11, జులై 2024, గురువారం

భయము
భయము అంటే ఏమిటి?  భయము ఎవరికి? మనము మనుషులము కాబట్టి ముందుగా మన భయాలను చర్చిద్దాము. ప్రాణులకు భయమన్నది సహజమైన అనుభూతి. మనకు వున్నది ఏదైనా మన దగ్గర వున్నది ఏదైనా మన నుంచి పోతుందేమోనని భయము.  మన దగ్గర ఏమున్నది?  ప్రాణి పుట్టగానే తనతో ఏమీ తీసుకొని రాదు, వంటి మీద బట్టలతో సహా. తనతో ఏమీ తీసుకొని రాని ఈ ప్రాణికి ఎందుకు భయము? కొంత మందికి ఒక్కరే ఉంటే భయం.  కొందరికి మందిలో ఉంటే భయం.  తరచి చూస్తే ప్రాణికి ప్రాణం పోతుందేమోనని మాత్రమే భయం అసలైన భయం.  జనంలో ఉంటే తొక్కిసలాట  అవుతుందేమోనని  భావం.  మరి ఒక్కరే ఉంటే ఎందుకు భయము.  ఒక రకంగా ఆలోచిస్తే మందిలో ఉంటే వచ్చే భయము కంటే ఒక్కరే ఉంటే వచ్చే భయమే ఎక్కువ.  కానీ ఒక్కరే ఉంటే ఎందుకు భయం?  ఎటునుంచి ఐనా ఏదైనా జంతువు వస్తుందేమో అని, పురుగో పుట్రో వచ్చి కరుస్తుందేమోననీ, అంతిమంగా ప్రాణం పోతుందేమోననీ భయం. ఏదో సినిమా పాటలో చెప్పినట్లు పులిని చూస్తే పులి ఎన్నడు బెదరదు, మేక వస్తే మేక ఎన్నడు బెదరదు. మనిషికి మాత్రమే మనిషిని చూసిన, జంతువుని చూసిన, పాము, పురుగులు వగైరాలను చూసినా భయం.  ఏమీ కనపడక పోయినా భయం.  ఈ భయం ఎందుకన్నదే   ప్రశ్న.  ఈ శరీరమే నేను, ఇది నాది, నాకు ఇది దక్కదేమో, నా నుంచి పోతుండేమో అనే  భావమే కారణము.   మొత్తానికి ఈ భయానికి నేను నాది అనే  ద్వంద్వ భావమే అసలు కారణము అని తెలుస్తోంది. 
మానవుడు తనకున్న ఈ భయాన్ని పోగొట్టుకోవడానికి నిరంతరమూ ప్రయత్నిస్తూనే వున్నాడు. ఇందులో భాగంగానే తనకంటే ఎక్కువ స్థితిలో వున్న దేవీ దేవతలను ప్రార్ధించడం, శ్లోకాలు, మంత్రాలు, చదవడం వగైరా.  లలితా సహస్రనామ స్తోత్రంలో " భక్తి ప్రియా భక్తి గమ్యా భక్తి వశ్యా  భయాపహా""   విష్ణు సహస్రనామ స్తోత్రం లో " సహస్రార్చి సప్త  జిహ్వా సప్తైధా సప్త వాహనః, అమూర్తి రనఘో అచింత్యో భయకృద్  భయనాశనః " ఇలా చాలా స్త్రోత్రాలలో ఈ భయాన్ని పోగొట్టమని దేవీ దేవతలని  అడుగుతున్నాడు మానవుడు. 
అయితే అవధూత గీతలో మొదటి శ్లోకం ఏమి చెబుతున్నది? 
ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసనా
మహద్భయ పరిత్రాణా ద్విప్రాణా ముపజాయతే 

ఆనగా ఈశ్వరుని కృపతో మాత్రమే నేను, నాది అనే ద్వంద్వ భావముల  మహద్భయము నుంచి మానవుడు బయట పడగలడని అవధూత గీతలో దత్తాత్రేయులవారు చెబుతున్నారు. 
కాబట్టి  మానవులు తరించాలంటే నేను నది అనే ద్వంద్వ భావములనుంచి తనను కాపాడమని ఆ పరమేశ్వరుని నిర్మల భక్తితో ప్రార్థించాలి. అప్పుడు ఈశారుడే గురు రూపములో వచ్చి మంకు తరుణోపాయము ఉపదేశిస్తారు. ఇది  ఒక్కటే మార్గము.  
అవధూత  చింతన శ్రీ గురు దేవ దత్త. 
ఓం తత్సత్.



6, జులై 2024, శనివారం

 తత్వ విచారణ

ఆధ్యాత్మ రామాయణము నందు, అరణ్యవాస ప్రారంభములో,  శృంగిబేర పురములో,   కుశపత్రములపై శయనించిన సీతా రాములను చూచి దుఃఖించిన గుహునితో లక్ష్మణుడు ఈవిధముగా తత్వోపదేశము చేసెను. 

సోదరా, నా మాట వినుము.  ఒకని సుఖమునకు గానీ దుఃఖమునకు గానీ వేరెవ్వరూ కారణము కాదు.  మానవుడు పూర్వ జన్మమున చేసిన కర్మమే ఒకరికి సుఖమునకు  కానీ దుఃఖమునకు  గానీ కారణము అగును.     సుఖదుఃఖములకు వేరెవ్వరూ కారణము కాదు. పరులెవ్వరో సుఖదుఃఖములకు కారణము అని తలచుట తెలివి తక్కువ. నేను చేయుచున్నాను   అని ఆనుకొనుట మిథ్యాభిమానము.  ఎందుకనగా జనులు తమ తమ కర్మ పాశములచే కట్టబడి ఉన్నారు.  మానవుడు స్వయముగా కర్మలు ఆచరించి తద్భావానుసారముగా సుహృత్తు, మిత్రుడు, శత్రువు, ఉదాసీనుడు, ద్వేషి, మధ్యస్థుడు, బంధువు మున్నగు వారిని కల్పించు కొనుచున్నాడు. 

కావున మానవుడు ప్రార్తబ్ద కర్మానుసారము సుఖదుఃఖాదులలో ఏది ప్రాప్తించిననూ అనుభవించుచూ ప్రసన్న చిత్తుడై ఉండవలయును. భోగములు వచ్చుట యందు కానీ, పోవుట యందు కానీ ఆపేక్ష ఉండరాదు. భోగములు వచ్చిన రావచ్చు, పోయిన పోవచ్చు. మనము కర్మకు  ఆధీనులము. ఏ దేశమున ఏ కాలమున ఎవ్వడు ఏ శుభాశుభ కర్మలను ఆచరించునో వానిని ఆతడు అవశ్యము అదేవిధముగా అనుభవించవలసి ఉండును. దీనిని ఎవ్వరూ తప్పించ లేరు. 

కావున శుభాశుభా కర్మ ఫలము ప్రాప్తించగానే  హర్షమునో దుఃఖమునో పొందుట నిరర్థకము.   విధాత గతిని ఎవరునూ ఉల్లంఘించలేరు. మానవుడు సదా సుఖ దుఃఖములచే చుట్టబడి ఉండును. మనుష్య శరీరము  పుణ్య పాప ఫలముగా ఉత్పన్నమగుటచే  సుఖ దుఃఖ మయముగానే ఉండును. సుఖము వెంట దుఃఖము, దుఃఖముననుసరించి సుఖము పగలు రేయి వలె జీవులకు అపరిహార్యము.  ఈ రెండూ నీరు, బురద వలె సర్వదా కలసియే  ఉండును.  

కావున విద్వాంసులు అంతా మాయయే అను భావన కలిగి ఇస్తానిష్ట ప్రాప్తి యందు ధైర్యము వహించి హర్ష శోకములను పొందరు.  

ఈవిధమైన  సుఖదుఃఖముల యెడ ఉపేక్షా భావము ఆచరణలో కష్టమే ఐనా, ఈ విధానము తప్ప మరి యే ఇతర పధ్ధతి వల్లనూ జీవుడు ఈ జనన మరణ చక్రములోనుంచి తప్పించుకోలేడు, కావున  సుఖదుఃఖములకు ప్రారబ్ద కర్మమే కారణమని తెలిసి, ఉపేక్షా భావముతో తరించగలరు.