శ్రీ గురు చరితము
అనసూయాత్రి సుతుడై, త్రిమూర్తియాత్మక
దత్తాత్రేయ స్వామి కలియుగములో భక్తులను అనుగ్రహించుటకై
అవతరించి చేసిన అతిమనుష కార్యములు శ్రీ గురు చరితములో వివరింపబడినవి. ఈ గురు చరితము
ప్రథమముగా మహారాష్ట్ర భాషలో సిద్ధ నామాధారక సంవాద రూపముగా గంగాధర సరస్వతీ స్వామి
వారిచే వ్రాయబడినది. ఇది పరమ పవిత్రమైన గ్రంథము.
ఈ గ్రంథము తదుపరి కాలములో శ్రీ వాసుదేవవనంద
సరస్వతీ స్వామి వారిచే సంస్కృతములో ప్రథమమములో గురు ద్విసాహస్రి అనుపేర రెండు వేల శ్లోకములతోనూ,
తదుపరి సమశ్లోకీ అనుపేర విపులముగా రచింపబడినది.
ఈ గ్రంథములు ఎంతో మహిమాన్వితములై ఎందరొభక్తులకు ఐహిక, ఆముష్మిక ప్రయోజనములను
సిద్ధింప చేసినవి. ఈ గురుచరితము యొక్క పారాయణ
మహారాష్ట్రలో అధికముగా వున్నది. శ్రీ వాసుదేవవనంద సరస్వతీ స్వామి వారు తమ సంచారములో దక్షిణ దేశయాత్ర చేసినప్పుడు ఈ గ్రంథము,
దాని ప్రాముఖ్యత, విశిష్టత క్రమముగా తెలుగు ప్రజలకు తెలియ వచ్చినది. ఈ సందర్భములో తెలుగువారైన శ్రీ అవధూత బోధానంద సరస్వతీ
స్వామివారు గణగాపురములో సాధన చేసిన రోజులలో మరాఠీ, సంస్కృతములో వ్రాసిన గురుచరితములు
మాత్రమే అందుబాటులో వున్న రోజులలో వారికి దత్తాత్రేయ స్వామి వారిచే స్వయముగా స్వప్నములో
తెలియ చేసిన గురుచరితమును శ్రీ అవధూత బోధానంద
సరస్వతీ స్వామివారు తెలుగు భాషలో ప్రథమముగా అనువాదము చేసినారు. ఇది తెలుగు భాషలో మొదటి శ్రీ గురు చరితము. కాలక్రమముగా ఇతర గ్రంథ కర్తలు తెలుగు భాషలో శ్రీ
గురు చరితమును అనువాదము చేసినారు.
శ్రీ గురు చరితమును భక్తులకు అందుబాటులో
వుంచుటకు, ఈ కాలము యొక్క పద్ధతిలో ఈ బ్లాగ్ లో యథా శక్తి టైపు చేయబడి భక్తులకు దత్తానుగ్రహముగా
స్వామి వారి ఆదేశానుసారము అందుబాటులో వుంచబడినది. ఇది 52 అధ్యాయముల గ్రంథము. కాలక్రమేణా కొన్ని అధ్యాయములు భక్తుల పారాయణకు వీలుగా
అందుబాటులో వుంచబడును.
ఈ రోజు మొదటి అధ్యాయము
తదుపరి రెండవ పుటలో
శ్రీ గురు చరితము
మొదటి అధ్యాయము
ఓ గణపతీ నీకు
నమస్కారము. నీవు భక్తుల విఘ్నముల
నివారించు వాడవు. నీవు విశాలములైన చెవుల
నెప్పుడునూ కదల్చుచుందువు. అందుచే పుట్టిన
గాలితో నిన్ను సమీపించి నీ పూజ చేయు భక్తుల విఘ్నములు దూరముగా పోగొట్టబడును. జగములన్నియు నీ ఉదరముననున్నవి గాననే నిన్ను
లంబోదరుడవని అందురు. దేవతలు గూడా
కార్యారంభముల నిన్ను పూజింతురు.
అట్టినిన్ను ధ్యానించి శ్రీ గురుచరితమునాంధ్రమున వ్రాయబూనితినిగాన
నీకార్యము నిర్విఘ్నముగా కొనసాగించుము.
ఓ సరస్వతీ నీకు
వందనము. శబ్దము నీ రూపము. నీ భక్తులకు నీవు ఙ్ఞానమనుగ్రహింతువు. నీ సహాయ్యములేనిది మానవుడొక శబ్దమైననుచ్చరింప
సమర్థుడు కాడు. నీవు ప్రతివారియందును పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అనురూపములతో వెలుగొందుచున్నావు. నీ అనుగ్రహముండిననే నేనుఈ గురుచరిత్రమును
వ్రాయగలను గాన నాకు మంచి శబ్దము స్పురింపచేసి నాచే ఈ గురుచరిత్రమును
వ్రాయించుము.
త్రిమూర్తులకు నా
నమస్కారము. త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయ
స్వరూపుడై లోకమునకాది గురువై భక్తు నుగ్రహించగలందులకు కలియుగమున నవతరించిన
శ్రీపాద శ్రీవల్లభస్వామికి, శ్రీ నృసింహసరస్వతికి
అభేదానుసంధానపూర్వకముగా నమస్కారమర్పించి గ్రంథమునారంభించెద.
సికింద్రాబాదు నుండి
పూనాకు పోవు మార్గమున గుల్‌బర్గా జిల్లాలో గణగా పురము (గంధర్వ నగరము) అనునొక
గ్రామము కలదు. త్రిమూర్తి స్వరూపుడైన
శ్రీ నృసింహసరస్వతి యను మహాత్ముడు క్రీస్తు శకము 15వ శతాబ్దమున అవతరించి ఆ క్షేత్రమున చాలా కాలము నివసించుటచే నాక్షేత్రము లోక
ప్రఖ్యాతమై భక్త జనులకు కామధేనువై విరాజిల్లు చున్నది. భక్తితో స్మరించువారికి భక్తులను రక్షించు శ్రీ
నృసింహసరస్వతి ప్రత్యక్షముగా నిప్పటికిని దర్శనమిచ్చి రక్షించును.
ఈవిషయమును నామధారకుడను
నొక భక్తుడు విని స్వామివారిని దర్శించని జన్మమెందులకని భావించి సర్వమును త్యజించి
తన గ్రామమును విడచి గణగాపురమునుద్దేశించి ఒంటరిగా పోవుచు నిట్లు
అనుకొనుచున్నాడు.
దేవా నీవు భక్తుల రక్షింతువని వింటిని. నన్నెందులకనుగ్రహించవు? నా యందు దయలేదా? ''నీవు నాకేమి ఉపకారము చేసితివి? నిన్నెందులకు
రక్షించవలె'' నందువా? ఉపకారమునపేక్షించు ఉపకరించువాడు ఉదారుడుగ పరిగణింపబడునా? నీవు అహేతుక దయామయుడవు
గావా! ధ్రువుని, ప్రహ్లాదుని, విభీషణుని ఎట్లు రక్షించితివో అట్లే నాకును దర్శనమిచ్చి
నన్ను రక్షింపుము. నీవు నా భక్తుడవు
కావందువా? నేను నీ భక్తి చేయకున్ననూ
మాపూర్వీకుడయిన సాయందేవుడు నీకు అనన్య భక్తుడు కాడా? అతను చేసిన భక్తికి నీవే మాకు ఋణపడిఉన్నావు.
కాన నీవు నన్ను రక్షించి కాపాడుట ధర్మము.
నాకు దర్శనమిమ్ము. లేనిచో నేను
జీవిం ప జాలనని ఇట్లు ప్రార్ధించుచు గాణగాపురమును గూర్చి పోవుచు భగవంతుడు
దర్శనమివ్వలేదను చింతతో పరవశుడై పడిపోయెను.
అప్పుడు స్వామివారు దర్శనమిచ్చి తన అభయ హస్తమును అతని శిరముననుంచి
అంతర్హితుడయ్యెను.
ఇది గురు
చరిత్రమున మొదటి అధ్యాయము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి