనిని వదలెను.  కాన ఓ నామధారకా! గోకర్ణము అట్టి పరమ పావనమగు క్షేత్రమగుటచే శ్రీపాద శ్రీవల్లభుల వారు అచ్చట మూడు సంవత్సరములు నిలుచుట తటస్థించినది అని  సిద్ధముని నామధారకునితో గోకర్ణ క్షేత్రము గుఱించి చెప్పెను.

 

ఇది గురు చరిత్ర ఏడవ అధ్యాయు సమాప్తము

           

 

 

శ్రీ గురు చరితము

ఎనిమిదవ అధ్యాయము

శ్రీగణేశాయనమః  ఓం దత్తాత్రేయాయనమః

దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా

            శ్రీపాదులవారు గోకర్ణ క్షేత్రమున మూడు సంవత్సరములు నివసించి అచ్చటనుండి శ్రీశైలము గూర్చి వెళ్ళిరి. అచ్చట  నాలుగు నెలలుండి నివృత్తి సంగమమును క్షేత్రమున స్నానమొనర్చి కురుపుము ప్రవేశించిరి.  మహాత్ముల దర్శనమే సర్వ తీర్థముల ఫలముల నొసంగును.  అయినను వారు లోకోద్ధారణము కొఱకు తీర్థక్షేత్రముల పర్యటన మొనర్చు చుందురు.  కురుపురము కృష్ణా నదీ తీరమున కలదు.  శ్రీపాదుల వారు ఆ క్షేత్రమున నుండ వారి మహిమ విఖ్యాతమయ్యెను.  అచ్చట వారిని సేవించు భక్తులు సంతాన కాములు సంతానమును, దరిద్రులు సంపదలను పొందుచుండిరి.  వారచట నుండ వారు మరి యొక అవతారమును స్వీకరించవలసిన సందర్భమేర్పడెను.  నాయనా! నామధారకా ! ఆ వృత్తాంతమును వినుము. 

