శ్రీ గురు చరితము
నాలుగవ అధ్యాయము
శ్రీదత్తాత్రేయాయ గురవే
నమః
శ్లో|| దత్తాత్రేయం శివం శాంతం| ఇంద్రనీల
సమప్రభం |
అనసూయాత్రి సంభూతం | జగద్గురు
ముపాస్మహే||
నామధారకునితో సిద్ధముని
చెప్పుచుండెను. నామధారకా! నీవు మిక్కిలి ధన్యుడవు. నీవు ప్రశ్నించుటచే నాకు గురులీలలు స్మరించు భాగ్యము
ఘటించినది. గురుచరిత్రమును చెప్పెద
వినుము. పూర్వము సృష్ట్యాదియందు నారాయణుడు
జలశాయి అయియుండ అతని నాభి కమలము నుండి బ్రహ్మాండ ముదయించెను. అట్టి బ్రహ్మాండములో నాలుగు ముఖములు గల బ్రహ్మ
పుట్టెను. అతను దిక్కులను కాలమును సృజించి
విష్ణుమూర్తి ఆఙ్ఞననుసరించి సృష్టి వృద్ధి కాగలందులకు మరీచి, అత్రి, అంగీరస, పులస్త్య, పులహ, క్రతు, వశిష్ఠుడు అను
ఏడుగురు మహర్షుల మనస్సంకల్పముచే సృష్టించెను.
అనంతరము బ్రహ్మ యొక్క కుడి శరీర భాగమునుండి స్వాయంభువ మనువు, ఎడమ సగ
భాగమునుండి శతరూపయను స్త్రీరత్నమును జనించెను.
వారికి దేవహూతి యను కన్య కలిగెను.
ఆ దేవహూతిని కర్దముడను ప్రజాపతికిచ్చి వివాహము చేసిరి. కర్దముని వలన దేవహూతి యందు తొమ్మిది మంది
కన్యలు పుట్టిరి. అందు రెండవ కన్యక అయిన
అనసూయను బ్రహ్మ మానస పుత్రుడు అయిన అత్రి వివాహమాడెను. అనసూయాదేవి యొక్క చక్కదనము వర్ణనాతీతము. ఆమె పాతివ్రత్యము నిరుపమానము. ఇంద్రాది దేవతలు ఆమె పాతివ్రత్య ప్రభావమును
చూచి భీతిల్లి త్రిమూర్తుల సమీపించి ఇట్లు చెప్పిరి. అత్రి భార్య యగు అనుసూయాదేవి పాతివ్రత్యమును
చూడ మాకు భయమగుచున్నది. ఆమె ఎవరికైనా
వరమిచ్చినచో మా ఇంద్రపదవియు దక్కదని తోచుచున్నది.
మనోవాక్కాయములతో నామె పతిని భజించును.
అతిథులు స్వప్న మందయినను ఆమె గృహమునుండి విముఖులై పోవుట చూడము. సూర్యుడు గూడను తన తీక్షణ కిరణముల నామెపై
ప్రసరింపజేయుటకు భయపడుచున్నాడు. అగ్నియు ఆమెను దహింపజాలదు. భూమియు ఆమె పాదమిడుచోట
మృదువయి యుండును ఆమె ఎవ్వరిని ఎప్పుడు శపించునో అను భయముతో మా ప్రాణములు పోవుచున్నవి కాన జగదీశ్వరు లారా! ప్రస్తుతము మాకు
ఘటిల్లిన ఆపదను నివారించి మాకు పదభ్రంశము కాకుండునటుల చేయుడు. మీరు అనుగ్రహించనిచో
మేము ఆమె యింటికి వెళ్ళి దాస్యము చేయవలసిన దుర్గతి యేర్పడును.
అనగా త్రిమూర్తులు వారి మాటలు
విని కోపించి అంత పతివ్రతయా ఆమె! మేము వెళ్ళి ఆమె వ్రతభంగమొనర్చి ఆమెను యమలోకమునకు
పంపెదము. అని దేవతల సమాధానపరచి అతిధి రూపముల ధరించి అత్రి మహర్షి ఆశ్రమమున లేని
సమయమున ఆకలిగొన్న వారివలె ఆమె ఆశ్రమము సమీపించిరి. అనసూయాదేవిని గూర్చి అమ్మా మాకు
తొందరగా అన్నమిడుము. మీయింట అభ్యాగతులకు తృప్తిగా ఇచ్ఛాను సారముగా భోజనము
లభించునని వింటిమి. నీకీర్తిని వచ్చితిమి, అనగా వారి
మాటలు విని అనసూయకాదేవి వారికి ప్రణమిల్లి పాద ప్రక్షాళన మొనర్చి ఆసనముల
కూర్చుండబెట్టి అర్ఘ్యపాదముల సమర్పించి గంధపుష్పాదుల పూజించి స్వామి! అనుష్ఠానము
చేసికొనుడు. మహర్షి శీఘ్రముగ రాగలడు. మీరు
భుజించవచ్చును. అనెను. ఆమాట విని వారు మీ మహర్షి వచ్చు పర్యంతము ఉండజాలము. శీఘ్రముగ అన్నమిడుము. లేనిచో పోయెదమనిరి.
అప్పుడు ఆమె అతిథి పూజాధురంధరురాలుగాన వారిని ఆసనముల కూర్చుండబెట్టి పత్రములుంచి
అన్నము తెచ్చుటకు నుద్యుక్తురాలయ్యెను. అప్పుడు వారు ఆమెతో అమ్మా మాకకొక కోరిక కలదు. మాయభీష్టమును తీర్చితివేని నీయింట భుజించెదము.
అది ఏమనిన నీవు నగ్నురాలవయి మాకు అన్నమిడవలయును లేనిచో మీయింట భుజించము, వెళ్లెదమనిరి.
ఆమాట విని ఆపతివ్రత తనమనములో వీరు సామాన్య మానవులుగ తోచదు. ఎవరో కారుణిక
మహాపురుషులుగ నుండనోపు. ఇట్టి మహాత్ములు
విముఖులయినచో ఈఆశ్రమము వనతుల్యమగును. వీరివాంఛను
నేను నెరవేర్చని యెడల వారు విముఖులయి పోవుదురు. నా మనము నిష్కల్మషమై ఉన్నప్పుడు
కామము నన్నేమి చేయగలదు. నా భర్తయొక్క తపమే నాకిత్తరి తారకము. అని విచారించి స్వామీ
మీకోరిక ప్రకారమే చేసెదను. స్వస్థమనస్కులై భుజించుడని చెప్పి ఆమె పాకశాలలోని
కరిగి భర్త పాదముల మనమున స్మరించి ఈ వచ్చిన వారు నాకు బాలులగుదురు గాక యని చెప్పి
వస్త్రమును విడిచి అన్నపు పళ్లెమును చేతనిడుకొని వారిని సమీపించగా ఇంతలో వారు
అప్పుడు పుట్టిన పిల్లల వలె క్రిందపడి పొరలుచు ఏడ్చుచుండిరి. ఆమె వారిని సమీపించి
ఓదార్చుచు ఆ బిడ్డలనెత్తికొనగా ఆమె స్తనములనుండి క్షీరము సమృద్ధిగ
నుత్పన్నమయ్యెను. ఒక్కొక్కరికి వరుసగా పాలనిచ్చి తృప్తి పరచెను. నామధారకా! ఆమె భాగ్యమేమని చెప్పగలను!
త్రిభువనములు తనలో గలవిష్ణువు ఆమె పయఃపానము చేసి తృప్తిపొందెను. సృష్టికర్తయగు
బ్రహ్మయు ఆసతీస్తన్యపానముచేసి తృప్తి పొందెను. పంచముఖుడై, ఫాలనేత్రుడయిన
శివుడు ఆసాధ్వీమతల్లి స్తన్యము గ్రోలి
ఆనందము నొందెను. ఇది అంతయూ అత్రి అనసూయల యొక్క తపఃప్రభావము. ఆమె బాలకులను
ఉయ్యలలయందు పరుండబెత్తి మధురముగా ఉపనిషదర్థగర్బితములగు గీతముల పాడుచు
నిద్రపుచ్చుచుండెను. ఇంతలో మధ్యాహ్నమగుట వలన తపోవనము నుండి అత్రి మహర్షి ఆశ్రమమును
సమీపింప లోపల అనసూయచే పాడబడు గీతములు వినబడెను. ఆయన ఆశ్చర్యపడి ఆశ్రమము ప్రవేశించి
అనసూయ వలన జరిగిన వృత్తాంతము తెలిపికొని జ్ఞాన దృష్టిచే వారు త్రిమూర్తులని
గ్రహించి నమస్కరించెను. వెంటనే ఉయ్యెలలో బాలురై ఉన్న త్రిమూర్తులు వారి
నిజరూపములతో ఆత్రి అనసూయలకు ప్రత్యక్షమయి మీతపఃప్రభావమునకు మెచ్చితిమి. ఏమయిన
వరములు కోరుకొనుమనిరి. అప్పుడు వారు మీరు ఈ బాలభావముతో మాకు బిడ్డలయి యుందురు గాక.
అను వరమడిగిరి. అట్లే వరమునను గ్రహించి వారిలోకమునకు వారేగిరి. త్రిమూర్తుల
వరప్రసాదముగా ముగ్గురు బాలురు అత్రి అనసూయలకు కలిగిరి. ఆ బాలురలో విష్ణు అంశతో
నేర్ఫడిన బాలుని దత్తాత్రేయుడనియు, బ్రహ్మ అంశముతో నేర్పడిన బాలుని చంద్రుడనియు, శివుని యంశతో
కలిగిన బాలుని దూర్వాసుడు అని నామకరణమొనర్చిరి. కొంతకాలము జరుగగా దూర్వాసుడు తన
రుద్రాంశమును దత్తాత్రేయుని యందే యుంచి తల్లిదండ్రుల యనుమతిపై తపమునకు పోయెను.
చంద్రుడును తన బ్రహ్మాంశమును దత్తాత్రేయునకర్పించి చంద్రమండలమునకు వెడలెను. అప్పటినుండియు
దత్తాత్రేయుల వారే త్రిమూర్తిస్వరూపుడయి గురుసంప్రదాయమునకు మూలపీఠమయి బ్రహ్మ
కల్పాంతము భక్తులననుగ్రహించుచుందురు.
దత్తాత్రేయుల వారి ప్రాదుర్భానము షోడశావతారములుగ కల్పభేదములను బట్టియు, సమయ
సందర్భమును బట్టియు జరిగి యున్నటుల శ్రీవాసుదేవానంద సరస్వతీ స్వాములవారు తమస్తోత్ర
సంగ్రహమని గ్రంథమునందు విశదీకరించియున్నారు, గ్రంథ విస్తర
భీతిచే నీ గురుచరిత్ర మందు నా విషయము క్లుప్తీకరించబడినది.
దత్తాత్రేయులవారు అవధూతయై
బాలోన్మత్త పిశాచ రూపము సంచరింతురు. కృతయుగాదుల యందు పెక్కుమంది వారిని నవవిధ భక్తులతో
నారాధించి ధన్యులయిరి. కార్త వీర్యార్జునుడు స్మరణ భక్తి చేసి ధన్యుడయ్యెను.
ఆయురాజు అర్చనయను భక్తితో నైహికాముష్మిక సుఖముల చూరగొనెను. మదాలన యను పతివ్రతా
గర్భరత్నమయిన అలర్కుడను మహారాజు స్వామి వారిని వందన భక్తితో
నారాధించిముక్తుడయ్యెను. పరశురాముడు సఖ్యభక్తి చేసి దత్తదేవుని కృపకు
పాత్రుడయ్యెను ఇంతేకాక ప్రహ్లాదుడు, యదుమహారాజు, వేదధర్ముడు, పింగళుడను
నాగుడు మొదలగు వారెందరో దత్తాత్రేయుని ఆరాధించి కృతార్థులయిరి. ఈ విషయము
దత్తపురాణమందు విశదముగా వ్రాయబడినది, అని ఇట్లు సిద్ధముని నామధారకునితో
చెప్పెను. అప్పుడు నామధారకుడు సిద్ధమునితో స్వామీ దత్తాత్రేయుల వారు ఈ
కలియుగమునందు భక్తుల రక్షించు నిమిత్తము అవతరించిరని వింటిని. అట్టి వారి అవతార
లీలల నాకు విశదముగ చెప్పి ధన్యుని చేయుడని ప్రార్థించెను. ఆ వృత్తాంతమును సిద్ధముని
పై అధ్యాయమున చెప్పగలరు.
ఇది గురుచరిత్రమున నాల్గవ యధ్యాయము
శ్రీ గురు చరితము
అయిదవ అధ్యాయము
శ్రీదత్తాత్రేయాయనమః శ్రీపాదశ్రీవల్లభఅవధూత పరబ్రహ్మణేనమః
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా
సిద్ధముని నామధారకునితో ఇట్లు
చెప్పుచుండెను. నారాయణుడు దుర్వాసుని
శాపమును, భక్తుడైన
అంబరీషుని సంరక్షణమును కారణముగా చేసికొని అవతారములను స్వీకరించవలసి వచ్చెను. మత్స్యమయి వేదములను ఉద్ధరించెను. కూర్మమై అమృత మధన సందర్భములో దేవతలకు
సహాయపడెను. వరాహమై
భూమినుద్ధరించెను. నరసింహ రూపమును దాల్చి
భక్తుడైన ప్రహ్లాదుని రక్షించెను.
వామనుడై యాచక రూపమున బలిని భిక్షమడిగెను.
బ్రాహ్మణుడై పరశువుచే దుష్ట క్షత్రియుల సంహరించి పరశురాముడను కీర్తి
గడించెను. దాశరథియై రావణుని సమూలముగా
సంహరించెను. కృష్ణుడై గోష్టమున గోవులను
కాచెను. దిగంబరుడై కలియుగమున
బుద్ధరూపమును దాల్చెను. యుగాంతమున కల్కియై
అతడే అశ్వమునధిష్టించి ఖడ్గముచే మ్లేచ్ఛుల దునుమాడగలడు. కలియుగము రాగా దురాచార రతులయి భక్తియన నేమియో
తెలియని అఙ్ఞానుల రక్షించ దలచి శ్రీదత్తాత్రేయుల వారు భూలోకమున నవతరించిరి. ఆ కథ చెప్పెద వినుము.
పిఠాపురమున ఒక సత్కుల
ప్రసూతుడైన ఆపస్తంభ శాఖకు సంబంధించిన రాజా అను పేరుగల ఒక బ్రాహ్మణుడు కలడు. ఆయనకు సుమతి అను పేరుగల నొక పతివ్రతయగు భార్య
కలదు.ఆమె సాత్విక వృత్తి కలదై పతిని భక్తితో సేవించుచు అతిథి అభ్యాగతుల నాదరించుచు
కాలము గడుపుచుండ ఒక అమావాస్య దినమున మధ్యాహ్న కాలమునకు దత్తాత్రేయులవారు ఒక
బ్రాహ్మణరూపమున ఆమె ఇంటికి అతిథియై వచ్చిరి.
ఆమె భర్త యింట లేకున్నను వారి చూడగానే భక్తితో భిక్షము పెట్టెను. వెంటనే ఆమె భక్తికి సంతసించి త్రిమూర్తి రూపమున
ప్రత్యక్షమయి అమ్మా నీకిష్టమయిన వరమును కొరుకొనుము ఇచ్చెద మనిరి. అప్పుడా పతివ్రత స్వామివారికి నమస్కరించి
వారినిట్లు స్తుతించెను. స్వామీ! జయజయ
జగన్నాథా! మీరు విశ్వ కర్తలు. భక్త
వత్సలులు. దయా స్వరూపులు, మీ వాక్యము వ్యర్థము కాదు. మీరు ధ్రువునకు
ధ్రువలోకాధిపత్యమిచ్చితిరి. విభీషణునకు
ఆచంద్రతారకముగ లంకానగరాధిపత్యమొసంగితిరి.
మీరు భక్తాధారులు. మీ బిరుదములు
ప్రఖ్యాతములు. కాన నామనో వాంఛను పూర్తి
చేయుడని వారి పాదములపై పడెను. అప్పుడు
వారు ఆమెను లేవదీసి అమ్మా! నీ కోరిక ఏమియో చెప్పమనిరి. అప్పుడు ఆమె స్వామీ! ఇపుడు మీరు నన్ను అమ్మాయని
సంబోధించితిరి. ఇదివరకు నాకు ఎంతమందియో
పిల్లలు పుట్టి మరణించిరి. ఇద్దరు మాత్రము
బ్రతికి యున్నారు. కానీ ఒకనికి పాదములు
లేవు. మరి యొకనికి నేత్రములు లేవు. అట్టి కుమారుల వలన నేను కష్ట జీవితమును
గడుపుచున్నాను. సత్పుత్రుడు లేని జన్మ
నిష్ఫలము గదా. ఆయుష్మంతుడైన, ఙ్ఞానియై
జగద్వంద్యుడైన మీ వంటి కుమారుని నాకు అనుగ్రహించి నాజన్మను సఫలమొనర్చుడనెను. ఆ మాట విని భగవంతుడు ప్రసన్నుడై కలియుగమున
సజ్జనులకు భక్తిమార్గమును ప్రచారమొనర్చుటకు ఇదియే తరుణమని భావించి తనే ఆ పతివ్రత
గర్భమున జన్మించ నిశ్చయించుకొని ఆమెతో ఆమ్మా! నీకోరిక నెరవేరును. ఉభయ
వంశముల తరింపజేయు నావంటి కుమారుడే నీ గర్భమున నుద్భవించగలడు. కాని అతని వాక్యమును మీరనుసరింపవలయును. అతడు లోకమునకు జ్ఞానప్రదుడగును. అని చెప్పి భగవానుడంతర్హితుడయ్యెను. ఆమె విస్మితురాలై ఆరూపమునే స్మరించుచుండెను. ఇంతలో భర్త రాగా జరిగిన విషయమును
చెప్పెను. అప్పుడతను సంతసించి వచ్చినవారు
దత్తాత్రేయులే సుమా. మధ్యాహ్న కాలమునకు
అతిథియై వారు బ్రాహ్మణ గృహముల కేతెంచెదరు.
మాహూరు,
కరవీరము,
పాంబలేశ్వరము మొదలగు క్షేత్రములనుందురు.
భికక్షుక రూపమున అచ్చటచ్చట సంచరింతురు.
నేను యింట లేకున్నను నీవు వారిని సత్కరించితివి. నాకు సంతసమైనది అనెను. అప్పుడామె ఈరోజున అమావాస్య అయినను దేవతార్చనము, వైశ్వదేవము, పితృతర్పణము
కాకున్నను నేను వారికి భిక్షమిచ్చితిని.
నా తప్పు క్షమించుడనెను. అప్పుడా
బ్రాహ్మణుడు ఆమెతో పితరులనుద్దేశించి శ్రాద్ధమునొనర్చి ఏఫలము విష్ణువునకర్పింతుమో
అట్టి దత్తాత్రేయుడే నేడు వచ్చి మనయింట భిక్షమంగీకరించెను. అందుచే మన పితరులకు శాశ్వత స్వర్గము
సిద్ధించెను. త్రిమూర్త్యాత్మకుడైన
దత్తదేవుని పూజించు భాగ్యము నీకు లభించెను.
అందుచే నీవే కాక నిన్ను కన్నతల్లియు ధన్యురాలయ్యెనని తలచెదను. కొద్ది కాలమునకు ఆమె గర్భవతి అయ్యెను. నవ మాసములు నిండ శుభ ముహూర్తమున ఆమె ఒక బాలుని
కనెను. దైవఙ్ఞులు ఆబాలుని జన్మ లగ్నమును
పరిశీలించి ఆ పిల్లవాడు జగద్గురువు కాగలడు.
సాధువులకు దీక్షనొసగును అని చెప్పిరి.
తల్లిదండ్రులు సంతసించిరి. ఆబాలునకు
పాదమందలి శంఖచక్రాది రేఖలు చూచి పన్నెండవరోజున శ్రీపాదుడని నామమిడిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచుండెను. ఎనిమిదవ యేట ఉపనయనము గావించిరి. సమస్త వేదములు, వేదాంగములు
ఆబాలునకు కంఠగతములయ్యెను. అతని ధారణా
శక్తిని చూచి పరమేశ్వరుడే గావచ్చునని అందరును విశ్వసించిరి. పదహారు సంవత్సరములు సమీపించగా తల్లిదండ్రులు
అతనికి వివాహము చేయ సమకట్టిరి. ఆ విషయమును
గ్రహించి శ్రీపాదులవారు నేను మానుష స్త్రీని వివాహమాడువాడను గాను. విరక్తి యను కాంతయే నాకు సమ్మతమగు
కన్యారత్నము. ఆమెనే వివాహమాడ
నిశ్చయించితిని. ఇతర స్త్రీలు అందరు నాకు
తల్లితో సమానులు. యోగ లక్ష్మిని తప్ప
ఇతరులనే కాంక్షించువాడను గాను. కాననే
నన్ను శ్రీవల్లభుడని తెలిసికొనుడు. నేను
లోకమునకు జ్ఞానముననుగ్రహించుచు ఉత్తర మార్గమున వెడలెదననెను. అప్పుడు వారు పూర్వము దత్తాత్రేయులవారు చెప్పన
వాక్యమును స్మరించి ఇట్టి మహాత్ముని వాక్యమునకు మనమడ్డు చెప్పుట ధర్మము కాదు. అట్లొనర్చితిమేని మనకే నష్టము వాటిల్లును. కాన నితనికి మన కష్టముల మాత్రము విజ్ఞాపన
చేసికొందమని నిశ్చయించుకొని నేత్రముల వెంబడి బాష్పముల కార్చు చుండిరి. అప్పుడు శ్రీపాద శ్రీవల్లభుల వారు వారి
నేత్రోదకముల తమ హస్తముల తుడిచి తల్లితో అమ్మా చింతించకుము. నీ కోరిక ఏమో చెప్పుము. మనస్సును దృఢము చేసికొని సుఖముగా
ఉండమనెను. అప్పుడు తల్లి తనకుమారునితో నాయనా
నిన్ను చూచుకొని దుఃఖమును మరచితిని.
వార్ధక్యమున మమ్ముల రక్షింతువనుకొంటిమి.
మాకా వృద్ధాప్యము వచ్చెను. ఉన్న
ఇద్దరు నీ సోదరులలో ఒకరు కుంటివాడు, వేరొకడు
గ్రుడ్డివాడు కదా. నీవా మమ్ముల విడిచి పోవుచుంటివి. మాగతి యేమి? అని
దుఃఖించుచుండెను. తల్లియొక్క వాక్యములు
విని తన సోదరులయిన కుంటివాడిని గ్రుడ్డివాడిని సమీపించి శ్రీపాద వల్లభులు అమృత
దృష్టితో చూచిరి. వారి చూపు సోకినంతనే
స్పర్శవేది సోకినంతన ఇనుము బంగారమైన రీతిని కుంటివానికి పాదములు వచ్చెను. గ్రుడ్డివానికి నేత్రములు వచ్చెను. ఇద్దరును వేద శాస్త్రపారంగతులయిరి. అప్పుడు శ్రీపాద శ్రీవల్లభుల వారు వారిని మరల దీవించి మీరు పుత్ర
పౌత్రాభివృద్ధినొందగలరు. లక్ష్మీ
సంపన్నులయ్యెదరు. నా వాక్యముననుసరించి
మీరు తల్లి తండ్రుల సేవించి ధన్యులు కండని చెప్పి తల్లి తండ్రులతో ఈ పిల్లలు
శతాయుష్మంతులగుదురు. వీరల పుత్రికా
పుత్రుల మీరు కన్నుల చూడగలరు. కాన చింతించ
వలదు. మీ యింట లక్ష్మి నిశ్చలముగానుండును.
మీ వంశమున వేదశాస్త్రపారంగతులే జన్మించెదరు. కాన తల్లీ! నాయందు అనాదరణ భావముంచక నాకు
అనుజ్ఞనిమ్ము. సాధువులను
అనుగ్రహించుటకుగాను నేను ఉత్తర మార్గమున వెళ్ళుచున్నాను. అని చెప్పి నమస్కరించి అదృశ్యుడై కాశీ పురము
చేరి అచటనుండి బదరికాశ్రమము వెళ్ళి అచ్చట నరనారాయణుల దర్శించి భూమండలమందలి ముఖ్య
క్షేత్రముల సంచరించి గోకర్ణ క్షేత్రము ప్రవేశించిరని ఈ కథా వృత్తాంతమును సిద్ధముని నామధారకునితో
చెప్పెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి