భయము
భయము అంటే ఏమిటి? భయము ఎవరికి? మనము మనుషులము కాబట్టి ముందుగా మన భయాలను చర్చిద్దాము. ప్రాణులకు భయమన్నది సహజమైన అనుభూతి. మనకు వున్నది ఏదైనా మన దగ్గర వున్నది ఏదైనా మన నుంచి పోతుందేమోనని భయము. మన దగ్గర ఏమున్నది? ప్రాణి పుట్టగానే తనతో ఏమీ తీసుకొని రాదు, వంటి మీద బట్టలతో సహా. తనతో ఏమీ తీసుకొని రాని ఈ ప్రాణికి ఎందుకు భయము? కొంత మందికి ఒక్కరే ఉంటే భయం. కొందరికి మందిలో ఉంటే భయం. తరచి చూస్తే ప్రాణికి ప్రాణం పోతుందేమోనని మాత్రమే భయం అసలైన భయం. జనంలో ఉంటే తొక్కిసలాట అవుతుందేమోనని భావం. మరి ఒక్కరే ఉంటే ఎందుకు భయము. ఒక రకంగా ఆలోచిస్తే మందిలో ఉంటే వచ్చే భయము కంటే ఒక్కరే ఉంటే వచ్చే భయమే ఎక్కువ. కానీ ఒక్కరే ఉంటే ఎందుకు భయం? ఎటునుంచి ఐనా ఏదైనా జంతువు వస్తుందేమో అని, పురుగో పుట్రో వచ్చి కరుస్తుందేమోననీ, అంతిమంగా ప్రాణం పోతుందేమోననీ భయం. ఏదో సినిమా పాటలో చెప్పినట్లు పులిని చూస్తే పులి ఎన్నడు బెదరదు, మేక వస్తే మేక ఎన్నడు బెదరదు. మనిషికి మాత్రమే మనిషిని చూసిన, జంతువుని చూసిన, పాము, పురుగులు వగైరాలను చూసినా భయం. ఏమీ కనపడక పోయినా భయం. ఈ భయం ఎందుకన్నదే ప్రశ్న. ఈ శరీరమే నేను, ఇది నాది, నాకు ఇది దక్కదేమో, నా నుంచి పోతుండేమో అనే భావమే కారణము. మొత్తానికి ఈ భయానికి నేను నాది అనే ద్వంద్వ భావమే అసలు కారణము అని తెలుస్తోంది.
మానవుడు తనకున్న ఈ భయాన్ని పోగొట్టుకోవడానికి నిరంతరమూ ప్రయత్నిస్తూనే వున్నాడు. ఇందులో భాగంగానే తనకంటే ఎక్కువ స్థితిలో వున్న దేవీ దేవతలను ప్రార్ధించడం, శ్లోకాలు, మంత్రాలు, చదవడం వగైరా. లలితా సహస్రనామ స్తోత్రంలో " భక్తి ప్రియా భక్తి గమ్యా భక్తి వశ్యా భయాపహా"" విష్ణు సహస్రనామ స్తోత్రం లో " సహస్రార్చి సప్త జిహ్వా సప్తైధా సప్త వాహనః, అమూర్తి రనఘో అచింత్యో భయకృద్ భయనాశనః " ఇలా చాలా స్త్రోత్రాలలో ఈ భయాన్ని పోగొట్టమని దేవీ దేవతలని అడుగుతున్నాడు మానవుడు.
అయితే అవధూత గీతలో మొదటి శ్లోకం ఏమి చెబుతున్నది?
ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసనా
మహద్భయ పరిత్రాణా ద్విప్రాణా ముపజాయతే
ఆనగా ఈశ్వరుని కృపతో మాత్రమే నేను, నాది అనే ద్వంద్వ భావముల మహద్భయము నుంచి మానవుడు బయట పడగలడని అవధూత గీతలో దత్తాత్రేయులవారు చెబుతున్నారు.
కాబట్టి మానవులు తరించాలంటే నేను నది అనే ద్వంద్వ భావములనుంచి తనను కాపాడమని ఆ పరమేశ్వరుని నిర్మల భక్తితో ప్రార్థించాలి. అప్పుడు ఈశారుడే గురు రూపములో వచ్చి మంకు తరుణోపాయము ఉపదేశిస్తారు. ఇది ఒక్కటే మార్గము.
అవధూత చింతన శ్రీ గురు దేవ దత్త.
ఓం తత్సత్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి