భాగవత పురాణ రచనా కారణము
ద్వాపరయుగ అంతములో ఉపరిచర వసువుకు వాసవి అను పేరుగల సత్యవతికి విష్ణువు అంశతో జన్మించిన వ్యాసుడు ఒక్కనాడు బదరికాశ్రమములో సరస్వతీ నదీ తీరములో స్నానాది నిత్య కర్మలు ఆచరించి ఒక సూర్యోదయ వేళ ఒంటరిగా కూర్చుండి భూత భవిష్యద్వర్తమానజ్ఞుండయిన ఆ ఋషి అవ్యక్తమయిన కాలవేగానికి లోకంలో యుగధర్మాలు సాంకర్యం చెందుతాయనీ, పాంచభౌతిక దేహులు శక్తి విహీనులగుదురనీ, పురుషులు నిస్సత్తువులు, ధైర్య శూన్యులూ, మంద ప్రజ్ఙులూ, అల్పాయువులూ, దుర్బలులు అయ్యెదరనీ, తన దివ్య దృష్టితో గ్రహించి సర్వాశ్రమములకూ హితము చేయదలచి, వైదిక కర్మలూ యజ్ఙములూ అవిచ్ఛిన్నముగా సాగడం కోసం ఒక్కటిగా ఉన్న వేదాన్ని విభజించి, పంచమవేదమమైన ఇతిహాస పురాణాలను రచించెను. వ్యాసుని శిష్యులు ఆ వేదాన్ని అధ్యయనం చేయసాగారు. వారి శిష్య ప్రశిష్యులు వేదాలనూ, పురాణేతిహాసాలనూ అధ్యయనం చేయసాగారు. ఇట్లు మేధావిహీనులయిన పురుషులచేత వేదంబులు ధరియింపబడుచున్నవి. స్త్రీ శూద్ర త్రైవర్ణికాధములచేత వేదములు ధరియింప బడుతున్నవి. సర్వమానవ శ్రేయస్సు కొఱకై వేదార్ధభావముల అంతా కూర్చి, పంచమవేదమని ప్రసిద్ధి చెందిన, మహాభారతమునుమరియు దీనవత్సలుడయిన వ్యాసుడు రచించినాడు. అయినప్పటికీ వ్యాసుని మనస్సు సంతసించలేదు. అందువల్ల వ్యాసుడు వ్యాకులపడి తన అసంతుష్టికి కారణం ఏమిటా అని ఆలోచించసాగాడు. కానీ, హరికీ, యోగివరులకు అభిలషితంబయిన భాగవత స్వరూపాన్ని చెప్పలేదు అని విచారించెను.
ఆసమయంలో ముల్లోకాలలో ప్రసిద్ధిచెందినవాడూ, నిఖిల శాస్త్ర పురాణ విశారదుడూ, నిరంతర నారాయణ స్మరణపరాయణుడు అయిన నారదముని అక్కడకు విచ్చేశాడు. అలా విచ్చేసిన నారదుణ్ణి చూచి వ్యాసుడు లేచి యథావిధిగా పూజించాడు. అంత వ్యాసుడు నారదుని తన విచారమునకు కారణమేమని ప్రశ్నించాడు. అంత నారదుండిట్లనియె. నాయనా నీవు అశేషాలైన ధర్మములను వెల్డడించావు. అయితే అందులో విష్ణు కధలను సమగ్రంగా వివరించలేదు. ఎన్ని ధర్మాలను వివరించినా శ్రీహరి సంతోషించడు. నీమనస్సుకు ఈ కొఱత రావడం నీ గ్రంధాలలో శ్రీహరి నామసంకీర్తనం ప్రధానంగా లేకపోవడమే. హరినామ సంకీర్తనతో ప్రకాశించే గ్రంథం బంగారు కమలాలతో ప్రకాశించే హంసలతో శోభిల్లే మానససరోవరంలాగా విరాజిల్లుతుంది. హరినామ సంకీర్తన లేని కావ్యం విచిత్రార్ధాలతో కూడినా బురదగుంటలాగా శోభస్కరంకాదు. అప శబ్దాలతో కూడినా పవిత్రమైన హరి చరిత్రతో కూడిన కావ్యాలు సకల పాపాలనూ పటాపంచలు చేస్తాయి. అందువల్లనే, సాధువులూ, తాపసులూ శ్రీహరిని భావిస్తూ, ఆయన లీలలను గానంచేస్తూ, ఆయన నామజపం చేస్తూ ఆయననే కీర్తిస్తూ ధన్యులు అవుతున్నారు. నిర్గతమూ, నిరుపాధికంబైన జ్ఙానము హరిభక్తిలేక శోభిల్లదు. చేసిన పని యొక్క ఫలమును కోఱక ఆకర్మను ఈశ్వరునకు అర్పించకున్న అది శ్రేయస్సును ఇవ్వదు. భక్తిహీనంబయిన జ్ఙానమూ,స్తోత్రమూ, కర్మనిపుణత్వమూ, నిరర్ధకము. కావున నీవు నిఖిల బంధమోచనము కొఱకు వాసుదేవుని లీలావిశేశంబులు భక్తితో వర్ణించుము. వాసుదేవుని వర్ణించకుండా ఇతర వర్ణనలు చేయువాని బుద్ధి ప్రచండవాయువేగానికి ప్రవాహంలో కొట్టుకు పోయే నావలాగా ఒడ్డుచేరలేదు. కామ్య కర్మలందు ఆసక్తులైన మూఢమానవులకు నియతములైన ధర్మములు చెప్పి శాసించడం నీకు తగదు. ఎందుకంటే వారు అదే పరమధర్మమని భావించి జుగుప్సితములైన కామ్యకర్మలకు అలవాటుపడి పరమార్ధాన్ని విస్మరించెదరు. అందువల్ల బుద్ధిమోహము జనించకుండా తగు ప్రతిక్రియ చేయవలసినది.
తన కులానుగతమైన ధర్మాలను ఆచరిస్తూ, గోవింద పద సేవ చేసే పురుషుడు ఈ జన్మలో కాకున్న మరు జన్మలో ఐనా తరిస్తాడు అంతే కానీ విష్ణుసేవా దూరుడైనవాడు ఎన్ని జన్మలెత్తినా తరించడు. కావున జ్ఙాని అగువాడు ప్రయత్నపూర్వక హరి సేవ చేసి తరించాలి. కాల క్రమముగా సుఖ, దుఃఖములు ప్రాప్తించినా హరి సేవ విడువరాదు. ఈవిధంగా హరి సేవ చేసేవాడు జన్మనెత్తినా సంసార సాగరములో చిక్కుపడక, తన పూర్వజన్మ సంస్కారమువల్ల, హరి నామ స్మరణ చేసి తరిస్తాడు.
ఈవిశ్వమంతా విష్ణుమయం. ఈసృష్టిలో విష్ణువుకు అన్యమయినది ఏదీ లేదు. ఆ పరమేశ్వరుని సంకల్పముచేతనే సృష్టి, స్థితి, లయములు ఏర్పడుతుంటాయి. నాయనా నీవు సర్వజ్ఙుడవు. అందువల్ల నీవు శ్రీహరి లీలావతారలలోని విశేషములు స్తుతించి ధన్యుడవు కావలసినది. లోకంలో ఏపదార్ధం వల్ల ఏరోగం వచ్చిందో ఆ పదార్ధంవల్ల ఆ రోగం తగ్గదు. మరొక పదార్ధంతోనే ఆరోగం నశిస్తుంది. అందువల్ల భవబంధ కారణమయిన కర్మల ను ఈశ్వరార్పణము చేయడంతోనే జ్ఙానం సిద్ధిస్తుంది. అందువల్లమాత్రమే ఈశ్వుడు సంతసించును. ఓంకాపూర్వకముగా వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ నామాలు భక్తితో స్మరించి, మంత్రమూర్తియు, మూర్తిశూన్యుడు అయిన యజ్ఙపురుషుని పూజించే పురుషుడు సమదృష్టి కలవాడవుతాడు. కాబట్టి ఓ వ్యాసమహర్షీ! నీవుకూడా శ్రీహరిని స్తుతించు. వినే వారి దుఃఖాలు అన్నీదూరమై వారికి అచల శాంతి లభించేట్లుగా నీవు భాగవత రచన సాగించి వాసుదేవుని యశోగాధలను కీర్తించు. ఈవిధంగా పలికి నారదుడు వీణమీటుతూ వెళ్ళిపోయాడు.
అంత వ్యాసమహర్షి, ఈవిశాల మహీతలంలో ఏ మహాగ్రంధాన్ని విన్నంతమాత్రమే సంసారబంధాలు సమసిపోయి లోకశరణ్యుడైన మాధవునిపై అచంచల భక్తి ఆవిర్భవిస్తుందో అటువంటి లోకకల్యాణకరమైన భాగవతామ్నాయమును నేర్పుతో రచించెను.
కావున శ్రీహరిగుణ కీర్తనమందు ఆసక్తులైన పురుషులు ముల్లోకములకూ కల్యాణ ప్రదమైన భాగవత మహాపురాణ అధ్యయనము చేసి కైవల్యాన్ని పొందవలసినది
ఓం తత్సత్