            ఆ గ్రామమున వేద శాస్త్ర పారంగుతుడగు నొక బ్రాహ్మణుడు కలడు.  ఆయనకు పరమ పతివ్రతయగు నొక భార్య కలదు.  ఆమె పేరు అంబిక.  ఆమెకు అనేక మంది పుత్రులు పుట్టి మరణించిరి.  చివరకు వారికొక కుమారుడు దైవానుగ్రహము వలన జన్మించి బ్రతికెను.  కాని అతను మందమతి.  ఎనిమిదవ ఏట తండ్రి ఉపనయనము ఒనర్చి వేదమును చెప్ప ప్రారంభించెను.  కాని ఒక మంత్రమయినను ఆబాలుడు నోట నుచ్ఛరించ   సమర్ధుడు కాకపోయెను.  అప్పుడు తండ్రి అయ్యో ఎంతకష్టము.  పూర్వజన్మమున ఎట్టి పాపమొనర్చితినో! ఇటువంటి మూర్ఖుడగు పుత్రుడు ఏల జన్మించెను.  అని విచారపడి బాలుని శిక్షింపసాగెను.  దానికి వాని భార్య మనకు లేక లేక ఒకడు మాత్రమే జీవించి ఉన్నాడు.  వాడు పురాకృత కర్మ వలన మందమతి అయ్యెను.  మీరు వానిని కొట్టి ఏమి ప్రయోజనము.  ఇకమీద వానిని దండించితిరేని నేను ప్రాణ త్యాగమెనర్చెదననెను.  అప్పుడా బ్రాహ్మణుడు చేయునదిలేక తన దురదృష్టమునకు వగచెను.  కొలది కాలముననే ఆ బ్రాహ్మణుడు మరణించెను.  విధవరాలయిన ఆ బ్రాహ్మణ స్త్రీ దరిద్రముతో బాధపడుచు యాచన వృత్తితో మూఢుడగు కుమారుని పోషించు చుండెను.  బాలునకు వివాహ వయస్సు వచ్చెను.  కాని మూఢుడని ఎవరును పిల్లనివ్వరైరి.  అందరును ఈ బాలుని చూచి మూఢా సిగ్గయిన లేదా! తల్లి యాచించి తెచ్చిన అన్నము తిని బ్రతుకు చున్నావు.  నీ తండ్రి వేద శాస్త్రఙ్ఞుడయి యుండ నీవు అతనికి కళంకము తెచ్చితివి.  పశువు వంటి నీ జన్మచే నీ పితరులును అధోగతినొందెదరు.  నీళ్ళుమోసి అయినను జీవించుము లేదా ప్రవాహములో పడి చనిపొమ్ము అని దూషించిరి.  ఆ బాలుడును వారి మాటలకు కడు దుఃఖించి తన తల్లితో అమ్మా! నేను తెలివి తక్కువవాడనగుటచే అందరు నన్ను నిందించుచున్నారు. కాన నేను ప్రవాహములో పడి చచ్చెదను అనెను. తల్లియు దుఃఖసముద్రమున మునిగి బాలునితో పాటు తనును కృష్ణలో పడి దేహ త్యాగ మొనర్చగలందులకు  సన్నద్ధురాలయ్యెను.  ఇంతలో వారి అదృష్ట వశమున శ్రీపాదుల వారు అచ్చటకు స్నానము నిమిత్తము వచ్చిరి.  వారి పాదములకు ఆబ్రాహ్మణ స్త్రీ నమస్కరించి స్వామీ! మేము ఈ ప్రవాహమున పడి మరణించ నిశ్చయించుకొంటిమి.  మాకు ఆత్మ హత్య దోషము లేకుండునటుల మీరనుగ్రహించుడని ప్రార్ధించెను.  ఆ మాటవిని దయానిధియగు శ్రీపాదుల వారు ఆమెతో నీకేమి సంకటము ప్రాప్తయ్యెను.  దుస్త్యజములగు ప్రాణముల నెందుకు విడువ సమకట్టితిరి అని ప్రశ్నించిరి.  అప్పుడామె స్వామీ! ఈ బాలుడు నాకుమారుడు.  మిక్కిలి మందమతి అందరు ఇతనిని దూషించుచున్నారు.  వీని తండ్రి వేదశాస్త్ర పారంగతుడు. అట్టివారి గర్భమున ఈ మందమతి ఏల జన్మించెను.  నాకు జన్మాంతరముననైన మీవంటి సత్పుత్రుడు కలుగుటకు ఏదైన ఉపాయమున్న సెలవిండు.  మా భాగ్యవశమున నేడు మీ దర్శనమయ్యెను.  మీరు శరణాగత రక్షకులు.  నేను ఈ సంసారములో జన్మించి ఒక సుఖమయిన నెఱుగను.  ఎందరో కుమారులు కలిగి పోయిరి.  నా సౌభాగ్యమా నష్టమయ్యెను. అజాగళ స్తమును బోలిన ఈ మూర్ఖపు బాలుడు  మాత్రము కలడు.  వాడివలన నేమియు ప్రయోజనము లేదు.  రాబోవు జన్మలోనయిన ఎట్టి పుత్రుని వలన పితరులకు మోక్షము సిద్ధించునో ఎవ్వనిని సర్వులు పూజింతురో అట్టిలోక పూజ్యుడయిన పుత్రుడు నాకు కావలయునను ఆశ కలదు.  అందులకేమయిన ఉపాయమున్న సెలవిండని ప్రార్ధించెను.  ఆ మాటలు విని శ్రీపాదులవారు దయగలవారై అమ్మా!నీవు శివుని ఆరాధించుము.  నీవు కోరిన లక్షణములు గల హరి యంతటి కుమారుడు నీకు వచ్చు జన్మమున కలుగగలడు.  పూర్వమొక గోపిక ప్రదోషకాలమున ఈశ్వరారాధనము చూచిన పుణ్యముచే కృష్ణుడామెకు పుత్రుడయ్యెను.  కాన నీవు ఈశ్వని ఆరాధించితివేని శ్రీమహావిష్ణువే తప్పక నీకు కుమారుడు కాగలడు. అని చెప్ప ఆ బ్రాహ్మణ స్త్రీ స్వామీ! ఆ గోపిక ఎవరు? ఎప్పుడు శివ పూజ చూచెను.  ఆ వ్రతమేమియో నాకు విశదముగ చెప్పుడని శ్రీపాదుల వారి పాదముల యందు శిరముంచి నమస్కరించెను.

            అప్పుడు శ్రీపాదులవారు ఇట్లు చెప్పుచుండిరి.  స్కాందపురాణమున ఈశ్వరుని మహిమను ప్రకటించు ఒక కథ కలదు.  అదియే నీకు చెప్పుచున్నాను.  వినుము.  ఉజ్జయిని అను ఒక పట్టణము కలదు.  దానిని అతి ధార్మికుడగు చంద్రసేనుడను ఒక రాజు పరిపాలించుచుండెను.  అతని వద్ద చింతామణి అను ఒక రత్నము కలదు.  ఆ రత్నముయొక్క ప్రకాశము సోకినంతనే ఇనుము బంగారమగును.  ఆరాజు యొక్కభక్తికి సంతసించి శివుడతనికి ఆ రత్నమనుగ్రహించెను.  ఇతని వద్ద ఇట్టి రత్నముండుట ఇతర రాజులు గ్రహించి ఆ రత్నమును సామ దాన భేదములతో తీసికొన యత్నించిరి.  రాజు అందుల కొడబడనందున వారు చతురంగ సైన్యములతో పట్టణమును అకస్మాత్తుగ ముట్టడించిరి.  ఆ రోజు త్రయోదశి శనివారమయ్యెను.  రాజు శివ భక్తుడగుటచే శివునినే అనన్యముగ శరణమొంది మనస్సును ఏకాగ్ర పరచి ప్రదోష కాలమున శివాలయమునకు వెళ్ళి అచ్చట మహాకాళమను శివలింగమును భక్తితో అర్చించ ప్రారంభించెను.  అదే సమయమున కొంతమంది గోపబాలురు అచ్చటకు వచ్చి ఆ రాజు చేయు శివ పూజను చూచిరి.  వారికి కూడ అట్లే శివ పూజ చేయ సంకల్పమయ్యెను.  వెంటనే వారు వారి గొల్లపల్లె సమీపమున ఒక చెట్టు క్రింద స్థలము శుభ్రపరచి ఒక గుండ్రని రాతిని శివునిగా నచ్చట స్థాపించి భక్తితో అచ్చట వారికి సంప్రాప్తములయిన పత్ర పుష్పములతో పూజించి ఉదకమునే నైవేద్యముగా సమర్పించి  భక్తి చేయు చుండిరి. చీకటి పడినను కొడుకులు రానందున తల్లులు కేకలు వేయుచు  రాగా అందరును వారి వారి గృహములకు తల్లులతో వెడలిరి.  కాని ఒక గోపబాలుడు మాత్రము మనస్సును శివుని యందు లయింప చేసి ధ్యానములో ఉన్నందున తల్లి పిలుచుటయు వినడయ్యెను.  తల్లి వచ్చి అతనిని కొట్టి పూజోపకరణములన్నియు చెల్లా చెదరు చేసెను.  లింగమును దూరముగ విసరి వేసెను.  అప్పుడా బాలుడు ధ్యానమునుండి బహిర్గతుడై శివపూజ పాడయి పోయినందులకు విలపించుచు చిత్తమున శివుని స్మరించుచు ప్రాణములు త్యజించనుద్యుక్తు డయ్యెను.  వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యెను.  అద్భుతమగు శివాలయము అచ్చట వెలసెను.  సూర్యునితో సమానమగు ప్రకాశముగల శివలింగమందుద్భవించెను.  శివుడు అచ్చట నిజరూపములో ప్రత్యక్షమయ్యి  బాలుని లేవదీసి భక్తాగ్రేసరా! నీ భక్తికి మెచ్చితిని.  నీకిష్టమైన వరము వేడుకొనమనెను.  అంత నాబాలుడు ఈశ్వరా మా తల్లి తెలియక అఙ్ఞానముతో నీ పూజకు భంగమొనర్చెను.  ఆమెను కోపించక రక్షింపుము.  అని ప్రార్ధించెను.  అప్పుడు శివుడు ఆ బాలునితో మీ అమ్మ నీవు చేయు శివపూజను చూచెను.  కాన ఆమె ధన్యురాలు.  వచ్చు జన్మములో కృష్ణునకు తల్లికాగలదు.  నీవు ఇహలోకమున సమస్త సౌఖ్యములననుభవింతువు.  అని వరమిచ్చి ఆ లింగమునందు శివుడంతర్హితుడయ్యెను.  ఆ లింగము కోటి సూర్యులతో సమానముగ ప్రకాశించుచుండెను.  ఆ ప్రకాశము భూమ్యాకాశము నిండిపోయెను.  పట్టణము చుట్టు ముట్టడించిన రాజులు చీకటిరోజున పట్టణమున నట్టి ప్రకాశముండుటకు ఆశ్చర్యచకితులయి తమలో తామిట్లనుకొనిరి.  ఈ పట్టణమునేలు రాజు గొప్ప మహిమ గలవాడుగ కనబడు చున్నాడు.  ఇతనితో విరోధము మనకు చెల్లదు.  అని భావించి తెల్లవారగనే రాజును సమీపించి రాజుతో సఖ్యమొనర్చుకొనిరి. ఆ చంద్రసేన మహారాజు కూడను గోపబాలుని భక్తి విశేషము చూచి అచ్చట నూతనముగ వెలసిన శివాలయమును గాంచి, సంతసించి, ఆబాలుని గోపాలురకధిపతిగ చేసి కొంత రాజ్యమతనికొసగెను.  అప్పుడు గోపాల బాలుడు తల్లిని సమీపించి శివుడిచ్చిన వరమును ఆమెకు చెప్పెను.  కొంత కాలమునకట్లే  ఆమె యశోద అయి పుట్టి పూజను చూచెనే కాని స్వయముగ చేయనందున కృష్ణుడామె గర్భమున జన్మించకున్నను ఆమెనే తల్లిగ భావించుటకు ఆమెయు కృష్ణుడే నా కుమారుడని భావించుటయు జరిగెను.  శివుడు ప్రసన్నుడయినచో దుర్లభ మెద్దియు లేదు.  కాన నీవు గూడ  భక్తితో ప్రదోష వ్రతమాచరించితివేని నావంటి వాడే నీకు రాబోవు జన్మలో పుత్రుడయి పుట్టును. అని చెప్పుచు ఆమె కష్టమును చూచి జాలినొంది ప్రసన్నుడయి ఆ మూర్ఖుడయిన బాలుని శిరమున తన దివ్య హస్తమునుంచు సరికి ఆ బాలుడు గొప్ప ఙ్ఞాని అయి వేద శాస్త్రవేత్త అయ్యెను.  వేద శాస్త్రముల ననర్గళముగ పఠించు నాబాలుని చూచి తల్లి విస్మితురాలయ్యెను.  శ్రీపాదులు ఈశ్వరులే అను భావన ఆమెకు కలిగెను.  క్షణ క్షణమునకు నమస్కరించెను.  స్వామీ! శివుడే మీరు.  మీకన్న వేరుగ శివుడు లేడు.  మిమ్ములనే ప్రదోషమున పూజించెదను.  మీ వాక్యమెన్నడును వ్యర్ధము కాదు అని చెప్పి అది మొదలుకొని ఆమె ప్రదోషముల యందు భక్తితో శివుని పూజించు చుండెను.  బాలుడు విద్వాంసుడగుట అందరకు తెలిసెను.  అతనికి వివాహమయ్యెను. శ్రీపాదుల వారి అనుగ్రహమున పుత్ర పౌత్రాదులతో కూడుకొని ఆ బాలుడు ఐహిక ఆముష్మిక సుఖములనొందెను.  కాన ఓ నామధారకా! ఎవరు గురు కృపకు పాత్రులో అట్టి భక్తులకు దయా సముద్రుడగు సద్గురువు సర్వాభీష్టములనొసంగి రక్షించును. 

ఇది గురుచరిత్ర యందు ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి