5, డిసెంబర్ 2025, శుక్రవారం

 

శ్రీ గురు చరితము

ఇరువదిఅయిదవ అధ్యాయము

కర్మకాండ ప్రారంభము

ఓం శ్రీ గణేశాయనమః  శ్రీగురుదేవదత్తాత్రేయాయ నమః

            నామధారకుడు సిద్ధమునితో స్వామీ! గురుమూర్తి త్రివిక్రమ భారతికి విశ్వరూపమును ప్రదర్శించి తిరిగి గణగాపురము చేరిరని చెప్పితిరి. అటుపైన జరిగిన గురుచరితమును నాకు వినిపించి ధన్యుని చేయుడని ప్రార్ధించెను.   సిద్ధముని ఇట్లు చెప్పుచుండెను.

            గురుచరితమును విస్తరించి చెప్పవలయుననిన గ్రంథము విస్తారమగును. నీవు భక్తితో ప్రశ్నించుచుంటిని గాన అందలి సారమును సంక్షేపముగ చెప్పచున్నాను.  వైడూర్యమును నగరమున ఒక యవనరాజు గలడు. అతడు బ్రహ్మద్వేషి,  శ్రూదుడు. హింసారతుడు. అతను బ్రాహ్మణులను పిలిపించి మీకు వలసినంత ధనమిచ్చెద మీవేదములను మాకు వినిపించుడు. వేదములను ఆర్థముతోసహ చెప్పువారిని విశేషముగా సత్కరించెదనని వారలతో ననెను. జ్ఞానులై వివేకముగల విద్వాంసులు అతని మాటలు విని మాకేమియు వేదములు రావు అని తప్పించుకొనిరి. మూఢులై కొంత మంది ద్రవ్యకాంక్ష కలవారై అతనివద్ద వేదమును అర్థముతో గూడ ఉపన్యసించుచుండిరి. వారు యజ్ఞప్రకరణమును వ్యాఖ్యానింప ఆతురకవాడు విని మీకు పశుహింస  చేయుదురని మమ్ముల నాక్షేపింతురే! మీరెటుల యజ్ఞములను పేరుతో పశువుల హింసించుచున్నారు? అని పరాభవించుచు ద్రవ్యమును మాత్రము వారివారి యొగ్యత ననుసరించి ఇచ్చుచుండెను.  వేదార్థములు చెప్పువారికి బిరుదములు గూడ ఇచ్చుచుండెను. ఎవరైతే దురాచారులై సంప్రదాయ విరుద్ధముగా మ్లేచ్ఛులయెదుట వేదముల పఠింతురో అట్టి మూర్ఖులు కలిపురుషునకు ప్రియులు. వారికి ముందు యమరాజ్యమే నివాసస్థానము.  ఇట్లుండ ఒక సమయమున ఇద్దరు బ్రాహ్మణులు ఆరాజును సమీపించి. మేము వేదశాస్త్రములను సమగ్రముగా పఠించితిమి. మాతో వాదించగలవారెవ్వరు లేరు. మీరాజ్యములో మాతో వాదించగలవారెవ్వరయిన నుండిన పిలిపించుడు అని తమ ఖ్యాతిని చెప్పుకొనిరి. ఆతురకరాజు వారి వాక్యములు విని ఆభిమానియై తమ రాజ్యమందలి పండితులనందర నాహ్వానించి ఈనూతన పండితుల నెవ్వరు గెలుతురో వారలకు గొప్ప బహుమానములనిచ్చెదనని అనెను. అచ్చటి బ్రాహ్మణులందరు ఆరాజుతో వీరుల గెలువగల సామర్థ్యము మాకులేదు. మాకంత పాండిత్యములేదు. మీరు వారలనే గౌరవించుడని చెప్పి తప్పించుకొనిరి. అప్పుడు రాజు నేనెట్లు యవనులకు రాజునో మీఇద్దరు బ్రాహ్మణులకు రాజులు అనిచెప్పుచు వస్త్రభూషణములతో వారలనలంకరించి ఏనుగులమీద వాద్య ఘోషపురస్సరముగా నూరేగించి వారల తన యాస్థానవిద్వాంసులుగా నుంచుకొనెను. వారు పాపభయము విడిచి నిత్యము మ్లేచ్చుని యెదుట వేదము పఠింపుచు బ్రాహ్మణుల నిందించుచు మదోన్మత్తులై  యుండిరి.   ఒకదినమున వారు రాజును సమీపించి మహారాజా మేము చదువుకొనిన విద్య అంతయు వ్యర్థమగుచున్నది. మీఆజ్ఞ అయినచో మేము  దేశదేశాంతరములకు వెళ్లి అచటనున్న విద్వాంసుల వాదమున గెలిచెదము. వాదించలేనివారిచే జయపత్రములు కొనితెచ్చెదము అని చెప్పిరి.  రాజును చాల నంతసించి బ్రాహ్మణ పరాభవము చేయదగినదే అట్లె యొనర్చుడని తగిన పరివారమును గూడ వారి వెంట పంపెను. ఆ తామసులగు బ్రాహ్మణులిద్దరు దేశదేశాంతరములు పర్యటించి అచటనున్న విద్వాంసుల ఓడించుచు జయపత్రములు తీసికొనుచు క్రమముగా దక్షిణదిక్కున నున్న త్రివిక్రమ భారతి నివాసస్థానమైన కుమసీగ్రామము చేరిరి. లోకులవలన నతను వేదవేత్తయనియు అనేక శాస్త్రములయందు నిపుణుడనియు విని వారిని సమీపించి మీరు గొప్ప విద్వాంసులని వినివచ్చితిమి. మీకు శక్తియున్నమాతో వాదించుడు. లేనిచో జయపత్రమిండని అడిగిరి. అపుడు త్రివిక్రమభారతీస్వామివారు వారలతో నాకు మూడు వేదములు రావు ఒక్క వేదమును రాదు. వేదశాస్త్రములతెలిపినవాడనైన యెడల మీవలె రాజపూజ్యతనొంది యుందును గాని ఇట్లరణ్యమున భికక్షుకుడనై ఎందులకుందును. కనుక సన్యాసి వేషముతో భిక్షమెత్తి జీవించు నేను మీతో సముడ కాజాలను. సర్వమును త్యజించి నిరభిమానియైన నాకు జయాపజయములతో పనియేమి? ఉత్కృష్టవిద్యాంసులైన మీకు భిక్షుకుడనగు నన్ను జయించుటవలన వచ్చు కీర్తియేమి? అని వినయముతో సమాధానము చెప్ప వారు మరింత అభిమానగ్రస్తులై మమ్ము గెలువగల వారివ్వరును ఈభూలోకమున లేరు. అన్ని రాష్ట్రముల పర్యటించితిమి. ఈ మా జయపత్రముల చూడుడు. మీకు విద్యాభిమానముండినచో వాదించుడు. లేనిచో అందరివలె జయపత్రమిండు వెళ్లిదమనిరి. స్వామివారు వారలకుతగు సమాధానము చెప్పజాలరైరి. వారు మీరు జయపత్రమీయనిచో మేము పోము.  అట్లు పోయితిమేని మారాజువలన మాకు మాటరాగలదు. అని పట్టుపట్టిరి. అప్పుడుస్వామివారు ఈ బ్రాహ్మణులు మదించియున్నారు.  ఇట్లెంతమంది బ్రాహ్మణుల పరాభవించిరో! వీరల నేను గంధర్వ నగరముననున్న గురుమూర్తి సమక్షమునకు తీనికొని పోయెద. అచ్చట వీరికి తగిన శాస్తి జరుగగలదని మనమున నిశ్చయించి వారలతో నాకన్న గొప్పవారు మాగురువరేణ్యులు గంధర్వనగరమున గలరు. అచ్చటకు పోయెదము రండు. అచ్చట మీకు జయపత్రము లభించుటయో లేదా మీకోరిక నెరవేరుటయో కాగలదు అని చెప్పిరి. అప్పుడా బ్రాహ్మణులు అందులకంగీకరించిరి.

            వారుత్తమయానము నధిష్టించి ప్రయాణమయిరి. స్వామివారు వారికి త్రోవచూపుచు పాదచారియై నడచుచుండిరి. మహాత్ముడగు యతి నడచుచుండ వారెప్పుడు యానములందు గర్వముతో కూర్చుండిరో అప్పుడే వారి ఆయుష్యము అల్పమైపోయెను. వారు క్రమముగా గంధర్వనగరము సమీపించిరి.

            త్రివిక్రమభారతి గురుమూర్తిని సమీపించి యోమహేశా! కృపాళో! భక్తవత్సలా! జగద్గురో! సంసారార్ణవతారకా! మిమ్ములగుర్తించనివారు నిజముగ నధోగతిపాలగుదురు. అని చెప్పుచు రోమాంచము గలుగు గద్గదధ్వనితో స్తుతించుచు నేత్రములవెంట ఆనందబాష్పములు రాల్చుచు గురునాధుని పాదములకు నమస్కరించెను. అప్పుడు గురునాధుడు త్రివిక్రమభారతిని లేవదీసి ఆలింగనమొనర్చి ఏమికార్యము! ఎందులకుగా నిటుల సంభ్రమముగా నిటకువచ్చితివని ప్రశ్నించిరి. అప్పుడు త్రివిక్రమభారతి గురుమూర్తితో స్వామీ! ఈ బ్రాహ్మణులు మదోన్మత్తులు. మాకు నాల్గువేదములువచ్చును. మాతో వాదించవలసినది. లేనిచో జయపత్రమిమ్మని నన్ను ఒత్తిడి చేసిరి.  నేను ఎంత చెప్పినను వారు నా వాక్యముల లెక్కచేయకున్నారు. కాన వారల తమ సమక్షమునకు తీసికొనివచ్చితినని చెప్పెను. అప్పుడు గురుమూర్తి నవ్వుచు బ్రాహ్మణులను దగ్గరకు పిలిచి, ఓబ్రాహ్మణులారా! మీరెందులకు వచ్చితిరి. వాదములవలన నేమి ఫలము. ఇతరుల పరాభవించుటయే విద్యకు ప్రయోజనమా! యతులమగు మాకు జయాపజయములు సమములు. యతిని జయించినందువలన మీకు వచ్చు పురుషార్థమేమి అనిరి. అప్పుడామదించిన బ్రాహ్మణులు ఓసన్యాసీ! మేము భూమండలమంతయు పర్యటించితిమి. మాతో వాదించు పండితుడే ఎందును కాన రాడయ్యెను. మాతో వాదము చేయజాలక అందరును జయపత్రముల నొసగిరి. అట్లే మేము ఈత్రివిక్రమభారతిని గూడ జయపత్రికనిమ్మనగా కోపముతో మీవద్దకు తీసికొనివచ్చిరి. మీకు పండితులమను అభిమానమే ఉన్నచో మాతో వేదశాస్త్రములందు వాదమునకు ఉపక్రమించుడు. యతులవేషము ధరించితిరే  కాని మీకేమివచ్చును అని ధిక్కరించి పలికిరి. వారి మాటలు విని గురుమూర్తి వారితో  వ్యర్థముగా గర్వించకుడు. దేవదానవులెందరో గర్వముతో నశించిరి. బలిచక్రవర్తి గర్వముతో నధోగతి పాలయ్యెను. బాణాసురుడు, లంకానాథుడగు రావణాసురుడు  గర్వించి మృతినొందిరి. మేము వేద వేత్తలమని గర్వించుచున్నారు.  వేదములనంతములు. బ్రహ్మాదులే వేదములకంతము కనుగొనరైరి. మీకు హితము చెప్పెద. గర్వమును త్యజించుడు. ఒక్కవేదమే సాంగముగా తెలియని మీరు చతుర్వేదవేత్తలగుట ఎట్లు? అని స్వామివారుఎంత భోధించినను వారు గర్వముతో స్వామివారు వాక్యమును పెడచెవిని పెట్టి తమ పట్టు విడువరైరి. ముందు కథను పై అధ్యాయమున వినగలరు.

ఇది గురుచరితమున ఇరువది అయిదవ అధ్యాయము సమాప్తము.

 

 

శ్రీ గురు చరితము

ఇరువదిఆరవ అధ్యాయము

ఓం శ్రీ గురుదేవదత్త, ఓం శ్రీగణేశాయనమః ఓం శ్రీపరబ్రహ్మణేనమః

ఓం శ్రీసద్గురుభ్యో నమః

 

            గురుమూర్తి ఆ గర్వితులగు బ్రాహ్మణులతో ఇట్లు చెప్పచున్నారు. మీరు వ్యర్థముగ భ్రమలో పడకుడు. వేదములు అనంతములు.  అట్టి వేదములను  నారాయణుడు వ్యాసుడయి అవతరించి విఖ్యాతిలోనికి తెచ్చెను. అందుకనియే వారికి వ్యాసుడను సార్థక నామమేర్పడెను. వ్యాసునకు నలుగురు శిష్యులు కలరు. 1 పైలుడు. 2, వైశంపాయనుడు, 3. జైమిని. 4. సుమంతుడు. పైనలుగురు శిష్యులకు నాలుగు వేదములనుపదేశించెను. ఒక్కొక్క వేదము కల్పాంతము పఠించినను అంతము నొందదు. ఇట్టి  స్థితిలో మీరు నాల్గు వేదముల పఠించితిమని ప్రగల్భములాడుచున్నారు. పూర్వము భరద్వాజుడను మహర్షి వేదములను సాంతముగ పఠించవలయునని దీక్షపూని ఘోరమయిన తపమొనరించెను. బ్రహ్మ ప్రసన్నుడయి వరము కోరుకొనుమన నాకు సమస్త వేదముల సాంగముగా పఠించు కోరిక గలదు,  అనుగ్రహించుడని కోరెను.  బ్రహ్మ,  భరద్వాజునితో అన్ని వేదములు పూర్ణముగ నాకే తెలియవు. నీకు వేదముల చూపెద శక్యమయినచో పఠించుము. అని చెప్పి జ్యోతిర్మయమయి ప్రకాశించెడి వేద పర్వతముల భరద్వాజునకు చూపెను.  అప్పుడు భరద్వాజుడు భయపడి స్వామి అనంతములయిన ఈ వేదరాసుల నేనేమి పఠించ సమర్థుడను? తమరు అనుగ్రహించు ఏకొంచెమో నాశక్తిని గ్రహించి ఇచ్చినచో పఠించెదనన అప్పుడు బ్రహ్మ మూడు వేదములనుండి మూడు పిడికిళ్ళు మాత్రము విడతీసి భరద్వాజునకిచ్చి పఠింపుమనెను.  భరద్వాజుడు ఇప్పటికిగూడ  బ్రహ్మ ఇచ్చిన అస్వల్ప భాగముగూడ పూర్తిగ పఠించలేకపోయెను. వ్యాసుడు ఈవిషయమును కనిపెట్టి తన శిష్యులకు ఆ వేదమును క్లుప్త పరచి ఈక్రింది విధముగ భోధించెను.

            పైలుడను శిష్యుని పిలిచి అతనికి ఋగ్వేదమునుపదేశించెను. ఒక్కొక్కవేదమునకు ఒక ఉపవేదముగూడ నుండును. ఋగ్వేదమునకు ఆయుద్వేదము ఉపవేదము.  ఋగ్వేదదేవత బ్రహ్మ, ఆత్రేయగోత్రము. రక్తవర్ణము చక్కని కంఠము వంకరలు తిరిగిన వెంట్రుకలు, రెండు మూరల ప్రమాణము గలవారుగ నుండును. ఋగ్వేదములో ఆశ్వలాయన, సాంఖ్యాయన, శాకల, బాష్కల, మాండూకేయ అని అయిదుశాఖలు కలవు. ఇట్టి వేదమును పైలుడు వ్యాసుని వలన గ్రహించెను. కాలక్రమమున కలిరాగా ఋగ్వేద శాఖలందు చాల భాగము లోపించి ఏకొద్దిభాగము మాత్రమే ప్రస్తుతము ప్రచారములో ఉన్నది.  ఇట్టి స్థితిలొ మేము వేదముల సాంతముగ పఠించితిమని చెప్పుటకు మీకు సాహసమెట్లు కలిగెను.

            వ్యాసుడు రెండవ శిష్యుడగు వైశంపాయనుని పిలిచి అతనికి యజుర్వేదము నుపదేశించెను. యజుర్వేదమునకు ధనుద్వేదము ఉప వేదము. రుద్రుడు  దేవుడు. భారద్వాజగోత్రము. పద్మపత్రములవలె విశాలమయిన నేత్రములు, తామ్రవర్ణము అయిదు మూరల పొడుగు ఇట్టి యజర్వేదమునకు ఎనుబదియారు అవాంతర శాఖలు గలవు. చరకములు, ఆహ్వరకములు, కఠములు, వాజసనేయములు,       మాద్ధ్యందినములు మొదలగునవి కలవు. యజుర్వేదము యజ్ఞములచేయు విధానమును విశేషించి వర్ణించును. ఇట్టివేదమునకు ఆపప్తంబ, భోధాయన, సత్యాషాఢ మొదలగు అవాంతర శాఖలు గలవు. మందబుద్ధి గలవారు పఠించుట కనుకూలమగునట్లు విస్తీర్ణమగు వేదమును వ్యాసుడు విభజించి శిష్యులకు బోధించెను.  యజుర్వేదమునందు మంత్రమని, బ్రాహ్మణమని, సంహిత అని, ఆరణ్యకమని విభాగములు కలవు.  ఇట్టి విస్తీర్ణమగు యజుర్వేదమును వైశంపాయనున కుపదేశించి, మూడవ శిష్యుడయిన జైమినిని పిలిచి అతనికి సామవేదమునుపదేశించెను. 

            సామవేదమునకు గాంధర్వవేదము ఉపవేదము.  విష్ణుమూర్తి దేవుడు.  కాశ్యప గోత్రము.  శుభ్రమైన వస్త్రమును ధరించి శాంతిగలవాడై దండమును చేతబూని తెల్లని రూపముతో ఆరుమూరల పొడుగున సామవేద దేవత ప్రకాశించుచుండును.  సామవేదమునకు వేయి శాఖలు గలవు.  నారాయణుడు తప్ప సామవేదము పూర్తిగ పఠించితిమని చెప్పగలవారెవ్వరును లేరు.  సామవేదమున ఆశురాయణీయ, వార్తాంతనీయ అని ఇట్లు ఎన్నియో భేదములు గలవు.  ఇట్టి సామవేదమును పూర్తిగ పఠించనెవ్వరు సమర్ధులు? పైవిధమున వ్యాసుడు జైమినికి సామవేదమునుపదేశించి ఇక నాలుగవవాడైన సుమంతుని పిలిచి అథర్వవేదమునుపదేశించెను.  

            అథర్వవేదమునకు అస్త్రవేదము ఉపవేదము.  ఇంద్రుడు దేవుడు.  తీక్ష్ణమైన రూపము, నల్లని వర్ణము, ఏడు మూరల పొడుగు. ఇట్టి రూపముతో అథర్వణ వేదదేవత శోభిల్లు చుండును.  అథర్వవేదమునకు  పైప్పల, దాంత మొదలగు తొమ్మిది ప్రధానమయిన భేదములు కలవు.  విధాన కల్పము, నక్షత్రకల్పము, శాంతికల్పము మొదలగు అయిదు కల్పములుగ అది విభజింప బడి ఉన్నది.  ఇట్టి అథర్వవేదమును  సుమంతుడు వ్యాసుని వలన గ్రహించెను.

            వేదములింత విస్తీర్ణములు.  పూర్వము ఈ భరత ఖండమున బ్రాహ్మణోత్తములు వర్ణాశ్రమాచార నిరతులయి వేదములు పఠించుచుండిరి. ఆ కాలమున వేదములు మంచిగ ప్రచారములో నుండెడివి.  కలియుగము రాగా బ్రాహ్మణులు వారి వారి ధర్మములు వదులుటచే వేదములు క్రమమముగ లుప్తములయినవి.  బ్రాహ్మణులు కర్మభ్రష్ఠులయి మ్లేచ్ఛుల ముందర వేదముల నిశ్శంకముగ పఠించుటచే ఆ మంత్రముల సత్తయు లోపించినది.  పూర్వము బ్రాహ్మణులందు వేదములు ప్రతిష్ఠింపబడి ఉండెను.  కావుననే వారు భూసురులని పేరునొందిరి.  పూర్వము చక్రవర్తులు బ్రాహ్మణులను పూజించుచుండిరి.  చక్రవర్తులు తమ సర్వస్వమును బ్రాహ్మణులకునీయ సమకట్టినను ఆ కాలపు బ్రాహ్మణులు నిస్పుృహులగుటచే రాజద్రవ్యమును గ్రహించక భిక్షాటనముచేతనే ఉదరపోషణమొనర్చుకొనుచుండెడివారు.  అట్టి బ్రాహ్మణుల చూచి ఇంద్రాది దేవతలుకూడ భయపడుచుండిరి.  త్రిమూర్తులు వారికి ఆధీనులయి ఉండిరి.  వారు తలచిన తృణమును పర్వతము చేయగలరు.  పర్వతమును కూడ తృణముగ చేయ సమర్ధులు.  వారియొక్క వాక్యము కామధేనువు వలె అభీష్టములనొసగ సమర్ధమయి ఉండెను.  బ్రాహ్మణులు వేదభూషితులగుట వలన విష్ణువంతవాడు బ్రాహ్మణోమమదైవతమ్‌ అని చెప్పెను.  అట్టి ప్రఖ్యాతిగాంచిన బ్రాహ్మణకులము నేడు వేదమార్గముల త్యజించి కుమార్గముల నాశ్రయించుచున్నది.  బ్రాహ్మణులు హీనజాతి సేవ చేయ సమకట్టు చున్నారు.  వేదముల జీవనార్ధము విక్రయించుచున్నారు.  హీనుల ఎదుట పవిత్రమగు వేదముల పఠించుచున్నారు.  అట్టివారి ముఖమును చూచినను పాపమే వచ్చును.  వారు బ్రహ్మరాక్షసులయ్యెదరు.  మీరు బుద్ధిహీనులయి వేదములన్నింటిని పఠించితిమని గర్వించి బ్రాహ్మణుల క్షోభపెట్టుచున్నారు.  మీకిట్టి దుర్బుద్ధి గఱపినదెవ్వరో తెలియదు.  మీరు ఆత్మ స్తుతి చేసుకొనుచున్నారు.  మా శిష్యుడగు త్రివిక్రమ యతిని జయపత్రమిమ్మని బాధించితిరి. మీరు దురాగ్రహము విడిచి ఇచట నుండి పొండు.  లేనిచో మీ ప్రాణములకే ముప్పు వాటిల్లగలదు.  అని హితబోధచేసినను ఆ తామస బ్రాహ్మణులు స్వామివారి హితబోధను పెడచెవి పెట్టి వారితో మీవలన జయపత్రమును తీసికొనక మేము పోయినచో మారాజు ఎదుట మాకు గౌరవముండునా? జయపత్రమిచ్చిననే పోయెదమని మదోన్మత్తులయి పలికిరి. పైకధా వృత్తాంతమును తరువాత అధ్యాయములో శ్రోతలు వినగలరు. 

ఇది గురుచరిత్రయందలి ఇదువది ఆరవ అధ్యాయము సమాప్తము.

శ్రీ గురు చరితము

ఇరువది ఏడవ అధ్యాయము

ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః  ఓం శ్రీగణాధిపతయేనమః  ఓం శ్రీగురుభ్యో నమః

 

            సిద్ధముని నామధారకునితో ఇట్లు చెప్పుచుండిరి.  ఆ బ్రాహ్మణులు మూర్ఖులయి మాతో వాదించుడు, లేదా జయపత్రమునిండు అని ఎప్పుడు పట్టుదలతో పలికిరో స్వామివారు మీ మనోరధమే నెరవేరు గాక యనిరి.

            నామధారకా ఎలుక తన మరణము కొరకు సర్పము నుంచిన బుట్టను కొరికి అందు ప్రవేశించినటుల, మిడుత ఆహారమని భావించి దీపజ్వాలమీద పడిన రీతిని ఈ తామస బ్రాహ్మణులు గురుమూర్తి ప్రభావము గ్రహింపజాలక మదోన్మత్తులయి తమ మరణమును తాము కొని తెచ్చుకొనుటకుద్యుక్తులైరి. అదే సమయమునకు ఆవీధి నుండి ఒక చండాలుడు పోవుచుండెను. గురుమూర్తి తన శిష్యుని పంపి అతనిని సమక్షమునకు రప్పించెను గురుమూర్తి అతనితో నీవెవ్వడవు. ఏజాతివాడవు? అని ప్రశ్నించిరి. వాడు దూరముగ నిలువబడి గ్రామబాహ్యమున నున్న మాలపల్లెనా నివాసము. నాపేరు మాతంగుడు. కడజాతివాడను అని సమాధానము చెప్పి దూరమున నుండి దండ ప్రణామమాచరించెను.

            గురుమూర్తి కృపాదృష్టితో నతని నొకసారి చూచి శిష్యుని చేతికి దండమునిచ్చి వాడున్న స్థలమునుండి వరుసగా ఏడు గీతలు గీయుమని చెప్పెను. శిష్యుడట్లొనర్చ స్వామివారు ఆచండాలుని మొదటి గీతమీదకు రమ్మనిరి. వాడట్లొనర్చ స్వామివారు వానిని నీవెవ్వడవని యడిగిరి. వాడు, నేను మైందుడనని చెప్పెను. రెండవ గీతమీదకు రప్పించ కిరాతుడననెను, మూడవగీతమీదకు రాగా నదీతీరముననుండు గంగాపుత్రుడను పేరుగల కాపుననెను, నాలుగవ గీత మీదకు రప్పించ తాను శూద్రుడననెను. అయిదవగీతమీదకు రాగా అతనికి జ్ఞానోదయమయి నేను సోమదత్తుడనను వైశ్యుడనని చెప్పెను. ఆరవ గీతమీదకు రప్పించి అడుగ వాడు తాను గోదావరి యను పేరుగల క్షత్రియుడనని చెప్సెను.  ఏడవ గీతమీదకు రప్పించి నీవెవ్వడవని యడిగిరి. వాడు తాను బ్రాహ్మణుడననియు వేదశాస్త్రములు పఠించిన పండితుడననియు చెప్పెను.  

            అప్పుడు గురుమూర్తి కొంచము భస్మము చేత తీసుకొని అభిమంత్రించి అతనిమీద చల్లి అతనితో వేదశాస్త్రములు పఠించితినని చెప్పుచున్నావు. వాదమునిమిత్తము వచ్చిన ఈబ్రాహ్మణులతో వాదించి వారిని పరాభవించుమని చెప్పిరి. గురుమూర్తి కృపాదృష్టిచే కాకి హంస అయిన విధమున కడజాతివాడును మహాపండితుడయ్యెను వేదముల నిరర్గళముగా పఠింపసాగెను.  ఇట్టి అద్భుతము ఆబ్రాహ్మణులు చూచిరి.  వారికి భయము కలిగెను. నోరాడకపోయెను. హృదయము కంపించెను. వెంటనే వారు గురుమూర్తి పాదములమీద పడి స్వామీ మేము గురుద్రోహులము, మహాపాప మొనర్చితిమి. మీరు సాక్షత్తు ఈశ్వరావతారము.  తామసులమగు మాకు మీ మహిమ గ్రహించు సామర్థ్య మెక్కడిది. మీరు త్రిమూర్తిస్వరూపులు. సృష్టిస్థితిసంహారములు చేయ సమర్ధులు. మా అపరాధము క్షమించి మమ్ముల కాపాడి రక్షింపుడు ప్రార్థించిరి. అప్పుడు స్వామి వారు మీరు ఎందరో బ్రాహ్మణుల  పరాభవించితిరి గాన ఎవ్వరి ఆర్జితము వారు  అనుభవించవలసినదే. మీరు పండ్రెండు సంవత్సరములు బ్రహ్మరాక్షసులై యుందురు. మీకు ఇప్పటికి పశ్చాత్తాపము కలిగెను గాన పండ్రెండు సంవత్సరములకు ఒక సద్బ్రాహ్మణునివలన వేదములోని నారాయణానువాకమును వినగలరు. అప్పుడు  మీకు పిశాచత్వము తొలగి సద్గతి లభించగలదు అని చెప్పి వారలను పంపివేసిరి. వారు గ్రామము దాటి బాహ్య ప్రదేశమునుకు వచ్చుట తోడనే హృదయశూలతో మరణించుట తటస్థించెను. గురువాక్యము ప్రకారము వారు పిశాచత్వము నొందుటయు పండ్రెండుసంవత్సరములకు తిరిగి వారు సద్గతి నొందుటయు తటస్థించెను.

            ఎవ్వరు చేసిన కర్మఫలము వారనుభవించవలసినదే సుమా నామధారకా!  గురుమూర్తియొక్క అనుగ్రహమువలన వేదవేత్త అయిన ఆ మాతంగుడు స్వామివారికి నమస్కరించి స్వామీ గురుదేవా! మీరు త్రికాలవేత్తలు. నేను పూర్వము వేదవేత్తనయిన బ్రాహ్మణుడనయియుండియు ఇట్టి నీచజన్మ మెందుకు ఎత్తవలసి వచ్చెను. దయయుంచి కారణము సెలవిండని ప్రశ్నించెను. అప్పుడు స్వామివారు పై అధ్యాయములో ఏకర్మచేసినవారు ఎట్టి జన్మనొందుదురురో అట్టి కర్మవిపాకమును విపులముగా చెప్పగలరు.

ఇది గురుచరితమున ఇరువదిఏడవ అధ్యాయము సమాప్తము.

 

 

శ్రీ గురు చరితము

ఇరువది ఎనిమిదవ అధ్యాయము

                                                                                         ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః  ఓం శ్రీగణేశాయనమః  ఓం శ్రీగురుభ్యో నమః

 

            సిద్థముని నామధారకునితో గురుమూర్తియొక్క సత్కధను ఈక్రింది విధమున చెప్పుచున్నారు. అది వినువారికి సర్వదోషములు నశించును. జ్ఞానముదయించును.  నరసింహసరస్వతీస్వామివారు పతితుని గూర్చి త్రివిక్రమభారతి మొదలగు శిష్యులు వినుచుండ కర్మవిపాకమును ఈక్రిందివిధమున చెప్పుచున్నారు.

            జీవుడు తాను పూర్వమార్జించిన పుణ్య పాపములను ఇట్టి ఉత్తమాధమ జన్మల నొందుచుండును. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు దురాచారరతులయ్యిరేని వచ్చు జన్మలో వారు చండాల జాతియందు జన్మింతురు. బ్రాహ్మణ స్త్రీయందు శూద్రుని వీర్యముతో జన్మించువారు చండాలుడు. ఇది మాలజాతి. కర్మను బట్టి చండాలత్వము వచ్చు పాపముల చెప్పుచున్నాను.

            బ్రాహ్మణుడు అనాచారుడయి యుండినచో నతడు వచ్చు జన్మలో చండాలుడై  పుట్టును. తల్లిదండ్రులను, గురువును, చేసికొనిన భార్యను, కులదేవతలను త్యజించువారు చండాలురగుదురు. అబద్ధము నాడువారు, జీవహింస చేయువారు, కన్యావిక్రయమొనర్చువారు, శూద్రునిఇంట భుజించువారు, అసత్య ప్రమాణము చేయువారు,  దాసీలతో రతి యొనర్చువారు చండాలురయ్యెదరు. అరణ్యమును దహించువారు, తల్లితండ్రులను వేరుచేసి ప్రత్యేకముగ జీవించెడివారు, ఎద్దునెక్కి తిరుగువారు. తీర్థయాత్రలకు వెళ్ళి అచ్చట శ్రాద్ధమొనర్చనివారు, తీర్థక్ష్షేత్రముల ప్రతిగ్రహ మొనర్చువారు, ఈశ్వరునకభిషేకమొనర్పక కపిలగోవుపాలు త్రాగువారు, చండాలురయ్యెదరు. ఒక భార్యను వివాహమాడి అంతకు పూర్వమున్న భార్యను విడనాడిన వారు, ఒక అతిథి ఇంటికిరాగా ఏమి చదివితిని వేదములు వచ్చునా? అని పరీక్ష చేసి ఎంతో కష్టముతో అన్నమిడుదురో అట్టివారు చండాలురయ్యొదరు. తల్లిదండ్రులకు వృద్ధాప్యమున సేవయొనర్చనివాడు చండాలుడగుటయేగాక ఏడు జన్మలయందు కిృమి అయి జన్మించును. యోగ్యుని త్యజించి, అయోగ్యుని పూజించువాడును, ఇతరుల యొక్క వృత్తికి భంగమొనర్చువాడును, వాపీకూపతటాక ధ్వంసమొనర్చువాడును, శివపూజకు విఘ్నమొనర్చువారును, ఇద్దరు భార్యలుండి వారియందు పక్షపాతముగ వర్తించువాడును, సంధ్యాకాలమున భుజించువాడును, అనినమాటను నిలబెట్టుకొనజాలనివాడును, సంధ్యాకాలమున నిద్రించువాడును చండాలుడై జన్మించును. శూద్రులకు వేదముల చెప్పువాడును పర్వకాలములయందు స్త్రీ సాంగత్య మొనర్చువాడును, శ్రాద్ధముల మానువాడును, తన పుణ్యముల తాను చెప్పుకొనువాడును, నడచు మార్గమున మలవిసర్జనము చేయువాడును,  చలివేంద్రములను భంగముచేయువాడును, నాడీ జ్ఞానము లేక వైద్యము చేయువాడును,  వేదమార్గమును విడనాడి జారణ మారణాది లోకోపద్రలకర్మల నాచరించువాడును, చండాలురగుదురు. గురువును మనుష్యుడని తలచువారును, ఇతర దేవతల పూజించుచు హరి హరుల నిందించువారును, కుక్క తిత్తియందలి గంగోదకమెట్లో అట్లుగ శూద్రునివలన మంత్రమును గ్రహించువారును, విధవాస్త్రీతో రతిచేయువారును, తన గురువును ఎవరైన నిందించుచుండ హర్షముగావినువారును, బ్రాహ్మణుల ద్వేషించువారును, వేదములను చర్చించువారును, బ్రహ్మరాక్షసులయ్యెదరు. తన దేవుని తాను భజించుచున్నను ఇతర దేవతల తూలనాడువాడు దరిద్రుడగుటయేకాక అపస్మార రోగ పీడుతుడగును.  బ్రాహ్మణుల నవమానించి వేదముల దూషించువాడు మూత్రకృచ్ఛ రోగముచే పీడింపబడును. ఇతరలయొక్క దుష్కృతములను, మర్మములను బయటపెట్టువాడు జన్మాంతరముల హృదయరోగములతో మహాకష్టముననుభవించును. స్త్రీలకు గర్భపాతమొనర్చువారు మృతవంధ్యులై జన్మింతురు.  అట్టివారికి సంతానము నిలువదు. కాన గర్భపాతమొనర్చుట తగదు. ఎవరు ధర్మమును చెప్పిన వినరో ఎక్కువ భుజించువారిని చూచి హేళనచేయుదురో వారు చెవిటివారుగను. గ్రుడ్డివారుగను పుట్టెదరు.  పతితునితో మైత్రి చేయువారు గార్ధభమయి జన్మించుదురు. హీనజాతివలన ఓషధమును స్వీకరించువారు మృగమగును. బ్రహ్మహత్య చేయువారు క్షయరోగులుగను, కల్లుత్రాగువారు పిప్పిపళ్లుగలవారుగను,  సువర్ణమును హరించువారు పిప్పిగోళ్లుగలవారు గాను, గురుభార్యతో రతిచేయువారు కుష్టురోగులుగను జన్మింతురు. గుఱ్ఱమును గోవును హత్యచేయువారు సంతాన హీనులగుదురు.   పశ్చాత్తాపమువలన పాపము తగ్గును. పాపము చేసినవాడు ముందుగ నరకము ననుభవించి అనంతరము రోగియై భూలోకమున జన్మించును. విశ్వాసఘాతము చేయువాడు వమన రోగముచే పీడింపబడును. ఒక సేవకుని వాని యజమానినుండి తప్పించి తన వద్ద పనికి నియమించు కొనునో అట్టివాడు బంధకారాగార శిక్ష అనుభవించును.   ఘోరమగు నరకమును గూడ ననుభవించును.   పరస్త్రీని అపహరించువాడు దారుణమయిన నరకముననుభవించి మతిహీనుడయి పుట్టి అనేక కష్టములనొందును. సర్పమును చంపువాడు సర్పమై పుట్టును.  సువర్ణము నపహరించువాడు ప్రమేహ వ్యాధిగలవాడగును. పుస్తకము నపహరించువాడు జన్మాంధుడగును. వస్త్రమునపహరించువాడు బొల్లిరోగముగల వాడగును. గణద్రవ్యము నపహరించువాడు గండమాలరోగముతో పీడించబడును. రోగముచే పీడితుడై మరణోన్ముఖుడైన వాని ద్రవ్యమపహరించువాడు చిరకాలము కారాగార శిక్ష ననుభవించునని బ్రహ్మాండపురాణమున చెప్పబడెను. పరులద్వేషించువాడు, పరులు తనవద్ద దాచిన ధనము లేదని ఎగవేయువాడు జన్మాంతరమున అపుత్రుడగును. అన్నమును హరించువాడు గుల్మరోగముచే పీడింపబడును. ధాన్యము నపహరించివాడు రక్తగాత్రుడగును. తైలము నపహరించువాడు దుర్గంధముగల శరీరము గలవాడగును. బ్రాహ్మణ ద్రవ్యము నపహరించివాడు బ్రహ్మరాక్షసి యగును. రత్నములు, మణిక్యములు, మౌక్తికములు మొదలగువాటిని తస్కరించువాడు హీనజాతుడుగ జన్మించును. పత్రశాక, ఫలములనపహరించువాడు తామర రోగి యగును. రక్తపానము చేయువాడు జోరీగయగును. కంచు, దూది, లోహము వీటిని అపహరించినవాడు నరకము ననుభవించి శ్వేతకుష్టుగలవాడై జన్మించును. దేవద్రవ్యము నపహరించువాడు, దేవకార్యములకు విఘాతమొనర్చువాడు, అభక్ష్యభక్షణము చేయువాడు పాండురోగముగలవాడై జన్మించును. ధనము నపహరించినవాడు ఒంటెయై జన్మించును. ఫలముల నపహరించిన కోతియగును. నీటిని దొగిలించిన చాతకపక్షియగును. గృహోపకరణముల నపహరించువాడు కాకియై జన్మించును.  తేనె నపహరించువాడు తేనేటీగయగును. గోరసముల నపహరించు వాడు కుష్టురోగయై జన్మించును. ఇక వ్యభిచారవిషయము చెప్పెద వినుము.

             పర స్త్రీని ఆలింగనమొనర్చినవాడు నూరుజన్మములు కుక్క అయిజన్మించి తరువాత సర్పమగును. పర స్త్రీ యోనిని వీక్షించువారు అంధుడును, మూఢుడును అయి పుట్టును. బంధుస్త్రీతో రతి చేయువాడు గార్దభమగును. ఎవరు దుర్బుద్ధితో పర స్త్రీల ముఖమును చూతురో వారు నేత్ర రోగము కలవారై పుట్టుదురు.

            ఇట్లు గురుమూర్తి  కర్మవిపాకమును చెప్ప త్రివిక్రమభరతీ స్వామివారు గురుమూర్తితో స్వామీ! మీరు ధర్మములను విస్తరించి ప్రతిపాదించితిరి. ఎవరయిన ఇట్టి పాపములు చేసిన అందులకేమయిన  ప్రాయశ్చిత్తము గలదా సెలవిండని ప్రార్ధించ గురుమూర్తి ఇట్లు చెప్పుచున్నారు.

            ఎవరికి పశ్చాత్తాపము కలుగునో వారి పాపములు నశించును.  చేసిన పాపములు సంస్కారరూపమున  వారి వారి అంతఃకరణములయం దణగి యుండును.  ఘోర మహా పాపము లొనర్చినవారు కర్మవిపాకమునందు చెప్పబడినటుల యథావిధి ప్రాయశ్చిత్త మొనర్చుకొనవలయును.  బ్రాహ్మణుల సభలో తన పాపమును చెప్పి వారు విధించినటు తన శక్తి కొలది గోదానమో కృచ్ఛ్ర చాంద్రాయణాది ప్రాయశ్చిత్తములో ఆచరించవలయును. శక్తిలేని వారు ప్రతినిధిగ ద్రవ్యదానమొనర్చవలెను.  అజ్ఞానకృత పాపములు పశ్చాత్తాపము చేతను, గురు సేవ చేతను నశించును.  సువర్ణదానముచేతను, తీర్ధయాత్రలు చేయుటచేతను పాపములు నశించును.  పదివేల గాయత్రీ జపము చేసినచో సామాన్య పాపములు నశించును.  గాయత్రీహోమము చేతను, వేదపారాయణ చేతను గూడ కృచ్ఛ్ర ప్రాయశ్చిత్తము చేసిన ఫలము లభించును. మూడురోజులు ఉపవాసము, మూడురోజులు పాలు, మూడు దినములు నెయ్యి త్రాగి యుండుట ఇట్టి వ్రతము కృచ్ఛ్రమనబడును. శక్తి లేనివారు నువ్వులు భక్షించవచ్చును. శక్తిగలవారు మారేడు, రావి, కమలములు, దర్భ, గరిక వీటితో భావితమయిన ఉదకమును మాత్రమేత్రాగి ఉపవసించవలయును. ఇది పర్ణకృచ్ఛ్రమనబడును. పాపశాంతి కొరకు చాంద్రాయణవ్రత మాచరించవలయును. అది యెట్లనిన అమావాస్య ఉపవాసముండి తిథిక్రమమున దినదినమునకు కుక్కుటాండ ప్రమాణమగు గ్రాసమును ఏకోత్తరవృద్ధిగ భక్షించుచుండవలయును. ఇట్లు పూర్తిచేసి కృష్ణపక్షమున చంద్రకళ రోజురోజుకు క్షీణించినటుల గ్రాసమును దినదినమునకు తగ్గించుచు అమావాస్యనాడు ఉపవసించవలయును. ఇది చాంద్రాయణ మనబడును. ఈవ్రతముచే సమస్త పాపములు నశించును. కాశీ క్షేత్రమున నెలరోజులు నివసించుటచే సర్వపాపములు నశించును. సేతుబంధమున సముద్రస్నానముచే భ్రూణహత్యాది మహాపాతకములు నశించును.  మితాహారుడయి పురుషసూక్తమును ఆరునెలలు  పఠించుచో నెట్టిపాపములయిన పోగలవు. అఘమర్షుణ సూక్తము, నారాయణోపనిషత్పఠనము, విష్ణుసూక్త జపము ఏడు జన్మముల పాపములను గూడ పోగొట్టును, ప్రాయశ్చిత్తము చేసికొనువాడు పూర్వదినమున, ఉపవాసముండి పంచగవ్య ప్రాశన మొనరింపవలమును, గోమూత్రము, గోమయము, గోక్షీరము, గోఘృతము, గోదధి వీటిని ఒక పాత్రలో కలిపి అందు కుశోదకమును గూడ చేర్చి వైదిక మంత్రములచే నభిమంత్రించి ఆచార్యునిద్వారా మంత్రపూర్వకముగా పుచ్చుకొనవలయును.  అందుచే పాపములుపశమించును. గురువను గ్రహముచేతను స్వధర్మనిరతుడయి వేదవేత్తయగు బ్రాహ్మణుని అను గ్రహముచేతను పాపులు పునీతులు కాగలరు. అని గురుమూర్తి త్రివిక్రమభారతితో చెప్పి ఆపతితుని చూచి ఓరీ!నీవు పూర్వము తల్లితండ్రుల ద్వేషించిన పాపమున చండాలుడవయితివి. నీవు నెలరోజులు ఇచ్చటి సంగమక్షేత్రమున స్నానమొనర్చితివేని నీపూర్వదోషము నశించును. రాబోవు జన్మమున బ్రాహ్మణుడవయి పుట్టగలవనిరి. అప్పుడు వాడు స్వామివారితో మీదర్శనమువలననె నా పాపములన్నియు నశించెను. శరణాగత రక్షకులగు మీ దృష్టిపడినమాత్రముననే నేను పవిత్రుడనయితిని. పరశువేది స్పర్శచే బంగారమయిన యినుము తిరిగి ఇనుమగునా? మీరు సర్వము తెలిసిన మహాత్ములు. నన్ను దయతో నభిమంత్రించి బ్రాహ్మణులలో కలుపుడు అని ప్రార్థించ స్వామివారు నవ్వి, జాతిహీనుగవయిన నిన్ను బ్రాహ్మణునిగ నెవ్వరంగీకరీంతురు? హీనజాతి  రేతస్సువలన జన్మించి. ఆ జాతిలో పుట్టి పెరిగిన నీకు బ్రహ్మత్వము లభించవేరదు. పూర్వము గాధిపుత్రుడగు క్షత్రియుడయిన విశ్వామిత్రుడు తనకు బ్రహ్మత్వము రాగందులకుగాను తప మొనర్చినాకు బ్రహ్మర్షిత్వమిండని దేవతలప్రార్థించ వారు నీగురువగు వశిష్ఠుని ప్రార్థించుము. అతడంగీకరించిన మాకును అంగీకారమే అనిరి. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుని సమీపించి నేను బహుకాలము తపమాచరించిరి నన్ను బ్రహ్మర్షిగ చేయుడని యాచించెను. అప్పుడు వశిష్టుడు ఓవిశ్వావిత్రుడా! అపవిత్రమయిన ఈక్షత్రియశరీరమును త్యజించి బ్రాహ్మణ కులమున పుట్టి ఉపనయన సంస్కార మొందినచో నీకు బ్రాహ్మత్వము వచ్చుననిరి. అంతదనుక నిన్ను బ్రాహ్మణుడవని అనజాలనన, వారి వాక్యములు విని కోపించి విశ్వామిత్రుడు వశిష్టుని నూర్గురు పుత్రుల సంహరించెను. అయినను బ్రహ్మజ్ఞానియగు వశిష్ఠుడు తామసమును పొందిలేదు. ఒకనాడు విశ్వామిత్రాడు గొప్ప శిలను చేపూని దానితో వశిష్ఠుని చంపచూచెను.   అంతలో దైవవశమున నిట్టి విచార ముదయించెను. నేనితనినిసంహరించుటచే బ్రహ్మత్యవచ్చునునేగాని బ్రహ్మర్షిత్వము రానేరదు. ఈ వశిష్టుడు నన్ను బ్రహ్మర్షియని యంగీకరించిననే దేవతలు నన్ను అట్లనుటకు సమ్మతించెదరు. కాన ఇట్టి మహాతుని చంపుట తగదు అని భావించి పశ్చాత్తాపము నొంది వశిష్ఠుని పాదముల శరణునొందెను. వశిష్ఠుడతని మనః పరివర్తనము గుర్తించి రాజర్షియని మాత్రము సంబోధించెను. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠునితో స్వామీ! నాకు బ్రహ్మర్షిత్వము ననుగ్రహింపుడని ప్రార్థించెను. వశిష్ఠులవారప్పుడు అతనితో సూర్యకిరణములచే నీ ప్రస్తుత దేహమును భస్మమొనరించి తపోబలముచే నూతన శరీరమును సృష్టింపుము. అప్పుడు నిన్ను బ్రహ్మర్షియని పిలిచెదనని చెప్ప విశ్వామిత్రుడటులచేసి అది మొదలుగ బ్రహ్మర్షియని ప్రసిద్ధినొందెను. అంతంత వారే బ్రహ్మత్వమును అంత కష్టముచే పొందియుండ నీవు నన్ను బ్రాహ్మణులలో కలుపమనుచున్నావు. అది సాధ్యమా! నేను చెప్పినటుల చేసితివేని రాబోవుజన్మలో బ్రాహ్మణుడ వగుదువు అనిరి. కాని దరిద్రునకు నిధి దొరికిన వదలజాలని విధమునను, చక్కని పచ్చిక బయలులో మేయుచున్న గోవు అందుండి వెడలుట కిచ్చయించనటులను గుర్వనుగ్రహమున తాత్కాలికముగ జ్ఞానప్రాప్తినొందిన ఆపతితుడు స్వగృహమునకు పోవ నిష్టపడకపోయెను.

            ఇంతలో నతని భార్యయు పిల్లలు అతనిని వెదకు కొనుచు వచ్చి అతనిని సమీపించి ఇక్కడకు వచ్చితివేమి? నీకు మతిపోయెనా? పోవుదము రమ్మన వాడు నన్ను సమీపించకుడు దూరముగ పొండని తరిమి వేయుచుండెను. అప్పుడతని భార్య స్వామి వారిని చూచి స్వామి! నాభర్తకు మతిపోయినట్లున్నది. ఇంతమంది పిల్లల నెవరు పోషించగలరు? తగిన పమాధానము చెప్పి మావెంట పంపుడు లేనిచో నేను మీయెదుట ప్రాణములర్పించెదననెను.  అప్పుడు గురుమూర్తి నవ్వి ఆ పతితునితో  ఓరీ! నీవింటికి పొమ్ము. దారాపుత్రుల క్షోభపెట్టిన నీకేమి సద్గతిరాగలదు. సంసారమున జన్మించినవారు వారివారి ధర్మముల నాచరించుచు ఇంద్రియముల సంతోషపరచవలయును. అట్లయిననే వారు సంసారసమద్రమును దాటగలరు. సూర్యచంద్రులు సాక్షిగ ఒక స్త్రీని కామించి వివాహమాడి త్యజించుట మహాపాతకము. అట్టివారికి సద్గతి ఎన్నిటికిని కలుగజాలదు అని గురుమూర్తి చెప్ప వాడును స్వామీ! మీయనుగ్రహమువలన జ్ఞానినయి తిరిగి ఎటులహీనత్వము పొందగలనవి దీనముగ వేడెను. అప్పుడు స్వామివారు తనలో నేను మంత్రించి చల్లిన భస్మమాహాత్మ్యముచే ఇతనికి ఇంతటి వివేకము కలిగెను. ఇట్టి భస్మమును కడిగించితినేని ఇతనికి తాత్కాలికజ్ఞానము నశించగలదు. అని భావించి తన శిష్యునితో ఆగ్రామమున లుబ్ధుడయిన జ్ఞానశూన్యుడయిన బ్రాహ్మణునెవనినయిన వెతికి తీసికొనిరమ్మని చెప్పిరి. వాడు అట్లే వాణిజ్యముచే జీవించెడి ఒక లుబ్ధ బ్రాహ్మణుని పట్టుకొనివచ్చిరి. గురువతనితో నీవు కుండలతో నీరు తెచ్చి ఇతనిని స్నానము చేయించుమనిరి. ఆబ్రాహ్మణు డట్లొనర్చ స్వామివారు చల్లిన మంత్రభస్మము క్షాళితమయ్యెను. వాడి జ్ఞానములోపించెను. అప్పుడు వాడు భార్యపుత్రుల యందు మమకారముకలవాడయి పుత్రుల నెత్తుకొని ఇదేమిటి ఇంత భ్రమ యేల కలిగెను. అని తాను చేసినదానికి వగచుచు భార్యపుత్రులతో కలసి సుఖముగ నింటికిపోయెను.

            అచ్చట నున్నవారందరు ఆచిత్రము చూచి కడు విస్మితులయిరి. అప్పుడు త్రివిక్రమ భారతీస్వామి గురుమూర్తి చరణములకు నమస్కరించి జాతిహీనున కింత జ్ఞానమెట్లు కలిగెను? స్నానము చేయించినంత మాత్రమున జ్ఞానహీను డెట్లయ్యెను? ఈసంశయమును తీర్చుడని వేడుకొన గురుమూర్తి నేను భస్మమును మంత్రించి అతని మీద చల్లితిని. అందువలన అతనికి జ్ఞానోదయమయ్యెను. భస్మము క్షాళితముకాగా ఆ జ్ఞానము నశించెను. భస్మము అంతమహిమకలది. కావుననే శివుడద్దానిని నిత్యము ప్రేమతో ధరించుచున్నాడు. అట్టి భస్మమునకు మహాత్ముని కరస్పర్శచే నత్యధిక ప్రభావము కలుగును. అని చెప్ప త్రివిక్రమ భారతి స్వామివారిని గూర్చి భస్మముయొక్క మాహాత్మ్యమును సాంతముగా నుపదేశింపుడని ప్రార్థించెను.

            స్వామివారు పై అధ్యాయమున భస్మము యొక్క మాహాత్మ్యమును తెలుపుదురు.

ఇది గురుచరితమున ఇరువది ఎనిమిదవ యధ్యాయము సమాప్తము.

 

 

శ్రీ గురు చరితము

ఇరువదితొమ్మిదవ అధ్యాయము

ఓం శ్రీ గురుదేవ దత్త,  ఓం శ్రీగణాధిపతియే నమః

 

            గురుమూర్తి త్రివిక్రమభారతితో భస్మమాహాత్మ్యమును ఈ క్రింది విధముగ చెప్పుచున్నారు.  త్రివిక్రమా! సావధానుడవయి వినుము. పూర్వము కృతయుగమున వామదేవుడను ఒక మహర్షిగలడు. అతడు గృహదారవర్జితుడు, నిస్పృహుడు, బ్రహ్మవేత్తయు, జడలు ధరించి భస్మభూషిత సర్వాంగుడయి వ్యాఘ్రచర్మధరుడయి భూమియందలి నానాక్షేత్రముల సంచరిచుచు దైవవశమున క్రౌంచారణ్యమార్గమున పోవుచుండ అతని నొక మహాభయంకరమైన రాక్షసి చూచెను. చూచుటతోడనే హింసాస్వభావముగల ఆ రక్కసి ఆకలితో అతనిని భక్షింపనోరు తెరచుకొని పండ్లు పటపట కొఱకుచు సమీపించెను. వామదేవుడు గొప్పజ్ఞానియగుటచే ఉగ్రరూపమున ఆ బ్రహ్మరక్కసి వచ్చుచున్నను కొంచెమయినను భయపడక నిలుచుండెను. బ్రహరక్కసివచ్చి వామదేవుని పట్టుకొనెను. అప్పుడు వామదేవుని శరీరమందున్న కొంత భస్మము ఆ రక్కసి కంటుటచే దానికి పూర్వస్మృతి కలిగెను. దాని పాపమునశించెను.   సత్పురుషుల దర్శనమగుచో నెట్టివాడును తత్కాలమున పునీతుడు కాగలడు. ఏదిఅయిన ప్రయత్నముచే సాధించనగును. కాని సత్పురుషుల దర్శనభాగ్యము లభించుట కడు దుర్లభము. ఆఘోరమగు రాక్షసికి అట్టి మహాత్ముని స్పర్శమాత్రముచే, ఏనుగుల, గుఱ్ఱముల,  మానవులగూడ భక్షించినను తరగని ఆకలి తత్కాలమున నశించెను. సముద్రమంత త్రావినను తీరని దప్పికయు తీరిపోయెను. అందుతోపాటు దాని రోషముగూడ అర్థక్షణమున నశించెను. అప్పుడు బ్రహ్మరాక్షసి ముని పాదములమందు పడి స్వామీ ఘోరసంసారమున పడియున్న నన్నుద్ధరింపుడు, మీదర్శనభాగ్యముచే నాపాపరాసులన్నియు నశించెను. హేజగద్గురో!  నేను నేడు పావితుడనైతిని అనెను. అప్పుడు వామదేవులవారు ఆరక్కసితో నీవ్వెడవు?  మనుష్యసంచారములేని ఈఘోరారణ్యమున ఎందులకు సంచరించుచుంటివి అని అడిగెను. మునివాక్యములు విని ఆ బ్రహ్మరాక్షసి తన వృత్తాంతము నిట్లుచెప్పుచుండెను. స్వామీ మీకృపచే నిప్పుడు ఇంతకు పూర్వము నేననుభవించిన ఇరువది అయిదు జన్మలు స్ఫురణకు వచ్చెను. ఇప్పటికి ఇరువది అయిదు  జన్మల క్రింద నేను దుర్జయుడననుపేరుతో యవనదేశమునకు రాజునయి ఉంటిని. దురాచారుడనయి ప్రజల పీడించితిని. అనేక మందిని హింసించితిని. మదోన్మత్తుడనయి ఏందరో స్త్రీల వరించితిని. బలాత్కారముగ గూడ ఎందరో స్త్రీలను నపహరించి భోగించితిని. రాజుల జయించి వారి భార్యలతో వ్యభిచరించితిని. రూపవంతులయిన స్త్రీలను ద్రవ్యముతో వశపరచుకొంటిని. ఒకరోజు భోగించిన స్త్రీని తిరిగి చూడక కారాగారమున నుంచెడివాడను. అవివాహితకాదు, సువాసినులేకాదు, రజస్వలేకాదు, విధవలేకాదు ఇట్లు విధినియమములేక ఏంతమందియో స్త్రీలను చెరిచితిని. నా భయమునకు ఆదేశమందలి బ్రాహ్మణులు భయపడి దేశాంతరముల పాలయిరి. ఎంతోమంది బ్రాహ్మణస్త్రీలను క్షత్రియస్త్రీలను, శూద్రస్త్రీలను, రజకస్త్రీలను, చండాలవనితలగూడ  పాడుచేసితిని. ఇక వారవనితల సంగతి చెప్పజాలను. మద్యము త్రాగి మాంసము తినుచు ఉన్మత్తుడనయి ఇటుల లెక్కలేని పాపముల సంపాదించిన నాకు క్షయరోగము వచ్చెను, శత్రురాజులు నామీదకు దండెత్తివచ్చి నన్ను సంహరించి నా రాజ్య మపహరించిరి. యమదూతలు నన్ను యమలోకమునకుకొనిపోయిరి.  పదివేల సంవత్సరములు పితరులతోకూడ దారుణ నరకయాతనల ననుభవించి తరువాత దేవతామానముతో వేలకొలది శిశ్నములుగల ఘోరమగు ప్రేతమయి దుర్గతిననుభవించితిని. అటుపైన భూలోకమున వ్యాఘ్రమయితిని. తరువాత అజగరమయితిని. అయిదవ జన్మమున నక్కనయితిని, ఆరవజన్మమున ఊరపంది నయితిని, ఏడవ జన్మమున కుక్కనయితిని, ఎనిమిదవ జన్మలో నక్కనయితిని, తొమ్మిదవ జన్మమున లేడిని, పదవజన్మమున కుందేలుని, పదకొండవ జన్మమున వానరమును, పన్నెండవ జన్మమున గ్రద్దను, పదమూడవజన్మమున కప్పను, పధ్నాలుగు కాకిని, పదిహేను ఎలుగుబంటిని, పదహారు అడవికోడిని, పదిహేడు గ్రుడ్డిగాడిదను, పదునెనిమిది పిల్లిని, పందొమ్మిది కప్పను, ఇరువది కాకిని, ఇరువదియొకటి చేపను, ఇరువదిరెండు ఎలుకను, ఇరువదిమూడు గుడ్లగూబను, ఇరువది నాలుగు ఏనుగును అయి పుట్టితిని. అట్టి నేను ఈ ఇరువది అయిదవ జన్మమున ఈకీకారణ్యమున ఎంతోకాలమునుండి బ్రహ్మరాక్షసినయి తిరుగుచున్నాను. రాత్రిపగలు ఆకలిదప్పులతో బాధపడుచు దుఃఖించుచున్నాను. మిమ్ములచూచి దుర్బుద్ధినయి భక్షించునుద్దేశముతో మీమీదపడితిని.  మీ స్పర్శమాత్రముననే నాకు జాతిస్మరణ కలిగెను. మీరు విశ్వతారకులు, ఘోరమగు సంసారయాతననుండి నన్నుద్ధరింపుడు. మీమాహాత్మ్యమును తెలుసుకొనుసామర్థ్యము నాకు లేదు. నన్నుద్ధరించుటకుగాను తమరిచ్చటకు వచ్చినటుల నాకు తోచుచున్నది అని ప్రార్థించెను.  అప్పుడు వామదేవుడు సంతసించి నీవు నన్ను స్పృశించినపుడు నాశరీరమందలి భస్మము నీకు అంటుట తటస్థించెను. అందుచే నీకింత జ్ఞానోదయమయ్యెను. భస్మమహిమ అపారము. కాననే ఈశ్వరుడు భస్మమును సర్వాంగములయందు ధరించును. భస్మమహిమను శంకరుడే గుర్తెరుగును. భస్మమహిమ నీకు తెలియ గలందులకు ఒక కథ చెప్పెదవినుము.

            పూర్వము ద్రవిడదేశమున కర్మభ్రష్టుడయిన ఒక నీచబ్రాహ్మణుడు కలడు వాడు శూద్రస్త్రీరతుడయి ఉండుటచే బ్రాహ్మణులు, తల్లిదండ్రులు దాయాదులు వానిని బహిష్కరించిరి.  చౌర్యముచే ధనమార్జించుచు పరకాంతలతో వ్యభిచరించుచుండెను. ఇట్లుండ ఒకనాడు ఒక శూద్రుడు ఇతనిని చంపి కొన ప్రాణముతో నున్న ఇతనిని చంపి నూరిబయట ఒక గోతిలో పడవేసెను. అదేసమయమునకు అచ్చట సమీపముననున్న ఒక భస్మరాశితో దొర్లుచున్న ఒక కుక్క ఇతను మరణించెనని తలచి భక్షించగలందులకు వచ్చి ఇతని శరీరము మీద నెక్కెను.  ఆ కుక్కశరీరమందలి భస్మము ఇతడు మరణించు సమయమునకు వక్షఃస్థలమునను లలాటమందును  భుజములయందును పడెను. యమకింకరులు పాశములతో నితనిని యమలోకమునకు కొనిపోవ వచ్చిరి. అంతలో శివదూతలు విమానముతో వచ్చి యమదూతలతో వీరు భస్మభూషితుండయి కైలాసనివాసమనకు యొగ్యుడయి యుండ నితనిని మీరెట్లు విచారణలేక యమలోకమునకు కొనిపోవవచ్చితిరి. అని కోపముతో వారల హింసించ యమదూతలు చేయునదిలేక యమలోకమునకు పోయి యమునితో నోయమధర్మరాజా! ఇక ముందు మాగతి యేమి? మీయాజ్ఞ ననుసరించి మేము ఒక పాపాత్ముని తీసికొనిరాగలందులకు భూలోకమునకు పోతిమి. శివదూతలు పరుగెత్తుకొనివచ్చి మమ్ముల కొట్టి తరిమి వేసిరి. ఇక మీద భూలోకమున కెట్లు పోగలము. అని చెప్ప యముడు సత్వరముగా శివదూతలున్న చోటికి వచ్చి మీరు మాకింకరుల కొట్టుటకు కారణమేమి?  గంగలో ఇసుకరేణువులవలె అనేక పాపములతో కూడిన ఇతడు శివపురవాసమున కెట్లర్హుడు? అని కోపముతో పలికెను. యముని వాక్యమును విని శివదూతలు ఇటుచూడుము. ఇతని లలాటమున వక్షఃస్థలమున, బాహుమూలమున, మణిబంధములయందును భస్మ ప్రకాశించుచుండ మీదూత లెట్లు ఇతని గొనిపోవవచ్చిరి. శివుడు భస్మాంకితులయిన మానవులకు శాశ్వత కైలాసమిచ్చెద. అట్టివారిని మీకు కైలాసమునకు తప్పక కొనిరండని మాకాజ్ఞనిచ్చెను. మేము దయతో మీదూతల ప్రాణములతో వదిలితిమి. ఇక మీదట మీదూతలకు భస్మదిగ్ధగాత్రుల జోలికి పోవద్దని బుద్దిచెప్పము. భస్మధరించువారికి ఎట్టిదోషములు వుండవు. అట్టివారు స్వర్గమునకే అర్హులు. అని శివదూతలు చెప్పిరి. అప్పుడు యముడు శివదూతలకు ప్రదక్షిణనమస్కారము లొనర్చితన కింకరులతో కలసి యమలోకమునకు వచ్చి వారలతో ఓదూతలారా! వినుడు. ఇకమీదట భస్మ ధరించువారి జోలికి పోకుడు. అట్టివారు యమలోకమునకు అర్హులు కారు. దూరముగ త్యజించుచు. అని ఆజ్ఞాపించెను.

            వామ దేవుడు బ్రహ్మరాక్షనితో భస్మమహిమ వింటివి గదా! నేను అదరముతో విత్యము భస్మధరింతును. ఈశ్వరునకు ప్రియమయిన భస్మమును ఎవ్వరు ధరింపరు? భస్మమాహాత్మ్యమును పూర్తిగ వర్ణించి నెవ్వరితరము? అని చెప్ప నాబ్రహ్మరాక్షసి వామదేవునితో మహాత్మా!  నన్నుద్దరించుడు. నేను ఇరువది అయిదు జన్మలక్రిందట మహాపాపినయియుండియు నీరులేనిచోట బావులు త్రవ్వించితి. బ్రాహ్మణులకు  వృత్తి కల్పించితిని. ఆ పుణ్యప్రభావముచేతనే నేటికి మీదర్శనమయ్యెను. ఆజన్మమున నేను మరణించ యమదూతలు నన్ను తీసికొనిపోయి యముని వద్ద నుంచిరి. యముడు చిత్రగుప్తుని పిలిచి నాపుణ్య పాపముల విచారించెను. అప్పుడు చిత్రగుప్తుడు నాపాపముల చెప్పి నేనాజన్మయందొనర్చిన ఆ కొలది పుణ్యమును పేర్కొనెను. అపుడు యమధర్మరాజు నాతో నీవు ఇరువది అయిదు జన్మములు పాపఫల మనుభవింతువు. ఇరువది అయిదవ జన్మమున నీ పుణ్యము ఫలించునని చెప్పెను కాననే నేడు మీపాదముల దర్శించు పుణ్యము నాకు లభించెను. స్వామీ! వామదేవా! నన్నుద్దరించుడు. భస్మయన నేమో అది యెట్లు తయారుచేయవలయునో దానినెట్లు ధరించవలయునో విస్తరముగ సెలవిండని ప్రార్థించ వామదేవుడు  బ్రహ్మరాక్షసితో నిట్లు చెప్పుచుండెను.

             పూర్వము మందరపర్వతమున శివుడు పార్వతీసమేతుడై సభ చేసెను. ప్రమథగణములు త్రింశత్కోటి దేవతలు, అష్టదిక్పాలకులు శివుని సేవించుచుండిరి. గంధర్వులు,  ఖేచరులు, పన్నగులు విద్యాధరులు, కింపురుషులు, సిద్దులు, సాధ్యులు మొదలగువారందరాసభకు వచ్చిరి.  వశిష్ఠుడు, నారదుడు, బృహస్పతి, పితృగణములు మొదలుగా గలవారును ఆ సభకు వచ్చిరి.  ఊర్వశి మొదలగు అప్సరసలు, సప్తమామాతృకలు చండిక మొదలగు శక్తులు ఈశ్వరుని సేవించుచుండిరి. మహాకాళుడు మహానీలుడు నందికేశ్వరుడు మణిభద్రుడు, వీరభద్రుడు మొదలగు వారు దండముల ధరించి శివుని సేవించుచుండిరి. భృంగిరిటుడు, భూతనాథుడు మొదలగు రుద్రగణములు శివుని పార్శ్వమున నుండిరి. కొందరు ఆయుధముల ధరించియు. కొందరు అస్త్రములు ధరించియు, నానావర్ణములు, నానారూపములతో ప్రమథగణములు శివుని సేవించు చుండెను. ఇట్టి గణములతో కూడుకొని శివుడు సింహాసనమున కూర్చుండెను. ఆసింహాసనము ఏడు ప్రభలుకలదై యుండెను. మొదటిప్రభ రత్నఖచితమయి ఎఱ్ఱని కాంతితో, రెండవది సువర్ణనిర్మితమయి పచ్చగను, మూడవ ప్రభ రత్నచిత్రతమయి నల్లని వర్ణముతో, నాల్గవది తెల్లని కమలములచే నలంకరింపబడి యుండెను. అయిదవ ప్రభ ముత్యములు వైడూర్యములచే నలంకరింపబడియుండెను. ఆరవ, ఏడవ ప్రభలుకూడ నానా విధములయిన రత్నములతో నిర్మింపబడి యుండెను. అట్టి సింహాసనమున కోటి సూర్యులతో సమానముగా ప్రకాశించు శివుడు కూర్చొనియుండెను. జడలను ధరించి కపాలమును చేతపూని, చంద్రుడు శిరోభూషణముగా గలవాడయి సర్పములనే  కుండలములుగ చెవుల ధరించి, నల్లని కంఠముతో నాగాభరణుడయి శివుడు ప్రకాశించుచుండెను. పెద్దపులి చర్మమును ధరించి కర్పూరముతో సమానమగు తెల్లని ఆకారముకలవాడయి భక్తవత్సలుడగు పశుపతి సింహసనమున కూర్చొని యుండెను. అట్టి శివునకు సర్వాంగములయందును సర్పములే భూషణముగా శోభిల్లుచుండును. పదిభుజములు కలవాడయి త్రిశూలము నొక చేతను, మృగము నొకచేతను ఖట్వాంగము నొకచేతను, పరశువు నొకచేతను బాణము నొకచేతను, అంకుశము నొకచేతను ధరించి యుండెను. శంకరునకు అయిదుముఖములు కలవు. ఒక ముఖము పాలమీది నురుగువలె కళంకములేని చంద్రునివలె భస్మభూషితమయి ప్రకాశించుచుండెను ఇది పడమటి ముఖము. రెండవ ముఖము ప్రాతఃకాల సూర్యుని వలె దానిమ్మ పుష్పమువలె ప్రకాశించును. ఇది ఉత్తరపు ముఖము. మూడవముఖము అర్ధచంద్రుడు భూషణముగా గలిగి జడల ధరించి ప్రకాశించుచుండెను. ఇది తూర్పుముఖము. నాల్గవ ముఖము కోరలతో భయంకరమయి నల్లని వర్ణము కలదయి ప్రకాశించును. ఇది దక్షిణముఖము, ఈముఖమునుండి అగ్నిజ్వాలలు వచ్చుచుండును. అయిదవ ముఖము వ్యక్తావ్యక్తముగను. సాకారనిరాకారముగను సగుణనిర్గుణముగను ఉండును. ఇది ఇతరులకు అలక్ష్యముగను భక్తులకు మాత్రమే కనపడుచుండును.  ఇట్లు అయిదు ముఖములతో ప్రకాశించు సర్వేశ్వరుడు పార్వతీ సమేతుడు సింహసనమున కూర్చొని యుండెను. పార్వతీమాత సౌందర్యము వర్ణనాతీతము. ఆభరణములు లేకనే ప్రకాశించు తల్లి నానాలంకారశోభితురాలయి యుండెను. ముక్తాహారములు రత్నఖచిత కిరీటము ధరించి, కంఠమున పుష్పహారములతో ప్రకాశించుచుండెను.  అందలి మకరందము నాస్వాదించుటకయి ఝంకారములు చేయుచు పరిసర ప్రదేశముల తుమ్మెదలు గుంపులుగుంపులుగా తిరుగుచుండెను. అట్టి జగన్మాతయొక్క నాసికయందు ముక్కెర జాజ్వల్యమానముగ ప్రకాశించుచుండెను. చక్కని అధరోష్ఠము రత్నముల వరుసవలె దంతములు కలిగిన సరమేశ్వరి దానిమ్మ పుష్పమువంటి వస్త్రము ధరించి పచ్చని రవికను తొడుగుకొని యుండెను. రత్న ఖచితమైన నూపురములు పాదములందును,  రత్నకంకణములు మణిబంధముల యందును గలిగి ఇటుల సర్వాలంకార భూషితురాలగు జగన్మాతయైన శంభునికాంత యొక్క సౌందర్యము నెవ్వరు వర్ణించ సమర్థులు. ఇట్లు  సభతీర్చియుండ సనత్కుమారులవారు లేచి శివుని సమీపించి సాష్టాంగముగ నమస్కారించి వినయముతో నిట్లు ప్రశ్నించిరి.

            శంభో! జయజయ ఉమాకాంతా! నీవు విశ్వకర్తవు. భక్తులకు ధర్మార్థకామమోక్షముల నొసంగు దాతవు. మీ వలన ఇదివరకు నమస్తధర్మముల విని యుంటిని. ఇవి అన్నియు బ్రహుప్రయాస సాధ్యములు. కాన తమరు దయయుంచి సంసారతారకము, సర్వసాపక్షయకరము స్వల్పసాధ్యము, బహుఫలప్రదము అయిన తరణోపాయము ఏది అయిన ఉన్న సెలవిండు, మర్త్యులకు శుభకరమును, హితకరమునైన పరమధర్మమును తమవలన వినగోరితి నని ప్రశ్నించ ఈశ్వరుడు సభలోనివారందరు వినుచుండ నిట్లు చెప్పెను.

            ఋషులారా! విరుడు, భస్మధారణము వేథాస్త్ర సమ్మతమయిన పరమధర్మము. అందుచే శీఘ్రముగ అనంత పుణ్యము లభించును. అని చెప్ప సనత్కమారుడు స్వామీ భస్మమెట్లు తయారుచేయవలయును? ఎట్లుధరించవలెను. ఆవిధానమును దయతో సెలవిండని ప్రార్థింప శివుడిట్లు చెప్పెను.  గోమయముతో భస్మతయారు చేయువలయును అగ్నియే భస్మమునకు దేవత. భస్మవిధానము జాబాలోపనిషత్తునందు చెప్పబడినది.

            పూర్వము దేవతలచే జరుపబడిన యజ్ఞగుండములందలి భస్మము బహుపుణ్యప్రదము. వేదమంత్రములతో ఆభస్మమును తీసికొని అందునుదకముంచి దానిని అంగుష్ఠముతో కలిసి మూడురేఖలుగ ముఖమున కనుబొమ్మలతో సమానముగ ధరించవలయును. మొదలు మధ్యమఅనామికలతో రెండురేఖల దిద్ది అంగుష్ఠముతో ఆ రెండు రేఖల మధ్యనుండి మధ్యరేఖ భస్మముతో దిద్దవలయును. ఇట్లు చేయుటయే త్రిపుండ్రము అనబడును. ఇందులో మూడు రేఖలును వరుసగా అకార ఉకార మకారములుగను, గార్హపత్య దక్షిణాగ్ని ఆహవనీయములను త్రేతాగ్నులుగను, సత్వరజస్తమో గుణములుగను, ఋగ్వేద యజర్వేద సామవేదములుగను  బ్రహ్మవిష్ణు మహేశ్వరులుగను భావించవలయును. ముక్తికాముడయి భస్మమును ధరించువానికి జన్మరాహిత్యము కాగలదు. సకాముడు పూర్ణకాముడగును. బ్రహ్మచారులు,గృహస్థులు, వానప్రస్థులు అందరును భస్మము ధరించనగును. ఉపపాతకములు, మహాపాతకములు భస్మధరించుటచే నశించునును. స్త్రీహత్య, వీరహత్య, ఆత్మహత్య మొదలగు పాపములుకూడను భస్మధారణముచే నశించును. విధి పూర్వకముగ సమంత్రకముగ శ్రద్దా భక్తులతో భస్మము ధరించవలయును. భస్మముయొక్క మహిమ యపారము. విధితెలియనివారు శ్రద్దాభక్తులతో ధరించినను ముక్తి నొందగలరు. పరద్రవ్యాపహారము, పరస్త్రీ సాంగత్యము, పరనింద మొదలగు పాపములుగూడ భస్మధారణచే పోవును. ఇతరుల పీడించుట, అన్యుల క్షేత్రారామములను భంగమొనర్చుట, అసత్యమాడుట, చాడీలు చెప్పుట, వేదవిక్రయము, కూటసాక్ష్యము, మొదలగు పాతకములు గూడ నశించును. నీచ ప్రతిగ్రహములవలన వచ్చినపాపము పోవును.  కన్యావిక్రయము, మాంస, గోరస, లవణాదుల విక్రయించిన పాపము పశ్చాత్తాప పూర్వకముగ భస్మ ధరించులచే నశించును.  పునీతులయినవారును భస్మను ధరించుట శ్రేయోదాయకము.  భస్మము ఎన్నిపాపములనో నశింపచేయును గాని, శివనిందయు, శివభక్తుని నిందయు, చేయువారి పాపముల నశింపచేయదు. కంఠమున రుద్రాక్షమాలయు, ఫాలమున భస్మముగలవాడు లోకపూజ్యుడగును. భస్మను ధరించుటచే సర్వతీర్థములందు స్నానము చేసిన ఫలము వచ్చును. అట్టివాని పితరులుగూడ తరించెదరు. భస్మము ధరించువారు ఇహలోకమున సుఖముగ దీర్ఘాయుష్మంతులయి జీవింతురు.  భస్మమును ధరించుటచే సమస్త వ్యాధులు నశించును. అట్టివాడు దేహంతమున విమానము నధిష్ఠించి స్వర్గమునకు పోవును. స్వర్గమున కొంతకాలముండి అచ్చటనుండి బ్రహ్మలోకమునకు వెళ్లి అచ్చటి భోగముల ననుభవించి, అచ్చటినుండి వైకుంఠమునకు వెళ్లి అచ్చట మూడు బ్రహ్మకల్పములుండి అచ్చటి నుండి కైలాసమునకు వెళ్లి అచ్చట శివునితో సాయుజ్యము పొందును. 

            కాననో సనత్కుమారా! సర్వోపనిషత్తులయొక్క సారము నీకు చెప్పితిని. కాన మీరందరు భస్మమును ధరించి ధన్యులుకండని చెప్పెను. అప్పుడు శివుని యాజ్ఞను శిరసావహించి సనత్కుమారుడు మొదలగు వారు వారివారి స్థానములకు వెళ్లిరి.

            అని వామదేవుడు బ్రహ్మరాక్షసితో భస్మమహిమను నీకు చెప్పితిని. నాశరీరము నందలి భస్మము  కొంచెమంటిన మాత్రముననే నీకింత జ్ఞానము కలిగెను. అని చెప్పుచు కొంత భస్మమును చేత తీసికొని అభిమంత్రించి ఆ ముని బ్రహ్మరాక్షసి కివ్వగా నదియు భక్తితో తన శిరమున త్రిపుండ్రవిధానముగా భస్మమును ధరించెను. వెంటనే దాని పిశాచ శరీరము పోయెను. దివ్యదేహధారి అయ్యెను.   అప్పుడది బ్రహ్మానందముతో వామదేవునకు ప్రదక్షిణ నమస్కారములొనర్చి, ఇంతలో ఆకాశమునుండి సూర్యునివలె ప్రకాశించెడి విమానమురాగా దానినధివసించి స్వర్గమును చేరగొనెను.

            వామదేవుని వలన నట్టి నీచపిశాచమునకు నిట్టి సద్గతి లభించెను. వామదేవుడు కేవలము శివుని అవతారము, జగదుద్ధరణనకుగాను మానవుడయి అవతరించెను. భస్మ మాహాత్మ్యము వర్ణనాతీతము. అట్టి భస్మము మహాత్ముల హస్తములనుండి లభించిన దాని మహిమ మరియు వర్ణనాతీతము.   మంత్రము లెన్నియొ కలవు గాని గురూపదేశముద్వారా లభించిన మంత్రమే సాధకునకు ఫలప్రదమగును. కాన వేదశాస్త్రములు నాస్తితత్త్వం గురోఃపరం అని చెప్పెను. ఈవిషయమంతయు సూతుడు శౌనకాదిమహర్షులకు చెప్పెనని గురుమూర్తి తన శిష్యుడగు త్రివిక్రమ  భారతీస్వామివారికి చెప్పిరి. త్రివిక్రమభారతియు స్వామివారి వలన భస్మ మహిమను విని వారికి నమస్కరించి ఆజ్ఞగైకొని స్వస్థానమునకు వెళ్లెనని సిద్ధముని నామధారకునితో చెప్పెను.

ఇది గురుచరిత మందలి ఇరువది తొమ్మిదవ యధ్యాయము సమాప్తము.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి