శ్రీ గురు చరితము
నలుబది మూడవ అధ్యాయము
అనంత వ్రతము
గణాధిపా నమస్కారము. గుచుమూర్తి సాయందేవునితో నిట్లు చెప్పుచున్నారు. పూర్వము నుండియు అనేకమందిచే ఆచరింపబడిన అనంత వ్రతమును చెప్పుచున్నాను శ్రద్ధతో వినుము. పూర్వము పాండు పుత్రుడైన ధర్మరాజు ఈ వ్రతమాచరించి నష్టమయిన రాజ్యమును తిరిగి పొందెను. కాన ఈ వ్రతము సర్వోత్కృష్టమయినది.
ధర్మరాజు కపట జూదములో కౌరవుల వలన రాజ్యమును గోలుపోయి
సోదరులతోడను భార్యయైన ద్రౌపదితోడను సమేతుడై పన్నెండు సంవత్సరములు అరణ్యమున
నివసించెను. అంత కష్టము ననుభవించుచున్నను
కృష్ణుని స్మరణ మానిన వారుకారు. కౌరవులు
పాండవుల నరణ్యమునకంపియు తృప్తి నొందక దుర్వాసుని వారల పరీక్షించ శిష్య సమేతముగ
పాండవుల వద్దకు ఆతిథ్యమునకు పంపిరి. అట్టి
సమయమున శ్రీకృష్ణుని సహాయ్యముచే పాండవులు దుర్వాసుని శాపమునకు గుఱికాకుండ
రక్షింపబడిరి. అరణ్యవాసమొనర్చుచు
నానాతీర్ధముల పర్యటించుచు, అనేక వ్రతము లాచరించుచు
ఎంతయో కష్టమనుభవించు చుండ శ్రీకృష్ణుడు తన భక్తుల కష్టముల గ్రహించి భక్త వత్సలుడు
గాన నొకదినమున పాండవులున్నచోటికి వచ్చెను.
ధర్మరాజు కృష్ణున కెదురేగి పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణునకు సాష్టాంగ
వందన మాచరించి తన శిరోజములతో కృష్ణుని
పాదములను శుభ్రపరచెను. పాద్యమును అర్ఘ్యము మొదలగు ఉపచారములతో శ్రీకృష్ణుని
భక్తితో పూజించి తన జన్మ ధన్యమయ్యెనని తలచెను.
ఇట్లు స్తుతించెను.
నారాయణ! హృషీకేశ, భక్త వత్సల, జయజయ. క్షీరాబ్దివాస
పరంజ్యోతి స్వరూప! నీవు విశ్వమును సృజింతువు.
రక్షింతువు. సంహరితువు.
స్థూలమందును సూక్ష్మమందుగూడ నీవు నివసించి యున్నావు. ఓ హృషీకేశ నీ పాదకమలములకు నమస్కారములు. నీవు దుష్టుల
నిగ్రహించి సాధువుల రక్షించ గలందులకు అవతరించితివని శ్రుతి స్మృతులు
చెప్పుచున్నవి. నీవు భూమికి భారమైనవారిని
సంహరింతువని విందుము. అట్లైనచో మేమును ఈ
భూమికి భారమైతిమి. మమ్ముల నెందుకు
సంహరింపవు. నీవు పాండవులు నా ప్రాణసములని
అందువు. అట్లైనచో మమ్ము ఇట్లు
అరణ్యవాసములో నెందుకు పడవైచితివి. నీవే మమ్ముల నుపేక్షించినచో నికమేమింక జీవించి
ప్రయోజనమేమి? అని ఇట్లు దీనుడై స్తుతించెను. భీముడు వచ్చి కృష్ణుని పాదములు పట్టుకొని కృష్ణ
ప్రభో! భక్తులమైన భక్తులమైన
మమ్ములనిట్లుపేక్షించుచున్నావేమని యడిగెను. అర్జునుడు వచ్చి కృష్ణుని పాదముల శిరముంచి
నమస్కరించి కృష్ణా! మాయందు నీకు కృపయేయుండిన ఈవనవాసము ఇంత కష్టముల
మేమనుభవింతుమా! పాండవులు నాకు ప్రాణసములని
నీవు లోకములో సంపాదించిన బిరుదును మా కష్టముల తొలగించి సార్ధకము
చేసికొనమమనెను. మాద్రీ సుతులైన నకుల
సహదేవులుకూడ వచ్చి కృష్ణునకు
నమస్కరించి రక్షింపుడని ప్రార్ధించిరి. ద్రౌపదియు వచ్చి కృష్ణుని పాదములపై పడి
నమస్కరించి ప్రభో! నీవు మాకు చక్రరక్షకుడవు.
మేము అరణ్యవాసము చేయుచున్నాము. మా
బంధువులు రాజ్యము చేయుచున్నారు. నీవు
ఛత్రమువలె రక్షకుడవైయుండ మాకింత కష్టమేల గాన మా కష్టములు తొందరగ పోవు ఉపాయమును
సెలవిండని ప్రార్ధించెను.
అప్ఫుడు కృష్ణుడు దయగలవాడై ధర్మరాజుతో ఓ పాండు సుత !
ధర్మరాజా! నీకు ఒక వ్రతము చెప్పెద
నాచరించుము. శ్రీఘ్రముననే మీకు రాజ్యము రాగలదు. వ్రతములోనికెల్ల అనంత వ్రతము
శ్రేష్ఠమైనది. కాన నా వ్రతము
నాచరించుము.
సర్వత్ర పరిపూర్ణుడవై యుండుటచేత నన్నే అనంతుడందురు. కాన అనంతుని వ్రతము చేయుటయనిన నన్ను
పూజించుటయే. నేను కాల స్వరూపుడనై
అహోరాత్రములు, పక్షములు, మాసములు, సంత్సరములు, యుగములు, కల్పములు అన్నింటియందు వ్యాపించి యున్నాను. భూత వర్తమాన భవిష్యత్తుల యందు వ్యాపించియున్న
నారాయణుడను నేనే. అట్టి నేను దుష్టుల
సంహరించి భూమిని రక్షించు నిమిత్తము యదుకులమున వాసుదేవుడనై అవతరించితిని. ధర్మరాజా!
సంశయింపకుము.
బ్రహ్మవిష్ణుమహేశ్వరులు నా స్వరూపులే.
రాసులు, గ్రహములు, భువనములు, ద్వాదశ రుద్రులు, అష్టవసువులు, సప్తసముద్రములు, పర్వతములు,
పాతాళాది
అధోలోకములు, తృణములు, వృక్షములు, ఆకాశము,
దిక్కులు
సర్వము వ్యాపించి ఉన్నాను.
విశ్వాత్మకుడనైన నాకన్న నితరమగు వస్తువే లేదు. ఇట్లుండియు నిర్వికారుడను, అవ్యయుడను.
అజుడను. అట్టినేను అనంతుడను గాన నా
వ్రతమే అనంత వ్రతము. అట్టి అనంత వ్రతము
విధివిధానముగ నాచరించుము అని చెప్ప ధర్మరాజు కృష్ణునితో అట్టి అనంత వ్రత మెట్లు
చేయవలయునో, ఏ దినమున చేయవనెనో, పూర్వమెవ్వరైన నీ వ్రతమాచరించి ఫలమునొందిరా చెప్పుడని ప్రశ్నించ కృష్ణ పరమాత్మ
ఈ క్రింది విధముగ చెప్పుచున్నారు.
ఈ అనంత వ్రతము భాద్రపద శుక్లచతుర్దశి మధ్యాహ్న సమయమున
నాచరించవలెను. శ్రద్ధతో నీ
వ్రతమాచరించితివేని శీఘ్రముగ రాజ్య ప్రాప్తి మీకు కలుగును. పూర్వము ఈవ్రతమునొక ఋషి యాచరించెను.
పూర్వము వసిష్ఠ గోత్రమున సుమంతుడను నొక ధర్మ నిష్ఠగల
బ్రాహ్మణుడుండెను. అతడు భృగు
గోత్రమందుద్భవించిన దీక్ష యను నామెను పెండ్లాడెను. వారికి సుశీలయను నొక పుత్రిక జన్మించెను. కొలది కాలమునకే సుమంతుని భార్య మరణించెను. మాతృహీనయైన
సుశీల తండ్రి వద్దనే పెరుగుచుండెను.
చిన్నతనమైనను ఆ బాలిక గృహ శుద్ధిచేయుచు ముగ్గులు పెట్టుచు భగవద్భక్తిగలదై
యుండెను. సుమంతుడు భార్యాహీనుడైనందున, భార్యలేనివాడు యజ్ఞాదికర్మల చేయననర్హుడుగాన, నతడు కర్మనిష్ఠగలవాడు గాన, తిరిగి వివాహము చేసికొనెను. కాని దైవవశమున నామె కలహశీలయు దుశ్శీల, దురాచారియు
నగుట తటస్థించెను. ఆమె సుశీలయందు ద్వేష
భావము గలదై భర్తకుగూడ విచారమునే కలిగించుచుండెను. ఇంతలో సుశీలకు వివాహయోగ్యమగు వయస్సు రాగా
యుక్తవయస్సున కుమార్తెకు వివాహము చేయుట ధర్మమని తలచి కౌండిన్యుడను నొక ఋషికి
ఆమెనిచ్చి వైదిక విధానముగ వివాహము చేసెను.
సుమంతుడు పుత్రిక యందలి మమకారముతో కౌండిన్యుని తన యింటనే ఉంచుకొనెను. సుమంతుని భార్య తన భార్యను ద్వేషించుట కౌండిన్యుడు
గమనించి రెండు నెలలు గడచిని తరువాత మామగారితో నేను నా భార్యను తీసికొని వెళ్ళి
మరియొకచోట నాశ్రమ మేర్పరచుకొందుననెను.
సుమంతుడు తన భార్య దుష్టురాలైనందులకు తన పుత్రికకు తనకు
వియోగమగుచున్నదని తలచి ఇట్లు విచారించెను.
హా పరమేశ్వరా! ఈమె నాకు భార్య కాదు.
శత్రువు. ఇట్టి పాపాత్మురాలి వలన
నా కుమార్తెతో నాకు వియోగము సంభవించుచున్నది.
ఎవ్వనికి శాంత స్వభావముగల భార్య లేదో వానికి గృహము వనముతో సమానము. సంసార సముద్రమున మునిగి పోతిని. ఈ భార్య నాకు కర్మానుష్ఠానమునకు గానీ, తపస్సునకు గానీ యోగ్యురాలు కాకపోయెను. ఏమిచేయుదునని విలపించుచుండ కౌండిన్యుడు
మామగారితో నిట్లనెను.
మీరు విచారింపకుడు.
తపస్సు చేయువారు కలసి యుండక వేరు వేరుగ నుండుటయే శాస్త్ర సమ్మతము. నేను
కొలది దూరముననే ఆశ్రమమును ఏర్పరచుకొందును.
అప్పుడప్పుడు మిమ్ముల చూచుటకు రాగలము అని ధైర్యము చెప్ప సుమంతుడు
కౌండిన్యునితో పన్నెండు రోజులు మాత్రమిచ్చటనుండి త్రయోదశి సర్వసిద్ధిప్రదముగాన
నాదినమున మీరు ప్రయాణముచేయుడన కౌండిన్యుడందులకు అంగీకరించెను.
త్రయోదశిరోజున
కౌండిన్యుడు భార్యతో సహ ప్రయాణము చేయబోవుచుండ సుమంతుడు భార్యతో మన కుమార్తె సుశీల
అత్తవారింటికి జనుచున్నది గాన దారి బత్తెము క్రింద నేమియైన ఆహార పదార్ధము నిచ్చి
పంపుమన నామె కోపముతో నేనేమియు ఇవ్వనని చెప్పి ఇంటిలోనికేగి తలుపులు బిగించుకొని
యుండెను. సుమంతుడు అయ్యో! దైవమా నేనేమి
చేయుదనిని విలపించుచుండ సుశీల తండ్రితో మీరు విచార పడకుడు. ఏమియు ఈయనవసరములేదు అని చెప్పెను. కాని సుమంతుడు పాకశాలలోనికి పోయి చూడ నక్కడ
కొంత గోధుమ పిండి కనుబడ అదియొక మూటగట్టి
కుమార్తె కిచ్చెను. సుశీలయు కౌండిన్యుడును
ఒక శకటము మీద కూర్చొని మామగారి ఆజ్ఞను తీసికొని ప్రయాణమైరి. వారు మధ్యాహ్నమునకు ఒక నదీ తీరము చేరిరి.
కౌండిన్యుడు అచ్చట శకటమునాపి నదియందు స్నానమొనర్చి అనుష్ఠానముచేయ
ప్రారంభించెను. సుశీల నదియొడ్డున కొంతమంది
స్త్రీలు దీక్షా వస్త్రములు ధరించి భక్తితో వేరువేరుగ కలశస్థాపనము చేసి పూజలు
చేయుచుండ చూచి వారల సమీపించి అమ్మలారా! మీరు ఏమి వ్రతమాచరించుచున్నారు? అన ప్రశ్నించ వారు సుశీలతో నిట్లనుచున్నారు. మేము సర్వాభీష్ఠముల నొసంగు అనంత
వ్రతమాచరించుచున్నాము అని చెప్ప సుశీల ఆ వ్రతమెట్లు చేయవలయునో చెప్పుడన వారిట్లనుచున్నారు. భాద్రపద మాసములో శుద్ధ పక్షములో చతుర్దశినాడు
ఇట్టి అనంత వ్రతమాచరించ వలయును. పదునాలుగు ముళ్ళుగల ఎఱ్ఱని తోరమును సిద్ధపరచుకొని నదీస్నాన మొనర్చి
పసుపు కుంకుమ ధరించి రక్త వస్త్రమును కట్టుకొని శుచియై రెండు కలశముల నిండ నీరు
పోసి పంచ పల్లవములను, రత్నములను అందుఉంచి ఆ
కలశముల పూజించి అచ్చట పూర్ణపాత్ర మీద వస్త్రముంచి అందు అష్టదళకమలమును గంధముతో
వ్రాయవలయును. దర్భతో శేషుని స్థాపించి
పూజించవలయును. చతుర్భుజములతో శంశచక్రములతో
కూడాన అనంతుని అందు భావించి ధ్యానించవలయును.
ఇట్లు నూతన తోరమును కుడి చేతికి
మంత్రముతో కట్టుకొని పాత తోరమును తీసివేయవలయును. తోరమును ధరించి ప్రస్థగోధుమ అపూపవాయనము
దక్షిణతో సహ బ్రాహ్మణునకు దానమొనర్చి ఇష్ట జనులతో సహ భుజించ వలయును. ఇట్లు పదునాలుగు సంవత్సరము లాచరించి ఉద్యాపన
మొనర్చవలయును. ఉద్యాపనమునకుగాను పదునాలుగు
కలశములతో మంటపారాధనమొనర్చి ఆ పదునాలుగు కలశములను బ్రాహ్మణులకు దానమొనర్చ
వలయును. అని సుశీలతో చెప్పి ఈ రోజు
చతుర్దశిగాన నీవును మాతో కలసి వ్రత మాచరింపుమని చెప్పి ఆమెకు ఒక తోరమునుగూడ
నిచ్చిరి. అప్పుడు సుశీల ఆస్త్రీలతో కలసి వ్రతమాచరించి తండ్రిగారు ఇచ్చిన ఆ గోధుమ
పిండిని బ్రాహ్మణునకు వాయనమిచ్చి అనంతుని తోరమును చేతికి కట్టుకొని ఆ స్త్రీలకు
నమస్కరించి తన భర్త అనుష్ఠానమొనర్చు స్థలమునకు వచ్చెను. తరువాత భార్యాభర్తలిరువురును శకటమునధిష్ఠించి
కొంతదూరము వెళ్ళు సరికి వారికి అమరావతితో సమమగు ఒక నగరము కనపడెను. ఆ గ్రామస్థులు కౌండిన్యునకు ఎదురుగ వచ్చి
స్వామీ! మీరు తపోధనులుగనున్నారు. ఈ గ్రామమున నుండుడు అని ప్రార్ధించి కౌండిన్యునకు
చక్కని గృహమును ధనమును ఇచ్చి సత్కరించిరి.
కౌండిన్యుడు ఆ గ్రామమున మిక్కిలి
సుఖముగ కాపురముండ నొకరోజున దైవవశమున తన భార్య చేతికి ధరించిన ఎఱ్ఱని తోరమును చూచి నీవు నన్ను
వశముచేసికొనుటకు ఇట్టి ఎఱ్ఱని సూత్రమును కట్టికొంటివా? యని
యధిక్షేపించెను. అప్పుడు ఆమె వినయముతో అది
అనంతుని తోరమనియు, దాని మహిమవలననే తమ
కంతటి సంపద లభించెననియు చెప్ప కౌండిన్యుడు కోపముతో మండిపడి అనంతుడెవ్వడని చెప్పుచు
అ తోరమును తెంచి నిప్పులో పడవైచి, ఈ ఐశ్వర్యము నా తపోపబలము వలన సంప్రాప్తించ నీవు
అనంతుడనుచున్నావు. నన్ను వశపరచుకొనుటకే ఈ
తోరమును ధరించితివి. ఇదిగో చూడుము తోరమును
నిప్పులో పడవేసితిని అని గర్వముతో పలికెను.
అప్పుడా సుశీల భర్త అట్లు చేయుట చూచి హాహాకారమొనర్చి నిప్పులో పడిన తోరమును
తీసి ఆవు పాలలో నుంచెను.
అనంతుని దూషించి
తోరమును నిప్పులో వేసిన దోషముచే వెంటనే అందరు శత్రువులైరి. ఐశ్వర్యము నష్టమయ్యెను. గోవులను దొంగలు హరించిరి. గృహమా దగ్ధమయ్యెను. కౌండిన్యునకు దీనత్వము సంప్రాప్తమయ్యెను. అప్పుడు కౌండిన్యుడు తనకు ఆకస్మికముగ వచ్చి
దారిద్య్రమునకు కారము అనంతుని దూషించిన పాపమేయని గ్రహించి సర్వమును త్యజించి
అనంతుని దర్శనమగు పర్యంతము అన్నపానీయములు గూడ తీసికొననని దీక్షపూని హా అనంత
అనంతయని అనంతుని వెదకుచు అరణ్య మార్గమున పోవుచుండ నచట పుష్పించిన ఫలించిన ఒక
మామిడి చెట్టును చూచెను. ఆ వృక్షమున ఫలములున్నను ఒక పక్షిగాని, కీటకముగాని ఆ ఫలముల ముట్టకుండుట చూచి ఆశ్చర్యపడి ఆ
వృక్షముతో నీకు అనంతుడు తెలియునా?
చూచితివా? యని యడుగ నా వృక్షము నాకు అనంతుడు తెలియదు. నీకు అనంతుడు కనబడుచో వారితో నా స్థితిని విన్నవించుడనెను. తిరిగి కౌండిన్యుడు కొంతదూరముపోగా అతనినకొక ఆవు
దూడతో సహ నిండు గడ్డితోగూడిన పొలముతో నుండుట చూచెను. ఆ గోవు గడ్డిలో నున్ననూ గడ్డిని మాత్రము తినక
కృశించుట చూచి ఆశ్చర్యపోయి నీకు అనంతుడు తెలియునా యని యడుగ ఆగోవు నాకు
తెలియదు. నీవు అనంతుని చూచినచో నా
స్థితిని గూర్చి వారితో మనవి
చేయుడనెను. తిరిగి కౌండిన్యుడు పోవుచు ఒక
ఎద్దును చూచి దానినిగూడ అనంతుడు తెలియునా యని యడుగ నదియును వెనుకటి వాటివలెనె తనకు తెలియదనెను.
తిరిగి పోవుచు కౌండిన్యుడు రెండు సరస్సులు చూచెను. ఆ సరస్సులు రెండును నీటి తోడను కమలముల తోడను
శోభిల్లుచు ఒక దానితో నొకటి కలసి యుండెను.
కాని ఆ సరస్సు వద్ద నొక్క పక్షియు లేకుండుట చూచి వాటితో మీకు అనంతుడు
తెలియునా యని యన మాకు తెలియదనెను.తిరిగి పోవుచు కౌండిన్యుడు ఒక గాడిదను ఏనుగును
గూడ చూచి అనంతుని గూర్చి ప్రశ్నించెను. అవి గూడ వెనుకటి వాటి వలెను మాకు అనంతుడు
తెలియదనిరి. అప్పుడు కౌండిన్యుడు అనంతుని దర్శనము కానందుకు హాహాకార మొనర్చుచు
ప్రాణ త్యాగమొనర్చిననుకట్టి అట్లేక్రింద పడి మూర్చనొందెను. అదే సమయమున
భక్తవత్సలుడైన అనంతుడే వృద్ధ బ్రాహ్మణ వేషమున అచటకు వచ్చి ఓబ్రాహ్మణుడా! లెమ్ము!
అనంతా! అనంతా! అని అరచుచున్నావు. లెమ్ము! చూపెదనని అతని చెయ్య పట్టుకొని అరణ్యములో
కొంతదూరము పొగా అచ్చట నొక గొప్ప నగరము కనబడెను. అందొక భవనములోనికి బ్రాహ్మణుని
తీసికొని పోయి అచటనున్న రత్నసింహసనముస అనంతుని ఆవృద్ధ బ్రాహ్మణుడు కూర్చొని
అనంతరూపములో దర్శనమిచ్చెను. కౌండిన్యుడు భగవంతుని అద్భుతరూపమును పొడగాంచి
పాదములమీద పడి బద్ధాంజలియై వినయముతో నిటుల స్తోత్రమొనర్చెను.
సచ్చిదానందస్వరూపా! గోవిందా! శ్రీవత్సాంకిత! నీకు
నమస్కారము. మీదర్శన మాత్రముచే నాపాపము దుఃఖము నశించెను. మీరు త్రిమూర్య్తాత్మకులు.
మిమ్ముశరణపొందుచున్నాను. నారాయణా శ్రీనివాస! జగద్వ్యాపక! వైకుంఠవాస! నిన్ను
శరణుపొందుచున్నాను అనంత బ్రహ్మాండనాయకా! పాపిని. భక్తిరహితుడనగు నాయపరాధము
క్షమించి రక్షించుడు. మీరు శరణాగతరక్షకులు, మీరేగతి. మిమ్మేనమ్మితిని. మీరే శరణు రక్షింపుడు అని
భక్తితో ప్రార్థించ భక్తులకు చింతమణియగు అనంతుడు ప్రసన్నుడై కౌండిన్యునకు
దారిద్య్ర నాశనము, ధర్మసమృద్ధి. శాశ్వత
వైకుంఠము అను మూడు వరముల నొసంగెను. అప్పుడు కైండిన్యుడు అనంతునితో ప్రభో! మిమ్ము
వెదకుచు వచ్చుచుండ ఒక మామిడి చెట్టు ఒక ఆవు, ఒక ఎద్దు,
రెండు
కొలనులు,గాడిద, ఏనుగు వీటిని చూచితిని. మిమ్ముగూర్చి యడుగ నవి మాకు
తెలియదని చెప్పెను. అవియేమిటో దయతో చెప్పుడు. అనంతుడు కనబడలేదని ప్రాణత్యాగము
చేసికొనపోవ ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనబడి నన్ను ఇచ్చటకు గొనివచ్చెను. మూఢుడ. ఏమియు
తెలియనివాడను. కాన దయయుంచి వారెవరో సెలవిండని ప్రార్థించ అనంతుడు కౌండిన్యునితో
నిటుల చెప్పుచున్నాడు.
కౌండిన్య! వినుము.
ఒక బ్రాహ్మణుడు వేదశాస్త్రములు పూర్తిగ చదివియు విద్యాభిమానముతో నెవ్వరికి
చెప్పకుండెను. ఆ పాపముచే నతడు మరణించి
మామిడి వృక్షమై జన్మించెను. పూర్వము
విద్యా దానము చేయని పాపమున ఆ వృక్షముయొక్క ఫలముల నెవ్వరును ముట్టుట లేదు. ఫలించని భూమిని దానము చేసిన పాపముచే నొకడు గోవు
జన్మ నొందియు గడ్డి తినలేక బాధపడుచున్నాడు.
ధనికుడై యుండియు దానధర్మములు చేయని పాపముచే నొకడు ఎద్దైబాధపడుచున్నాడు. ఇద్దరు అక్కచెల్లెండ్రు పరస్పరము వారిలో వారే దానము చేసికొనుటచే జంటకొలనులై జన్మించిరి. ఆ పాపము వలన నా ఉదకముగాని అందలి పుష్పములు గాని ఎవ్వరికిని ఉపయోగ
పడకున్నవి. ఒకడు గొప్ప క్రోధము గలవాడై
ఖరమై జన్మించెను. ఒకడు మదముతో గర్వించి
నందున ఏనుగయి జననమొందెను. నీకు కలిగిన
పశ్చాత్తాపమునకు సంతసించి నేనే వృద్ధ
బ్రాహ్మణుడనై నీకు దర్శనమిచ్చితిని. నీవు
చూచిన వాటికన్నిటికి నీయందలి దయతో నేను ముక్తినొసంగితిని. ఓ కౌండిన్య! నీవు ఈ శరీరాంతమున పునర్వసు
నక్షత్రమున నివసింతువుగాక.
ఓ ధర్మరాజా! ఈ విధమున కౌండిన్యుడు అనంతుని వలన వరమొంది
ఇహలోకమున అఖండసౌఖ్యమునంది వ్రత ప్రభావమువలన శాశ్వత స్వర్గమునందెను. కాన నీవును ఈ
వ్రత మాచరించుము. నీ కష్టములు పోయి తొందరగ రాజ్యప్రాప్తినొందగలవని కృష్ణుడు
చెప్పధర్మరాజు తన సోదరులతో కలసి ఈ అనంతవ్రత మాచరించి వ్రత ప్రభావమువలన శత్రువుల
సంహరించి నష్టమైన రాజ్యము పొందెను. అట్లెందరో మహర్షులు ఈ అనంతవ్రత మాచరించి
ధన్యులైరి. ఎవ్వరు ఈవ్రత మాచరింతురో వారు తప్పక చతుర్విధ పురుషార్ధములు నొందెదరు.
కాన ఓ సాయందేవా! ఈ దినము చతుర్ధశిగాన కౌండిన్యునిచే నాచరింపుము. నీవు కౌండిన్య గోత్రమున
జన్మించితిని గాన ఈ వ్రతమును నీవు తప్పక ఆచరింపుమని గురుమూర్తి చెప్పిరి.
అప్పుడు గురుమూర్తి ఆజ్ఞప్రకారము సాయందేవుడు ఆదినమున
గురుమూర్తి అనంతుని పూజించి బ్రాహ్మణ సమారాధన గావించెను. గురుమూర్తి ఆజ్ఞబడసి తన
కుటుంబమును గ్రామమున దిగవిడిచి శ్రీ గురుమూర్తి సేవించుచు వారి వద్దనే
నివసించుచుండెను. ఓ నామధారకా! మీ పూర్వీకుడైన సామందేవుని విషయమున శ్రీ గురుమూర్తి
ప్రసవ్వుడైన వృత్తాంతమును చెప్పితిని. అట్టి భక్తుని వంశమున జన్మించి నందున
నీవును కడుధన్యుడవని సిద్ధముని నామధారకునితో చెప్పెను.
ఇట్లు గురుచరితమున నలుబది మూడవ అధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
నలుబది నాలుగవ అధ్యాయము
గణాధిప! నమస్కారము
నామధారకుడు
సిద్ధమునితో ఆ పైన నేమి జరిగెనో చెప్పుడని ప్రార్ధించెను. అప్పుడు సిద్ధముని ఇట్లు చెప్పుచున్నాడు. నామధారకా వినుము. గాణగాపురమున తంతుకుడు అను ఒక సాలెవాడు
కలడు. వాడు స్వామివారియందు భక్తి
కలవాడగుటచే నిత్యము తన గృహకృత్యముల తీర్చుకొని స్వామివారి మఠమునకు వచ్చి
దూరమునుండి నమస్కరించి, స్వామివారి మఠమును
ఊడ్చుచు నీళ్ళు చల్లుచు స్వామివారి సేవ అతి భక్తితో చేయుచుండెను. ఇట్లు కొంతకాలము జరుగ శివరాత్రి పర్వకాలము
సమీపించెను.
అతని బంధువులందరు శ్రీశైల యాత్రకు పోవుచు అతనినికూడ
రమ్మనిరి. అప్పుడు ఆ సాలెవాడు వారలతో మీరు
వ్యర్ధముగ అంతదూరము పోవుచున్నారు.
శ్రీశైల మల్లికార్జునుడు గురు రూపమున మనవద్దనే యుండ మీరు మూర్ఖులయి
తెలుసుకొనలేకపోవుచున్నారు. నేను మాత్రము
రాజాలను. నాకు గురుమూర్తియే శ్రీశైల
మల్లికార్జునుడు. వారి నివాస స్థానమే నాకు
శ్రీశైలమని చెప్ప నతని మూర్ఖునిగ భావించి అతని బంధువులందరు శ్రీశైలయాత్రకు
వెడలిరి. ఆ సాలె భక్తుడు నిత్యము వలె
సంగమమునకేగి గురుమూర్తికి నమస్కరింప గురుమూర్తి అతనితో ఏమిరా! నీ బంధువులందరు
శ్రీశైలమునకేగిరి కదా! నీవెందులకు పోలేదని అడుగ వాడు స్వామీ మీ పాదములయందే సర్వ
తీర్ధములు కలవు. మూర్ఖులుగాన వారు మీ మహాత్మ్యమును గ్రహింపజాలక అంతదూరము పాషాణమును
దర్శించబోయిరి అని చెప్పి నమస్కరించి యింటకి పోయెను. కొన్ని రోజులకు మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి
పుణ్యకాలము వచ్చెను. ఆనాడు ఆ సాలె భక్తుడు
శివరాత్రి ఉపవాసమునకు సంకల్పమొనర్చి మధ్యాహ్నిక స్నాననిమిత్తము సంగమమునకేగి
స్నానమొనర్చి నిత్యమువలె బద్ధాంజలియై గురుమూర్తికి నమస్కరించి కూర్చుండెను. అప్పుడు గురుమూర్తి అతనితో ఓరీ! నీకు శ్రీశైల
యాత్ర ఘటించలేదుకదా! నీ బంధువులందరు యాత్రకు వెళ్ళిరి. నీవెప్పుడైనా శ్రీశైలము చూచితివా? అని అడుగగా వాడిట్లనుచున్నాడు.
స్వామీ! మీ పాదము తప్ప నింకేమియు నాకు తెలియదన నతని భక్తికి
సంతసించి ఓరీ! నీకు నేడు శ్రీశైలము చూపెద నీవు నేత్రములు మూసికొని చేతులతో
నాపాదుకల గట్టిగ పట్టుకొనుము.
అననతడట్లొనర్చెను. గురుమూర్తి
క్షణములో అతనిని శ్రీశైలమందలి పాతాళగంగ
సమీపమునకు చేర్చి ఓరీ! నేత్రముల తెఱువుమనిరి. వాడు నేత్రములు తెఱచి చూడ శ్రీశైలము
నతకగుపడెను. ఇది స్వప్నమా యేమి యని
నాశ్చర్యపడుచుండ ఓరీ పిచ్చివాడడై అటుల చూచుచుంటివేమి? నిన్ను శ్రీశైలమునకు
తెచ్చితిని. నేనిక్కడ నుండెద. నీవు క్షుర కర్మ చేసికొని స్నానమొనర్చి
శ్రీశైల మల్లికార్జునుని పూజించి రమ్మని చెప్పిరి. వాడు అచట తమ గ్రామస్తులను చూచెను. వారును అతనితో ఓరీ! మాతో రమ్మన రాకపోతివి. ఎట్లు వచ్చితివని ప్రశ్నింప వాడీదినమున
మధ్యాహ్నము బయలుదేరి గురుమూర్తితో సహ ఒక ఘడియలో వచ్చితినన కొందరు
అబద్ధమాడుచున్నాడనియు తమ వెంటనే కనపడకుండ చాటుగ వచ్చియుండెననియు భావించిరి.
తంతుకుడు క్షౌరము గావించుకొని స్నానమొనర్చి గంధపుష్పాది
పూజసామగ్రుల గొని శ్రీశైల మలికార్జునుని దర్శనార్థము దేవాలయమున ప్రవేశించ నచట
నతనికి లింగమునకు బదులు గురుమూర్తియే గోచరించెను. అందరును గురుమూర్తినే
పూజించుచున్నటుల గాంచి తన గురువు సాక్షత్తు శంకరుడని దృఢపరచుకొనెను. అచ్చట పూజ
గావించుకొని ప్రసాదము తీసికొని గురుమూర్తి సమక్షమునకు వచ్చి నమస్కరించ గురుమూర్తి
అతనితో ఏమిరా! యాత్రచేసికొంటివా! ఇంక కొంతకాల మిచ్చట నుందువా! లేక వచ్చెదవా యని
యడుగ వాడు గురుమూర్తితో నిటులనుచున్నాడు.
స్వామీ! నేను చూచిన చిత్రమును చెప్పుచున్నాను. నేను
దేవాలయములోనికి పోగా అచ్చట మిమ్ములనే అందరు పూజించుచుండినటుల గాంచితిని. లింగము
నాకు గోచరమేకాలేదు. సమీపముననున్న మిమ్ము గుర్తించలేక మూఢులు ఇంతదూరము ఎందులకు
వచ్చుచున్నారో బోధపడుటలేదని యన గురుమూర్తి అతనితో ఓరీ! ఈశ్వరుడు అంతట నొకడేకలడు.
కాని స్థలవిశేషమునుబట్టి మాహాత్య్మముగూడ నుండును. అని చెప్ప వాడు స్వామీ! మీరు
పరిపూర్ణ బ్రహ్మరూపులు ఈక్షేత్రము యొక్క స్థానమాహాత్మ్యమును నాకు విస్తరించి
చెప్పుడని ప్రార్థించ గురుమూర్తి నవ్వుచు
ఓరీ! స్కాందపురణమున నీ క్షేత్రమహిమ విస్తరించి చెప్పబడెను. ఆవిషయమే నీకు
సంక్షేపముగ చెప్పుచున్నాను శ్రద్ధతో వినుమని ఇట్లు చెప్పుచున్నారు.
మాఘమాసమున శివరాత్రి దినమున శ్రీశైలము గొప్ప మహోత్సవము
జరుగును. ఈ క్షేత్రముహాత్మ్యము అపారము. నీకు తెలియగలందులకు ఒక పురాతన ఇతిహాసయున
చెప్పెద వినుము. పూర్వము కిరాత దేశములను విమర్షణుడను పేరుగల రాజొకడు
పరిపాలించుచుండెను. అతడు బుద్ధిమంతుడు, బలాఢ్యుడు,
నీతిశాస్త్ర నిపుణుడునయియుండియు పరస్త్రీ లంపటుడై
గ్రాహ్యాగ్రాహ్య భక్ష్యాభక్ష్య విచారణ లేక దురాచారుడై యుండెను. అట్లుండియు
నిత్యము నీశ్వరుని భక్తితో పూజించు చుండును. శివరాత్రి మహోత్సవము గీతవాద్యములతో
నీశ్వర ప్రీతిగ గొప్ప వైభవముతో జరుపుచుండును. అతనికి కుముద్వతియను
ప్రతివ్రతారత్నము భార్యగా గలదు. ఆమె నాభర్త
దురాచారుడయ్య శివుని కడు భక్తితో పూజించుచుండును. ఇందుల కేమి కారణమోయని
తలచి యొక దినమున నేకాంతముగా తన భర్తను సమీపించి ప్రాణనాథా! నేనొక ప్రశ్న
చేయుచున్నాను. మీరన్యధా తలంచక నాకు తగు
సమాధనము చెప్ప వేడెదను. మీరు దురాచారముగ నుందురు. పరస్త్రీవ్యసనము గలవారు. సర్వభక్షకులుగా నుందురు. ఇట్లుండిన మీకు
శివునియందు అంత భక్తి కలుగటకు కారణమేమియో గోచరించుటలేదు. ఈవిషయమును మీ వలన
వినగోరితినని ప్రశ్నింప ఆరాజు సంతసించి ప్రియురాలా మంచి ప్రశ్నచేసితివి. నాకు
పూర్వజన్మజ్ఞానము గలదు కాన పూర్వజన్మ వృత్తాంతము చెప్పెద వినుము.
పూర్వము నేనొక గొల్లవాని యింట కుక్కనై జన్మించితిని. అట్లుండ ఒక నాడు శివరాత్రి
సంప్రాప్తమయ్యెను. ఆ గ్రామ బాహ్యమున ఒక
శివాలయము కలదు. జనులంలందరు శివుని
పూజించుటకు అచ్చట గుమిగూడిరి. నేనును
ఆకలిగొని అచ్చటనేమైన భోజ్య పదార్ధము లభించునేమో అని ఆశతో శివాలయము
సమీపించితిని. జనులు గీతా వాద్యములతో
ప్రదక్షిణలు, అభిషేకములు
కడునుత్సాహముతో చేయుచుండిరి. నేనును
వినోదముగ ఆ శివాలయము ప్రవేశించితిని.
నన్ను చూచి అచ్చటి వారందరు కుక్క దేవాలయములోనికి వచ్చెను. కొట్టుడు కొట్టుడు అని అరచిరి. కొంత మంది నన్ను చంపుటకు
ఉద్యుక్తులయ్యిరి. నేను ఎటు పోవుటకు
దారిగానక ఆ దేవాలయము చుట్టు మూడు పర్యాయములు పరుగెత్తితిని. భయముతో ఆలయము (గర్భగుడి) ప్రవేశించి అచ్చట
శివుని దర్శించితిని. జనులు ద్వారము
బిగించి నన్ను శస్త్రములతో చంపి బయిట
పడవేసిరి. శివరాత్రి దినమున తెలియక
శివునకు ప్రదక్షిణ మొనర్చి, శివుని దర్శించిన పుణ్య
విశేషముచే నీ జన్మమున రాజునై జన్మించితిని.
శివరాత్రి దినమున ఆహారము లభింపమిచే నుపవాసము ఘటించెను. శివుని దర్శనమయ్యెను. అచ్చట వెలిగించబడిన దీపములగూడ చూచితిని. శివుని చూచుచు ప్రాణముల విడచితిని. ఇట్టి పుణ్య సముదాయము దైవవశమున కుక్కనై యుండ
లభించిన విశేషముచే ఈ జన్మముననింతటి వైభవము గలవాడనై నుంటిని. ఇక నా దురాచారమునకు కారణము చెప్పెద
వినుము. పూర్వము కుక్కనై ఉంటిని కాన నా
జాతికి భక్ష్యా భక్ష్య విచారము లేకపోవుట, స్త్రీ లంపటత్వము సహజముగా నుండును గాన పూర్వ ప్రకృతి ఈ జన్మయందును నన్ను వదలక
యున్నది. అని రాజు చెప్పగా రాణివిని నాధా!
మీరు మీ పూర్వ జన్మగురించి చెప్పితిరి.
మీరు సర్వజ్ఞులు. నా పూర్వ జన్మ
వృత్తాంతము తమకు తెలిసిన సెలవిండని ప్రార్ధింప నారాజు తన భార్యతో
నిట్లనుచున్నాడు. నీవు పూర్వ జన్మమున నొక
అరణ్యమున నొక ఆడ పావురముగా నుంటివి. ఒక
దినమున ఆహారము కొఱకు తిరుగుచు నొక మాంస శకలమును నోట కఱచుకొని ఆకాశమార్గమున నీవు
వచ్చుచుండ నొక గ్రద్ద నిన్ను వెంబడించెను.
నీవు ప్రాణభయముతో నెగిరి ఎగిరి దైవవవశమున శ్రీశైల శిఖరమును సమీపించి
గ్రద్దచంపునను భయముతో ఆ శిఖరము చుట్టు మూడు పర్యాయములు తిరిగి శిఖరముపై కూర్చుని
ఉండ గ్రద్ద వచ్చి నిన్ను సంహరించెను. ఆ దినము శివరాత్రి పర్వకాలమయ్యెను. శివరాత్రియందు మల్లికార్జునునకు మూడు
ప్రదక్షిణములు చేసి దేవాలయ సమీపమున ప్రాణత్యాగము ఘటించిన పుణ్యవిశేషముచే నీ
జన్మమున నాకు భార్యవై ఇంతటి వైభవము ననుభవించుచున్నావు అని చెప్ప ఆమె తిరిగి ప్రాణనాధా! ఇప్పుడు ఈ జన్మమున
మనము శివుని ఆరాధించుచుంటిమి కదా. ఇక
రాబోవు జన్మమున జరుగబోవునది నీ వలన వినగోరుచున్నానన రాజిట్లు చెప్పుచున్నాడు. రాబోవు జన్మమున నేను సింధుదేశపురాజునై
జన్మించగలను. నీవు శృంజయ దేశ రాజుకు
పుత్రికవై నన్ను వరించగలవు. మూడవ జన్మమున
సౌరాష్ట్రదేశమునకధిపతినై నేను
జన్మించెదను. నీవు కళింగదేశపు రాజునకు
కుమార్తెవై నన్ను వరించెదవు. నాలుగవ
జన్మమమున నేను గాంధార దేశాధిపతిని కాగా నీవు మగధరాజు కూతురువై నన్ను
చేపట్టకలవు. అయిదవ జన్మమున అవంతి
దేశాధిపతినగు నన్ను దశార్ణ దేశాధిపతికి పుత్రివగు నీవు వరింప గలవు. ఆరవ జన్మమున అనంతుడను రాజుగా పుట్టెదను. నీవు యయాతి వంశమున జన్మించి
నన్నుచేపట్టెదవు. ఏడవ జన్మమున పాండ్య
దేశరాజునై నేను జన్మించెదను.
పద్మవర్ణుడని నాపేరుండును. నీవు
విదర్భ కులమున సుమతి అనుపేరుతో పుట్టి స్వయంవరమున దమయంతి నలుని వరించినట్లుగ నన్ను
వరింతువు. మనము ఆ జన్మమున
యజ్ఞమునాచరింతుము. ధర్మపరాయణులమై దైవ
ద్విజాతుల నారాధించి వృద్ధాప్యము రాగా కుమారునకు రాజ్యమిచ్చి అగస్త్యునివలన
బ్రహ్మజ్ఞానోపదేశము పొంది, ఆత్మ సాక్షాత్కారము
గలవాడనై దేహావాసాన కాలము రాగా పునరావృత్తి రహితమగు ముక్తిని పొందగలను. ఇది మన భవిష్యద్వృత్తాంతమని రాజు భార్యతో
చెప్పి భార్యా భర్తలిరువురు శ్రీశైల యాత్రకు వెడలిరి. కావుననో తంతుకా ! క్షేత్ర మహాత్మ్యమును వింటివా? క్షేత్ర ప్రభావమువలన సామాన్యమైన నొక మానవుడు ఏడు
జన్మలు చక్రవర్తియై జన్మించెను. నీవు
ఈశ్వరునారాధించుము. మన గంధర్వ నగరమున
కల్లేశ్వరుడు కలడు. మల్లికార్జునకు
కల్లేశ్వరునకు భేదమింతైనను లేదు. సంగమమున
సంగమేశ్వరుడు కలడు. సంగమమునకు వెళ్ళి
అచ్చటనున్న కల్లేశ్వరుడను పేరుగల సంగమేశ్వరుని అహర్నిశములు పూజించి ధన్యుడవు గమ్ము
అని చెప్ప నా సాలె భక్తుడు గురుమూర్తితో మీరు సంగమేశ్వరుని పూజించుము, కల్లేశ్వరుని పూజించుము అని చెప్పుచున్నారు. నేను మల్లికార్జున స్వామి పూజ చేయబోగా నచట
మిమ్ములనే గాంచితిని. మీరు
సర్వవ్యాపకులు. మీ కన్న సంగమేశ్వరుడు
వేరుగాగలడా? అని యన
స్వామివారునవ్వుచు ఓరీ పాదుకల గట్టిగ పట్టుకొని కన్నులు మూసికొనుమనిరి. క్షణకాలమున భక్తునితో సమేతముగా గురుమూర్తి
సంగమము చేరిరి.
గణగాపురమున గ్రామస్థులందురు శివరాత్రిగాన స్వామివారిని
దర్శించుటకుగాను సంగమమునకు వచ్చిరి. స్వామివారు అచ్చటలేనందున వారు
విభ్రాంతినొందిరి. గురుమూర్తి సంగమము ప్రవేశించి తంతుకుని శిష్యులకు తమ రాక
తెలుపుమని గ్రామమునకు పంపిరి. వాడు గ్రామ ప్రవేశ మొనర్చి అచ్చటివారితో స్వామివారు
సంగమమున నున్నారు. రండనెను. గ్రామస్థులు తంతుకుని చూచి ఓరీ నీవెక్కడికేతెంచితివి? క్షౌర మెచ్చట చేయించుకెంటివి? అని ప్రశ్నింప వారలతో గురుమూర్తితో కలసి నేను శ్రీశైలమునకు పోయి వచ్చితిని. ఇదిగో దేవుని
ప్రసాదము. విభూతి చూడుడు. అని చెప్ప నచటివారు
రెండుజాములపర్యంత మిక్కడనే యుంటిరిగదా? శ్రీ శైలమునకు వెళ్లుట ఎట్లు! వచ్చుటఎట్లు! అనిశంకింప
గురుమూర్తి నన్ను వాయువేగమున క్షణకాలమున తీసికొని వెళ్లెనని అతడు చెప్పెను.
అప్పుడు వారు సంతోషముతో మహోత్సవముతో సంగమము సమీపించి అచ్చటనున్న గురునాథుని
భక్తితో పూజించిరి. సిద్ధముని
నామధారకునితో నిట్లనుచున్నారు. గురునాథుని ప్రభావము తెలిసి కొనక విశ్వసించనివారు
మహాపాతకము నొందెదరు. ఇట్లు పదునైదు దినములు జరుగగా శ్రీశైలయాత్రకు వెగలిన
గ్రామస్థులందరు తిరిగి వచ్చిరి. వారి వలన తంతుకుడు శివరాత్రి దినమున శ్రీ
శైలమునకు వచ్చిన సంగతి నిర్ధారితమయ్యెను. అందరును గురుమూర్తి మానవమాత్రుడు
కాడనియు, ఈశ్వరావతారమనియు
తెలిసికొని ఆనంద భరితులయిరి. ఇట్టిగురు మహిమను అమృతమువలె నెవరు గ్రోలెదరో వారు
గురు మూర్తి యొక్క కృపకు పాత్రులు కాగలరని సిద్ధముని నామధారకునితో చెప్పెను.
ఇట్లు గురుచరితమున నలుబది నాలుగవ అధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
నలుబది అయిదవ అధ్యాయము
శ్రీగణేశాయనమః శ్రీ దత్త
సిద్ధముని నామధారకునితో నామధారకా! నీ భాగ్యమేమని
చెప్పుదును. నీకు గురు చరిత్ర శ్రద్ధతో విన ఆసక్తి కలుగుచున్నది అన నామధారకుడు
సిద్ధమునితో మీరు పరబ్రహ్మ స్వరూపులయిన శ్రీగురుమూర్తి లీలల స్వయముగ
చూచితిరి. మీ భాగ్యమే భాగ్యము. మీ వలన గురుచరిత్ర వినుటచే నా కష్టములన్నియు
నశించి నా అభీష్టము సిద్ధించును.
గురుమూర్తియొక్క పై చరిత్రను గూడ నాకు వినిపించి నన్ను ధన్యునిగా
నొనర్చుడని ప్రార్ధింప సిద్ధముని ఇట్లనుచున్నాడు.
ఓ వత్సా! నామధారకా వినుము.
నందియను పేరుగల నొక బ్రాహ్మణుడు కలడు. అతడు శ్వేత కుష్టురోగముచే పీడింపబడ
తులజాపురమునకు వెళ్ళి రోగ నివృత్తి కొఱకు పరమేశ్వరుని ఆరాధించ నామె చందలా
పరమేశ్వరిని సేవింపమన నతడు చందలా పరమేశ్వరి క్షేత్రమునకు వెళ్ళి ఏడు నెలలు తపమొనర్చ
నాదేవి నీవు గాణగాపురమునకు పొమ్ము. అచట
త్రిమూర్తి అవతారమయిన జగద్గురువు నరరూపమున కలడు.
అచ్చట నీరోగము నివర్తించ గలదని స్వప్నములో చెప్పెను. అప్పుడతను నీకు నా రోగము పోగొట్ట శక్తిలేనిచో
మొదటనే ఎందులకు చెప్పవైతివి. నీవు గొప్ప
దేవతవని తులజా పరమేశ్వరి చెప్పగా వచ్చితి.
ఏడు నెలలు కష్టపడి ఉపవాసములొనర్చితిని.
ఇప్పుడు నీవు మనుష్య మాత్రునియొద్దకు పొమ్మనుచున్నానవు. అట్లు అనుటకు నీకు సిగ్గయిన లేదా? నీవు నా రోగమును నివృత్తి చేసిన చేయుము. నా ప్రాణమయిన నిచట నర్పింతును కాని మఱియొక
చోటికి మాత్రము పోనని దేవితో చెప్పి మొండి పట్టు పట్టి అచటనే దీక్ష పూని యుండ
మరునాడు కూడ అట్టి స్వప్నమే అతనికి వచ్చెను.
ఇంతియే కాక అచ్చటి పూజారులకు స్వప్నములో దేవి అగుపడి ఆ బ్రాహ్మణుని అచ్చట
నుండి తరిమి వేయుమని ఆజ్ఞాపింప ఆ నందియను బ్రాహ్మణుని సమీపించి నీవు దేవి ఆజ్ఞ
ప్రకారము ఇచ్చటనుండి వెడలి పొమ్ము. లేనిచో
నిన్ను ఆలయములోనికి రానివ్వ మనిరి.
అప్పుడు వాడు చేయునది లేక అంతటితో తన దీక్షను వదలి పారణమొనర్చి బయలు దేరి
గాణగాపురము వచ్చి మఠమున గురుమూర్తి గలరా? అని ప్రశ్నింప స్వామివారు పరిచారకులు గురుమూర్తి సంగమమున గలరు. నిన్న శివరాత్రిగాన సంగమమునకు వెళ్ళిరి. అచ్చటనే ఉన్నారు. మధ్యాహ్నమునకు పారణకు నిచ్చటకు రాగలరని
చెప్పిరి. మధ్యాహ్న కాలమునకు గురుమూర్తి
సంగమమునుండి మఠమునకు వచ్చిరి. నందియును
గురుమూర్తిని దర్శింప పోగా శిష్యులు దూరముగా నుండమని నిషేధించి గురుమూర్తి వద్దకు
వెళ్ళి వారితో స్వామీ! మీ దర్శనార్ధము ఒక బ్రాహ్మణుడు వచ్చి బయట నిలబడి
ఉన్నాడు. అతని శరీరమంతయు కుష్టురోగముతో
వ్యాప్తమయి ఉన్నదనిరి. అప్పుడు గురుమూర్తి
వారితో నాకు తెలియును. వాడు
సంశయాక్రాంతమయిన మనస్సుతో వచ్చెను. అయినను
వానిని ఇచ్చటకు పిలుచుకొని రండనెను.
వెంటనే శిష్యులు వేగముగ నా బ్రాహ్మణుని గురు సమక్షమునకు తీసికొనిరాగా నా
బ్రాహ్మణుడు దూరమునుండియే నేలమీద పడి నమస్కరించెను. అప్పుడు గురుమూర్తి వానితో ఓయీ సందేహము
పెట్టుకొని నీవెందులకు ఇచ్చటకు వచ్చితివి? దేవి వలన కాని పని
మానవుని వలన అగునా? సంశయాత్మకునకు కార్య సిద్ధి ఎటుల కాగలదు అనిరి.
స్వామి వారి వాక్యములు విని తన మనో భావమును స్వామి వారు గ్రహించుటచే
వారియందు మనుష్య మాత్రుడు కారను భావమేర్పడి ఇట్లనుచున్నాడు. స్వామీ! క్షమించుడు. నేను తమోంధుడనైతిని. అజ్ఞానాంధకారమున పడి పరబ్రహ్మ స్వరూపులగు
మిమ్ముల గుర్తించలేకపోతిని. నేడు
సుదినముగాన మీ దర్శనమయ్యెను.
పునీతుడనైతిని. పాప కర్ముడ. పాపాత్ముడ.
పాప సంభవుడ. మీరు
భక్తాధారులు. మిమ్ముల శరణు పొందుచున్నాను.
ఓనృసింహసరస్వతీ!మీరు శరణాగతులకు వజ్రపంజరమని మీ బిరుదు జగద్విఖ్యాతమై
విరాజిల్లుచున్నది నేటితో నాదుష్కర్మ నశించెను. పరబ్రహ్మను నేత్రముతో చూడగలిగితిని.
యతిరాజా! నేటికి నామనోరథము నెరవేరినది.
మీరు త్రిమూర్తిస్వరూపులు. భక్తజనులకు కామధేనువులై యున్నారు. మీమహిమ ఎంత
వారికిని అగోచరము. సగరచక్రవర్తి కుమారుల తరింపచేయ గంగవచ్చినటుల భక్తుల
తరింపచేయగలందులకుగాను మనుష్యదేహములో నవతరించితిరి. పాషాణమైన అహల్యను పాదస్పర్శతో
శాపవిముక్తి నొందించిన శ్రీరామచంద్రులే మీరు. నాకు వివాహమైన తదుపరి ఈ వ్యాధి
ప్రారంభమయ్యెను. నాభార్యయు నన్ను స్పృశించి వెరచి పుట్టినింటికి చేరెను.
తలిదండ్రులుగూడ నన్ను విడనాడిరి. దుఃఖముతో సంసారము విడిచి వచ్చితిని. తులజాపురము
వెళ్ళి తపమాచరింప నాదేవి నీవు పాపివిగాన నిచ్చిట నీకు రోగనివృత్తి కాదు. చందలాదేవి
వద్దకు పొమ్మ ఆజ్ఞాపించ నచ్చటగూడ తపమాచరింప నాదేవి తమవద్దకు పొమ్మని ఆదేశింప
నిచటకు వచ్చితిని. అంగహీనుడనగుటచే నాముఖ మెవ్వరును చూడరు. ఇక జీవించి ప్రయోజనమేమి.
ఈరోగము నివృత్తియగునో కాదో తమరు దయయుంచి తెలుపుడు. రోగము నివృత్తి కాని పక్షమున
మీవద్దనే ప్రాణములు విడచెద. మీరే రక్షకులని మిమ్ముల శరణుపొందితిని. తులజాదేవి, చందలాదేవి వారలవలె మీరుగూడ ముందు ఆశలు కల్పించి
తరువాత విడనాడకుడు. అని దీనుడై ప్రార్థింప గురుమూర్తి నవ్వుచు సోమనాథుడను
బ్రాహ్మణుని పిలిచి ఇట్లనిరి.
పోమనాథా! నీవు ఈబ్రాహ్మణుని సంగమమునకు తీసికొనిపోయి
సంకల్పపూర్వకముగ స్నానము చేయించుము. అశ్వత్థ ప్రదక్షిణ చేయించి పాత వస్త్రమును
పారవేయించి నూతన వస్త్రమును ధరింపచేసి నావద్దకు తసికొని రమ్మనిరి.
సోమనాథుడు,
ఆ
బ్రాహ్మణుడు కలసి సంగమమునకు వెళ్ళిరి. బ్రాహ్మణుడు సంగమమున స్నానమొనర్చెను.
స్నానము చేయుసరికి అతని శరీరము మారిపోయెను. అనంతరము అశ్వత్థప్రదక్షిణము చేయ
శరీరమునకు సువర్ణఛాయ వచ్చెను. సోమనాథుడిచ్చిన నూతనవస్త్రమును ధరించి పాతవస్త్రమును
దూరముగ పారివేయి ఆచోటు కమిలిపోయి చవిటినేల అయ్యెను. బ్రాహ్మణుని వెంటనిడుకొని సోమనాథుడు మఠమున
కేతెంచెను.
అచటి వారందరును ఆ బ్రాహ్మణుని చూచి విస్మితులైరి. నందియను
బ్రాహ్మణుడు స్వామివారికి నమస్కరించెను. సంతోషముతో స్తోత్రముచేయుచు పాదములమీదపడి
సాష్టాంగవందన మాచరించెను. స్వామివారు అతనితో నీమనోరథము నెరవేరెనా? శరీరమంతయు శోధించుకొని చూడుమన వాడు చూడ శరీరమంతయు
బాగుగ ఉండెను. కాని కాలిపిక్కలో కొంచెము కుష్ఠుశేషముండెను. వాడదిచూచి భయపడి
స్వామీ! మీకృపాదృష్టివలన శరీరమంతయు స్వచ్ఛమాయెను. కాని కాలిమడతలో మాత్రము కొంచెము
వ్యాధి శేషించెను ఇందులకు కారణమేమియో తెలియదు. నాయందు కృపయుంచి ఈకొంచెము శేషముగూడ లేకుండచేసి
రక్షించుడని ప్రార్థించెను.
గురుమూర్తి అతనితో నీవు మనుష్యమాత్రునివలన నేమికాగలదను
సంశయముతో వచ్చినందున నిశ్శేషముగ నీ వ్యాధి నశించక కొంచెము శేషించెను. అదియు
పోగలందులకు నీకొక యుపాయము చెప్పెద నీవు నామీద కవిత్వముతో స్తుతి యొనర్చుము. అట్లు
చేసితివేని నీ వ్యాధి నిశ్శేషముగ పోవునన నాబ్రాహ్మణుడు స్వామివారి పాదముల మీద
పడిలేచి చేతులు జోడించుకొనిస్వామీ! నేను నిరక్షరకుక్షిని, కావ్యవ్యుత్పత్తి ఎంత మాత్రము లేదు. కవిత్వము
ఎట్లుచెప్పగలనని దీనుడై పలుక స్వామీవారు అతని మీద దయగలవారై నోరు తెరువుమని చెప్పి
కొంత విభూతిని అతని నాలుక మీద చల్లగా అతనికి జ్ఞానోదయమై కవిత్వము చెప్ప
సామర్థ్యము వచ్చెను. అప్పుడు అతని అందరు చూచుచుండ ఈక్రింది విధమున స్వామివారిని
స్తుతించుచు అద్భుతముగ కవిత్వము చెప్పదొడగెను.
నంది బ్రాహ్మణుడు చెప్పిన కవిత్వసారము-
స్వామీ! మాయలోపడి
సంసారసాగరములో మునిగి తేలుచు మిమ్ము స్మరింపజాలక దూరమైతిని. మందమతినై మీనామము
స్మరింపజాలనైతిని అందుచే స్వేదజములు. అండజములుగ పుట్టితిని. పశుజన్మల
గూడనెత్తితిని. అట్టి నీచజన్మలయందు నిన్ను స్మరించు అవకాశమే లేకపోయెను. అన్ని
జన్మలలోనికి మానవజన్మ ఉత్తమమైనది. అందును బ్రాహ్మణజన్మ శ్రేష్ఠమైనది. అప్పుడును
సద్గురువును భజించక మూర్ఖుడై కాలమును
గడిపినచో నదియు వ్యర్థమేకదా! జీవుడు పై లోకమునుండి వర్షధారలద్వారా అన్నమై తండ్రియందు
రేతోరూపమై ఋతుకాలమున తల్లి గర్భములో ప్రవేశించి ఆమె రక్తములో కలిసి అయిదుదినములకు
ఒకబుడగరూపము నొందును. పదునైదు దినముల కది గట్టిపడును. ఒక మాసమున కది
మాంసపిండాకారము నొందును. రెండునెలలకు శిరస్సు రెండు పాదములు ఏర్పడును. కాని అట్టి స్థితిలో జీవుడు నిన్ను
స్మరించజాలకున్నాడు. మూడు నెలలకు సర్వావయవములు, నవద్వారములు ఏర్పడును. ప్రాణముగూడ
నందు ప్రవేశించును. కాని అప్పుడు కూడ మిమ్ముల స్మరించు సామర్థ్యము లేనివాడుగనె
యుండును. అయిదవనెలలో చర్మము,
రోమములు
ఏర్పడును. ఆరవ నెలలో ఉచ్ఛ్వాస నిశ్వాసముల విడుచును. ఏడవనెలలో శ్రోత్రమును జిహ్వ
ముక్కు ఏర్పడి తొమ్మిది నెలలవరకు తల్లి గర్భములో
మలమూత్రముల మధ్య కష్టపడును. తల్లి భుజించిన కారము మెదలగు తీక్ష్ణ
పదార్థములవలన గర్భములో జీవుడు మితిలేని బాధ నొందును. ఆబాధలో జీవుడు నిన్ను
స్మరించజాలడు. ప్రసవ కాలము రాగా ఎంతయో కష్టముతో తల్లి గర్భము నుండి జన్మించును.
జన్మించిన తరువాత గూడ మానవుని జీవితములో సగభాగము నిద్రలో వ్యర్థమగుచున్నది.
మిగిలిన సగము బాల్యము, యౌవనము, వార్థక్యముగా మూడు విధముల విభజింపబడుచున్నది.
బాల్యవస్థలోని కష్టముల చెప్ప నెవరితరము.
తల్లి ఉయ్యెలలో పరుండబెట్టును. బాలుడు మలమూత్రములలో పొరలుచు అజ్ఞానముతో తన
మలమునే తాను భక్షించుచుండును. బాల్యములో
పడిన బాధ స్మరించినంతనే నెంతవారికి హృదయము కంపించును. ఉదరబాధతో బాలుడు బాధనొందుచుండ తల్లి
తెలిసికొనజాలక ఆకలి అయ్యెను అని పాలనిచ్చును.
ఆకలితో నేడ్చుచుండ కడుపు నొప్పితో బాధపడుచున్నాడనుకొని లేనిపోని మందుల
పోయును. అప్పటికి ఏడ్చుచుండ నాబాలుని
ఉయ్యెలలో పరుండబెట్టి ఊపుచు నిద్రపుచ్చ ప్రయత్నించును గాని వాని ఆకలి బాధ
గుర్తించజాలదు. భయపడెనేమోయని రక్షల
గట్టించును. ఒక సమయమున ప్రక్కలో
తేలుకుట్టి బాలుడు ఏడ్చుచుండ తల్లి తెలిసికొనలేక పాలిచ్చి ఏడ్పుమాన్ప
యత్నించును. కాని తేలు కుట్టినట్లు
తెలిసికొనజాలదు. పైపెచ్చు మరల నాతేలుగల
ఉయ్యెలలోనే పరుండబెట్టును. బాలుడు ప్రాణాంతక బాధ నొందునుగాని చెప్పజాలడు. ఇట్టి బాల్యములో జీవుడు నిన్నెట్లు స్మరించ
సమర్ధుడు?
క్రమముగ జీవుడు బాల్యముదాటి ఎంతో కష్టము ననుభవించి నిన్ను
స్మరించక ఆటపాటలతో కాలము జరుగ యౌవనములో నడుగిడును. కామాంధకారములో పడి తల్లితండ్రుల మరచును. పెద్దల తిరస్కరించును. వారవనితల కామించును. వృద్ధులను వెక్కిరించును. ఇంద్రియలోలుడై మిడుత దీపముమీద పడినటుల
స్త్రీలరూపమును చూచి భ్రమించి వ్యభిచరించును.
పరద్రవ్యమపహరించును. పెద్దల బోధ చెవిని
పెట్టడు. మహాత్ముల నిందించును. ఇట్లు నిన్ను స్మరించక మదించి కాలము
వ్యర్ధపుచ్చును. ఇంతలో వృద్ధాప్యము
వచ్చిమీద పడును. అప్పుడతను
భార్యాపుత్రులకు భారమై తోచును. కఫము
ప్రారంభమగును. శరీరము వణకసాగును. వెంట్రుకలు తెల్లనగును. దంతములు ఊడిపోవును. చెవులు వినబడవు. స్వామీ! ఈవిధమున మానవుని జీవితము నిన్ను
స్మరించు భాగ్యములేక నానా కష్టములకు పాలగుచున్నది. ప్రభో! నాయందు దయయుంచి నన్ను సంసారసాగరమునుండి
దరిచేర్చుడు. మందమతినై మీచరణ
సత్తానెఱుగనైతిని. మీరు కేవలము
నారాయణావతారమై ఉన్నారు. నరవేషము ధరించి
విశ్వమును తరింపచేయనవతరించితిరి. మీరు
విశ్వపాలకులు. పామరులు దివాంధుల వలె
మిమ్ముల గుర్తించజాలరు. నేను మీ
కింకరుడ. సంసారసాగరమునుండి
తరింపచేయుడు. అని ఇట్లు నందియను
బ్రాహ్మణుడు అద్భుతముగ కవిత్వము చెప్పుచుండ జనులందరు ఆశ్చర్యపోవుచుండిరి. అప్పుడచ్చటి జనులతో నంది ఇట్లనుచున్నాడు. ఓ జనులారా! వినుడు. ఈ గురుమూర్తి కేవలము పరబ్రహ్మము. వీరి
దర్శనముచే నాపాపము లన్నియు నశించెను. దావాగ్నిచే తృణము దగ్ధమగురీతిని గురుకృప
ఎవ్వరియందు ప్రసరించునో వారి పాపములన్నియు నటుల నిస్సంశయముగ నశించును. గురువుకన్న
వేరు దేవుడేలేడు. కాన సద్గురుచరణముల
భక్తితో భజించుడు. గురుచరణము కడు పవిత్రము. గురుచరణ స్పర్శచే బ్రహ్మచే లిఖింపబడిన ఫాలమందలి
దుష్టాక్షరపంక్తియు మారిపోగలదు. నిధివలె
గురుమూర్తి సమక్షమున నున్నను మనము గుర్తింపజాలకున్నాము. శ్రీ నృసింహసరస్వతి
మనపాలిటి కామధేనువు. కాన భజించి ధన్యులుకండు గురుమూర్తి ఇహలోకమున సౌఖ్యము, పరత్రసద్గతి నను గ్రహించ సమర్థుడు. ఈమాట సత్యము.
ముమ్మాటికి సత్యము నమ్ముడు.
ఇట్లుపన్యసించుట చూచి గురుమూర్తి మిక్కిలి సంతసించి
అచ్చటవారితో ఈ బ్రాహ్మణునకు కవీశ్వరుడని
బిరుదము నిచ్చితిని. మీరిక మీద నితనిని కవీశ్వరుగని పిలుపుడనిరి.
కవీశ్వరుడైన నంది అప్పుడు తన శరీరమందు విమర్శించి చూడ మిగిలియున్న ఆకొద్ది
కుష్ఠురోగము గూడ నివృత్తిచెందెను. అప్పటి నుండియు నంది కడు సంతోషముతో స్వామీవారికి
నమస్కరించి వారి సేవ చేయుచు వారి సమక్షముననే నివసించుచుండెను. ఓ నామధారకా!
గురుమూర్తియొక్క అద్బుతమైన మహిమను వింటివి. స్వామివారి వద్ద నంది కవీశ్వరుడేకాక
నరహరియను మఱియొక కవియు గలడు. అతనెటుల గురుకృపకు పాత్రుడయ్యెనో ఆవిషయమును నీవు పై
అధ్యాయములో వినగలవని సిద్ధముని నామధారకునితో చెప్పెను.
ఇట్లు గురుచరితమందు నలుబది అయిదవఅధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
నలుబది ఆరవ అధ్యాయము
శ్రీ గణేశాయ నమః
నామధారకుడు సిద్ధమునితో ఓ మునీంద్రా స్వామివారి వద్ద నంది
కవికాక మఱియొక కవి కలడని చెప్పితిరి.
అతనెవడు? ఎటుల స్వామివారికి
శిష్యుడయ్యెనో కృపతో అమృత సమమగు గురుచరిత్రమును నాకు వినిపించి నన్ను ధన్యుని
కావింపుడని ప్రశ్నించ సిద్ధమునీంద్రుడిట్లు చెప్పుచున్నారు.
నామధారకా! నిరుపమానమగు గురుచరితమును వినుము. గురుమూర్తి గాణగాపురమున నుండ నందియను కవి గురు
కృపకు పాత్రుడైన సంగతి వినియుంటివి.
నందిచే రచించబడిన కవిత్వము నలుదిక్కుల వ్యాపించెను. అందరును అతని కవిత్వమును పఠించి
ధన్యులగుచుండిరి.
ఇట్లుండ హిప్పరగ అను గ్రామవాసులు గురుమూర్తి ఖ్యాతిని విని
వారి వద్దకు వచ్చి ప్రార్ధించి వారిని తమ గ్రామమునకు కొనిపోయిరి. గొప్పగ పూజామహోత్సవముల నాచరించిరి. ఆ గ్రామమున గొప్ప కల్లేశ్వర శివాలయము
కలదు. దేవాలయమున నరహరియను బ్రాహ్మణుడు
శివుని పూజించు చుండెను. ఆ బ్రాహ్మణుడు
విద్వాంసుడగుటచే నిత్యము ఐదు నూతన పద్యములు శివునిమీద రచించి శివుని
ఆరాధించుచుండును. అతడు ఏకాగ్రముగ శివుని
మాత్రమే ధ్యానించును, పూజించును, నుతించును కాని స్వప్నమందైన ఇతర దేవతల చూడడు, పూజించడు, స్తుతించడు.
ఇట్లుండ ఆ గ్రామస్థులు నరహరి వద్దకేగి అతనితో
బ్రాహ్మణోత్తమా! కవీశ్వరా! గురుమూర్తి మన గ్రామమునకేతెంచిరి. వారికి కవిత్వమన్న కడు ప్రేమ. కావున నీవుగూడ వచ్చి వారిమీద మంచి కవిత్వము చెప్పి
వారిని సంతోషపరచుమన నతడు వారితో నిట్లనెను.
నేను నా జిహ్వను కల్లేశ్వరునకమ్మివేసితిని. ఇతర దేవతల నేను స్తుతించను. అట్టినేను నర స్తుతి ఎట్లు చేయుదును కావున మీరు
కోరిన పని నావలన కాదు అనెను. అదే దినమున
అతను స్నానమొనర్చి శివుని పూజించ శివాలయము ప్రవేశించెను. పూజించుటకు శివుని ముందు కూర్చొనెను. అంతలో గాఢనిద్ర వచ్చెను. ఆ నిద్రలో నతనికి తాను శివుని ముందు
కూర్చున్నటులను, తన ముందర గల లింగము
అదృశ్యమయి దాని స్థానములో గురుమూర్తియే కూర్చున్నటుల, అట్టి గురుమూర్తిని హర్షముతో పూజించుచున్నటుల స్వప్నము
వచ్చెను. ఆ స్వప్నమందు స్వామివారు అతనితో
నీవు నరుల స్తుతించవట కదా నన్నెందులకు పూజించి స్తుతించుచున్నావని అడిగిరి. అతను మాత్రము నిశ్చల భక్తితో గురుమూర్తిని
స్వప్నమందు పూజించి నిత్యమువలెనే పంచపద్యములతో స్తుతించెను. ఇంతలో స్వప్నమునుండి మెలకువ వచ్చెను. అప్పుడతను విస్మితుడయి గురుమూర్తి మానవ
మాత్రుడు కాడనియు అవతార పురుషుడనియు అట్టివారి మహిమ గ్రహించలేక పోతినని
పశ్చాత్తాపమునొంది భక్తితో గురు సమక్షమునకు అడుగడుగున సాష్టాంగ వందనము ఆచరించుచు
వచ్చి గురుమూర్తి పాదములమీద పడి నమస్కరించి స్వామీ! మీ స్వరూపము గ్రహించలేక పోతిని. నా యందు కృపయుంచుడు. మీరు మానమ మాత్రులు కారు. శివ స్వరూపులు. అజ్ఞానములో పడి మీ మహిమ తెలిసికొననైతిని. మీరు
విశ్వమునకు ఆధారమైనవారు. మీరే
కల్లేశ్వరులు, మీ చరణ కమలములందు నేనిక భ్రమరమై ఉందును. మీరు శరణాగతులకు వజ్రపంజరము వంటివారు. నిధి ఇంటనుండ కట్టె పుల్లల కొఱకు అడవిని వెతుక
ప్రయాసమెందులకు? మీరు భక్తులకు కామధేనువులయి ఉన్నారు. పూర్వము మానవులు ఎంతో కాలము తపమాచరించినను
వారికి మీ సాక్షాత్కారము కాకుండెను. నేడు మాకు ఎట్టి శ్రమలేకనే మీరూపమున
కల్లేశ్వరుడు మాకు ప్రత్యక్షమయ్యెను. మాకు
నిధి లభించెను. మా కోరిక నెఱవేరెను. నా యందు దయ యుంచుడని చెప్పుచు గురుమూర్తి
పాదములపై పడి భక్తితో నమస్కరించ గురుమూర్తి అతనితో నీవు నిత్యము మమ్ముల
నిందించుచున్నావని వినుచున్నాను. నీకు
నేడేల నా మీద నింత భక్తి కలిగెనని అడుగ ఆ బ్రాహ్మణుడు ఇట్లనుచున్నాడు.
స్వామీ! ఇంత పర్యంతము అజ్ఞానాంధకారములో పడి
ఉంటిని. క్షమించుడు. నేనింత పర్యంతము చేసిన పుణ్యము వలననే నేడు
మిమ్ముల చూడకలిగితిని. నేడునేను శివుని
పూజించుచుండ లింగమునకు మారుగ మిమ్ములనే కాంచితిని. నా సంశయము నశించెను. నన్నుకూడ తమ శిష్యులలో నొకడుగా స్వీకరించుడని
చెప్పి స్వామివారికి భక్తితో పూజ సల్పి స్వప్నములో చేసిన విధమున నూతన పద్యములనుకూడ
స్వామివారిమీద రచించి స్తుతించెను.
స్వామివారు అచ్చటివారితో ఇతడు నన్ను కల్లేశ్వరాలయమున ప్రత్యక్షముగ
పూజించియు స్వప్నములో పూజించితినని చెప్పుచున్నాడు. ఇప్పుడు నన్ను మీ సమక్షమున ప్రత్యక్షముగ పూజించుచున్నాడు అని పలికి అతనిని
తమ శిష్యునిగ చేసికొని నూతన వస్త్రములు బహుకరించి నీవు కల్లేశ్వరుని
పూజించుచుండుము. కల్లేశ్వరుని పూజించుటయన
నన్ను పూజించుటయే అనిరి. అప్పుడతను
స్వామీ! ప్రత్యక్షముగనున్న మిమ్ముల విడిచి ఆ కల్లేశ్వరునితో నాకేమి
ప్రయోజనము. నేను కల్లేశ్వరునియందు
మిమ్ములనే కాంచితిని. మీరే
కల్లేశ్వరులు. త్రిమూర్త్యవతారులు. ఇది
సత్యము. మిమ్ముల విడిచియుండజాలనని పలికి
గురుమూర్తికి శిష్యుడయ్యెను. అతనితో కలసి
గురుమూర్తి గాణగాపురము వచ్చిరి. నందియను
కవివలె నీ నరహరి కవియును గురుమూర్తిమీ అనేకవిధముల కవిత్వము చెప్పుచు గురు సేవ
చేయుచుండెను.
ఓ నామధారకా ఎవరు గురు భక్తి చేయుదురో
గురుమూర్తి వారి ఇంటిలోని కల్ప వృక్షమై సర్వాభీష్టముల నొసంగుచుండును.
ఇట్లు గురు చరితమున నలుబది ఆరవ అధ్యాయము సమాప్తము.
నలుబది ఏడవ అధ్యాయము
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా
శ్రీ గణేశ! నమస్కారము. సిద్ధమునిని
నామధారకుడు పైకథావృత్తాంతమును చెప్పుడని ప్రార్ధింప వారిట్లు చెప్పుచున్నారు. నామధారకా!
గురుచరిత్రమును మిక్కిలి ఉత్సాహముతో వినుచున్నావు. నీవు పుత్రపౌత్రాభివృద్ధికలిగి
శ్రీమంతుడవగుదువు. గురుచరిత్రమును వినిన
పతితులుకూడ పవిత్రులగుదురు. అట్టి
గురుచరిత్రమును వినుము.
గురుమూర్తి గాణగాపురమున నున్న దీపావళి పండుగ సమీపించెను. ఏడు గ్రామములనుంచి
శిష్యులు స్వామివారిని తమగ్రామమునకు పండుగకు భిక్షకు తీసికొనిపోవు సంకల్పముతో
గణగాపురము వచ్చిరి. వారికందరకు
గురుమూర్తియందు ఒకరికన్న మఱియొకరికి ఎక్కువ ప్రీతి. వారందరునూ గురుమూర్తిని సమీపించి వారి
పాదములమీద పడి నమస్కరించి తమ తమ గ్రామములకు పండుగకు భిక్షకు దయచేయుడని
ప్రార్ధించిరి.
అప్పుడు స్వామివారితో నేనొక్కడను. ఏడు గ్రామములకు ఎట్లు రాగలను?
నేను
శిష్యులకధీనుడను. మీలో మీరు
సమాధానపరచుకొని ఈ పండుగకు ఎవరి గ్రామమునకు ఆహ్వానించిన నచ్చటకు వచ్చెదననిరి. వారు అన్యోన్యము సంప్రదించుకొనిరి. ప్రతివారును స్వామిని మా గ్రామమే తీసికొని
పోయెదమని తగువులాడసాగిరి. గురుమూర్తి
వారితో నేను మీకందరకు సముడనే. మీరు
వివాదపడకుడు. నేను పండుగకు నాకు
బుద్ధిపుట్టిన గ్రామమునకేతెంచెదననిరి.
స్వామివారి వాక్యములు విని శిష్యులు స్వామీ! తమరు పక్షపాతము చూపరాదు. శ్రీమంతులు దరిద్రులు
అనుభేదము చూపి మా గ్రామమునకు రానిచో మేము గంగా ప్రవేశము చేయుదుము. భక్త వత్సలుడయిన కృష్ణుడు చక్రవర్తియైన
దుర్యోధనుని ఇంటికి పోక బీదవాడగు విదురుని ఇంటికి వెళ్ళినటుల మా గ్రామమునకే తమరు
దయచేయ వలయును. తమరు మీ గ్రామము వచ్చెదనని
ఎవరితో చెప్పిన వారు ముందుగా తగిన ప్రయత్నము చేసికొనుటకు వీలు కలుగునని పలికి
గురుమూర్తి పాదములకు సాష్టాంగ వందనము ఆచరించిరి.
గురుమూర్తి తప్పక మీ గృహములకేతెంచెద, విశ్వసించుడు.
చింతించకుడు అనిరి. అప్పుడు వారు
స్వామీ! మీరు అందరితోనూ వచ్చెదననుచున్నారు.
మేము ఎవ్వరము మీ మాట నమ్మి వెడలి పోయి ప్రయత్నము చేసికొందుము?
కాన
తమరు మాతో నిర్ధారణగ మీ గ్రామమే వచ్చెదనని సెలవిచ్చిన సంశయ నివృత్తి
కాగలదనిరి.
అప్పుడు గురుమూర్తి శిష్యులు అజ్ఞులు కాన తమ సామర్ధ్యమును గుర్తించ లేరని
గ్రహించి ఒక్కొక్కరిని ఏకాంతమునకు పిలిచి అతని చెవిలో రహస్యముగ మీ ఇంటికే పండుగకు
వచ్చెద. ఈ సంగతి ఎవరికి చెప్పక మీ
గ్రామమునకు వెళ్ళి ప్రయత్నము చేసికొనుమని చెప్పి పంపివేసిరి. అట్లే తక్కిన వారితో ఏకాంతమున చెప్పి అందరిని
పంపివేసిరి. అప్పుడు గ్రామస్థులందరు
గురుమూర్తిని సమీపించి స్వామీ! మీరు దీపావళి పండుగకు మమ్ము విడిచి గ్రామాంతరము
పోవలదని చేతులు జోడించుకొని దీనులై ప్రార్ధించ వారితో నేనిచ్చటనే ఉండెదనమ్ముడని
వారలనోదార్చిరి. ఇంతలో దీపావళి సంప్రాప్తమయ్యెను. త్రయోదశి రాత్రి స్వామివారు ఎనిమిది రూపములు
దాల్చి ఒక రూపమున గాణగాపురములో నుండి ఏడు రూపములతో ఏడు గ్రామములందును
ప్రత్యక్షమయ్యిరి. ఆయా గ్రామస్థులు స్వామి
వారు తమయందలి ప్రేమతో తమ గ్రామమునకేతెంచిరని సంతసించి స్వామివారికి మంగళ స్నానము
చేయించి షోడశోపచారములతో స్వామివారిని గొప్పగ పూజించిరి. స్వామివారందరచేతను పూజింపబడి తిరిగి ఆ రూపముల
నుపసంహరించి తమ నిజరూపమున గాణగాపురములోనుండిరి.
ఈ రహస్యమెవ్వరును తెలిసికొనజాలరైరి.
ప్రతివారును తమ గ్రామమునకే స్వామివారు వచ్చిరనియు, తమ పూజయే గ్రహించిరనియు భావించిరి. ఇంతలో కార్తీక పున్నమినాడు స్వామివారిని దర్శించి కార్తీక దీపమాలలనర్పింప
నుద్దేశ్యముతో నాయాగ్రామస్థులందరు గాణగాపురము వచ్చి స్వామివారి పాదములకు
నమస్కరించి తమరు మా గ్రామము దీపావళికి వచ్చి మమ్ములనానందింప జేసిరి. అందుచే ధన్యుల మైతిమి. తిరిగి పది దినములకు దర్శింప
వచ్చితిమనిరి. మా గ్రామము పండుగకు
వచ్చిరి. మేము పూజించి స్వామివారికి
వస్త్రములర్పించితిమి. మీ గ్రామమెట్లు
వచ్చిరి? అసత్యమెందుకు పలికెదరని ఇట్లు అన్యోన్యమందరు
కలహింపసాగిరి. గ్రామస్థులు మీరందరు
అసత్యము పలుకుచున్నారు. స్వామివారు మా
గ్రామముననే దీపావళి పండుగ చేసి మమ్ముల నానాందింప చేసిరి అనిరి. కాని స్వామివారి వద్ద గ్రామస్తులొసగిన
వస్త్రములేకాక మిగిలిన ఏడు గ్రామవాసులొసగిన వస్త్రములన్నియు గుర్తుగ నుండుట చూచి
ఆశ్చర్యచకితులై స్వామివారు నారాయణమూర్తియే కానీ నరమాత్రులు కారని నిశ్చయించుకొని
భక్తితో స్వామీ! మీ మహిమ తెలిసికొని మేమెంత వారము. వేదమూర్తీ! విశ్వపాలకా! గురునాథా! మీరు
త్రిమూర్తి స్వరూపులు అని స్తుతించి స్వామివారి ఎదుట దీపారాధనలు చేసి బ్రాహ్మణులకు
పక్వాన్నములతో సమారాధనలు జరిపిరి.
సిద్ధమునిని నామధారకునితో నామధారకా! గురుమహిమ ఇట్లు దిన దినమునకు వ్యాప్తమయ్యెను. శ్రీ నరసింహసరస్వతీ స్వామివారి ప్రభావము
జగద్విఖ్యాతమయ్యెను.
కల్పవృక్షము సమీపముననున్నను
దురదృష్టుడు తెలిసికొనలేనట్లు గురుమూర్తి సమక్షముననున్నను భక్తిలేనివారు మాత్రము
వారిని గుర్తెరుగజాలరు. ఓ భక్తులారా! గురునాథుని భజించుడు. గురునాథుడు
తప్పక మీ మనోరథముల సమకూర్ప సమర్ధుడు.
ఈ మాట నేనుభవించి చెప్పుచున్నాను.
విశ్వసించుడని గంగాధర సరస్వతి గురు చరిత్రమును చెప్పుచున్నాడు. అమృతమును వదిలి ఉప్పునీటిని మూర్ఖుడుకూడ తాగునా?
జ్ఞానవంతులారా
గురునామామృతమును పానమొనర్చుడు.
గురుమూర్తిని సేవించుడు.
గురుమూర్తి త్రిమూర్తి స్వరూపుడు గాని మనుష్యుడు కాడని ఢంకా వాయించి
చెప్పుచున్నాను. సంసారము నుండి తరించుటకు
గురువుకన్న వేరు గతి లేదు. గురు భక్తిలేని
మానవుడు రాబోవు జన్మమున సూకరమై
జన్మించునని వేద శాస్త్రములు చెప్పుచున్నవి. సంసారమను ఎడారి యందు గురువను చలివేంద్రము
నిర్మింపబడి ఉన్నది. అట్టి గురుమూర్తి
కధామృత పానమొనర్చి అమరత్వమునొందుడు.
గాణగాపురమున ప్రత్యక్షముగ నరసింహ సరస్వతి గురురూపమున నవతరించి
యున్నారు. కాననచ్చటకు పోయి వారిని సేవించుడు. మీ మనోరథములు తప్పక నెఱవేరగలవు. ఎట్టి అనుమానము
పడనవసరములేదు. దేవుడు అచ్చట
ప్రత్యక్షముగాగలడు. మీ హితము చెప్పితిని. విని విశ్వసించి గురుమూర్తిని సేవించుడు.
ఇట్లు గురు చరితమున నలుబది ఏడవ అధ్యాయము సమాప్తము.
నలుబది ఎనిమిదవ అధ్యాయము
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా
శ్రీ గణేశాయ నమః నామధారకా! గురుచరిత్ర నీకు
చెప్పుచున్నకొలదియు నాకు సంతోషమగుచున్నది.
ఒక అపూర్వమైన విషయముచెప్పుచున్నాను. శ్రద్ధతోవినుము. గురుమూర్తి
నివసించుటచే గణగాపురమునకు అపూర్వమైన ఖ్యాతి వచ్చెను. ఆ గ్రామమున నొక శూద్రభక్తుడు
గలడు. వ్యవపాయముచే జీవించువాడు. అతని కథచెప్పెద వినుము. స్వామివారు గణగాపుర మఠము
నుండి ఉదయముననే బయలుదేరి సంగమమునకేగి అచ్చట ననుష్ఠానమొనర్చుకొని మధ్యాహ్నమునకు
మఠమునకు బిక్షకువచ్చెడివారు. శూద్రభక్తుడు వ్యవసాయమొనర్చు పొలము స్వామివారు పోవు
మార్గమునకు కొలది దూరమున గలదు. స్వామివారు సంగమమున కేగుచుండ వాడు నిరీక్షించి
వెంటనే పరుగెత్తి వచ్చి వారికి దూరమునుండి సాష్టాంగముగ నమస్కరించును. అదే రీతిని
వారు తిరిగి గణగాపురమువచ్చుచుండ వాడు అట్లేవచ్చి వారి పాదములకు వందన
మాచరించుచుండును. గురుమూర్తి వానితో మాట్లాడక ఊరక వాని భక్తి చూచుచుండెడివారు.
వాడికి స్వామివారియందు దినదినము భక్తి వృద్ధియగుచుండెను. ఇట్లు కొంతకాలము జరుగ నొక
దినమున వాడు నిత్యము వలె నమస్కరింప స్వామివారు అతనితో ఓరి! నీవు కష్టపడి నిత్యము
నాకు నమస్కరించుచున్నావు. నీమనస్సులో ఏవికోరికయో చెప్పుమన వాడుస్వామీ! తమ
అనుగ్రహమువలన మా వ్యవసాయము చక్కగ అక్కరకు వచ్చి మా పొలము చక్కగాపండిన మేము సుఖముగ
జీవింతుము. ఇంతకన్న వేరు కోరిక ఏమియు లేదన స్వామివారు వానితో నీ పొలములో
ఈసంవత్సరము ఏమి పైరు వేసితివన వాడు స్వామి జొన్నపైరు వేసితిని పైరు
వృద్ధియగుచున్నది. కంకులుపడు సమయము వచ్చినది. మీ యనుగ్రహమువలన మంచిగ పండిన
పండవచ్చును. నాప్రార్థన ఒకటి గలదు ఏమన
తమరు నాయందు దయయుంచి మాపొలము తమ పాదధూళితో పవిత్ర మొనర్చిన సంతోషించెదనన నాతని
భక్తికి సంతసించి అతనితో కలసి అతని పొలము సమీపించి పొలము చూచి ఓరీ! భక్తుడా!
నేనొకటి చెప్పదలచితిని చేసెదవాయని యడిగిరి. అప్పుడు వాడు స్వామీ! మీరు నాకు
గురువులు. మీవాక్యము నాకు ప్రమాణము. మీరు ఏమీ చెప్పిన అటుల నాచరించులకు
సంసిద్ధుడను గాన సంశయముంచక నేనేమిచేయవలయునో ఆజ్ఞాపింపుడనెను. గురుమూర్తి అతనితో
ఓరీ! నేనిప్పుడు సంగమమునకు వెళ్ళుచున్నాను. మధ్యాహ్నమునకు తిరిగి మఠమునకు బిక్షకు
పోవుదును. ఇంతలో నీవు నీ పొలమును మొత్తము మొదటికి కోసివేయుము అని చెప్పి
గురుమూర్తి సంగమమునకు వెళ్లిరి.
ఆశూద్రభక్తుడు మనస్సులో గురువాక్యమే నాకు ప్రమాణముగాన పోయి
క్షేత్రయజమానితో తనకు కౌలు పత్రము వ్రాసియిమ్మన నతడు ఈ సంవత్సరము పైరు అధికముగ
పండవచ్చును కాన నిరుటివలె నేను వ్రాసియివ్వనన శూద్రుడు యజమానితో వెనుకటికన్న
రెండురెట్లు ధాన్యమిచ్చెద నాకు పత్రము వ్రాసియిండన వాడు అటులనే వ్రాసియిచ్చెను.
యజమానివలన ప్రమాణపత్రము తీసికొని కూలీలను పిలుచుకొని వెళ్ళివారలతో పొలమును
కోయుంచనారంభించెచు. ఈ విషయముతెలిసికొని అతని దారాపుత్రాదులు నిషేధించరాగా వారల
రాళ్లతో గాట్టి విళ్లగొట్టెను. వారు క్షేత్రయజమాని వద్దకు వెళ్లి కాపువానికి పిచ్చిఎక్కినది.
ఎవరో సన్యాసి చెప్పినాడని నెలలో పంటను వచ్చుపైరును మొదటికి కోసి వేయించుచున్నాడు.
అటులచేయవద్దని మేము ఆటంకపరుచబోగా మమ్ముల రాళ్లతోగొట్టుచున్నాడు. అని చెప్ప
నాక్షేత్రపతి వారలతో నేనేమిచేయగలను. నాకు పత్రము వ్రాసియిచ్చినాడు అని చెప్పియు
అటుల చేయవద్దని చెప్పుటకు తనసేవకుని పంపెను. అతను వెళ్లి యజమాని పంపగా వచ్చితిని
పొలము కోయించవద్దని నిషేధించ నాశూద్రుడు నేను వెనుకటికన్న
రెట్టింపుధాన్యమిచ్చెదనని పత్రమువ్రాసియిచ్చితిని. యజమానికి భయమున్న నాయింట
ధాన్యముగలదు నేడే ధాన్యము కొలిచి యిచ్చెద. అట్లు కానిచో నాఎద్దులనైన నతనికిచ్చెద.
నేను కోయించుటమానననిచెప్ప నా సేవకుడు వెళ్లి కాపువాని మాటలను క్షేత్రపతితో
చెప్పెను. క్షేత్రపతి కాపువానియింట ధాన్యము సమృద్ధిగ గలదని తెలసియున్నందున నతడు
ధైర్యముతో నేమియైన కానిమ్మని యనుకొనెను.
శూద్రుడు తన పొలమంతయు గురువు చెప్పినటుల కోయించి గురుమూర్తి రాకకై
నిరీక్షించుచుండ మధ్యాహ్నము గురుమూర్తి సంగమమునుండి వచ్చుచుండ నెదురేగి నమస్కరించి
వారితో స్వామీ! మీయాజ్ఞ ప్రకారము పొలము కోయించితినన గురుమూర్తి అతనితో ఓరీ! నేను
పరిహాసమునకట్లంటిని. నీవు నా మాటల నమ్మి
అట్లెందుకొనర్చితివన స్వామీ! మీ వాక్యమే నాకు కామధేనువు. నాకెట్టి సంశయము లేదు అన నతని నిష్ఠకు
గురుమూర్తి సంతసించి ఓరీ! చింతపడకుము.
నీకే అధిక ఫలము సిద్ధించును అని ఆశీర్వదించి మఠమనకేగిరి.
గురుభక్తుడైన శూద్రుడు ఇంటికి పోగా గ్రామస్థులందరు వచ్చి
మూఢుడవై పొలము కోయించితివెందుకు అనిరి.
భార్య ఏడువసాగెను. శూద్రుడు
అందరిని ఓదార్చి చింతించకుడు నేను మూఢుడనుగాను.
గురువాక్యము కామధేనువు. వారి
అనుగ్రహముండిన ఒక గింజకు వెయ్యి గింజలు రాగలవు.
మీరు మూఢులుగాన గురుమూర్తి మహిమనెఱుంగరు.
గురుమూర్తి నరుడు కాడు.
శివుడు. గురుకృపకు
పాత్రుడైనవానికి దైన్యమెన్నడు నుండదు.
అని దూరరృష్టిగలవాడు గాన భార్యాపుత్రుల, గ్రామస్థుల నోదార్చెను.
ఇట్లుండ ఒక వారము దినములు గడిచెను.
ఇంతలో ఒక సుడిగాలి వీచి గ్రామములోని పైరంతయు నేలవాలెను. సూర్యుడు మూలా నక్షత్రములో ప్రవేశించుటచే
అఖండమైన వర్షముచే పైరులన్నియు నీట నీటమునిగి కుళ్ళిపోయెను. శూద్రుని పొలము ముందుగానే కోయబడెనుగాన వర్షము
తగ్గి భూమి ఆరినకొలదియు అతని పొలములో కోయబడిన మొదళ్ళనుండి అద్భుతముగ
నొక్కొక్కదానికి పది పదకొండు అంకురములు బయలు వెడలెను. కొద్ది రోజులలో నతని పొలము పైరుచే కిక్కిరిసి
నేత్రములకు ఆనందకరముగ నుండెను. గ్రామస్థులందరు
ఆశ్చర్యచకితులయిరి.
శూద్రుని భార్య
తనపొలము పైరుతో నిండియుండుట చూచి ఆనందమునొంది భర్తను సమీపించి పాదములకు నమస్కరించి
ఓ ప్రాణనాధా! నేను అజ్ఞానినే మిమ్ములను గురుమూర్తిని అనరాని మాటలాడి
నిందించితి. క్షమించుడని
ప్రార్ధించెను. భార్యా భర్తలిరువు
క్షేత్రదేవతకు పూజలొనర్చి గురుమూర్తిని సమీపించి భక్తితో పూజించిరి. గురుమూర్తి
ఏమి కారణము? ఎందులకు అకస్మాత్తుగ
వచ్చి నాకు పూజచేసెదరన శూద్రుడు భక్తితో స్వామీ! జయ జయ. మీరు మాకు కులదేవతలు. మీరు కామధేనువులై ఉన్నారు. మీ వాక్యము అమృతము. మీ పాదము చింతామణి. మా మనోరథము నెరవేఱెను. మీరే మాకు శరణు. భక్తవత్సలా! మీ బిరుదావళులు మా విషయములో
సార్ధకములయ్యెను అని చెప్పుచు భార్య భర్తలిద్దరును స్వామి వారి పాదములమీదపడి
నమస్కరించి, పూజించి, నీరాజనమిచ్చిరి.
స్వామి సంతోషించి మీరు అఖండైశ్వర్యమునొందగలరని ఆశీర్వదించిరి. గురుమూర్తి ఆజ్ఞనొంది శూద్ర దంపతులు వారి
గృహమునకు వెళ్ళిరి. ఒకనెలరోజులలో పైరు
పెరిగి కంకులు అద్భుతముగ బయలు వెడలెను. గురుమూర్తి
అనుగ్రహమువలన ఆ శూద్రునికి వెనుకటి సంవత్సరముకన్న నూరు రెట్లుగ ధాన్యము
పండెను. శూద్రుడు సంతోషముతో ధాన్యము
సిద్ధపరచి క్షేత్ర యజమానిని సమీపించి అతనితో నీసంవత్సరము నాకు ధాన్యము అధికముగ
పండెను. సగము మీకిచ్చెదనన అతను వానితో
ధర్మ హాని వలదు. నీవు గురుభక్తుడవు. గురుప్రసాదము వలన వచ్చినదానిని నీవే
అనుభవించుము. అని చెప్పెను. శూద్రుడ ఇంటికి వచ్చి యజమానికి ఇవ్వవలసినది
యిచ్చి బ్రాహ్మణులకు సహితము తన ధాన్యము పంచి పెట్టెను. అది మొదలు గురుమూర్తి కృపవలన శూద్రుడు
శ్రీమంతుడై సుఖముగనుండెను.
ఓ నామధారకా! చిత్రమయిన గురుచరితమును వింటివా? గురుమూర్తియందు దృఢభక్తి గలవారికెన్నడును
దైన్యముండదని గ్రహించుము. సర్వాభీష్టప్రదమయిన గురుచరిత్రనెవ్వరు నిత్యము భక్తితో
పఠింతురో వారి గృహమున లక్ష్మి తన నైసర్గిక చాంచల్యము విడనాడి
స్థిరనివాసమొనర్చును. కాన భావికులు
నిత్యము గురుసేవ చేసిన ఐహికాముష్మిక సుఖమును సంపదలను పొందగలరు.
ఇట్లు గురు చరితమున నలుబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
నలుబది తొమ్మిదవ అధ్యాయము
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా
నామధారకుడు సిద్ధముని పాదములకు నమస్కరించి చేతులు జోడించి ఇట్లు ప్రశ్నించుచున్నాడు. త్రిమూర్త్యావతారమైన గురుమూర్తి భారత దేశమున
నెన్నియో క్షేత్రములుండ గంధర్వ నగరముననే చాలాకాలము నివసించుటకు ఏమి కారణము?
దయయుంచి
ఆ క్షేత్రమహాత్మ్యమును నాకు సమగ్రముగ సెలవిండని ప్రార్ధించ సిద్ధముని ఇట్లు
చెప్పుచున్నాడు. శ్రోతలారా! శ్రద్ధతో గంధర్వ నగర మహిమను వినుడు.
ఒక సంవత్సరము ఆశ్వయుజ బహుళ చతుర్దశి దీపావళి మహోత్సవము
సమీపించెను. గురుమూర్తి శిష్యులను పిలిచి మనము కాశీ, గయా, ప్రయాగలను
త్రిస్థలములకు యాత్రకు పోదమనిరి. శిష్యులు
గురుమూర్తి వాక్యము విని స్వామీ! మేము సకుటుంబముగా వచ్చెదము. యాత్రకు తగిన సన్నాహము చేసికొందమనిరి. అందుకు స్వామివారు నవ్వి మన గ్రామముననే కాశీ, గయా, ప్రయాగలు కలవు. మీరు యాత్రకు వేరుగ
నేమియు ప్రయత్నము చేయనవససరము లేదు, రండని స్వామివారు శిష్యసమేతముగ సంగమమునకు వెళ్ళి స్నానమొనర్చి శిష్యులతో ఈ
సంగమము ప్రయాగతో సమానము. భీమానదిలో
ఆమరజానది కలియుటచే నీక్షేత్రము గంగాయమునలు కలసిన తీర్ధరాజము వలె అంతటి
మహిమకలది. ఇచ్చట అమరజానది ఉత్తరవాహిని
యగుటచే నిది కాశీతో సమానము. ఈ క్షేత్రమున
ఎనిమిది తీర్ధములు కలవు. ప్రత్యేకము ప్రతి
తీర్ధముయొక్క మహిమ ఎంతవారికి సమగ్రముగా చెప్పశక్యము కాదు అనిరి. స్వామివారియొక్కవాక్యము విని స్వామీ! ఈ
అమరజానది ఎట్లు ఉద్భవించెను. ఈ నదికి అమరజానదియని పేరెందుకు వచ్చెనో సెలవిండన
గురుమూర్తి శిష్యులతో నిట్లు చెప్పుచున్నారు.
శిష్యులారా మంచి ప్రశ్న చేసితిరి. వినుడు.
పూర్వము జాలంధరుడను రాక్షసుడు దేవతలనందర యుద్ధమున
పరాభవించెను. అనేకమంది దేవతలు అతనిచే
సంహరింపబడిరి. ఇంద్రుడు చేయునది లేక
కైలాసమునకేగి ఈశ్వరునితో దేవా! జాలంధరునిచే దేవతలు సంహరింపబడిరి. నా స్వర్గ స్థానమునుకూడ అతను అపహరించెను. మేము రాక్షసుల సంహరించినను వారి రక్త
బిందువులలోనుండి అసంఖ్యాకముగ రాక్షసులు పుట్టి మాతో యుద్ధమొనర్చు చున్నారు. లోలకమంతయు రాక్షసులచే వ్యాప్తమయ్యెనుగాన
మిమ్ముల శరణు పొందుచున్నాను. దయయుంచి రాక్షసుల సంహరించి మమ్ముల కాపాడుడు. మరణించిన దేవతల తిరిగి యేయుపాయముచేతనయినను
జీవింపచేయుడని ప్రార్ధించెను. ఈశ్వరుడు
కరుణించి రాక్షసుల దునుమాడ తాను రౌద్రరూపము దాల్చి బయలుదేరుచు ఇంద్రునకు
అమృతరసపూరితమైన ఒక ఘటమును ఇచ్చి ఇందలి అమృతమును మృతులైన దేవతలమీద ప్రోక్షించుము, వారలు బ్రతుకగలరని చెప్పెను. ఇంద్రుడు అందలి అమృతమును మృతులైన దేవతలమీద
చల్ల వారు జీవించిరి. మిగిలిన అమృతము
ఇంద్రుని హస్తమునున్న ఘటము నుండి భూమిపై పడెను.
అదియే మహా ప్రవాహమై అమరజా యను నది రూపమున ప్రసిద్ధి గాంచినది. ఇట్టి
నదియందు ఎవ్వరు భక్తితో స్నానమొనర్చెదరో
వారికి కాలమృత్యువు లేదు. ఇక అప
మృత్యువు ఎటుల రాగలదు? ఈ నదిని స్నానమొనర్చిన దుఃఖములు, రోగములు,
బ్రహ్మహత్యాది
పాతకములు నశించును. ఇట్టి సంజీవనీ నది
భీమా నదితో కలసి సంగమమయ్యెను గాన నీక్షేత్రము ప్రయాగతో సమమని వేఱుగ
చెప్పనవసరములేదు. వైశాఖ, కార్తీక, మాఘమాసములందిచ్చట స్నానమొననర్చువారు ఇహలోకమున సుఖమునొంది అంతమున
మోక్షమునొందుదురు. సూర్యచంద్ర గ్రహణములందు, సంక్రాంతులు పర్వకాలములు ఏకాదశి మొదలగు తిథులయందు
స్నానముచేయువారు అనంతఫలము నొందగలరు.
ఘటించిన సర్వకాలములందును స్నానమొనర్చుట ప్రశస్తము.
ఇవ్విధమున గురుమూర్తి శిష్యులతో కలసి నమరజానది మహాత్మ్యమును
చెప్పి అచ్చటికి కొలది దూరముననున్న అశ్వత్థవృక్షము వద్దకు శిష్యసమేతముగ వచ్చి
శిష్యులారా! ఈఅశ్వత్థము కల్పవృక్షము.
ఇచ్చటి తీర్ధము మనోహరతీర్ధమనబడును.
ఈ తీర్ధమున స్నానమొనర్చి అశ్వత్థమునకు పూజలు ప్రదక్షిణములు చేయువారికి
వారిమనోరథములు అన్నియు నెఱవేఱగలవు.
నేనెప్పుడు నీఅశ్వత్థవృక్షమందు నివసించెద.
నన్ను ఎవ్వరు అశ్వత్థవృక్షమందు ధ్యానించి పూజించెదరో వారికి ఈ కలియుగమందును
దర్శనమిచ్చెద. అని చెప్పి అచ్చటనున్న
సంగమేశ్వర శివాలయమునకు శిష్యుల తీసికొనిపోయి వారితో శ్రీశైలమున
మల్లికార్జునునివలె నీక్షేత్రమున సంగమేశ్వరుడు భక్తులకభీష్టములివ్వ సమర్ధుడు. ఓ శిష్యులారా! ఈశ్వరునకు
ప్రదక్షిణమొనర్చువారికి అనంత ఫలము సిద్ధించును. ప్రథమమున నందీశ్వరునకు నమస్కరించి
అచ్చటనుండి చండీశ్వరుని వద్దకు పోవలెను.
చండీశ్వరునకు నమస్కరించి అచ్చటి నుండి మరలి సవ్యముగ నందీశ్వరుని చూచి
అచ్చటనుండి సోమసూత్రము సమీపించి తిరిగి
నందీశ్వరుని వద్దకు వచ్చి అచ్చటినుండి
సోమసూత్రము చండీశ్వరుని దర్శించి శివుని వద్దకు రావలెను. ఇట్లుచేయు ప్రదక్షిణము
శివప్రదక్షిణమనబడును. ఇట్లు మూడు
ప్రదక్షిణములొనర్చుటచే పాపములన్నియు పోగలవు.
నందీశ్వరుని వృషణములమీద నెడమచేతినుంచి కుడిచేతి అంగుష్ట తర్జనులతో నందయొక్క
రెండుకొమ్ముల స్పృశించి మధ్యనుండి శివుని
చూడవలయును. ఇట్లు శివుని దర్శించువారు
పుత్రపౌత్రాభివృద్ధిని ధనధాన్యసమృద్ధిని గూడ నొందగలరు. అని ఇట్లు సంగమేశ్వరుని మహిమచెప్పి
శిష్యులతోగూడ అచ్చటికి కొలదిదూరమున గల వారణాసియను తీర్ధము సమీపించి శిష్యులతో
నిట్లనెను. ఈతీర్థముఇచ్చటికి అర్ధకోశమునగల నాగేశమను గ్రామమునుండి బయలుదేరెను. దాని
వృత్తాంతము చెప్పెదవినుడు. పూర్వము భరద్వాజ గోత్రపుబ్రాహ్మణు డొకడుకలడు. అతడు
గొప్పవిరాగియు శివభక్తుడు అగుటచే లోకమునకు పిచ్చివానివలె దేహస్మృతి లేక ఆనందముతో
తిరుగుచుండును. అతనికి ఈశ్వరుడనియు. పాండురంగడనియు నిద్దరు సోదరులుకలరు.
సోదరులిద్దరును ఒక సమయమున కాశీయత్రచేయుసంకల్పించి ప్రయాణమగుచు విరక్తుడై
అంతర్ముఖడైయున్న తమ సోదరునితో ఓ పిశాచమా! మాతో కాశీవచ్చెదవా! అని యడిగిరి.
పామరులకు బ్రహ్మవిదులు పిశాచములవలెను. పిచ్చివారివలెను గోచరించుట సహజము.
సోదరులవాక్యములు విని ఆ బ్రహ్మవిదుడు విశ్వేశ్వరుడు నావద్దనేగలడనెను. అప్పడు
సోదరులు ఇచ్చటనే విశ్వేశ్వరుడున్న కాశీకిపోవలసిన పనిఏమి? నీవిచ్చట శివునిచూపగలవా! అని అడిగిరి. అప్పుడతను స్నానమొనర్చి
శివునిధ్యానింప నచ్చట శివుడు ప్రత్యక్షముగనావిర్భవించెను. ఆభక్తుడు శివా!
నన్నుఅనుహ్రించి ఈక్షేత్రము కాశీక్షేత్రముగ నొనర్చుమన ఈశ్వరుడు సంతోషించెను. అచ్చట
మణికర్ణిక గుండము ఏర్పడెను. కాశీక్షేత్రమందలి చిహ్నము లన్నియు నచ్చట అగుపడెను.
అదిచూచి అతనిసోదరులు ఆశ్చర్యపడిరి. అప్పుడతను మీకు కాశీకి పోనవసరములేదు.
ఇచ్చటస్నానమొనర్చుడు. విశ్వేశ్వరుని పూజించుడు.
మీరు పండరీపురము వెళ్లి అచ్చట ఆరాధ్యులను పేరుతో పండరీనాథుని పూజించుడు.
ప్రతి సంవత్సరము ఇచ్చటకువచ్చి ఈశ్వరుని పూజించుచుండుడని తన సోదరులకు
ఆజ్ఞఇచ్చెను. అప్పటి నుండియు ఈక్షేత్రము
వారణాసీ తీర్థమను పేర ప్రసిద్ధిగాంచినది. ఈతీర్థము భీమానదితో కలియుటచే నీక్షేత్రము
కాశీ క్షేత్రముతో సమానముగాన నిచ్చట స్నానమొనర్చుడని గురుమూర్తి చెప్ప శిష్యులందరూ
స్నానమొనర్చి శివుని పూజించిరి. అచ్చట
నుండి గురుమూర్తి శిష్యులతో కలసి కొలది దూరముననున్న పాపవినాశమను తీర్ధమునకు
వచ్చిరి. ఏతీర్ధము స్నానమాత్రము చేతనే
అగ్ని తృణరాశిని దగ్ధమొనర్చురీతిని సమస్త పాప రాసుల దగ్ధమొనర్చునో అట్టి తీర్ధమును
వారు శిష్యు సమేతులై వచ్చుసరికి స్వామివారి పూర్వాశ్రమపు సోదరి రత్నాబాయి అచ్చటకు
వచ్చెను. స్వామివారు ఆమెతో నీవు నన్ను
దర్శింప వచ్చితివి. నీవు పూర్వము చేసిన
పాపముల తెలిసికొంటివా? అనిరి. అప్పుడామె స్వామివారి పాదములకు నమస్కరించి
స్వామీ ఆజ్ఞానురాలను, మూఢురాలను. పూర్వ జన్మమును గుర్తెరుగు
శక్తినాకెక్కడిది. తమరు సర్వజ్ఞులుగాన
నాపూర్వార్జితమును చెప్పిన తెలిసికొదనెను.
స్వామివారు ఆమెతో నీవు పూర్వ జన్మమున
ఒక పాపమొనర్చితివి. అది ఏమన ఒక పిల్లి
నీళ్ళకాగులో ఐదు పిల్లల పెట్టెను. నీవు చీకటిలో తెలియక కాగులో నీరు పోసి కాచుటచే
నా ఐదు పిల్లికూనలు మరణించెను. ఇంకనూ
కొన్ని పాపములు చేసితివి. అవి నేనిదివరకే
నీకు తెలిపితిని. ఆమాటవినుటతోడనే ఆమె
శరీరము కుష్టురోగముచే వ్యాప్తమయ్యెను. ఆమె
భయపడి స్వామివారికి నమస్కరించి గురునాధా! దయాబ్ధే! రక్షించుడు. పాపనివృత్తి కాంక్షించియే మీ దర్శనార్ధము
వచ్చితిననెను. ఆమె వాక్యములు విని ఆమెతో
నీవు ఈ పాపఫలము ఈ జన్మలో అనుభవించెదవా లేక వచ్చే జన్మలో అనుభవించెదవా అని
అడిగిరి. స్వామీ! జన్మరాహిత్యమే
కావలయును. నాకింక జన్మలేకుండ చేయుడని
ప్రార్ధించెను. అప్పుడు స్వామివారు
కరుణించి ఆమెతో నీవు ఈ పాపనాశన తీర్ధమున స్నానమొనర్చుము, నీ పాపము నశించును.
నీవిచ్చటనే నివసించి నిత్యము ఈ పాపవినాశనమునందు స్నానమొనర్చుచుండుము. ఈతీర్ధమున స్నానమొనర్చుటచే సప్త జన్మార్జిత
పాపములే భస్మములు కాగలవు. నీ కుష్టురోగము
నశించు విషయములో సంశయమేల అనిరి.
స్వామివారి వాక్యములు విని ఆమె ఆతీర్ధమున స్నానమొనర్చగా కుష్టు రోగము
తక్షణమే నివర్తించెను. ఈ విషయము నేను
స్వయముగ చూచితినని సిద్ధముని నామధారకునితో చెప్పెను.
రత్నావతియు పాపవినాశన తీర్ధ
మహాత్మ్యమునకచ్చెరువొంది అచ్చటనే మకాము నిర్మించుకొని నిత్యము అచ్చట
స్నానమొనర్చుచు జీవితమును ధన్యమొనర్చుకొనెను. అటుమీద గురుమూర్తి అచ్చటకు మరికొంత
దూరముననున్న కోటి తీర్ధమునకు వచ్చి శిష్యులతో జంబూద్వీపమున ఎన్ని తీర్ధములు కలవో
అన్ని తీర్ధములును ఈ తీర్ధమున కలవు. కాననే
దీనికి కోటి తీర్ధమని సార్ధక నామధేయము వచ్చెను.
సూర్య చంద్రగ్రహణములు,
పూర్ణిమ, అమావాస్య సంక్రాంతులు ఇట్టి పుణ్యకాలములందిచ్చట
స్నానమొనర్చిన అనంత ఫలము వచ్చును. ఇచ్చట
చేయబడిన గోదానము మొదలగు దానములు కోటి దానముల ఫలమొసగును. అని గురుమూర్తి శిష్యులతో చెప్ప శిష్యులచ్చట
స్నానదానములాచరించిరి. గురుమూర్తి అచ్చట
నుండి శిష్యుల రుద్రపాదమను పేరుగల తీర్ధమునకు కొనివచ్చిరి. శిష్యులతో ఇచ్చటి రుద్రపాదముల నర్చించుటచే కోటి
జన్మార్జిత పాపములుకూడ నశించును. ఈ
తీర్ధము గయతో సమము అని చెప్పి అచ్చటనుండి శిష్యుల చక్రతీర్ధమునకు కొని
వచ్చిరి. అచ్చట కేశవదేవాలయము కలదు. శిష్యులతో ఈ తీర్ధమున స్నానమొనర్చి కేశవుని
పూజించువారు జ్ఞానంతులగుదురు. ఈ తీర్ధమున
వేయబడిని అస్థులు (ఎముకలు) చక్రాంకితములగును.
ఈ తీర్ధము ద్వారకతో సమానమని చెప్ప శిష్యులచ్చట స్నానదానము లాచరించిరి. అచ్చటనుండి గురుమూర్తి శిష్యులను గ్రామమునకు
పూర్వభాగముననున్న మన్మధతీర్ధమునకు గొనివచ్చిరి. అచ్చట కల్లేశ్వరుడను శివాలయముకలదు. ఆ కల్లేశ్వరుడు శ్రీశైలమల్లికార్జునుని తోడను
గోకర్ణమందలి మహాబలేశ్వరుని తోడను సముడని శిష్యులతో చెప్పిరి. ఈ మన్మధ తీర్ధమున స్నానమొనర్చి కల్లేశ్వరుని
పూజించువారు అష్టైశ్వర్యములతో తులతూగగలరు.
శ్రావణమాసమున అఖండాభిషేకము, కార్తీకమాసమున దీపమాలికలచే కల్లేశ్వరుని పూజించుటచే అక్షయమగు పుణ్యము లభించును
అని ఈవిధమున నాదినమున శిష్యులకు గాణగాపురమునందలి అష్టతీర్ధముల నెఱుగపఱచిరి. శిష్యులందరు నానందభరితులయ్యిరి. స్వామివారితో మేమిచ్చట నివసించియు ఇంతకాలము
వరకు ఈ క్షేత్ర మహిమను గుర్తెఱుగమైతిమి.
తమ కృపచే నేటికి తెలిసికొంటిమి.
అని చెప్పి ఆ దినమున శిష్యులందరు గొప్ప ఉత్సాహముతో స్నానదానములాచరించిరి. బ్రాహ్మణ సమారాధన చేసిరి. ఈ విధమున గురుమూర్తి శిష్యుల
కృతార్ధులగావించుచు గంధర్వపురమున నివసించిరని సిద్ధముని నామధారకునకు చెప్పెను.
ఇట్లు గురు చరితమున నలుబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
ఏబదియవ అధ్యాయము
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా
సిద్ధముని నామధారకునితో ఓ నామధారకా! నీకు ఈ గురుచరిత్రయందలి (తొమ్మిదవ) అధ్యాయమున
ఒక రజకుడు గురుమూర్తి అనుగ్రహమునకు పాత్రుడయిన విషయమును, అతనిని గురుమూర్తి
రాబోవు జన్మమున నీవు మ్లేచ్ఛకులమున చక్రవర్తివై జన్మింపుమని ఆశీర్వదించిన విషయము
నీవు వినియుంటివి. వాడు గురుమూర్తి ఆజ్ఞ ప్రకారము వైడూర్యనగరము(బీదర్)
న మ్లేచ్ఛకులమున రాజై జన్మించెను. అష్టైశ్వర్యములలో తులతూగుచు పుత్రపౌత్రాదులతో
సమేతుడై జాతిహీనుడైనను పూర్వ సంస్కారమునుబట్టి
పుణ్యకర్మలందును, దాన ధర్మములందును
ఆసక్తిగలవాడై ఉండెను. ఇంతియేకాక
బ్రాహ్మణులందు భక్తిగలవాడై దేవాలయములకు, తీర్ధ క్షేత్రములకు నుపద్రవము చేయక చక్కగా రాజ్యమేలు చుండెను. అతని పురోహితులు రాజుతో ఓరాజా! నీవు
మ్లేచ్ఛుడవు. అయినను హిందువుల ద్వేషింపక
వారలతో మైత్రిని చేయుచున్నావు. ఇట్లు
చేయుట మన జాతికి విరుద్ధము. అట్లొనర్చిన
నీకు పాపము రాగలదు. ఎవరి ధర్మము ప్రకారము
వారు నడువవలయును. హిందువులు
తెలివిలేనివారు కావుననే రాతిబొమ్మలను కట్టె బొమ్మలను దేవతలని కొలుచుచుందురు. గోవు, నీరు, నిప్పులనుగూడ దేవుడని
కొలుచు చుందురు. నీవు ఇకమీద మ్లేచ్ఛ
ధర్మము ప్రకారము నడచుట మంచిదని హితబోధ చేయ ఆ మ్లేచ్ఛరాజు తన మ్లేచ్ఛ పురోహితులతో
ఇట్లనుచున్నాడు.
మీరు చెప్పినది సరికాదు.
దేవుడు ప్రతి అణువునందును,
తృణమునందును, సర్వత్రా కలడు.
పరమేశ్వరుడు తన సంకల్పముతో నీజగద్రూపమై ప్రతి వస్తువునందున లోపల
నంతార్యామియై ఇమిడి ఉన్నాడు. గోవులు
వేఱైనను పాలు ఒకటి యైనటుల ఆభరణములు వేరుగానున్నను సువర్ణము ఒకటైనటుల జగత్తులోని పదార్ధముల వేఱువేఱుగ కనబడుచున్నను
అన్నిటియందు నున్న పరమాత్మడొక్కడే. కుండలు
వేఱువేఱుగానున్నను అందలి ఆకారమునకు భేదము లేదుకదా. నామరూపాత్మకమైన జగత్తు అంతయు సూత్రము మీద
మణులున్నటుల పరమాత్మమీద నోతప్రోతమై ఉన్నది.
జాతులు వేఱైనను అన్నిజాతులచే నారాధింపబడు దేవుడొక్కడే. అట్టి దేవుడు ఆకాశమువలె సర్వ వ్యాపకుడు. అట్టి నిరాకారమై సర్వ వ్యాపకమైన పరమాత్మను
తెలిసికొనుటకు చిత్త శుద్ధి అవసరము గాన చిత్తమును నిలుప గలందులకుగాను హిందువులు
విగ్రహములను గోవులను పూజింతురు. వారుకూడ
చిత్త శుద్ధికలిగిన తరువాత విగ్రహారాధన మాని నిరాకారమైన తత్త్వమునే
ధ్యానింతురు. వారి వారి భావనను బట్టి
భగవంతుడు వారివారికి ఫలముల నొసంగును. భగవంతునకు అందరును సమానముగాన మీరు ఇక మీద
హిందువుల దూషింపకుడు. ఎవ్వరికి ఏధర్మము విహితమో వారు ఆధర్మమునాచరించుట వలన
శ్రేయస్సునే పొందెదరు. ఎవరిమతము ప్రకారము వారు నడచుకొనవలెనని తన పురోహితులకు
హితముచెప్పి తానుయథాపూర్వముగ దేవ బ్రాహణ భక్తి గలవాడై పుణ్యకర్మల
నాచరించుచుండెను. ఇట్లుండ ఆమ్లేచ్ఛరాజు రాజ్యమేలుచుండ దైవయోగముచేనతని తొడమీద నొక
వ్రణము లేచుట సంభవించెను. ఎన్నియో చికిత్సలు చేసిరి గాని వ్రణబాధతగ్గక పోగ
దినదినమునకు ఎక్కువగుచుండెను.
ఇట్లుండ గంధర్వనగరమున గురుమూర్తి సర్వజ్ఞులు గాన
మ్లేచ్ఛరాజు తన దర్శనమునకు రాగలడు, అతడు వచ్చిన బ్రాహ్మణులకు బాధ కలుగును.
నా అవతార ప్రయోజనము పూర్తి అయినది.
కలియుగమగుటచే నేను అంతర్ధానమొందుటయే ఉచితము. లేనిచో నికమీద మ్లేచ్ఛులుగూడ నాదర్శనార్ధము
రాగలరు. బహుధాన్య సంవత్సరము, బృహస్పతి సింహరాశిలోనికి రాబోవు చున్నాడు గాన గౌతమీ
తీర్ధయాత్ర యను మిషతో నేను గాణగాపురము వదలి వెళ్ళెదనని భావించి శిష్యులతో నేనిచ్చట
నుండిన ఇకమీద మ్లేచ్ఛులుగూడ నా వద్దకు వత్తురు.
అందుచే మీధర్మములకు కష్టము రాగలదు గాననేను గౌతమీ నదికి యాత్రగా పోదలచితిని
అనిరి. శిష్యులు గురుమూర్తి వాక్యము విని
ఏమి చేయవలయునో చేయక మ్లేచ్ఛులు వచ్చినను శ్రీదత్తదేవుడే తమను రక్షింపగలడని
నమ్మకముతో నుండిరి.
మ్లేచ్ఛరాజు వ్రణముచే బాధపడుచుండెను. ఎన్ని చికిత్సలు చేసినను ప్రయోజనము
లేకపోయెను. అప్పుడు ఆ రాజు బ్రాహ్మణుల
పిలిచి నాకీ వ్రణముతగ్గు ఉపాయమేమియైన నుండిన చెప్పుడని ప్రార్ధింప ఆ బ్రాహ్మణులు
అతనితో ఇట్లు అనుచున్నారు.
ఓ రాజా! వినుము.
పూర్వ జన్మములో చేసిన పాపముల వలననే వ్యాధులు వచ్చును. తీర్ధ యాత్రలు, దేవతల పూజలు, దానములు ఆచరించుటచేత వ్యాధులు పోగలవు.
సత్పురుషుల దర్శనముచే అరువది జన్మల(60) పాపముగూడ నశింప గలదు.
నీవు సత్పురుషుల దర్శించితివేని నీపాపము నశించును. నీ వ్రణము ఉపశమించి నీకు ఆరోగ్యమ వచ్చుననిరి.
బ్రాహ్మణ వాక్యములువిని భక్తితో ఓ మహాత్ములారా! నేను మ్లేచ్ఛుడనని ఉపేక్షించకుడు.
నేను మీసేవకుడను. పూర్వజన్మలో నేను గురు
సేవ చేసియుండుట చేతనే ఈ జన్మలో రాజు నయితిని.
పాపవశమున మ్లేచ్ఛ కులమున జన్మించితిని. మహాత్ముల దర్శనమువలన రోగములు
నశించునని చెప్పిరి. అట్టివారి దర్శనము
వలన ఎవ్వరికైన రోగనివృత్తి అయ్యెనా? నాకు విశ్వాసము కలుగగలందులకు ప్రశ్నించుచున్నాను అని రాజు అడుగ నాబ్రాహ్మణులు
అతనితో నీ ప్రశ్నలకు రహస్యస్థలమున సమాధానము చెప్పెదము. నీవు ఏదియో ఒక నిమిత్తమును కల్పించుకొని మీ
నగరసమీపమున పాపవినాశనమను తీర్థము కలదు. అచ్చటకు ఒంటరిగ రమ్ము. అచ్చట నీకు సత్పురుష
దర్శనము వలన గలుగు ఫలమును తెలియపరచెదమనిరి.
రాజు బ్రాహ్మణుల వాక్యములు శిరసావహించి ఒక దినమున
పరివారమును విడనాడి ఒంటరిగ పాపవినాశన తీర్ధమునకేగి అచ్చట స్నానమొనర్చి
కూర్చుండెను. అప్పుడు ఒక బ్రాహ్మణ యతి
అచ్చటకు వచ్చెను. రాజు ఆ యతికి నమస్కరించి
తన వ్రణముచూపి అది శమించు ఉపాయ మేమియైన నుండిన చెప్పుడని వినయముతో ప్రార్ధింప నా
యతి నారాజుతో నిట్లనుచున్నాడు. ఓ
రాజా! వినుము. సాధువుల దృష్టి పడిన మాత్రముననే నీ వ్రణము శమించి నీకు ఆరోగ్యము కలుగును. ఇందుకు గాను నీకు ఒక ఇతిహాసమును చెప్పెద
వినుము. పూర్వము అవంతీనగరమున ఒక
దురాచారుడగు బ్రాహ్మణుడుండెడివాడు. అతను
జాతికి బ్రాహ్మణుడైనను బ్రాహ్మణ ధర్మమును విడనాడి పర స్త్రీలోలుడయి స్నాన
సంధ్యాదుల త్యజించి దురాచారుడై పింగళ యను వేశ్య యింటనే నివసించుచు అచటనే
భుజించుచు అహోరాత్రులు దానితో క్రీడించుచుండెను.
ఇట్లుండ ఋషభుడను ఒక మహాయోగి దైవయోగమున ఒక దినము సాయంకాలమునకు ఆ పింగళ
ఇంటివద్దకు రాగా నానీచ బ్రాహ్మణుడు ఆ ఋషికి ప్రణమిల్లి ఆహ్వానమొనర్చి ఇంటిలోపలికి
కొనిపోయి ఆసనమున కూర్చుండ బెట్టి షోడశోపచారములతో వేశ్య సమేతుడై పూజించి, ఆ ఋషీశ్వరుని పాద తీర్ధమును తానును ఆవేశ్యయును
గ్రహించి వారికి మంచి పక్వాన్నములతో భోజనమిడెను.
అనంతరము వారి హస్తములు,
పాదములు
కడిగి తుడిచి తాంబూలమిడి మంచి మృదువైన తల్పమున పరుండబెట్టి ఆ వేశ్యయు, తానును ఆ ఋషీశ్వరుని పాద సంవాహనమొనర్చిరి. ఇట్లు వారిచే పూజించబడి ఆ రాత్రి వారి ఇంట
సుఖముగ నిద్రించి తెల్లవారుట తోడనే ఆ ఋషీశ్వరుడు యథేష్టముగ తన త్రోవను తాను
పోయెను.
కొంతకాలమునకు ఆ బ్రాహ్మణుడు, ఆ వేశ్యయును వార్ధక్యము రాగా మరణించిరి. ఒక దినము మాత్రమే సాధు సేవ చేసిన పుణ్యవశమున ఆ
బ్రాహ్మణుడు దశార్ణ దేశమునకు రాజైన వజ్రబాహు మహారాజు యొక్క పెద్ద భార్యయగు సుమతి
గర్భమున ప్రవేశించెను. రాజుతన పెద్ద భార్య
గర్భవతి అయినందుకు కడు సంతసించి పుంసవనాది సంస్కారములను గొప్ప వైభవముతో
గావించెను. ఇట్లుండ ఆరాజు యొక్క
చిన్నభార్య తనకు సంతానము లేక తన సవతికి
సంతానము కలిగిన రాజునకు తనయందు ప్రేమ తగ్గునని భావించి అసూయతో సుమతికి
తీవ్రమగు గరళమును భోజనముతో కలిపి ఒసంగెను.
సుమతి శరీరమంతయు విషముచే వ్యాప్తమయ్యెను కానీ దైవయోగమున
మరణించకుండెను. నవమాసములు నిండి కష్టముతో
ప్రసవించెను. కానీ బాలుడు కూడ విషము జీర్ణించుటచే తల్లి వలె శరీరమంతయు విష వ్రణములు
కలవాడై జన్మించెను. వ్రణబాధతో నాబాలుడు
రాత్రిందినములు నిద్రాహారములు లేక నేడ్చుచుండెను.
రాజు తన భార్యయు కుమారుడును విషవ్రణములతో దుఃఖపడుచుండుట చూచి
చింతాక్రాంతుడై అనేక వైద్యుల పిలిచి నెన్నియో చికిత్సల చేయించెను కానీ
విషవ్రణములు శమింపవయ్యెను. తల్లికి
కుమారునకు కూడ వ్రణములనుండి చీము పురుగులుగూడ పడుచుండెను. ఇట్లు రాణియు బాలుడును కడు
దుఃఖముననుభవించుచుండిరి. నిద్రాహారములు
లేక కృశించుచుండిరి. ఇట్లుండ రాజు వారల చూచి ఎన్నో చికిత్సల చేయించినను వీరల
వ్యాధి తగ్గుట లేదు. ఏమి చేయుదు? వీరల బాధ చూచి సహించుట కూడ దుర్భరముగానున్నది.
వీరుపూర్వజన్మమున మహా పాపమాచరించిరి. వారిపాపము వారు అనుభవించియే తీరవలయును. ఇక
మీదవారల చూడజాలనని భావించి తనసూతని పిలిచి అతనితో నీవురాణిని ఈమెకుమారుని రథముమీద
గొనిపోయి నరసంచారములేని కీకారణ్యమున వదలిరమ్మని యాజ్ఞాపించి
నాసుతుడట్లేచేపివచ్చెను. నగరమందలి ప్రజలందరు రాజుచేసిన ఘోరకృత్యము చూచి హాహాకారము
లొనరించి రాజును దూషించిరి. రాజు
ఈవిషయమును ఇతర భార్యలతో చెప్ప వారు సంతసించిరి. రాజు ఇతర భార్యలతో
సుఖించుచుండెను.
రాణి బాలునితో సహ అరణ్యములో అన్నోదకములు లేక ఎంతయోకష్టము
నొందుచూ నడచుటకు మార్గమైన లేనందున నటునిటి ముళ్ళకంపలలోను, రాళ్ళగుట్టలలోను మెల్ల మెల్లన తిరుగుచు వ్యాఘ్రములు సర్పముల చూచి భీతల్లుచు దప్పిక
అయిననూ త్రాగుటకు నీరు లేక బాధపడుచు, దైవవశమున అరణ్య మార్గమున కొంతమంది వైశ్యులు గోవుల తోలుకొని పోవుచుండ వారల
సమీపించి ఇచ్చట ఎక్కడైన ఉదకము దొరుకునా అని అడిగెను. అప్పుడు వారు ఈ సమీపముననేనొక గ్రామము
కలదు. మా వెంట రమ్ము అని ఆమెను
వెంటనిడుకొని వారి గ్రామమునకు ఆమెను కొనిపోయిరి.
ఆ గ్రామమును పద్మాకరుడను వైశ్యుడు పరిపాలించుచుండెను. అతడు పుణ్యాత్ముడు దయాళువగుటచే నతడు రాణిని
ఆదరించి ఆమె పూర్వ వృత్తాంతము తెలుసుకొని ఆమె నివాసమునకొక గృహమిచ్చి
అన్నపానములుగూడ యధేచ్చముగా నొసగుచు పోషించుచుండెను. కొంతకాలమట్లు జరుగుచుండెను కానీ వ్రణములు
మాత్రము ఎన్ని చికిత్సలు చేసినను ఉపశమించకుండెను.
ఇట్లుండ ఒక దినము నామెకుమారుడు వ్రణపీడితుడై మృతినొందెను. అప్పుడు రాణి పుత్రుని మరణమును చూచి మూర్ఛనొంది
లేచి పుత్రుని గూర్చియు తన పూర్వ స్థితిని స్మరించియు మిక్కిలి దుఃఖించెను. వైశ్యుని భార్యయు, ఇతర స్త్రీలు ఎంతయో ఓదార్చిరి, కానీ ఆమె దుఃఖము శమింపదయ్యెను. హా!కుమారా! భార్యయు బంధువులు గూడ విడనాడినను
నిను చూచి బ్రతుకుచుంటిని. నన్ను వదలి
నీవు ఎటకేగితివి? నీవు నన్ను
రక్షింతువనుకొంటిని నీవు మరణించితివి. ఇక
నాకు రక్షకులెవరు? నేనును ప్రాణముల విడిచెద అని ఇట్లు రాజు భార్య శోకించుచుండ
నానగరమందలి వారందరును దుఃఖింపసాగిరి.
అట్టి స్థితిలో వృషభయోగి ఆ పిల్లవాడు పూర్వ జన్మమున తనకు ఒక దినము రాత్రి
చేసిన పరిచర్యను స్మరించి ఆ బాలుడు మరణించి పడియున్న స్థలమునకు వచ్చెను. వైశ్యుడు ఆయోగీంద్రున కర్ఘ్యపాద్యముల ఇచ్చి
పూజించెను. అప్పుడా యోగియు వైశ్యునితో
ఏమియు తెలియనివాడు వలె ఈమె ఎవరు?
ఎందులకేడ్చుచున్నది అని అడుగ నా వైశ్యుడు నామె
వృత్తాంతమంతయు చెప్పెను. అప్పుడా ఋషభయోగి
ఆమెను సమీపించి ఇట్లనెను.
ఓ రాణీ! ఎందులకు మూఢురాలవై
శోకించెదవు? పుట్టినదెవరు? చచ్చినదెవరు? ఆత్మకు పుట్టుక
లేదు. చచ్చుటలేదు. ఆత్మ ఎవ్వరికి గోచరమగునది కాదు. దేహమా! ఇది పాంచ భౌతికము. పుట్టుటకు పూర్వము లేదు. మధ్యన కొంతకాలము నీటిలో తరంగ ఫేన బుద్బుదములవలె
కొంత కాలము కనబడి నశించును. పంచభూతముల
చేరిక వలన నేర్పడిన శరీరమందు జీవుడు సూక్ష్మ శరీర సమేతుడై కర్మముననుసరించి సంచరించి
కర్మతీరిన తోడనే దేహమును విడనాడును.
అప్పుడు ఈ స్థూల శరీరము జడమై పడిపోవును.
ఆత్మకు నాశనమేలేదు కావున నీకు శోకము తగదు.
జీవుడు ప్రకృతి గుణములకు లోనై కర్మబంధములో పడి సత్వగుణమును బట్టి
దైవత్వమును, రజోగుణమువలన
మనుష్యత్వము, తమోగుణము వలన
తిర్యక్త్వమును పొందును. ఎప్పుడు గుణముల
కతీతుడగునో అప్పుడు జీవుడు జన్మమరణ పరంపరల నుండి విముక్తి గాంచును. ఏ గుణము ప్రబలముగానుండగా జీవుడు మరణించునో
వచ్చు జన్మ ఆగుణముననుసరించియే వచ్చును. ఈ
సంసారమున జన్మించు ప్రతిజాతియు సుఖదుఃఖములను, జన్మమరణములను కర్మననుసరించియే పొందుచుండను. కోటికల్పముల
ఆయుష్యము గలవారైనను చివరకు మరణింప వలసినదేకదా! ఇక స్వల్పాయుష్యము గల మనవంటివారల
విషయము చెప్పనేల. ఈవిషయము తెలిసిన విజ్ఞులు జన్మయందు మోదమును,
మరణమందు
విషాదమును పొందరు. జీవుడెప్పుడు గర్భమున
ప్రవేశించెనో మృత్యువు అప్పుడు నుండియు అతనినాశ్రయించియేయున్నది. కొందరు
తారుణ్యమునను మరికొందరువృద్ధాప్యమునను మరణింతురు. ఏజీవి ప్రారబ్ధము ప్రకారము ఆ
జీవి జన్మమరణములనొందుచుండును. ఇట్లుండ
తత్త్వము తెలిసికొనలేక పుత్రుడు,
భార్య అని
మోహముతో మానవులు బంధమునొందుచున్నారు.
బ్రహ్మ లలాటమున లిఖించిన వ్రాతను మార్చగల శక్తి దేవతలకుకూడ లేదు. పూర్వ జన్మములో నీవు ఎవరకి తల్లివో ఎవరికి
భార్యవైతివో అప్పుడు నీచుట్టములెవరో విచారించుము. వారల గుఱించి నీవు దుఃఖించుచుంటివా?
కాన
నేను చెప్పిన రీతిని విచారించి శోకము విడనాడి ఈశ్వరుని శరణు పొందుము. కృతార్ధురాలవు కాగలవు అని ఋషి చెప్ప నారాణి
తిరిగి వారితో నిట్లనుచున్నది. ప్రభో!
ఋషిపుంగవా! నేను రాజ్యభ్రష్టురాల నగుటయేకాక ఇట్టి స్థితినొందితిని. ఈ పుత్రుడు జీవించగలడను ఆశతో తల్లితండ్రుల నందరకూడ విడనాడితిని. ఇట్టి స్థితిలో నా ప్రాణప్రియుడగు పుత్రుడే
మరణించ నికనేను జీవించి ఏమి ప్రయోజనము? నేనును మరణించెదనని చెప్పి
మరణోన్ముఖురాలై ఆ ఋషిపాదముల మీద పడెను.
అప్పుడా యోగీంద్రుడు ఆ బాలుడు పూర్వ జన్మమున తనకు చేసిన సేవను స్మరించి
ప్రసన్నుడై కొంచెము భస్మము మంత్రించి కొంతనాబాలుని మీద చల్లి కొంత నోటిలోనుంచ
వాడు నిద్రపోయిన వానివలె లేచి కూర్చుండెను.
ఆ బాలుని శరీరము దివ్యకాంతివంతమయ్యెను.
వ్రణబాధ నివర్తించెను. మరికొంత
భస్మము ఆ రాణిమీద ప్రోక్షించ నామెయు వ్రణబాధ పోయి సువర్ణ కాంతిగల శరీరము
గలదయ్యెను. యోగీశ్వరుడు వారలకు వరముల
ననుగ్రహించెను. ఆ బాలునకు భద్రాయువను
నామమిడి ఆ బాలుడు కీర్తిమంతుడై గుణసంపన్నుడై తండ్రివలె చిరకాలము రాజ్యమేలగలడని
ఆశీర్వదించి వెడలిపోయెను. భద్రాయువను
బాలుడు ఋషభయోగీంద్రుల ఆశీర్వచన బలమున ఇహలోకమున అఖండ సౌఖ్యము ననుభవించెను.
కాన నో రాజా! సత్పురుషుల సేవించుటచే
సర్వవ్యాధులు తప్పక నివర్తించగలవు. కాన నీవు చింతింపక సత్పురుషులు దర్శింపుము.
నీకు వ్రణమునివర్తించునని చెప్ప నాతురుష్కరాజు ఆయతి నమస్కరించి ప్రస్తుతకాలములో
నెవ్వరైన అట్టి సత్పురుషులు ఉన్న దయతో సెలవిండు నేను సత్వరమువెళ్ళి వారిని
దర్శించెద. వారి దర్శనమాత్రము చేతనే నావ్యాధి నయమగునని నమ్మకము నాకు గలదు. అని
ప్రార్థించ నాయతి ఓరాజా! భీమాతీరమున, గంధర్వపత్తనమున పరమపురుషుడు,
భగవంతుడు
నృసింహ సరస్వతియను నామముతో వెలయుచున్నారు. నీవు వారినిదర్శించితివేని తప్పక నీకు
ఆరోగ్యము కలుగును అనిచెప్పిపోయెను.
వెంటనే ఆతురకరాజు విశ్సాసముగలవాడై
చతురంగబలముల వెంటనిడికొని గంధర్వనగరము సమీపించి గ్రామస్థులతో ఆగ్రామమున నొక తాపసి
సన్యాసిరూపమున నున్నారని వింటిని. వారెక్కడమన్నారో చెప్పుడని యడుగ గ్రామస్థులు
తురుష్కుడువచ్చెను ఏమి చేయునోయని భీతిల్లిరి. రాజు తిరిగి వారల చూచిస్వామివారిని
చూడవచ్చితిని మీరు చెప్పరెందులకని కోపముతో బలుక వారు స్వామివారు అనుష్ఠానమునకు
సంగమమునకువెళ్లిరి. మధ్యాహ్నమునకు గ్రామమునకు భిక్షకురాగలరని చెప్పిరి. వారి
వాక్యము విని తనపరివారము నచ్చటనే ఉంచి తాను ఆందోళిక నధిష్ఠించి సంగమమునకు వెళ్లి
దూరముననే ఆందోళిక నుండి దిగి పాదచారియై స్వామివారిని సమీపించి నమస్కరించెను.
స్వామివారు రాజును చూచి ఓరీ! చాకలీ!
వచ్చితివా! ఎంతకాలమునకు నిన్ను చూడగలగితిననిరి. స్వామివారి వాక్యము వినుట తోడనే
అతనికి పూర్వజన్మజ్ఞానము కలిగి సాష్టాంగముగ నేలపై పొరలుచు లేచి ఏడ్చుచు తన పూర్వ
జన్మమును స్మరించి గద్గద ధ్వనితో ఇట్లను చున్నాడు. స్వామీ నన్ను మీరు ఉపేక్షచేసితిరి. గృహస్థకూపమున పడిడపోతిని. మదించి మీ చరణముల మరచితి. దుష్టబుద్ధినై సంసార సాగరమున మునిగితిని. మాయా జాలములో చిక్కుకొని మీ పాదము
స్మరించనైతిని. మతిహీనుడనై మీ
సాన్నిధ్యమును విడనాడితిని. మీరు అజ్ఞానులను
ఉద్ధరించిన వారై ఉండియు నన్ను ఎందులకు ఉపేక్షించి
అజ్ఞాన మహాసముద్రమున పడవేసితిరి.
నన్ను దయయుంచి జన్మ పరంపరలలో తిరిగి పడకుండ నుద్ధరించుడని దీనుడై ప్రార్ధించెను. గురుమూర్తి సంతసించి రాజుతో నీకోరిక
సిద్ధించుగాక. అని ఆశీర్వదించిరి. అప్పుడు రాజు స్వామివారితో తొడమీదనొక
రాచపుండులేచి అపరిమితమైన బాధపడుచున్నాననెను.
అప్పుడు స్వామివారు వానితో ఓరీ అబద్ధమాడుచున్నావు. ఏదీ చూపుము చూచెదననిరి. వాడు స్వామివారి వాక్యములు విని ఆశ్చర్య పడి
కట్టు విప్పి చూడ తొడమీద వ్రణముయొక్క గుర్తైనలేకపోయెను. అప్పుడతడు ఆశ్చర్యమునొంది సంతసించి స్వామివారి
పాదములమీద పడి నమస్కరించి స్వామీ! మీ ప్రసాదమువలన రాజ్యమునొందితిని. ఐశ్వర్యమునకు మితిలేదు. పుత్రపౌత్రాదులు గలరు. నామనసు తృప్తినొందెను. కాని ఒక కోరిక కలదు. తమరు దయయుంచి నారాజ్యమునకు వచ్చి నాఐశ్వర్యమును
తిలకించుడు. అటుపిమ్మట నేనీ సంసార భారము
విడనాడి మీ పాద దాసుడనై ఉండెద. ఇదే
నాకోరిక అనెను.
ఆ రాజు మాటవిని స్వామివారు ఓరీ! నేను
సన్యాసిని. మీరు తురకలు. మీ గ్రామములో గోహత్యలు జరుగుచుండును. తురుష్కులు మహా పాపములాచరింతురు. అట్టి మీ నగరమునకు నేనెట్లు రాగలను అనిరి. అప్పుడారాజు దీనుడై నేను ప్రస్తుతము నీచజాతిలో
తురుష్కరాజునై జన్మించినను పూర్వము మీ దాస్యమొనర్చిన చాకలినే కదా! మీ అనుగ్రహముచే
రాజునై ఈ జన్మలో సమస్త సుఖముల అనుభవించితిని.
తమరు వచ్చి నాపుత్ర పౌత్రాది సంపద వీక్షించిన నాకు సంతోషమగును. అనంతరము సర్వము విడనాడి మీ పాద సేవ
యొనర్చెదననెను. ఇటుల ఆ రాజు దీనుడై మాటి మాటికి ప్రార్ధించ గురుమూర్తి తన మనమున
ఇట్లు విచారించిరి.
నేనిక మీద ఈ లోకమున నుండ తగదు. ఉంటినేని నీచులు కూడ నన్ను వచ్చి ఆశ్రయింతురు.
కలి ప్రబలుచున్నది గాన నేను గౌతమీ యాత్ర యను మిషతో నీ క్షేత్రము విడనాడి
మ్లేచ్ఛుని మనోరధము తీర్చి సింహరాశిలోనికి
బృహస్పతి వచ్చెను కాన గౌతమీ పుష్కర స్నానమొనర్చి ఈ లోకమున నిక నదృశ్య రూపమమున
నుండెద అని భావించి రాజుతో కొలది శిష్యులతో సహ బయలు దేరిరి. మ్లేచ్ఛరాజు గురుమూర్తిని పాలకియందు
కూర్చుండబెట్టి వారి పాదుకల శిరసావహించి పాదచారియై నడచుచుండెను. స్వామివారతనితో నీవు రాజువుగాన
గుఱ్ఱమునధిష్టించుము. లేనిచో నీ జాతివారు
నిన్ను పరిహసింతురు అన వాడు స్వామీ నేను మీసేవకుడనైన రజకుడనే కదా! పరశువేదిచే లోహము సువర్ణమైన రీతిని మీ
అనుగ్రముచే రాజునైతిని. మీరే రాజులు నేను
మీ సేవకుడను అనుచు స్వామివారితో సహ పాదచారియై గణగాపురము సమీపించి అచ్చటనున్న తన
రథగజతురగాది సైన్యము నంతను గురుమూర్తికి ప్రదర్శింప చేసెను. గురుమూర్తి అతని సంపద చూచి సంతసించి అతనితో
చాలా దూరము ప్రయాణము చేయవలయునుగాన నా ఆజ్ఞననుసరించి గుఱ్ఱము నధిష్టించుమన నా రాజు
గురుమూర్తి శిష్యులందరిని ప్రత్యేకపు
గుఱ్ఱముల మీద నెక్కించి తానుగూడ గుఱ్ఱము నధిష్టించెను. ఆ రాజు తనకు గురు దర్శన భాగ్యమబ్బెనని
సంతోషములో పరవశుడై ఉండెను. స్వామివారతని
పిలిచి ఓరీ! నీవు నీచ కులమున పుట్టినను నీ
భక్తికి సంతసించితిని. నేనొక మాట చెప్పెద
వినుము. మేమే తాపసులము. నీ వెంట వచ్చినచో మాకు అనుష్టాన భంగము
వాటిల్లును. నేను ముందుకు వెళ్ళి
పాపవినాశనము వద్దనుండుదును. నీవు పరివారముతో సహ మెల్లగ వచ్చి అచ్చట నన్ను
దర్శించుము అని చెప్పి శిష్య సమేతముగ నంతర్ధానమొంది వైడూర్య నగరమునకు కొలది
దూరముననున్న పాపవినాశనము చేరి అనుష్టానమొనర్చు చుండిరి. స్వామివారచ్చటకు వచ్చుట వైడూర్య నగర ప్రాంతమున
కాపురమున్న సాయందేవుని కుమారుడు నాగనాధుడు విని స్వామివారిని శిష్య సమేతముగ తన
గృహమునకు కొనిపోయి షోడశోపచారములతో మహాపూజగావించి భిక్షచేసెను. స్వామివారు నాగనాథునితో మ్లేచ్ఛరాజు
నీదర్శనముకొరకు సాయంకాలమునకు పాపనాశనమునకు రాగలడు. నేనచ్చట నుంటినేని నాకొరకు అతడు
మీగృహమునకు వచ్చుచో మీయాచారధర్మములకు భంగము వచ్చును. గాననేనచ్చటకు పోయెదనని చెప్పి
శిష్యసమేతముగ పాపనాశనము చేరి అచ్చట
అనుష్ఠానమొనర్చుచుండెను.
తురుష్కరాజు గురుమూర్తి శిష్యసమేతముగ
అంతర్ధాన మెందుగ చూచి ఎంతము విచారించి గురుమహిమ తెలిసినవాడగుటచే తనమనమున నిట్లు
అనుకొనెను. గురుమూర్తిమహిమ నెవ్వరు తెలిసికొనగలరు? నాభాగ్యము మంచిదిగాననే వారి చరణదర్శనమయ్యెను. వ్రణమనుమిషచే
వచ్చి వారిని దర్శించితిని. వారి దర్శనమాత్రముననే వ్రతము అదృశ్యమయ్యెను. నేను
ముందు వెళ్ళి పాపనాశనముననుందు మనిరిగదా! వారు మనోవేగమున నచ్చటకేగియుందురని ఆరాజు
నిశ్చయించుకొని వేగమునపోగల గుఱ్ఱము నెక్కి నలుబదినాలుగు కోసులదూరము దినమంతయు
ప్రయాణమొనర్చి సాయంకాలమునకు పాపవినాశనము సమీపించి అచ్చట స్వామివారిని దర్శించెను.
స్వామివారికి నమస్కారించి తననగరమునకు దయచేయుడని ప్రార్థించి నగరమంతయు
ముత్యాలతోరణములతోడను, పతాకములతోడను
అలంకరింపచేసి స్వామివారిని దివ్యమైన పల్లకిలో కూర్చుండబెట్టి తాను పాదచారియై
నగరమంతయు ఊరేంగింపు చేసెను. నగరస్థులు స్వామివారికి ఇంటింట రత్నాలహారతులనిచ్చిరి.
మేచ్ఛజాతివారు మాత్రము ఈ రాజు జాతి ధర్మమువిడిచి విప్రుల పూజించుచున్నాడు. ఎవరి
ముఖము చూడరాదో అట్టివారి సేవ చేయుచున్నాడు. ఇతను జాతిభ్రష్టుడయ్యెనని నిందించుచుండిరి.
మంచివారుమాత్రము రాజుయొక్క మంచి స్వభావము చూచి వేయినోళ్ల పొగడుచు రాజును
ఆశీర్వదించిరి. నగరములోనివారందరు స్వామివారు పల్లకి వద్దకు వచ్చి నమస్కరించి ఈ
మహానుభావుడు భగవంతుడుగాననే ఈ రాజుమ్లేచ్ఛుడయినను వారి సేవచేయుచున్నాడని భవించిరి. నానా విధముల వాద్యములు
మ్రొగుచుండెను.స్వామివాని బిరుదావళులు వందిమాగధులు పఠించుచుండిరి. రాజు ఆనంద
నిర్భరుడై బీదలకు వస్త్రముల పంచిపెట్టి బిక్షకుల సంతోషపెట్టెను. పల్లకి రాజభవనము
సమీపించి స్వామివార పాదములు నేలకు ఆనకుండ మార్గమంతయు దివ్యాంబరముల పరచిరి.
పల్లకినుండి స్వామివారిని దింపి ఆమ్లేచ్ఛరాజు తనరాజ భవనమునకు గొనిపోయి
మహాసింహాసనమున వారిని కూర్చుండబెట్టెను. రాజుభార్యలు హారతులనిచ్చిరి. రాజభవనము
చక్కగనలంకరింపబడెను. గురుమూర్తియు
వారిముఖ్య శిష్యులమైన నాతో నలుగురు మాత్రమే రాజభవనమును చూచితిమి మిగతా జనమంతయు
భవనమునకు వెలుపలనే ఆపబడిరి. రాజు తన పుత్రపౌత్రులచే గురుమూర్తికి
నమప్కారముచేయించెను. గురుమూర్తివారిని ఆశీర్వదించి కుశల ప్రశ్నగావించిరి. తరువాత
గురుమూర్తి నవ్వుచు నీమనోరథమునెరవేరెనా? ఇంకనేమైన కోరికలు గలవా! చెప్పుమనిరి. అప్పుడు ఆరాజు స్వామి! ఈవిభవములలో పడి మీకు
దూరమైతిని. బుద్ధి వచ్చెను. మీ పాద సేవ
చేయుట తప్పనిక నే కోరికయు కోరననెను.
గురుమూర్తి కొంతకాలమునకు నీవు శ్రీశైలమున నన్ను కలసికొనగలవు. నీవు నీ పుత్రునకు రాజ్యమప్పగించి నావద్దకు
రమ్మనిచెప్ప వాడు నాకు జ్ఞానమును అనుగ్రహించుడని కొరెను. అట్లే అతనికి జ్ఞానదానము చేసి శిష్యసమేతముగ వెడలి
గౌతమిని స్నానమొనర్చి గాణగాపురము ప్రవేశించిరి.
స్వామివారిని దర్శించి అచటి వారందరూ ఆనందభరితులయిరి. ప్రజలందరు హారతులిచ్చిరి. అప్పుడు స్వామివారు శిష్యులందర రావించి వాలతో
ఇటుల చెప్పిరి.
మా కీర్తి లోకమంతట ప్రకటమయినది. యుగధర్మము కఠినముగనున్నది. ఇకమీద ప్రకటరూపమున నున్న తురకలుకూడ నా వద్దకు
వత్తురు. నిజమయిన భక్తిలేక అనేక కామలతో
ఎందరో వారివారి మనోరథముల సఫలముగావింతుకొనగలందుకు రాగలరదు గాన నేనికమీద
నదృశ్యరూపమున గుప్తముగ నుండెద. శ్రీశైల
యాత్రయను మిషతో నీక్షేత్రమునండి బాహ్యమునకు వెళ్ళినటుల కనబడుదునే కాని నా
సాన్నిధ్యమిచ్చటనే ఉండును. ఇచ్చట
నదృశ్యరూపమున నుండి భక్తుల కాపాడుచుందుననిరి.
సిద్ధముని నామధారకునితో
నిట్లనుచున్నారు. నామధారకా గురుమూర్తి
ఇప్పటికి ప్రత్యక్షముగ గాణగాపురమున కలరు.
భక్తితో భజించువారికి దర్శనమిచ్చెదరు.
సందేహింపకుడు. ఇట్టి గురుచరితమును
భక్తితో నియమముతో పఠించువారికి వారి మనోరధముల గురుమూర్తి యొసంగి
రక్షించుచుండును. నామధారకుడు
ఇట్లనుచున్నాడు. శ్రోతలరా! గురుమూర్తి
లోకదృష్టికి అవతారము చాలించిరేగాని భక్తితో ధ్యానించువారికి గాణగాపురమున నిప్పటికి
దర్శనమిచ్చెదరు. నేను అనుభవించి
చెప్పితిని. సంశయింపక గాణగాపురము వెళ్ళి
గురుమూర్తిని దర్శించి కృతార్ధులు కండు.
ఇట్లు సిద్ధనామధారక సంవాదాత్మకమగు గురుచరితమున యాబదియవ అధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
ఏబది ఒకటవ అధ్యాయము
శ్రీ గణేశాయ నమః
నామధారకుడు సిద్ధమునితో
స్వామీ!ఆ పైన నేమి జరిగెనో చెప్పుడన సిద్ధముని ఇట్లనుచున్నారు. తరువాత తమ మనమున ఇట్లనుకొనిరి. మా మహిమ లోకవిఖ్యాతమయ్యెను. ఇకమీద నేను గుప్తరూపమున నుండెద. లేనిచో నానాజాతివారును నావద్దకురాగలరని భావించి
శిష్యులను పిలచి వారలతో తమ సంకల్పము చెప్పి శ్రీశైలయాత్రకు వెడల సన్నద్ధులయిరి.
అందరు వియోగమును సహింపజాలక విలపింపసాగిరి. స్వామివారు వారలతో నవ్వుచు మీరు
చింతించకుడు. నేను ఈ గ్రామముననే యుందును. నిత్యము అనురజాసంగమమున స్నానమాడి మధ్యాహ్నమున నిచ్చటిమఠమునకు భిక్షకు వచ్చెద.
నేను గుప్తరూపమున నుననను నిజమైన భక్తులకు ప్రత్యక్షముగగూడ దర్శనమిచ్చెద. మఠమున
మీపూజగూడ గుప్తరూపమున స్వీకరింతును. మీరెంతమాత్రము సందేహింపవలదు. ఇచ్చట నా
నిర్గుణపాదుకల నుంచెద. ఎవ్వరు సంగమస్నానమొనర్చి అచ్చటి అశ్వత్థమును పూజించి మఠమున
నున్న నిర్గుణపాదుకల శ్రద్ధతోభక్తితో నర్చింతురో వారి మనోరథములన్నియు తప్పక
నెరవేరగలవు. ఇచట చింతామణి వినాయకుని పూజించువారి సర్వ కార్యములు నిర్విఘ్నముగ
కొనసాగగలవు. ఇచ్చట అష్ట తీర్ధములందు
స్నానమొనర్చుడు. అట్లొనర్చు వారు నా
అనుగ్రహమునకు పాత్రులయ్యెదరు. నా నిర్గుణ
పాదుకలకు త్రికాలములందు హారతులిచ్చువారికి వారి మనోరథములన్నియు తప్పక నెఱవేరగలవని
శిష్యుల సమాధాన పరచి స్వామివారు గ్రామమునుండి బయలు వెడలిరి. గ్రామస్థులు స్వామివారిని ప్రయాణము చేయించి
తిరిగి వచ్చి మఠము ప్రవేశించి చూడ నచట స్వామివారు ప్రత్యక్షముగ వారికి కనబడిరి. లోకులందరు నప్పుడు స్వామి వారు మనుష్యమాత్రులు
కారనియు త్రిమూర్తి స్వరూపులనియు నిశ్చయించిరి.
ఇట్టి స్వామివారిని మనుష్యులని తలచువారు తప్పక యమపురమునొందగలరని భావించిరి. స్వామివారు క్షణమాత్రమున తిరిగి
అదృశ్యులయ్యిరి.
స్వామివారు నలుగురు శిష్యులతో కలసి శ్రీశైలమందలి
పాతాళగంగను సమీపించి శిష్యులతో మీరు అరటి ఆకులతోను పుష్పములతోను ఒక ఆసనమును
సమకూర్చుడు. అందు నేను కూర్చుని
మల్లికార్జునునితో ఐక్యము కాగలందులకు పోవలయునని ఆజ్ఞాపించిరి. శిష్యులు చేమంతి, మాలతి,
కల్హారాది
పుష్పములు తెచ్చి అరటి ఆకులతోడను పుష్పములతోడను ఒక ఆసనమును సిద్ధపరచిరి. ఆ ఆసనమును ప్రవాహముననుంచ స్వామివారు వారలతో
మీరు మీ గృహములకు శీఘ్రముగ పొండు. నేను గాణగాపురమున గుప్తరూపముననుండెద. భక్తులకు దర్శనమిచ్చెద. అభావికులకు ఇకమీద కనబడకుండ ఉండగలందులకుగాను
నేను గుప్తమగుచున్నాను. ఇది నిశ్చయము. నేను నిర్ధారణగ భక్తుల
గృహములనుండెదననిరి. శిష్యులు గురుమూర్తి
పాదముల శిరమునుంచి నమస్కరించి వారినాశీర్వదించి గురుమూర్తి పుష్పవిమానము మీద కూర్చుండిరి. స్వామివారు శిష్యులతో మీరు మీ గృహములకు పొండని
ఆజ్ఞాపింప శిష్యులు నిర్విణ్ణులయి దుఃఖించుచుండిరి. అప్పుడు స్వామివారు శిష్యులతో మీరు వేరు భావన
చేయకుడు. బాహ్యమునకు లేనట్లు
కనబడుదును. భావికులకు నేను దర్శనమిచ్చు
చుండెద. నేను నా భక్తుల గృహములందే
వాసమొనర్చెద. దుఃఖించకుడని
ఓదార్చిరి. అప్పుడు శిష్యులు గురుమూర్తి
పాదములకు నమస్కరించిరి. స్వామివారు
వారినాశీర్వదించి ఆనందముతో పుష్పాసనమున కూర్చుని ఉండిరి. బృహస్పతి కన్యారాశికి వచ్చెను. బహుధాన్య సంవత్సరము, ఉత్తరాయణము, మాఘమాసము, శుక్ల పక్షము
శుక్రవారము పుణ్యదినముగాన నీరోజున నేను నా స్థానమునకు పోవుచున్నాను. మీకు నేను ప్రసాద పుష్పముల పంపెద. మీరు వాటిని గ్రహించి పూజించుడు. మీరు లక్ష్మీ సంపన్నులు కాగలరు. నాకు గానమన్న కడు ప్రీతి గాన నిత్యము మీ గృహముల
భగవంతుని గానమొనర్చుడు. అట్టి గృహముల నేను
నివసించెద. వారింట వ్యాధులు గాని
దారిద్య్రముగాని ఉండజాలదు. మీరు
దీర్ఘాయుష్మంతులయి, పుత్రపౌత్రాభివృద్ధి
గాంచగలరు. నా చరిత్రను పఠించువారు
దీర్ఘాయుష్మంతులయి లక్ష్మీసంపన్నులయి ఉండెదరు.
ఈ విషయమున నెట్టి సంశయములేదని శిష్యులతో చెప్పి స్వామివారు
అంతర్ధానమొందిరి.
శిష్యులు గురుమూర్తి వియోగమును సహించలేక విచారపడుచుండిరి.
ఇంతలో కొంతమంది పల్లెవాండ్రు అచ్చటికివచ్చి మీగురుమూర్తిన మేము చూచితిమి. దండము
ధరించి యతీశ్వరరూపమున నున్నారు. వారు మాతో నాపేరు నరసింహసరస్వతి. నేను
నానిజస్థానమునకు పోవుచున్నాను. అయినను గణగాపురముననే నిత్యము నివసింతును. అని మీతో
చెప్పుమనిరి మీగురుమూర్తి స్వర్ణపాదుకల ధరించియుండిరి. వారుమీతో మీగ్రామములకుపోయి
నాయందుభక్తి సల్పుచు సుఖముగ నుండుడు. మీకు ప్రసాద పుష్పముల పంపుచున్నాను. వాటిని
తీసికొని పొండు . అని చెప్పిరని పల్లెవారు చెప్పుచుండ ప్రవాహములో నుండి నాలుగుపుష్పములు
శిఫ్యులున్న స్థానమునకు కొట్టుకొని వచ్చెను. ఆపుష్పములు స్వామివారి
శిష్యులుగ్రహించిరి. అవి సిద్ధముని చెప్ప నామధారకుడు స్వామీ! స్వామివారికైలాస
యాత్ర సమయమున వారిసమీపముననున్న ముఖ్యశిష్యులెవరో సెలవీయడని ప్రార్థింప సిద్ధముని
ఇట్లనుచున్నారు నామధారాకా! స్వామివారికి ఎంతోమంది శిష్యులు కలరు. కొంతమంది
గణగాపురమున నున్నాడు. స్వామివారికి శిష్యులైనయతీశ్వరులు కృష్టసరస్వతి, బాలసరస్వతి, ఉపేంద్రమాధవసరస్వతి మొదలగువారు స్వామివారి యాజ్ఞననుసరించి
తీర్థయాత్రలు చేయవెడలిరి. స్వామివారు శ్రీశైలయాత్రకు వచ్చునపుడు నలుగురు ముఖ్యశిష్యులు
మాత్రమే వారివెంట వచ్చిరి. అందులో మొదటివాడు సాయందేవుడు, నంది,
నరహరి అను
ఇద్దరు కవీశ్వరులు. నాలుగవవాడను నేను. మేము స్వామివారి పుష్పముల స్వీకరించితిమి. అని
తనవద్దనున్న ప్రసాదపుష్పమును చూపెను.దానిని చూచి ఆనందభరితుడై నామధారకుడు
నమస్కరించెను. సిధాముని నామధారకా! నీకు నిరుపమానమగు గురుచరిత్రను సంక్షేపముగ
చేప్పితిని. గురుచరిత్ర భక్తులకు కామధేనువు. ఇట్టిదీనిని పఠించువారు వినువారు
దుఃఖము దారిద్య్రములేక లక్ష్మివంతులై పుత్రపౌత్రాభివృద్ధిగలిగి సుఖింతురు. దీనిని
పఠించువారు ధర్మార్థ కామమోక్షముల నొందగలరు.ఈ పుస్తకమును స్వయముగా నెవరు లిఖింతురో
వారు సర్వసిద్ధుల నొందగలరు. అని సిద్థముని చెప్ప నామధారకుడు సతంసించెనని గంగాధర
సరస్వతి మహారాష్ట్రభాషతో నిట్టి పవిత్రమైన గురుచరిత్రను రచించెను. గురుచరిత్రను
శ్రద్ధతో వినువారు సంసార సముద్రమును
అవలీలగ దాటగలరు. అట్టివారికి పరమార్థము కరతలామలకము. అమృతముతో సమమగనిట్టి
గురుచరిత్ర భావికులగు సజ్జనులకు మాత్రమే రచించును. గురుచరిత్రను శ్రర్ధతో
వినువారిని గురునాథుడు శ్రీనృసింహసరస్వతి వంశపరంపరంగ రక్షించుచుండును. శ్రోతులారా!
నమస్కారములు. మనోహరమగు ఈ గురుకథ సకలాభీష్టములను ఈయ సమర్థుము కాని ఫలము పఠించువారి
మనోభావమును పట్టియుండును కాన ప్రేమతో పఠించుడు. అందలి అర్థమును మననమొనర్చుడు. గురుమూర్తిని
భక్తితో ధ్యానించుడు. నృసింహ సరస్వతి మిమ్ముల రక్షించును. ఇట్టి పవిత్రమైన
గ్రంథమును శుద్థమైన వస్త్రమున కట్టి గృహమున ఉంచి నిత్యము పూజ గావించుడు.
గురుమూర్తి మిమ్ముల రక్షించును.
ఇట్లు గురుచరిత్రమున ఏబది ఒకటవ అధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
ఏబది రెండవ అధ్యాయము
ఓం శ్రీ గణేశాయ నమః ఓం గురుదేవ శ్రీ దత్తాత్రేయాయ నమః
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః
శ్రోతలారా వినుడు! పావనమైన గురు చరిత్రమును సిద్ధముని వలన
విని నామధారకుడు ఆనంద నిమగ్నుడై దేహ భావము విడిచి సమాధినిష్టుడయ్యెను. అప్పుడు
సిద్ధముని నామధారకుని కొలదిసేపటికి సమాధి నుండి బహిర్ముఖునిగావించి ఆలింగనమొనర్చి
అతనితో బాలకా! నీవు తరించితివి. అయినను నీవిట్లుసమాధిలో నుండిన లోకులు తరించుట
ఎట్లు? మనసును గురుచరణముల యందు
లగ్నముచేసి బాహ్యమునకు లోకాచారమునకు అనుకూలముగ ప్రవర్తించవలెను. నీవలన నాకు
గురుచరిత్రమును సమగ్రముగా స్మరించి చెప్పు భాగ్యము లభించెను, అనెను. నామధారకుడు సిద్ధముని పాదములకు నమస్కరించి
చేతులు జోడించుకొని గురునాథ! మీవలన భవసాగరమును దాటగలిగితిని, గురు చరిత్రనువింటిని. తృప్తి అయ్యెను. మనసు
స్థిరపడెను. కాని గురుచరిత్ర
కథానుక్రమణికను నాకు దయచేసి సెలవిండు అని ప్రార్థించ సిద్ధముని నామధారకునితో
నీక్రిందివిధముగ అధ్యాయ అనుక్రమణిక చెప్పుచున్నాడు.
మంగళాచరణము, ఇష్టదేవతా స్మరణము, సద్గురు దర్శనము, గురు మహాత్మ్యము, దీపకునికథ,
అంబరీషునికథ, దత్తాత్రేయుని జన్మవృత్తాంతము గోకర్ణమహిమ, శ్రీ సాదులవారి జన్మ, శని ప్రదోషవ్రతమాహాత్మ్యము, రజకునకు వరమునొసంగుట, కురువపురమహిమ నృసింహసరస్వతి జన్మవృత్తాంతము, వారి సన్యాసస్వీకారము, సాయందేవుని అనుగ్రహించుట, తీర్థయాత్రమహిమ, మందమతికి విద్యనొసంగుట, దరిద్రునకు
ధననిధినిచూపుట. స్వామివారు అమరపురమున నివసించి అచ్చటి భక్తులను ద్ధరించిన
వృత్తాంతము. స్వామివారు గణగాపురము చేరుట అచ్చట వారు చూసిన అద్భుత అతిమానుషలీలలు.
ఇవి ఈగురుచరిత్రయందు విస్తరించి నిరూపింపబడినవి.
కలియుగమున అధర్మము వృద్ధినొందుటచూచి స్వామివారు
అదృశ్యమైరి. కానిభక్తి గలవారికి వారి దర్శనమగుచునేయుండును. గురుచరిత్రమును
సప్తాహపారాయణము భక్తితో చేయువారికి గురునాథుడు వారి మనోరథము తీర్చును.
సప్తాహపారాయణము చేయువారు మంచిదినము చూచుకొని స్థలశుద్ధియొనర్చుకొని దీపమువెలిగించి
నియమపూర్వకముగా గ్రంధమును పూజించి ప్రథమదినమున 7వ అధ్యాయములు 2వ దినము 18అధ్యాయముపూర్తి, 3వ దినము 29అధ్యాయము పూర్తి, 4వదినము 35అధ్యాయముపూర్తి, 5వదినము 38అధ్యాయముపూర్తి. 6వ దినము 43అధ్యాయముపూర్తి, 7వ దినము గ్రంథసమాప్తి పర్యంతము
పఠింపవలెను. చివరకు గ్రంథమునకు పూజగావించి యథాశక్తి బ్రాహ్మణ సువాసినీ సమారాధన
జరుపవలెను. ఇట్లు శ్రద్ధతో సస్తాహమొనర్చువారికి గురునాథుడు దర్శనము ఇవ్వగలడు.
వారిమనోరథము నెరవేరగలదు. అని సిద్ధముని నామధారకునకు చెప్పెనని గంగాధరసరస్వతి
గురుచరిత్రను వ్రాసెను. ఇట్టి గురుచరిత్రము యధాశక్తి శ్రీదత్త అవధూతచే ఆంధ్రమున
అనువదింపబడెను. సిద్ధమునికి వందనములు నామధారకునకు వందనములు.
ఇట్లు గురుచరిత్రమున ఏబది రెండవ అధ్యాయము సమాప్తము.
ఇతి నారాయణ స్మరణమ్.
గురుశిష్యస్వరూపా నారాయణా, జయజయ జయదేవజయదేవ
జయసద్గురు దత్తా,
హారతి ఓం వాళితా హరతి భయచింతా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి