శ్రీ గురు చరితము
ముప్పదియవ అధ్యాయము
ఓం శ్రీ దత్తత్రేయాయ నమః, ఓం శ్రీగణాధిపతియే నమః ఓం శ్రీ గురుభ్యోనమ
నామధారకుడు సిద్ధముని పాదములకు నమస్కరించి జయజయ సిద్ధమునీంద్రా, మీరు భవసాగరతారకులు. బ్రహ్మజ్ఞానులు, అజ్ఞానతిమిరభాస్కరులు. అజ్ఞానమును రాత్రియందు గాఢముగ నిద్రించుచున్న నన్ను గురుచరిత్రమను భేరి మ్రోయించి మెలకువ నొందించితిరి. ఓచిన్మయాత్మస్వరూప మీవలన నేను సంసారపారము పొందుచున్నాను, అని స్తుతించ సిద్ధముని అతని భక్తికి సంతసించి అభయమిచ్చి పైకథావృత్తాంతము నీ క్రింది విధముగ చెప్పుచున్నారు.
గురుమూర్తి మహిమ సర్వత్రా విఖ్యాతమయ్యెను. మందుడనైన నేను త్రిమూర్తి అవతారమయిన స్వామివారి మహిమను పూర్తిగ వర్ణించ నెంత సమర్ధుడను? వారు మానవదేహము ధరించి పావనమగు తన చరిత్రమును లోకమునకు ప్రదర్శించిరి. అనేక మంది భక్తులు వారి ఖ్యాతి విని దూరమునుండి వచ్చి వారిని సేవించి వారివలన అభీష్ట సిద్ధినొందుచుండిరి. దీనులు శ్రీమంతులగుచుండిరి. వంధ్యలు పుత్రవంతులయిరి. అంధులు చకక్షుష్మంతులయిరి. అపస్మారాది రోగములు వారి దర్శనమాత్రముననే పలాయితము లగుచుండెను. పరశువేది తగిలిన మాత్రముననే ఇనుము బంగార మగునటుల వారి కృపాదృష్టిచే భక్తుల సర్వాభీష్టములు సిద్ధించుననుటలో చిత్రమేమియులేదు. ఇక నచ్చట జరిగిని చిత్రమయిన గురులీలను చెప్పెద. సావధానముగ వినుము.
మాహూరు అనుపట్టణమున గోపీనాధుడు పేరుగల ఒక ధనికుడయిన
బ్రాహ్మణుడు కలడు. అతనికి కొంతమంది
పుత్రులు పుట్టి మరణించిరి. అప్పుడు
దంపతులు దత్తాత్రేయుని ఆరాధించగా వారికి నొక పుత్రుడు కలిగెను. వానిని తల్లితండ్రులు సంతోషముతో
పోషించిరి. అయిదు సంవత్సరములు రాగా
ఉపనయనమొనర్చిరి. పన్నెండవ సంవత్సరమున
అతనికి వివాహముచేసిరి. తల్లితండ్రులు తమ
పుత్రుని, కోడలిని చూచుకొని
సంతోషపరవశులయిరి. ఆనూతన దంపతులు
రతీమన్మధుల వలె అన్యోన్యము అనురూపముగలవారై సమవస్కులయి పరస్పర ప్రేమతో
శోభించుచుండిరి. ఇట్లు కొంతకాలము సుఖముగ గడిచెను.
దంపతులు పరస్పర విరహమును సహించక అన్యోన్య ప్రేమతో సుఖముగ కాలము గడుపుచుండ
దైవవశమున ఆ బాలుడు రోగగ్రస్తుడయ్యెను.
తల్లితండ్రులు ధనికులగుటచే అనేక చికిత్సల చేయించిరి. కానీ అవియన్నియు నిష్ప్రయోజనమయ్యెను. అన్నమునందును రుచి తగ్గెను. అతని భార్యయు పతివ్రత కావున భర్త ఎంత భుజించునో
తానును అంతమాత్రమే తినుచుండెను. ఇట్లు
మూడు సంవత్సరములు నడిచెను. వ్యాధి దిన
దినమునకు ప్రబలమగుచుండెను. భర్త ఎటుల క్షీణించుచుండెనో
అటులే అతని భార్యయు అతని పాదోదకము త్రాగుచు క్షీణించుచుండెను. బంధువులు నివారిరంచినను వారిమాటలు
లెక్కచేయకుండెను. ఆభరణముల త్యజించి భర్తనే
ప్రాణముగ సేవించుచుండెను. ఎన్నియో జపముల, హోమముల చేయించిరి.
కానీ ప్రయోజనము లేకపోయెను. శరీరమున
దుర్గంధము వ్యాపించెను. వైద్యులు చికిత్సకు వచ్చుట మానిరి. జ్యోతిష్కులు నిరాశగ చెప్పిరి. వైద్యుల నడుగ ఈ రోగము ముదిరినది భగవంతునికి
తప్ప మానవ మాత్రులకు దీని నయము చేయ సాధ్యముకాదనిరి. వైద్యుల మాటవిని ఆ బాలుని తల్లితండ్రులు
స్వామీ నిన్ను ఆరాధించగా ఈ పుత్రుడు మాకు నిధివలె లభించెనని సంతోషపడితిమి. ఆ బాలుని నీవు రక్షించనిచో మా వంశము
నిర్వంశమగును. మేము ప్రాణముల త్యజించెదము
అని పరిపరివిధముల దుఃఖించుచుండ ఆ
రోగగ్రస్తుడగు బ్రాహ్మణ బాలుడు తల్లితండ్రుల నాలింగనమొనర్చి నాకొఱకు దుఃఖించి ఏమి
ప్రయోజనము? జన్మాంతరమున ఎంత ఋణము మీవద్ద తీసికొంటినో అది తీరువరకే
మీకును నాకును సంబంధము. అని చెప్ప మహా
దుఃఖముతో తల్లితండ్రులు బాలుని మీద పడి ఏడ్చుచు నాయనా! మా ఆశ నిరాశచేసి మమ్ము దుఃఖ సముద్రమున ముంచిపోవుట న్యాయమా!
వార్ధక్యమున మమ్ముల రక్షించువారెవరు? అని అన ఆ బాలుడు సర్వము
ఈశ్వరాధీనమయి ఉండును. మనుష్య ప్రయత్నము ఎందులకు కొరకాదు. తల్లివలన ఒక ఘడియ త్రాగిన పాల ఋణమునుకూడ
కుమారుడు తగిన ప్రత్యుపకారమొనర్చియు తీర్చుకొనజాలడు. మీకు కష్టముల నిచ్చుటకుగాను నేను మీగర్భమున
జన్మించితినే గాని నావలన కొంచెమయినను సుఖమును పొందరైతిరి. నేనేమి చేయుదును? అని తల్లితండ్రుల నూరడించి తన భార్యతో ప్రాణేశ్వరీ! నా
నిమిత్తము వ్యర్ధముగా నింత కష్టపడుచున్నావు. నా జీవితానంతరము నీవు మాయింటనే
యుంటివేని మాతల్లితండ్రులే నిన్ను పుత్రునిగా భావించి కాపాడగలరు. ఇచ్చట నుండుట
కష్టమని తోచినచో మీపుట్టినింటికి పోమ్ము, దురదృష్టవంతుడనగు నన్ను వివాహమాడుటచే చక్కని నీ సౌందర్యము, సౌభాగ్యము నశించెను. అని చెప్ప పతివాక్యములు విని ఆ
పతివ్రత మూర్ఛిల్లి కొంతసేపటికి తేరుకొని దుఃఖముతో భర్తపాదముల తన శిరముంచి
ఇట్లనుచున్నది. స్వామీ! ప్రాణరక్షకా! నేను త్యాగార్హురురాలను కాను. స్త్రీలకు
భర్తయే గతి, మీదేహ మెచ్చటనుండునో
నాశరీరము అక్కడనే యుండును. మిమ్ములవదిలి నేనుండ. ఇందెట్టి సందేహము లేదు. అని
అనెను. ఆదంపతుల వాక్యములు విని తల్లిదండ్రులు అట్లే నేలమీదపడి దుఃఖించుచుండిరి.
అప్పుడు సావిత్రియను నాపతివ్రత తన అత్తమామలతో నిటుల చెప్పుచున్నది.
మీరు చింతించకుడు
నాభర్త జీవించగలడు. నాప్రార్థన నంగీకరించుడు. నేనొక క్షేత్రమునకు పోదలచితిని. నా
భర్తతో సహ నన్ను అచ్చటకు పంపుడు. లోకులు గంధర్వనగరమున నరసింహసరస్వతియను పేరుతో
దత్తాత్రేయులవారే అవతరించి యున్నారనియు, వారి మహిమ ఆపారమనియు చెప్పుచున్నారు, నేను నాభర్త నక్కడకు తీసికొని పోయెద. వారి దర్శనమాత్రముననే నాభర్తకారోగ్యము
సిద్ధించగలదు అని అత్తమామల ప్రార్థించ వారందుల కంగీకరించిరి. రోగియగు నాకుమారుని
ఒక ఆందోళికయందు పరుండబెట్టి కొద్దిపరివారముతో ఆమెవెంట పంపిరి. ఆమె భర్తను
తీసికొనిపోవుచు అత్తమామలతో మీరు స్థిరముగ నిర్భయముగ నుండుడు, భగవంతుడు నాప్రాణప్రియుని రక్షించును. అని
ధైర్యముచెప్పి వారలకు నమస్కరించ వారలు సౌభగ్యవతివి కమ్ము. ఈబాలుడు చిరంజీవియగుగాక
అని ఆశీర్వదించి సాగనంపిరి. ఆమె భర్తను వెంటనిడుకొని గ్రామ గ్రామములు దాటి
భీమానదీతీరము సమీపించెను. గంధర్వనగరసమీపమున భర్తనుంచి ఆందోళికను క్రింద దించిరి.
పైన కప్పబడిన ఆచ్ఛాదనమును తీసిచూచెను. మార్గశ్రమచే రోగి రోగము ప్రకోపించెను. ఆమె
అంత గ్రామస్థులవలన గురు మూర్తి సంగమమున నున్నారని తెలిసికొని, సంగమమునకు తీసికొని పోవ భర్తను సమీపించెను.
అదేక్షణమునకు అతనికి అంతకాలము ఆసన్నమయ్యెను. ప్రాణములు శరీరమునుండి నిర్గమించెను.
ఆమె అది చూచి హాహాకారమొనర్చుచు ఒక కత్తతో ఆత్మహత్య చేసికొనపోగా అచ్చటివారు
నివారించిరి. అప్పుడామె ఇట్లు దుఃఖించ నారంభించెను.
హా ప్రాణనాథా! నాగతి యిట్లుయెనా! పూజకొరకు దేవాలయమునకు పోవ ఆ
దేవాలయము కూలి అతడు చచ్చెననునటుల. ఒకడు ఎండలో డస్సి ఒక వృక్షచ్ఛాయ నాశ్రయింప నా
వృక్షము విరిగి అతడు మరణించినటుల,
దప్పితీర్చుకొనుటకు
కొలనులో నడుగిడ నందొక మొసలి వానినే భక్షించినటుల నా స్థితి సంభవించెను. ఎంత
దురదృష్టవంతురాలను, పరమపాపిని, పతిఘాతకురాలను, అత్తమామలగూడ విడచి యింతదూరమువచ్చితి. ఏమిచేయగలను అని
దుఃఖిచుచుండ నగరవాసులందరుఅచ్చటకి వచ్చి ఆమెను ఓదార్చిరి. అచ్చట ముతైదువలు ఆమెను
సమీపించి ఆమ్మా దుఃఖించి ఏమి ప్రయెజనము? కర్మను తప్పించుకొనగలవారెవ్వరు? అని భోధించిరి. ఇట్లెంతమంది చెప్పినను ఆమె భర్తయొక్క గుణముల స్మరించుచు ఓసోదర
సోదరీమణులారా! నేనేమి చెప్పుదు;
ఇచ్చట
స్వామివారు గలరనియు, వారి దర్శనముచే నా
భర్తకు ఆరోగ్యము చేకూరునని నమ్మి ఇంతదూరము నా భర్తను తీసికొని వచ్చితిని, ఇప్పుడు నాకెవ్వరు శరణు? నా ప్రాణేశ్వరుని వదలి నేనెట్లు జీవించగలను? నేను బాల్యము నుండియు గౌరీశంకరుల పూజించితిని.
వివాహసమయమున సుమంగళిత్వము కొరకు గౌరీపూజ యొనర్చితిని. ఎవ్వరేమి వ్రతము చెప్పిన దానిని స్థిర
సౌభాగ్యము నుద్దేశించి చేసితిని,
అంతయు
వ్యర్థముయ్యెను, నాకంఠ సూత్రము
అపహరింపబడెను. గౌరమ్మవారికి నామీద ఆగ్రహము వచ్చెను, నాపుణ్యమంతయు నీటగలిసెను. ఇక నేనెక్కడకు పోవుదును? నా భర్త అందరితో సమానుడు కాడు. నా భర్తయే నాకు
ప్రాణము నేనేమిచేయుదునని భర్తముఖము చూచుచు పరిపరివిధముల దుఃఖంచుచుండెను. భర్త
శవముమీదపడి ఏడ్చుచు జరిగిన దినములస్మరించుచు ఆహా! ఎంత దురదృష్టవంతురాలను!
ప్రాణేశ్వరా! నన్నెందులకు వదలి వెళ్లితిరి! నన్నుపేక్షించుట ధర్మమా? నిన్ను చంపుటకు గాను నీ తల్లిదండ్రులకు ఎడముగా
ఇంతదూరము కొనివచ్చితి. దశరథుడు శ్రావణుడను మునిపుత్రుని సంహరించి తల్లిదండ్రులకు
దుఃఖము కలుగజేసినటుల నేనును అట్లొనర్చితిని. ఈవార్తవిని మీతల్లి దండ్రులు
ప్రాణత్యాగమొనర్తురు. ఈవిధమున ముగ్గురి ప్రాణముల హరించిన మహాపాపినగుచున్నాను.
లోకులందురు నన్ను పతిఘాతినిగా చెప్పుదురు. నేను నీకు భార్యనుకాను. తీక్షమయిన
కత్తివలె నీ ప్రాణమపహరించితిని. తల్లిదండ్రులు నీమరణసమయమున దగ్గరనున్నచో ఇంత
దుఃఖముండదు. అందుకు నేను విఘ్నమొనర్చితిని నేనెక్కడకు పోదును.
ఎంతదురదృష్టవంతురాలను నిన్ను వదిలి వేరుశయ్యయందు పరుండి ఎదుగను. ఈవిషయములను
స్మరించిన నాగుండె పగులుచున్నది. ఇక
నేనెట్లు జీవించగలను. ప్రపంచములో బాలవిధవ అను జనాపవాదమేరీతి భరింప గలను. కేశవపనమొనర్చుకొని నేనెటుల నుండగలను? నీప్రేమను ఆధారముగా చూచుకొని నాతల్లిదండ్రులు ఎన్ని
పర్యాయములు నన్ను పిలువవచ్చినను నేను వెళ్ళనయితిని. మీ సుఖమునకు ఉపేక్ష కలుగునని నా
తల్లిదండ్రులగూడ త్యజించితిని. ఛత్రమువలె రక్షకులై మీరుండ నేను లోకమున
మాన్యతనొందితిని. ఇప్పుడు నిందాస్పదురాలనయి నేనెటుల జీవింతును? అత్తమామల ముఖ మెట్లు చూడగలను? నన్ను చూచుటతోడనే వారు మరణింతురు, గృహమరణ్యమగును.
నిన్ను ఆరోగ్యము కొరకు తీసికొనివచ్చి నీ ప్రాణము తీసిన రాక్షసినయితిని. అని
నానావిధముల దుఃఖించుచుండెను. ఆసయమయునకు ఒక సిద్ధపురుషుడు భస్మరుద్రాక్షభూషితుడయు
త్రిశూలమును హస్తమునందు పూని అచ్చటకు వచ్చి ఆమెతో నిట్లనుచున్నారు.
మూర్ఖులారా! ఎందుకు
దుఃఖించెదవు. లలాటమునందు లిఖితమయినదానిని ఎవరయిన తప్పింపగలరా! ఎవరి ఆర్జితమును
వారు తప్పక అనుభవించవలసియే యుండును. ఎవరికర్మ వారి వెంటనే నడచుచుండును. ఎనిమిది
దినములు దుఃఖించినను పోయిన ప్రాణములు రాగలవా? ఎవరు ప్రపంచమున చిరకాలము జీవించెదరు? మృత్యువునకు వశము కానివారెవ్వరో చెప్పుము! నాభర్త నాభర్తయని దుఃఖించుచున్నావు. భర్త
ఎక్కనుండి వచ్చెను ? నీవెక్కడనుండి
వచ్చితివి? నదియందు కఱ్ఱలకువలె, వృక్షమునందు పక్షులకువలె ఒకసమయమునందున సంయోగము, మరుసటి సమయమున వియోగము కలుగుచుండును. చచ్చువాడెవడు? పుట్టువాడెవడు? నీటియందు బుడగలవలె కర్మయోగమున పంచభూత సమ్మేళనముతో శరీరము
లేర్పడుచుండును. తిరిగి నశించుచుండును. అస్థిరములగు దేహములందు పుత్రుడని, భర్తయని, భర్యయని భ్రమను కల్పించుకొని మాయామోహములెపడి మానవులు మునిగి తేలుచుందురు.
ఆత్మస్వరూపమును తొలిసికొనలేక పంచభూతాత్మకమగు నశించు దేహమును భర్తయని తలచుచున్నావు.
మాయయందలి సత్వరజస్త మోగుణములు జీవునకు కర్మానుసారముగ సుఖదుఃఖముల నొసగుచుండును.
ఇట్టి కర్మానుభవము ఋషులకు దేవతలకును తప్పదు. ఎంతవారును కాలమునకు బలికావలసినదే.
మానవులమాట చెప్పనేల. ఇట్టిసంసారము మాయకల్పితమని గుర్తెరిగినవాడు ఒకడు పుట్టిన
సంతసించరు. మరొకరు మరణించిన దుఃఖించరు. దేహము ప్రారబ్ధము ననుసరించును. కొందరు
గర్భముననే, మరికొందరు బాల్యమునను, యౌవనమున, వార్ధక్యమున మరికొందరు మృతినొందుదురు. పూర్వార్జిత పుణ్యపాపముల ననుసరించియే
సుఖదుఃఖములేమి, స్త్రీపురుషుల సంయోగ
వియోగములేమి జరుగుచుండును. ఒకవేళ పుణ్యకర్మల నాచరించి దుష్కర్మల
నశింపజేయవచ్చునేమోగాని కాలముయొక్కబారినుండి తప్పించుకొనుటకు దేవదానవులకు గూడ
తరముగాదు. ఇదివరకు ఎన్నియో జన్మలు నీకును గడచియుండును. నీవెంతమందికో భార్యవయి
యుండవచ్చును. ఈ శరీరము చర్మము,
రక్తము, మాంసము, ఎముకలు, శ్లేష్మము,
మలము, మూత్రములచే నిండి కడు జుగుప్సితమయి యుండును. ఇట్టి
పాంచ భౌతికదేహమువలన నేమి ప్రయోజనము, జన్మ వచ్చినందుకు ప్రతి వారును సంసారసాగరమునుండి తరించుమార్గమే చూచుకొనవలయును.
అని యిట్లు స్వామివారు ఆపతివ్రతకు బోధించ ఆమెకు సగము దుఃఖము తగ్గెను, కొంచము జ్ఞానముదయించెను. ఆస్పుడామె చేతులు జోడించి
ఆసాధువుయొక్క పాదములకు నమస్కరించి, స్వామీ నన్నుద్ధరింపుడు. తరించుమార్గము చూచుకొనుమని
సెలవిచ్చితిరి. అదెట్లో నాకు సెలవిండు. అట్లే ఆచరించెద. అని చెప్ప ఆసాధువు ఆమె
వాక్యములు విని ప్రసన్నుడయి స్త్రీలు తరించవలసిన విధానమును చెప్పబోవుచున్నారు. ఆ
విషయము పై అధ్యాయమున రాగలదు.
ఇదు గురుచరితమున ముప్పదియవ అధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
ముప్పది ఒకటవ అధ్యాయము
ఓం శ్రీ దత్తాత్రేయాయ
నమః, ఓం శ్రీగణాధిపతియే నమః ఓం శ్రీ గురుభ్యోనమః
యోగీశ్వరుడు ఆ పతివ్రతతో స్త్రీల ధర్మముల నిట్లు
చెప్పుచున్నాడు. ఓ సాధ్వీమణీ! నీకు
సువాసినుల ధర్మము, విధవా స్త్రీల ధర్మము
చెప్పుచున్నాను, వినుము. స్కాందపురాణమున
కాశీ ఖండమందు స్త్రీల ధర్మములు విపులముగా చెప్పబడినవి. ఆ విషయమునే చెప్పుచున్నాను. పూర్వము కాశీపట్టణమున అగస్త్య మహర్షి
యుండెను. అతని భార్య లోపాముద్ర పతివ్రతా
రత్నము. వారిద్దరు కాశీ పట్టణమునకు
అలంకారముగ నుండిరి. వింధ్య పర్వతము
అగస్త్యునకు శిష్యుడయి యుండెను. పర్వతములు
దేవతా రూపమున శిలారూపమునగూడ నుండును. ఒక
సమయమున నారదుడు లోకముల పర్యటించుచు వింధ్యపర్వతము వద్దకు వచ్చి నీకు ఎందును
కొదవలేదు. కాని ఎత్తులో మాత్రము మేరు
పర్వతమునకు తీసిపోదువనెను. అప్పుడు
వింధ్యపర్వతమునకు రోషము వచ్చి క్షణమున మేరు పర్వతముకన్న నెత్తుగ పెరుగ సాగెను. సూర్యమండలమును దాటి స్వర్గమును
సమీపించెను. అందుచే వింధ్యపర్వతమునకు
దక్షిణ దిగ్భాగమున సూర్య రశ్మిలేకపోవుటచే ఆ దేశమంతయు అంధకారబంధురమయ్యెను. యజ్ఞములు లోపించెను. అప్పుడు ఋషులందరు ఇంద్రుని సమీపించి జరిగిన
వృత్తాంతమును చెప్పిరి. ఇంద్రుడు తాను
చేయునది లేక దేవతల వెంటనిడుకొని బ్రహ్మలోకమునకు వెళ్ళి వింధ్యపర్వతము పెరుగుదలనుగూర్చి, దాని వలన లోకములకు కలిగిన అనర్ధము గూర్చియు
బ్రహ్మతో చెప్పెను. అప్పుడు బ్రహ్మదేవుడు
ఆలోచించి దేవతలతో నిట్లనెను.
కాశీపట్టణమున వింధ్యపర్వతమునకు గురువయిన అగస్త్య మహర్షి నివసించుచున్నారు.
మీరు వారి వద్దకు వెళ్ళి దక్షిణ దిక్కున తగిన సత్పురుషులు లేకున్నారు. మీరు దయతో అచ్చటివారల నుద్ధరించుటకుగాను
అచ్చటికి వెళ్ళినివసించుడని వారల ప్రార్ధించుడు.
అప్పుడు అగస్త్యులవారు దక్షిణ దిక్కుకు ప్రయాణముచేయుచు వింధ్యపర్వతమును సమీపించెదరు. అప్పుడు వింధ్యము శిరసా నమస్కరించును. అప్పుడు అగస్త్యుడు నీవికమీద లోకోపద్రవము చేయక
భూమిమీద పడియుండుమని ఆశీర్వదించును. మీ
కార్యము నెఱవేఱును. అని బ్రహ్మ చెప్ప ఇంద్రుడు బృహస్పతి మొదలగు వారితో కలసి
కాశీపట్టణము వచ్చి అగస్త్యుల వారి ఆశ్రమము ప్రవేశించిరి. అగస్త్యుడు బృహస్పతి పురోహితుడుగాగల దేవతలను
అర్ఘ్యపాద్యములనిచ్చి పూజించెను. అప్పుడు
బృహస్పతి దేవతలు వినుచుండ నిట్లు చెప్పెను.
ఈ లోపాముద్రాదేవితో సమమగు పతివ్రత ఎచ్చటను లేదు. అనుసూయ, సావిత్రి,
అరుంధతి, శతరూప, పార్వతి, మేనక, సునీతి మొదలగుగాగల జగద్విఖ్యాతిగాంచిన
పతివ్రతలకన్ననీమె కడు మిన్న. సందర్భము
వచ్చెను గాన ఓ దేవతలారా! మీకు పతివ్రత లక్షణముల చెప్పెద వినుడు.
భర్త యొక్కఉచ్ఛిష్ట భోజనము పతివ్రతకు ముఖ్యమగు ఆహారము. భర్తయొక్కయు, అతిథులయొక్కయు పూజ అహోరాత్రములు చేయు చుండవలయును. భర్త ఆజ్ఞలేనిదే దానధర్మములు చేయరాదు. భర్త నిలుచున్న తాను కూర్చుండరాదు. ఆయన కూర్చుండిన వారి ఆజ్ఞననుసరించి కూర్చుండ
వలయును. భర్తనవమాన పరచరాదు. భర్తను హరియను భావముతో సేవించవలయును. శయనకాలమున అతనిని సుఖింపచేసి అతను నిద్రించిన
తరువాత నిద్రించ వలయును. భర్తయొక్క పేరు
భార్య చెప్పరాదు. భార్య ధరించు కంచుకము
భర్తయొక్క శరీరమునకంటరాదు. అట్లయినచో
భర్తకు ఆయుష్యము క్షీణించును. భర్త
నిద్రనుండి లేచుటకు పూర్వమే తాను మేల్కొని గృహమును శుద్ధి పరుచ వలయును. శంకరుడను భావముతో అర్ఘ్యపాద్యములిచ్చి భర్తను
పూజించవలయును. భర్త గృహమున ఉన్నప్పుడు
భూషణముల ధరింపవలయును. అతను గ్రామాంతరము
వెళ్ళినప్పుడు భూషణముల ధరింపరాదు. భర్త
కోపించిన క్షమింపుడని ప్రార్ధించవలయును. అతను కోపమున అనిన మాటలను మనసున
ఉంచరాదు. భర్త గ్రామాంతరమునుండి రాగా
ఎన్నికార్యములున్నను వాటిని త్యజించి భర్తను ఎదుర్కొన వలయును. భర్త ఆజ్ఞననుసరించియే భార్య
నడుచుకొనవలయును. పరగృహములకు పోరాదు. అట్లొనర్చిన అనేక దోషములు వాటిల్లును. అవసరమయిన కార్యముండి వెళ్ళినను వెంటనే
రావలయును. స్వతంత్రముతో పరగృహముల చరించు
స్త్రీ గుడ్లగూబ అయి జన్మించును. ఈ
లోపాముద్రయను పతివ్రత పరగృహమునకు పొరపాటునయిన పోదు గాననే ఇంత ఖ్యాతి ఈమెకు
వచ్చెను. భర్త యొక్క పూజా ద్రవ్యముల తాను
స్వయముగ సమకూర్చ వలయును. భర్త
చిత్తముననుసరించి హితమగునటుల పాకము చేయవలయును.
భర్త గ్రామాంతరమేగినపుడు గోవునకాహారమిడి గోశేషమును భుజించవలయును. గృహమును శుభ్రముగా నుంచవలయును. భర్త ఆజ్ఞ లేనిదే వ్రతోపవాసముల చేయరాదు. నగరమున ఉత్సవము జరుగుచున్నను వెళ్ళరాదు. భర్త సంతోషముగా నున్నప్పుడు తాను దుఃఖితురాలై
ఉండరాదు. భర్త విచారముగా నున్నతరి తాను
హర్షముగా నుండరాదు. రజస్వల అయినరోజున మౌనముగానుండవలయును. వేద ధ్వని వినరాదు. నాలుగవరోజున స్నానమొనర్చి భర్త ముఖము
చూడవలయును. భర్త గ్రామమున లేనిచో భర్త
రూపమును హృదయమును స్మరించి సూర్యుని దర్శించి గృహము ప్రవేశించ వలయును. భర్త యొక్క ఆయుష్యాభివృద్ధికిగాను కుంకుమ, పసుపు, మంగళసూత్రము మొదలగు వాటిని ఆదరముతో ధరించుచుండవలయును. దరిద్రులతోడను, నీచజాతి స్త్రీలతోడను, పతిని నిందించు స్త్రీలతోడను పతివ్రత సంభాషించరాదు. అత్తమామల బావమరుదుల ఆడబిడ్డల త్యజించి
విభక్తముగా నుండ కోరు స్త్రీ రాబోవు జన్మమున ఆడకుక్క అయి జన్మించును. దిగంబరముగా స్నానము చేయరాదు. రోలు రోకలి మొదలగు వాటిమీద కూర్చొనరాదు. భర్తతో వివాదమాడు స్త్రీ దుఃఖ మనుభవించును.
భర్త అభాగ్యుడయినను, నపుంసకుడయినను, రోగి అయినను అతనిని పతివ్రత దేవునిగా
భావించవలయును. భర్తకు అభిమతములగు
భూషణములను వస్త్రములను మాత్రమే ధరింపవలయును.
ఇంటికి అవసరమయిన వస్తువులేమిఅయినను తాను స్వయముగ చెప్పరాదు. పిల్లలచే చెప్పింప వలయును. సమక్షమున ఎవ్వరూ లేనిచో సంజ్ఞతో కావలసిన
పదార్ధమును భర్త యొక్క మనస్సునకు వచ్చునటుల చేయవలయును. భర్తకు దైవవశమున నేది లభించునో
అంతమాత్రముచేతనే తాను సంతృప్తినొందవలయును.
ఇరుగు పొరుగ శ్రీమంతుల చూచి భర్త అసమర్ధుడని నిందింపరాదు. యాత్రికులు యాత్రకుపోవుచుండ అట్టి ఇచ్ఛ
పతివ్రతకు జనించరాదు. పతిసేవయే యాత్రగాను, పతిపాదోదకమే తీర్ధముగాను పతివ్రత భావించ
వలయను. అట్టి పతివ్రతను చూచి త్రిమూర్తులు
సంతోషించెదరు. పతికి కోపముతో ప్రత్యుత్తరమిచ్చు స్త్రీ కుక్కయి
జన్మించును. ఆ పై జన్మమున నక్కఅయి గ్రామ
బాహ్యమున సంచరించును. అత్తమామల ఎదుట
పెద్దగా మాటలాడరాదు. పెద్దగా
నవ్వరాదు. భర్త కోపించి కొట్టిన కోపముతో
చచ్చిపోమని దూషించినచో ఆ స్త్రీ వ్యాఘ్రమయి పుట్టి కష్టమనుభవించును. పరపురుషుల ప్రేమతో చూచు స్త్రీ పుట్టు
గ్రుడ్డిఅయి జన్మించును. భర్త లేకుండా
చూచి పిండివంటలు చేసికొని భుజించు స్త్రీ గ్రామసూకరమై జన్మించును. పై జన్మమున
కపోత పక్షిఅయి దాని మలమునే అది తినుచుండును.
భర్తతో నిష్ఠురముగా మాటలాడు స్త్రీ ఏడు జన్మముల మూగదై పుట్టును. పరపురుషుల కామముతో వీక్షించు స్త్రీ
అంగహీనురాలై దరిద్రమనుభవించును.కాన పరపురుషుల పతివ్రతలు కన్నెత్తి చూడరాదు.
భర్తసంతోషించిన త్రిమూర్తులు సంతోషించెదరు. ఋజువాక్యములతో భర్తను సంతోషపనచుచు వారి
పాదసంవాహన మొనర్చుచుండవలయును. స్త్రీకి బంధువులుగాని ఆప్తులుగాని సోదరులుగాని
తల్లితండ్రులుగాని ఏమియు నీయజాలరు. పతివ్రతకు భర్తవలననే సర్వము లభించగలదు. గురువు, దేవుడు, తీర్థము, సర్వము పతివ్రతకు
భర్తయే. భర్త జీవించియుండ స్త్రీ పవిత్రురాలుగ భావింపబడును. భర్త మరణించిన ఈమె
ఆస్పృశ్యురాలుగను, అమంగళిగను, ప్రేతతో సమముగ పరిగణింపబడును. సంతానములేని స్త్రీ
కడు దూష్యముగ భావింపబడును. ప్రయాణము చేయువారికి విధవ ఎదురైనచో మరణము తప్పదు. కాని
పుత్రవతియగు విధవయైనచో ప్రమాదము తేదు. విధవవలన నాశీర్వచనము కొంతరాదు. ఇట్టి దోషము
వైధవ్యమున నుండుటచే పతివ్రతలగు స్త్రీలు భర్తతో సహగమన మొనర్చెదరు. భర్తలేనిచో వైభవము
లెందులకు పనికివచ్చును? దేహముతో నేమి ప్రయోజనము? చంద్రునివెంట చంద్రిక పోయినరీతిని, మేఘముతో కూడ మెరుపు అస్తమించిన రీతిని పతివ్రత
భర్తతోపాటు తన జీవితమును త్యజించును గాననే శ్రుతి స్మృతులు సహగమనముమహాధర్మమని
ప్రతిపాదించినని సహగమనమొనర్చు స్త్రీ నలువది రెండు తరముల వారిని తరింపజేయును.
భర్తతో సహగమనమునకు పోయెడి స్త్రీ అడుగడుగునకు వెయ్యి అశ్వమేధ యాగముల ఫలము నొందును.
ఏ స్త్రీ సహగమన మొనర్చునో ఆమె భర్త పాపియై యమపాశములచే గట్టబడి యమలోకమునకు
గొనిపోవుబడుచున్నను పతివ్రత తన ప్రభావముచే గరుడుడు సర్పమునీడ్చుకొనిపోవునటుల
భర్తను యమపాశములనుండి తప్పించి స్వర్గమునకు గొనిపోవగలదు. యమదూత లామెను చూచి
దూరముగా పారిపోవుదురు. యమదూతలు మనకు కాలమువలనగాని, మరి ఎవ్వరివలన గాని భయములేదుగాని పతివ్రతలనిన భయమగును. అని
అన్యోన్యము చెప్పుకొందురు. సూర్యుడు తన తీక్ష్ణ కిరణముల పతివ్రతమీద
ప్రసరింపచేయజాలడు. అగ్ని కాల్చజాలడు.
అట్టి పతివ్రత భర్తతో సహ స్వర్గమున శాశ్వతసుఖము ననుభవించును. ఏ స్తీ సహగమన
మొనర్చునో ఆమెకు శరీరమున కెన్ని రోమములు కలవో అన్ని కోట్ల సంవత్సరములు భర్తతో సహ
స్వర్గసుఖములనుభవించగలదు. ఏ కులమున పతివ్రత జన్మించునో ఆ కులము ధన్యము. ఆమె భర్త
ధన్యుడు. ప్రసంగవశమున దురాచారులగు స్త్రీ లను గురించి చెప్పెద వినుడు.
వ్యభిచారిణియగు స్తీ ఇహపరముల అనర్థమునే
పొందును. తాను నరకమున పడుటయేగాక తన పాపముచే స్వర్గముననున్న ఇరువరియొక్క తరములవారిని
గూడ ఘోరనరకమున పడవేయును. పతివ్రత పాదస్పర్శచే భూమి పవిత్రమగును. సూర్యుడు చంద్రుడు
తమ కిరణములచే పతివ్రతను స్పృశించి పావనుల మైతిమని తలంచెదరు. పతివ్రత దృష్టిపడిన
మాత్రమున మానవులు పవిత్రులయ్యెదరు. ప్రతి యింటను స్త్రీలు కలరు గాని ఏమి
ప్రయోజనము. కులము నుద్ధరించెడి స్త్రీ
ఏఇంటనుండనో అదియే ఇట్లు. పతివ్రత భార్యగా కలజన్మమే జన్మము. ఎన్ని జన్మలయందో
పుణ్యము చేసిననే అట్టి పతివ్రత భార్యగాలభించును. అట్టి భార్యవలననే పుణ్యము
సిద్దించును. ఎవనియింట సాధ్వియగు భార్యలేదో వాని గృహమే అరణ్యము. వాని
జన్మవ్యర్థము. భార్యలేనివాడు కర్మల కనర్హుడు.
గంగాస్నానమువలన వచ్చెడి పుణ్యము పతివ్రతల దర్శనములవలన వచ్చును. అని ఇట్లు పతివ్రతాధర్మముల నాయోగీశ్వరుడు ఆ
పతివ్రతతో చెప్పెను.
ఇది గురుచరితమందలి ముప్పది ఒకటవ అధ్యాయము సమాప్తము.
ముప్పది రెండవ అధ్యాయము
ఓం శ్రీగురుదేవదత్త, ఓం జయజయ
మృత్యుంజయా శ్రీనృసింహ సరస్వతి,
ఓం శ్రీగణాధిపతియే నమః
యోగీశ్వరుడు ఆ పతివ్రతతో ఇట్లు చెప్పుచున్నాడు. కాశీ పట్టణమున బృహస్పతి అగస్త్యమహర్షియొక్క ఆశ్రమమున పతివ్రత ధర్మములను, సహగమన పద్ధతని చెప్ప దేవ ఋషులందరూ తిరిగి ఇట్లు బృహస్పతిని ప్రశ్నించిరి. మహాత్మా మీరు సహగమనము మహా ధర్మమని చెప్పితిరి. ఒక వేళ భర్త దూరదేశమున మృతినొందును లేదా భర్త మరణించు సమయమునకు భార్య గర్భవతిగ గాని పసిబాలుని తల్లిగ గానీ యుండినచో సహగమనమెట్లు చేయనగును. ఈ సంశయమును వారింపుడని ప్రశ్నించ బృహస్పతి ఇట్లు చెప్పు చుండెను.
దేవతలారా! వినుడు.
శవము లభించని పక్షమునను భార్య గర్భవతిగ నున్ననూ, స్తన్యపానమొనర్చు పసిబాలుడున్నను సహగమనమొనర్చరాదు. అట్లొనర్చిన దోషమే వాటిల్లును. అట్టి స్త్రీ యావజ్జీవ వైధవ్యమును
పరిపాలించవలయును. అట్లొనర్చిన సహగమనము
చేసిన ఫలము రాగలదు. భర్త మరణించిన తరువాత
స్త్రీలు కేశములనుంచుకొనరాదు.
అట్లొనర్చినచో ఆమె కేశములు భర్తకు పాశములగును. నిత్యము శిరస్నానమొనర్చ వలయును. దినమునకొక పర్యాయమే భుజించవలయును. శాకాహారమైనను, ఫలాహారమైనను, క్షీరపానమైననూ చేసి జీవించ వలయును.
ప్రాణములు నిలుచుటకు ఎంత అవసరమో అంతమాత్రమే భుజింపవలయును. మంచమున పరుండ రాదు. మంగళ స్నానముల చేయరాదు. గంధ, పుష్ప,తాంబూలముల
విసర్జించవలయును. సంతానములేని విధవలు
భర్తకు పితృతర్పణాదులు తిలలతో ఆచరింపవలయును.
దేవుని పూజించునపుడు తన భర్తృ రూపమున భావించి పూజించవలయును. వ్రతోపవాసముల యథాశక్తి ఆచరించవలయును. తన భర్తకు ప్రియమైన వస్తువుల బ్రాహ్మణులకు
దానమివ్వవలయును. మాఘ, కార్తీక, వైశాఖ మాసములయందు స్నానాది ధర్మములనాచరించవలయును. వైశాఖమాసమున జలదానము, కార్తీకమాసమున దీపదానము, మాఘమాసమున ఘృతదానమును చేయుచుండవలయును. ఎండాకాలమున నిర్జల స్థలముల
చలివేంద్రములనేర్పాటు చేయవలయును. శివుని
పూజింపవలయును. శివునికి అభిషేకమునకుగాను
జలము తీసికొని ఇవ్వవలయును. అతిధులకు
యథాశక్తి అన్నదానమును చేయుచుండ వలయును.
తీర్ధయాత్రలొనర్చువారికి ఛత్రపాదుకలనొసగ వలయును. బ్రాహ్మణులకు ఉదక పాత్రములను, కదళీ ఫలములను, గుడోదకమును దానమొనర్చు చుండవలయును. ఏదానము చేసినను భర్త యొక్క నామమును ఉచ్ఛరించి
సంకల్ప పూర్వకముగా చేయవలయును. కాంస్య
పాత్ర నిండా నెయ్యియుంచి బ్రాహ్మణునికి దానమొనర్చు చుండవలయును.తాను భూమియందు
శయనించుచు మంచమును బ్రాహ్మణునికి దాన మొనర్చవలయును. శక్తియుండిన సాలంకృత గోదానము
చేయవలయును. ఖర్జూరంబులు, అపూపములు, శక్తి ననుసరించి బ్రాహ్మణునకు ఇచ్చుచుండవలయును.
చలికాలము శీతనివారణము కొఱకు,
కట్టెలు, కంబళ్ళు, మొదలగువాటిని దానము చేయుచుండవలయును. శక్తిగలవారు సంవత్సర గ్రాసముతో
సద్బ్రాహ్మణునకు గృహదాన మొనర్చవలయును. గంధపుష్పములతో కేశవుని పూజింపవలయును.
పార్వతీపరమేశ్వరులకు రుద్రాభిషేకవిధిగ పూజలు చేయచుండవలయును. శివాలయములందు
శంకరునికి ప్రీతిగ దీపమాల లర్చివలయును. రవికలు తొడగరాదు. తెల్లని వస్త్రమునే
ధరించవలయును. ఎఱ్ఱని వస్త్రములు ,నల్లని వస్త్రములు, చిత్రవర్ణములుగల వస్త్రములు ధరించిన దోషము
వాటిల్లును. పుత్రవతి అయినచో పుత్రుని ఆజ్ఞప్రకారము నడచుకొనవలయును. ఈవిధముగ వేదశాస్త్రములందు చెప్పబడిన రీతిని
ఎవ్వరాచరింతురో అట్టి వారికి గూడా సహగమనము ఆచరించిన ఫలము వచ్చును. అట్టి స్త్రీ తన
పుణ్యప్రభావముచే తన భర్త నరకముననున్నను అతనిని స్వర్గమునకు తీసికొని పోగలదు.
పతివ్రతయగు స్త్రీ భాగీరథితో సమానము. ఆమె భర్త శంకరునితో సమానముగాన నిట్టి దంపతులే
లోకపూజ్యలు.
అని ఇట్లు బృహస్పతి
దేవతలతో చెప్పెనని ఆయోగీశ్వరుడు పతివ్రతతో చెప్పి అమ్మా నీకు చెప్పవలసినదంతయు
చెప్పితిని నా వాక్యములు వింటివి.
రెండుమార్గములు పురుషార్థపాధనములే.
ధైర్యమున్నచో సర్వోత్తమమగు సహగమన మాచరింపుము. లేనిచో వైధవ్య దర్మాచరణ
మాచరింపుము, అట్లయినను నీవు
కృతార్థురాలవు కాగలవు. అనిచెప్పి తనహస్తమును ఆమె శిరమున నుంచిరి.
అప్పుడామె వినయముతో
నాతపసితో విట్లనుచుండెను. స్వామీ! యోగీశ్వరా! మీరే నాకు
తల్లిదండ్రులు. నేను విదేశమునకు
వచ్చితిని. బంధువులెవ్వరు నాకిచట లేరు.
మీరే అంతకాలబంధువులుగను, స్నేహితులుగను, ఆప్తులుగను, నాభాగ్యమున తటస్థించితిరి. మీరు రెండుమార్గములను నాకు
సూచించితిరి. అసిధారతో సమమగు వైధవ్య ధర్మములు కష్టసాధ్యముగ గన్పట్టుచున్నని, యౌవనమున నున్న నేను, ఈకలియుగమున నిందాపవాదములకు పాత్రురాలనగుట కిష్టములేదు. గాన
భర్తతో సహగమన మొనర్చుటయే నాకు సమ్మతము. అని చెప్పివారి పాదములకు నమస్కరించెను.
యోగీశ్వరుడు ఆమెను లేవదీసి అభయమిచ్చి అమ్మా అట్లయిన సహగమన మొనర్చుము. భర్త యొక్క
స్థానము పొందుటయే సమ్మతమేని,
నేను
చెప్పినటుల చేయుము. నీవు గురుమూర్తిని చూడవలయునని భర్తయొక్క ఆరోగ్యము నపేక్షించి
భక్తితో నింతదూరము వచ్చితివి. విధి నివ్వరు తప్పింపగలరు. కాలము దుర్జయము, బ్రహ్మాదులుగూడ కాలమును దాటజాలరు, బ్రహలిఖితము అపరిహార్యము. దుఃఖించి యేమి ప్రయోజనము
లేదు. హరిశ్చంద్రుడంతటివాడు చండాలుని గృహముననీరు మోసెను. బలి పాతాళమునకు
త్రొక్కబడెను. రావణుడంతవాడు కాలముచే కాలగ్రస్తుడయ్యెను. స్వచ్ఛంద మృత్యువు అయిన భీష్ముడు యుద్ధయున పడవేయబడెను.
పరీక్షిత్తు సర్పముచే కఱవబడెను. అనంతావతారములే పుట్టి పుట్టి లయము నొందుచుండును.
మానవులు, దానవులు, దేవతలు అందరు కాలమునకధీనులే. కాలము అందరిని
జయించును. కాలము నెవ్వరు జయింపజాలరు. కాననే కాలము అజేయమందురు. కాలము అందరిని
జయించునది. అయినను ఆట్టి కాలమును జయించగల శక్తి గురుమూర్తికి మాత్రము కలదు. కాని ఆ
గురుమూర్తియు, భావికులపట్ల
ప్రసన్నుడగును. అమ్మా నీకొకమాట చెప్పెద. అట్లు చేయుము. సంగమమున గురుమూర్తి యన్నారు
నీవాఇంతదూరము వచ్చితివి. కాన వారిని దర్శించి మాత్రము నీవు నీప్రియునితో
అగ్నిప్రవేశమొనర్చుము. అని చెప్పి కొంత భస్మమును ఆశవమునకు పూసి నాల్గు రుద్రాక్షల
నామె కొసంగి ఆమెతో రెండు కర్ణములకును రెండు రుద్రాక్షల కంఠమునకును కట్టుము.
ఇంకొకమాట చెప్పెద. నీవు గురుదర్శనమునకు వెళ్ళినపుడు శిష్యులు వారి పాదములకు
దుద్రాభిషేకము చేయుచుందురు. ఆతీర్థము నీవు చల్లుకొని ఈ ప్రేతము యొక్క సర్వాంగములపై చల్లుము. సువాసినులకు వాయనము
లొసంగుము. బ్రాహ్మణులకు యథాశక్తి దానము లొనర్చి సహగమున మొనర్చుమని ఆ యోగి చెప్పి
అచ్చటనుండి వెడలిపోయెను. ఆ పతివ్రతయు వారు చెప్పినటుల షోడశకర్మాధికారి యగు
బ్రాహ్మణుని రప్పించి తాను స్నానమొనర్చి పట్టువస్త్రము ధరించి అలంకార మొనర్చుకొని
భర్త శపమునకు చేయువలసిన ఔపాసనాది సంస్కారముల జరిపించి తానే, చేత నగ్గిపూని శవమును నదీతీరమునకు గొనిపోవుచుండెను.
తారుణ్యముతో భూషణభూషితురాలై ఆమె లక్ష్మివలె ప్రకాశించుచుండెను. వేలదికొలది
స్త్రీలు అచటకు వచ్చి ఆమె దృఢనిష్ఠకు సంతసించి తలలూపుచుండిరి. కొంతమంది అయ్యో ఎంత
దురదృష్టవంతురాలు. ఏమియు సుఖమెరుగదు.ఆనందముతో భర్తతో శరీరము నగ్నియందర్పింప
బోవుచున్నది అనిరి. మరికొంతమంది ఆమెకు బోధించెదము. వ్యర్థముగా ప్రాణము లర్పించుట
ధర్మముగాదు, పుట్టినింటికి
బొమ్మనెదము అని ఆలోచనలు సలుపుచుండిరి. కొంతమంది నిజమైన పతివ్రతయన నీమెయే. ఈమె ఎంత
ధన్యురాలు. ఈమెను కనిన తలిదండ్రు లెంత ధన్యులో, సహగమనముచే నిరుపదియొక్క తరముల తరింపజేయుచున్నది, అని ప్రశంసించు చుండిరి.
ఆమె శవమును వాహకుల ద్వారా నదీతీరమునకు తెచ్చెను. అచ్చట చితి ఏర్పరుపబడెను. ఆమె
ముత్తైదువలకు వాయనము లొసగెను కంఠసూత్రములు, కుంకుమ,
పసుపు, కాటుక వీటితో కూడా మూసివాయనములిచ్చెను.
బ్రాహ్మణులకు ద్రవ్యదానము చేసి అందరిని ప్రార్థించి నమస్కరించి చిరునవ్వుతో
ఆజ్ఞయుండు నేను పితృగృహమునకు పోయెద. దీపావళి సమీపించుచున్నది. అందుకుగాను
తల్లిదండ్రులు నన్నాహ్వానము చేయుచున్నారు. శంకరుడు నాకు తండ్రి గౌరియే నాకు తల్లి
అని ఇట్లు గ్రామస్థులతో చెప్పి, తన వెంటవచ్చిన వారితో మీరు మీగ్రామములకు పొండు.
చింతించకుడు. అత్తమామల డిగినచో మేము సుఖముగ
నిచ్చట నున్నామనుడు. లేనిచో వారల చంపిన
పాపము మీకు రాగలదు. అని చెప్ప వారందరు దుఃఖనిమగ్నులైరి. అప్పుడామె యోగి చెప్పిన
వాక్యముల స్మరించి వారిచ్చిన రుద్రాక్షల రెండిని శవము కర్ణములకును మరి రెంటిని
కంఠమునకు కట్టి అచటి బ్రాహ్మణులతో
ఓబ్రాహ్మణలారా! నాకొక సంకల్పము గలదు. మీ యాజ్ఞ అయినచో నేను గురుమూర్తిని
దర్శించివచ్చి సహగమన మొనర్చెదనని వారల ప్రార్థించ వారును అమ్మా! తొందరగ రమ్ము. అస్తమయమునకు పూర్వమే శపమునకు
సంస్కారము జరుపుట ధర్మము అని చెప్పిరి. వారి యాజ్ఞతో నామె
శ్రీనృహింహసరస్వతీస్వామివారున్న సంగమ క్షేత్రమునకు ప్రయాణమయ్యెను. అనేక మంది
స్త్రీలు పురుషులు కుతూహలముతో నామె వెంట వచ్చుచుండిరి. ఆమె స్వామివారి
దర్శనమునకు పోవుచు ఇట్లునుకొనుచుండెను.
స్వామీ! నేను దౌర్భాగ్యురాలను,
కాననే
నన్నుపేక్షించితిని. నీవు శరణాగత రక్షకుడవు దాతవుగూడను, నీకీర్తి
జగద్విఖ్యాతము. కాని దురదృష్టురాలనగు నాయందు నీకనుగ్రహ మెట్లురాగలదు, నీవు ఇచ్ఛామాత్రముచే జగత్తును సృజించ సమర్థుడవు.
స్థితికాలమున పోషించును. ప్రళయకాలమున లయింపజేయుదువు. విశ్వపాలకుడవు.
త్రిమూర్తిస్వరూపుడవు. అష్టసిద్ధులు, నవనిధులు నీకు దాస్యమొనర్చుచుండును. కాని నేను కుబుద్ధినగుట చూచి
నన్నుపేక్షించితిని. లోకమున ఎవరైన నొకరికి అపకారము చేసినచో వారు రాజునకా విషయము చెప్ప రాజు
దండార్హుని దండించును. రోగగ్రస్తుడగువాడు వైద్యుని శరణుపొంద వైద్యుడు తగన
ఔషధమునొసంగి రోగనివారణ చేయును. అట్లే నీవు
త్రిమూర్తి స్వరూపుడవు. భక్త జనాధారుడవని
నీ కీర్తివిని ఇంత దూరము వచ్చితి. నిన్నే స్మరించుచు
స్వకీయులగూడ మరచి ఇరువది గ్రామములు దాటి నీ దర్శనముచే నా భర్తకు ఆరోగ్యము కలుగ
గలదను ఆశతో వచ్చితి. ఇందు నాదేమి అపరాధము
గలదు. నాతో సమానులగు స్త్రీలు వారి వారి
భర్తలతో పుత్రపౌత్రులతో సుఖించుచున్నారు.
నేను దురదృష్టవంతురాలను. శిలతో
సమమగు నాయందు మీ కృప ఎట్లు ప్రసరించును? నా కోరికలన్నియు
నెఱవేఱెను. మనోరధము ఫలించెను. నీ ఖ్యాతియు లోక ప్రసిద్ధిగాంచెను. మీ ఆజ్ఞగైకొని మీ కీర్తిని తీసికొని భర్తతో
పరలోకమునకు పోయెద. అని ఇట్లు చింతించుచు
సంగమమును సమీపించి అచ్చట అశ్వత్థమూలమున కూర్చొని ఉన్న స్వామివారిని చూచి దూరముననుండి సాష్టాంగముగ నమస్కరించెను. అప్పుడు వారు సువాసినీ! నీవు దీర్ఘ
సౌభాగ్యవతివికమ్మని దీవించిరి. మరల
నమస్కరించ అష్టపుత్రవతివికమ్మనిరి.
అచ్చటవారందరును పకపక నవ్వుచు స్వామీ! ఈమె భర్త మరణించెను. శవమును స్మశానమున నుంచి మీ ఆజ్ఞను గైకొని
భర్తతో సహగమనమొనర్చగలందులకుగాను నీమె వచ్చెనని చెప్పిరి. అప్పుడు స్వామివారు నవ్వి ఈమెకు స్థిరసౌభాగ్యముండ
భర్త ఎటుల మరణించెను? నానోట నసత్యమెన్నడు
రాజాలదు. శవమును తీసికొని రండు
చూచెదమనిరి. వెంటనే కొంతమంది స్వామివారు
శిష్యులు పరుగెత్తికొని పోయిరి. ఇంతలో
నలుగురు బ్రాహ్మణులు అచ్చటకు వచ్చి స్వామివారి పాదములకు రుద్రసూక్తముతోనభిషేక
మొనర్చి స్వామివారిని షోడశోపచారములతో పూజించిరి.
ఇంతలో బ్రాహ్మణులు శవమును తెచ్చి గురు సన్నిధానమున నుంచిరి. అప్పుడు స్వామివారు శవముమీద కప్పబడిని
వస్త్రమును, బంధముల తొలగింపచేసి, తన శిష్యులద్వారా పాద తీర్ధమును శవముమీద
చల్లించిరి. అనంతరము వారు కృపాదృష్టితో
ఏకాగ్రముగా శవము వైపు దృష్టి ప్రసరింపచేసిరి.
వారి అమృత దృష్టి పడుటతోడనే శవమునందు చైతన్యము ప్రవేశించెను. జీవము వచ్చెను. అవయవముల కదల్చెను. నిద్రపోయి లేచినవానివలె ఆ బ్రాహ్మణ కుమారుడు
సావధానుడై లేచి కూర్చుండి సిగ్గుపడుచు ఇది ఏమిటి? నా వస్త్రమేమయ్యెను? నేను నగ్నుడనై ఉంటినెందులకు? అని అనుచుండ భార్య
వానికి వస్త్రమిచ్చెను. ఆ వస్త్రము ధరించి
ఆ బాలుడు కూర్చుండి తన భార్యతో ఇది ఏమిటి? నన్నెక్కడకు తెచ్చితివి? ఈ యతీశ్వరులెవ్వరు? ఇంత నిద్ర నాకెటుల వచ్చెను? నన్నెందులకు లేపనైతివి? అని ప్రశ్నించ ఆమె చిరు నవ్వులు నవ్వుచు భర్తతో జరిగిన వృత్తాంతమంతయు
చెప్పెను. భార్యాభర్త లిరువురు లేచి
స్వామివారి పాదములయందు శిరముంచి ఆనందాశృవులచే పాదప్రక్షాళన మొనర్చిరి. అచ్చట కూడిన జనులందరు ఆనందభరితులైరి. ఆదంపతులు స్వామివారినిట్లు స్తుతించిరి. స్వామీ మేము పాపాత్ములము. ఓ త్రిమూర్త్యవతారా! నీ పాదముల మరచితిమి. మీరు జగద్గురువులు. శరణాగత వర వ్రతులు. సచ్చిదానంద స్వరూపులు! పరాత్పరా! త్రాహి త్రాహి
గురునాధా! కృపాబ్దే భక్తాభీష్ట వరప్రద! జయ జయ త్రాహి త్రాహి. మీరు శంకరులు.
భక్తుల రక్షించుటకు గాను ఇట్లు మానవులై అవతరించిరి. ఓ దేవ శిఖామణీ! భక్తు నిరంతరము ఆపదలనుండి మీరు
రక్షించుచుందురు. సర్వ భూతాంతర్యామీ! దేవా
నీకు నమస్కారము. మీరు మాయను
నడపించువారలు. మనోవాక్కుల కగోచరుడవు. ఈ త్రిభువనములు మీలీలలే. మాకు జన్మలేకుండు నటుల చేయుడు. మీరు నిష్కళంకులు. జీవమాత్రుల కృపతో రక్షించువారు. ఇహపరముల నొసగువారు. చిన్మాత్రాకారులు. కరుణా సాగరులు. స్వామీ! నృసింహ సరస్వతీ! మా అపరాధముల క్షమించి
రక్షించుడని భక్తితో దంపతులు స్తుతించ స్వామివారు సంతసించి ఇట్లనిరి. మీ దోషములన్నియు పోయెను. మీరు పూర్ణాయుష్మంతులయి అష్టపుత్రుల
బడసెదరు. దేహాంతమున ముక్తి పొందగలరు. అని ఆశీర్వదించిరి. అక్కడి వారందరు జయజయధ్వానములు చేసిరి. స్తుతించిరి.
అందొక ధూర్తుడగు బ్రాహ్మణుడు స్వామివారిని గూర్చి స్వామీ! నా కొక సంశయము
గలిగెను. నివారించుడు. వేద శాస్త్రములు బ్రహ్మ లిఖితము తప్పదని
చెప్పుచున్నవి. ఈ బ్రాహ్మణుడు అపమృత్యువుచే మరణించక, రోగ
గ్రస్తుడయి మరణమునొందెకదా. కాల మృత్యువు
కదా. తిరిగి ఎటుల జీవించెను? బ్రహ్మ లిఖితమేమయ్యెను అని ప్రశ్నించ స్వామి వారు ఆ
బ్రాహ్మణునితో నిట్లనిరి. ఈ బ్రాహ్మణునకు
ఈ జన్మమున బ్రహ్మ లిఖితము ముప్పది సంవత్సరములైనను ముందు రాబోవు జన్మమున
శతాయుష్మంతుడు కానున్నందున బ్రహ్మను ప్రార్ధించి రాబోవు జన్మమందలి శతాయుష్యము ఈ
జన్మకు సంక్రమించునటుల చేసితినని చెప్పిరి.
అచ్చటి వారందరూ స్వామివారి అమానుషమైన అత్యద్భుతమగు ప్రభావమునకు సంతసించి
వారి వారి గృహములకు వెళ్ళిరి. స్వామివారి
ఖ్యాతి దిగంత విఖ్యాతమయ్యెను. దంపతులు
స్నానమొనర్చి స్వామివారిని భక్తితో పూజించిరి.
ఇంతలో సూర్యాస్తమయము కాగా గురుమూర్తి ఆ దంపతులతో కూడ గాణగాపురమున నున్న
మఠమునకు వచ్చిరి. ఇట్టి గురు
చరితమునెవ్వరు భక్తితో విందురో పఠింతురో వారలకు గురుమూర్తి సమస్త
కోరికలనిచ్చును. అని ఇట్లు సిద్ధముని
నామధారకునితో చెప్పెను.
ఇది గురుచరితమున ముప్పది రెండవ
అధ్యాయము సమాప్తము
శ్రీ గురు చరితము
ముప్పది మూడవ అధ్యాయము
ఓం శ్రీగురుదేవదత్త,
శ్రీగణాధిపతియే నమః శ్రీగురుభ్యోనమః
నామధారకుడు సిద్ధముని
పాదములకు నమస్కరించి భక్తియుక్తుడయి స్వామీ! గురుమూర్తి బ్రాహ్మణ దంపతులతో కలసి
మఠమునకు వచ్చిరని చెప్పితిరి. పైకథావృత్తాంతమును చెప్పుడని ప్రార్థించ సిద్ధముని
ఇటుల చెప్పుచున్నారు.
మరునాడుదయము దంపతులు
గురుమూర్తివద్ద చేతులు జోడించుకొని కూర్చుండి యుండిరి. అప్పుడా పతివ్రత స్వామీ!
నేను దుఃఖముతో బాధపడునపుడు ఒక యతి వచ్చి కొన్ని ధర్మముల నుపదేశించి నాల్గు
రుద్రాక్షల నొసగెను. ఆ రుద్రాక్షల నాభర్త చెవులకు కంఠమునకు రెండేసి కట్టుమని, స్వామివారి పాదతీర్థముచే శవమును ప్రోక్షించుమనియు, గురుమూర్తి దర్శనమొనర్చి సహగమనము చేయమనియు చెప్పి
వెడలెను. ఇప్పటికి ఆ రుద్రాక్షలు నాభర్త కంఠమున నున్నవి. వారెవరో తెలియదు అని
అనెను. అప్పుడు స్వామివారు నవ్వుచు మీ భక్తిని చూచి నేనే ఆ రూపమున వచ్చితిని, రుద్రాక్షల మహిమ అద్భుతముసుమా! నీవు భక్తురాలవు గాన
రుద్రాక్షల మహిమ చెప్పెద వినుము,
శ్రద్ధతోగాని, శ్రద్ధలేకగాని రుద్రాక్షల నెవ్వరు ధరింతురో వారిని
పాపము స్పృశించదు. రుద్రాక్ష ధారణముచే కడు పుణ్యము సిద్ధించునని శ్రుతిస్మృతులు
చెప్పుచున్నవి. సహస్ర సంఖ్యాకులయిన రుద్రాక్షల నెవ్వడు ధరించునో వాడు రుద్రునితో
సమానుడు. సహస్రము లభించనిచో రెండు భుజములయందును పదునారు, పదునారును శిఖియందొకటియు, చేతులకు ఇరువదినాల్గు, కంఠమున ముప్పది రెండు, చెవులయందు ఆరు ఆరు, మస్తకమున నలుబదిరెండు, వక్షఃస్థలమున నూటెనిమిది ఇట్లెవడు ధరించునో వాడు
కుమారస్వామితో సమానుడు. రుద్రాక్షలతో పాటు ప్రవాళములు, స్పటికములు, వైడూర్యములు, మౌక్తికములు కలిపియు
మాలగ ధరించవచ్చును. రుద్రాక్షలు ధరించువారికి సద్గతి నిశ్చయము. రుద్రాక్షమాలతో జపమొనర్చుటచే అనంత ఫలము
లభించును. రుద్రాక్షలు ధరించనివాని జన్మ వ్యర్థము. రుద్రాక్షలు చెవులయందు ఆభరణముగ
ధరించి స్నానమొనర్చుటచే గంగాస్నాన ఫలములభించును. రుద్రాధ్యాయముచే రుద్రాక్ష
నభిషేకించిన రుద్రుని పూజించిన ఫలము వచ్చును. రుద్రాక్షలలో ఏకవక్త్రములు.
పంచవక్త్రములు ఏకాదశముఖములు ఇట్లునేక రకములుండును. రుద్రాక్షలు ధరించులచే చతుర్విధ
పురుషార్థములు సిద్ధించును. ఈ రుద్రాక్షల మహిమ తెలియగలందులకు ప్రాచీనమైన
ఆఖ్యానమును చెప్పుచున్నాను వినుము.
పూర్వము కాశ్మర దేశమున
భద్రసేనుడను రాజు గలడు. అతనికి సుధర్ముడను పేరుగల మంత్రి గలడు. రాజుకు తారకుడను
కుమారుడును. మంత్రికి సద్గుణుడనువాడును జన్మించిరి. ఆబాలురు చిన్ననాటినుండియు
అన్యోన్యము స్నేహితులై కలసి క్రీడించుచుండిరి. కలసియే చదువుచుండిరి. బాలులిద్దరు
బాల్యమునుండియే రుద్రాక్షలు ధరించుచు భస్మత్రిపుండములను ధరించి నియమముతో శివుని
పూజించుచుండిరి. తల్లిదండ్రులు బంగారు
ఆభరణములచే అలంకరించినను వాటిని త్యజించి రుద్రాక్షలనే ఆదరముతో ధరించుచుండిరి.
ఇట్లుండ ఒకదినమున వారి ఇంటికి పరాశరమహర్షి దైవవశమున వచ్చెను. రాజు మహర్షిని
అర్ఘ్యపాద్యములతో పూజించి సింహాసనమున కూర్చుండ బెట్టి స్తుతించి, చేతులు జోడించుకొని వారితో నిట్లు విన్నపము
చేసికొనుచున్నాడు.
మునీశ్వరా! మాపిల్లలకు
ఏమిఅయిన పిశాచమావేశించెనేమో తెలియదు. మేము ఆభరణముల నలంకరించ వాటిని దూరముగా
పారవేయుచున్నారు. రుద్రాక్షలనే ఎప్పుడు ధరించుచున్నారు. మామాటల వారలు లక్ష్యము
చేయుటలేదు. మీరు భూతభవిష్యత్తులు తెలిపిన మహానుభావులు. మీరు చెప్పిన విందురేమో! ఈ
పిల్లల పూర్వజన్మవృత్తాంతమును మాకు దయతో సెలవిండని ప్రార్థించెను. అపుడు పరాశరముని
ఆరాజుతో ఇట్లు చెప్పచుండెను. రాజా!
నీకుమారునియొక్కయు, మంత్రికుమారునియొక్కయు
విస్మయకరమైన పూర్వజన్మ వృత్తాంతమును చెప్పెద వినుము. అది వినిన ఈపిల్లలు
రుద్రాక్షలు ప్రేమతో ధరించుటకు కారణము నీకే తెలియును.
పూర్వము నందిగ్రామమున
నొక వారవనిత కలదు. ఆమె రూపలావణ్యములు వర్ణనాతీతములు, ఐశ్వర్యమున కంతులేదు. నవయౌవనమున నుండియు వేశ్యఅయినను
పతివ్రతయను కీర్తినొందెను. అన్నవస్త్రములచే సాధువుల నారాధించును. ఆమె భవనమున
కెదురుగా నొక నాట్యమండపమును నిర్మించెను. అచ్చట సర్వాభరణభూషితురాలై సఖీజనముతో
కలసి నిత్యము నృత్య మొనర్చుచుండును. ఆమె ఒక కుక్కుటమును, ఒక మర్కటమును ప్రేమతో ఆ నాట్యమంటపమున పోషించుచుండెను. ఆమె
శివభక్తురాలగుటచే వాటికి కంఠముననలంకారముగ రుద్రాక్షమాలలు కట్టి వాటికిగూడ నృత్యకళ
నేర్పుచుండెను. ఇట్లుండ ఒక గొప్ప శివభక్తుడగు వైశ్యుడు రుద్రాక్షమాలల ధరించి
భస్మభూషిడుడై రత్నకంకణములచే శోభిల్లెడి తన హస్తమున నొక దివ్యమున రత్నలింగమును
ధరించి ఆమార్గముననే పోవుచుండ ఆ వేశ్యాంగన అతనికి నమస్కరించి గౌరవముగా
తీసికొనివచ్చి నాట్యమంటపమున కూర్చుండపెట్టెను. ఆమె వైశ్యునివద్దనున్న కంకణము
రత్నలింగమును చూచి దానిని అతనివలన తీసికొనవలయునని కోరి తన చెలికత్తెలతో నిటుల
చెప్పెను. నీవు ఆషావుకారు ఆరత్నలింగమును ఆమ్మునేమో తెలిసికొనుము. నేను దానిని వెల చెల్లించి తీసికొందును. లేదా అతనికి
నాతో సుఖించ కోరికయున్నచో మూడురోజులతనికి భార్యయై సుఖమిచ్చెదను అడుగుమనెను. అప్పుడా
చెలికత్తె వైశ్యునితో ఆవిషయము చెప్ప ఆవైశ్యుడు నవ్వి ఆమె పతివ్రతయని
పేరుపొందినది. అట్టి మీనాయిక మూడు దినములు దృఢవ్రతురాలై పత్నీసుఖమిచ్చిన
నేనిలింగమును, కంకణమును నిచ్చెద కాని
మీరు వ్యభిచారమే వృత్తిగాగలవారు. మీవాక్యము సత్యమని ఇట్లు నమ్మగల? లోకుల మోసగించు మీజాతికి ధర్మమెక్కడిది.
దినమునకొకనిని మీరు వరించెదరు. అనియన ఆవేశ్యకాంత అతనితో నేను నిజముగ మూడుదినములు
మీకు మనోవాక్కాయములతో ధర్మపత్నినయి యుండి రమింపజేసెద. ఇందులకు సూర్యచంద్రులే
సాకక్షులు అని చెప్పుచు ఆలింగముపై చేయియుంచి ప్రమాణముచేసెను. దానిని నమ్మి అతను ఆ రత్నకంకణమును
ఆమె చేతికిచ్చుచు ఈలింగము నాకు ప్రాణముతో సమము. దీనికి హాని సంభవించిన నేను
ప్రాణముల త్యజించెదను గాన భద్రముగా నుంచుమని చెప్పెను. ఇంతలో సూర్యుడస్తమించెను.
ఆమె వైశ్యుని శయనాగారమున కాహ్వానించెను. వైశ్యుడామెతో ఈలింగము పవిత్రమైనది గాన
రతిసమయమున ఆస్థానమున నుండ తగదని చెప్ప ఆమె ఆలింగమును నాట్యముండపముననే మధ్యస్తంభ
సమీపమున భద్రపరచి వైశ్యునితో సహ తన శయనగృహము ప్రవేశించెను. వారు గృహమున
క్రీడాసక్తులయియుండ దైవవశమున నాట్యమండపమునకు నిప్పంటుంకొనెను. క్షణములో నామంటపము
కర్ఫూరమువలె ధగ్ధమయ్యెను. అది చూచి వైశ్యుడు హాహాకారమొనర్చును వచ్చి
నాప్రాణలింగము నశించ నేనెట్లు బ్రతుకగలనని దుఃఖించెను. సమీపస్థులు నిప్పు
చల్లార్చి చూచిరి గాని లింగము కనిపించదాయెను. కాలిపోయెను. దానితోపాటు అక్కడ కట్టిన
కుక్కుటమర్కటములుకూడ భస్మమైపోయెను. వైశ్యుడు విలపించుచు కాష్టములచే చితిపేర్చి అగ్ని
ప్రజ్వలింపచేసి యందు దుమికి మరణించెను. నాగరకులందరు విస్మయముతో దుఃఖించుచుండిరి.
అప్పుడావేశ్య హాదైవమా ఏమి అయ్యెను! నాకు ఈదినమున పతిహత్య సంభవించెను.
నాప్రాణేశ్వరుడు నశించిన నేనెట్లు బ్రతుకగలను? నేను పతివ్రతనని ప్రసిద్ధినొందితి కాన నేనిప్పుడు అగ్నియందు
నితనితో సహగమన మొనర్చుట ధర్మము అని నిశ్చయించి అచ్చటనున్న బ్రాహ్మణులకు నమస్కరించి
తనకున్న భూషణముల వస్త్రముల ధనముతో సహ
దానమొనర్చి చందనకాష్టములచే అగ్నిని ప్రజ్వరింపచేసి నేను భర్తతోసహ సహగమన
మొనర్చుచున్నాను ఆజ్ఞయిండని అచటివారల ప్రర్థించెను. ఆమెమాటలు విని ఆమె బంధువులు
సోదరులు ఇదియేమి ధర్మము? మతిహీనులారా! మనము
వేశ్యకులమువారముగదా! అసంఖ్యాకులు మనగృహములకు వచ్చెదరు. ఇతనే నీకు భర్త ఎట్లు
కాగలడు? వేశ్యధర్మము నీకు తెలియదు. రోజుకొక నూతనుడు మనతో రతిజేయు
వచ్చుచుండును. లింగమేమిటి? ధర్మమేమిటి? లోకులు నిన్ను చూచి పరిహసించెదరు అని అనిరి. ఆమె
వారివాక్యముల నిరాదరించి అచటి వారితో నేను ఇతనికి మూడుదినములు భర్యగానుందునని
సూర్యచంద్రుల సాక్షిగ ప్రమాణము చేసితిని.
కావున ధర్మమునుబట్టి నేనితనికి ధర్మపత్నినే యగుదును. అట్టి నాభర్తమరణించిన
నేనెట్లు జీవించెద? భర్తతో సహగమన మొనర్చు
స్త్రీ అడుగడుగునకు అశ్వమేధ ఫలము
నొందగలదని శాస్త్రములు
చెప్పుచున్నవి. ఏ స్త్రీ
సహగమనమొనర్చునో ఆ స్త్రీ తండ్రియొక్కయు, భర్తయొక్క, తల్లియొక్కయు, ఇరువది తరములు తరింపజేయును. అని శ్రుతులు
చెప్పుచుండ అట్టి పుణ్యమును వదలి నేను ఈ
అసారమగు సంసారమున జీవించి ఏమి ఫలము? ఎప్పటికైనను మరణింపక తప్పదు. కాన సహగమన మొనర్చెదనని చెప్పి అగ్నికి సమస్కరించి
ప్రదక్ష్షిణ మొనర్చి ఈశ్వరుని స్మరించి అగ్ని సమీపమునకు పోయి దానిలో దుమికెను.
వెంటనే పంచవక్త్రుడు, నాగయజ్ఞోపవీతియగు
సదాశివుడు నందివాహనమధిష్టించి ప్రత్యక్షమై తన పదిభుజములతో నామెను పట్టుకొనెను.
అగ్ని శమించెను. అప్పుడు శివుడామెకు ప్రసన్నుడై వరము కొరుకోనుమనెను. నీధైర్యమును
పరిక్షించుటకుగాను నేనే వైశ్యుడనై వచ్చితిని. ఆ లింగము నారూపమే. నేనే మాయతో
అగ్నిని కల్పించితి. నీమనస్థైర్యము కనిపెట్టగలందులకు నేనగ్ని ప్రవేశమొనర్చితి.
నీవు నిజమగు పతివ్రతవు. నీభక్తికి సంతసించితి. దీర్ఘాయుష్యము. ఐశ్వర్యమును, ఆరోగ్యమును ఇంక ఏమి అయిన కొరికలున్నచో
కోరుకొనుమనెను. అప్పుడా వేశ్య శివునితో స్వామీ తుచ్చములగు
స్వర్గమర్త్యపాతాళములయందలి సుఖములతో పనిలేదు. నన్ను బంధుమిత్ర పరివారసమేతముగా
కైలాసమునకు కొనిపొండు. మీసన్నిధిని, మీపాదకమలమునకు భృంగమునై యుండెద. సంసార సముద్రమునుండి నన్ను తరింపజేయుడని
ప్రార్థించెను. శివుడు అట్లె ఆమెను పరివారముతో గూడ కైలాసమిచ్చి అంతర్హితుడయ్యెను.
ఓరాజా! నాట్యమంటపమున
మరణించిన కుక్కుటమర్కటములే మర్కటము నీకుమారునిగను, కక్కుటము మంత్రికుమారునిగను జన్మించినవి. పూర్వజన్మమున
రుద్రాక్షల ధరించుటచే ఆ సంస్కారముబట్టి వీరలు జ్ఞానవంతులై శివభక్తులై
రుద్రాక్షలనే ప్రేమతో ధరించుచున్నారు. రుద్రాక్షల ధరించువారి పుణ్యమునకు మితిలేదు
అని పరాశరుడు ఆరాజునకు చెప్పెనని గురుమూర్తి దంపతులకు చెప్పిరి. ఇట్లు సిద్దముని నామధారకునితో గురుచరితమును
చెప్పెను.
ఇది గురుచరితమందలి ముప్పది మూడవ
యధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
ముప్పది నాల్గవ అధ్యాయము
శ్రీగణేశాయనమః శ్రీనృసింహసరస్వత్యై నమః
గురుమూర్తి దంపతులతో
నిట్లు చెప్పుచున్నారు, పరాశరునివలన నారాజుతన
కుమారునియొక్క పూర్వజన్మ వృత్తాంతము రుద్రాక్షమహాత్మ్యమును విని భక్తితో చేతులు
జోడించుకొని ఇట్లు ప్రశ్నించెను. స్వామీ, మీవలన రుద్రాక్షమాహాత్మ్యమును వింటిని. పూర్వజన్మమున నజ్ఞానముచే రుద్రాక్షల
ధరించిన పుణ్యమున వీరు జ్ఞానము గలవారైననియు, భక్తిగలవారై భస్మ రుద్రాక్షల ప్రీతితో ధరించుచుండిరనియు
సెలవిచ్చితిరి. తమరు త్రికాలజ్ఞాలు కాన నాకుమారుని భవిష్యత్తు తమ వలన
వినగోరుచున్నాను. కాన నాయందు దయయుంచి
చెప్పుడని ప్రార్థించెను.
అప్పుడు పరాశరమహర్షి
రాజుతో ఓరాజా! నీవు నీకుమారుని భవిష్యత్తును ప్రశ్నించుచున్నావు. నేను నిజము
చెప్పిన నీకు దుఃఖము కలుగును. కాన నేనెట్లు చెప్పగలనన నారాజు మహర్షితో స్వామీ, ఎట్టి
దుఃఖమునకును కష్టమునకును ప్రతీకార మొనర్చి మమ్ము రక్షించు సామర్థ్యము తమకు
గలదు గాన సంశయింపక సెలవిండని ప్రార్థింప నాపరాశరమహర్షి ఇట్లు చెస్పుచున్నారు.
నీకుమారునకు బ్రహ్మ పన్నెండు సంవత్సరములు మాత్రమే ఆయుష్యము లిఖించెను. అందు ఇంకను
ఏడు దినములు మాత్రమే మిగిలియున్నవి ఎనిమిదవరోజు నీకుమారుడు మృతిచెందును అని
చెప్పెను. ఆమహర్షి పాదములమీద పడి స్వామీ మిమ్ము శరణు పొందుచున్నాను. రక్షించుడు.
రక్షించుడు అని దీనుడై ప్రార్థించెను. రాజు భర్యయు దుఃఖార్తురాలై పరాశర మహర్షి
పాదములపై పడి పుత్రుని రక్షింపుమని దీనురాలై ప్రార్థించెను.
అప్పుడు ఋషి వారల
నోదార్చి అభయమిచ్చి మీరు భయము విడనాడి ఉమాకాంతుని సదాశివుని శూలపాణిని ఆరాధించుడు.
శివుని మీరు అనన్యభక్తితో శరణుపొందితిరేని శివుడే మీకుమారుని రక్షించును, ఆవిధానము చెప్పెద వినుమని పరాశరుడు ఆరాజుతో శివమహిమ
నీక్రిందివిధమున చెప్పుచున్నాను.
ఎవ్వని చేతను జయింపబడని
కాలమును జయించుట కొక ఉపాయము గలదు. స్వర్గ మర్త్య పాతాళములందు ప్రసిద్ధిగాంచిన
దేవుడు శివుడు. అట్టి శివుడు సచ్చిదానందస్వరూపుడు. నిష్కళుడు. అట్టి శివుడు సృష్ట్యాదియందు మాయయందలి రజోగుణముతో బ్రహ్మదేవుని
సృజించి అతనికి సృష్టివిధానము తెలియగలందులకు నాలుగు వేదములను ఉపనిషత్తులను గూడ
ననుగ్రహించెను. అట్టి వేదములతో ప్రధానమైన యజర్వేదమందు శివుని మాహాత్మ్యమును
ప్రకటించు రుద్రాధ్యాయము గలదు. రుద్రుడవ్యయుడు నాశరహితుడు. అట్టి రుద్రుని
స్వరూపమును వర్ణించు రుద్రాధ్యాయముయొక్క మహిమ నిరుపమానము. బ్రహ్మదేవుడు తన
దక్షిణముఖముతో యజుర్వేదమును అందలి రుద్రాధ్యాయ సహితముగా సృష్ట్యాదియందు ఋషులకు
ప్రదేశించెను. బ్రహ్మవలన మరీచ్యాది మహర్షులు, వారిద్వారా వారి శిష్య ప్రశిష్యులును ఈరుద్రాధ్యాయమును
ఉపదేశమొందిరి. ఈవిధమున శివుని మహిమను వర్ణించు రుద్రాధ్యాయము జగత్తున
ప్రసిద్థిచెందెను. రుద్రాధ్యాయముతో సమమగు మంత్రము వేరొండు లేదు. అది పఠించువారికి
చతుర్విధ పురుషార్థముల నివ్వసమర్థము. గొప్ప పాపము లొనర్చువారుగూడ రుద్రమును
జపించిన పవిత్రులై పరమపదవి నొందుదురు,. బ్రహ్మదేవుడు రుద్రాభిషేకము చేయుబడిన ఉదకమును అమృతతీర్థముగా చేసెను. అట్టి
తీర్థమును స్నానముచేసిన వారికది తారకముగాగలదు. అట్టి తీర్థము దుష్కర్మల
నశింపజేయును. దానిని సేవించువారు సంసారమునుండి తరించెదరు. సుకృతముగాని
దుష్కృతముగాని ఎవరు పూర్వజన్మమున చేయుదురో వారు వాటి ఫలమును ఈజన్మమున తప్పక
అనుభవింతురు.
పూర్వము బ్రహ్మదేవుడు
సృష్ట్యాదియందు తన వక్షఃస్థలము నుండి ధర్మమును, పృష్ఠభాగమునుండి అధర్మమును నిర్మించెను. అందు
అధర్మమాచరించువారు ఇహపరముల దుఃఖముల ననుభవించెదరు. అధర్మమునకు మహాభయంకరములగు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు పుత్రులు. వ్యభిచారము కామము యొక్క పుత్రుడు. ఇట్లేకామము ద్వారా
చేయబడు దుస్కార్యములుగూడ కామముయొక్క పుత్రులనియే తెలియవలెను. క్రోధముతో చేయబడు
హింస బ్రహ్మహత్యాది పాపములు క్రోధముయొక్క సంతానము. దేవ బ్రాహ్మణ ద్రవ్యాపహరణము, కన్యా విక్రయము దాతృత్వము లేకుండ ద్రవ్యము కూడ
పట్టుట ఇవి లోభసంతానములు.
యమధర్మరాజు ఒకదినమున తన
దూతల పిలిచి మీరు నాయాజ్ఞ ననుసరించి భూలోకమున అధర్మమాచరించువారిని నాలోకమునకు
గొనిరండని ఆజ్ఞాపించెను. యముని యాజ్ఞను శిరసావహించి యమదూతలు పాశముల చేతపూని
భూలోకమునకు వచ్చిరి గాని ప్రతివారును రుద్రమును పఠించుచుండుటచే వారల సమీపించజాలక
భయపడి యమలోకమునకు పరుగిడిపోయి యమునితో నిట్లు చెప్పసాగిరి.
యమధర్మరాజా! జయజయ. మీయాజ్ఞ ననుసరించి
మేము భూలోకమునకు వెళ్ళితిమి. కాని అచ్చట వారు పఠించు రుద్రాధ్యాయమను అగ్నిచే
దహింపబడి వారల సమీపించజాలక తిరిగి వచ్చితిమి. ఇక మీదట మేము భూమికి పోజాలము.
మాగతియేమి? గ్రామ గ్రామముల, నదీతీరముల, దేవాలయములయందు రుద్రాధ్యాయమును బ్రాహ్మణులు పఠించుచుండ
నాగ్రామమును సమీపించు శక్తిగూడ మాకు లేకపోయెను. ఎన్ని ప్రాయశ్చిత్తములు చేసినను
పోని పాపముల నాచరించినవారును రుద్రపారాయణ మొనర్చి పునీతులగుచున్నారు. రుద్రము
మాపాలిటి కాలకూటము. ఇట్టి భూమికి మేమేట్లు
పోగలము? ఓయమధర్మరాజా బ్రహ్మదేవుడు నిర్మించిన రుద్రమను విషము మమ్ముల
బాధింపకుండ చేయుమని యమదూతలు ప్రార్థించిరి. దూతల వాక్యములు విని యముడు కోపముతో
శిరము కంపింపజేసి వెంటనే బ్రహ్మలోకమునకు వెళ్లి బ్రహ్మకు ప్రణమిల్లి ఇట్లనెను.
పద్మాసనా! చతుర్ముఖ!
జయజయ. నేను మీయాజ్ఞకు బద్ధుడనయు యమలోకాధిపత్య మొనర్చుచున్నాను. నాదూతలు పాపాత్ముల
కొని రాగలందులకు భూలోకమునకు పోయిరి.
మహాపాపులుగూడ మీరొసగిన రుద్రపారాయణ మొనర్చి పునీతులగుచున్నారు. నా దూతలు
రుద్రపారాయణమను అగ్నిచే దగ్ధులై భీతల్లి వచ్చిరి. నానరకము శూన్యమయినది. శూన్యమగు
నరకమున నేనేమి రాజ్యము చేయగలను?
ఇవ్విధమున
నందరు ముక్తి నొందినచో సృష్టి ఎట్లు జరుగగలదు? కాన ఏమి అయిన ఉపాయమాలోచించి సృష్టిపరంపర నిర్విఘ్నముగ
జరుగునట్లు చేయుడు. మీరు మానవులకు రుద్రము నెందులకిచ్చితిరి. అని ఇట్లు అడుగు
బ్రహ్మదేవుడు కొంచెమాలోచించి యమునితో నిట్లు చెప్పుచున్నాడు.
ఇప్పటినుండియు ఎవరు
నియమములేక దుర్మార్గులై భక్తిహీనులై శయనించుచు, నడచుచు,
శుచిత్వములేక
జపింతురో, పఠింతురో వారి పాపములు
నశింపకపోగా అట్టివారు మహాపాపులుగ పరిగణింప బడుదురు. కాన నట్టివారు యమయాతన కర్హులేగాన వారల నీవు
నీదూతలద్వారా యమలోకమునకు గొనిపోయి శిక్షించుము.
భక్తితో నియమముతో పఠించువారు వందనీయులుగాన వారి జోలికి మాత్రము పోవలదని
నీదూతల కాజ్ఞాపింపుము. రుద్ర జపముతోసమానమగు పుణ్యము మరి యొండులేదు. పూర్వ
జన్మార్జిత పాపముచే మానవుడు అల్పాయువగును. అట్టిపాపముగూడ రుద్రజపముచే
నివర్తించును. సంపత్తియు జ్ఞానము,
బలము, వర్చస్సు, మేధ ఇవి అన్నియు రుద్రపారాయణముచే అభించును. రుద్రాభిషేక తీర్థముతో
స్నానమొనర్చువారు పావనులయ్యెదరు. రుద్రమును జపించువాడు చిరంజీవియగును. అట్టివానిని
చూచి మృత్యువు భయపడును. శతరుద్రముతో శివునభిషేకించువారు శతాయుష్మంతులగుదురు. కాన
ఓయమధర్మరాజా! ఈవిషయమును నీవు గ్రహించి నీదూతలతో నికమీద భక్తితో రుద్రపారాయణ
చేయువారి జోలికి మాత్రము పోవద్దని చెప్పమన యముడు బ్రహ్మకు నమస్కరించి సెలవు
తీసికొని యమలోకమునకు వచ్చి తన దూతలకు నట్లే చెప్పెను. కాన ఓరాజా! నీకుమారునకు రానునన్న మృత్యువు
తొలగి దీర్ఘాయష్మము సిద్ధించవలయునన్న నీవు నూరు మంది సద్బ్రాహ్మణుల నీహ్వానించి
వారిచే పదివేల రుద్రములచే శివునభిషేకింపచేయుము. అట్లేనర్చితివేని నీకుమారుడు పదివేల సంవత్సరములు జీవించును.
అఖండైశ్వర్యముతో రాజ్యముననుభవించును. అని పరాశరుడు చెప్ప రాజు పరాశరమహర్షినే
యాచార్యునిగ నియమించి వారు చెప్పినటుల గొప్ప మంటప మేర్పరచి శత సంఖ్యాక బ్రాహ్మణుల
రప్పించి నూరు కలశములతో నుదకము తెప్పించి అఖండధారగనహోరాత్రులు ఏడుదినములు
శివునకభిషేకము చేయించెను. నిత్యము అభిషేక తీర్ధముతో రాకుమారునకు స్నానము
చేయించుచుండిరి. ఎనిమిదవ దినము సంప్రాప్తముకాగా బాలునకు మృత్యువు సమాసన్నమైనందున
యమదూతలు పాశములతో రాగా వారిని చూచి అతడట్లే మూర్చనొందెను. పరాశరుడును రుద్రము జపించు బ్రాహ్మణులును బాలునిమీద
మంత్రాక్షతల జల్లిరి. అందుచే యమదూతలు బాలుని సమీపించజాలక దూరమునుండి పాశముల బాలుని
మీద వేయ ప్రయత్నించుచుండిరి. ఇంతలో కైలాసమునుండి శివదూతలు దండహస్తులై వచ్చి
యమదూతల పారద్రోలిరి. శివదూతలచే కొట్టబడుచు యమదూతలు చేయునదిలేక యమలోకమున కేగిరి.
అప్పుడు పరాశరుడు రుద్రాభిషేకతీర్థముచే బాలుని ప్రోక్షించి రక్షించెను. బాలుడు
లేచి కూర్చుండెను. బ్రాహ్మణులు వేదమంత్రములతో రాజకుమారు నాశీర్వదించిరి. రాజు మహానందముతో పరాశరుని బ్రహ్మణులను
పూజించెను. సత్కరించెను. అన్నదాన మొనర్చెను. మహోత్సన మొనర్చి సభచేసి పరాశరుని
సింహసనమున కూర్చుండబెట్టి పూజించుచుండ నారదుడచ్చోటికి దైవవశమున వచ్చెను. నారదుని
చూచుటతోడనే సభలోనివారందరు దిగ్గున లేచిరి. రాజు నారదున కెదురేగి స్వాగతమొనర్చి తీసికొనివచ్చి
ఉత్తమాసనమున కూర్చుండబెట్టి చేతులు జోడించుకొని వినయావనతుడై వారితో ఓదేవర్షీ!
నారదమహర్షీ! మీరు సమస్తలోకములయందు అవ్యాహతముగ తిరుగుచుందురు. ఎందైన ఏమియైన
అపూర్వవిషయము గలిగిన పెలవిండని ప్రార్థించెను. అంత నారదుడిట్లనెను, ఓరాజా నేనిప్పుడు కైలాసమునుండి వచ్చుచున్నాను. అచ్చట
నేనొక అపూర్వము చూచితిని. చెప్పెద వినుము. మహామృత్యువు దూతలతోగూడ నీకుమారుని
గొనిపోవరాగ శివదూతలు వారల పరాభవించి వెడలగొట్టిరి. అప్పుడు యమదూతలు చేయునది లేక యమలోకమునకు పోయి
యమధర్మరాజుతో జరిగిన విషయము చెప్పిరి. యమడు కుపితుడై వీరభద్రుని సమీపించి మాదూతలు
నిజ కర్మచే గతాయువగు రాజపుత్రుని గొనిపోవరాగా మీ శివదూతలు నిష్కారణముగ మాదూతల
నెందుకు దండించిరని ప్రశ్నించ వీరభద్రుడిట్లనెను. ఈరాజకుమారునకు పదివేలసంవత్సరములు
ఆయుష్యముండ నీవు చిత్రగుప్తునితో సరిగ నాలోచింపక దూతల నెటుల పంపితివి? నీపుణ్యము మంచిదిగాన మాదూతలు మీదూతల ప్రాణములతో
వదలిరి అనిచెప్పెను. అప్పుడు వెంటనే యముడు చిత్రగుప్తుని పిలిపించి రాజ కుమారుని
ఆయుష్యపరిమితి చక్కగ విచారించి చెప్పుమనెను. చిత్రగుప్తుడు తన పుస్తకముల తెరచి చూడ
అందు ఆబాలునకు పన్నెండు సంవత్సరములే ఆయుష్యమనియు. కారణాంతరముల ఆగండము తప్పిన
పదివేలసంవత్సరములు జీవించుననియు వ్రాయబడియుండెను. ఆవిషయము యముడు చూచి వీరభద్రుని తన పొరపాటునకు క్షమాపణ కోరుకొని తన
పురమున కేగెను. ఈవిషయము నేను కనులార గాంచినది అని చెప్ప ఆరాజు నారదుని పూజించెను.
నారదుడు అటనుండి వీణమీటుచు ఆకాశమార్గమున
నేగెను. పరాశర మహర్షియు రాజుచే పూజింపబడి తన యాశ్రమమునకు పోయెను. బ్రాహ్మణులందరు
రాజుచే సత్కరింపబడి వారివారి గృహముల కేడిరి. ఆరాజకుమారుడు రుద్రాధ్యాయమహిమచే
మృత్యువును జయించి పదివేలసంవత్సరములు నిష్కంటకముగ రాజ్యపరిపాలన మొనర్చెను. ఇది
అంతయు రుద్రాధ్యాయ మహిమ యని నృసింహసరస్వతీ స్వామివారు ఆదంపతులతో చెప్పిరి.
స్వామివారికి రుద్రాధ్యాయమన్న కడు ప్రేమ. కాన గురుమూర్తిని భక్తులు
రుద్రాభిషేకముతో నర్చించెదరు. అని ఈకథావృత్తాంతమును సిద్ధముని నామధారకునితో
చెప్పెను. గురుమూర్తిచరిత్రను భక్తితోవినువారు భవసాగరమును సులభముగా దాటుదురు.
ఇది గురుచరితమున ముప్పదినాల్గవ అధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
ముప్పది అయిదవ అధ్యాయము
ఓం శ్రీగురుదేవదత్త,
శ్రీగణాధిపతియే నమః శ్రీగురుభ్యోనమః
నామధారకుడు సిద్ధమునితో స్వామీ గురుమూర్తి దంపతులతో
రుద్రాధ్యాయ మహాత్మ్యమును చెప్పిన విషయమును మీ వలన వింటిని. ఆపైన జరిగిన కథావృత్తాంతమును సెలవిండని
ప్రార్ధించ సిద్ధముని ఇట్లు చెప్పుచుండెను.
ఒక దినముననాదంపతులు ఉదయమున లేచి స్నానమొనర్చి గురుమూర్తిని
దర్శింప వచ్చిరి. అప్పుడా పతివ్రత
స్వామివారిని చేతులు జోడించుకొని ఇట్లు వేడెను.
స్వామీ ముందు నాకు సద్బుద్ధి కలుగలందులకు ఏదిఅయిన మంత్రముపదేశింపుడు అని
ప్రశ్నించగా గురుమూర్తి ఇట్లు చెప్పుచుండిరి.
స్త్రీలు తరించుటకు పతి సేవయే చాలును. స్త్రీలకు మంత్రముపదేశించరాదు. అట్లెవరయిన ఉపదేశించిన, ఉపదేశించినవారిమంత్రమునకు
కూడ మహా హాని వాటిల్లును. ఈ విషయము నీకు
తెలియగలందులకు పురాతనమగు ఒక ఇతిహాసమును చెప్పుచున్నాను వినుము.
పూర్వము దేవ దానవులకు ఘోరమగు సంగ్రామము జరిగెను. యుద్ధమున దేవతలచే మృతినొందిన రాక్షసుల వారి
గురువగు శుక్రాచార్యుడు తన మృతసంజీవనీ విద్యచే జీవింపజేయుచుండిరి. అట్లు జీవించి తిరిగి రాక్షసులు దేవతలమీదకు
యుద్ధసన్నద్ధులగుచుండిరి. దేవేంద్రుడది
గ్రహించి కైలాసమునకేగి ఈశ్వరునితో శుక్రాచార్యుని వలన దేవతలకు కలుగుచున్న
అపకారమును గూర్చి చెప్పెను. శివుడు
కోపించి నందీశ్వరునితో శుక్రాచార్యుని అట్లే పట్టుకొని రమ్మని చెప్ప, నందీశ్వరుడు శుక్రుడున్న స్థలమునకు వెళ్లి ధ్యాన
నిష్ఠుడయిన శుక్రుని అట్లే పట్టుకొని రాగా శివుడు అతనిని అగస్త్యుడు సముద్రమును
పానము చేసినటుల భక్షించెను. కాని మంత్ర
ప్రభావముచే శుక్రుడు మరణించక కొంతకాలమునకు శివుని మూత్రద్వారమునుండి శుక్రరూపమున
బయిటకు వచ్చెను. అంతకు పూర్వము భార్గవుడను
పేరుగల ఇతడు శివుని శుక్ర సంపర్కముచే శుక్రుడని లోక విఖ్యాతుడయ్యెను. ఇట్లు బయిటకు వచ్చి తిరిగి యథాపూర్వముగా రాక్షసుల బ్రతికించుచుండెను. అప్పుడింద్రుడు బృహస్పతిని సమీపించి అతనితో
గురూత్తమా! శుక్రుడు చనిపోయిన రాక్షసుల బ్రతికించుచున్నాడు. ఇట్లు జరుగ కుండ మీరేమైన విఘ్నమాచరింప
వలయును. మీరు మమ్ముల ఉపేక్షించుట ధర్మముకాదు. మీరు మాకు పూజ్యులు. బుద్ధి సూక్ష్మమున మీరు శుక్రునికి
తీసిపోరు. కాన ఎట్లయిన మమ్ముల రక్షింపుడని
ప్రార్ధించెను. అప్పుడు బృహస్పతి సంతసించి
సంజీవని మంత్రము శుక్రుని వద్దనే గలదు.
మనము ఏది అయిన ఉపాయముచే ఆ మంత్ర ప్రభావము నశించునటుల చెయ్యవలయును. నేను నాకుమారుడగు కచుని అతని వద్దకు
విద్యార్ధిగ పంపెద. అతను ఎట్లయిన శుక్రుని
వద్దనుండి మంత్రమును గ్రహించి రాగలడు అని దేవేంద్రుని సమాధాన పరచి బృహస్పతి తన
కుమారుడయిన కచుని పిలిచి నీవు దేవ కార్యము కొఱకు విద్యార్ధి రూపము ధరించి శుక్రుని
వద్దకు పొమ్ము. దేవతల నిందించి అయినను
అతని విశ్వాసమును సంపాదించి మనోవాక్కాయకర్మలతో అతని సేవించి అతని వద్దనుండి
సంజీవని మంత్రమును ఎటులయిన గ్రహించి రమ్ము అని చెప్పెను. కచుడు బృహస్పతి చెప్పినటుల విద్యార్ధి రూపముతో
శుక్రాచార్యుని గృహమునన కేతెంచి అతనికి
నమస్కరించి చేతులు జోడించుకొని నిలబడెను. శుక్రుడు నీవ్వెడవు? ఎందులకుగాను వచ్చితివని ప్రశ్నింప కచుడు శుక్రునితో
స్వామీ! నేను మీకీర్తి విని విద్యార్థినయివచ్చితిని. బ్రాహ్మణ బాలుడను. మీరు అనాధ రక్షకులు. భక్తులకు చింతామణి వంటివారు. మీ చరణ సేవ చేసెద. నన్ను శిష్యునిగా పరిగణింపుడని
ప్రార్ధించెను. ఆమాటలు విని శుక్రుడు
విచారించుచుండ అచ్చట శుక్రాచార్యుని కుమార్తె అయిన దేవయాని అను కన్యారత్నము కచుని
చూచి అతని నిరుపమానమగు సౌందర్యమును చూచి ఇతను నాకు పతిఅయిన బాగుండునని మనమున
భావించి తండ్రితో ఈ బాలుని మీరు శిష్యునిగ నంగీకరింపుడని చెప్ప పుత్రిక యందలి
వాత్సల్యముతో శుక్రుడు కచుని శిష్యునిగ అంగీకరించెను. ఇట్లు కొన్ని రోజులు జరుగగ రాక్షసులు ఈ కచుని
దేవపక్షమువానిగను కపటవేషముతో తమ గురువు వద్దనుండి విద్యా రహస్యములు కొనిపోవచ్చిన
వానిగను గ్రహించిరి. శుక్రుడు కచునకు
విద్య చెప్పిన తమకు భంగము వాటిల్లునని భావించి ఒకనాడు సమిధల తెచ్చుటకు గాను కచుడు
వనములకేగ అతనితోబాటు దైత్యులుకూడ వెళ్ళి
అరణ్యమున అతనిని సంహరించి సమిధల తామే తెచ్చి ఇచ్చిరి. సాయంకాలమైనను కచుడు రానందుకు దేవయాని చింతించి
తండ్రిని సమీపించి కచుడేమయ్యెను?
అతను
రానిది నేను భుజించను అని అన శుక్రుడు తన ధ్యాన దృష్టితో కచుడరణ్యమున
మృతుడయియుండుట తెలిసికొని సంజీవనీ మంత్ర ప్రభావముతో బ్రతికించెను. కచుడు శుక్రుని ఆశ్రమమునకు సుఖముగ తిరిగి
వచ్చెను.
ఇట్లు కొంతకాలము జరుగగ రాక్షసులు ద్వేషపూరితులయి ఒకనాడు
కచుని అరణ్యమున సంహరించి శుక్రుడు తిరిగి
బ్రతికించునేమో అని సందేహముతో వాని శవమును ముక్కలు ముక్కలుగ ఖండించి దశదిక్కుల
చిమ్మివేసిరి. ఇట్లు సాయంకాలమైనను కచుడు
తిరిగి రానందులకు దేవయాని తండ్రిని సమీపించి కచుడు నాప్రాణస్నేహితుడు. అతను ఇంకను తిరిగి రాలేదు. అతను రానియెడల నేను విషమును భక్షించి
మరణించెదనని చెప్పెను. శుక్రుడు
పుత్రికయందల వ్యామోహముచే, వాత్సల్యముచే దివ్య
దృష్టిచే కచుడు ఖండ ఖండములుగ ఖండింపబడెనని గ్రహించి తన మంత్రప్రభావముచే తిరిగి
బ్రతికింపచేసెను. కచుడు ఆశ్రమమునకు
చేరెను. దేవయాని సంతోషించెను. అప్పుడు
రాక్షసులు గుమిగూడి మనము కచుని సంహరించినను పుత్రికయందలి ప్రేమతో మాటిమాటికి
బ్రతికించుచున్నాడు. ఒక ఉపాయము చేసెదముగాక, అని నిశ్చయించుకొని ఏకాదశి దినమున కచుని అరణ్యమన
సంహరించి భస్మమొనర్చి ఆభస్మమును పానీయమున కలిపి శుక్రునిచే త్రాగించిరి. శుక్రుడును విచారించక అది విశ్వసించి
త్రాగెను. మామూలు ప్రకారము కచుడు రానందున
దేవయాని దుఃఖించుచు తండ్రిని సమీపించి తండ్రీ! నాప్రాణ స్నేహితుడు నేడు
రాడయ్యెను. ఏమయ్యెనో ఏమో అన
దుఃఖించెను. అప్పుడు శుక్రుడు జ్ఞాన
దృష్టితో బాహ్యమున చూచెను. ఎక్కడను కచుడు
కనపడక పోయెను. అప్పుడు అంతర్దృష్టిచే చూడ
తన ఉదరముననే జీర్ణమయి ఉండినటుల గోచరించెను.
అప్పుడు కుమార్తెతో నా ఉదరమున జీర్ణమయి ఉన్నాడు. నేనతనిని బ్రతికించితినేని నేనే మరణించవలసి
వచ్చును. అతనితో నీకేమి ప్రయోజనము అని యన
ఆమె నేనతనిని కామించితిని. అతనికి భార్యనయి
మేమిద్దరము నీవద్దనే ఉండెదము. అట్టినా
ప్రియుని బ్రతికించనిచో మీ ఎదుట నేనిక్కడనే ప్రాణముల వదిలెదను. అని దుఃఖింపసాగెను. ఆ మాట విని కుమార్తెతో అతనిని బ్రతికించినచో
నేను మరణించెదను. అప్పుడు నిన్ను
కన్యాదానమొనర్చువారెవరు? అని యన దేవయాని అందరినీ
జీవింపచేసెడి మీకు మరణమెట్లు రాగలదు? ఇది ఏమి చిత్రము అని అనెను. అందుకు శుక్రుడు పుత్రీ, జీవింపజేసెడి సంజీవినీ మంత్రము నావద్దనే గలదు. నేనే
మరణించిననన్ను బ్రతికించు వారెవ్వరు? అని యన కుమార్తె బద్ధహస్తురాలయి తండ్రీ! మీరా మంత్రమును నాకుపదేశింపుడు. కచుని
బ్రతికించుడు. కచుడు మీఉదరమును చీలికొని రాగా నేను మీరుపదేశించిన మంత్రము
పఠించిమిమ్ముల బ్రతికించెదనని పాదములకు నమస్కరించెను. అప్పుడు శుక్రుడు పుత్రీ
స్త్రీలకు మంత్రోపదేశము చేసినచో ఆమంత్రప్రభావమునకే కీడు వాటిల్లును అని అనెను.
అప్పుడు దేవయాని మీరు, మీమంత్రమును సుఖముగ నుండుడు. ఇక నేను బ్రతుకను అని
క్రిందపడి మూర్ఛిల్లెను. శుక్రుడు పుత్రికయందలి వ్యామోహముతో కుమార్తెను లేవదీసి
చేయునదిలేక సంజీవినీమంత్రమును ఆమెకు ఉపదేశించెను. కచుడును ఉదరమునుండి ఆ మంత్రమును
వినుట తటస్థించెను. ఉదరముననున్న కచుడు జీవించి శుక్రుని పొట్టను చీల్చికొని బయటకు
వచ్చెను. అప్పుడు దేవయాని మంత్రము
నుచ్చరించి తండ్రిని బ్రతికించెను. అప్పుడును కచుడు మంత్రమును వినుట
తటస్థించినందున కార్యము సానుకూలమయ్యెను అని సంతసించి శుక్రుని సమీపించి నమస్కరించి
ఆచార్యా! నా మనోరథము నెరవేరినది. నేనిచ్చట
నున్న రాక్షసులు ద్వేషముతో నన్ను హింసించుచున్నారు. కాన మీ యాజ్ఞ అయినచో వెళ్లెద
ననెను. శక్రుడును సంతసించి పొమ్మనెను. కచుడు పోవుచుండ దేవయిని అతని వస్త్రమును
పట్టుకొని నేను నిన్ను ప్రేమించితిని. నీ ప్రాణముల మూడుసారులు కాపాడితిని. నన్ను
వివాహమాడి ఇచ్చటనే సుఖముగ నుండుమని బలాత్కరించెను. అప్పుడు కచుడు నీవు
గురుపుత్రివిగాన నాకు సోదరివగుదువు. ప్రాణముల రక్షంచినందున తల్లితో సమానురాలవు.
కాననేనెట్లు నిన్ను వివాహమాడగలను అని నిరాకరించెను. ఆమెకోపించి నీవిద్య
వ్యర్థముగుగాక! కపటముచే మాతండ్రి వద్ద విద్యాభ్యాసమొనర్చితిని గాన ఈవిద్యను నీవు
విస్మరింతువుగాక. అని శపించెను. అప్పుడు కచుడు నీవు అనవసరముగా నన్నిటుల శపించితివిగాన
నీకిక మీద బ్రాహ్మణుడు భర్తగ లభించడు. బ్రాహ్మణేతరుడే నిన్ను వరించును. ఇదిగాక మీ
తండ్రి శాస్త్రవిరుద్ధముగ పుత్రికా వ్యామోహముతో నీకు మంత్రోపదేశము చేసెను గాన
ఈసంజీవినీ మంత్రమున కిక మీద ఎట్టిప్రభావమును లేకపోవుగాక అని శపించి స్వర్గమునకు
పోయెను. దేవతలందరు కచుని ఉపకారమునకు సంతసించిరి.
కాన ఓసాధ్వీ! స్త్రీలకు
మంత్రోపదేశము కూడదు పతిసేవయే వారలకు పరమధర్మము. గురువులయొక్క ఆజ్ఞననుసరించి
వ్రతముల ఉపవాసముల చేయువచ్చుననిరి. అప్పుడు సావిత్రియను పతివ్రత స్వామీ ఏమి అయిన
వ్రతము నుపదేశింపుడు. మీ పాదస్మరణ పూర్వకముగ మీరుపదేశించిన వ్రతమును శ్రద్ధతో
నాచరించి తరించెదమని ప్రార్థించెను. అప్పుడు గురుమూర్తి సంతసించి మీదంపతులకు
సర్వసౌఖ్యముల నొపగు నట్టియు. స్త్రీలకు స్థిరసౌభాగ్యము ఘట్పిజేయునట్టియు ఒక వ్రతము
చెప్పెద వినుమని ఇట్లు చెప్పిరి.
పూర్వము ఋషులీవిషయమునే
సూతుని ప్రశ్నింప సూత మహర్షి ఋషుల కేమి చెప్పెనో దానినే మీకు చెప్పుచున్నాను.
స్త్రీలు గాని, పురుషులుగాని, నిర్వికల్పుడు, నిరామయుడు ఆయిన ఈశ్వరుని ఆరాధించుచో సర్వాభీష్టముల
నొందగలరు. విరక్తులుగాని, విషయాసక్తులుగాని
ఎవ్వరయిన భక్తితో పూజించుచో ఈశ్వరుడు వారిపట్ల ప్రసన్నడగును. సంసార సముద్రమును
అనాయాసముగ తరించగోరువారు సోమవార వ్రతముచే శివుని ఆరాధించి సంతోషపెట్టవలయును.
ఈశ్వరారాధనమువలన సర్వాభీష్టములు సిద్ధించును. ఈశ్వరారాధనారూపమైన సోమవారవ్రతము
వ్రతములలోకెల్ల నుత్తమమైనది. సోమవారవ్రత మాచరించువారు ఉపవాసముండిగాని
నక్తభోజనమొనర్చికాని శివుని ఆరాధించవలయును. బ్రహ్మచారులు, గృహస్థులు,
స్త్రీలు,కుమారికలు, భర్తృహీనలైన
విధవలు గూడ నీవ్రతము నాచరింపనర్హులు. ఈవ్రత ప్రభావము తెలియగలందులకుగాను
స్కాందపురాణమందలి ఒక ఇతిహాసమును చెప్పెద వినుము.
పూర్వము చిత్రవర్మయను
రాజు ఆర్యావర్తమును పాలించుచుండెను. అతడు పుణ్యాత్ముడు, ధార్మికుడు, శూరుడు, ఇట్టి రాజు
అఖండైశ్వర్యములతో తులతూగుచు చాలకాలము సంతానము లేక శివుని పూజించి అతని అనుగ్రహమున
ఒక కుమార్తెను పొందెను. రాజు కుమార్తెయొక్క సౌందర్యాతిశయమునకు సంతసించి
జ్యోతిష్కులపిలిచి కుమార్తెయొక్క జన్మలగ్నము పరీక్షించి జాతకము చెప్పుడని వారల
ప్రార్థించ వారిట్లు చెప్పిరి.
ఈబాలిక పార్వతివలె
సర్వమంగళరూపముతో దమయంతిని బోలియిండును. కీర్తిలో భాగీరథికి సరి. గుణములలో
లక్ష్మితో సమురాలు. సీతలో పాతివ్రత్యమున తులతూగను. ఈమె భర్తతో కలసి పదివేల
సంవత్సరములు భూమిని పరిపాలించును అని చెప్పిరి.
రాజు సంతపించి జాతకము చెప్పినవారల యధేచ్ఛగ ధనముచే సత్కరించెను. తన
కుమార్తెకు సీమంతినియని నామకరణమొనర్చి సుఖముగనుండ ఒక దినమున ఒక బ్రాహ్మణుడు రాజ
సభకు వచ్చి సీమంతిని జాతకము చూచి నిర్భయముగ ఓరాజా నీకుమార్తె సర్వ
సులక్షణములుగలదైనను పదునాల్గవ సంవత్సరమున వైధవ్యము రాగలదు. అని చెప్పిపోయెను.
రాజు ఆమాటలువిని మూర్చనొంది లేచి దుఃఖించి సర్వము ఈశ్వరాధీనము నేవేవిచేయుదునని
తలచుచుండెను.
ఇట్లుండ సీమంతినికి ఏడు సంవత్సరములు రాగా రాజు ఇటుల చింతింప
సాగెను. బ్రాహ్మణుడు ఈమెకు పదునాల్గు సంవత్సరములకు వైధవ్యము
వచ్చునని చెప్పెను. నేనీ బాలికకు
వివాహమెట్లు చేసెదనని భార్యతో కూడ విచారనిమగ్నుడగుచుండెను. సీమంతని ఒక దినమున చెలికత్తెలతో కలసి
ఉద్యానవనమున విహరించుచు చెలికత్తెల ద్వారా తనకు పదునాల్గవ సంవత్సరమున వైధవ్యము
వచ్చునని తెలిసికొని అల్పాయుష్కురాలయ్యును కడు దుఃఖించుచుండెను. ఒకనాడు దైవ వశమున యాజ్ఞవల్క్యుని భార్య
మైత్రేయి యను సతీరత్నము తనభవనమునకు రాగా సీమంతిని ఆమె పాదములకు నమస్కరించి ఆమెతో
తల్లీ! నన్నుద్ధరింపుము. నాకు స్థిర
సౌభాగ్యము లభించెడి ఉపాయమేమి అయిననున్న ఉపదేశించుమని దీనురాలై ప్రార్ధించ ఆ
బ్రహ్మవాదిని యగు మైత్రేయి సీమంతినితో అమ్మా! నీవు సోముని సేవించుము. శివుని అనుగ్రహముచే స్థిర సౌభాగ్యము నీకు
సిద్ధించును అన ఆ బాలిక తల్లీ! ఆ వ్రతమేమిటో ఎట్లొనర్చవలయునో ఆనతిమ్మని ప్రార్ధించ
మైత్రేయి సీమంతినితో ఇట్లు చెప్పుచున్నది.
నీవు సోమవార వ్రతము ఆచరింపుము. మనస్సు స్థిరము చేసికొని సోమవారము ప్రాతఃకాలము
స్నానము చేసి ఉపవాస విధిగ గౌరీ హరుని భక్తితో నారాధించుము. శివపూజయొక్క మహిమ చెప్పెద వినుము. అభిషేకముచే పాపములు నశించును. పీఠ పూజచే సామ్రాజ్యము లభించును. గంధాక్షత పుష్పాదులచే పూజించిన సౌభాగ్యము, సౌఖ్యము లభించును.
ధూపముచే సౌందర్యము, దీపముచే కాంతియు, నైవేద్యముచే భోగములు, తాంబూలార్పణచే లక్ష్మియు, నమస్కార మాత్రమున చతుర్విధ పురుషార్ధ సిద్ధియు, మంత్ర జపమున అష్టైశ్వర్య ప్రాప్తియు, హోమముచే కోశ సమృద్ధియు, స్తోత్రమొనర్చుటచే సర్వ సమృద్ధియు, బ్రాహ్మణ భోజనముచే సర్వదేవతా తృప్తియు కలుగగలదు. ఓ కన్యకా! నీవు ఈ విధముగ సోమవార వ్రతము
ఆచరించుము. నీ క్లేశములు తొలగును. దురితము నశించును. భయము సంభవించినను హరుడు రక్షించి
కాపాడును. గౌరీహరుల పూజచే సర్వపాపములు
క్షయించును. అని మైత్రేయి చెప్పి
వెడలెను. అప్పటి నుండియు సీమంతిని
శ్రద్ధతో సోమవార వ్రతము ఆచరించి చేయుచుండ తండ్రియు చూచి సంతసించెను.
సీమంతిని తండ్రి అయిన
చిత్రవర్మయు దైవము మీద భారము ఉంచి యుక్తవయస్సున తన కుమార్తెకు
వివాహమొనర్చుట ధర్మమని తలచి మంత్రుల ద్వారా విచారించి నలుని వంశమందు జన్మించిన
ఇంద్రసేన మహారాజు పుత్రుడయిన చంద్రాంగవర్మకిచ్చి గొప్ప వైభవముతో తన కుమార్తెకు
వివాహము జరిపెను. వివాహమునకు వచ్చిన రాజుల
గౌరవించెను. బ్రాహ్మణుల సత్కరించెను. అల్లుడయిన చంద్రాంగదునకు పారిబర్హముగ ననేక
రత్నములు, దాసదాసీజనముల
కూడనొసగెను. వివాహమున కేతెంచిన వారందరు
రాజుచే సత్కరింపబడి వెళ్ళిరి.
చిత్రవర్మ కుమార్తెయందలి వ్యామోహముతో తన అల్లుడయిన
చంద్రాంగదుని తన ఇంటనే ఉంచుకొనెను.
ఇట్లుండ సీమంతనికి పదునాల్గు
సంవత్సరములు పూర్తికాగా నొకరోజున చంద్రాంగదునకు యమునా నదియందు జలక్రీడచేయ
కోరిక కలిగెను. కొంత పరివారముతో నతడు
నదికేగి ఒక పడవ నెక్కి జలక్రీడనొనర్చుచుండెను.
పరివారము నదికి ఉభయ తటముల నిలుబడి ఉండిరి.
అదే సమయమునకు ప్రవాహము మధ్యమున ఆ
పడవ మునిగెను. జనులు
హాహాకారమొనర్చిరి. నావికులు నదిలో దూకి
ఎంతయో శోధించిరి కానీ చంద్రాంగదుని శరీరము కనబడలేదు. వెంటనే కొంతమంది చిత్రవర్మని సమీపించి మీ
అల్లుడు చంద్రాంగదుడు యమునానదిలో మునిగి పోయెను.
ఎంత వెదికినను కనబడలేదు అని చెప్పిరి.
ఆ మాటలు విని రాజు మూర్ఛిల్లెను.
సీమంతిని ప్రాణములు విడువ నుద్యుక్తురాలయ్యెను. అందరు యమునా నదికి వచ్చిరి. ఎంత శోధించిననూ వారలకు శవమయినను గోచరము కాలేదు. అప్పుడు సీమంతిని ఇటుల దుఃఖింపసాగెను.
దేవా!
త్రిపురాంతకా! శరణు వేడిన నన్ను రక్షించవైతివి. నేనొనర్చిన వ్రతమిట్లు నిష్ఫలమయ్యెను. నన్నుపేక్షించుట ధర్మమా! ఇట్లొనర్చుట నీకపకీర్తి కాదా! నాకు పదునాల్గు
సంవత్సరములకు వైధవ్యము వచ్చునను భీతితో మైత్రేయిని ప్రార్ధించ ఆమె సోమవార
వ్రతమాచరించుము. నీకు సౌభాగ్యము
వర్ధిల్లునని చెప్ప నేనట్లొనర్చితిని.
శంకరా ఇక నాగతి ఏమి? అని దుఃఖించుచుండ
మంత్రులు పురోహితులు ఆమెకెంతయో బోధించిరి.
ఇంతలో ఈ వృత్తాంతము తెలిసి చంద్రాంగదుని తండ్రియగు ఇంద్రసేన మహారాజు
భార్యతో కూడ శోక సాగరమున మునిగి అచ్చటకు వచ్చెను.
అందరును హాహాకారములు చేయుచు శిరములు, వక్షస్థలములు బాదుకొనుచు దుఃఖింపసాగిరి. సీమంతిని హా ప్రాణనాధా! ఎటకేగితివని దుఃఖించుచు
నేను జీవించి ఏమి ప్రయోజనము.
సహగమనమొనర్చెదనన అచ్చటి విద్వాంసులు శవము కనబడనిది సహగమనమెట్లు చేయనగును?
అతను
జీవించెనో మరణించెనో మనమెట్లు నిర్ణయించ గలము అని చెప్పిరి. విధి లిఖితము తప్పింపరాదు. కాన మీరు దుఃఖించక మీ గృహములకు పొండు అని
చెప్పిరి. ఇంద్రసేనుడు పుత్ర దుఃఖముతో
కృశించుచు రాజ్యమునందు దృష్టి ఉంచక ఉండుటచే దాయాదులతనిని భార్యా సమేతముగా
కారాగారమున ఉంచి రాజ్యమపహరించిరి.
ప్రాణములు త్యజించ ఉద్యుక్తురాలగు సీమంతినితో తండ్రి అమ్మా! నాకు నీవు తప్ప
వేరే సంతానము లేదు. లోకులు నిందించినా
నిందింతురు గాక. నీవు ఒక సంవత్సరము
వైధవ్యాచరణ మొనర్చుచు ఉండుము. అని
బ్రతిమిలాడికొనెను. ఆమెయు తండ్రి మాటలు
విని శోకార్తురాలయ్యును సోమవార వ్రతమును
మాత్రము యథాపూర్వకముగ ఆచరించుచుండెను.
ఇక నారాజకుమారుడు యమునా నదిలో నిమగ్నుడు కాగా దైవవశమున
నచ్చట నాగకన్యకలు విహరించు చుండిరి. వారు
ప్రవాహమున కొట్టుకొని పోవుచున్న రాజకుమారుని చూచి అతని సౌందర్యమున కాశ్చర్యము
చెంది అతనిని నాగలోకమునకు కొనిపోయి అమృతమును ప్రోక్షించి జీవింపచేసి నాగలోకమునకు
రాజైన వాసుకి ఎదుటకు తీసికొని వెళ్ళిరి.
అప్పుడు చంద్రాంగదుడు రత్న ఖచితములయిన గోపురములతోడను, సువర్ణ భవనములచేతను, చంక్రాంతుల వలె ప్రకాశించెడి పాతాళ లోక రచనను చూచి
అత్యాశ్చర్యపడెను. వాసుకి యొక్కసభయందు సభ్యులందరును సర్పములే. మధ్య పీఠమున సూర్య కాంతితో సమముగ ప్రకాశించుచు
పచ్చని వస్త్రము ధరించి అనేక ఫణములతో వాసుకి కూర్చుని ఉండెను. నవ యవ్వనముతో సర్వాభరణ భూషితులగు నాగకన్యకలు
సర్పరాజును సేవించుచుండిరి. అట్టి
నాగరాజును ఈ రాజకుమారుడు చూచి సాష్టాంగముగ
నమస్కరించెను. వాసుకియు
నాగకన్యకలను శుభలక్షణములుగల ఈ కుమారుడెవ్వడు? మీకెచ్చట లభించెను? అని ప్రశ్నించ వారు ప్రభో ఇతనెవరో మాకు తెలియదు. మేము యమునానదిలో విహరించుచుండగా
మాకతనుగోచరించెను. మీవద్దకు తెచ్చితిమి
అనిరి. అప్పుడు వాసుకియే ఆ రాజకుమారునితో
నీ పేరేమి? మీ దేశమేమి? ఇచ్చటకు వచ్చుటకు కారణమేమి? అని ప్రశ్నించ చంద్రాంగదుడిట్లు చెప్పుచుండెను.
భూలోకమున నిషధ దేశమున నలుడను పుణ్యశ్లోకుడుండెను. అతని వంశమున ఇంద్రసేనుడను రాజునకు నేను
జన్మించితిని. నేను మామామగారింట నుండ
దైవవశమున జలక్రీడయొనర్చుచు యమునా జలమున మునిగితిని. ప్రవాహమున కొట్టుకొని పోవుచుండ నన్ను
నాగకన్యకలు ఇచ్చటకు తెచ్చిరి. మీ దర్శనముచే నాజన్మ సఫలమయ్యెను. కృతార్ధుడనైతిని. పూర్వార్జిత పుణ్యముచే తిరిగి జీవించు భాగ్యము
నాకు కలిగెను అని వినయముతో చెప్పెను. ఆ
మాటలు విని నాగరాజు సంతసించి పుత్రా భయపడకుము అని ధైర్యము చెప్పి మీరు భూలోకమున
ఏదేవుని ఆరాధింతురో చెప్పమనియన చంద్రాంగదుడిట్లు
హర్షనిర్భరమానసుడై చెప్పుచుండెను.
మాకు దేవుడు శంకరుడు. అట్టి సదాశివుడు
దేవాధిదేవుడు. శివుని వామాంగమున గౌరి ప్రకాశించుచుండును. ఏదేవుడు తన రజోగుణముచే
బ్రహ్మను సృజించి అతని ద్వారా జగమును సృజింపజేయుచున్నాడో అట్టి సదాశివుల మేము
పూజింతుము. ఏదేవుడు తన సత్వగుణముచే విష్ణువును నిర్మించి జగమును పాలించుచుండెనో
అట్టి శివుని మేమారాధింతుము. ఏదేవుడు తన
తమోగుణముచే ఏకాదశరుద్రాల నిర్మించి ప్రళయకాలమున జగముల సంహరింపజేయునో. ఎవడు
పంచభూతాత్మకుడో, సర్వవ్యాపకుడో
చిన్మయుడో, నిరంజనుడో, మనోవాక్కులకుగూడగోచరముకాడో, ఎవడు తక్షకశేషుల కుండలములుగ ధరించునో, వ్యాఘ్రచర్మము ధరించి త్రినేత్రుడయి చంద్రుని
శిరోభూషణముగ ధరించునో అట్టి మహేశ్వరుని మేము పూజింతుము. అని చెప్ప అతని వాక్యములకు
నాగరాజు కడు సంతసించి ఆరాజకుమారుని ఆలింగన మొనర్చి అతనితో రాజకుమారా!
నీవిచ్చటనేయుండి ఈపాతళలోకాధిపత్య మొనర్చుము. ఈపాతళము కల్పవృక్షములతోడను, అమృతముతో నిండిన వాపీకూపతటాకాదులతోడను
శోభిల్లుచుండును. ఇచ్చట నుండువారికి స్వప్నావస్థయందేని రోగభయముగాని, మృత్యుభయముగాని లదు, కాన సుఖముగ నీవిచ్చటనే ఉండుమని ప్రార్థింప ఆరాజకుమారుడు
ఆనీగరాజుతో ఓనాగరాజా! నాతండ్రికి నేనొక్కడనే పుత్రుడను నాకు నూతనముగ వివాహమయ్యెను.
ఆమెయు పదునాలుగు సంవత్సరముల వయస్సుకలది అయినను శివుని నిత్యమారాధించుచుండును. నేను
యమునానదిలో మరిణించితినని తలచి వారెట్లుండిరో మీపాదకమలముల దర్శించితిని.
నాప్రాణముల రక్షించితిరి. నాస్వకీయుల జూడవలయునని నామనము తహతహలాడుచున్నది. అని
చెప్ప వాసుకియు సంతసించి అనేక భూషణములను, వస్త్రములను, రత్నములను, కల్పవృక్షఫలములను, భార్యకుగాను కొంత అమృతమును ఇచ్చి ఒక నాగకుమారుని సహాయునిగ
నిచ్చి, మనోవేగము గల ఒక
అశ్వమునధిష్టింపజేసి అతనిని సాగనంపుచు అతనితో నీకవసరమైనపుడు నన్ను స్మరించుము.
నీకార్యము సఫలముచేసెదనని చెప్పి పంపివేసెను.
రాజకుమారుడు అశ్వము
నధిష్టించి నాగపుత్రునితో సహ క్షణకాలమున యమునానదీతీరమునకు తానెచ్చటమునిగెనో
అచ్చటకే వచ్చెను. ఆరోజు సోమవారమయినందున సీమంతినియు చెలికత్తెలతో కలసి
నదీస్నానమొనర్చుటకుగాను అచ్చటకే దైవవశమున వచ్చి, ప్రవాహము నుండి వచ్చుచున్న రాజకుమారుని చూచి
చెలికత్తెతో సఖీ ఒకనాగపుత్రునితో కలసి ఎవ్వరో మనోహరమయిన రూపముతో అశ్వము నదిష్టించి
వచ్చుచున్నారు. ఎవరయిన రాక్షసుడు మనుష్యరూపమున వచ్చుచుండెనా! ఇతని రూపము చూడ
పూర్వమెప్పుడో చూచిన జ్ఞాపకము కలుగుచున్నది. నాభర్తవలెనున్నాడు. ఇదేమియని భయపడుచు
అట్లేనిర్విణ్ణురాలయి చూచుచుండెను. రాజపుత్రుడును నదీతీరమునకు వచ్చి దూరముగనున్న
సీమంతినిని చూచి ఈమె ఎవ్వరయి యుండవచ్చును. ముఖముచూచిన నాప్రియురాలు జ్ఞప్తికి
వచ్చుచున్నది. కంఠసూత్రముగాని ముక్తాహారములుగాని కుంకుమ మొదలగు శుభలక్షణములుగాని
కననపడవయ్యె. ఈమె ఎవ్వరయి యుండవచ్చు అని విచారించుచు అశ్వమునుండి దిగి ఆసీమంతినిని
దగ్గరకు పిలిచి నీవెవ్వరవు? నీభర్త ఎచ్చట? ఇంతబాల్యమున నీముఖమున శోకలక్షణములు కనబడుచున్నవి
నీవృత్తాంతము చెప్పుమని ప్రశ్నించ ఆమె సిగ్గుపడుచు తన చెలికత్తెకు సూచించ ఆమె
ఇట్లు చెప్పుచుండెను.
ఈమె పేరు సీమంతిని
అందురు. చిత్రవర్మయొక్క కుమార్తె, చంద్రాంగదుని భర్య. కొంతకాలము క్రింద దైవవశమున ఈమె
భర్త జలక్రీడకుగాను వచ్చి యమునానదితో మునిగిపోయెను. వైధవ్యముతో దుఃఖితురాలయ్యు, ఈదినము సోమవారమగుటచే ఈమె స్నానార్థమిచటకేతెంచెను. ఈమె యొక్క
అత్తమామలు పుత్రదుఃఖముతో దుఃఖించుచుండ దాయాదులు వారిరాజ్యమపహరించి వారిని
కారాగారము నందుంచిరి. ఇట్టి కష్టములు సంప్రాప్తమయినను ఈమె సోమవారమున శూలపాణిని
ఆరాధించుట మానలేదు అని ఇట్లు చెప్పుచుండ
సీమంతిని స్వయముగ అతనితో మీరెవ్వరు? మమ్ముల ప్రశ్నించులకు కారణమేమి? గంధర్వులా! సిద్ధులా! కిన్నరులా! మనుష్య రూపముతో
కనపడుచున్నారు. మీరు స్నేహభావముతో నన్నిట్లు ప్రశ్నించుచున్నారు. మీపేరేమి? అని పలుకుచు తన భర్త స్మృతికి వచ్చినందున దుఃఖము నాపజాలక అట్లే
భూమిమీదపడి మూర్ఛిల్లెను. ఆదృశ్యము చూచి రాజకుమారుడు చకితుడై నేత్రముల వెంబడి
అశ్రువుల ప్రక్షాళనమొనర్చుకొని ఆమెను సమీపించి చేయిపట్టుకొని దుఃఖించకుము నాపేరు
సిద్ధుడందురు. నీభర్త సుఖముగనే ఉన్నాడు. నేను చూచితిని. నీవ్రత పుణ్యప్రభావమువలన మూడుదినములకు నీవద్దకు
రాగలడు. అతడు నాప్రాణస్నేహితుడు. ఈవిషయమున సంశయింపకుము. శివునిమీద శపథముచేసి
చెప్పుచున్నాను. అని రహస్యముగ ఆమెతో పలికి ఈవిషయమతి రహస్యముగాన నెవ్వరకు బహిర్గతము
చేయవలదని చెప్పి అశ్వము నధిష్ఠించి నాగపుత్రునితో కూడ తన రాజ్యమునకు పోయెను.
సీమంతిని నేత్రములనుండి
కన్నీరు కార్చుచు తన భర్త రూపమునే స్మరించుచు, ఆవచ్చిన యువకుడు తన భర్తయేయని పోలికను బట్టి సంశయించుచు, నాకంత అదృష్టమా! మరణించివవారు జీవించి వచ్చుట
ఎచ్చటనైన గలదా! ఎవరయిన ధూర్తుడు ఇటుల కపటవేషము ధరించియుండునా! లేక మైత్రేయి చెప్పిన వ్రతమును నేను నియమముతో
నాచరించుటచే గిరిజానాథుడు ప్రసన్నుడయ్యెనా! శివుడు ప్రసన్నుడయినచో
దుఃఖమెట్లుండగలదు! దుర్లభమెద్దియులేదు. అని చింతించుచు చెలికత్తెతో కలసి తన గృహమునకు సీమంతిని వెడలెను.
రాజకుమారుడు తన నగరమును సమీపించి నాగపుత్రుని శత్రురాజుల
వద్దకు వెళ్ళి మీరు చంద్రాంగదుడు మరణించెనని భావించి అతని రాజ్యమపహరించి
వృద్ధులయిన అతని తల్లితండ్రుల బంధించిరి.
అతను పాతాళమునకు వెళ్ళి సర్పరాజుతో స్నేహమొనర్చి నాగబలమును వెంటనిడుకొని వచ్చుచున్నాడు. మీకు ప్రాణములమీద తీపి ఉండెనేని వారల బంధ
విముక్తుల చేసి వారి రాజ్యము వారి కొసగి అతనిని శరణునొందుడు. లేనిచో మిమ్ములనతడు సర్వనాశనము చేయగలడు అని
చెప్పి పంపెను. వారు ఆసందేశము విని భయపడి
తాము చేసిన దుష్కృత్యమునకు వగచి అతని నిందకు భయపడి వృద్ధులయిన రాజదంపతుల కారాగారవిముక్తుల
చేసి వస్త్రభూషణాదులతో నలంకరింపచేసి సింహాసనమున కూర్చుండబెట్టి పాదములకు
నమస్కరించి మా అపరాధముల మన్నించి మాప్రాణ రక్షణ చేయుడని వేడుకొనిరి.
నాగపుత్రుడు ఇంద్రసేన మహారాజుతో మీ కుమారుడు
పాతాళలోకమునుండి క్షేమముగా వచ్చి ఉన్నాడని చెప్ప అట్టి అమృత తుల్యమగు వాక్యము విని
హర్షోద్రేకముతో మంత్రులను పిలపించి నగరమును అలంకరింప చేసి పరివార సమేతులయి భార్యతో
కలసి కుమారుని చూడ నగర బాహ్యమునకు వచ్చెను.
ప్రజలందరు ఆనందభరితులయిరి.
వాయిద్యములు మ్రోగెను. జయజయ
ధ్వానములు చెలరేగెను. చంద్రాంగదుడు
తండ్రినెదుర్కొని ప్రేమతో నమస్కరించెను.
తండ్రియును కుమారుని ఆలింగనమొనర్చి ఆనందాశ్రువులతో తడుపుచు కుమారా!
నీవియోగముచే నేను శవమునయితిని. పోయిన
ప్రాణము వచ్చినటుల తిరిగి నేను నిన్ను చూడగలిగితిని. చిరంజీవివికమ్మని దీవించెను. అప్పుడు చంద్రాంగదుడు తల్లిని
ఆలింగనమొనర్చుకొని అమ్మా! నేను పుత్రుడనుగాను.
నీకుశత్రువును. నేను పాతాళమున సుఖముగనే ఉంటిని. మీకా దుఃఖము కలిగించితిని. తల్లి హృదయము నవనీతమువలె మృదువుగా ఉండును. ఎవడు కఠిన హృదయుడై తల్లి దుఃఖమునున గుర్తించడో వాడు మలముతో సమముగా
చెప్పబడును. అట్టివానిని మానవుడనుట
చెల్లదు. తల్లికి దుఃఖము కలిగించు మూర్ఖుడు ఏడు జన్మములు సంతాన వర్జితుడయి
దారిద్య్రముతో బాధనొందును. తల్లి ఋణము తీర్చుకొనుట ఎవరికిని శక్యము కాదు. తల్లి యన సాక్షాత్తు భవాని అని శాస్త్రములు
చెప్పినవి. కాన తల్లికి మించిన
దైవములేదు. అని ఇట్లు తల్లిని
ఓదార్చెను. మహోత్సవముతో ఇంద్రసేన మహారాజు
తన కుమారుని నగరమున ప్రవేశింపచేసి రాజభవనమునకు కొనిపోయెను. వెంట వచ్చిన నాగకుమారుని వస్త్రభూషణములచే
సత్కరించి అతని లోకమునకు పంపిరి.
అప్పుడు ఇంద్రసేన మహారాజు చిత్రవర్మ మహారాజు వద్దకు దూతల
ద్వారా మీ కుమార్తె వ్రత ప్రభావమున నాకుమారుడు జీవించి వచ్చెను అను వార్తను తెలియ
చేసెను. దూతల ద్వారా చిత్రవర్మ తన అల్లుడు సుఖముగ వచ్చుట తెలుసుకొని
శుభవార్తను చెప్పిన దూతను వస్త్రభూషణములచే అలంకరించి ఇంద్రసేన మహారాజును సకుటుంబముగ రప్పించి
మహోత్సవముతో సీమంతినిని వారికప్పగించెను.
చంద్రాంగదుడు తాను పాతాళమునుంచి తెచ్చిన రత్నములను, కల్పవృక్ష ఫలములను
భార్యకొసగెను. మహోత్సవముతో
చంద్రాంగదుడు భార్యతో తన పురమునకు విచ్చేసెను.
సోమవార వ్రత ప్రభావము వలన ఆ దంపతులు పది వేల సంవత్సరములు
సుఖముగ రాజ్యపాలననొనర్చిరి. గౌరీహరుల నర్చించుటచే సీమంతిని అట్టి
ఫలమునొందెను. కాన ఓ సువాసీనీ! నేనునీ యందలి ప్రేమతో ఇట్టి వ్రతమునుపదేశించితిని. దీనినాచరింపుము. నీకు సంతానము సౌభాగ్యము అంఖండితమయిన లక్ష్మియు
కలుగునని ఆశీర్వదించిరి.
అప్పుడు దంపతులు గురునాథుని ఆజ్ఞ గైకొని తమగ్రామమునకు
పోవుటకు సిద్ధమగుచుండ వారి తల్లితండ్రులు పుత్ర దర్శన లాలసులై అచ్చటకు వచ్చి
జరిగిన విషయము విని ఆనందభరితులయి గురుమూర్తిని పూజించి మహోత్సవమొనర్చి అఖండ బ్రాహ్మణసమారాధనము గావించి గురుమూర్తి
ఆజ్ఞ గైకొని ఆదంపతులతో సహ తమ గ్రామమునకు వెళ్ళిరి. గురుమూర్తి అనుగ్రహము వలన అ దంపతులు అష్ట పుత్ర
బహుధనముతో సుఖముగ జీవించుచు ప్రతి సంవత్సరము గురుమూర్తిని గాణగాపురమున దర్శించి
వెళ్ళుచుండిరి. ఇట్లు సమస్త సుఖముల వారు
గురు కృపచేనొందిరి.
కాన ఓ నామధారకా! ఎవరైతే శ్రద్ధాభక్తులతో గురువునారాధింతురో
వారిపట్ల గురుమూర్తి ప్రసన్నుడగుననుటలో సంశయమేమియు లేదు. చక్కెర వలె అతి మధురమయిన ఇట్టి గురుచరితము నీకు
చెప్పితి. చేతి కంకణము చూచుటకు అద్దము
కావలయునా! ప్రత్యక్షముగ అనుభవగోచరమయిన
సద్గురుమూర్తి యొక్క కీర్తిని విశేషించి చెప్పనవరముండదు. ఓ శ్రోతలారా! మీకు హితము చెప్పెద వినుడు.
గురునాథుని భజించుడు. సర్వార్ధ
సిద్ధినొందుడు. ఈ గురుచరితమను చలివేంద్రము
నిర్మింప బడినది. సర్వ సులభము. ఇందలి కధామృతమును యథేష్టముగ పానమొనర్చి ధన్యులు
కండు.
ఇది గురుచరితమున ముప్పది అయిదవ అధ్యాయము సమాప్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి