శ్రీ గురు చరితము
పదునారవ అధ్యాయము
ఓం శ్రీగురు దత్తాత్రేయాయ నమః ఓం శ్రీగణాధిపతయే నమః
ఓం శ్రీగురు దేవదత్త
సిద్ధముని నామధారకునితో నిట్లు చెప్పుచున్నారు. స్వామివారు శిష్యులనందరను తీర్థయాత్రలకు
సాగనంపిరి. నేనుమాత్రమే వారి పాదసేవా తత్పరుడనై అక్కడ ఉంటివి. ఆక్షేత్రము కడు
మనోహరము. ఆరోగ్యభవానియను పరమేశ్వరి అచ్చట వెలసియుండుటచే ఆక్షేత్రమహిమ
జగద్విఖ్యాతము. ఆక్షేత్రమున శ్రీనృసింహ సరస్వతీస్వామి వారు ఒక సంవత్సరము గుప్తముగ
నివసించిరి. వారచ్చటనున్న కాలములో నొక చిత్రము జరిగెను. చెప్పెద వినుము.
ఒక బ్రాహ్మణు డొక
దినమున స్వామివారి వద్దకు వచ్చి సాష్టాంగముగ నమస్కరించి, స్తుతించి,
అజ్ఞానమహాసముద్రములో
మునిగి యున్నాను. నన్ను తరింపజేయుడు. నేను బహుదినములు తపమొనర్చితిని గాని
మనస్సునకు స్థిరత ఏర్పడలేదు. జ్ఞానములేని తపస్సు వ్యర్థము గదా! మీదర్శనము వలన
నామనస్సునకు హర్షోదయమయ్యెను. నాకు శీఘ్రముగ జ్ఞానోదయమగునటుల నేమి అయిన ఉపదేశించి
నన్ను తరింపచేయుడని ప్రార్థించిను అప్పుడు స్వామివారు నవ్వి ఓయీ బహుదినములు
తపమొనర్చితినంటివి. నీకింతపర్యంతము గురూపదేశముయ్యెనా! గురూపదేశము లేనిది
తపమెట్లాచరించితివి. అని అడిగిరి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు దుఃఖముతో కన్నుల
నీరుకార్చుచు స్వామీ! నావృత్తాంతము చెప్పెద వినుడు.
నాకును ఇదివరకొక
గురువుండెను. కాని అతను నిష్ఠురముగా మాట్లాడువాడు. దయ అనునది ఏమాత్రములేదు. విద్య
చెప్పకపోగా అది చేయును. ఇదిచేయుము అని కఠినసేవలవిధించెను. నేను ఆపనుల చేయట
నిరాకరించి వారిని త్యజించి మీకడకు వచ్చితిని. వారి వాక్యమును వినక పోవుటచే వారికి
నామీద మరింత కోపము వచ్చెను. ఇది నా పూర్వ వృత్తాంతము అని చెప్పెను. అతని వాక్యము విని స్వామివారు ఓరీ! మూఢుడా! ఒకడు దేవాగారమున
మలవిసర్జనము చేసి ఎవ్వరయిన నధిక్షేపించ అదినా ప్రారబ్ధమనినటుల, ఒకడు తన ముక్కుల చెవుల కోసికొని ఇతరులకు అపశకునము
కాగలందులకు వారల కెదురయినట్లు నీచరిత్ర నాకు తోచుచున్నది. గురువును అవమానించిన
నీకు జ్ఞానమెట్లు కలుగును? నీవు నిజముగ
గురుద్రోహివి కాన గురువును నోట నిందించుచున్నావు. స్వముఖమున గురువుయొక్కదోషముల
కీర్తించెడి నీకు మనస్థైర్యము ఎటుల లభించును? జ్ఞాన మెట్లు సిద్ధించును? గురు ద్రోహియగువాడు ఇహ పరముల సుఖము నొందజాలడు.
గురుసేవావిధిని తెలిసికొనిన వానికి జ్ఞానము సిద్ధించును. గురుకృపకు పాత్రుడయిన వానికి వేద
శాస్త్రములు వాటంతట అవి వశముకాగలవు అని
ఇట్లు గురుభక్తి ప్రభావమును వారు విస్తరించి చెప్ప, వాడును తాను చేసిన దానికి పశ్చాత్తప్తుడయి దీనవదనుడయి, నమ్రుడయి ఇట్లు చెప్పుచుండెను.
సద్గురో! జయజయ! మీరు
నిర్గుణులు. నిరాకారులు. నేను ఆజ్ఞానమను వలలో పడి గురు స్వరూపమును
గుర్తించకపోతిని. నాయందు దయయుంచి నాకు జ్ఞానము కలుగునటుల చేయుడు. గురువన నెవ్వడు? గురుసేవ చేయవలసిన విధానమెయ్యది? మొదలగు విషయముల నాకు విశదీకరించి నామనస్సును
స్థిరపరచుడు. అని చెప్పచు స్వామివారికి నమస్కరించెను.
గురునాథుడు అతని
దీనాలాపములకు కరుణించి అతనితో గురుసేవా విధానమును ఇట్లు చెప్పిరి. ఓబ్రాహ్మణా!
వినుము. తల్లిదండ్రులు మొదటిగురువులు. మనకు హితమునుపదేశించువారును గురుతుల్యులే బ్రహ్మవిద్య నుపదేశంచు నతడు
త్రిమూర్తి స్వరూపుడగు దత్తాత్రేయునిగ
భావించవలయును. సావధానముగ అట్టివారి సేవచేసి తీరవలయును. గురుసేవాఫలము నీకు
గోచరముకాగలందులకు భారతమున చెప్పబడిన యొక కథను చెప్పుచున్నాను వినుము.
పూర్వము ద్వాపరయుగమున
ధౌమ్యుడను నొక మహర్షికలడు. అరుణుడు, బైదుడు, ఉపమన్యువు అను ముగ్గురు
శిష్యులు వేదాభ్యాసమునకు వచ్చి వారిసేవ చేయుచుండిరి. పూర్వపు విద్య పరిస్థితి
ఎట్టిదనిన శిష్యుడు వచ్చుటతోడనే అతనికి విద్యచెప్పు సంప్రదాయము లేకుండెను.
ఎంతోకాలము పరీక్షార్థము అతనివలన నానావిధములగు శుశ్రూషలు చేయించుచుందురు. ఇట్లు
కొంతకాలము శిష్యుడు చేయు సేవచే అతని చిత్తము పరిపాకమునొందుట చూచి అప్పుడు వారు
కృపాదృష్టితో శిష్యుని చూతురు. వెంటనే అతడు సర్వవిద్యా పారంగతుడగును. ఇది ప్రాచీన
విద్యాసంప్రదాయము. ధౌమ్యుడు నట్టి సంప్రదాయము ననుసరించిన వాడేగాన ఒకరోజున అరుణుడను
శిష్యుని పిలిచి శిష్యుడా! నీవు మాపొలమునకు పోయి చెరువునీరు మంచిగ పొలము
తడియునట్లు పెట్టుము, నీరులేనిచో సన్యము
ఎండును. కాన శీఘ్రముగ పొమ్మనిరి. గురువుయొక్క వాక్యమును వినుటతోడనే శిష్యుడు సంతోషముతో క్షేత్రమునకు వెళ్ళి, చెరువునీటిని కాలువ ద్వారా గురువుయొక్కపొలము
పర్యంతము తెచ్చుచుండ మధ్యమార్గమున ఆ కాలువ కట్టతెగి ప్రవాహము పల్లమునకు పోవుచుండ
అక్కడ దగ్గర నున్న రాళ్ళను మట్టిని గండిపడిన చోట వేసి ప్రవాహము క్రిందికి
పోకుండునటులప్రయత్నించెను. కాని అతని ప్రయత్నము విఫలమయ్యెను. అప్పుడు వాడు
శ్రీహరీ! ఏమిచేయుదును. గురుకార్యము చేయలేని ఈ జన్మఉండి ఎందులకు? ప్రాణముల త్యజించి అయినను గురుకార్యము
నిర్వహించుటయే నాధర్మము. అని నిశ్చయించుకొని గురువును ధ్యానించుచు తనశరీరము నాపడిన
గండికి కట్టగ నుండునటుల ప్రవాహములో పడుకొనెను. అప్పుడు ప్రవాహ జలము స్వేచ్ఛగ
గురువుగారి పొలములో ప్రవేశించెను. ఆక్షేత్రమంతయు చక్కగా తడసెను. అంతలో గురుమూర్తి ధౌమ్యుడు సూర్యుడస్తమించినను
శిష్యుడు ఇంటికి రాకుండుటకు ఖిన్నుడై వ్యాఘ్రములచేత భక్షింపబడి యుండునా అని
శంకించుచు దీర్ఘస్వరముతో శిష్యుని పిలుచుచు క్షేత్రమును సమీపించెను. గురువు యొక్క
పిలుపు చెవిని పడుటతోడనే నీటినుంచి లేచి శిష్యుడు భక్తిభావముతో గురువు యొక్క
పాదములకు వందనమాచరించెను. గురువు జరిగిన వృత్తాంతము నతని వలన తెలిసికొని అతని
గురుభక్తికి అతని ధైర్యమునకు విస్మితుడయి నీవు సమస్తవేద శాస్త్ర పారంగతుడవగుదువు
గాక. అని ఆశీర్వదించెను. వెంటనే అతను విద్యానిధి అయ్యెను. నీవు ఇంటికిపొమ్ము. తగిన
భార్యను వివాహమాడి సుఖముగ నుండుమని చెప్పి ఆశిష్యుని పంపివేసెను.మిగిలిన ఇద్దరు
శిష్యులు గురువును సేవించుచుండిరి. కొంతకాలము జరుగ ధౌమ్యుడు బైదుడను రెండవ
శిష్యుని పరీక్షింపనెంచి ఒకరోజున అతని పిలిచి పుత్రకా! క్షేత్రమున పైరు
పక్వమయినది. నీవు పొలమునకు పోయి అహోరాత్రములు కాపలా కాచి ధాన్యమును సిద్ధపరచుమనిరి.
వాడును గురుని ఆజ్ఞననుసరించి క్షేత్రమునకు వెళ్ళి పైరును రక్షించి ధాన్యము
రాశిచేసి గురువును సమీపించి గురువుతో ధాన్యమును సిద్ధము చేసితిని. మీ ఆజ్ఞ అయినచో
నింటికి తెచ్చెదననెను. అప్పుడు ధౌమ్యుడు అతనితో శిష్యశిఖామణీ! నాకొరకింత
కష్టపడితివి. ధాన్యమును శీఘ్రముగ నింటికి తెమ్ముఅని చెప్పి తనవద్దనున్న ఒక బండిని
ఒక దున్నపోతునుమాత్రము శిష్యునకు స్వాధీనము చేసెను. శిష్యుడు వారి ఆజ్ఞను
స్వీకరించి మహిషమును బండికి కట్టి రెండవ మషిషము లేనందున రెండవ ప్రక్క కాడిని తన
భుజమునందే ఉంచుకొని ఆబండిని నింపి తిరిగి ఆబండిని వెనుకటి విధముగ గురు గృహమునకు
తెచ్చుచుండెను. కాని ఆమహిషముతో సమముగ తామ నడువలేకుండెను. త్రోవలో ఆమహిషము బురదలో
దిగబడెను. అప్పుడు దాని కంఠపాశమును వదలి బండిని బురదనుండి తీయగలందులకు
ప్రాణమునయినను లెక్కచేయక ప్రమత్నించుచుండెను. అట్టి సమయమునకే ధౌమ్యమహర్షి అచ్చటకు
వచ్చుట తటస్థించెను. వారు శిష్యుని సాహసమనకు, వాని దృఢభక్తికి సంతసించి అతనిని సమీపించి ఆలింగనము
చేసికొనిరి. వెంటనే వాడును సర్వ విద్యాపారంగతుడాయెను. అతనిని ఆశీర్వదించి ఇంటికి
పోయి వివాహమాడి సుఖముగ నుండుమని చెప్పి పంపివేసిరి.
ఇక మూడవశిష్యుడు
ఉపమన్యుడు గురుసేవానిరతుడు. కాని తిండిపోతు. కనుక విద్యాభ్యాసమునకు అర్హుడు
కాకుండెను. అతనికి మితాహారము నభ్యసింప చేయవలయునని గురువు తలచి ఒకరోజున
అతనినిపిలిచి ఓరీ, నీవు నిత్యము
ప్రొద్దునలేచి మనగోవులను అరణ్యమునకు తీసికొనిపోయి కాచుకొనిరమ్ము అని శుశ్రూష
విధించిరి. వాడు గోవులను మేతకు తీసికొని పోయెను. కాని ఆకలి అయినందున కొలది కాలమునకే
గోవులను తిరిగి తీసికొనివచ్చెను. గురువు అతనిని చూచి ఓరీ ఇంత శీఘ్రముగ వచ్చితివేమి? సూర్యుడస్తమించు పర్యంతము గోవులను మేపి
తీసుకొనిరమ్ము అని పంపిరి. వాడు గురువుఆజ్ఞ ననుసరించి గోవులను తీసికొని పోవుచు
ఆకలియగుచున్నందున అచ్చట ఒక నదియందు స్నానమొనర్చి గోవులను మేతకు వదిలి సమీపమున
నున్న గృహముల మాధూకరముచేసి భుజించి సాయంకాలమునకు గురుగృహమునకు గోవులను
తెచ్చుచుండెను. గురును మితముగ రాత్రి ఆహారము నొసంగుచుండెను. ఇట్లు కొన్నిరోజులు
గడువ శిష్యుడు మామూలు ప్రకారమే పుష్టిగ నుండుట చూచి గురునతనితో ఓరీ, నీవు పగలంతయు ఆహారములేక గోవుల కాచుచుంటివిగదా!
నీవింత పుష్టిగ నెట్లుండగలిగితివి. అని ప్రశ్నించెను. అప్పుడు వాడు స్వామీ! ఆవులు
మేయుచుండ నేను నిత్యము మధ్యాహ్నకాలమున పరిసరములయందున్న గృహములయందు మాధూకరముచేసి
భుజించుచుంటిని. అని చెప్పెను అప్పుడు గురువు కోపించి ఓరీ, నన్ను విడిచినీవు భుజించుట ధర్మమా! రేపటినుండి నీవు
యాచించిన మాధూకరమును నాకు తెచ్చియిమ్ము.
అనంతరము గోవుల కాచుటకు సొమ్ము అని ఆజ్ఞాపించెను. శిష్యుడటులనే చేయుచుండెను.
గురువు ఇచ్చు ఆహారముచే ఇతని యాకలి తీరకుండెను. అప్పుడు వాడు గురుని ఇంట భుజించియు
తిరిగి గోవులను తోలుకొనిపోవుచు మరి కొన్నియిండ్లలో మాధూకరముచేసి భుజింపుచుండెను.
ఇట్లు కొన్ని రోజులు జరుగ శిష్యుడు
వెనుకటివలెనే పుష్టిగనుండెను. దానినిచూచి గురువు అట్లుండుటకు కారణమేమని
ప్రశ్నించ స్వామీ! మీరిచ్చిన పదార్థముచే నాకాకలి తీరనందున మరియొక పర్యాయము గూడను
మరికొన్ని గృహములందు భిక్షముచేసి భుజించుచుంటిని అని నిజము చెప్పెను. గురువు
కోపించి రెండవసారి యాచించిన యన్నమునుగూడ నాకే తెచ్చియిమ్మనెను. వాడును
అట్లేచేసెను. అతనికి ఆకలి తీరకుండెను. మరుసటిరోజును గోవుల కాచుటకు వెడలెను.
ఆవుదూడలు పాలు త్రాగుచుండ వాటి మూతినుండి చొంగధారలు క్రిందపడుచుండెను. వాడప్పుడు
దొసిళ్లతో ఆపాలచొంగను త్రాగ ప్రారభించెను. రెండు పర్యాయములు తాను తెచ్చిన
భిక్షమిచ్చు చుండెను. అందుండి గురువిచ్చిన ప్రసాదమును తినును. తిరిగి ఆడవులలో
గోవత్సముల ముఖములనుండి స్రవించు పయోధారల గ్రోలుచుండులచే వీడు దినదినంబునకు మరింత
పుష్టి నొందుచుండెను. కొన్ని రోజులకు గురువు వాడు అప్పటికిని పుష్టిగనుండుట
గమనించి కారణమడుగ వాడు తానుచేసిన పనిని చెప్పెను. గురువు అదివిని ఓరీ!
మతిభ్ట్రుడా! ఉచ్చిష్ట పయఃపానము చేయవచ్చునా! అట్లుచేయుట బహుదోషము. ఇక మీదట
నట్లొనర్పకుము అనిరి. శిష్యుడును
వారియాజ్ఞకు బద్ధుడేగాన మరసటి దినము నుండియు ఆపని మానెను. ఆవుల కాచుచుండెను.
కడుపులో ఆకలి మండిపోవుచుండెను. అచ్చట అనేక జిల్లేడు వృక్షములు అతనికి అగుపడెను.
అందొక ఆకు విరచగా అందుండి క్షీరము స్రవించసాగెను. ఇదియు క్షీరమేగదా! గురువు ఇది
త్రాగవద్దని నిషేధించలేదు గాన దీనిని త్రాగి ఆకలిని తీర్చుకొనియెద అని
నిశ్చయించికొని ఆకులతో నొకదొప్పను దయారుచేసి అందు అర్కక్షిరముల నింపి త్రాగుచుండ
దైవవశమున అవి కంటిలోపడి రెండు నేత్రములు
పోయి గ్రుడ్డివాడాయెను. గోవులను చూడలేక
పోయెను. చింతాక్రాంతుడయి చేతనొక కఱ్ఱను పట్టుకొని గోవులేమయ్యెనోగదా! గురువు నన్ను
కోపించును. ఏమిచేయుదును. అని అటునిటు అంధుడయి తిరుగుచు ఒక గర్తమున పడెను. ఇంతలో
సూర్యుడు అస్తమించెను. ధౌమ్యులవారు శిష్యుడు ఎంతకును రాకపోయెను. ఏమి కారణమాయని
విచారించుచు అడవి మార్గమున వెదకుచు వచ్చుచుండ వారికి గోవులుమాత్రము గోచరముయ్యెను.
శిష్యుడు కనబడనందున దుఃఖార్తుడయి దీర్ఘధ్వనితో కేకలు వేయసాగెను. గురువుయొక్క
వాక్యము చెవినిపడి గర్తములోనుండిన శిష్యుడు దీనస్వరముతో స్వామీ! ఇచ్చట పడియుంటిని
అనిచెప్పెను, ధౌమ్యమహర్షి
అచ్చటకువచ్చి వానియందు కృపగలిగి వానివలన జరిగిన వృత్తాంతమును విని ఓరీ ఒక పర్యాయము
అశ్వినీదేవతల స్మరింపుమని చెప్పిరి. వాడట్లు స్మరించినంతనే యధాపూర్వముగ దృష్టి
వచ్చెను. వెంటనే వాడు గర్తమునుండి బయటకువచ్చి భక్తితో నమస్కరించి స్తుతించెను.
అప్పుడుధౌమ్యులవారు
సంతసించి అతనిని ఆలింగనమొనర్చి ఓశిష్యశిఖామణీ! నీభక్తికి నీకౌశల్యమునకు
సంతసించితిని. అని చెప్పి తన హస్తమును అతని శిరముననుంచు సరికి ఆశిష్యుడును తత్క్షణము
వేద శాస్త్ర పారంగతుడాయెను. అప్పుడు ధౌమ్యులవారు అతనితో గృహమునకు పోయి తగిన
భార్యను పెండ్లాడి భూతలమున సుఖముగ జీవించుము. నీకీర్తి భూతలమున
ప్రఖ్యాతిగాంచును. నీకు నీతో సమానుడగు
ఉత్తంకుడును శిష్యుడు నీవద్ద విద్య నభ్యసించి నీకు గురుదక్షిణగ పాతాళలోకమునుండి ఆదిశేషుని కుండలముల తెచ్చి
సమర్పించును. అతనే జనమేజయునితో సర్పయాగము చేయుంచును. ఆసమయమున తక్షకుడు ఇంద్రుని
శరణుపొంది అతని పీఠమునకు చుట్టుకొని యుండ నీశిష్యుడయిన ఉత్తంకుడు తన మంత్ర మహిమచే
సహేంద్ర తక్షకాయస్వాహాయని ఇంద్రుని పీఠముతో సహ తక్షకుని ఆకర్షింప సమర్థుడగును.
ఇటువంటి శిష్యుని ద్వారా నీకీర్తి ఆచంద్రతారకముగ నుండగలదు అని చెప్పి అతనిని గూడ
పంపివేసిరి.
స్వామివారు
బ్రాహ్మణునితో పైవిధమయిన ధౌమ్యుని కథచెప్పి ఓబ్రాహ్మణుడా గురుభక్తి ప్రభావము
వింటిని గదా! గురుద్రోహికి ఇహసుఖమే లేదు. పరసుఖమెక్కడిది? అట్టివాడు గురుద్రోహమను పాపముచే కుంభీపాకమునే పొందును.
గురువు సంతోషించిన నేదిసిద్ధించదు? కాన ఇప్పటికయినను ఆజ్ఞానమున విడనాడి చేసిన పొరపాటును దిద్దుకొని నీగురువును
సమీపించుము. అతడు నిన్ను తరింపచేయును. గురువు సంతసించిన మంత్రసిద్ధి వెంటనే
కలుగును. అని ఆజ్ఞాపించిరి. వారి వాక్యములు విని ఆబ్రాహ్మణుడు స్వామీ! జయజయ
గురుతత్వమును బోధించితిరి. నేను నిజముగ గురుద్రోహినైతిని. గురువు యొక్క
చిత్తమునకు నొప్పి కలిగించితిని. నేనిప్పుడు వెళ్లినను నాయందెట్లు
ప్రసన్నులయ్యెదరు. సువర్ణాదిధాతువులు అతికిన నతుకవచ్చును. ముత్యపుచిప్ప పగిలిన
ఎవ్వరయిన అతుకగలరా! గురుద్రోహినయిన నేను జీవించి ప్రయోజనమేమి? ప్రాణముల త్యజించెద అని చెప్పుచు ఆత్మహత్యకు
నుద్యుక్తుడయ్యెను. అందుచే అగ్నిస్పర్శచే తృణము భస్మమయినటుల పశ్చాత్తాపముతో అతని
పాపములన్నియు పటాపంచలయ్యెను. అగ్ని కర్పూరమును విశ్శేషముగ దహించునటుల
పశ్చాత్తాపముచే సర్వదోషములు సమూలముగ నశించును. కాన గురుమూర్తి అతనికి కలిగిన
పశ్చాత్తాపమునకు సంతసించి అతనిని దగ్గరకు పిలచి నీదురితములన్నియు పోయెను.
నీగురువును హృదయమున స్మరించి ఆరూపముతో నన్ను ధ్యానించుము. అనిచెప్ప అతనును
సంతసించి వారి పాదముల శిరముంచి నమస్కరించెను.
గురువును స్తుతించెను. శరీరము పులకరించెను. కంఠము గద్గదమయ్యెను.
ఆనందబాష్పములు నేత్రముల వెంట స్రవింపసాగెను. తక్షణమున గురుకృపచే అతనికి
జ్ఞానోదయమయ్యెను వేద శాస్త్రములయందు నిపుణుడయ్యెను. ఆబ్రాహ్మణునియొక్క అదృష్టమును
ఏమని చెప్పవలెను? అప్పుడు గురుమూర్తి
అతనిని ఓదార్చి నీవు సంశయించక ఇపుడు నీగురువునొద్దకు పొమ్ము. నీవు వెళ్లినంత మాత్రముననే అతడు సంతసించును.
అతను వేరు నేను వేరు అను భేదమును విడనాడుము. అని చెప్పిరి. వాడును అట్లే చేసి
గురుకృపకు పాత్రుడయి ఇహపరసుఖముల నొందెను. ఇంతలో వైద్యనాథక్షేత్రమున సంవత్సరము
పూర్తికాగా శ్రీనృసింహ సరస్వతీస్వామివారు ఆక్షేత్రమును విడిచి కృష్ణా నదీ తీరమందలి
భువనేశ్వరియను పరాశక్తికి నివాసమయిన భిల్లవటియను గ్రామముచేరి నదికి
పశ్చిమతీరముననున్న ఒక ఉదుంబర వృక్ష మూలమున కొంతకాలము నివసించిరి. ఆకథ పై అధ్యాయమున
చెప్పబడును.
ఇది గురుచరితమున పదునారవ అధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
పదునేడవ అధ్యాయము
ఓంశ్రీగురుదత్తాత్రేయాయ నమః ఓం శ్రీగణాధిపతయే నమః
సిద్ధమని నామధారకుని
గూర్చి నీవు నిజమయిన గురుభక్తుడవు కాననే గురుచరిత్రమును విను భాగ్యము నీకు
లభించెను. వర్షము వచ్చుటకు పూర్వము దానిని
సూచించు చల్లని గాలి ముందు వచ్చునటుల గురుకృపకు పాత్రుడగుటకు పూర్వము వారి కథ
వినుటయందు రుచియు అటులనే పుట్టును. సావధానుడవై గురుచరిత్రమును వినుము.
స్వామివారు
భువనేశ్వరికి నివాసస్థానమయిన ఆ భిల్లవాటికా యను క్షేత్రమున కృష్ణానదికి
పశ్చిమతీరమున ఒక మేడిచెట్టు క్రింద చాతుర్మాస్యవ్రతము నాచరించుచుండిరి. వారు
నివసించుటచేత ఆస్థానమునకు మహిమ మెండాయెను. అచ్చట వారు గుప్తముగ నుండి
భిక్షావృత్తిచే జీవయాత్ర సలుపుచుండిరి. అని చెప్ప నామధారకుడు పిద్ధమునితో స్వామీ!
అంతటి మహాత్ములు గుప్తముగ నుండుటకు కారణమేమి? భిక్షమెత్తి జీవించ వలసిన అవసరమేమి అని ప్రశ్నించ సిద్ధముని
ఇట్లు చెప్పుచుండెను. శివుడు భిక్షమాచరించును.
మహాత్ములు తీర్థయాత్రచేయుట ఏమి, తపమాచరించుట యేమి, భిక్షమెత్తుట యేమి, భక్తుల ననుగ్రహించుటకే గాని అందు వారి స్వార్థమేమియు లేదు.
భక్తిలేనివారి బారి నుండి తప్పించుకొనందులకుగాను వారు గుప్తముగ నుండనెంతురు. వారు
ఎంత గుప్తముగ నుండదలచినను, కస్తూరి గుప్తముగ
దాచినను దాని సుగంధ మెటుల వెలువడునో అట్లే వారి మహిమయు ప్రఖ్యాతమగుచునే యుండును.
ప్రస్తుతము ఈ భిల్లవటీతీరమున జరిగిన చరిత్రమును చెప్పెద వినుము.
కరవీరనగరమున వేద శాస్త్రపారంగతుడై
స్వకర్మనిరతుడయున ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికొక కుమారుడుండెను. ఆబాలుడు మందబుద్ధి.
చిన్నతనముననే తండ్రి మరణించెను. బాలునకు ఏడు సంవత్సరములు వచ్చెను.
జ్ఞాతివర్గమువారు అతనికి ఉపనయనము చేసిరి. కాని పశుప్రాయుడగు నాబాలుడు గాయత్రీ
మంత్రమునయినను సరిగ నుచ్చరింప సమర్థుడుగాడు. ఎన్ని పర్యయములు చెప్పినను వెంటనే
మరచిపోవును అయిదారక్షరములుగల పదమునయినను కలిపి పలుకజాలకుండెను. అచ్చటి
విద్వాంసులందరు ఆబాలునితో ఓరీ దుర్మతీ అటువంటి విద్వాంసుని గర్భమున నెట్లు
జన్మించితివి? పాషాణముతో సమమగు నీవు
జన్మించి ఎమి ప్రయోజనము? నీపుట్టుకచే నీతండ్రి
కీర్తికిగూడ కళంకము వాటిల్లెను. పందివలె ఊరక తిని తిరుగుచున్నావు. దురాచారుడవగు
నీకు యమలోకమే ముందు నివాసము కాగలదు. ఇట్టి నీవు బ్రతికియు ఏమి లాభము. పెద్ద పాషాణమొకటి
కట్టుకొని చెరువులో పడి చచ్చుటయే శ్రేష్ఠము. విద్యగలవాని జీవితమే జీవితము. విద్యతరుగని
నిధి. విద్వాంసుడు అందరిచే పూజింపబడును. వయస్సుకు చిన్నవాడయినను విద్వాంసుడు
వయోధికులచేతను గౌరవింపబడును. సోదరులు లేకున్నను విద్యయే సోదరునిగ పనిచేయును. విదేశములకు వెళ్లినను పరిచయము లేనిచోట గూడ అతను
మన్నననొందును. విద్య గలవాడు జ్ఞానిగాగలడు. విద్యగలవానియందు సమస్త దేవతలు ఉందురు. అతడు
అందరిచేతను గౌరవింపబడును. చక్రవర్తియు విద్వాంసుని పూజించును. కాన విద్యాభ్యాసము
ప్రతివారును చేయనగు. విద్యలేనివాడు పశువు అని అనిరి. వారి మాటలువిని ఆమూఢ బాలుడు
వారితో స్వామీ మీరు చెప్పినది సత్యము.
నేను పూర్వ జన్మమున విద్యాదానము చేయనయితిని. కాననే ఈజన్మయందట్టి మందమతి నయితిని.
నేనేమి చేయుదును. ఏది అయిన ఉపాయము నాకు విద్య రాగలందులకు మీరుపదేశించిన
నేనాచరించెద అని అన వారు అతనిని పరిహసించి కులనాశకా, కుక్షింభరుడా! నీకేమిటి! విద్యవచ్చుట ఏమి? పో పొమ్ము అని నిరాకరించిరి. అప్పుడు వాడు
అనుతాపమునొంది విరక్తుడయి ఆగ్రామమును వదలి ఛీ నేను జీవించి ఏమిలాభము? నాకన్న కుక్కయు శ్రేష్ఠము ప్రాణము
త్యజించెదననుకొనుచు అడవి మార్గమున పోయి పోయి దైవవశమున భిల్లవటీ గ్రామమును
ప్రవేశించెను. అచ్చట ప్రసిద్ధి గావించిన భువనేశ్వరి అమ్మవారి దేవాలయ ద్వారమువద్ద
కూర్చొని ఉపవాసము చేయుచుండెను. స్నానములేదు. సంధ్యయులేదు. ఇట్లుమూడు రాత్రులు
ఉపవాసము చేసెను. మనస్సున అమ్మవారిని ప్రసన్నురాలవయి విద్య విమ్మని ఆర్తితో
ప్రార్థించుచుండెను. మూడుదినములయినను
స్వప్నమందయినను దేవి ప్రసన్నురాలు కాకుండుటకు వాడు కోపించి తల్లీ నన్ను
ఉపేక్షించుచున్నావా? అని చెప్పుచు ఒక
పదునైన కత్తితో తన నాలుకను ఛేదించి దేవి పాదములముందుంచి ఇంతియేకాదు నీవు
ప్రసన్నురాలవు కానిచో రేపు నాశిరమును కోసి నీపాదములయందుంచెదనని శపథము చేసెను.
భువనేశ్వరి అతనియందు జాలికలదై స్వప్నములో దర్శనమిచ్చి ఓరీ నామీద నీకెందులకు
కోపము. సాక్షాత్తు శివావతారమయిన ఒక మహానుభావుడు ఈకృష్ణానది పడమటి తీరమున
మేడిచెట్టు క్రింద కూర్చొని యున్నారు. నీవు వారిని శరణు పొందుము. నీకోరిక తీరును
అని చెప్పి అంతర్ధానము నొందెను. వెంటనే ఆబాలుడు మెలుకువనొంది సంతోషముతో నదిని దాటి
అనాథ రక్షకుడగు స్వామివారిని మేడిచెట్టు క్రింద చూచి వారి పాదముల యందు శిరముంచి
నమస్కరించెను. వెంటనే స్వామివారు ప్రసన్నులయి అతని శిరమున తమ హస్తముంచగా తెగిపోయిన
నాలుకయు సరిగ వచ్చెను. వేద శాస్త్రపురాణతర్క వ్యాకరణములయందు గొప్ప పాండిత్యము కలవాడయ్యెను. కాకి మానస సరోవరమును
సమీపించినంతనే రాజహంస ఎట్లగునో అట్లే స్వామివారి హస్తస్పర్శ మాత్రముననే వాడు
పండితుడయ్యెను. లోకపూజ్యుడయ్యెను. స్వామివారి ఆజ్ఞగైకొని వాడు తన గ్రామమునకు
వెళ్ళి ఇహపర సౌఖ్యముల నొందెను.
ఇది గురుచరితమున పదునేడవ అధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
పదునెనిమిదియవ అధ్యాయము
ఓం శ్రీగురుదత్తాత్రేయాయ నమః ఓం శ్రీగణాధిపతయే నమః
నామ ధారకుడు
సిద్ధమునిని గూర్చి మీవలన గురుకథామృతమును పానముచేయుచుండ నాకు పిపాస
యధికమగుచున్నది. భక్తునకు గురు కథామృతమే జీవనము గదా! కాన పైకథను నాయందు దయయుంచి
చెప్పుడని ప్రార్థించ సిద్ధముని హర్షముతో
నిట్లు చెప్పుచుండిరి.
శ్రోతలారావినుడు. శిష్యశిఖామణి నీవు ధన్యుడవు. నీ ప్రశ్నయు కడు
ధన్యము. నీవలన గురుకథను చెప్పుభాగ్యము నాకు లభించుచున్నది. కొంత కాలము
భిల్లవటియందు నివసించి అచ్చటనుండి వరుణాసంగమనును
క్షేత్రముల తమ పాదముల స్పర్శచే పావనమొనర్చుచు కృష్ణా పంచనదీ సంగమముననున్న
అమరపురమను గ్రామమునకు వచ్చి అచ్చట పన్నెండు సంవత్సరములు స్వామివారు నివసించిరి.
ఆక్షేత్రము కాశీపురమువలె మనోహరమయి యుండుటచేతను అయిదు నదులు కృష్ణా నది యందు సంగమము
నొందుటచేతను, ప్రయాగ కురుక్షేత్రము
మొదలగు క్షేత్రములకంటె మిన్న అయినందుకు ఆక్షేత్రమున వారు అంత కాలము నివసించుట
తటస్తించెను.
అచ్చట శివ, భద్ర, భోగవతి, కుంభి, సరస్వతి అను అయిదు నదులు కృష్ణయందు వచ్చి చేరును.
ఇవి యన్నియు మహాపాతక నాశకములు. అమరపురమను గ్రామము నిరుపమానమగు పుణ్యక్షేత్రము.
దక్షిణప్రయాగగ ప్రసిద్ధినొందినది. ఆసంగమమున నమరేశ్వరుడను శివుడు గలడు. అందుచే
ఆపురమునకు అమరపురమని పేరువచ్చెను.
అమరేశ్వరుని సన్నిధిని లోకపావనమగు శక్తి తీర్థముగలదు. అందు నరువది నలుగురు
యోగినీశక్తులు అమరేశ్వరుని సేవించుచు నచ్చట నివసించుచుందురు. అందువలన ఆతీర్థమునకు
శక్తితీర్థమని పేరు వచ్చెను. ప్రయాగయందు మాఘమాసము నెలరోజులు స్నానముచేయుటచే వచ్చు
పుణ్యము ఆక్షేత్రమున ఒక స్నానమున మాత్రమే రాగలదు. అక్కడ కృష్ణ దక్షిణవాహినియయి
ప్రవహించును.అచ్చట తీర్థములయొక్క మహిమ పూర్తిగా నెవ్వరికి వర్ణించ తరముగాదు. అమరపురమునకు ఉత్తరముగా కృష్ణ పశ్చిమ వాహినియయి
ప్రవహించును. అచ్చట శుక్లతీర్థమను తీర్థము కలదు. అచ్చట నొక మేడిచెట్టు కలదు.
ఆమేడిచెట్టుయొక్క సమీపమున పాపవినాశనము, కామ్యతీర్థము, వరదతీర్థము, అను తీర్థములు దగ్గరదగ్గరగా గలవు. సంగమమున శక్తి
తీర్థము, అమరక తీర్థము, కోటి తీర్థము అను ముఖ్యమయిన మూడు తీర్థములు
గలవు. ఇట్టి పుణ్య తీర్థమగుటచే త్రిమూర్తి
స్వరూపుడయిన శ్రీనృసింహ సరస్వతీ స్వామివారు అచ్చట కొంతకాలము నివసించిరి. ఆ క్షేత్రము సకలాభీష్టదము గాన సిద్ధ స్థానమని
చెప్పనగును. కలియుగమున కాలవశమున గుప్తమయిన
తీర్థములకు లోకమున ప్రఖ్యాతి తెచ్చుటకు స్వామివారచ్చట నివసించిరి. స్వామివారు నిత్యము మధ్యాహ్న కాలమునకు
అమరపురమునకు భిక్షకు వెళ్ళుచుందురు.
ఆ గ్రామమున ఒక వైదిక బ్రాహ్మణుడు కలడు. అతను మిక్కిలి సాధువృత్తము కలవాడు. అతని భార్యయు పతివ్రతా శిరోమణి. బ్రాహ్మణుడు బీదవాడగుటచే నిత్యము యాయవారవృత్తిచే
జీవించును. వారి అంగణమున ఒక తమ్మ పాదు
ఉండెను. అది కాయలు కాయుచుండెను. ఏదినమున దైవవశమున వారికి తినుటకు ఆహారము
లభించకుండెనో ఆదినమున ఆ తమ్మకాయలను మాత్రమే శాకముగ చేసి భుజించుచుండెడి వారు. ఒకరోజున దైవవశమున శ్రీగురుమూర్తి వారు
వారియింటికే మధ్యాహ్నమునకు భిక్షకు వెళ్ళుట తటస్థించెను. దంపతులు భక్తితో స్వామివారిని ఆహ్వానమొనర్చి
షోడశోపచారములతో పూజకావించిరి. తాము ఆరోజున
సిద్ధపరచు కొనిన అట్టి శాకాహారము చేతనే కడు ఖిన్నులయి భిక్షగావించిరి. స్వామివారు బిక్షచేసి సంతృప్తినొంది
వారినోదార్చి నేడు నాకు సంతోషమయ్యెను.
నేటితో మీదరిద్రము నశించెను. అని
చెప్పిపోవుచు ద్వార సమీపమున నున్న ఆ తమ్మ చెట్టు మొదటికి విరిచివేసి
వెళ్ళిరి. అది చూచి ఆబ్రాహ్మణునియొక్క
భార్యయు వారి పుత్రులును ఇట్లు దుఃఖపడసాగిరి.
హా దైవమా! ఎంత కష్టము! మాకింత దురదృష్టమా! మనమా యతీశ్వరునకు ఏమి అపకారము
చేసితిమి? ఇంతమాత్రము ఆహారముకూడ మనకు లేకుండ మనచెట్టును విరిచి
వెళ్ళిరే! అని విలపించుచుండిరి. అప్పుడు ఆ
బ్రాహ్మణుడు తన భార్యతో ఔషధముచే రోగమును నశింప జేయునటుల శ్రేయస్సునకు భంగము
తెచ్చెడి రోషమును విడనాడుము. ప్రతివారికి
ప్రారబ్దమని ఒకటి ఉండును. జరుగు ప్రతి
విషయము ప్రారబ్దముననుసరించియే జరుగుచుండును.
ఈశ్వరుడు వారి వారి ప్రారబ్దము ప్రకారము ఆయాకాలములయందు సుఖ దుఃఖములనుభవింప
చేయుచుండును. పిపీలిక మొదలుకొని సర్వ
జీవులకు ఎవ్వరి కెట్టి ఆహారమవసరమో అట్టి ఆహారమునతడొసంగుచుండును. ఆయురన్నం ప్రయచ్ఛతి. ఈశ్వరుడు ముందుగా అన్నమును సృజించియే జీవుల
సృజించుచున్నాడు. ఈశ్వరుని దృష్టిలో కడు
బీదవాడును చక్రవర్తియు కూడా సమానమే. ఎవరి
పూర్వార్జితముగా ఏది సిద్ధమయి ఉన్నదో అద్దానినే వారలకు ఘటింపజేయుచుండును. మూర్ఖుడు తన పూర్వార్జిత కర్మను తాను మరచి
ఇతరుల మీద దోషములనారోపించును. నీవును
అటులే అజ్ఞానములో పడి స్వామివారిని నిందించుచున్నావు. స్వామివారు మనకు తారకుడై నేను నాదియను దృఢమయి మొలచుకొనియున్న అహంకారమును
గ్రంధిని భేదించివేసిరి. అట్టి మహాత్ముని
నిందించి పాపము నార్జించకుము. అని భార్యను
సమాధాన పరచి విరుపబడిన తీగను బయిట పారవేసి
గడ్డపారతో మొదలుకూడ వేరుతో సహా త్రవ్వనారంభించెను. అట్లు తవ్వుచుండ ధనముచేత పూర్ణమయిన ఒక గొప్ప
ఘటము అందుండి వెలువడెను. అది చూచి
పరమానందముతో తన భార్యను పిలిచి ఇటు చూడుము.
యతీశ్వరులు మనయందు ప్రసన్నులయిరి.
తీగను ఛేదించి మహానిధిని మనకు అనుగ్రహించిరి. వారు సాక్షాత్తు మహేశ్వరులయి ఉండవచ్చు. మన దైన్యమును హరించుటకు గాను నేడు ఈశ్వరుడే
నరరూపమున మన యింటికి వచ్చెను. అని చెప్పి
భార్యా సమేతముగ పూజా ద్రవ్యముల వెంటనిడుకొని స్వామివారున్న స్థలమునకు వెళ్ళివారిని
పూజించిరి. జరిగిన వృత్తాంతము వారితో
చెప్పిరి. స్వామివారు ఈవిషయమును మీరు
లోకమునకు తెలియచేయకుడు.
అట్లొనర్చితిరేని లక్ష్మిమీ యింట
నుండనొల్లదు. మీ వంశము పుత్ర పౌత్రాదులతో
అష్టైశ్వర్యములతో తులతూగగలదు. అని
వారలనాశీర్వదించి పంపిరి.
నామధారకా గురు కృపకు పాత్రుడయిన వానికి దైన్యముండదు. కల్పవృక్షమే ఇంటనుండ దరిద్రమచ్చట నివసించునా?
ఎవరైన
భక్తితో సద్గురువును సేవించిన తప్పక వారు గురు కృపకు పాత్రులయి సర్వపూజ్యులు
కాగలరు. ఇది అంతయు గురు భక్తి
ప్రభావము. కావున నీవును స్థిరమయిన భక్తితో
సద్గురువును పూజించి ధన్యుడవు కమ్ము.
ఇది గురుచరితమందలి పదునెనిమిదియవ అధ్యాయము సమాప్తము
శ్రీ గురు చరితము
పందొమ్మిదవ అధ్యాయము
ఓం శ్రీగురుదత్తాత్రేయాయ నమః ఓం శ్రీగురుభ్యో నమః ఓం శ్రీ
మహాగణపతయే నమః
నామధారకుడు
సిద్ధముని చరణములకు నమస్కరించి చేతులు జోడించుకొని జయ జయ యోగీశ్వరా! నీవు
అజ్ఞానధ్వాంతమునకు మార్తాండుడవు. భవసాగరతారకుడవు. మోహమను రాత్రియందు
నిద్రించుచున్న నన్ను లేపి మీరు గురులీలామృతమును త్రాగించుచున్నారు. మీవలన నేను
ప్రబుద్ధుడ నయితిని. ముందు రానున్న గురుమూర్తి కథను నాకు వినిపింపుడు.
అనిప్రార్ధించెను. శిష్యుని వాక్యము విని సిద్ధముని సంతసించి గురుమూర్తి యొక్క
నిరుమానమగు మహాత్మ్యమును ఇటుల చెప్పదొడగెను.
స్వామివారు ఆక్షేత్రమున
కృష్ణానదీతీరమున నొక ఉదంబర (మేడి) వృక్షము క్రింద నివసించిరి. లోకమున అనేక
పుణ్యవృక్షము లున్నను శ్రీదత్తాత్రేయ అవతారమగు శ్రీనృసింహసరస్వతీ స్వామివారికి
ఉదంబర వృక్షమన్న కడు ఆదరము. పూర్వము శ్రీమహావిష్ణువు నరహరి అయి అవతరించి తన
నఖములచేత హిరణ్యకశిపుని ఉదరము చీల్చి అతని ప్రేగులు కంఠమున హారముగ ధరించెను.
ఆదైత్యుని ఉదరమున కాలకూటముతో సమమగు విషముండుటచే స్వామివారికి దుస్సహమగు వేదన
వాటిల్లెను. అప్పుడు లక్ష్మిఅచ్చట నొక మేడిచెట్టు ఉండ ఆవృక్షముయొక్క పక్వములగు
ఫలముల కొన్నిటిని వారి నఖములకు అద్దెను. వెంటనే ఆవిషవేదన అంతయు శాంతించి
నరసింహస్వామి శాంతినొందెను. సంతోషముతో లక్ష్మిని ఆలింగనమొనర్చెను. అప్పుడు
లక్ష్మియు నరసింహస్వామియు ఆమేడివృక్షము యెడ సంతసించి నీవికమీదట కల్పవృక్షముగ
భక్తులకు సర్వాభీష్టముల నిచ్చుచుందువు గాక నిన్ను భజించువారు కామ్యములన్నియు తప్పక
సిద్ధించగలవు. నీదర్శనము వలననే ఉగ్రమయిన విషబాధయు తత్కాలమున శమించ గలదు. నిన్ను
పూజించి నీకు ప్రదక్షిణమొనర్చువారు వంధ్యాత్వదోషము నుండి విముక్తులై
పుత్రవతులయ్యెదరు. నిన్ను సేవించువారి దైన్యము నశించి వారు శ్రీమంతులు కాగలరు.
నీనీడయందు ఎవ్వరు స్నానము చేయుదురో వారికి గంగాస్నానము చేసిన పుణ్యము కలుగును. నీ
నీడ నెవరు జపానుష్ఠానముల చేయుదురోవారికి అనంతమగు ఫలము సత్వరము సిద్ధించును.
అట్టివారి వ్యాధులు నశించును. నిన్ను పూజించుటచే బ్రహ్మహత్యాది మహాపాతకములు సహితము
పోగలవు. సమస్తదేవతలే గాక లక్ష్మి సమేతముగ నేనును నీ కధీనులమయి యుండెదము. అని
ఆవృక్షమునకు వరములనిచ్చిరి. స్వామివారు విష్ణ్వవతారమగుటచే దాని వలన పూర్వము అనగా
తామునృసింహస్వామి అయి అవతరించిన సమయమున
ఉపకృతి నొందిన కారణమునుబట్టి వారికి ఈవృక్షమనిన కడుప్రేమ. అందుకనియే ఆవృక్ష
సమీపముననే వారు నివాస మేర్పరచుకొనిరి ఇట్లుండ మధ్యాహ్నకాలమునకు స్వామివారు
అచ్చటనుండుట గ్రహించి శక్తితీర్థమున గుప్తముగనున్న చతుష్టష్టియోగినీ గణములు
మహోత్సవముతో స్వామివారిని సమీపించి భిక్షకుగాను తమ నివాసమునకు గొనిపోయి
గంధాక్షతలతో పూజించి భిక్షమొనర్చి తిరిగి స్వామివారిని యధాస్థానమున చేర్చుచుండిరి.
ఆ అమరపురమున నుండు బ్రాహ్మణులు తమలో తామిట్లనుకొనుచుండిరి. ఎవ్వరో ఒక యతి
కృష్ణాతీరమున అరణ్య మధ్యమమున ఒక వృక్షము క్రింద నుండుచున్నట్లు
తెలియుచున్నది. వారు ఎన్నడును మన
గ్రామమునకు భిక్షకైనను రారు. వారికి
నిత్యము భిక్ష ఎట్లు జరుగుచున్నదో విచారింతమనుకొని గూఢముగ నొక వ్యక్తిని అచ్చటనుంచిరి. మధ్యాహ్న కాలము రాగా అచ్చటనున్న వానికి హృదయమున
భీతాహమయ్యెను. వాడు అచ్చటనుండ జాలక
గ్రామమునకు తిరిగి వెడలెను. ఎవరు మహాత్ముల
పరీక్షించదలతురో వారికి అథోగతియు,
యమలోక
ప్రాప్తియు తప్పక కలుగును. దైవవశమున
నచ్చటనొక గంగానుజుడను పేరుగల పొలపు కాపరియగు కర్షకుడొకడు వచ్చుట తటస్థించెను. అదే సమయమునకు యోగినీ గణములు స్వామివారిని
సమీపించి భిక్షకు కొనిపోవుచుండిరి. వారు
స్వామివారిని వెంటనిడుకొని జలప్రవాహమును సమీపించ ప్రవాహము రెండు పాయలయ్యి వారికి
మార్గమిచ్చెను. గంగానుజుడు అది చూచి
వీరెవ్వరో ఈశ్వరవతారమయి యుండవచ్చును. గాననే దేవకన్యలు ఈ మహాత్ముని గౌరవముతో తమ
స్థానమునకు గొనిపోవుచున్నారు. అని
భావించెను. తరిగి స్వామివారు అదే ప్రకారము
భిక్ష చేసికొని కొంతసేపటికి వచ్చుటయు వాడు కనులారా గాంచెను. మరునాడు అటులే యోగినీ గణములు మధ్యాహ్న కాలమునకు
మహోత్సవముతో స్వామివారిని సమీపించి నమస్కరించి నీరాజనమిచ్చి తమ స్థానమునకు
తీసికొని పోవుటకు నదిని సమీపించ మామూలు ప్రకారము నది రెండు పాయలయి మార్గమొసంగ ఆ
మార్గమున గురుమూర్తి యోగీనీ సమేతుడై పోవుట కాంచి ఆ గంగానుజుడు వారి వెంట
తెలియకుండునట్లు ఆ మార్గముననే వెడలెను.
అచ్చట ఒక పట్టణము చిత్రములయిన రత్న ఖచిత గోపురములచే అమరావతీ తుల్యముగ
సూర్యుని వలె దేదీప్యమానముగ ప్రకాశించుచుండెను.
యోగినిలు స్వామివారిని రత్నములచే మండితమగు నొక సింహాసనమున కూర్చుండబెట్టి
పూజించి షడ్రసాన్నములతో భిక్షకావించిరి.
అప్పుడు గురుమూర్తి ఆ కర్షకుని చూచుట తటస్థించెను. స్వామివారు నీవెవ్వడవు? ఎందుకు వచ్చితివి? అని ప్రశ్నించ అతడు స్వామీ మీ దర్శనార్థము వచ్చితిని. పరమేశ్వరా మీరు మనుష్యమాత్రులు కారు. సంసార మహా సముద్రమున మగ్నుడనైయున్న
నన్నుద్ధరించుడు. మీరు విశ్వతారకులు
అజ్ఞానాంధుడనైన నాకు నేడు జ్యోతి స్వరూపులగు మీదర్శనము దైవవశమున ఘటించెను. నా తప్పిదము క్షమించి నన్ను కాపాడి రక్షించుడని
దీనత్వముతో స్వామివారి నతడు శరణుపొందెను.
అతని భక్తికి స్వామివారు సంతసించి అతనినోదార్చి నేటితో నీ దైన్యము
తొలిగెను. నీ అభీష్టములన్నియు
నెఱవేఱగలవు. నేనీ క్షేత్రమున నుండు దనుగ
నిచ్చట జరిగిన విషయమును ఎవరికీ ప్రకటించకుము.
నీకు సద్గతి లభించును. అని
ఆశీర్వదించి స్వామివారు మామూలు ప్రకారము ఉదుంబర వృక్షము చేరిరి. వాడును స్వామివారి వెంట వచ్చి వారికి
నమస్కరించెను. ఆ నాటినుండియు వాడు స్వామివారియందు
అనన్యమయిన భక్తి కలవాడై నిత్యము గురుసేవా పరాయణుడై పుత్ర పౌత్రాభివృద్ధితో
సంతోషముగా నుండెను. ఇట్లుండ మాఘపూర్ణిమ
సంప్రాప్తమయ్యెను. వాడాదినమున ఉదయమున
స్వామివారిని సమీపించి మామూలు ప్రకారము నమస్కరించి స్వామివారితో స్వామీ! పెద్దలు
మాఘమాసమున ప్రయాగ స్నానము మహాపుణ్య ఫలప్రదమని చెప్పుచుందురు. ప్రయాగయన నేమియో కాశీ అననేమియో తెలియని
జ్ఞానహీనుడను అన పలికెను.
వాడి మాటలు విని ఓరీ! ఈ కృష్ణా నదీ సంగమమే మనకు
ప్రయాగము. కొల్హాపురమే మనకు గయ. ఇచ్చట సమీపముననున్న యుగాలయము కాశి. ఇవి ఈ దక్షిణ క్షేత్రముననున్న
కాశీగయాప్రయాగలు. అయినను నీ భక్తి
శ్రద్ధలకు సంతసించితిని. కావున నీకు నేను
కాశీగయాప్రయాగల ప్రత్యక్షముగ దర్శింపచేసెద నని చెప్పి స్వామివారు వ్యాఘ్రాసనమున
పద్మాసనముతో కూర్చుని తమపాదుకల నతని గట్టిగా పట్టుకొనుమని ఆజ్ఞాపించిరి. వాడట్లొనర్చెను. కనులు మూసి తెరచునంతలో
గురుశిష్యులిద్దరు ప్రయాగయందుండిరి. అచ్చట
స్నానమొనర్చి తిరిగి పూర్వపు రీతిని కాశీ చేరిరి.
అచ్చట విశ్వనాధుని దర్శించిరి.
అచ్చట నుండి మనోవేగముచే గయాక్షేత్రము చేరిరి. అచ్చటను స్నానమొనర్చి సాయంకాలమునకు తిరిగి తమ
నివాస స్థలమగు ఉదుంబర వృక్ష సమీపమునకు శిష్య సమేతముగ వచ్చిచేరిరి. ఇట్లు కొంతకాలము జరిగెను. అప్పుడు స్వామివారు ఇచ్చట నా కీర్తి
వ్యాప్తమయ్యెను. నేనీక్షేత్రము వదలి
మరియొకచోట గుప్తముగ నుండుట సమంజసమని భావించి అచ్చట నున్న అమరేశ్వరుని సమాధానపరచి ఆ
క్షేత్రము విడిచిపోవనుద్యుక్తులుకాగా అచ్చనున్న యోగినీ గణములు స్వామివారి
సంకల్పమును గ్రహించి స్వామీ! నిత్యము మీ దర్శనముచే మా తాపములన్నియు
నశించుచున్నవి. మమ్ములనుపేక్షించిపోవుట
ధర్మమా! అని దీనత్వముతో పలుక
భక్తవత్సలుడగు స్వామివారు ఆ యోగినీ గణములతో నిట్లనుచుండిరి.
నేను వెళ్ళినను ఈ ఉదుంబరమే నాకు నివాస స్థానము. ఇచ్చట అప్రకటముగా నుందును. ఇచ్చట ఎవరు వచ్చి ఈ ఉదుంబర వృక్షమున నన్ను
పూజింతురో వారికి మీరు గూడను సహాయ్యమొనర్చు చుండవలయును. నాపాదుకలనిచ్చట స్థాపించెదను. ఈ ఉదుంబర వృక్షమును, మిమ్ములను పూజించువారి
సర్వకామనలు నెఱవేఱగలవు. ఇచ్చట
అన్నపూర్ణను స్థాపించుచున్నాను.
కాననీక్షేత్రమున నిరంతరము బ్రాహ్మణ సమారాధనలు జరుగుచుండును. ఇచ్చటనున్న
పాపనాశనము, కామ్యతీర్థము, సిద్ధతీర్థములందు స్నానమొనర్చి ఏడు పర్యాయములు ఈ
ఉదుంబర వృక్షమును ఎవ్వరు ఉదకముతో తడుపుదురో అట్టి వారికి వంధ్యాత్వము తొలగి
దీర్ఘాయుష్మంతుడగు పుత్రుడు కలుగును. ఇచ్చట స్నానమాత్రముచే బ్రహ్మ హత్యాది మహా పాతకములు నశించును. సూర్య చంద్ర గ్రహణములు సంక్రాంతి మొదలుగాగల
పుణ్యకాలములయందు ఇచ్చట తీర్థముల స్నానమొనర్చినవారికి అశ్వమేథయాగము కన్న అధిక ఫలము
లభించును. అమావాస్య, సోమవారము, వ్యతీపాతయను పుణ్యకాలములయందు ఇచ్చట తీర్థముల స్నానమొనర్చిన వారికి వెయ్యి కపిల
గోవులను గంగాతీరమునున్న నొక సద్బ్రాహ్మణునకు దానమొసగిన ఫలము లభించును. ఒక బ్రాహ్మణునికి ఇచ్చట అన్నదానమొనర్చిన వారికి
కోటి బ్రాహ్మణులను తృప్తిగా భుజింపచేసిన ఫలము వచ్చును. ఈ ఉదుంబర వృక్షమూలమున చేయబడిన జపహోమతర్పణములు
కోటి గుణితములగును. ఒక పర్యాయము
నిశ్చలమైన చిత్తముతో నాపాదుకలకు ఏక రుద్రాభిషేకము చేయువారు అతి రుద్రము చేసిన
ఫలమునొందగలరు. మందగతిగ ఈ వృక్షమునకు, పాదుకలకు ప్రదక్షిణమొనర్చినవారు అడుగడుగునకు వాజపేయ
క్రతు ఫలమునొందుదురు. లక్ష పర్యాయములు ఈ వృక్షమునకు ప్రదక్షిణమొనర్చినవారికి
కుష్టురోగము నశిచును. అంగహీనులకు
అంగవైకల్యము కూడ పోవును. నేను లోక
దృష్టికి ఇచ్చటనుండి భీమ అమరజానదీ సంగమమున నున్న గంధర్వ నగరమునకు
పోవుచున్నాను. కానీ గుప్తముగ నిచ్చటగూడ
నుండుదును. చింతింపకుడని వారల నోదార్చి అంతర్హితులయిరి. అయినను గురునాధుడు సర్వగతుడగుటచే ఈ అమరపుర క్షేత్రమున
నుండియే నున్నారు. గురుమూర్తి చరిత్రము కామధేనువు వలె భక్తితో
శ్రవణమొనర్చినవారికి సర్వాభీష్టముల నొసంగ సమర్థము. కావున భావికులగు ప్రతివారును స్వామివారిని
సేవించి వారి వారి అభీష్ట సిద్ధి నొందుదురు గాక.
ఇది గురుచరితమున పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము
శ్రీ గురు చరితము
ఇరువదియవ అధ్యాయము
ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః ఓంజయ జయ శ్రీ నృసింహ సరస్వతి ఓం
శ్రీ గణాధిపతయే నమః
నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి చేతులు జోడించి ఇట్లు
ప్రశ్నించుచుండెను. స్వామివారు
గంధర్వనగరమును గూర్చి వెళ్లియు ఆ అమరపురమున ఉదుంబర సమీపమున అదృశ్య రూపమున ఉండియే యున్నారని మీరు
చెప్పియుంటిరి. స్వామివారు ఆక్షేత్రమును వదలి వెళ్లిన తరువాత నెవ్వరయిన అచ్చట
స్వామివారిని సేవించి ఫలప్రాప్తి నొందిరా! దయచేసి సెలవిండని ప్రార్థించెను.
అప్పుడు సిద్ధమున ఇట్లు చెప్పుచున్నాను.
గురులీలల పూర్తిగ
వర్ణించి చెప్ప నెవ్వరితరము. అయినను నీకు నిదర్శనముగ అచ్చట జరిగిన నొక
వృత్తాంతమును నీకు చెప్పుచున్నాను. సమూహితుడవయి వినుము. శిరోళ అను గ్రామము గలదు. అచ్చట వేద శాస్త్రసారంగతుడైన
గంగాధరుడను నొక బ్రహ్మణుడు కలడు. అయనకు సుశీలయను పతివ్రతయగు భార్య కలదు. వారికి
అయిదుగురు పుత్రులు పుట్టుటయు మరణించుటయు సంభవించెను. ఎందరో దేవతల నారాధించిరి
గాని వారికి నెట్టిఫలము లేకపోయెను. వ్రతములను ఉపవాసములను గూడ నాచరించిరి. ఏమియు
లాభము లేకపోయెను. అప్పుడా బ్రాహ్మణుని భార్య పుత్రశోకముచే పీడింపబడి కర్మవిపాకమును
చెప్ప సమర్థుడయిన నొక బ్రాహ్మణుని సమీపించి పుత్ర దుఃఖము కలుగులకు కారణమేమని
ప్రశ్నించెను. అప్పుడా బ్రాహ్మణు డిట్లు చెప్పుచుండెను. ఎవ్వరు గర్భపాతమొనర్తురో, పరద్రవ్య మపహరింతురో, గోవులగాని అశ్వములనుగాని హింసింతురో అట్టివారు రాబోవు
జన్మమున వంధ్యలగుదురు. ఒక వేళ పుత్రులు పుట్టినను మరణింతురు. నీవు పూర్వజన్మమున
శౌనక గోత్రుడగు నొక బ్రాహ్మణునివలన నూరురూప్యముల నప్పుగాగొని అతడెంత అడిగిను నీవు తిరిగి ఇవ్వనందున
ద్రవ్యలోభముచే నతడాత్మహత్య చేసికొని పిశాచమయ్యెను. అతనే నీసంతానమును హింసించుచున్నాడు. చేసిన కర్మ భోగముచేతనే
క్షయించును. అని చెప్ప నామె కడు భిన్నురాలయి జన్మాంతరమున తానొర్చి పాపమునకు
పశ్చాత్తాపమునొంది ఆ బ్రాహ్మణునకు నమస్కరించి చేతులు జోడించుకొని స్వామీ!
మహాపాపిని. నేను చండాలురాలను. విషము
భక్షింతిని. తమరు దయయుంచి నాపాపము శమించుట కెద్దయిన ఉపాయమున్న సెలవిండని
ప్రార్థించెను. అప్పుడా బ్రాహ్మణుడు నీనిమిత్తముగ చచ్చిన బ్రాహ్మణుడు
పిశాచమయ్యెను. అతనికి వంశీయులు లేక పోవుటచేత కర్మయు జరిగి యుండలేదు. కాన నీవు అతనినుద్ధేశించి ప్రేతకర్మ
నాచరించుచు. అతని ద్రవ్యమును నీవపహరించితివి గాన ఆగోత్రీయుడగు బ్రాహ్మణునకు అంత
ద్రవ్యము నొసంగుము. కృష్ణా నదీతటమున
పంచగంగా సంగమమున ఒక నెలరోజులు గురుమూర్తి పాదుకల నారాధించుము. ఆస్థానము పరమపావనము.
అట్లొనర్చితివేని శ్రీనృసింహసరస్వతీ స్వామివారు అనుగ్రహమువలన నీదోషములన్నియు
నశించుటయేగాక నీకు పూర్ణాయుష్మంతుడగు పుత్రుడు కలుగగలడు అని చెప్పెను. అప్పుడామె
ఆబ్రాహ్మణునితో అయ్యా! నేను కడు బీదరాలను నూరు రూప్యములు నాకెచ్చటనుండి దొరకగలవు.
మీరు చెప్పినటుల నెలరోజులు ఆక్షేత్రమున నియమముతో శ్రీ గురుమూర్తి యొక్క పాదుకల
సేవించెద. అని చెప్ప బ్రాహ్మణుడును అందులకు సమ్మతించెను. అప్పుడామె సంతోషముతో నా
క్షేత్రమునకు వెళ్లి సంగమమునకు పాపనాశమునకు కామ్యతీర్థమునను స్నానమొనర్చి ఏడు
పర్యాయములు కలశముతో ఉదకమును తెచ్చి ఉదుంబర వృక్షమును తడపి శ్రీగురుపాదకుల భక్తితో
పూజించి ఉపవాసనియముతో ప్రదక్షణముచేయుచుండెను. ఇట్లు మూడు రోజులు గడచెను. మూడవరోజు
రాత్రి స్వప్నమున ఆమెకు పిశాచము కనబడి, నాద్రవ్య మపహరించి నీ విచ్చట ప్రదక్షణల చేయుచుంటివా! నీ వంశనాశనము చేసెద. నా
ద్రవ్యమిమ్ము. నిన్ను సంహరించెదనని ఆమెమీద పడబోగా ఆమె భయముతో లేచి ఆమేడిచెట్టును
మీపించెను. అచ్చట గురుమూర్తి ఆమెకు ప్రత్యక్షముగ కనపడ ఆమె వారి చాటునకుపోయెను. అప్పుడు స్వామివారు ఆమెకభయమిచ్చి నా భక్తురాలగు
ఈమెను ఎందుకు హింసించుచున్నావు?
అని ఆ
పిశాచమును ప్రశ్నించ ఆ పిశాచము స్వామీ ఈమె జన్మాంతరమున నా ద్రవ్యమపహరించెను. అందుమూలమున నేను మరణించుటయు పిశాచమగుటయు
సంభవించెను. మీరు యతీశ్వరులు. ఇట్టి మీకు నా శత్రువగు ఈమెయందు పక్షపాతము
చూపుట ధర్మము కాదు. అనగా స్వామివారు
కోపించి ఓరీ! నిన్ను శిక్షించెదను. ఆమె
జోలికి పోకుము. నేను చెప్పినటుల
ఆచరించితివేని నీకును ఈ పిశాచత్వము తొలిగి సద్గతి లభించగలదు. ఆమెకు శక్యమయినంత ద్రవ్యము నిన్నుద్దేశించి
దానముచేయును. అంతమాత్రమున తృప్తినొందుము. లేనిచో వెళ్ళిపొమ్ము నా భక్తురాలగు ఈమెను
నేను రక్షించెదనని చెప్ప ఆపిశాచము వారి దర్శనమాత్రముచే మనశ్శాంతి నొంది స్వామీ నా
అపరాధమును క్షమింపుడు. మీ యాజ్ఞకు నేను బద్ధుడను. నాకీ పిశాచత్వము లేకుండ జేయుడని
ప్రార్థించెను. అప్పుడు స్వామివారు ఈమె పదిదినములు నీసద్గతి కొరకు కర్మనాచరించును.
అందుచే నీకు పిశాచత్వము తొలగును. అని చెప్పి ఆమెతో అమ్మా నీకు ఉన్నంత ద్రవ్యముతో ఈ
ప్రేతము నాద్దేశించి కర్మనాచరింపుము. నీకు
బ్రహ్మ హత్యాదోషము నశించును నీకు పూర్ణాయుష్మంతులగు పుత్రికాపుత్రులు పుట్టెదరు.
ఇచ్చటి అష్టతీర్థముల స్నానమొనర్చి ఉదుంబర వృక్షమునకు నిత్యము ఏడు పర్యాయములు
నీరుపోసి నాపాదుకల నారాధించుము. నీ మనోరథము నెరవేరును. అని చెప్పి స్వామివారు
అదృశ్యమయిరి. ఆమెయు గురుమూర్తి చెప్పినటుల ఆచరించెను. పిశాచము సద్గతినొందెను.
ఆమెకు బ్రహ్మహత్యా పాతకము నశించెను. ఒక రోజున ఆమెకు స్వప్నమున స్వామివారు
దర్శనమిచ్చి రెండు నారికేళ ఫలముల నామె యొడిలోనుంచి నీవ్రతము సమాప్తమయ్యెను. ఈ
ఫలముల భక్షించుము. నీకు సంతానవృద్ధి కలుగగలదు. అని సెలవిచ్చి అంతర్థాన మొందిరి.
ఆమె మెలకువనొంది భర్తతో స్వప్నవృత్తాంతమును చెప్పి ప్వామివారిచ్చిన ఫలముల భక్షించి
వ్రతసమాప్తి గావించి తమ గ్రామమునకు తిరిగి వచ్చెను. గురు కృపచే ఆమె గర్భవతి అయ్యెను. నవమాసములు నిండ ఇద్దరు పిల్లలు
జన్మించిరి. బాలురకు ఎనిమిది సంవత్సరములు
రాగా వారిద్దరిలో జ్యేష్టునకు ఉపనయనము రెండవ వానికి చౌలకర్మ జరుప
ముహూర్తమేర్పరచుకొనిరి. తగిన
సంబారములన్నియు సమకూర్చుకొనిరి. రేపు
ముహూర్తమనగా దైవ వశమున ఆ ఇద్దరిలో పెద్దవాడు వ్యాధిగ్రస్తుడయ్యెను. ధనుర్వాతముచే అతని అవయవములన్నియు బిగిసిపోయి
మూడు దినములట్లే బాధనొంది మూడవ రోజు రాత్రి మృతుడయ్యెను. అప్పుడు తల్లి కడు దుఃఖముతో శిరమును
వక్షస్థలమును బాదుకొనుచు నేలమీద పడి పొర్లుచు కంటికి కడవెడుగా కన్నీరు కార్చుచు
పిల్లవాని శవముమీద పడి బాలుని గుణముల స్మరించుచు భోరున ఏడువ సాగెను. నాయనా కుమారా! ఎచ్చటకు పోతివి? నేనేమి చేయుదును.
నీ ముద్దు మాటల నేనెట్లు మరువగలను? ఎంతో మంది పిల్లలు మరణించినను నీవు గర్భమున పడిన నాటినుండియు
ఆ దుఃఖమును మరచిపోయితిని. గురుమూర్తి
వరమొసంగెను. దీర్ఘాయుష్మంతుడగు పుత్రుడు
పుట్టెనని విశ్వసించితిని. నీవు
వార్ధక్యమున మమ్ముల కాపాడగలవని ఎంతయో ఆశ పెట్టుకొంటిని. అట్టి మమ్ముల అనాధలచేసి పోవుట ధర్మమా అని
నానాప్రకారముల విలపించుచుండ చుట్టు ప్రక్కల వారందరునూ ఆమెను సమీపించి అమ్మా దైవము
నెవ్వరు తప్పించగలరు. లలాటమున లిఖితమగు
బ్రహ్మ లిఖితమును మార్చ నెవ్వరి తరము.
అవతారములే స్థిరము కానప్పుడు మానవులమగు మనజీవితమెంత శాశ్వతము. దుఃఖించిన ఏమి ప్రయోజనము. అని ఎంత ఓదార్చిననూ ప్రయోజనము లేకపోయెను. అప్పుడామె వారితో నేను అమరపురమున నృసింహ
సరస్వతీ స్వామివారిని ఆరాధించితిని. వారు
నాకు రెండు ఫలములనొసంగి నీకు దీర్ఘాయుష్మంతులయిన సంతానము కలుగగలదని
వరమిచ్చిరి. వారి వాక్యమే వ్యర్ధమయినచో
నేను జీవించి ఏమి ప్రయోజనము. ఈ బాలుని తోడ
నేనును నాప్రాణములర్పించెద. అనిచెప్పి
స్వామివారిని స్మరించి స్వామీ నాకింత బాధ కలిగించుచున్నారా? మీ వాక్యము సత్యమనియు మీరు సత్య సంకల్పులనియు నమ్మి
విశ్వసించితిని. మీరు విశ్వాస
ఘాతమొనర్చితిరి. మీరు త్రిమూర్తి
స్వరూపులని నమ్మితిని. నన్ను రక్షించ
సమర్ధులుగాని మీరు ధ్రువుని, విభీషణుని వారి వారి అభీష్టములనొసంగి రక్షించితిరని
నమ్ముట ఎట్లు? నన్ను మీరు ఎందులకు ఉపేక్షించితిరి? ఎంతో మంది మీ పాదుకల నర్చించుచున్నారు. అట్లొనర్చువారికి మీరు అభీష్టములిచ్చెదరు. అని నమ్మితిని. నాకు తగిన శాస్తి అయ్యెను. నీవు విశ్వాసఘాతకుడవని తేలినది. ఇక మీదట మిమ్మల నెవ్వరు విశ్వసింతురు?
బ్రహ్మ
హత్యా దోషముచే పీడింపబడి మిమ్ముల శరణునొందితిని.
ప్రధమమున అంగీకరించి ఇప్పుడు విడనాడితిరి.
ఒక గోవు వ్యాఘ్ర భయముచే పరుగెత్తి వచ్చి ఒక యవనుని గృహము ప్రవేశించ
వాడద్దానిని హింసించినటుల నాగతియు అయ్యెను.
దేవుని దర్శించ నొక దురదృష్టుడు దేవాలయములోనికి పోవుచుండ ఆ దేవాలయమే విరిగి
వాని మీద పడినట్లయ్యెను. ఓ గురుమూర్తీ!
నాగతి ఇట్లయ్యెనని అమె దుఃఖించుచుండ ఇంతలో తెల్లవారెను. గ్రామములోని బ్రాహ్మణులందరు వచ్చి ఎందుకు
దుఃఖించెదవు? మూర్ఖత్వమును విడనాడుము.
బాలుని శవమిమ్ము. నదీతీరమునకు
సంస్కారమునకు తీసికొనిపోయెదమనిరి. ఆమె
అప్పుడు ఆ శవమును గట్టిగా తన పొట్టకు వస్త్రముచే కట్టుకొని ఆ బాలునితోకూడ నన్నును
కాల్చివేయుడు అని చెప్పుచు బాలుని శవమును వారలకివ్వకపోయెను. అందరును ఆమె మూర్ఖత్వమునకు వింతపోవుచు
చూచుచుండిరి. ఇంతలో మధ్యాహ్నకాలమయ్యెను.
గ్రామస్థులందరు అచ్చటకు సమకూడిరి. కాని
ఎవ్వరును ఆమె మనస్సునకు సమాధానము చెప్పరయ్యిరి.
అదే సమయమున ఆమె దృఢ భక్తికి మెచ్చి భక్తవత్సలుడయిన శ్రీ నృసింహ సరస్వతీ
స్వామివారు ఒక బ్రహ్మచారి రూపమున నచ్చటకు వచ్చిరి. వారు ఆమెను గూర్చి చేయు హితబోధ పై అధ్యాయమున
శ్రోతలు వినగలరు.
ఇది గురుచరితమున ఇరువదియవ అధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
ఇరువదిఒకటవ అధ్యాయము
ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః ఓం శ్రీ గురుమూర్తయే నమః ఓం శ్రీ గణాధిపతయే నమః
దుఃఖించుచున్న
ఆబ్రాహ్మణస్త్రీని ఆ బ్రాహ్మచారి సమీపించి ఇట్లు చెప్పుచుండిరి. అమ్మా
మూర్ఖురాలవయి ఎందులకు దుఃఖించెదవు. ఈ సంసారము క్షణభంగురము. పుట్టినదెవరు? చచ్చినదెవరు? శరీరములు జలబుద్పుదముల (నీటిబుడగలు) వలె కర్మవశమున
పంచభూతముల సంయోగముచే జన్మించును. అట్టి కర్మ క్షయించగా నవి నశించును.
మాయాపాశములోపడి పంచభూతవికారమయిన దేహమును పుత్రుడని భార్యయని భర్తయని సోదరుడనియ
తలతురు. సత్వరజస్తమో గుణములలో,
సత్వగుణమును
బట్టి దేవత్వము, రజోగుణముచే మనుష్యత్వము
తమోగుణముచే పశుపక్ష్యాది నీచజన్మప్రాప్తియు ఆత్మకు ఘటించుచుండును. వారివారి కర్మననుసరించి
సుఖదుఃఖముల నెంత వారును అనుభవింపక తప్పదు. మాయాపాశబుద్ధులయి జీవులు
కర్మానుభవమునొందుదురు. కల్పాంతము జీవించు దేవతలకు సహితము కర్మానుభవముతప్పదు.
మానవులమాట చెప్పనేల. జీవుడు దేహము మీద నాధారపడును. దేహము కాలాధీనముయి యుండును. కాలము కర్మకధీనమయి
నడచును. కర్మానురూపముగ ప్రతిదేహధారియు పుట్టుట, పెరుగుట,
నశించుట
మొదలగు వికారముట నొందుచుండును. ఇట్టిదేహము ప్థిరమని నమ్మరాదు. కాననే వివేకము
గలవారు ఒకరు జన్మించిన సంతోషమునుగాని మరణించిన దుఃఖమునుగాని పొందరు. ప్రతి వారికి
పుట్టుటకు పూర్వము దేహము లేకుండెను. మరణించిన తిరిగి అదృశ్యమగును. మధ్యన
కొలదికాలము మాత్రమే గోచరించును. ఇట్టి దేహము స్వప్నశరీరమువలె నస్ధిరమనియు, కల్పితమనియు భావించవలయును. కర్మననుసరించి కొందరు
బాల్యముననే మరణించెదరు. కొందరు యౌవనమున మరికొందరు వృద్ధాప్యమున మరణింతురు వారివారి
పూర్వార్జితముమీద వారివారి జీవిత మాధారపడియుండును. నిజమిట్లుండ నెవ్వరు
మాయాపాశములోపడి నాతండ్రి, నాతల్లి,
నాకుమారుడు
నాసోదరుడు అను వ్యామోహములో నుందురోవారు మూఢులని తెలియనగును. రేతస్సుయొక్కయు రక్తముయొక్కయు సమ్మేళనను జన్మించిన ఈదేహము
బాహ్యమునకు మనోహరముగ కనబడినను అసహ్యములగు మలమూత్రములు, మాంసము,
ఎముకలు, మొదలగు పదార్థములచే నిండియుండును. ఇట్టిదేహమును
స్థిరమని తలచుట ఎట్లు? కాలమును జయించ నెవ్వరికిని తరము గాదు. స్వప్నమందు కనపడిన పదార్థమును గూర్చి మెలుకువ
నొందినతరువాత లేదని ఎవ్వరయిన
దుఃఖపడుదురా! వివేకి అయిన వాడెవ్వడు ఇంద్రజాలమువలె నస్ధిరమగు దేహమును
స్థిరమని నమ్మజాలడు. నీకు ఇంతకు పూర్వము ఎన్నిజన్మములు గడచెనో! ఆయా జన్మలయందు
ఎంతమందికి తల్లివైతివో ఎంతమందికి భ్యావయితివో! వారల కోసము నీవు దుఃఖించుచుంటివా!
అట్లె ఈబాలుని యందును మమకారమును విడనాడుము. గ్రామస్థులు ఈశవమునకు శాస్త్రరీతిని
సంస్కారమొనర్చెదరు. అని ఆబ్రహ్మచారి చెప్ప ఆమె వారి వాక్యములువిని తిరిగి వారితో
నిట్లనుచున్నది.
స్వామీ! మీరు కరుణతో
నాకు తత్త్వమునుపదేశించితిరి,
మీరు
చెప్పినదంతయు నిజమేగాని నామనమున అట్టి తత్త్వము నిలువకున్నది. మీరు ప్రారబ్ధమునకు
బలముచెప్పుచున్నారు. ప్రారబ్ధమే ఎంతవారికి తప్పక ననుభవించవలసియున్నచో ఇక ఈశ్వరుని భజించనవసరము లేదు. ఒకడు జ్వరముచే
పీడించిబడి వైద్యుని సమీపించి అతనివలన తగిన ఔషధమును స్వీకరించి ఆరోగ్యము నొందుట
చూచుచున్నాము. ఎవరికైన ఆపద వచ్చినపుడు
సమర్ధులయిన వారిని శరణు పొందుటయు వారివలన తమ ఆపత్తును తొలగించుకొనుటయు మనము లోకమున
చూచుట లేదా? అట్లే నేనును పూర్వము దైవహీనురాలనయి త్రిమూర్తి స్వరూపుడగు
నృసింహ సరస్వతి స్వామివారిని శరణు పొందితిని.
వారి వలన వరము నొందితిని. అప్పటి
నుండియు నిశ్చింతగ నున్నాను. స్వామివారి
వాక్యమును విశ్వసించిన నన్ను మూర్ఖురాలనుగ మీరెట్లు చెప్పగలరు?
స్వామి
నాకు విశ్వాస ఘాతమొనర్చెను. కాన
నిట్టికీర్తి వారలకు రాగలందులకుగాను
వారినుద్దేశించి ఈ దేహమును త్యజించ
సమకట్టితిని అని సమాధానము చెప్పెను. ఆమె వాక్యమును విని ఆమె దృఢ భక్తికి మెచ్చుకొని
ఆమెతో నిట్లనిరి. అమ్మా స్వామివారియందు
అట్టి దృఢవిశ్వాసము నీకున్నచో నిక్కడ నేడ్చి ఏమి ప్రయోజనము. ఎచ్చట నీకు స్వామివారు వరమొసగిరో అట్టి పంచనదీ
సంగమమున నున్న ఉదుంబర వృక్షము వద్దకు నీబాలుని కళేబరమును కొనిపోయి వారి
పాదములందుంచుము. అని చెప్పి బ్రహ్మచారి
వెళ్ళిపోయిరి. ఆమెయు వారి వాక్యములు విని
వారు చెప్పినటుల పిల్లవాని శవమును తన వస్త్రములో కట్టుకొని భర్తతో సహ ఉదుంబర
వృక్షమును సమీపించి అచట బాలుని శవమునుంచి పట్టరాని కోపముతో తన శిరమును ఆ పాదుకలకు
వేసి కొట్టుకొనెను. ఆమె రక్తముచే పాదుకలు
కూడ తడసెను. పుత్రశోకము అన్ని దుఃఖము కంటె
అధికము. అది క్షయరోగము వంటిది. ఆమె అచ్చట విలపించు చుండెను. ఇంతలో
గ్రామస్థులందరు వచ్చి అమ్మా దుఃఖించి ఏమి ప్రయోజనము? సూర్యుడు
అస్తమించుచున్నాడు. ఈ అరణ్యమున రాత్రి
కాలమున మనుష్యులెవ్వరు ఉండజాలరు.
శవమునిమ్ము. సంస్కరించెదము అని
అనేక విధముల బ్రతిమిలాడినను వారి మాటల నామె పెడచెవిని పెట్టి శవమునీయక అట్లే దుఃఖించు చుండెను. అప్పుడు గ్రామస్థులందరు ఈమె మన మాట వినుట
లేదు. మనమిచ్చట నుండుట తగదు. రేపటి దినమున ప్రాతఃకాలమున వచ్చెదము. రాత్రి శవము దుర్గంధముచే వ్యాప్తమగును. అప్పుడు తప్పక ఇచ్చివేయును. అని అనుకొని వారి గృహములకు వెడలిరి. రెండు
దినములనుండియు ఆ దంపతులకు దుఃఖముచే నిద్రలేకుండెను. ఆ రాత్రియు మూడు ఝాములు గడిచెను. అప్పుడకస్మాత్తుగ ఆమెకు నిద్ర వచ్చెను. స్వప్నమున జటాధారి అయి, భస్మవిభూషితుడయి రుద్రాక్షమాల ధరించి వ్యాఘ్రచర్మపరిధానుడయి
హస్తములయందు యోగ దండమును, త్రిశూలమును
ధరించి స్వామివారు దర్శనమిచ్చి ఆమెతో అమ్మా నన్ను ఊరక ఎందులకు
తిట్టిపోయుచున్నావు? నీకుమారునకు చికిత్స చేయ వచ్చితిని. మరణించుట అన ప్రాణవాయువు పోవుటయే కదా. నోరు తెరువుము ప్రాణము పోసెదనని చెప్పి కొద్ది
భస్మమును ఆ శవము మీద చల్లిరి. ఇంతలో ఆమెకు
మెలకువ వచ్చెను. భయభీతురాలయ్యెను. ఇది భ్రాంతియా! మరణించినవారు బ్రతుకుట ఎందైన కలదా?
మన
ప్రారబ్ద మిటులుండ దేవుడేమి చేయును. మనము
మెలకువగా ఉన్నప్పుడేమి అనుకొందుమో అదియే స్వప్నమున కనబడును. మూర్ఖురాలనయి
అజ్ఞానముతో స్వామివారియందు దోషమునారోపించితిని అని పరి పరి విధముల చింతించుచు ఆ
శవమును కొంచెము దూరమగ నుంచెను. అంతలో ఆ
బాలుని శరీరమందు చైతన్యము ప్రవేశించెను.
అవయవములు కదలసాగెను. ఇది ఏమి !
భూతావేశమా! అని ఆమె శకించు చుండ బాలుడు లేచి కూర్చొని అమ్మా ఆకలి అగుచున్నది. అన్నము పెట్టుమని అడుగుచు ఏడవ సాగెను. వెంటనే ఆమెకు స్తనములనుండి క్షీరము స్రవించెను. అప్పుడామె సందేహము విడనాడి బాలునెత్తుకొని
స్తన్యమిచ్చెను. వానిని తీసికొని భర్తను
సమీపించి జరిగిన వృత్తాంతమంతయు చెప్పెను.
అప్పుడు దంపతులు ఉదుంబర వృక్షము వద్దకు వచ్చి ప్రదక్షిణమొనర్చి సాష్టాంగముగ
నమస్కరించి ఇట్లు స్తుతించిరి.
ఓ త్రిమూర్తి స్వరూపా! జయ !జయ! నీవు భక్త వత్సలడవు. విశ్వతారకుడవు. నీ మహిమ వర్ణించ నెవ్వరికి తరము కాదు. మా అపరాధముల క్షమించుడు. బాలుడు కోపము వచ్చినప్పుడు తన తల్లిని కఠోరముగ
తూలనాడును. అటులనే మేముగూడ కష్టకాలమున
నోటికి వచ్చినటుల మిమ్ము దూషించితిమి. మా
అపరాధముల మన్నించి రక్షించుడు. మీరే మాకు
శరణ్యము అని ప్రార్ధించి బాలునితో సహ కృష్ణా నదిలో స్నానమొనర్చి ఆ నీటితో,
రక్తముతో
తడసిన స్వామివారి పాదుకల, ప్రక్షాళనమొనర్చి
ఉదుంబర వృక్షమూలమున దీపమాలికలనర్పించి
శమీపత్రముల చేతను, ఇంక ననేక పుష్పముల
చేతను స్వామివారి పాదుకల పూజించి నీరాజనమిచ్చిరి.
ఇంతలో తెల్లవారెను. గ్రామస్థులు ఆ
బాలుని శవమును సంస్కరించ వలయునను భావముతో నచ్చటకు వచ్చి బాలుడు జీవించి
ఆడుకొనుచుండుట చూచిచ విస్మితులయిరి.
నామధారకా! శ్రీ గురుస్థానము యొక్క మహిమ వింటివికదా!
గురుమూర్తి సర్వకాలముల యందును ఉదుంబర వృక్షమూలమున నుందురు. వారిని ఆరాధించుటచే భక్తుల మనో రధములన్నియు
నెరవేరును. వంధ్య పుత్రవతి యగును. దరిద్రుడు శ్రీమంతుడగును. రోగపీడితులు ఆరోగ్యవంతులగుదురు. అపమృత్యు బాధలు తొలగును. భక్తి భావముతో గురుమూర్తి పాదుకల నెవరు
పూజింతురో వారి కోరికలను గురునాధుడు పూర్తి చేయును. అంగహీనుడు, కుష్ఠు రోగముతో బాధపడు వారు అంగవైకల్యము పోయి సువర్ణ దేహము
గలవారు కాగలరు. హృదయ శూల, గండమాల, అపస్మారము మొదలగు రోగములు సహితము పాదుకల నర్చించుటచే నుపశమించును. ఉదుంబర వృక్షము కల్ప వృక్షము గాన అట్టి
వృక్షమును పూజించుటచే మందమతులు,
మూగవారు, కుంటివారు మొదలగు వారు వారి వారి వైకల్యముల
పోగొట్టుకొందురు. ఇట్లెంత వర్ణిచి
చెప్పగలను. గురుచరిత్రము కేవలము
కామధేనువు. ఇట్టి గురు చరిత్రమును
శ్రద్ధతో వినువారు సర్వాభీష్టముల నొందగలరు.
అని సిద్ధముని నామధారకునితో చెప్పెను.
ఇది గురుచరితమందలి ఇరువరియొకటవ అధ్యాయము సమాప్తము.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి