శ్రీ గురు చరితము
ముప్పది ఆరవ అధ్యాయము
శ్రీగణేశాయ నమః శ్రీదత్తాత్రేయాయ నమః
నామధారకా! జ్ఞానప్రదమగు గురుచరితమును చెప్పుచున్నాను
వినుము. గంధర్వపురమున జరిగిన గురుమాహాత్మ్యమును అంతయు చెప్ప సమర్థుడగాను. అందలి
సారమును మాత్రమే చెప్పెద. ఆ నగరమున నొక
వైదికబ్రాహ్మణుడు కలడు. అతడు విద్వాంసుడు.నిరక్తుడు. కర్మమార్గనిష్ఠుడు, ప్రతిగ్రహమొనర్చడు. పరాన్నము భుజించడు. యాయవార
వృత్తితో జీవనము జరుపుచుండును. అతిథుల పూజించుచుండును. అతనికొక భార్యగలదు. భర్త అట్లుండుట కామె
కిష్టములేక ఎల్లప్పుడు ముఖము మాడ్చుకొని కోపస్వభావముగానుండును. ఆగ్రామమున కెందరో భక్తులు
వచ్చి మిష్టాన్నములతో బ్రాహ్మణులకు సమారాధనలు చేసి దక్షిణలిచ్చుచుందురు. అప్పుడు
ఆఊరివారందరు సమారాధనలకు వెళ్ళి అచ్చటి పక్వాన్నములను ప్రశంసించుచుండ ఆ బ్రాహ్మణుని
భార్య ఆమాటలు విని ఇట్లు విలపించసాగెను.
అయ్యో! దైవమా! నేనంత దురదృష్టవంతురాలను. దరిద్రుడైన ఇట్టి
భర్తను పెండ్లాడినందున స్వప్నమందైన మిష్టాన్నము భుజించి ఎఱుగ. కష్టములు మాత్రమే అనుభవించుచున్నాను. నా పూర్వార్జితమును బట్టి ఇట్టి హీనుని భర్తగా
పొంది దారిద్య్రము నిత్యమనుభవించుచుంటిని.
గ్రామములోని స్త్రీలు పురుషులందరు నిత్యము సమారాధనమునకు వెళ్ళి తృప్తిగ
మిష్టాన్నముల గుడుచుచున్నారు. వారు
పూర్వమెంత సుకృతమొనర్చిరో! ఎవరైన వచ్చి పిలిచినను నా భర్త సమారాధనకు పోడు
కదా! దైవమా! నేనేమి చేతునని
విలపించుచుండెను.
ఇట్లుండ గాణగాపురమున ఒక ధనికుడగు బ్రాహ్మణుడు వచ్చి
బ్రాహ్మణుల దంపతీ సమేతముగ సమారాధన చేయదలచి ఈ వైదిక బ్రాహ్మణునికూడ భార్యాసమేతముగ
భోజనమునకు రమ్మని ఆహ్వానించెను. అప్పుడతని
భార్య, భర్తను సమీపించి మీరు
ఆమంత్రణము నంగీకరించుడు. నాకు అందరితోపాటు
మిష్టాన్నము తిన వేడుక కలదు. మంచి
దక్షిణయు నూతన వస్త్రములుగూడ మనకు లభించగలవు.
మీకు పూర్తిగ ఇష్టము లేకున్న మీ ఆజ్ఞ అయినచో నేనైన పోయెదననెను. ఆ బ్రాహ్మణుడు భార్యతో నేను పరాన్నము
భుజించను. నీకంతగ కోరిక ఉన్నచో
వెళ్ళుమనెను. అప్పుడామె సంతర్పణ చేయు బ్రాహ్మణుని
సమీపించి నా భర్త రాడు, కానీ నేను మాత్రము మీ
సమారాధనమునకు వచ్చెదనన అతడు నేను దంపతులను పూజించి సమారాధన చేయు సంకల్పము చేసితిని
కాన నీ భర్త రానిచో నీకు సమారాధనమున స్థానము లేదు. వచ్చిన త్రోవ వెళ్ళుమనెను. ఆ మాటలకామె కడు వగచి నారాయణా ఏమి
ప్రారబ్ధము. నేనేమి చేయుదును. ఎంత దైవ హీనురాలను. ఇట్టి భర్తను చేసికొనుట వలన స్వప్నమందైన
రుచికరమైన అన్నమెరుగనైతిని అని చింతించుచు శ్రీ నరసింహ సరస్వతీ స్వామి
వారికడకేగి నమస్కరించి వారితో ఇట్లు చెప్ప తొడగెను.
స్వామీ నాభర్త నామాట వినడు. ఈ గ్రామమున గొప్ప సమారాధన జరుగనున్నది. దంపతులకు వస్త్ర దక్షిణలతో భోజనము
పెట్టెదరట. సమారాధన చేయు వారాహ్వానించినను
నా భర్త అందులకు అంగీకరించుట లేదు. తమరు
నాయందు దయయుంచి నా భర్తను పిలిచి సమారాధనకు వెళ్ళవలసినదని ఆజ్ఞాపించి నా ఆత్మకు
సంతోషము కలిగించుడు అని దీనురాలై ప్రార్ధించెను.
ఆమె వాక్యమునకు స్వామివారు నవ్వుకొని బ్రాహ్మణుని పిలిచి
అతనితో నీవు నా ఆజ్ఞ ప్రకారము బ్రాహ్మణ సమారాధనకు భార్యతో కలసి పొమ్ము. భార్య యొక్క మనోవాసనను పూర్తిచేయుట భర్తకు
ధర్మము. కులస్త్రీయొక్క మనస్సు
కష్టపెట్టరాదు అని చెప్ప ఆ బ్రాహ్మణుడు గురుమూర్తితో ఇట్లనెను. స్వామీ! నాకు పరాన్నము తినకూడదని నియమము
కలదు. కాని గురువాక్యమును వినని వారు రౌరవ
నరకమున బడుదురు గాన మీ ఆజ్ఞననుసరించి అట్లే వెళ్ళెదననెను. భార్యయు ఆనందిచెను. భార్యా భర్తలు సమారాధనమునకు వెళ్ళిరి. యజమాని పితృప్రీతిగ సంకల్పించి దంపతుల పూజించి
కూర్చుండ బెట్టి పక్వాన్నములతో సహ వడ్డించి భుజించమనెను. అందరును భుజించ ప్రారంభించిరి.
ఆబ్రాహ్మణస్త్రీకి మాత్రము. తనతోపాటు పంక్తులయందు కుక్కలు
పందులుగూడ ఏకపంక్తిని భుజించుచున్నటుల గోచరించ ఆమె అసహ్యపడి లేచి అందరితో పెద్దగ
మీరేల శ్వసూకరములతో కలసి వాటి ఉచ్చిష్టముల భుజించుచున్నారు అని ఆక్షేపించి తన
భర్తతోగూడ నట్లేచెప్ప నతడు నిన్ను పెండ్లాడుటచే నాకీగతి పట్టినది అని చెప్పుచు
పంక్తినుండి లేచెను. అప్పుడు భార్యాభర్త లిరువురు గురుమూర్తి వద్దకు వచ్చిరి.
స్వామివారు ఆబ్రాహ్మణితో నీ మనోరధము ఫలించెనా? వ్యర్ధముగ భర్తను పీడించితివి. పరాన్నసుఖము తెలిసినదా? అని అడిగెను. ఆమె
గురుమూర్తి పాదములకు నమస్కరించి స్వామీ! నా అపరాధమును క్షమించుడు. లోభముతో నా భర్తకుగూడ దోషము ఘటింప
చేసితిని. బలాత్కారముగ నా భర్తను
పరాన్నమునకు గొంపోతిననెను.
బ్రాహ్మణుడు గురుమూర్తితో ఈ దుర్మార్గురాలివలన నాకిట్లే
అనేక దోషములు వాటిల్లుచున్నవి. నా నియమము
నేడు భంగమయ్యెను. అని యన గురుమూర్తి
బ్రాహ్మణునితో నీవు భీతిల్లకుము. నేటితో
ఆమె కోరిక పూర్తి అయ్యెను. ఇందుచే
నీకేమియు దోషము వాటిల్లదు. ఇకనుండి ఆమెయు
నీ ఆజ్ఞననుసరించును. అని చెప్పి తిరిగి
ఇట్లు అనుచుండిరి.
దైవ పితృకార్యములందు బ్రాహ్మణుడు లభించక కర్మకు లోప
ప్రసక్తి వచ్చెనేని తప్పక భోజనమునకు వెళ్ళుట బ్రాహ్మణునకు ధర్మము. లేనిచో దోషము వాటిల్లును అని చెప్ప బ్రాహ్మణుడు
వినయానవతుడయి స్వామీ! ఎవరింట భుజించనగునో
ఎవరింట భుజించరాదో ఆవిషయమును పూర్తిగ నాకు సెలవిండని చెప్ప గురుమూర్తి ఇటుల చెప్పు
చుండెను.
బ్రాహ్మణోత్తమా! వినుము.
శిష్యుడు గురు గృహమున సంశయింపక భుజించ వచ్చు. మేనమామ, పిల్లనిచ్చిన మామ, సాధువులు, సోదరులు మొదలగు వారింట
భుజించ వచ్చును. శ్రాద్ధములయందు కర్మలోప
ప్రసక్తి వచ్చిన భుజించి మరునాడు గాయత్రీజపమొనర్చిన శుద్ధుడగును. తల్లితండ్రులచే సేవ చేయించుకొనువాని గృహమున
లోభి గృహమున భుజించరాదు. కళత్రాదుల
పీడించి బయిట ధర్మమొనర్చువారింట కుడువ రాదు.
గర్వి యింటను, శస్త్రముతో జీవించు
వాని యింట, మల్ల యుద్ధము చేయువాని
యింట, బహిష్కృతుని యింట, యాచక వృత్తితో జీవిచువాని యింట, ఇతరులకు మంత్రోపదేశమొనర్చి తద్వారా జీవించు
బ్రాహ్మణుని యింట, క్రోధి యింట, కులస్త్రీని త్యజించినవాని యింట, భర్తను త్యజించిన స్త్రీయింట భుజింపరాదు. స్త్రీజితుని యింట, దొంగతనముచేసి జీవించువాని
యింట, జూదమాడువానియింట, స్నానమొనర్చక భుజించు వానియింట, సంధ్య వార్చని వాని గృహమున, దానము చేయు వానివద్దని అడ్డు చెప్పువారి యింట, శ్రాద్ధములు ఆచరించనివాని యింటను, వడ్డీ వ్యాపారముతో జీవించువానియింట, ద్రవ్యాశతోజపమొనర్చువాని యింటను విశ్వాసఘాతకుని
యింటను, సాధువుల
ద్వేషించువానియింట, గురునిందయొనర్చువాని
యింట, కులదేవతను త్యజించువాని యింట, విధినిషేధములు లేక అన్ని చోట్లను భుజించువాని యింట, పుత్ర హీనుని యింట, కుమార్తెను అల్లుని అవమానపరచువాని యింట, ఆశ్రమ ధర్మముల విడిచి అద్వైతము చెప్పువాని యింట, అనుభవము లేక బాహ్యమునకు అద్వైతము పలుకువాని యింట
భుజింపరాదు. ఇటి స్దలముల పరాన్నము భుజించుటచే ఇంద్రియ వైకల్యము అల్పాయుష్యము
బుద్ధిమాంద్యము ఘటిల్లును పరాన్నము భుజించ వారి పాపము వీరికి వచ్చును. పరాన్నము
భుజించుటవలన వచ్చు పాపము గోభూసువర్ణదానముల స్వీకరించుటవలన వచ్చు పాపముకన్న నధికము.
అమావాస్యనాడు పరాన్నము భుజించుచో మాసమొనర్చిన పుణ్యము నశించును. శూద్రునిచే
నాహూతుడయి బ్రాహ్మణుడు బ్రాహ్మణగృహమునకు భోజనమునకు పోరాదు. సంతానము కలుగు పర్యంతము కుమార్తె యింట
భుజింపరాదు. సూర్య గ్రహణములయందు, సూతకములయందు దానము పట్టరాదు. ఎవరైతే ఆచారమును పాటింతురో వారికి
దైన్యములేదు. దేవతలందరు వారికాధీనులై
ఉందురు. అట్టి వారు సర్వ సుఖముల నుభవింతురు. ప్రస్తుతము కలికాలమున బ్రాహ్మణులు మదాంధులై
స్వాచారధర్మముల త్యజించిరి. కాననే
దరిద్రులయి బాధపడుచున్నారు. అని
గురుమూర్తి చెప్ప బ్రాహ్మణుడు గురుమూర్తితో స్వామీ! మీరు
త్రిమూర్త్యివతారులు. భక్తజనాధారులు. దయయుంచి ఆచార ధర్మముల బోధించుడని ప్రార్ధించ
గురుమూర్తి అతనితో మంచి ప్రశ్న చేసితివి.
పూర్వము నైమిశారణ్యమునకు పరాశర మహర్షి రాగా ఋషులు వారిని సత్కరించి
ఆచారముల ప్రశ్నించిరి. అప్పుడు పరాశరుడు
ఆమహర్షులకేమి చెప్పెనో ఆవిషయమే నీకు నేను చెప్పుచున్నాను. సావధానుడవయి వినుము అని ఈ క్రింద విధముగ
చెప్పుచుండెను. ప్రతివారును
బ్రహ్మముహూర్తమున మెలువ కాంచి వెంటనే గురువును స్మరింపవలయును. అట్లే బ్రహ్మవిష్ణుమహేశ్వరులను, సూర్యాది నవగ్రహములను, సనకాదులను,
నారదతుంబురులను, సిద్ధులను, సాధ్యులను,
పితృదేవతలను, సప్త సముద్రములను, సప్త ద్వీపములను, సప్త ఋషులను, భూదేవిని, గోవును నమస్కరించి ప్రక్కనుండి లేచి
మలమూత్రోత్సర్జనమొనర్చి పాద ప్రక్షాళనము గావించుకొని ఆచమనమాచరించ వలయును. ఇట్లే స్నానమునకు పూర్వము తరువాత అధోవాయువు
విసర్జించినపుడు, భోజనమునకు పూర్వము
తరువాతను, తుమ్ము వచ్చిన తరువాతను
ఆచమనమాచరించవలయును. ఆచమనము కొఱకు ఉదకము
సమీపమున దొరకనప్పుడు కుడిచెవిని కుడిచేతితో స్పృశించవలయును. దక్షిణ కర్ణమున ఉదకదేవతలు ఉందురుకాన ఆచమన ఫలము
వచ్చును. అరుణోదయము వరకు మానసిక
స్నామాచరించి ఇష్టదేవతలను స్మరించ వలయును.
అరుణోదయముకాగా ఉపవీతమును నివీతిగ ధరించి మలమూత్రోత్సర్జనమొనర్చవలయును. నిలబడి మలమూత్రోత్సర్జనమొనర్చువారు
నరకమనుభవింతురు. నిర్‌ఋతి దిక్కుగ వెళ్ళి
వస్త్రముచే శిరమును కప్పుకొని మౌనముగ మలమూత్రోత్సర్జన మొనర్చవలయును. పగలు ఉత్తరముఖముగను, రాత్రులు దక్షిణముఖముగను కూర్చుండవలయును. సూర్యచంద్రుల నక్షత్రముల చూడరాదు. నీరు లభించనపుడు గంగను స్మరించి మట్టి పెళ్ళతో
శౌచమాచరించవలయును. తిరిగి ఉదకము లభించగా
యధావిధిగ శౌచము చేసికొనవలయును. అంతదనుక
నేమియు భుజించరాదు. పుణ్యవృక్షములక్రింద,
దేవాలయ
సమీపమున మలమూత్రముల విసర్జింపరాదు. శుభ్రముగ కడుగుకొన వలెను. రాత్రియందు, సంకటములయందు, మార్గమందు యథాశక్తి శౌచమాచవించవలయును. ఇట్లు శౌచమాచరించుటచే
ధర్మము సిద్ధించును. పైవిధమున శౌచవిధి నాచరించి తరువాత ఉదకము కుడిచేతి లోనికి
ఉద్ధరిణితో తీసికొని కేశవాదినామముల నుచ్చరించుచు ఆచమనము చేయవలయును. ఈవిధానము గురువులవలన
గ్రహించవలయును. స్నానము, వమనము, భోజనము, ఫలహారము, శ్మశానగమనము, ఇతరుల పాదప్రక్షాళనము ఈనిమిత్తములయందు ఆచమన
మాచరించవలయును, ఆచమనము చేయుటచే
ఆయుష్యము, ఆరోగ్యము
వృద్ధినొందును. ముళ్లచెట్లు నారికేళవృక్షము ఖర్జూరము, మొగలి మొదలగు చెట్లకాష్ఠములతో దంతధావనము చేయరాదు. చండ్ర, మేడి, మఱ్ఱి ఉత్తరేణి మొదలగు పుణ్యవృక్షముల పుల్లల తీసికొని దంతధావనమొనర్చి
ఆపుల్లలను నైరృతిదిక్కుగపారవేయవలయును, అనంతరము పన్నెండు పర్యాయములు గండూషము లాచరించవలయును. తరువాత స్నానము
చేయవలయును.
ప్రాతఃస్నానముచే తేజస్సు, బలము,
ఆయుష్యము
వృద్ధిగాంచును. దుఃస్వప్నదోషము నశించును. ప్రజ్ఞ వృద్ధిగాంచును. దరిద్రము, చింతలు,
శోకము
తొలగును. సంకటములందు, రోగము వచ్చినప్పుడు, జలము లభించనపుడు, అశక్తియందు భస్మ స్నానము,
గోధూళి
స్నానము, భౌమస్నానము
ఆచరించవలయును. విష్ణు స్మరణము, గురు దర్శనము, తల్లితండ్రుల పాద తీర్ధమును ప్రోక్షించుకొనుట ఇవి చేయుటచే
స్నానము చేసిన ఫలము సిద్ధించును.
ధృఢగాత్రుడు జలస్నానమే చేయవలయును.
అశక్తులు, గృహస్తులు ఉష్ణోదకముతో
స్నానమాచరింపవచ్చును. ఉష్ణోదకముతో స్నానము
చేయునప్పుడు సంకల్పము, తర్పణము చేయరాదు. ఉష్ణోదకమును, శీతోదకముతో కలిపి
గాయత్రి మొదలగు మంత్రములతోనభిమంత్రించి స్నానమాచరించవలయును. పుత్రోత్పత్తి, సంక్రాంతి,
శ్రార్ధము, వ్రతములు, పర్వకాలములయందు వేడినీటి స్నానము నిషేధము.
నదియందు నదికి (ప్రవాహమునకు) ఎదురుగ స్నానము చేయవలయును. ఇతరత్రా తూర్పుముఖముగ నిలువబడి
స్నానమాచరించవలయును. స్నానమాచరించి
ఆచమనమొనర్చి ధౌత వస్త్రము ధరించ వలయును. మంగళ స్నానము(తలంటు) ఆదివారమున జ్వరప్రదము, సోమవారమున కాంతిహానియు, మంగళవారము మరణమును, బుధవారము ఐశ్వర్యమును, గురువారము ధనహానియు, శుక్రవారము పుత్రహానియు, శనివారము సంపత్తియు ఇచ్చును కాన విచారించి ఆచరించ
వలయును. ముత్తయిదువులగు స్త్రీలు నిత్యము శిరస్నానమాచరించరాదు. అశక్తియందు గంగను స్మరించుకొని ఆర్ద్ర(తడి)
వస్త్రముతో శరీరమును శుభ్రపరచుకొనినచో స్నానఫలము రాగలదు. కాషాయము, రక్తము,
జీర్ణవస్త్రము
వీటిని ధరించి చేయబడు పుణ్యము రాక్షసులకు పోగలదు.
బ్రాహ్మణులకు శ్వేత వస్త్రము శ్రేష్టము. విష్ణు భక్తులగువారు గోపీ చందనముతో
ఊర్ధ్వపుండ్రములను, శివభక్తులగువారు
భస్మముతో త్రిపుండ్రములను ధరించవలయును.
ఆయుష్కాముడు మధ్యవ్రేలితోడను, ముముక్షువు భగవన్నామ స్మరణమొనర్చుచు అనామికతో గానీ, తర్జనితోగానీ, ఊర్ధ్వపుండ్రము ధరించవలయును. ఇట్లు
ఊర్ధ్వపుండ్ర, త్రిపుండ్రముల
ధరించినచో హరిహరులు సంతోషించెదరు.
దర్భలతో పవిత్రము ధరించి పితృ తర్పణముల చేయవలయును. దర్భ లభించనిచో గరిగ మొదలగు తృణములు దర్భకు
ప్రతినిధిగ వాడవచ్చును. దర్భకు మూలమున
రుద్రుడు, మధ్యమున విష్ణువు, అగ్ర భాగమున శివుడు నివసింతురు. కాన దర్భ పాపనాశనము. దానము చేయునపుడు, జపాదులయందు, వేదాధ్యయనము, హోమములయందును, పితృకర్మములయందు, సువర్ణ రజత ముద్రికల ధరించ వచ్చును. బంగారు ఉంగరము దేవ కర్మలయందు, వెండి ఉంగరము పితృకర్మలయందు ప్రశస్తము. బంగారు ఉంగరము అనామిక వేలికి, వెండి ఉంగరము తర్జనియందు ధరించవలయును. యోగపట్టమును ధరించవలయును. నవరత్న ముద్రికనుధరించు వారికి పాపముండదు. యోగపట్టమును ధరించుట, గయా శ్రార్ధము, పాదుకలుఇవి జీవత్పితృనకు నిషిద్ధములు.
సాన్నమొర్చి తిలకము ధరించి సంధ్యావందన మాచరించ వలయును.
ప్రాతఃకాలము నక్షత్రములుండప్రారంభింపబడు సంధ్యఉత్తమమనియు, నక్షత్రములు లోపించిన తదుపరి చేయబడు సంధ్య మధ్య
మమనియు, ప్రొద్దెక్కి చేయబడు
సంధ్య ఆధమమనియు, అట్లే సాయకాలము సూర్య
ప్రకాశముండగ ప్రారంభింపబడు సంధ్య ఉత్తమము సూర్యుడు అస్తమించిన తరువాత ఆచరింపబడు
సంధ్య మధ్యమము నక్షత్రోదయము తదువాత చేయబడునది అధమము. అట్లే మధ్యాహ్న కాలమున
మాధ్యాహ్నికసంధ్యము ఆచరింపవలసియున్నది. శిఖ బంధించి ఆచమన మొనర్చి ప్రాణాయాయము చేసి
ఉదకముతో తన అవయవములను, ప్రోక్షించుకొనవలయును.
అనంతరము మంత్రించిన ఉదకమును పానమొనర్చవలయును. సూర్యనకు అర్ఘ్యమును మూడు పర్యాయములు
ఇవ్వవలయును. నిత్యము మందేహులను రాక్షసులు ముప్పదిమూడుకోట్లమంది సూర్యగమనమును
నిరోధింతురు. మనచే నివ్వబడు అర్ఘ్యము వజ్రాయుధమయి వారల పారద్రోలును. కాన అర్ఘ్యము
సూర్యనకు ప్రతివారు ఇచ్చుట శ్రేయస్కరము. అర్ఘ్యమిచ్చి చేత ఉదకము తీసికొని ఆసూర్యడే
నేను సూర్యుడే పరమాత్మ అని భావించుచు ఆఉదకము తీసికొని తన చుట్టు ప్రదక్షిణముగ
పడునట్లు త్రిప్పవలయును. అనంతరమును గాయత్రీ జపముఆచరించవలయును. కాష్ఠాసనమున
జపించుటచే దుఃఖము యశోహానియు,
ఋణబాధయు, రాతిమీద జపించుటచే వ్యాధియు,కుశాసనమున వశీకరణమును, పాపనాశనము,
రోగనివృత్తియు, భస్మయందు ఆరోగ్యము కంబళమునకు సుఖము, కృష్ణాజినమున జ్ఞానము, వ్యాఘ్రాజినమునన లక్ష్మియు, మోక్షము సిద్ధించును గాన విచారించి తగు ఆసనమున కూర్చొని
మనస్సును ఏకిగ్రపరచి మంత్రజప మాచరించవలయును. మంత్రముజపించువారిని పాపమునుండి
రక్షించును మ యను మనస్సు, త్రయనత్రాణము అని
అర్థము పఠించువారిని రక్షించునది గాన మంత్రమని సార్థకనామ ధేయమయ్యెను. జ అన
జన్మవిచ్ఛేదకము. ప అన పాపనాశనము అని ఇట్లు జపశబ్దార్థము శాస్త్రములచే
నిర్వచ్చిబడెను. గ్రాయత్రీమంత్రము అన్ని వేదములకు మూలము. గాయత్రీ మంత్రజపముచే
వేదపాఠఫలము లబించును. గాయత్రీ జప మొనర్ఛనివాని జన్మ వ్యర్థము. జపమాలను చేత ధరించి
మంత్రజప మొనర్చవలయును. మాలను ప్రాతఃకాలమున నాభికమలమందును. మధ్యాహ్నమున
హృదయస్థానమందును. సాయంకాలము ముఖసమీపమునందును ఉంచుకొని జపింపవలయును. ప్రవాళములు
(పగడము) స్పటికములు. మౌక్తికములు. స్వర్ణమణులు. రుద్రాక్షలు. కుశగ్రంథులు వీటితో
చేయబడిన మాలలు క్రమముగ శ్రేష్ఠములు. మాలను త్రిప్పునప్పుడు శబ్దము కారాదు.
మంత్రమును ఇతరులవద్దకూలిగా ద్రవ్యమును తీసికొని జపించరాదు. జపించునపుడు గోళ్ళతో
శరీరమును గోకికొనుట ఇతరులతో సంభాషించుట చేయరాదు. అగతిగ నట్లు జరిగిన భగవంతుని
స్మరించవలయును. జపించునపుడు నిద్ర ఆవలింతలు. ఆధోవియువులు వచినచో కుడిచెవి
స్నృశించి సూర్యునిగాని గోవునుగాని చూడవలెను. మంత్రము జపించి సూర్యుని స్తుతించి
దిగ్దేవతలకు తల్లిదండ్రులకు గురువునకు నమస్కారము లాచరించి తన గోత్రము నుచ్చరించి
తానాచరించిన సంధ్యాకర్మ ఫలమును ఈశకవరును కర్పింపవలయును. అనంతరమగ్నియందు అష్టదేవతలకు
హోమముచేయవలయును. తరువాత వేదముగాని గీతలు మొదలతు భక్తి గ్రంథములగాని పఠించవలెను.
పితరుల, దేవతల, ఋషుల తర్పణములచే తృస్తిపరచవలయును. ఈవిధానము
శాస్త్రము తెలిసిత పెద్దలద్వారా గ్రహించవలెను. దీపావళినాడు యముని స్మరించి అతని
నామముల నుచ్చరించుచు యముని ప్రీతిగ తర్పణమిచ్చిన పాపములు రోగములు నశించును.
శనిపీడతొలగును. అపమృత్యువుగూడ తొలగును. మాఘమాసమున కృష్ణాష్టమినాడు భీష్మునకు
ప్రీతిగ తర్పణమిచ్చిన సంవత్సరపాపము నశించును. ఇటుల నిత్యము ఎవరు సత్కర్మ
నాచరించురో వారు ఇహపరముల సుఖముల ననుభవింతురని శ్రీగురుమూర్తి బ్రాహ్మణునకు చెప్పెనని
సిద్ధముని నామధారకునకు నిత్యము మానవులచే నవశ్యకర్తవ్యమైన ఆచారపద్ధతి నుపదేశించెను.
ఇది గురుచరితమున ముప్పది ఆరవ అధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
ముప్పది యేడవ అధ్యాయము
శ్రీగణాధిపతయేనమః శ్రీదత్తాత్రేయాయ నమః
పీఠమున కూర్చుండి సంకల్పము నాచరించి. ప్రాణాయామ మొనర్చి
పూజా ద్రవ్యముల స్వయముగ పరిశీలించి ఉదకముతో ప్రోక్షించవలెను. తన ఇష్టదేవతా
విగ్రహమును ఎదుట సింహాసనమున నునిచి దక్షిణముల శంఖమును, వామభాగమున ఘంటను ఉంచవలెను.
దేవుని మీదనున్న వెనుకటి నిర్మాల్యమును తొలగించి దీపము వెలిగించి గణపతిని పూజించి.
గురువును స్మరించి పీఠపూజ నాచరించవలయును. ముందుగ ద్వారపాలకుల పూజించి తన
ఇష్టదేవతారూపమును హృదయము భావించి ఆరూపమే బాహ్యముననున్న విగ్రహమందు ఆహ్వాన
మొనర్పవలయును. భగవంతుడే స్వయముగ వచ్చి తన ఎదుటనున్నటుల భావించుచు వరుసగ పింహాసనము
పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, మధుపర్కము, స్నానము, మొదలగు ఉపచారములతో పూజించి ఆవుపాలు మొదలగు పంచగవ్యములతో
వేదమంత్రముల పఠించుచు అభషేక మొనర్చి శుద్ధవస్త్రము, గంధము,
యజ్ఞోపనీతము
లిచ్చి పూజించి అనంతరము సుగంధద్రవ్యములతో పుష్పములతో, అక్షతలతో పూజింపవలెను. తెల్లని పుష్పములు శ్రేష్ఠములు, పచ్చని, ఎరుపు పుష్పములు మధ్యమములు. నల్లని
విచిత్రపురంగులుకల పుష్పములు ఆధమములు, పురుగులు తినిన పుష్పములు. వాడి క్రిందబడినవి, క్రిందటిరోజున త్రెంపబడిన పుష్పములు దేవపూజకు వర్జ్యములు
మారేడుదళములకు పైనియమమువర్తించదు. పద్మములు, నాగకేసరములు, సంపెంగ,
మల్లె, జాజి, కలువ ఈజాతిపుష్పములు పూజకర్హములు, జిల్లేడుపుష్పము విష్ణుపూజ కర్హముగాదు. బూరుగుపువ్వు పూజకర్హముకాదు. శివుని
వెలగ మొగిలి, దానిమ్మ, వకుళము ఈపుష్పములతో పూజింపరాదు. గణపతిని తులసితోడను
దేవిని గరికతోడను పూజింసరాదు. ఇట్లు విచారించి దేవుని పూజించి ధూపమర్పింపవలెను.
అనంతరము దీపము సమర్పించి నైవేద్యము భగవంతుని ఎదుట నుంచవలయును. దేవుడు భుజించినటుల
భావించి అనంతరము భగవంతుని హస్తప్రక్షాళన
మొనర్చి తాంబూలమును ఫలసమేతముగ నర్పించి నీరాజన మీయవలయును. అనంతరము భగవంతుని
పాదములందు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణ మొనర్చి సాష్టాంగముగ నమస్కరింపవలెను.
అట్లే తల్లిదండ్రుల గురువుల బ్రహ్మణులగూడ నమస్కరింపవలయును.
నమస్కార విధానము చెప్పెద వినుము. తల్లిదండ్రుల సమీపించి పాదములకు నమస్కరించవలయును
పూజ్యులు పెద్దలు వచ్చుట చూడ ఎదురేగి నమస్కరింపవలయును. సభకు ఒక్క పర్యాయమే
నమస్కరింపవలెను. గురువునకు నమస్కరించునపుడు తన కుడిహస్తముతో గురుని కుడిపాదమును, ఎడమ హస్తముతో ఎడమ పాదమును స్పృశించి షాష్టాంగముగా
మోకాలు, వక్షఃస్థలము, ముఖము భూమికి తగులునటుల సాగిలబడి నమస్కరించవలయును. మోకాలు మొదలు పాదాంతముతన హస్తముతో
స్పృశించవలెను. తల్లి, తండ్రిగురువు పోషకుడు, భయహర్త, అన్నదాత, సవతితల్లి పురోహితుడు.
జ్యేష్ఠభ్రాత, పితృభ్రాత, మాతృభ్రాత, జానవృద్ధులు వీరందరుగూడ గురువుతో సమానులుగాన
నమస్కారమునకర్హులు.
అజ్ఞానులు తనకన్న తక్కువ వయస్సుగలవారు. స్నానముచేయువారు.
సమిధలు, పుష్పములు మొదలగు
వస్తువుల గొనివచ్చువారు. హోమము చేయుచున్నవారు. ధనగర్వితులు. కోపముతో నున్నవారు, మూర్ఖులు వీరికి నమస్కరింపరాదు.
శవమునకు నమస్కరింపరాదు. ఏకహస్తముతో నమస్కరింపరాదు.
ప్రతివారును అయిదివిధములైన పాపములను విత్యము గావింతురు. అవి పంచ
సూనములని అనబడును. ఇట్టి పాపములచేయని గృహస్థే ఉందదు. అవి యేవన కత్తి, తిరుగలి, రోకలి వీటితో నిప్పుతో, నీటితో చీపురుకట్టతో
జరుగు పాపములు, ఈపాపములు పోగలందులకు
వైశ్వదేవము చేయవలయును. అనగా వంటచేయబడిన పదార్థమును దేవతలకు. పితరులకు. భూతములకు. ఋషులకు.
అతిథులకు కూడ నర్పించి శేషించిన పదర్థాము యజ్ఞశేషమని భావించి భుజించవలెను.
అట్లొనర్చుటచే నిత్యము గృహస్థునిచే చేయబడు పంచసూనములను పాపముల వలన కలుగు దోషము
నశించి దేవతలవల చిత్తశుద్ధికలవాడగును.
భోజనకాలమున ఎవరైనా అతిథిగా వచ్చిన కులముగానీ గోత్రముగానీ
ప్రశ్నించక భగవంతుడను భావముతో భోజనమిడవలను.
యమధర్మరాజు అతిథి పూజచేయువారిని నాలోకమునకు గొనిరావద్దని తన దూతలతో
చెప్పెను. అతిథి పూజచే సర్వ దేవతల
పూజించిన ఫలము వచ్చును. అతిథికి పాద
ప్రక్షాళన మొనర్చిన పితృదేవతలు తృప్తులగుదురు.
అతిథిని పూజించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తృప్తి గాంతురు. అతిథి గానీ,
బ్రహ్మచారిగానీ, భిక్షకువచ్చిన
వైశ్వదేవము, నైవేద్యముకాకున్ననూ
తప్పక భిక్ష నివ్వవలయును.
అట్టివారికివ్వబడిన ఒక కబళము మేరువంతయగును. వారు త్రాగు పానీయము సముద్రమంతగా
వృద్ధియగును. అట్టి అతిథిని విడనాడి
భుజించువాడు మరుజన్మయందు కుక్కయై తరువాత గాడిదయై పుట్టును. వడ్డించునపు పంక్తి భేదము చేయుట మహాపాపము. భుజించువారు పాదములు,చేతులు ముఖము నీటిచే కడుక్కుని భుజించవలయును. మౌనముగా తూర్పుముఖముగా కూర్చుని
భుజించవలయును. వడ్డించుచోట నీటితో అలికి
ముగ్గువేసి అందు దేవతల నాహ్వానించి అచ్చట పత్రముంచి వడ్డించవలయును. మండలముచేయక భుజించువారి అన్నరసము రాక్షసుల, పిశాచుల పాలగును.
పితృకార్యములందు ఉత్తరముఖముగ
భుజించవలయును. మూలలకు ముఖముండునటుల
కూర్చుని భుజింపరాదు. గృహస్థులు వెండి,బంగారము, తామ్ర పాత్రలందును. పద్మ పలాశ పత్రములయందును భుజించవచ్చును. లోహపాత్రలయందు, వస్త్రమందు, భూమిమీదను భుజించరాదు. కాంస్య పాత్ర యందు భుజించుటచే ఆయుష్యము, వర్చస్సు వృద్ధియగును. కాంస్య పాత్రభోజనము, అభ్యంజనము,
తాంబూలము
ఇవి విధవలకు, యతులకు నిషేధము. పతితుల ప్రక్కననిడుకొని భుజించరాదు. కొంచము అన్నమును భుజించునపుడు కుడి ప్రక్కన
నేలమీద చిత్రగుప్తుని పేరుతో బలిగానర్పించి భుజించవలయును. భగవంతుడే తనలోనుండి భుజించుచున్నాడనియు తినబడు
అన్నము బ్రహ్మస్వరూపమనియు భావించుచు భుజించవలయును. ముఖములో నిముడునంత మాత్రమే ముద్దచేసి నోట పెట్టుకొనవలయును. నెయ్యి, పాయసము,
లవణము
పత్రములో శేషముంచరాదు. ఎడమ పాదమున
చేయిపెట్టి భుజింపరాదు. మోకాళ్ళకు బయిట
చేయి పెట్టి భుజించరాదు. చప్పుడగునటుల
తినరాదు. నీరు త్రాగరాదు. నిలువబడి కానీ, తిరుగుచూకానీ నీరు త్రాగరాదు. రజస్వలను, కుక్కను,
చండాలుని
చూచుచు భుజించరాదు.
స్త్రీలు నల్లని వస్త్రము ధరించి గాని గోచీలేకగాని
వడ్డించరాదు. భుజించిలేచి గండూషము లాచరించి హస్తము కడుగుకొనవలయును. పాదప్రక్షాళన
మొనర్చవలయును. ఆహారము జీర్ణము కాగలందులకు అగుస్త్యుని, కుంభకర్ణుని, బడబాగ్నిని స్మరించవలయును. తామస పదార్థముల
భుజించరాదు. కుక్కలు, కాకులు పిల్లులు
స్పృశించిన అన్నము తినరాదు. చద్ది అన్నము తినరాదు. రాత్రులందు, సప్తమీ ఆదివారము లందు ఉసిరికపచ్చడి తినరాదు.
భుజించి తాంబూలము వేసికొనవలయును. యతులు, బ్రహ్మచారులు, విధవలు, రజస్వలైన స్త్రీలు తాంబూలము వేసికొనరాదు. సాయకాలము
పురాణములు, సద్గ్రంథములు పెద్దలవలన
వినవలయును. సూర్యుడస్తమించు సమయమునకు తిరిగి సంధ్యవార్చి హోమమొనర్చి
గురువందన మాచరింపవలయును. రాత్రులందు లఘువుగ భుజించవలయును. జాముప్రోద్దుపోవువరకు సద్గ్రంథముల పఠించితాను
దినమంతయు చేసిన కర్మనంతను ఈశ్వరున కర్పించి శయనించవలయును. తూర్పు, దక్షిణములశిరముంచి గాని, ప్రవాసము లందు పడమరగ శిరముంచిగాని శయనించవలెను. ఉత్తరముగ
శిరముంచి ఎన్నడును శయనింపరాదు. భర్తతో శయనించు స్త్రీ నీలవస్త్రము ధరింంపరాదు.
రతికాలమున దీపముండరాదు. రజస్వల అయిన స్త్రీతో నాల్గవదినమున రమించిన
అల్పాయుష్మంతుడగు కొడుకు కలుగును. అయిదవదినమున కన్యక, ఆరవదినమున పుత్రుడు జన్మింతురు. స్త్రీపురుషులు రతికాలమున
ఎట్టిభావము గలవారుగ నుందురో అట్టిసంతానమే కలుగును అని ఈవిధమున గురుమూర్తి
బ్రాహ్మణునితో ఆచార ధర్మ ముపదేశించి ఆచారమును పరిపాలించువారింట దైన్యముండదు. వారు
ఆయుష్మంతులై పుత్రు పౌత్రాభివృద్ధినొంది సుఖింతురు. వారికి కలికాభయము లేదు. వారు
కాలమృత్యువు గెలుతురు. అపమృత్యువు వారల నేమిచేయగలదు? కాన బ్రాహ్మణా నీకు ఆచార ధర్మము చెప్పితిని. నీవు
పరాన్నమికమీద విసర్జించి ధర్మమాచరించి సుఖింపుమని ఆశర్వదించిరి. బ్రాహ్మణుడును
భార్యతోకలసి గురుమూర్తికి నమస్కరించి ఆజ్ఞతీసికొని వెళ్లి అట్లే ఆచరించి
ఇహపరసౌఖ్యముల నొందెను. ఇట్టి గురుచరితము నెవ్వరు శ్రద్ధతో విని ఆచరించెదరో
అట్టివారు మూర్ఖులు సహితము ఉత్తమజ్ఞానసంనస్నులు కాగలరని సిద్ధముని నామధారకునితో చెప్పెను.
ఇది గురుచరితమున ముప్పది యేడవ అధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
ముప్పది ఎనిమిదవ అధ్యాయము
శ్రీదత్తాత్రేయాయ నమః శ్రీగణాధిపతయేనమః శ్రీ గురుభ్యో నమః
జయ జయ శ్రీనృసింహసరస్వతీ జయజయ
నామధారకుడు
సిద్ధముని పాదమునకు నమస్కరించి గురుమాహాత్మ్యమున వినిన కొలదియు ఇంకను వినవలయునను
తృష్ణ అధికమగుచున్నది. కాన దయయుంచి తరువాత జరిగిన గురుచరిత్రను నాకు వినిపించి
నామనస్సు శాంతి పరచుడని ప్రార్థించ పిద్ధముని ఇట్లు చెప్పుచున్నాడు. నీ ప్రశ్నవలన నాకును కడుసంతసమైనది. నీనిమిత్తము గురు కథను మధ్యమధ్య మరచుచున్న నాకు
తిరిగి స్మరించు భాగ్యము ఘటించుచున్నది.
గంధర్వపురమున జరిగిన చిత్రమైన గురులీల నొకటి
చెప్పుచున్నాను వినుము. గురుమూర్తి మాహాత్మ్యమును విని అనేకమంది ధనికులైన భక్తులు
గణగాపురము వచ్చి గురుమూర్తిని దర్శించి వారికి శిష్యసమేతముగ పక్వాన్నములతో భిక్షలు
చేయుచుండెడివాడు. ఇట్లునిత్యము అచట బ్రహ్మణు సమారాధనలు జరుగుచుండెడివి. బ్రాహ్మణ
సమారాధనమే లేని దినమే కానరాకుండెను. ఇట్లుండ నొక దినమున కాశ్యపగోత్రజుడైన
భాస్కరుడను పేరు గల ఒక బీద బ్రాహ్మణుడు స్వామివారికి భిక్ష చేయవలయునను కోరికతో
గణగాపురము వచ్చి భక్తితో స్వామివారి పాదములకు సాష్టాంగముగ వందన మాచరించెను. బీదవాడగుటచే
ముగ్గురకు మాత్రము సరిపోవు తండులములను మిగిలినపదార్థములను పై ఖర్చుకుగాను తగినంత
ద్రవ్యమును తన వస్త్రమున మూటగట్టికొని వచ్చి మఠమున నివసించెను. ఆదినమున సమారాధనము
చేయువారలచే నాహ్వానింపబడి అందరితో పాటు తానును భుజించి రాత్రికాలమున స్వస్థముగ
మఠముననే నిద్రించెను. ఇట్లున్నిదినములో గడిచెను. అతనికి తాను తెచ్చిన స్వల్ప
పదార్థముతో స్వామివారికి భిక్ష చేపెదనని చెప్పుటకుగూడ సిగ్గగుచుండెను.
స్వామివారి శిష్మలు ఇతని వలన ఇతని అభిప్రాయమును గ్రహించి
అతనిని పరిహసించి ఒక్కరికైన సరిపోని పదార్థముతో శిష్యసమేతముగ స్వామివారికి భిక్ష
ఎట్లుచేయగలవు? అట్లు చెప్పుటకు నీకు
సిగ్గయిన లేదా! రేపు నీవు తెచ్చిన
పదార్థము వండి బీదవారికి మధూకరము పెట్టుమనిరి. ఇటుల మూడునెలలు జరిగెను. నిత్యము
స్వామివారితో పాటు తానును సమారాధనమున భుజించి రాత్రి తాను తెచ్చిన సామాగ్రి మూట
తలక్రింద నిడుకొని నాకు స్వామివారికి భిక్షచేయు భాగ్యము లేకపోయెగదా! అందరు నన్ను
పరిహసించుచున్నారు. దైవహీనుడ నేనేమి చేయుదునని విచారించుచు నిద్రించుచుండెను.
గురుమూర్తి సర్వజ్ఞుడుగాన భాస్కరుని భక్తికి సంతసించి ఒక
దినమున నతనిని పిలిచి రేపు నీవే మాకు భిక్షయొనర్చుము. శుచిగ పాకమొనర్చుము. అన అతడు
ఆనందభరతుడై మరునాడు పణ్యవీధికి వెళ్లితన వద్దనున్న ద్రవ్యముతో నెయ్యి శాకములు
తెచ్చి స్నానమొనర్చి పాకముచేయ ప్రారంభించెను. అదే దినమున మరియొకరు స్వామిని
భిక్షకుప్రార్థించ స్వామివారు ఈదినమున భాస్కరుడు భిక్షచేయునుగాన
వీలులేదనిరి. బ్రాహ్మణులందరు హా దైవమా! నిత్యము స్వామివారితోపాటు మిష్టాన్నము
భుజించుచుంటిమి. నేడీ బీదబ్రాహ్మణుడెట్లు తటస్థమయ్యెనని చింతించుచుండ గురుమూర్తి అది గ్రహించి వారలతో మీరందరు
నిత్యమువలె కుటుంబసమేతముగా వచ్చి నావద్దనే భుజింపుడనియనిరి. గ్రామస్థులు
స్వామివారివద్ద శిష్యులచే నివ్వబడిన పదార్థము చాల గలదుగాన మనకందరకుగూడ పాకము
చేయింతురని భావించి వెళ్లిరి.
గురుమూర్తి భాస్కరుని పిలిచి ఈదినము ఎక్కువమంది బ్రాహ్మణులు
భోజనమున కేతెంచెదరు. కాన శీఘ్రముగ పాకము చేయుమన నాబ్రాహ్మణుడు పాకము
సిద్ధముయ్యెననెను. స్వామివారు
బ్రాహ్మణునితో నీవు నది వద్దకు వెళ్లి బ్రాహ్మణులతో పాకము సిద్ధమైనది గుర్వాజ్ఞ
అయ్యెను గాన మీరందరు శీఘ్రముగ భోజనమునకు రండని పిలువుమని చెప్ప నాబ్రాహ్మణుడు
నదికి వెళ్లి బ్రాహ్మణులతో పాకము సిద్ధముయినది మిమ్ముల భోజనమునకు రమ్మని
గురుమూర్తి చెప్పిరని యన వారు నీవు చేసిన పాకముతో స్వామివారికి భిక్షయొనర్చుము.
స్వామివారు మాకందరకు వంట చేయించెదరు. ఆలస్యము కాగలదు. ఇప్పుడే వచ్చి ఏమి చేసెదము? కాన రామని నిరాకరించిరి. అప్పుడా బ్రాహ్మణుడు
గురుమూర్తితో స్వామీ భిక్షకు దయచేయుడు బ్రాహ్మణులు నేడు మా గృహములందే భుజించెదమని
ఏమేమో చెస్పుచు పరిహసించు చున్నారని చెప్ప స్వామివారు నేను బ్రాహ్మణులందరితో కలసి
భిక్ష చేయుదును కాని ఒంటరిగ నీ భిక్ష స్వీకరించువాడనుగాను అని యన బ్రాహ్మణడు స్వామివారి మహిమ తెలిసిన వాడగుటచే వారి వాక్యము కామధేనువని మనస్సున విశ్వసించియు స్వామివారితో స్వామి! మీ
యాజ్ఞకు నేను బద్ధుడను. కాని నావాక్యమును వారు విశ్వసించుటలేదు. నేనేమి చేయుదునన
స్వామివారు తన శిష్యుని పిలిచి నీవు వెళ్ళి బ్రాహ్మణుల వందరి వెంటనే భోజనమున
కాహ్వానింపుముఅని పంప అతడు గురుమూర్తి ఆజ్ఞను వారలతో చెప్ప వారందరు స్నానములొనర్చి
మఠమునకు వచ్చిరి. అప్పుడు స్వామివారు బ్రాహ్మణునితో నీవు వీరలనందరను కుటుంబసమేతముగ
నిచ్చట భుజింపుడని ప్రార్థించుమన నతడట్లొనర్చెను. అచట చేరిన బ్రహ్మణులు అతనిని
పరిహసించిరి. నీవు వండిన పదార్థము ఇంతమందికి ఏమి సరిపోవును? ఒక్కొక్కరకు ఒక్క మెతుకైన రాదు కదా! అని
అనుచుండిరి. గురుమహిమ తెలిసిన వృద్ధులు మాత్రము అతనిని పరిహసించకుడు గురుమూర్తి
చెప్పమన్న దీతిని అతడు పలికెను. అతనిదేమి దోషమనిరి. బ్రాహ్మణులు వరుసలుగ
కూర్చుండిరి, విస్తళ్లు వేయబడెను.
భాస్కరుడు గురుమూర్తికి షోడశోపచారములతో పూజ
యొనర్చి నీరాజనమిచ్చెను.
గురుమూర్తి భాస్కరునితో నీవు చేసిన పాకమును పాత్రలతో సహ
తెచ్చి నా సమక్షమున నుంచుమనెను. అతడట్లొనర్చెను. తన శాటీ వస్త్రమును ఇచ్చి దానితో
నాపాకమును కప్పుమన నతడట్లొనర్చెను. స్వామివారప్పుడు తన కమండలములోని ఉదకమును చేత
తీసికొని మంత్రించి ఆ ఉదకమును పాకముమీద చల్లి, నీవు వస్త్రమును తీయక పాత్రాంతరములతో పదార్థము తీసికొని
యథేష్ఠముగ వడ్డింపుమని యాజ్ఞపించిరి. భాస్కరుడట్లొనర్చెను. తీసిన కొలదియు
పదార్థములు నిండుచుండెను. ఆ ఆశ్చర్యము చూచి అనేక మంది బ్రాహ్మణులు వడ్డనకు లేచిరి.
ఏ పదార్ధము ఏపాత్రనుండి ఎంత తీసిన తతక్షణమే ఆ పాత్రము పూర్వమువలె పూర్తిగ నుండెను.
వడ్డన పూర్తి అయ్యెను. అందరును భుజించుటకు ప్రారంభించిరి భాప్కరుడు బ్రాహ్మణుల
స్వస్థమనస్కులై భుజించుడు కావలసిన పదార్థముల యథేష్టముగ నడుగుడని ప్రార్థించెను.
బ్రహ్మణులు కంఠమువరకు తింటిమి ఇట్లెన్నడును భుజింపమైతిమనిరి. అందరును భుజించి
హస్తముల కడుగుకొనిరి. అందరికి తాంబూలము లివ్వబడెను. భుజించినవారి విస్తళ్లు
తీసివేయబడి స్థలము శుద్ధము చేయబడెను. అప్పుడు గురుమూర్తి గ్రామములో ఇంకెవరైన
బ్రాహ్మణులు, స్త్రీలు బాలురుగూడ
భుజించకనున్న వచ్చిభుజింపుమని ఆజ్ఞ నీయనట్లే గ్రామస్థులైన బ్రాహ్మణులు స్తీలు
బాలురు అందరు భుజించి వెళ్లిరి. స్వామివారు గ్రామస్థులైన శూద్రులను అంత్యజులను
స్త్రీ పుత్రసమేతముగ పిలిసించి వారలకుగూడ భోజనమిడుమని ఆజ్ఞ నీయ
బ్రాహ్మణుడట్లొనర్చెను. గురుమూర్తి బ్రాహ్మణునితో అందరు భుజించిరా! గ్రామములో
నెవరైన భుజించని వారున్నచో వచ్చి భుజించుమని డంగోరా (దండోరా, చాటింపు) వేయించమని ఆనతిచ్చిరి.
బ్రాహ్మణుడట్లొనర్చెను. అందరును భుజించినందున ఎవ్వరును రారయిరి. అపుడు గురుమూర్తి
నీవు భుజించుమని బ్రాహ్మణునకు చెప్పిరి. అతడును భుజించెను. అప్పుడు గురుమూర్తి పాత్రములమీద కప్పిన
శాటీతీయమనెను. బ్రాహ్మణుడట్లేతీసి చూడ వండిన పరార్థమంతయు నట్లేయుండెను. అప్పుడు
గురుమూర్తి బ్రాహ్మణునితో నీవు ఈపదార్ధమును భీమానదితో పరవేసి రమ్మ అందలి చేపలుగూడ
నీ పరాద్థముల భుజించగలవని చెప్ప ఆ బ్రాహ్మణుడును నట్లొనర్చెను.
ఆదినమున జరిగిన ఈ గురులీలను చూచి అందరు ఆశ్చర్యమందిరి.
స్వల్పపదార్థముచే గురుమూర్తి నాలుగువేల మందికి పైగా అన్ని దానము చేసిరి.
గురుమూర్తి బ్రాహ్మణుని భక్తిశ్రద్ధలకు
సంతసించి నీవు లక్ష్మిసంపన్నుడవై పుత్రపౌత్రాభివృద్ధినొందుమని ఆశీర్వదించిరి.
కొంతమంది విజ్ఞులు గురుమూర్తి అన్నపూర్ణను స్మరించెను గాన
అన్నము అక్షయమయ్యెననిరి. మరికొందరు పూర్వము దూర్వాసుడు శిష్యుసమేతముగపాండవుల
పరీక్షంపరాగా ద్రౌపది కృష్ణుని స్మరింప కృష్ణుడే తెంచి ద్రౌపదిని సంకటమునుండి
రక్షించుట వింటిమి గురుమూర్తి భాస్కరుని అవమానమునుండి రక్షించి కాపాడుట నేను
చూడగలిగితిమి అనిరి. స్వామివారు మనుష్య మాత్రులుగారు త్రిమూర్త్యవతారులే
గాకున్ననితటి సామర్థ్యమెవ్వరికైన కలుగునా! ఇట్టి శ్రీవారి మహిమ నెన్ననెవ్వరి తరము, ఇట్టివారిని మనుహ్యునిగా తలుచువారు తప్పక నధోగతి
పాలగుదురు.
ముగ్గురకు సరిపోని పదార్థముతో నాలుగువేల మందికి
అన్నదానమొనర్చిరి. మరణించిన వానికి ప్రాణములిచ్చిరి. ఈ చిత్రముల కనులార గాంచితిమి.
త్రివిక్రమ భారతికి విశ్వరూపము జూపిరి. గ్రామమధ్యమున గొడ్డుబోతు బఱ్ఱెతో పాలు
పితికించుటయును చూచితిమి. హీనజాతి వానిచే వేదముల పలికించిరి. భక్తునకు కాశీ గయా
ప్రయాగల నొకే రోజున దర్శింపచేసిరి. ఇట్టి అమితములైన మహిమ లెన్నియో కనులార
చూచితిమి ఇట్టి సామర్థ్యము ఈశ్వరస్వరూపులైన వారికే తప్ప మరియెక్కడ గాంచము. ఎంతయో
శ్రమపడిననే ఆరాధించిననే దేవతలు ప్రసన్నులగుదురు. గురుమూర్తి అట్లుగాక దర్శన మాత్రముననే భక్తుల
కామముల పూర్తిచేయుచున్నారు. అని అందరును గురులీలల వెయ్యినోళ్లతో కొనియాడిరి. ఇట్లు
గురుమూర్తి ఖ్యాతి సర్వత్ర విఖ్యాతి నొందెను. ఎందరో గురుమూర్తికి
శిష్యులగుచుండిరి. నానా రాష్ట్రములనుండి గురుమూర్తిని సేవింప వచ్చుచుండిరి.
శిష్యమనోభావన ననుసరించి గురువు వారల పట్లు ప్రసన్నుడగుచుండునని ఇట్టి
గురుచరిత్రమును సిద్ధముని నామధారకునకు చెప్పెను.
ఇట్లు గురుచరిత్రమున ముప్పది ఎనిమిదవ అధ్యయము సమాప్తము.
శ్రీ గురు చరితము
ముప్పది తొమ్మిదవ అధ్యాయము
గురుదేవదత్త. శ్రీగణపతయేనమః శ్రీ సరస్వత్యై నమః జయ జయ
శ్రీనృసింహసరస్వతీ.
సిద్ధముని నామధారకునితో ఓ నామధారకా!గురుమూర్తి అను గ్రహమువలన అరువది (60) సంవత్సరముల వనితకు సంతతికలిగెను. అట్టి అపూర్వమగు గురుమాహాత్మ్యమును చెప్పెద సావధానుడవై వినుము.
గణగాపురమున
శౌనకగోత్రీయుడు ఆపస్తంబ యజుర్వేద శాఖీయుడు అయిన సోమనాథుడను బ్రాహ్మణుడు కలడు. అతడు
వేదశాస్త్ర ప్రమాణముగ నిత్యము సత్కర్మల నాచరించుచుండును. అతనికి పతివ్రతయగు గంగ
యను భార్య కలదు. ఆమెకు అరువది సంవత్సరములు
వచ్చినను సంతానము లేనందున గొడ్రాలను వాడుక ఆమె విషయమున వచ్చెను. ఆమె నియమముతో పతి
సేవ చేయుచుండును. అట్లే నిత్యము గురుమూర్తియైన నృసింహసరస్వతీస్వామివారి మఠమున
కేతించి స్వామివారికి నమస్కరించి,
పూజచేసి.
నీరాజనమిచ్చి పోవుచుండెడిది. ఇట్లు కొంత కాలము జరుగ నొక రోజున ఆమె తన దర్శనమునకు
రాగా ఆమె భక్తికి శ్రద్ధకు సంతసించి నవ్వుచు నా వృద్ధురాలితో నిట్లనిరి. ఓ
గంగాబాయీ! నీవు నిత్యము నా దర్శనమునకు వచ్చి నీరాజనమిచ్చిపోవుచున్నాను. కాని నీ కోరిక ఏదియో ఇంతవరకు విల్లడించవైతివి.
నేడు నేనడుగుచుంటిని గాన సంశయింపక నీ మనోవాసన
ఎమియో చెప్పము. పరమేశ్వరుడు నీ యభీష్టమును సిద్ధింపచేయును. అని అనిరి.
గురుమూర్తి వాక్యమును విని ఆమె దోసిలియొగ్గి నమస్కరించి ఇట్లనుచున్నది. స్వామీ!
పుత్రులు లేని స్త్రీకి గతి లేదనియు. అట్టిస్త్రీ ముఖమును చూడరాదనియు వేదములందు
గలదని పెద్ద లందరు. నేను పాపినగుటచే నాగర్భము ఫలించనందున నాజన్మ వ్యర్థమయ్యెను.
పుత్రులు లేని గృహము అరణ్యముతో సమానము. నిత్యము స్త్రీలు పిల్లల నెత్తుకొని నదీ
స్నానమున కేతెంచెదరు. నేనెట్టి భాగ్యమును చేసి కొననైతిని. సంతానహీనురాలగు స్త్రీ
యొక్క పితరులుగూడ పిండోదకము లిచ్చువారు లేక పోవుటచేత నధోగతి పాలగుదురట. నాకు
ఇప్పటికి అరువది సంవత్సరములు వచ్చెను. ఇట్లీజన్మ సంతానరహితమై వ్యర్థమాయెను. మీ
యనుగ్రహమువలన ముందు జన్మనైన పుత్రవంతురాలను కావలయునను మనోవాసనతో మీ సేవ
చేయుచుంటిననెను.
స్వామివారామెతో నీ సేవకు సంతసించితిని. ముందు జన్మ సంగతి ఎవరు చెప్పగలరు? ఒక జన్మ విషయము రెండవ జన్మలో స్మృతిలో నుండుటయ
అసంభవము. ఈజన్మలో నీవు నన్ను
సేవించితివి. కాన ఈ జన్మయందే నీకు ఒక
పుత్రికయు, పుత్రుడును గూడ
కలుగగలరని ఆశీర్వదించిరి. స్వామివారి
వాక్యముల విని ఆమె లోపల విశ్వసించి వారితో స్వామీ! నాకు అరువది సంవత్సరములు వచ్చె
కదా! బహిష్టుకాలము కూడ దాటిపోయెను. నాకు
సంతానము కలుగు మార్గమేమియో గోచరించుటలేదు.
నేనెన్నియో వ్రతములచారించితిని.
తీర్ధయాత్రలు చేసితిని. అశ్వత్థ
ప్రదక్షిణలనాచరింపమని అందరూ చెప్ప నింత పర్యంతము ఈ జన్మలో గాకున్న ముందు జన్మకైన
పుత్రవంతురాలనగుదునను ఆశతో అశ్వత్థ ప్రదక్షిణముల నాచరించు చున్నాను. నేటికి నాకీ జన్మయందే సంతానము కలుగునట్లు
ఆశీర్వదించితిరి. మూర్ఖురాలనై నింత
పర్యంతము అశ్వత్థమును సేవించితినన స్వామివారు నవ్వుచు ఆమెతో ఇట్లనుచున్నారు.
అశ్వత్థమును నిందింపకుము.
అశ్వత్థ సేవ కడు పుణ్య ప్రదము.
నీవు ఇక మీద సంగమమున నేను అనుష్ఠానమొనర్చు అశ్వత్థమునకు ప్రదక్షినమొనర్చుము. నీకు సంతానము కలుగును. పురాణములందు అశ్వత్థ
వృక్షముయొక్క మహాత్మ్యము విస్తరించి చెప్పబడెను. అశ్వత్థ వృక్షము నారాయణ
స్వరూపమగుటచే నేనును అశ్వత్థ వృక్ష సమీపమునే నివసించుదును. అని గురుమూర్తి చెప్పగా ఆమె అశ్వత్థవృక్ష
మహాత్మ్యమును విస్తరించిచెప్పుడు. నామనస్సు
స్థిరపడును అని అడుగ స్వామివారు ఆమెతో బ్రహ్మాండ పురాణమున అశ్వత్థ మహిమ
వర్ణింపబడెను. ఆవిషయమునే
చెప్పుచున్నాను వినుము అని ఇట్లు
చెప్పుచుండిరి.
బ్రహ్మ పుత్రుడయిన నారదుడు బ్రహ్మ వలన అశ్వత్థవృక్ష
మహాత్మ్యమును విని భూలోకమునందలి ఋషుల ఆశ్రమమునకు రాగా ఆశ్రమ వాసులకు ఋషులు అతనికి
స్వాగతము చెప్పి అశ్వత్థ మహాత్మ్యమును ప్రశ్నించ నారదుడు ఋషులకు ఈ క్రిందివిధముగ
అశ్వత్థ మహాత్మ్యమును చెప్పెను.
ఋషులారా! నేను లోకముల పర్యటించుచు బ్రహ్మలోకమునకు పోయి
బ్రహ్మకు నమస్కరించి తండ్రీ! అందరూ అశ్వత్థవృక్షము విష్ణు స్వరూపమందురు. అట్టి
వృక్షమునెట్లు సేవించవలెనో అట్టి అశ్వత్థ మహాత్మ్యమును నాకు విస్తరించి చెప్పుడని
ప్రార్ధించ చతుర్ముఖుడు నాతో నేమి చెప్పెనో ఆవిషయమే మీతో చెప్పుచున్నాను వినుడు. అశ్వత్థమూలమున బ్రహ్మ నివసించును. మధ్యభాగమున
విష్ణువు, అగ్రమున రుద్రుడు
నివసింతురు. దక్షిణ శాఖలందు శూలపాణియు, పశ్చిమ శాఖలందు విష్ణువు, ఉత్తర శాఖలందు బ్రహ్మయు నివసింతురు. ఇంద్రాది దేవతలు తూర్పు శాఖలనుందురు. బ్రాహ్మణులు, ఋషులు,
గోవులు, వేదములు, యజ్ఞములు, మూలాంకురముల
నుందురు. నదులు, సప్త సముద్రములు
శాఖలందుండును. అకారము మూలముగను, ఉకారము స్కంధముగను, మకారమగ్రముగను ఇట్లు అశ్వత్థమును ప్రణవముగ తెలుసుకొని
ఉపాసింప వలయును. అశ్వత్థము
కల్పవృక్షము. భక్తులకు సమస్త కామనల
నిచ్చుటయందు సమర్ధమయినది అని నారదుడు చెప్ప ఋషులు అశ్వత్థ సేవావిధానమును
విస్తరించి చెప్పుమని ప్రార్ధించిరి.
అప్పుడు నారదుడు ఇట్లు చెప్పుచున్నాడు.
ఋషులారా! వినుడు! ఆషాఢ, పుష్య,
చైత్రమాసములందును, గురు, శుక్ర మౌఢ్యము వచ్చినప్పుడు చంద్రానుకూల్యములేనప్పుడు అశ్వత్థ
సేవనారంభించరాదు. శుభదినమున శుచియై
అశ్వత్థ ప్రదక్షిణల నారంభించ వలయును.
రాత్రి, అపరాహ్ణము మొదలగు
నిషిద్ధకాలమునందు అశ్వత్థవృక్షమును స్పృశింపరాదు.
అశ్వత్థ సేవ చేయువారు అబద్ధములాడరాదు. జూదమాడరాదు.
ఇతరులనిందించరాదు.
శిరఃస్నానమొనర్చవలయును. శుభ్రమైన
వస్త్రముల ధరించి, అశ్వత్థసేవనారంభించవలయును. రెండు కలశములతో ఉదకము తెచ్చి గంగా యమునల
నందాహ్వానించి సంకల్పమొనర్చి ఆ ఉదకముతో ఏడు పర్యాయములు అశ్వత్థమును
తడుపవలయును. తిరిగి స్నానమొనర్చి శుచియై
షోడశోపచారములతో వృక్షమును పూజించవలయును.
ఎనిమిది భుజములుగల శ్రీమహావిష్ణువుగ ధ్యానింపవలయును. లక్ష్మిసమేతునిగ, పీతాంబరధరునిగ, భుజముల శంఖము, చక్రము, వరముద్ర, ఖడ్గము, చాపము, అభయముద్ర మొదలయినవి
ధరించి ఉన్నటుల ధ్యానించవలయును. వస్త్రముతోగానీ, దారముతోగానీ వృక్షమును చుట్టి ప్రదక్షిణలనాచరించ
వలయును. మందగతిగ మౌనముగగానీ, భగవంతుని నామముచ్చరించుచుగానీ
ప్రదక్షిణలచేయవలయును. ప్రతి
ప్రదక్షిణకునమస్కరించవలెను. రెండు లక్షల
ప్రదక్షిణములనొనర్చిన బ్రహ్మ హత్య నశించును.
అశ్వత్థ ప్రదక్షిణల వలన వ్యాధులు నశించును. ఋణబాధలు తొలగును. గ్రహబాధలు తొలగును. పుత్రకాములు మనోవాక్కాయములతో అశ్వత్థ
ప్రదక్షిణముల చేసిస తప్పక వారలకు సంతాన ప్రాప్తియగును. చతుర్విధ పురుషార్ధముల
నొసంగెడి అశ్వత్థ సేవ పుత్రప్రదమనుటలో ఆశ్చర్యమేమియులేదు. శనివారము అశ్వత్థమును స్పృశించుచు మృత్యుంజయ
మంత్రమును జపించుచో కాలమృత్యువుగూడ తొలగును.
అపమృత్యువు మాట చెప్పనేల? శని చాలనివారు ''కోణస్థః, పింగళో, బభ్రుః, కృష్ణః, రౌద్రః, అన్తకః, యమః, సౌరిః, శనైశ్వరః, మందః,
పిప్పలాదేవ
సంస్తుతః'' అని శనినామము పఠించుచు
అశ్వత్థ సేవ చేసిన శనిపీడ తొలగును.
దృఢమనసుతో సేవ చేయువారు సర్వకామనల నొందగలరు. అశ్వత్థపునీడను అమావాస్య, గురువారములందు స్నానమొనర్చిన బ్రహ్మహత్య
తొలగును. ఆ వృక్షముక్రింద చేయబడిన జపము
అనంత ఫలప్రదమగును. అశ్వత్థవృక్షమును నాటిన
వారి పుత్రులు శాశ్వత స్వర్గమునొందెదరు.
అశ్వత్థవృక్షమును ఛేదించువారు వారి పితరులతో సహ నరకమనుభవింతురు. ప్రదక్షిణల పూర్తిచేసి ఉద్యాపన
ఆచరింపవలయును. బంగారు అశ్వత్థవృక్షమును
బ్రాహ్మణునకు దానము చేయవలయును. తెల్లని
గోవును దానమివ్వవలయును అని ఇట్లు నారదుడు ఋషులకు చెప్పెనని గురుమూర్తి ఆ గంగ యను
వృద్ధ స్త్రీకి చెప్పి ఆమెతో నీవు సంగమమున మన
అశ్వత్థమును సేవించుము. నీకు సంతానము
కలుగునని చెప్పెను.
గురుమూర్తి వాక్యము విని ఆమె స్వామీ! నాకు అరువది
సంవత్సరములు వచ్చినవి. జన్మ వంధ్యనని
లోకమున పేరుగాంచితిని. అయినను గురువాక్యము
కామధేనువని స్మృతిస్మృతులు చెప్పుచున్నవి.
మీవాక్యము విశ్వసించి మీరు చెప్పినటుల నడుచుకొనెదనని చెప్పి వారి ఆజ్ఞబడసి
సంగమమునకేగి షట్కాలములయందును స్నానమొనర్చి మూడు దినములు అశ్వత్థముతోపాటు
గురుమూర్తికి కూడ ప్రదక్షిణలు,
పూజలు
చేసెను. మూడవ రోజు రాత్రి ఆమెకు
స్వప్నములో నొకబ్రాహ్మణుడు కనపడి అభయమిచ్చి నీ కోరిక నెఱవేఱును. రేపు ఉదయము గాణగాపురముననున్న గురునాథుని వద్దకు
పోయి ప్రదక్షిణ నమస్కారములుగావింపుము.
నీకు వారేమిత్తురో దానిని భుజింపుము.
నీకార్యము తొందరగా ఫలించును అని చెప్పెను.
ఆమెయు స్వప్నమునుండి మేల్కొని సంతసించి ఉదయమగుటతోడనే స్నానమొనర్చి
అశ్వత్థమును సేవించి గాణగాపురము వచ్చి గురుమూర్తికి ప్రదక్షిణనమస్కారములకావించెను. గురుమూర్తి నవ్వుచు ఆమెకు రెండు ఫలములనిచ్చి ఈ
ఫలముల భుజించుము. నీకు ఒక పుత్రికయు, పుత్రుడుగూడ కలుగునని చెప్ప ఆమె సంతసించి ఆఫలముల
భక్షించి వ్రత సమాప్తిగావించెను.
ఆ సాయంకాలమునకే ఆమె ఋతుమతి అయ్యెను. మూడు దినములు నియమము
ప్రకారము శ్వేత వస్త్రము ధరించి హవిష్యాన్నము తిని నాల్గవదినము స్నానమొనర్చి, గురుదర్శనమొనర్చి, అయిదవ దినమున భర్తతోసహ గురుమూర్తి సన్నిధానమునకేగి వారిని
పూజించెను. గురుమూర్తి పుత్రవతివి కమ్మని
ఆశీర్వదించిరి. ఆమె గురుమూర్తి వాక్య
ప్రభావమువలన గర్భవతి ఆయ్యెను.
గ్రామస్థులందరు ఆశ్చర్యపడి సోమనాధుడు ఎంతటి భాగ్యవంతుడు.
గంగాబాయి ఎంత అదృష్టవంతురాలు. ఇంత
వృద్ధాప్యమున స్త్రీ గర్భవతియగుట ఎందేని కలదా? అని అనునకొనుచుండిరి.
సోమనాధుడు సంతోషముతో పుంసవనము, సీమంతము అను గర్భవతికి చేయతగిన సంస్కారములను గావించెను. గంగాబాయి, గురుమూర్తి ఆజ్ఞప్రకారము ముత్తయిదువలకు
వాయినములిచ్చెను. గ్రామస్థులు ఆమె నెరిసిన
తలకట్టుతో సంతోషముగ వాయినములొసగుట చూచి ఇట్లనుకొనుచుండిరి. ఆమె ఎంత అదృష్టవంతురాలు. గురుమూర్తి ఆమెకు
ప్రసన్నుడయ్యెను. త్రిమూర్తి స్వరూపులగు
దత్తాత్రేయుల వారు నృసింహసర్వతి రూపమున భక్తులనుద్ధరించుట కవతరించిరి. గురుమూర్తిని భక్తితో నర్చించువారికి చతుర్విధ
పురుషార్ధములు సులభసాధ్యములనుటలో సందియములేదు అని అందరు చెప్పుకొనుచుండిరి. ఆమెయు స్త్రీలకు వాయినములిచ్చి గురుమూర్తిని
సమీపించి నమస్కరించి స్వామీ! మీ అనుగ్రహము వలన పవిత్రురాలనియితిని. మీరు అనాధలకు నాధులు. త్రిమూర్తి స్వరూపులు విభో! జయజయ అని స్తుతించి
వారి అనుమతినొంది గృహమునకేగి కొంతకాలమునకు ఆమెకు నవమాసములు నిండ ఒక శుభదినమున
శుభసమయమున ఆడ శిశువు జన్మించెను.
జ్యోతిష్కులు జన్మ లగ్నము చూచి ఈ కన్యక అష్ట పుత్రులు కలదగును. ఈమె వలన సంతాన వృద్ధి కాగలదు అనిరి. సోమనాధుడు వారల సత్కరించెను. సూతకము వెళ్ళగా స్నానమొనర్చి భార్యాభర్తలు
కుమార్తెను వెంటనిడికొని గురుమూర్తిని సమీపించి గురుమూర్తి పాదముల సమీపమున
పుత్రికనునుంచి భక్తిభావముతో సాష్టాంగవందనమాచరించిరి. గురుమూర్తి వారలనోదార్చిరి. అప్పుడామె స్వామీ! మీ ఆజ్ఞ ప్రకారము సరస్వతి
ఉదయించెను. పుత్రుని కూడ ననుగ్రహించుడన
గురుమూర్తి ఆమెతో సంశయింపకుము.
పుత్రుడుకూడ మీకు కలుగగలడని ఆశీర్వదించిరి. ఆ కన్యకను తీసికొని దంపతులతో అచ్చటి వారలు
వినుచుండ నాకన్య లక్షణములు ఇటుల చెప్పుచున్నారు.
ఈమె దీర్ఘ సుమంగళియై పుత్ర పౌత్రులగాంచును. వేదపారంగుడై జ్ఞాని యైన భర్త ఈమెకు
లభించును. ఈమె వంశము ఐశ్వర్యముతో
తులతూగును. ఈమె పాతివ్రత్యము, ధర్మశీలత చూచి దక్షిణదేశపు చక్రవర్తి ఈమె దర్శనము
చేయగలందులకు రాగలడు అన చెప్ప ఆమె స్వామీ! నాకుపుత్రునిగూడ అనుగ్రహించుడన
గురుమూర్తి ఆమెతో యోగ్యుడగు అల్పాయుష్మంతుడైన వాడు కావలయునా? లేక మూర్ఖుడైన దీర్ఘాయువు గావలయునా చెప్పుమనిరి.
ఆమె స్వామీ! నాకు యోగ్యుడగు కకుమారుడు కావలయును.
అతనికి అయిదుగురు సంతానముండవలయును.
అనియన స్వామివారు నవ్వి అట్లే కాకలదని అనుగ్రహించిరి. దంపతులు గురుమూర్తి అనుమతినొంది గృహమునకు
పోయిరి. వారికి అచిరకాలముననే ఒక పుత్రుడు
కలిగెను. గురుమూర్తి ఆశీర్వదించినరీతిని
అతడు వేద శాస్త్ర పారంగతుడయి అయిదుగురు పుత్రులు కలవాడయ్యెను. ఆకన్యకగూడ విద్వాంసుడు, జ్ఞాని యగు దక్షితుడు అనువారుభర్తగా లభించెను. ఇట్లందరూ
గురుమూర్తి కృపకు పాత్రులగుటచే నైహికగముగ సర్వసుఖముల ననుభవించిరి. కాన ఓ నామధారకా గురు కృప యన నిట్టిది. ఎవరికి మనో నిశ్చయము దృఢముగానుండునో వారికి ఫల
సిద్ధి తక్షణమే లభించును గాన ప్రతివారును నిర్వ్యాజమయిన భక్తితో గురు సేవ చేసి
ధన్యులు కావలసినదని నామధారకునితో సిద్ధముని గురు చరిత్రమునందలి ముప్పది తొమ్మిదవ
అధ్యాయమును చెప్పెను.
ఇట్లు గురుచరిత్రమున ముప్పది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
నలుబదియవ అధ్యాయము
శ్రీసద్గురు పరబ్రహ్మాణేనమః శ్రీజగద్గురు నృసింహ సరస్వత్వై
నమః
గురుదేవ! జయజయ. మీరు భక్తవత్సలురు. మీ ఖ్యాతి దిగంత ఖ్యాతిగాంచి
యున్నది. మీరు పరంజ్యోతి స్వరూపులు. నేను
భూమి యందు జన్మించితిని గాని నాజన్మ పాషాణమువలె వ్యర్థమయ్యెను. కుష్ఠురోగి నని
అందరు నన్ను నిందించుచున్నారు. వేదమును పఠించితిని. అయినను అంగహీనుడనగుటచే
నన్నెవ్వరును భోజనమునకైనను పిలుచుటలేదు. ప్రొద్దున లేచి ఎవ్వరును నాముఖమైన
వీక్షించరు. ఇట్టనేను బ్రతికి ఏమి ప్రయోజనము. వెనుకటి జన్మమున ఏదియో పాప మొనర్చి
యున్నందున ఇట్టి వ్యాధిచే బాధనొందుచున్నాను. వ్రతములు ఆచరించి,
తీర్ధములు
సేవించి, దేవతల కొలిచితికాని
వ్యాధి శమించదయ్యెను. తమ ఖ్యాతి విని తమ
వద్దకు వచ్చితిని. తమరు ఈ దీనునియందు కృప
చూపరేని నిశ్చయముగ ప్రాణముల విడిచెదననెను.
అప్పుడు భక్త వత్సలుడగు గురుమూర్తి అతనిని కరుణించి ఇట్లు చెప్పిరి. ఓ బ్రాహ్మణా! నీ దోషము నశించి నీ దేహము దివ్య
దేహము కాగలదు. అందుకు నేనొక ఉపాయము
చెప్పెద. ఆచరించుమని అనుచుండ నా
మార్గముననొకడు నాలుగు సంవత్సరముల క్రింద నరకబడి ఎండిన మేడి కొమ్మనొకదానిని
తీసికొని పోవుచుండ గురుమూర్తి వీక్షించి ఆ బ్రాహ్మణునితో నీవు అతని వద్దనుండి ఆ
కాష్టమును కొని తీసికొని సంగమముననున్న సంగమేశ్వరుని ఎదుట పాతి, నిత్యము స్నానమొనర్చి అశ్వత్థ వృక్షమును పూజించి
తిరిగి స్నానమొనర్చి జలపూర్ణములయిన రెండు కలశములతో త్రికాలములయందు ఈ మేడి కొమ్మకు
అభిషేకమొనర్చుము. ఇట్లు చేయుచుండ నేదినము
ఈ కట్టె పల్లవించి వృక్షమగునో ఆనాటికి ఆ పాపము నిశ్శేషముగ నశించును. నీవప్పుడుశోభనాంగుడవయ్యెదవు అనిరి.
ఆ బ్రాహ్మణుడు గురుమూర్తి వాక్యమును శిరసావహించి ఆ ఎండిన
మేడి కఱ్ఱను కొని తీసికొనిపోయి సంగమముచేరి, సంమేశ్వరుని ఎదుట పాతి, గురుమూర్తి చెప్పినటుల నిశ్చలమయిన భక్తితో ఆహారమునుగూడ
త్యజించి ఆకాష్టమునే సేవించుచుండెను.
ఇట్లు ఏడు దినములు గడిచెను.
అతని ఘోరమయిన దీక్షను చూచి అచ్చటి బ్రాహ్మణులు అతనితో
ఇట్లనిరి. ఓయీ! ఈ ఎండిన కట్టె నిట్లెందుకు
తడుపుచున్నావు? ఈ కట్టె వృక్షమగునా? గురుమూర్తి దయా స్వరూపుడు గాన నీతో నీవ్యాధి కుదురునది
కాదని చెప్పజాలక ఈ మేడి కట్టెను సేవించమని చెప్పెగాని ఈ కఱ్ఱ వృక్షమగుట కల్ల. నీ
వ్యాధి నశించుటయు కల్ల. వ్యర్ధముగ
శ్రమచేసెదవేల అన వారి మాటలు విని ఆ బ్రాహ్మణుడు ఇట్లనుచుండెను.
గురువాక్యము కామధేనువు.
గురుమూర్తి సత్య సంకల్పుడు. వారి
వాక్యము ఎన్నడు వ్యర్ధము కాజాలదు. నాకట్టి
నిశ్చయము కలదు. ఈ కాష్టము తప్పక
వృక్షముగాగలదు. నా ప్రాణములున్నంత దనుక
గురుమూర్తి ఆజ్ఞ ప్రకారము నడిచెదను. ఇది
నా దృఢ నిశ్చయమని చెప్పి ఆ శుష్క కాష్టమునే గురూక్తరీతిని భక్తితో సేవించు
చుండెను.
ఒక దినమున స్వామివారి శిష్యులు గురుమూర్తిని సమీపించి
స్వామీ తమరు ఆ బ్రాహ్మణునకు శుష్క కాష్టమును సేవించుమని ఆజ్ఞనిచ్చితిరి. అతను ఉపవాస వ్రతముతో నీరైన త్రాగక ఆ కాష్టమునే
సేవించుచున్నాడు. మేము వద్దని
నివారించినను నాకను గురువాక్యమే ప్రమాణము.
గురుమూర్తియే వారి వాక్యమును సత్యము చేసికొనగలరు. కాన నా ప్రాణములున్నంతవరకు నా కర్తవ్యమును
మాననని చెప్పుచున్నాడని అనిరి. శిష్యుల
వాక్యము విని గురుమూర్తి ఎవరికి ఎట్టి భావము కలదో వారికి వారి భావముననుసరించియే ఫల
సిద్ధికలుగుచుండును. గురువాక్యమందలి
విశ్వాసమే శిష్యునకు కార్య సిద్ధికి హేతువగును.
ఈ విషయమును మీకు తెలియగలందులకుగాను స్కాందపురాణమునందలి ఒక కధను
చెప్పెదవినుడు.
పూర్వము నైమిశారణ్యమున ఋషులు సూతుని గురుభక్తి ప్రభావమును
గూర్చి ప్రశ్నించ సూతుల వారు వారితో ఇట్లు చెప్పుచున్నారు. ఋషులారా! వినుడు. గురుభక్తితో సమమగు సంసారమునుండి తరింపచేసెడి
సాధనము మరియెకటి లేదు. గురువు యోగ్యుడా అయోగ్యుడా అని విమర్శ శిష్యుడు
చేయరాదు. గురువును బ్రహ్మ స్వరూపముగ
భావించి భక్తితో సేవించవలయును. గురుభక్తి
గలవారికి సర్వము క్షణకాలములో సిద్ధించును.
గురువు నెవ్వరు మనుష్య బుద్ధితో చూడక త్రిమూర్తి స్వరూపముగ భావించి
సేవింతురో వారి పట్ల శూలపాణి
ప్రసన్నుడగును. మంత్రము, బ్రాహ్మణుడు, దేవుడు,
దైవజ్ఞుడు, వైద్యుడు, గురువు వీరలయందెవ్వరికెట్టి భావముండునో వారికి తదనురూపముగ
ఫలసిద్ధిగాగలదు. ఇందులకు నిదర్శనముగ మీకొక
ఇతిహాసము చెప్పెద వినుడు.
పూర్వము పాంచాల నగరమున సింహకేతువు అను రాజు కలడు. అతనికి ధనంజయుడను పుత్రడు కలడు. ధనంజయుడొకనాడు అడవికి వేటకు పోయెను. నిర్మానుష్యమయి కీకారణ్యమున ఒక కిరాత దూతతో సహ
వేటాడి తిరిగి వచ్చుచు అచ్చటనొక జీర్ణమయిన శివాలయమును గాంచెను. శబరుడచట పడి ఉన్న శివలింగమును తీసికొని
రాజకుమారుని సమీపించి అతనితో నాకు శివపూజ చేసుకొనవలయునని కోరిక కలదు. తమరినే గురువుగ స్వీకరించున్నాను. పూజించు విధానమును సెలవిండన రాజు అతనితో ఇట్లు
చెప్పుచున్నాడు.
ఓ శబరుడా! ఈ లింగమును గృహమునకు కొనిపోయి శుచియగు స్థలమున
ఉంచి భార్యా సమేతుడవై నిత్యము సావధానముతో గంధపుష్పాద్యుపచారములచే పూజించి ధూప
దీపములర్పించి స్మశానమందలి చితాభస్మమును శివునకు నివేదించి మహానివేదననర్పించి
భార్యతో సహా శివుని ప్రసాదమును స్వీకరించుము.
అట్లు చేసితివేని శివుడు ప్రసన్నుడగును.
అని చెప్ప శబరుడు రాజకుమారుని గురువుగ భావించి అతని ఉపదేశమును శిరసావహించి
గృహమునకేగి భార్యా సమేతుడై నిత్యము శివలింగమును గురూపదిష్ట మార్గమున పూజించు
చుండెను. నిత్యము స్మశానమునకేగి
చితాభస్మమును తెచ్చి శివుని భక్తితో పూజించుచుండెను. శబరియు భర్తతో కలసి నిత్యము శివుని పూజించుచు
శివుని ప్రసాదమును భక్తితో స్వీకరించుచుండెడిది.
ఇట్లుండ ఒకనాడు అతనికి స్మశానమున చితాభస్మము కనిపించదయ్యెను. చుట్టు పక్కల గ్రామమునందలి స్మశానముల శోధించెను
కానీ ఎందును అతనికి చితాభస్మము లేశమయినను లభించదయ్యెను. అప్పుడతడు ఖిన్నుడయి ఇంటికి చనుదెంచి భార్యతో
నేనేమి చేయుదును. నీకీనాడెచ్చట చితాభస్మము
లభించదయ్యెను. గురువు చెప్పిన రీతిని నేను
నేడు శివపూజనాచరించనయితిని. ఇక బ్రతికి
ఏమి ప్రయోజనము. గురువాక్యముల్లంఘించిన వారికినరకము, దారిద్య్రము, అధోగతియు సిద్ధించును. కాన నేను
ప్రాణముల త్యజించెదనన శబరి అతనితో నిట్లనుచున్నది. మీరు వ్యర్ధముగ ఎందుకు చింతించెదరు?
మీకు
నేను చితా భస్మము నిచ్చెద. నన్ను
దగ్ధమొనర్చి అట్టి భస్మమును శివునకర్పించుడు.
వ్రత భంగము మాత్రము చేయరాదు. నేను
సంతోషముతో చెప్పుచున్నాను. ఉత్పన్నమయిన ఈ
దేహమెన్నటికైన నశించునదియే. కాన శివుని
ప్రీతిగ ఈ దేహమర్పించి ధన్యురాలయ్యెదనన భార్యమాటలు విని ఆ శబరుడు బాధపడి
ఇట్లనుచున్నాడు. ప్రాణ ప్రియా! నీప్రాణము
నేనెట్లు హరించెద? సూర్య చంద్రుల సాక్షిగ
నిన్ను వరించితిని. నీ తల్లి తండ్రులు
నన్ను స్త్రీ హంతకుడని దూషింపరా? శరీరములుండినగదా ధర్మములాచరించుట. నిన్ను దగ్ధమొనర్చిన నాకు పాపమే ఘటించునుగానీ
శివుడు సంతసించునా! అనియన ఆ శబరి భర్తతో మీరు మాయామోహములలో పడి ఇట్లు విలపించుట
ధర్మము కాదు. మీకింత అజ్ఞానమేల ఈ శరీరము
స్వప్న దృష్ట శరీరమువలెను, జలబుద్బుదుము వలెను
నశ్వరమయినది. జన్మించువారెప్పటికైనను
మరణించుటయే నిశ్చయము. నా
తల్లితండ్రులెప్పుడు నన్ను మీకర్పించిరో అప్పుడే మీకు అర్ధాంగినయితిని. అట్టి నాయందు భిన్న భావమేల? కాన భేద భ్రమవిడిచి నాదేహమును భస్మమొనర్చి శివుని
పూజించుడు. శివుడు ప్రసన్నుడు కాగలడని
చెప్పి భర్త ఎంత బోధించినను వినక గృహము ప్రవేశించి ద్వారమును బంధించుకొని గృహమును
దగ్ధమొనర్చుడని చెప్ప ఆ శబరుడు సంతసించి ధీరుడై గృహమును ప్రజ్వలింపచేసెను. క్షణ మాత్రమున గృహము భస్మమయ్యెను. అప్పుడతను నిత్యము వలె శివుని పూజించి ఆనంద
నిమగ్నుడై భార్య దగ్ధమయ్యెనను మాట మఱచి చితాభస్మమును శివునికర్పించి
శివప్రసాదమును చేతబూని నిత్యము ప్రసాదము స్వీకరించు నిమిత్తము భార్యను పిలుచు
వాడుకరీతిని ఆనాడును శబరీ! వచ్చి ప్రసాదమును కొనిపోమ్ము అని అనెను. వెంటనే కృపానిధియగు శివుడు
ప్రసన్నుడయ్యెను. గృహము గృహముగానే
ఉండెను. అందుండి శబరి నిజరూపముతో వచ్చి
ప్రసాదమును గ్రహించెను. శబరుడు
విస్మితుడయి భార్యతో నేను నిన్ను స్వయముగ దగ్ధమొనర్చితిని కదా! తిరిగి ఎట్లు
జీవించితివని అడుగ ఆమె మీరు గృహమునకెప్పుడు నిప్పు పెట్టితిరో ఆ క్షణముననే నాకు
గాఢమగు నిద్రపట్టెను. ఇప్పుడు మీ పిలుపు
విని నిద్రనుండి లేచి వచ్చితిని. ఇది
అంతయు శివ లీలయై ఉండును. అని చెప్పుచుండ
శివుడచ్చట ప్రత్యక్షమయ్యెను. దంపతులు
శివుని పాదముల మీద పడి నమస్కరించిరి.
శివుడు వారి భక్తికి సంతసించి ఇహలోకమున అఖండ సౌఖ్యమును, పరత్ర సద్గతియ ననుగ్రహించెను. కాన ఓ ఋషులారా! గురూక్తియందు
విశ్వాసముంచువారికి మనోరధము తప్పక సిద్ధించునని సూతుడు శౌనకాది ఋషులకు
చెప్పెనని గురుమూర్తి శిష్యులతో గురుభక్తి
ప్రభావమును చెప్పి, ఆ బ్రాహ్మణుడు నా
వాక్యమందు విశ్వాసముంచి, శుష్క కాష్టమును
భజించుచున్నాడు. కార్య సిద్ధి భావము మీద ఆధారపడిఉండును. కాన అతనికి
కార్య సిద్ధికాగలదు. అని చెప్పి
దయా సముద్రుడగు గురుమూర్తి సంగమమునకు వెళ్ళి అతని
భక్తికి అచ్చెరువంది కమండలోదకమును చేతబూని ఆ శుష్క కాష్టమును ప్రోక్షించ
అది క్షణమాత్రమున పల్లవించి అద్భుతముగ ఉదుంబర వృక్షమయ్యెను. అదేక్షణమున ఆ కుష్టురోగియు
సువర్ణాంగుడయ్యెను. ఇద అంతయు ఓ నామధారకా!
నేను కనులారా చూచితిని. అప్పుడా
బ్రాహ్మణుడు సంతసించి ప్రణమిల్లి పులకితాంగుడై ఆనందాశ్రువుల కార్చుచు ఈ క్రింది
విధముగ స్తుతించెను.
శ్రీ
నృసింహ సర్వతీ స్తోత్రము:
(1) శ్లో|| ఇందుకోటి తేజకరుణ సింధు భక్తవత్సలం
నందనాత్రి
సూనుదత్త మిందిరాక్ష శ్రీగురుం
గంధమాల్య
అక్షతాదిబృంద దేవవందితం
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం||
శ్లో|| కోట్యర్కభం కోటిసుచంద్రకాంతం
విశ్వాశ్రయం దేవగణార్చితాంఘ్రిం
భక్తప్రియం త్వత్రిసుతం వరేణ్యం
వందే నృసింహేశ్వర పాహిమాంత్వం||
తా|| కోటిసూర్యులు
కోటిచంద్రులతో సమమగు కాంతి కలిగివిశ్వాశ్రయమై, దేవతలచేతను పూజింపబడెడి భక్తిప్రియుడై, భక్తులకు వరము లొసగెడి అత్రి అనసూయలకు తనయుడై
యుండి కలియుగమున ధర్మసంస్థాపనకుగాను అవతరించిన ఓనృసింహసరస్వతీ స్వామీ నీకు వందనము
నన్ను రక్షింపుము.
(2) శ్లో|| మోహపాశ అంధకార జాతదూర భాస్కరం
ఆయతాక్షపాహిశ్రీయావల్లభేశనాయకం
సేవ్యభక్త బృందవరద
భూయభూయనమామ్యహం
వందయామి నారసింహ
సరస్వతీశ పాహిమాం
శ్లో|| మాయాతమోర్కం విగుణం గుణాఢ్యం
శ్రీ వల్లభం స్వీకృత భిక్షవేషం
సద్భక్తసేవ్యం వరదం పరిష్ఠం
వందేనృసింహేశ్వర పాహిమాంత్వం.
తా|| మాయాపాశమను అంధకారములో
నున్న భక్తులకు సూర్యుడవై నట్టియు, విశాలములైన నేత్రములు కలిగి,
లక్ష్మిపతివై సేవించు భక్తబృందమునకు శ్రేష్టములైన వరంబు
లొసగెడి ఓ నృసింహ సరస్వతీ స్వామీ నీకు మాటిమాటికి నమస్కారము. నన్ను రక్షింపుము.
(3) శ్లో||
చిత్తజాతవర్గషష్క
మత్తవారణాంకుశం
సత్యసారశోభితాత్మ దత్త
శ్రీయావల్లభం
ఉత్తమావతారభూత కర్తృ భక్తవత్సలం
వందయామి నారసింహసరస్వతీశ
పాహిమాం.
శ్లో|| కామాది షణ్మత్త గజాంకుశంత్వాం, ఆనందకండం పరతత్వరూపం
సద్ధర్మగు ప్త్యైవిధృతావతారం
వందేనృసింహేశ్వర పాహిమాంత్వం
తా|| చిత్తమందుదయించెడి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనెడి మదపుటేనుగలకు అంకుశమైనట్టియు, భక్తులందలి వాత్సల్యముతో శుద్ధసత్వమునుపాధిగ స్వీకరించి
అత్యద్భుతమగు యత్యవతారము ధరించిన ఓ నృసింహ సరస్వతీ స్వామీ! నీకు వందనము.
శ్లో|| వ్యోమవాయుతేజ ఆపభూమి కర్తృమీశ్వరం
కామక్రోధ మోహరహీత
సోమసూర్యలోచనం
కామితార్థ దాతృభక్త కామధేను
శ్రీగురుం
వందయామి
నారసింహ సరస్వతీశ పాహిమాం.
శ్లో||
సూర్యేందుగుం, సజ్జనకామధేనుం, మృషోద్యపంచాత్మక భూతమస్మాత్,
ఉదేతిమస్మిన్ రమతేసమేతి వందే, నృసింహేశ్వర పాహిమాంత్వం,
తా|| పంచభూతాత్మకమైన
జగమునకు కర్తలై యుండియు, రాగద్వేషములు లేని
భక్తులకు కామధేనువై వారికి కామితార్థముల నొసగెడి సూర్యచంద్రులు నేత్రములుగా గల
ఓగురుమూర్తీ ! నృసింహసరస్వతీ! ఈశ్వరా! నీకు వందనము, నన్ను రక్షింపుము.
(5) శ్లో|| పుండరీక ఆయతాక్షకుండలేందు తేజసం
చండదురిత ఖండనార్థ దండధారి
శ్రీగురుం
మండలీకమౌళి మార్తాండ భాసితాననం
వందయామి నారసింహ సరస్వతీశ
పాహీమాం
శ్లో|| రక్తాబ్జపత్రాయతకాంత నేత్రం, సద్ధండకుండీ పరిహాపితాఘం
శ్రితస్మిత జ్యోత్స్నముఖేందు శోభం, వందేనృసింహేశ్వర పాహిమాంత్వం||
తా|| కమలములవలె విశాలములైన
నేత్రములు కలిగి, చంద్రుని వలె
నాహ్లాదకరమైన ముఖారవిందముతో నొప్పుచూ భక్తుల ప్రచండ దురితముల పారదోలుటకా యనునటుల
దండమును ధరించి కమంలువును హస్తమున గలిగి యతి వేషముననున్న ఓ శ్రీహరీ! నృసింహ
సరస్వతీ స్వామీ! నీకు వందనము నన్ను రక్షింపుము.
(6) శ్లో|| వేద శాస్త్ర సుత్య పాద మాదిమూర్తి శ్రీగురుం
నాద బిందు కళాతీత కల్పపాద సేవ్యయం
సేవ్య భక్త బృందవరద భూయభూయ నమామ్యహం
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం
శ్లో|| నిత్యాంత్రయీ మృగ్య పదాబ్జ ధూళిం, నినాద సద్బిందు కళాస్వరూపం
త్రితాపతప్తాశ్రిత కల్ప వృక్షం, వందే నృసింహేశ్వర పాహిమాం త్వం
తా|| వేద శాస్త్రములచే
స్తుతించబడు పాదపద్మములు గలవాడవై
నాదబిందు కళలు స్వరూపముగాగలవాడవై యుండియు వాటి కతీతుడవై తాపత్రయములచే
పీడింపబడుచు సేవించెడి భక్తులకు కల్పవృక్షమై విరాజిల్లెడి ఓ నృసింహసర్వతీ స్వామీ!
మాటిమాటికి నమస్కృతులు గావించెద. నన్ను
రక్షింపుము.
(7) శ్లో|| అష్టయోగ తత్త్వ నిష్టతుష్టజ్ఞానవారిధిం
కృష్ణవేణీ తీరవాస పంచనదీ సంగమం
కష్టదైన్య దీనభక్త తుష్టకామ్యదాయకం
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం
శ్లో|| దైన్యాది భీకష్టదవాగ్నిమీడ్యం, యోగాష్టక జ్ఞానసమర్పణోత్కం
కృష్ణా నదీ పంచసరిద్యుతిస్థం, వందే నృసింహేశ్వర పాహిమాం త్వం
తా|| జ్ఞానాంబుధివై భక్తులు
స్మరించినంతనే సంతసించి వారలకు అష్టాంగయోగసిద్ధి ననుగ్రహించుచు అష్టకష్టములతో
బాధనొందుచూ దీనుడై శరణునొందిన భక్తులకు సమస్త కామ్యముల నొసంగుచూ కృష్ణానదీ
తీరమందలి నరసింహవాడి(అమరపురము) క్షేత్రమున నివసించి భక్తుల నుద్ధరించిన
శ్రీనృసింహసర్వతీ స్వామీ! నీకు వందనము. నన్ను రక్షింపుము.
శ్లో|| నారసింహ సరస్వతీశ
అష్టకంచ యః పఠేత్
ఘోర సంసార సింధు తారణాఖ్య సాధనం
సారజ్ఞాన దీర్ఘఆయురారోగ్యాది సంపదాం
చారు వర్గ కామ్యలాభ నిత్యమేవయః పఠేత్
శ్లో|| అనాదిమధ్యాంత మనంత శక్తిం అతర్క్యభావం పరమాత్మ
సంజ్ఞం
వ్యతీత వాగ్దుృక్పధ మద్వితీయం, వందే నృసింహేశ్వర పాహిమాం త్వం
ఫలశృతి: యోనృసింహసరస్వత్యా
అష్టకం పఠతీహసః
దీర్ఘాయుః సంసృతిం తీర్త్వాభీష్టం లబ్ద్వామృతం లభేత్
తా|| అనంత శక్తిగలవాడవై
జగముయొక్త ఆది మధ్యాంతములయందు ఏకరూపమున విరాజిల్లుచూ అవాజ్ఞానగోచరుడవైన ఓ
శ్రీనృసింహసర్వతీ! సద్గురుమూర్తీ నీకు వందనమాచరించెదను. నన్ను రక్షింపుము.
ఫలశృతి: ఘోరమైన సంసారమునుండి తరింపచేయ సమర్ధమైన
ఈఅష్టక స్తోత్రము నెవ్వరు నిత్యము పఠింతురో వారు చతుర్విధ పురుషార్ధములను, దీర్ఘాయుష్యమును, ఆరోగ్యమును, సంపత్తును గూడ బడయుదురు.
ఇట్లు నరహరియను ఆబ్రాహ్మాణుడు గురుమూర్తిని స్తుతించి
భక్తితో నమస్కరించెను. గురునాథుడాతని భక్త్యుద్రేకమునకు సంతసించి
జ్ఞానరాశిబికమ్మని యాశీర్వదించిరి. ఎండిన కాష్టము వృక్షమగుటయు, కుష్ఠురోగియగు బ్రాహ్మాణుడు దివ్యాంగుడగుటయు నచటి
జనులు చూచి విస్మయమునొంది గురుమూర్తిని భక్తిభావనలతో ననేక విధముల స్తుతించిరి.
గురుమూర్తి అందరితోడను కలిసి సంగమమునుండి గణగాపురమునందలి తమ నిర్గుణమఠము
ప్రవేశించిరి. అందరు వారిని భక్తితో పూజించిరి. నరహరి బ్రాహ్మాణుడు సంతోషముతో
ఆగ్రామమందలి మావన్మంది స్త్రీ పురుషులకు సంతర్పణ చేసెను. అప్పుడు గురుమూర్తి
అతనిని దగ్గరకు పిలిపించి నీవు నాభక్తుడవు నీకు ఐహికాముష్మిక సుఖముల ననుగ్రహించితిని.
నీ సంతానము లోకమున విస్తృతిగాంచును. అని ఆశీర్వదించి అతనికి అష్టాంగయోగముపదేశించి
మోగీశ్వరుడని నామకరణ మొనర్చిరి. నీవు చింతించకుము. నేనుచెప్పిునట్లు చేయుము. నీ
కుష్ఠురోగము పోయెనుగాన శీఘ్రముగ గృమున కేగి దారాపుత్రాదుల తీసికొనివచ్చి
నాసన్నిధినే నివసించుము. నీకుశుభమగును. నీకు పుత్రులు కలిగెదరు. వారు
నన్నర్చింతురు. మీవంశమువారందరు నాకు భక్తులైయుండును. అని చెప్పి అతనికి
మంత్రరాజమైన విద్యాసరస్వతీమంత్రము నుపదేశించిరి. నరహరియను బ్రాహ్మణుగు గురుమూర్తి
చెప్పినటుల ఆచరించి గురుకృపకు పాత్రుడయ్యెను.
ఇట్లు గురుచరితమున నలుబదియవఅధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
నలుబదియొకటవ అధ్యాయము
జయ జయ శ్రీ నృసింహ సరస్వతీ
నామధారకుడు బద్ధాంజలియై సిద్ధమునితో యోగిపుంగవా! జయజయ. మీవలన రసవంతమైన గురుచరితము విని
ధన్యుడనైతిని. నేనిప్పుడొక ప్రశ్న
వేయుచున్నాను. మాపూర్వీకుడైన సాయందేవుడు
గురుమూర్తిని భక్తితో సేవించెనని వింటిని.
అతనెటుల స్వామివారికి శిష్యుడై వారిని సేవించెనో సెలవిండన ప్రశ్నించ
సిద్ధముని ఇట్లనుచున్నాడు.
నామధారకా సావధానుడవై విస్తరించి నేను చెప్పు గురుచరితమును
వినుము. పూర్వము నావలన నీగురుచరితమునందు
గోదావరీ తీరమున వాసరక్షేత్రమున నీపూర్వీకుడైన సాయందేవుడు గురుమూర్తిని భక్తితో
పూజించుటయు గురుమూర్తి ప్రేమకు పాత్రుడగుటయు వింటివి. స్వామివారు ఆ తరువాత అనేక దేశములు పర్యటించి
అచ్చటి భక్తులనుద్ధరించి గంధర్వనగరము చేరిన తదుపరి వారికీర్తి దశదిశల
వ్యాపించెను. సకాములై భక్తులు వచ్చి
పూర్ణకాములగుచుంటిరి. గంధర్వనగరమున
స్వామివారు కలరను ఖ్యాతిని విని నీపూర్వీకుడైన సాయందేవుడు ఆనందభరితుడై భక్తితో
వారి దర్శనార్ధమొకదినమున గంధర్వనగరముకేతెంచెను.
దూరముగ గంధర్వనగరమును కని సాష్టాంగముగ నమస్కృతులు కావించుచు గ్రామము
ప్రవేశించి మఠమును సమీపించి పరాత్పర పరబ్రహ్మస్వరూపుడైన స్వామివారిని
దర్శించెను. సాష్టాంగముగ పాదములకు
నమస్కరించి తన శిరోజములతో స్వామివారి
పాదముల ధూళి తుడిచెను. చేతులు జోడించి
ఇట్లు స్తుతించెను.
స్వామీ! మీరు త్రిమూర్తి స్వరూపులు. మీ దర్శనము వలన నేను ధన్యుడనైతిని. మా పితరులు కృతార్ధులయిరి. మీ పాద దర్శనము వలన కోటి జన్మార్జిత పాపము నశించెను. సర్వ వ్యాపకా! హే సద్గురో! జగజ్యోతి స్వరూపా !
శ్రీ నరసింహ సరస్వతీ! జయజయ. ఓ భక్త వత్సలా ! నీ పాద మహిమ వర్ణింప నేనెంత
వాడను. నీ చరణములందే కోటి తీర్ధములు కలవు. మీరు బ్రహ్మమే యనదగి ఉన్నారు. అమృతపూర్ణ కమండలమును హస్తమున ధరించి అందలి
ఉదకమును ప్రోక్షించి మృతుల జీవింప చేయుచున్నారు.
స్వామీ! మీరు దండమును ధరించి విష్ణు స్వరూపులై భక్తులయొక్క దైన్యమును
దురితమును నశింపచేయుచున్నారు. మీరే శివ
స్వరూపులై భస్మ రుద్రాక్షలను ధరించి భక్తుల పాపముల నశింపజేయుదురు. మీ భక్తులకు మీరు చతుర్విధ పురుషార్ధముల
నిచ్చుచున్నారు. జగద్గురో! నరసింహ
సరస్వతీ! మీరు భవరోగముల నశింపచేయ సమర్ధులు.
మీ పాదములయందే సర్వ తీర్ధములు కలవు.
మీరు భక్తుల పాలిట కామధేనువులు.
మీరు ఉదకము ప్రోక్షించి
శుష్కకాష్ఠమును వృక్షముగానొనర్చితిరి.
గొడ్డుబోతు బఱ్ఱెను పాలిచ్చునట్లు చేసితిరి. వంధ్యకు సంతానమునిచ్చితిరి. అన్నపూర్ణ మీ సమక్షముననే కలదు. త్రివిక్రమభారతికి విశ్వరూప ప్రదర్శన మిచ్చితిరి. మీ మహిమ అపారము. మీరు త్రిమూర్తి స్వరూపులై
భక్తులనుద్ధరించుచున్నారు. ఇట్లు గద్గద
ధ్వనితో స్తుతించుచు ఆనందాశ్రువులతో, రోమాంచముతో మిగుల భక్తి చేసెను.
గురుమూర్తి అతని భక్తికి సంతసించి నీవు పరమ భక్తుడవని
చెప్పుచు అఘహరమైన హస్తము నతని శిరముననుంచిరి.
నీ భక్తికి సంతసించితిని. మీ వంశము వారందరు నాకు భక్తులు కాగలరు. నీవు
నాకు అతి ప్రియమగు భక్తుడవు.
తొందరగ సంగమమునకేగి స్నానమొనర్చి అశ్వత్థమును పూజించి మఠమునకు భోజనమునకు
రమ్మనిరి. సాయందేవుడును సంగమమునకేగి స్నానము
చేసి, అశ్వత్థమును పూజించి మఠమునకు
వచ్చి స్వామి వారిని షోడశోపచారములతో పూజించెను.
స్వామివారు అతనిని అందరి శిష్యులకన్న మిక్కిలి ప్రేమతో భిక్షాసమయమున తమ
ప్రక్కనే ఉంచుకొనిరి.
భోజనమైన తరువాత సాయందేవుని స్వామివారు తన వద్ద
కూర్చుండబెట్టుకొని ఇట్లు ప్రశ్నించిరి.
నీవు ప్రస్తుతమెక్కడ కుటుంబ సమేతముగా నుంటివి? అందరూ క్షేమమా అన అతడు
స్వామివారితో వినయముగా స్వామీ! మీ అనుగ్రహము వలన ఉత్తర కాంచీ గ్రామమున సకుటుంబముగ
క్షేమముగానే ఉన్నాను. పుత్రులు బంధువులు
సంసారమును దిద్దుకొనగలరు. మీ సేవ చేయుచు
మీ వద్దనే ఉండి ధన్యుడ గాదలచితిననెను.
అతని వాక్యము విని స్వామివారిట్లనుచున్నారు. భక్త కేసరా! నేనొకచోటనుండు వాడను కాను. ఇట్టి నా సేవ చేయుట కఠినము. ఒకచోట అరణ్యముననో మరియొక సమయమున గ్రామముననో
ఇచ్చ వచ్చినటుల సంచరించుచుందును. నా సేవ
వలన నీకు కష్టమే కలుగు అనిరి. అప్పుడు
సాయందేవుడు స్వామీ! నేను మిమ్ము సర్వాత్మనా శరణు పొంది వచ్చితిని. నన్ను విడనాడకుడు. గురు సేవ వలనగదా మానవుడు కృతార్ధుడగుట, చతుర్విధ పురుషార్ధములనొసగు గురు సేవ సుఖ
ప్రదముగాని దుఃఖప్రదమెట్లు కాగలదు? గురు సేవ చేయువారికి నరకమే
లేనప్పుడు దుఃఖమెట్లు రాగలదు? కాన నన్ను నిరాకరించక నా సేవను స్వీకరించి నన్ను ధన్యునిగా చేయుడని
మిక్కిలి భక్తితో ప్రార్ధించ గురుమూర్తి నీ కంతటి దృఢ దీక్ష ఉన్నచో నీ ఇష్ట
ప్రకారము నావద్దనుండి దాస్యమొనర్చుమని చెప్పిరి.
సాయందేవుడును సంతసించి భక్తితో వారిని సేవించుచుండెను. ఇట్లు మూడు నెలలు గడిచెను. గురుమూర్తి అతని దృఢ భక్తిని పరీక్షింపగోరి
సాయంకాల సమయమున శిష్యులనందర రావద్దని నిరాకరించి సాయందేవుని మాత్రము వెంటనిడుకొని
సంగమమునకు వెళ్ళిరి. సంగమము చేరి అశ్వత్థ
సమీపమున గురు శిష్యులిద్దరు సుఖాలాపములు జరుపుచుండిరి. ఇంతలో సూర్యుడస్తమించెను. అప్పుడు సాయందేవుని భక్తి నిష్ఠను స్వామివారు
పరీక్షింప దలచిరి.
స్వామివారి సంకల్ప మాత్రముచే గొప్ప ఝంఝామారుతము వీచసాగెను.
వృక్షములు పడిపోవసాగెను. ముసలములవంటి ధారలతో వర్షము కురియసాగెను. సాయందేవుడు
చలించని భక్తితో తన పైవస్త్రమును కప్పి స్వామివారిని రక్షించుచుండెను. ఇట్లు రెండు
జాములకు వర్షము తగ్గి గొప్ప శీతవాతము
వేయసాగెను. అప్పుడు స్వామివారు సాయందేవునితో చలిగాలి బాధించుచున్నది. నీవు
గ్రామమును కేగి నిప్పుపట్టుకొని రమ్ము. పోవునపుడుగాని, తిరిగి వచ్చునపుడు గాని పార్శ్వ భాగములు (ప్రక్కల)
చూడకుమనిరి. గుర్వాజ్ఞను శిరసావహించి ఆచీకటిలో బుదరలో పడుచు లేచుచు ఎట్లో గ్రామము
ప్రవేశించి గ్రామస్థుల నుండి కొంత నిప్పు నొక భాండమున తీసికొని, దానిని నెత్తిమీద పెట్టుకొని సంగమమునకు తిరిగి
వచ్చుచు గురుమూర్తి ప్రక్కల చూడ వద్దనిరి ఎందులకనియో అని విచారించుచు నొక ప్రక్క
చూడ ఐదు ఫణములతో నొక సర్పము తన వెంట వచ్చుచున్నటుల చూచి భయపడి మరియొక ప్రక్క
చూడనటువైపున గూడ నొక గొప్ప సర్పము వెంటవచ్చుట నతడు చూచి మిక్కిలి భయపడి
పరుగెత్తుచు ఎట్లో సంగమము చేరెను. అతనికి సంగమమున ననేక దీపముల ప్రకాశము. గొప్ప
వేదధ్వనియు వినబడెను. గురు సమక్షమునకు రాగ నదియంతయు అదృశ్యమై గురుమూర్తి యొక్కడే
అక్కడ అతనికి గోచరించెను. ఆకసము నిర్మలమై చంద్రునిచే శోభిల్లుచుండెను. స్వామివారి ఎదుట నగ్నిని ప్రజ్వలింపజేసి
భయకంపితుడగుచు వారి ఎదుట నిలువబడెను. అతని వెంట వచ్చిన సర్పములు స్వామివారి వద్దకు
వచ్చి వారి యాజ్ఞగైకొని వెడలి పోయెను.
అప్పుడు స్వామివారు అతనితో నీ రక్షణ కొరకే ఈ సర్పముల నీ వెంటనంపితిని
వ్యర్థముగ నెందులకు భయపడెదవని ఓదార్చుచు భయపడకుము. గురుభక్తి కఠినమని చెప్పితిగదా!
విచారించియే గురువును సేవింపవలెను. దృఢ నిష్టతో గురువును సేవించువాడు కలివలన గాని, కాలమువలనగాని భయపడ నవసరముండదని చెప్ప సాయందేవుడు
గురుమూర్తి పాదములకు నమస్కరించి స్వామీ నాకు గురుభక్తి దృడముగ నిలువ గలందులకు
గురుభక్తి ప్రభావమును బోధించుడని ప్రార్థింప గురుమూర్తి సంతసించి సాయందేవునితో
గురుభక్తి ప్రభావమునీ క్రింది విధముగ చెప్పుచున్నారు. సాయందేవా!
బ్రహ్మముహూర్తమునకు ఇంకను కొంత వ్యవధి కలదు. అంతదనుక నీకు గురుభక్తి ప్రభావమును
బోధించు కథనొక దానిని చెప్పుచున్నాను సావధానుడవై వినుము.
పూర్వమొక సమయమున కైలాస శిఖరమున పార్వతీ సమేతుడై శివుడు
కూర్చొని ఉండెను. అట్టి సమయమున పార్వతి
శివుని గుఱించి గురుభక్తిని విస్తరించి చెప్పుడని ప్రార్ధింప శివుడు పార్వతితో
ఇట్లు చెప్పుచున్నాడు.
గురు భక్తిచే సర్వము సిద్ధించును. శివుడే గురువను దృఢ భావముతో శిష్యుడు గురువును
సేవించవలయును. గురు భక్తిప్రభావము తెలియగలందులకు ప్రాచీనమైన ఇతిహాసమును చెప్పెద
వినుమని శివుడు పార్వతితో ఇటుల చెప్పుచున్నాడు.
జపములు అనుష్ఠానములు చిరకాలమనుష్ఠించిననే ఫలించును. గురుభక్తి అట్లుగాక తత్కాలముననే ఫలించును. తపములు, అనుష్ఠానములు, యజ్ఞములు, దానములు ఒక సమయమున
ఫలములేక పోగా విఘ్నములచే కొట్టబడుటయు సంభవించును.
గురుభక్తి అట్లుకాక తప్పక ఫలమిచ్చును.
అంతియుగాక గురుభక్తి యొనర్చువారికి యజ్ఞములు, దానములు చేసిన ఫలముకూడ రాగలదు. గురుభక్తి సులభము. ప్రయాసము లేనిది. కాని మనసును స్థిరపఱచుకొని దృఢభక్తితో గురుకుల
వాసమొనర్చవలయును. ఇందులకు నిదర్శనముగా నొక
కధను చెప్పెద వినుము.
పూర్వము త్వష్టృయను బ్రహ్మకొక కుమారుడు కలడు. ఆబాలుడు ధర్మశీలుడు, సుందరాంగుడు.
అతనికి తండ్రి ఎనిమిదవ సంవత్సరమున ఉపనయనమొనర్చి ఒక గురువు వద్ద గురుకుల
వాసము చేయ నియమించెను. ఇట్లుండ ఒక దినమున
గొప్ప గాలి వాన వచ్చి గురువుగారి పర్ణశాల కూలిపోయెను. అప్పుడా గురువు తన శిష్యుని పిలిచి నాకు
నివసించుటకు ఒక చక్కని భవనము నిర్మించుము.
ఆ గృహము సుందరముగా నుండవలయును.
గృహమునకు కావలసిన సౌకర్యములన్నియు అందుండ వలయును అనెను. ఇంతలో గురు పత్ని వచ్చి ఆ బాలునితో నాకొక మంచి
రవిక కావలయును. అది దారములతో
నేయబడరాదు. నా శరీరప్రమాణమునకు తగి మంచి
రంగులు కలదై ఉండవలయును అనెను.
గురుపుత్రుడు అతనితో నాకొక పాదరక్షల జత కావలయును. అవి పాదములకు సరిపోవలయును. వాటికి బురద అంటరాదు. నీటి మీదకూడ నడచుటకు వీలుగ ఉండవలయును. వాటిని ధరించి ఎక్కడికి పోవవలయునని కోరుకొనిన
వెంటనే అచ్చటికి తీసికొని పోవుటకు తగిఉండవలయును అనెను. ఇంతలో గురు పుత్రి ఆ బాలుని చేయి పట్టుకొని
నాకు మంచి అందమయిన కర్ణాభరణములు కావలయును. ఇంతియేగాక ఆడుకొనుటకు ఒకే ఏనుగు దంతముతో
చెక్కబడిన సుందరమైన బొమ్మరిల్లు తెచ్చిపెట్టుము.
వంట చేసికొనుటకు పాత్రసామాను తెచ్చి పెట్టుము. వాటితో వంట చేసినను మసి కాకూడదు అని
కోరెను.శిష్యుడు వారలకోరికల తీర్చ గలందులకు వారివద్ద సెలవు తీసికొని అరణ్యమార్గమున
పోవుచు ఇటుల చింతింపసాగెను. నేను
బ్రహ్మచారిని. ఏమియు తెలియని వాడను. నాగురువు, గురుపత్ని,
గురు
పుత్రుడు, గురు పుత్రికయు కోరిన
వాటిని నేనెట్లు సమకూర్చగలను?
భోజన
పత్రముల కూడ కుట్టుట చేతగాని నేను ఆ కార్యముల నెట్లు చేయ సమర్ధుడను?
నాకెవ్వరు
ఆధారము? గురువు కోరినటుల చేయనిచో గురువు కోపించును కదా? నేనెవరి శరణు వేడెదను. నాకు గురువే రక్షకుడు. ఆయనయే నాకుగతి. కృపానిధియగు గురు కరుణ నాయందుండిననే ఈ కార్యము
సిద్ధించ గలదని అనన్య భక్తితో గురుమూర్తిని శరణు పొంది ప్రాణము అర్పించి అయిన
గురుకార్యము సాధింప ఉద్యుక్తుడయి అరణ్య మార్గమున పోవుచుండ నాబాలునకు ఒక అవధూత గోచరించెను. ఆ అవధూత బాలుని సమీపించి నాయనా నీవెక్కడకు
పోవుచున్నావు? నీముఖము చింతాక్రాంతమై యున్నది. కారణమేమి
విస్తరించి చెప్పుమన ఆ బాలుడు అవధూతకు నమస్కరించి స్వామీ! మీరు నన్ను
రక్షించుడు. చింతాసముద్రమున మునిగి
ఉన్నాను. మీ దర్శనమువలన నాకు ఆనందము
లభించినది. చకోరములకు చంద్రుడు కనబడినటుల
నాకు మీ దర్శనమయ్యెను. నా పూర్వ పుణ్యము
మంచిదిగాననే నేడు మిమ్ముల చూడకలిగితిని. ఓ
దయాసముద్రా! మీ పేరేమి. మీరెక్కడనుంచి
వచ్చుచున్నారు. ఈ నిర్మానుష్యమైన
అరణ్యమున మిమ్ముల చూడ నాకు మీరు ఈశ్వరుడే కావచ్చునని తోచుచున్నది. మీ దర్శనముచే నా మనస్సు స్థిరపడినది. నన్ను మీ దాసునిగా భావించి ఓ దయాసముద్రా! నన్ను రక్షించి కాపాడుడని చెప్పి ఆ బాలుడు
అవధూత పాదముల శిరముంచి నమస్కరించెను. ఆ
అవధూతయు దయగలవాడై ఆబాలుని లేపి ఆలింగనమొనర్చి ఓదార్చి అతని వలన జరిగిన విషయమంతయు
విని చింతాక్రాంతుడైన ఆ బాలునకు అభయమిచ్చి ఆ బాలునితో ఓ బాలకా నేనొక విషయము
చెప్పెద. నీవు నేను
చెప్పినట్లాచరించితివేని నీ కార్యము సిద్ధించునని ఇట్లు చెప్పెను.
కాశీపట్టణమున విశ్వేశ్వరుడు కలడు. అట్టి విశ్వేశ్వరుని ఆరాధనమువలన సర్వాభీష్టములు
సిద్ధించగలవు. కాశీక్షేత్రము అయిదు
క్రోసుల విస్తీర్ణము కలదై ఉండును. అచ్చట
బ్రహ్మ విశ్వేశ్వరుని ఆరాధించి సృష్టిచేయు సామర్ధ్యమును బడసెను. విష్ణువుకూడ విశ్వేశ్వరుని ఆరాధించి జగమును
పరిపాలించు సామర్ధ్యమును గడించెను. నీవు
సందేహము విడనాడి కాశీపట్టణమునకు పొమ్ము.
నీ మనోరథము నెరవేరును. నీవే
విశ్వకర్మవు కాగలవు. శివుని
అనుగ్రహముండిన చతుర్విధపురుషార్ధములు అయత్నమున సిద్ధించగలవు. శివుడు దయా స్వరూపుడు. ఉపమన్యుడను ఒక భక్తుడు కొలది పాలకొఱకు సేవించ
అతనికి క్షీరసముద్రము మీదనే ఆధిపత్యమునొసగెను.
కాశీకి ఆనందకాననమనియు పేరుగలదు. అచ్చట శివుని ఉపాసించువారు పూర్ణ మనోరథులై
ఆనందమున తులతూగుదురు. కాననే దానికి
ఆనందకాననమనియు సార్ధకనామమేర్పడెను. కాశి
సమస్త ధర్మములకు రాశి. జీవులకది
మోక్షస్థానము. కాశీ క్షేత్రమున
నివసించినవారిని చూచిననే సమస్త దోషములు నశించును.
అట్టి క్షేత్రమహిమ వర్ణింప నెవరితరము? అట్టి క్షేత్రముండ బాలుడా నీకు చింత ఏమిటికి? కాశీక్షేత్రమునకు తీర్ధయాత్రపోవువారికి అడుగునకు
అశ్వమేధ ఫలము వచ్చును. ధర్మ
అర్ధకామమోక్షములను చతుర్విధ పురుషార్ధములు లభించును. సందేహింపనవసరము లేదు అన ఆ బాలుడు వారితో స్వామీ
నేనా అరణ్యమున ఉన్నాను. కాశీ ఎక్కడ ఉన్నదో
తెలియదు. ఈ సంసార సాగరమున మునిగిపోవుచున్న
నాకు మీరు తారకులుగ దర్శనమిచ్చిరి. నాకు
జ్ఞానముపదేశించి రక్షింపుడు. తరింప
చేయుడు. బాలుడను ఏమియు తెలియనివాడను తమరు
దయ ఉంచి నన్ను కాశీ క్షేత్రమునకు కొని పొండు అని వారి పాదముల మీద పడెను. అప్పుడా అవధూత బాలునితో నీవలన నాకు కాశీ వాసము
లభించును కాన నిన్ను తప్పక కాశీకి తీసికొని పోయెదను. అని చెప్పి బాలుని చేయి పట్టుకొని క్షణకాలములో
మనో వేగముతో కాశీ సమీపించి బాలునితో మనము కాశీకి వచ్చితిమి. నీవు యాత్ర సలుపుమన ఆ బాలుడు వారితో స్వామీ!
నేనేమియు తెలియని వాడను. కాశీ
యాత్రనేవిధముగ చేయవలయునో సెలవిండని ప్రార్ధింప నాఅవధూత కాశీయాత్ర విధానమును ఈ
క్రింది విధముగ చెప్పుచున్నాడు.
ప్రథమమున మణికర్ణిక యందు స్నానమొనర్చి వినాయకుని దర్శించి
పాంచాలేశ్వరునకు నమస్కరించి తరువాత విశ్వేశ్వరుని దర్శించ వలెను. తిరిగి గంగకు వెడలి మణికర్ణికేశ్వరుని పూజించి
కమలేశ్వరుని దర్శించి అనంతరము వాసుకేశ్వరుడు, పర్వతేశ్వరుడు, గంగా కేశవుడు, లలితాదేవి, జరాసంధేశ్వరుడు, సోమనాధుడు,
శూలకంఠేశ్వరుడు, వరాహేశ్వరుడు, బ్రహ్మేశ్వరి, అగస్తేశ్వరుడు, హరిహరేశ్వరుడు, వైద్యనాధుడు, ధృవేశ్వరుడు, గోకర్ణేశ్వరుడు, హాటకేశ్వరుడు వీరల
దర్శించి పూజించుము. అనంతరము
చిత్రగుప్తేశ్వరుడు, పశుపతేశ్వరుడు, చంద్రేశ్వరుడు, అగ్నీశ్వరుడు, నాగేశ్వరుడు, హరిశ్చంద్రేశ్వరుడు
వీరలను పూజించుము. చింతామణి వినాయకుని, సోమనాధ వినాయకుని దర్శించి పూజించుము. చతుర్వక్తేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, చండీశ్వరుడు వీరలను పూజించుము. భవానీ
శంకరులను పూజించి డుంఢిరాజుకు నమస్కరించి, రాజరాజేశ్వర, లాంగూలేశ్వర, నకులేశ్వరులను
పూజించుము. గంగేశ్వరుని పూజించి నవాపియందు
స్నానమొనర్చి జ్ఞానేశ్వరుని పూజించి నందికేశ్వరునికు నమస్కరించి మార్కండేశ్వరుని, తారకేశ్వరుని, మహాకాళేశ్వరుని, దండపాణిని, మోక్షేశ్వరుని, వీరభద్రేశ్వరుని పూజించి అవిముక్తేశ్వరుని సమీపించి
భక్తితో పూజించుము. పంచ వినాయకుల పూజించి
భైరవుని పూజించి మహాద్వారమునకు వచ్చి విశ్వనాధుని పూజించుము. ఈ విధమున అంతర్గృహ యాత్రమొనర్చి ముక్తి మండపము
ప్రవేశిచి శివా! నేను, నీ ప్రీతికొఱకు అంతర్గృహ యాత్రసలిపితిని. న్యూనాతిరిక్తముల క్షమించి ప్రసన్నుడవుకమ్ము
అని ప్రార్ధించుము. అచ్చట కొంచెము
విశ్రమించి అచ్చటనుండి లేచి విశ్వనాధునికి నమస్కరించి దక్షిణ మానస యాత్ర సలుపుము. అది ఎట్లన మణికర్ణికకు వెళ్ళి ఉత్తరావాహినిఅయిన
గంగ యందు స్నానమొనర్చి పంచవినాయకులకు నమస్కరించి డుంఢిరాజుని పూజించి భవానీ
శంకరులకు నమస్కరించి ధర్మకూపమున స్నానముచేసి అచ్చట తీర్ధ శ్రార్ధము చేసి
ధర్మేశ్వరుని పూజించుము. గంగాకేశవులను
పూజించి లలితాదేవిని పూజించుము.
జరాసంధేశ్వరునకు నమస్కరించి సోమనాధుని దర్శించి, వరాహేశ్వరుని పూజించి దశాశ్వమేధతీర్ధమున
స్నానమొనర్చుము. సీతలేశ్వరుని దర్శించి
బందీదేవిని పూజించి తిలభాండేశ్వరుని పూజించుము.
రేవా కుండమునను మానససరోవరమునను స్నానము చేయుము. అచ్చట శ్రార్ధమొనర్చి మానసేశ్వరుని పూజించుము
నీ మనోరధము నెఱవేఱును. కేదార కుండమున
స్నానమొనర్చి కేదారేశ్వరుని పూజించుము.
గౌరీ కుండమున స్నానమొనర్చుము.
వృద్ధకేదారేశ్వరుని హనుమంతేశ్వరుని పూజించుము. రామేశ్వరుని దర్శించి
కృమికుండమున స్నానము చేసి శ్రార్ధమొనర్చుము.
సిద్ధేశ్వరుని పూజించి స్వప్నకుండమున స్నానమొనర్చి స్వప్నేశ్వరుని పూజించి
తరువాత సంగమేశ్వరుని పూజించి లోలార్కకూపమున స్నానమొనర్చుము. తరువాత గతిప్రదేశ్వరుని దర్శించుము. అర్క వినాయకుని పరాశరేశ్వరుని పూజించుము. కురుక్షేత్రకుండమున స్నానము చేసి సువర్ణ దానము
మొదలగు దానములొనర్చుము. అమృతకుండమున
స్నానముచేసి దుర్గావినాయకుని పూజించి దుర్గాదేవిని పూజించి అనంతరము అరువదినాలుగు
యోగిగణముల దర్శించి నమస్కరింపుము. తరువాత
కుక్కుట ధ్వజునకు నమస్కరింపుము. కాశీలో
దక్షిణ భాగమున కుక్కుట ధ్వజుని దర్శించి పూజించిన వారికి దుష్ట స్వప్నములు
సుస్వప్నములు కాగలవు. తరువాత గౌరీ దేవిని
దర్శించి అచ్చట ఏడు గవ్వలనుంచుము. తరువాత
రేణుకను దర్శించుము. శంఖోద్ధారకుండమున
స్నానము చేసి శంఖవిష్ణువును పూజించుము.
కామాక్షీ కుండమున స్నానము చేసి కామాక్షిని పూజించుము. అయోధ్యా కుండమున స్నానము చేసి అచ్చటనున్న
లక్ష్మిని పూజించుము. లక్ష్మీకుండమున
స్నానము చేసి లక్ష్మీనారాయణుల పూజించుము.
సూర్యకుండమున స్నానము చేసి అచ్చట శ్రాద్ధమాచరించి సూర్యుని పూజించి
వైద్యనాధకుండమున స్నామొనర్చి వైద్యనాధేశ్వరుని పూజించుము. గోదావరీ కుండమున స్నానము చేసి గౌతమేశ్వరుని
భక్తితో పూజించుము. అగస్తికుండమున
స్నానమొనర్చి అగస్తీశ్వరుని పూజించుము.
శుక్రకూపమున స్నానము చేసి శుక్రేశ్వరుని పూజించుము. అప్పుడు అన్నపూర్ణను
సమీపించి భక్తిభావముతో నమస్కరించుము.
డుంఢిరాజుని పూజించి జ్ఞానవాపిలో స్నానమొనర్చి జ్ఞానేశ్వరుని పూజించి
దండపాణిని పూజించుము. ఆనందభైరవుని
పూజించి మహాద్వారమున సాష్టాంగముగ నమస్కారము చేసి విశ్వనాధుని దర్శించుము. ఇట్లు చేయుటచే దక్షిణ మానస యాత్ర చేసినవాడవగుదువు. ఇక నిప్పుడు ఉత్తరమానస యాత్రవిధిని
చెప్పుచున్నాను వినుము.
సంకల్పమొనర్చి పంచగంగ యందు స్నానము చేయవలయును. అందుచే కోటి జన్మ పాపము నశించును. కిరణ,ధూతపాపి, పుణ్యసర్వతి, గంగా యమున ఇవియే పంచగంగలు. కృతయుగమున ధూతపాప యనియు ద్వాపరమున బిందు
తీర్ధమనియు కలియుగముననదియే పంచగంగయనియు పిలువబడుచున్నది. ప్రయాగయందు మాఘమాసము స్నామొనర్చిన పుణ్యముకన్న
కోటిరెట్ల ఫలము పంచ గంగా స్నానమువలన సిద్ధించును.
అట్టి పంచగంగలో స్నానమాడి బిందుమాధవుని దర్శించి గోపాలకృష్ణుని పూజించి
నృసింహభవనము వెళ్ళి నృసింహుని దర్శించి తరువాత మంగళగౌరిని చూచి గభస్తీశ్వరుని
మధురాదిత్యుని దర్శించి తిరిగి విశ్వనాధుని దర్శించవలయును. అనంతరము ముక్తి మంటపమునకు వెళ్లవలెను. ఆదిత్యుని పూజించి కేశవేశ్వరుని
పాపభక్షేశ్వరుని, నవగ్రహములను, కాలభైరవుని, క్షేత్రపాలకుని అర్చించవలెను. కాలకూపమున స్నానమొనర్చి
కాలేశ్వరుని పూజించి. హంసతీర్థమున స్నానమొనర్చి అచ్చట పితరులకు శ్రాద్ధమొనర్చి.
కృత్తివాసేశ్వరుని చూచి, అచ్చట నుండి వెడలి
శంఖవాపియందు స్నానమొనర్చి ఆచమనము చేసి రత్నేశ్వరుని, సత్యేశ్వరుని దక్షేశ్వరుని, చతుర్వక్త్రేశ్వరుని వరుసగ పూజించవలెను. వృద్ధకాలకూపములో
స్నానమొనర్చి కాలేశ్వరుని పూజించి తరువాత అపమృత్యుఈశ్వరుని పూజించుము. మందాకినిని
స్నానముచేసి, మధ్యమేశ్వరుని, జంబుకేశ్వరుని, వక్రతుండుగణపతిని పూజించి దండఖాతకూపమున స్నానముచేసి
శ్రాద్ధమొనర్చుము. తరువాత భూతభైరవుని, ఈశానేశ్వరుని చేచి .ఐగీషవ్యగుహము, దర్శించి నమస్వర్చిఇ ఘంటా కుండమున స్నానముచేసి వ్యాసేశ్వరుని కందుకేశ్వరుని, భక్తితో పూజించుము. జ్యేష్ఠవాసిమందు స్నానముచేసి
జ్యేష్ఠేశ్వరుని పూజించి సప్తసాగర తీర్థమునకు వెళ్ళి స్నానముచేసి వాల్మీకేశ్వరుని
పూజించి భీమాతటముననున్న భీమేశ్వరున పూజింపుము మాతృపిండకుండమందు పితృశ్రాద్థమొనర్చి పిశాచమోచక తీర్థమున
స్నానమాడి, కపర్దేశ్వరుని పూజించి
కర్కోటక వాటియందు స్నానము చేసి కర్కోటేశ్వరుని భక్తితో పూజించి ఈశ్వరగంగకు
వెళ్లిఅచ్చటస్నానము చేసి శ్రద్ధతో శ్రాద్ధమాచరించుము. ఉత్తరార్కుని పూజించి
మత్స్యోదరియందు స్నానము చేసి ఓం కారేశ్వరుని, కపిలేశ్వరుని పూజించుము. ఋణమోచన తీర్థమునను, పాపవిమోచన తీర్థమునను స్నానముచరించుము. అట్లే
కపాలమోచన తీర్థమున గూడ స్నానమొనర్చి కులస్తంభమునకు వెళ్ళి నమస్కరించి వైతరిణీ
తీర్థమున స్నానముశ్రద్ధము గోదానమును గూడ నొనర్చుము. అచ్చటనుండి కపిలధారకు వెళ్ళి
స్నానముచేసి వత్సతో కూడిన గోదానము బ్రాహ్మణునకు చేయుము. వృషభధ్వజుని పూజించి జ్వాలానరసింహునకు
నమస్కరించి వరుణా సంగమమునకు వెళ్ళి స్నానము శ్రాద్ధము చేసి కేశవాదిత్యుని, ఆది కేశవునిగూడ పూజించుము. ప్రహ్లాద తీర్ధము కలదు. అచ్చట గూడ
స్నానదానాదులనాచరించయలయును.
కపిలధారయను తీర్ధమందును స్నానము
చేయుము. త్రిలోచనేశ్వరుని, అసంఖ్యాతేశ్వరుని పూజించి మహాదేవుని సమీపించి
భక్తితో పూజించి ద్రుపదేశ్వరునిగూడ పూజించుము.
గంగాయమునాసరస్వతి యను మూడు లింగములు కలవు.
వాటిని పూజించుము. కామ్యతీర్ధము
దర్శించి కామేశ్వరుని పూజించి తిరిగి మణికర్ణికయందు స్నానముచేసి జలశాయిని పూజించి
హనుమంతునకు సమస్కరించి మోదాది పంచ వినాయకుల పూజించుము. అన్నపూర్ణను పూజించి ధుంఢిరాజును దర్శించి
జ్ఞానవాపియందు స్నానము చేసి జ్ఞానేశ్వరుని పూజించుము. దండపాణిని మోక్షలక్ష్మీవిలాసుని పంచపాండవుల, ద్రౌపదీ ద్రుపదుల దర్శించి, ఆనందభైరవుని, అవిముక్తేశ్వరుని దర్శించి పూజించి విశ్వనాథుని
సమ్ముఖమునకు వెళ్ళి స్వామీ! నీ ప్రీతి కొఱకు ఉత్తరమానస యాత్ర సలిపితిని. ప్రసన్నుడవు కమ్మని ప్రార్ధించ వలెను. సాష్టాంగముగ విశ్వనాథునకు నమస్కరించి అనంతరము
పంచక్రోశ యాత్ర సలుప వలెను. ఇట్టి
గురుచరిత్రను శ్రద్ధతో వినువారు చతుర్విధ పురుషార్ధములనొందగలరు. అని సిద్ధముని నామధారకునకు చెప్పెను.
ఇట్లు గురుచరిత్రమందు నలుబది ఒకటవ అధ్యాయము సమాప్తము.
శ్రీ గురు చరితము
నలుబది రెండవ అధ్యాయము
శ్రీ గణేశ్వరా నమస్కారము.
సిద్ధముని నామధారకునితో నిట్లు చెప్పుచున్నారు. గురుమూర్తి సాయందేవునితో సాయందేవ వినుము. అవధూత బ్రహ్మచారితో కాశీయాత్ర విధానమును తిరిగి
ఇట్లు చెప్పుచున్నారు.
బాలకా వినుము.
సంకల్పమొనర్చి స్వర్గ ద్వార భువనమునకేగి అచ్చట గంగా కేశవుల పూజించి
హరిశ్చంద్ర మంటపమునకేగుము.
హవిష్యాన్నమును భుజించి మరునాడు ప్రాతఃకాలమున
గంగా స్నానమొనర్చుము. ధుంఢిరాజుకు
పూజచేయుము. గంగకు నమస్కరించి విశ్వనాథుని దర్శించి తరువాత భవానీ శంకరుల
పూజించుము. ముక్తి మండపము ప్రవేశించి
నమస్కరించి తరిగి ధుంఢిరాజు వద్దకు పొమ్ము.
తిరిగి మహాద్వారమునకేగి విశ్వేశ్వరుని పూజింపుము. మోదాది పంచవినాయకులకు నమస్కరించి దండపాణిని
దర్శించి నమస్కరించుము. ఆనందభైరవుని
పూజించి మణికర్ణికకు తిరిగి వెళ్ళి ఈశ్వరుని సిద్ధివినాయకుని పూజించుము. గంగా కేశవుల పూజించి సిద్ధివినాయకునికి
నమస్కరించి రాజసిద్ధేశ్వరుని ధ్యానించి దుర్లభేశ్వరుని పూజించుము. సోమనాథుని, శూలకంఠేశ్వరుని, వారాహేశ్వరుని దర్శించి దశాశ్వమేధ ఘట్టమునకు పొమ్ము. బందీ దేవిని పూజించి సర్వేశ్వరునికి నమస్కరించి
కేదారేశ్వరుని, హనుమంతేశ్వరునికూడా
పూజయొనర్చుము. సంగమేశ్వరుని, లోలార్కుని, అర్కవినాయకుని పూజించి దుర్గాకుండమున స్నానమొనర్చుము. దుర్గా దేవిని పూజించి దుర్గాగణేశ్వరుని
దర్శించి విష్వక్సేనేశ్వరుని దర్శించి
కర్దమ తీర్ధమున స్నానము చేసి కర్దమేశ్వరుని పూజించుము. కర్దమ కూపమునకేగి అచ్చట సోమనాధుని పూజించి
తరువాత విరూపాక్ష లింగమునకు పూజయొనర్చుము.
నీలకంఠుని పూజించి కర్దమేశ్వరుని పూజించుము. నాగనాథుని పూజించి చాముండాదేవిని, మోక్షేశ్వరుని, వరుణేశ్వరుని భక్తితో పూజించుము. వీరభద్రుని పూజించి వికటాక్షదేవిని
పూజించుము. ఉన్మత్త భైరవుని, విమలార్జనుని, కాలకూట దేవుని పూజించుము.
మహాదేవుని, నందికేశ్వరుని, భైరవుని, గణప్రియుని, విరూపాకక్షుని, యజ్ఞేశ్వరుని, విమలేశ్వరుని, భీమాచండీ వినాయకుని, రవిని, రక్తాక్షగంధర్వుని
పూజింపుము. జ్ఞానేశ్వరుని, అమృతేశ్వరుని, భీమాచండిని, నరక సముద్రమునుండి తరించుటకు
పూజింపుము. ఏకపాద వినాయకుని, భైరవుని, సంగమేశ్వరుని పూజించుము. భూతనాథుని, సోమనాథుని, కౌలనాథుని పూజించి కపర్దేశ్వరుడను శివలింగమును
పూజించుము. నాగేశ్వరుడు, కామేశ్వరుడు, గణేశ్వరుడు, విశ్వేశ్వరుడు, చతుర్ముఖ వినాయకుడు, దేహళీవినాయకుడు, ఉద్దండ గణపతి వీరల పూజించుము. ఉత్కలేశ్వరుడు, ఏకాదశరుద్రులను పూజించి తపోభూమి యనుచోటుకు పొమ్ము. అచ్చట రామేశ్వరుని, సోమనాథుని,
భరతేశ్వరుని, లక్ష్మణేశ్వరుని, శత్రుఘ్నేశ్వరుని, భూదేవిని, నహుషేశ్వరుని, రామేశ్వరుని పూజించుము. అసంఖ్యాత తీర్ధమునకు నమస్కరించి అసంఖ్యాత
లింగమునకు పూజచేయుము. సిద్ధేశ్వరుడను
గొప్ప లింగమునకు పూజచేసి పరశుపాణి వినాయకుని పూజించి పృథ్వీశ్వరునకు నమస్కరించి, సరయూకూపమున స్నానమొనర్చి కపిలోద్ధారమను తీర్ధమున
స్నానమాచరించుము. ఋషభధ్వజుని పూజించి
జ్వాలానృసింహస్వామి పాదములకు నమస్కరించి వరుణాసంగమ స్నానము చేసి పితరులకుశ్రాద్ధము
పెట్టుము. సంగమేశ్వరుని పూజించి వినాయకుని, కేశవుని, ప్రహ్లాదేశ్వరుని పూజించి కపిల తీర్ధమున స్నానము చేసి త్రిలోచనేశ్వరుని
పూజించుము. అనంతరము బిందుమాధవుని
పూజించుము. మంగళగౌరిని పూజించి, వశిష్ఠ వామదేవుని పూజించి, పర్వతేశ్వరుని పూజించుము. అనంతరము సిద్ధివినాయకుని పూజించి
సప్తవర్ణేశ్వరుని, సర్వగణేశ్వరుని పూజించి
మణికర్ణికకేగి అచ్చట స్నానమొనర్చి విశ్వేశుని స్మరించి మహాదేవుని పూజించి
ముక్తిమంటపమున కేగి విష్ణుమూర్తిని, దండపాణిని, ధుంఢిరాజును పూజింపుము. ఆనందభైరవుని పూజించి
ఆదిత్యేశ్వరునకు నమస్కరించి మోదాది పంచవినాయకుల పూజించుము. తరువాత విశ్వేశ్వరుని
పూజించి మోక్షలక్ష్మీ విలాసమునకు నమస్కరించి విశ్వేశ,విశ్వాత్మ కాశీక్షేత్ర ప్రదక్షిణముచే అనేక జన్మార్జిత
పాపములు నశించినవని చెప్పి శివుని ధ్యానించవలెను. అనంతరము ముక్తిమంటపమునకు, స్వర్గమంటపమునకు, ఐశ్వర్యమంటపమునకు, జ్ఞానమంటమునకు, మోక్షలక్ష్మివిలాసస్థానమునకు, ముక్తిమంటపమునకు ఆనందమంటమునకు, వైరాగ్యమంటమునకు వెళ్ళి ఈ ఎనిమిదిస్థానములకు
నమస్కార మొనర్చుము. ఇట్టి కాశీయాత్రా విధానము నీకు చెప్పితిని. మరియొక విధముగ గూడ
కాశీయాత్రచేయు విధము చెప్పెదనో బాలుడా! వినుమని అవధూత చెప్పుచున్నాడు.
ముందుగ సచేలస్నానము చేసి తరువాత చక్రపుష్కరణిని
స్నానమొనర్చి దేవపితృతర్పణము గావించి బ్రాహ్మణుల పూజింపుము. అచ్చట నుండి బయలుదేరి
ద్రుపదాదిత్యేశ్వరుని పూజించి,
దంపత్యేశ్వరునకునమస్కరించి
ఆ సమీపముననున్న విష్ణుమూర్తిని పూజించి దండపాణిని, మహేశ్వరుని పూజింపుము. ధుంఢిరాజును పూజించి జ్ఞానవాపియందు
స్నానమొనర్చి నందికేశ్వరుని పూజించి తారకేశ్వరుని పూజించుము. మహాకాళేశ్వరుని
దర్శించి దండపాణివినాయకుని పూజించి విశ్వేశ్వరుని దర్శింపుము. ప్రతిపత్తునాడు
మత్స్యోదరతీర్థమున స్నానము చేసి ఓంకారేశ్వరుని పూజించుము. త్రిలోచన, మహాదేవులను రెండు లింగముల విదియ, తదియల వరుసగ నర్చింపుము. చవితినాడు కాంచీవాసలింగము
నర్చించుము. పంచమినాడు రత్నేశ్వరుని, షష్ఠినాడు చంద్రేశ్వరుని
పూజించుము. సప్తమినాడు కేదారేశ్వరుని పూజించుము. సప్తమినాడు విశ్వేశ్వరుని
ఆరాధించి, దశమినాడు కామేశ్వరుని, ఏకాదశినాడు తిరిగి విశ్వేశ్వరుని, ద్వాదశినాడు మణికర్ణికేశ్వరుని, త్రయోదశియందు అవిముక్తేశ్వరుని, చతుర్దశినాడు విశ్వేశ్వరుని పూజించవలయును, కాశీయందు నివసించువారు ఈవిధమున యాత్రచేయనిచో వారి
యాత్రకు విఘ్నము వాటిల్లును. ఇక కృష్టపక్షమున నెటుల కాశీయాత్ర సలుపవలయునో చెప్పెద
వినుము.
వరుణానదియందు స్నానమొనర్చి శైలేశ్వరుని దర్శించి
సంగమస్నానమొనర్చి సంగమేశ్వరుని పూజించ వలయును.
స్వర్గ తీర్ధమున స్నానమొనర్చి స్వర్గేశ్వరుని పూజించవలయును. మధ్యమేశ్వరుని
మందాకినియందు స్నానమొనర్చి పూజించవలయును.
మణికర్ణికా స్నానమొనర్చి ఈశానేశ్వరుని పూజించుము. హిరణ్యగర్భమను రెండు లింగములు కలవు. వాటిని పూజించుము. ధర్మకూపమున స్నానముచేసి గోపద్మేశ్వరుని
పూజించుము. కపిలధార తీర్ధమున స్నానమొనర్చి
ఋషభధ్వజలింగమునకు పూజకావింపవలయును.
ఉపశాంతి కూపమున స్నానమొనర్చి
ఉపశాంతేశ్వరుని ఆరాధించుము. పంచచూడా ప్రవాహమనుచోట
స్నానముచేసి జ్యేష్టేశ్వరుని అర్చించుము.
చతుస్సముద్రకూపమున స్నానముచేసి సముద్రేశ్వరుని సేవించుము. తరువాత దినమున శుక్లేశ్వరుని పూజించుము. దండఖాత తీర్ధమున స్నానముచేసి వ్యాఘ్రేశ్వరుని
పూజించుము. శౌనకేశ్వరతీర్ధమున
స్నానమొనర్చి శౌనకేశ్వరుని పూజించుము.
జంబూతీర్ధమన స్నానమొనర్చి జంబుకేశ్వరుని ఆరాధించుము. శుక్ల పక్షమునను కృష్ణ పక్షమునను విశేషించి
మోక్షేశ్వరుని, పర్వతేశ్వరుని, పశుపతేశ్వరుని, గంగేశ్వరుని, నర్మదేశ్వరునిగూడ పూజించ వలయును.
అనంతరము భక్తేశ్వరుని,
గభస్తేశ్వరుని, మధ్యమేశ్వరుని, తారకేశ్వరుని పూజించుము.
అగ్నిధ్రువేశ్వరుడు, ఊర్వశీశ్వరుడు, నకులేశ్వరుడు, ఆషాఢేశ్వరుడు, భారభూతేశ్వరుడు, లాంగులేశ్వరుడు, త్రిపురాంతకేశ్వరుడు, మనఃప్రకామేశ్వరుడు, ప్రీతేశ్వరుడు, మందాలికేశ్వరుడు, తిలపర్ణేశ్వరుడు
గలడు. వీరలగూడ పూజించుము. ఇక శక్తి యాత్ర చెప్పెద వినుము.
శుక్ల పక్ష తదియనాడు గోప్రేక్షతీర్ధములో స్నానమొనర్చి
ఫాలనేత్రయను శక్తిని పూజించి జ్యేష్ఠవాపిని స్నానమొనర్చి జ్యేష్ఠాదేవిని
అర్చించుము. అట్లే జ్ఞానవాపినియందు
స్నానముచేసి శృంగార సౌభాగ్య గౌరిని ఆరాధించుము.
విశాల గంగయందు స్నానమాడి విశాలగంగాదేవిని పూజించుము. లలితా తీర్ధమున స్నానము చేసి లలితా దేవిని
ఆరాధించుము. భవానీ తీర్ధమున స్నానమాడి
భవానీ అమ్మవారిని పూజించుము. బిందు
తీర్ధమున స్నానముచేసి మంగళగౌరిని అర్చించుము.
ఇట్లు శక్తుల పూజించి లక్ష్మీదేవిని ఆరాధించుము. ఇట్లు తదియయందు పూజలు చేసి చతుర్ధియందు
చేయవలసిన యాత్ర విధానమును చెప్పెద వినుము.
గౌరీ పుత్రుడయిన గణేశునకు మోదకములర్పించుము. ఇట్లు చేసినచో తీర్ధయాత్రచేయువారికి ఎట్టి
విఘ్నములు రాజాలవు. మంగళ, ఆదివారములందు భైరవుని, సప్తమీ ఆదివారము సూర్యుని ఆరాధించుము. అష్టమి, నవమి తిథులయందు చండీ అమ్మవారిని పూజించుము. ప్రతి నిత్యము అంతర్గృహయాత్రను
తప్పకచేయవలయును. ఈ కాశీయాత్రా విధానము
స్కాందపురాణములో కాశీఖండములో కలదు. అదియే
నేను నీకు చెప్పితిని. ఓ బ్రహ్మచారీ
నీవిటుల యాత్రచేసి నీపేరుతో సోమేశ్వరుడను పేరుగల లింగమును స్థాపింపుము. నీవిటుల ఆచరించితివేని నీ మనోరథము నెఱవేఱును. నీ చిత్తములో గురుభక్తి దృఢముగా కలదు. శంకరుడు తప్పక ప్రసన్నుడు కాగలడు. తప్పక గురు స్మరణ నిత్యము నిరంతరము
చేయుచుండుమని చెప్పి ఆ అవధూత అక్కడనే అదృశ్యుడయ్యెను. అప్పుడు ఆ బ్రహ్మచారి ఆశ్చర్యపడి అతనే తన
గురువై ఉండవచ్చునని నిర్ణయించుకొని గురువు కృపామూర్తిగాననే నిర్హేతుకముగ వారి
యనుగ్రహము నాయందు లభించెను. నేను
ధన్యుడనైతిని. తప్పక నాకార్యము సిద్ధించును. నేను ఈశ్వరునియందు భక్తిలేనివాడనైనను
గురువనుగ్రహము వలన నాకుఈశ్వర అనుగ్రహముకూడ సిద్ధించునని భావించి కాశీ ప్రవేశించి
గురువు చెప్పిన విధమున తాను కాశీయాత్రను సాంగోపాంగముగ ఆచరింప ఈశ్వరుడు ప్రత్యక్షమై
బాలకా వరము కోరుకొనమన నాబ్రహ్మచారి తన గురువు, గురుభార్య,
గురుపుత్రుడు, గురుపుత్రికయు కోరినవాటినన్నిటిని చెప్పి అవి చేయు
సామర్ధ్యమును తనకిమ్మని ప్రార్ధించెను.
అప్పుడు ఈశ్వరుడు బాలునితో ఓ బాలకా! నీవు సర్వవిద్యాపారంగతుడవగుదువు.
ఇంతియేకాక నీవు ఇకమీద విశ్వకర్మ అనుపేరుతో వెలయగలవు. ఓ త్వష్టృ కుమారా! నీకు సంకల్ప మాత్రముననే
సృష్టిచేయగల సామర్ధ్యమనుగ్రహించితిని అని చెప్పి శివుడు అంతార్ధానమొందెను. అప్పుడు బ్రహ్మచారి శివుని వలన వరమునొంది
తనపేరుతో లింగ స్థాపన గావించి తన గ్రామము చేరి శివుని వరప్రసాదముచే గురువు, వారిభార్య పుత్ర పుత్రికలు కోరినవాటినెల్ల రచించి
గురువును సమీపించి గురుచరణములకు నమస్కరించి వారు వారు కోరిన వస్తువులనెల్ల వారల
కర్పించి నిలువబడెను.
గురువు సంతోషముతో శిష్యుని ఆలింగనమొనర్చి శిష్యాగ్రేసరా! నీ
భక్తికి సంతసించితిని. నీవు గురుభక్తిచే
త్రిమూర్తుల వశపరచుకొంటివి. సర్వ
విద్యాకుశలుడవై అష్టైశ్వర్యములతో తులతూగుచు సుఖముగ నుండుచు చిరంజీవివై
ఆచంద్రార్కము లోకోపకారమొనర్చుచుండుము. మీ
వంశము అష్ట సిద్ధులతో తులతూగుచుండును. మీ
వంశమువారికి చింతలు, కష్టములుకూడా
నుండవు. మీ వంశమువారందరు చతుష్షష్టి
కళలయందు ఆరితేరి ఉందురు అని గురువు శిష్యుని ఆశీర్వదించి పంపివేసెనని శివుడు
పార్వతికి చెప్పి తిరిగి ఓ పార్వతీ గురు భక్తి ఎట్టిదో తెలిసికొంటివా? ఏక భావముతో గురువును భజించవలెను. భవసాగరమును దాటవలయుననిన గురు భక్తియే ఆధారము. గురువును త్రిమూర్తుల యొక్క అవతారముగ భావింప
వలయును. వేద శాస్త్రములు యస్య దేవే పరా
భక్తిః యథా దేవే తథా గురౌ తస్యైతే కథితే
హ్యర్థః ప్రకాశంతే మహాత్మనః దేవునియందు ఎంత భక్తియో అంత భక్తి గురువుయందు
ఉంచవలయును. అట్టివానికే గురువు చెప్పిన
బోధ అనుభవమునకు రాగలదు. అని ఇట్లు
గురుభక్తియే జన్మ సంసిద్ధికి ముఖ్య కారణముగ చెప్పినవని గురుభక్తి మహాత్మ్యమును
శివుడు పార్వతికి చెప్పెనని గురుమూర్తి సాయందేవునకు చెప్పెను. ఇంతలో సూర్యోదయమయ్యెను. అంధకారము నశించెను. సాయందేవుడు సంతసించి గురుమూర్తి పాదములకు
నమస్కరించి స్వామీ! అట్టి దృఢ భక్తి సర్వ కాలములయందు నాకుండునటుల చేయుమని
ప్రార్ధించుచు స్వామీ! తమరు నాకు కాశీయాత్ర విధానమును చెప్పుచున్నప్పుడు ఏమి
అద్భుతమోగాని తమతో కలసి నేను కాశీ క్షేత్రములో నున్నటుల నాకుఅనుభవమయ్యెను. అది స్వప్నమో ఏమియో నాకు తెలియుటలేదు. కాశీ క్షేత్రమును ప్రత్యక్షముగా చూచితిని అని
చెప్పి భక్తితో ప్రణమిలిల ఇట్లు స్తోత్రము చేసెను.
సాయందేవుని
స్తోత్రము
జయజయ పరమ
పురుషా! పరాత్పరా! పరమహంసా! భక్త జన మానస హంసా! శ్రీ నృసింహసరస్వతీ!
(1) ఆదౌ బ్రహ్మ త్వమేకమే జగతాం వేదాత్మమూర్తిం విభో
పశ్చాత్‌క్షోణితలే వినాశి దితిజే కృత్వావతారం విభో
హత్వాదైత్య మనేక ధర్మ చరితం భూత్వాత్మజోత్రే-ర్గృహే
వందే-హం నరకేసరీ సరస్వతీ శ్రీపాదయుగ్మాంబుజమ్||
శ్లో|| పాగ్బ్రహ్మ
త్వమజో-క్రియోపి బహుళం స్యామిత్య భూద్ధీస్తయా
సృష్ట్యౖవాండ భువం తతో జగదిదం సృష్ట్వా సధర్మంగుణైః
స్వైస్వం భో రమయన్ విహంసి సదరీనత్రావతీర్యానిశం
వందే శ్రీ నృహరే సరస్వతివరం తే శ్రీపదాబ్జ ద్వయం
తా|| సృష్టికి పూర్వము
ఒక్కడవై సృష్టికాలము రాగా సంకల్ప మాత్రముచే బ్రహ్మాండ రూపుడవై, స్థితికాలమందు నీ రూపమైన జగమును నీవే పాలించి దుర్మార్గుల
సంహరించి భక్తుల రక్షించుటకుగాను అవతరించిన ఓ నృసింహసరస్వతీ! నీ
పాదద్వంద్వములకివే వందనములు.
(2) భూదేవాఖిల మానుషం విదుజనా బాధాయమానం కలిం
వేదాదుష్య మనేక వర్ణ మనుజా భేదాది భూతోన్నతిం
ఛేత్తా-ధర్మ తమాంధకార హరణం
జ్ఞాన ప్రదీపోజ్వలం
వందే-హం నరకేసరీ సరస్వతీ శ్రీపాదయుగ్మాంబుజమ్||
శ్లో|| కల్యాకృష్ట
హృదుజ్ఘితక్రతు నరత్రస్తాధ్వరాశీర్ముదే
ప్రాతస్సూర్య ఇవోదితో-స్యజ మహా మోహాంధకారం గ్రసన్
సద్ధర్మాశ్రమ సేతు మత్ర శిథిల ప్రాయం సుధార్డ్యం నయన్
వందే శ్రీ నృహరే సరస్వతివరం తే శ్రీపదాబ్జ ద్వయం
తా|| కలిచే ధర్మము నశించి
యజ్ఞయాగములు లోపించగా దేవతల ప్రార్ధనననుసరించి భూమిని అవతరించి శిథిలమైన ధర్మ
సేతువుల బాగుపరచి జ్ఞానజ్యోతిస్సులను లోకమున కనుగ్రహించుచున్న ఓ నృసింహసరస్వతీ నీ
పాదకమలములకివే వందనములు.
(3) ధాతస్త్వం హరిశంకరాది గురవో జాతాగ్రజన్మం
విభో
హేతుః సర్వ విభోజనాయతరణం జ్యోతిః స్వరూపం జగత్
చాతుర్ధాశ్రమ స్థాపితం క్షితితలే పాతుస్సదా సేవ్యయం
వందే-హం నరకేసరీ సరస్వతీ శ్రీపాదయుగ్మాంబుజమ్||
శ్లో|| సర్వానంద నిధానరూపమమలం
సత్వం సుఖం మూర్తి మత్
ప్రాదుష్కృత్య జనత్రయాంతర మృగక్రీడావనం పావనం
సంసారా వటమగ్నముద్ధరసి భో స్వీకృత్య తుర్యాశ్రమం
వందే శ్రీ నృహరే సరస్వతివరం తే శ్రీపదాబ్జ ద్వయం
తా|| సంసార సముద్రమున మునిగి దరికానకయున్న భక్తజనుల
తరింపచేయగలందులకు అవతరించి తురీయాశ్రమమును స్వీకరించి లోకుల నుద్ధరించుచున్న ఓ
నృసింహ సరస్వతీ మీ పాద ద్వంద్వమునకు నమస్కారము.
(4) చరితం చిత్రమనంత కీర్తి మతులం పరిభూత భూమండలే
మూకం వాక్యదివాంధకస్య నయనం వంధ్యాంచ పుత్రందదల్
సౌభాగ్యం విధవా చ దాయక శ్రియం దత్వాచ భక్తం జనం
వందే-హం నరకేసరీ సరస్వతీ శ్రీపాదయుగ్మాంబుజమ్||
శ్లో|| మూకే గాం దృశమన్ధకే సుత
నయం వంధ్యాసు చాసూన్మృతే
సౌభాగ్యం విధవాసు పల్లవమహోదత్తం సుశుష్కేందనే
ఏవం భూత ఇయాన్ తవైష మహిమాత్రైలోక్య సంస్థాక్షమో
వందే శ్రీ నృహరే సరస్వతివరం తే శ్రీపదాబ్జ ద్వయం
తా|| స్వామీ! మీచరితము లోకాతీతము. మూగవానికి మాటలాడు శక్తిననుగ్రహించితిరి. గ్రుడ్డి వానికి నేత్రముల నిచ్చితిరి. గొడ్రాలికి సంతానమిచ్చితిరి. ఎండిన కట్టెను పల్లవింప చేసితిరి. మీ మహిమనునేనెంత వర్ణింప సమర్ధుడను?
మీ
పాదకమలములకు నమస్కరించెద. స్వామీ! ఓ
నృసింహ సరస్వతీ!
(5) దురితా ఘోర దరిద్ర దావతిమిరహరణం జగజ్యోతిషం
సురధేను సురపాద పాజితజనా కరుణాబ్ధి భక్తార్తిహా
నరసింహ సరస్వతీశ్వర విభో! శరణాగతం రక్షణం
వందే-హం నరకేసరీ సరస్వతీ శ్రీపాదయుగ్మాంబుజమ్||
శ్లో|| ముక్తా వాస ముముక్ష
కల్ప విటపిన్ భో! కామినాం కామధుక్
దారిద్య్రానల మేఘ దుష్కృతదవాగ్నే! తాపితారామ తే
శ్రుత్యన్విష్ట రజః పదం శ్రుత వివాదాతీత తత్వం మహత్
వందే శ్రీ నృహరే సరస్వతివరం తే శ్రీపదాబ్జ ద్వయం
తా|| దురితమును
దారిద్య్రమును పోగొట్టి జగత్తుకు జ్ఞాన జ్యోతిస్సునొసంగుచు, కామధేనువు, కల్పవృక్షము వలె భక్తుల కోరికలనెల్ల సఫలమొనర్చుచు ముక్తులకు
ముముకక్షువులకు సహిత మాధారమై వేదములకు కూడ గోచరించని స్వరూపముగల ఓ నృసింహ
సరస్వతీశ్వర ప్రభో ! మీ పాద ద్వంద్వమునకివే సహస్ర వందనములు.
(6) గురుమూర్తి చరాణరవింద యుగళ స్మరణేకృతే నిత్యశః
చరితం క్షేత్రమనేక తీర్ధ సఫలం సరిదాది భాగీరధీ
తురగామేధ సహస్ర గోవిదుజనాః సమ్యగ్దదన్ తత్ఫలం
వందే-హం నరకేసరీ సరస్వతీ శ్రీపాదయుగ్మాంబుజమ్||
శ్లో|| భో యోగీశ్వర భావితం తవ
పదం తార్ధాశ్రయం సజ్జనా
జీవం కామి సుదైవతం చ కమలా లీలాస్పదం నిర్మలం
విద్వద్వాదకరండకం సుకృత సంస్థానం మహత్పావనం
వందే శ్రీ నృహరే సరస్వతివరం తే శ్రీపదాబ్జ ద్వయం
తా|| ఓ యోగీశ్వర! నీ పాదములు తీర్ధములతో సమము. సత్పురుషులకు జీవనాధారము. కామముతో సేవించు వారికి నీ పాదములే వారలకు
కామముల నివ్వ సమర్ధములు. మిక్కిలి
పావనములు. లక్ష్మికి నివాస స్థానములు. ఓ
నరసింహ సరస్వతీ అట్టి నీ పాద ద్వంద్వమునకు నమస్కృతులు గావించెద.
(7) నోశక్యం తవ నామ మంగళ స్తవం వేదాగమాగోచరం
పాద ద్వంద్వ హృదయాబ్జ మంతర నిధాయత్వాం భూమిపం
భూయో భూయ స్మరన్నమామి మనసా
శ్రీ సద్గురుం పాహిమాం
వందే-హం నరకేసరీ సరస్వతీ శ్రీపాదయుగ్మాంబుజమ్||
శ్లో|| వేదాగోచర తే చరిత్రమమలం
శక్తోత్ర కః కృత్నశః
వక్తుం వహ్న్య బినేందు భూ ఖపవనాత్మేతీహ మూర్త్యష్టకం
ఏతద్విశమయం న చాన్యదిహ వా ఓంకారరూపేశితః
వందే శ్రీ నృహరే సరస్వతివరం తే శ్రీపదాబ్జ ద్వయం
తా|| వేదములకు గూడ గోచరము కాని నీ చరిత్రమెవ్వరు వర్ణింప
సమర్ధులు? నీవు ఓంకార స్వరూపుడవు.
పంచ భూతములు, సూర్య చంద్రులు, జీవాత్మ ఇవి ఎనిమిది నీరూపములు గాన నీవు విశ్వరూపుడవు. అట్టినీ
పాదారవిందముల హృదయమున నిలిపి నిన్ను స్మరింతును.
ఓ నరకేసరీ! సరస్వతీ! సద్గురో! నీ పాదారవిందములకు నమస్కారము.
(8) కుండీ దండ ధరం ప్రశాంతమమలం సన్యాసిరూపం తవ
శ్రీ భీమామరజాయుతి స్థితమజధ్యేయం శరణ్యం మయి
జ్ఞానం తారకమీశ సత్యమనిశం బ్రహ్మన్థ్సిరీకుర్వదో
వందే-హం నరకేసరీ సరస్వతీ శ్రీపాదయుగ్మాంబుజమ్||
శ్లో|| భక్తానాం తరణార్ధ సర్వ
జగతాం దీక్షాం దదవ్యోగినాం
సుక్షేత్రం పురగాణగాస్థిత ప్రభో దత్వాచతుష్కామదం
స్తుత్వా భక్తి సరస్వతీ గురుపదం జీత్వాద్య దోషాదికం
వందే శ్రీ నృహరే సరస్వతివరం తే శ్రీపదాబ్జ ద్వయం
తా|| కలియుగమున భక్తుల నుద్ధరించగలందులకు అవతరించి భీమా
అమరజాసంగమమున గణగాపురమున నివసించి దండకమండముల ధరించి యతీశ్వర రూపమునున్న
దత్తాత్రేయ! శ్రీనృసింహ సరస్వతీ! నీ పాదారవిందములకు నమస్కారము. నా దోషముల పోగొట్టి నాకు స్థిరమైన జ్ఞానము
ననుగ్రహించుము. నన్ను రక్షించుము.
(9) ఏవం శ్రీ గురునాయకాష్టక మిదం స్తోత్రం పఠేన్నిత్యశః
స ప్రాప్నోతి బలం శ్రియం చ సుధియం తేజో వపుపాటవం
వర్చః పుత్ర కళత్రమిత్రజ సుఖం దీర్ఘాయురారోగ్యతాం
సంప్రాప్తైహిక సౌఖ్య మనిశం చాంతే స ముక్తిం వ్రజేత్
ఏవం శ్రీ గురునాధ మష్టక మిదం స్తోత్రం పఠేన్నిత్యశో
తేజోదర్పబలోన్నతిం శ్రియకరం ఆనందవర్ధం వపుః
పుత్రా పత్యమనేక సంపద శుభదీర్ఘాయురారోగ్యతాం
వందేహం నరకేసరీ సరస్వతీ శ్రీ పాదయుగ్మాంబుజమ్
తా|| నిత్యము ఈ గురునాథాష్టకమును శ్రద్ధతో పఠించు వారికి
గురునాథుడు తేజస్తును ఐశ్వర్యమును ఆరోగ్యమును పుత్రపౌత్రాభివృద్ధిని, దీర్ఘాయుష్యమును, ఐహిక సౌఖ్యమును, అంతమందు మోక్షమునుగూడ ప్రసాదించును.
అట్టి గురుమూర్తి శ్రీ నృసింహ సరస్వతి పాదారవిందములకు నమస్కారము.
ఇట్లు స్తుతించుచు సాష్టాంగ వందనమాచరించి రోమాంచముగలవాడై
గద్గదమైన కంఠస్వరముతో త్రిమూర్త్యవతారా! జగద్గురో! మీరు దయామూర్తులు. మాకు మానవరూపమున నగుపడుచున్నారు. కానీ మీరు మానవ మాత్రులు కారు. మీరే విశ్వనాథులు. కాశీపురము మీయందే కలదు. మీరు కాశీ
క్షేత్రముగూర్చి చెప్పుచున్నపుడు నేను
స్వప్నమో ఏమియోగాని కాశీక్షేత్రము చూడగలిగితిని.
దేవా నా భాగ్యమేమని వర్ణించగలనని స్తుతించ శ్రీ గురుమూర్తి సంతసించి
అతనితో నీకు నేను కాశీ క్షేత్రమును
దర్శింపచేసితిని. మీ వంశము ఇరువదియొక్క
తరముల వారికి గూడ కాశీయాత్ర ఫలము నేడు సిద్ధించెను. నీవు నిజమైన భక్తుడవు గాన నీవునా సేవ
చేయుచు నావద్దనే యుండుము. ఇక మీద మ్లేచ్ఛ సేవ చేయక దారా పుత్రుల తీసికొని
వచ్చి నా వద్దనే నివసించుము. అని చెప్పి
సాయందేవునితో సహ గణగాపురములోని మఠమునకు వచ్చిరి.
ఆపై నేమి జరిగెనని నామధారకుడు డడుగ సిద్ధముని పై కథను క్రిందివిధముగ
చెప్పుచున్నారు.
సాయందేవుడు గురుమూర్తి ఆజ్ఞననుసరించి తన గ్రామమునకేగి
గురుమూర్తికి తనయందు కలిగిన అనుగ్రహమును వారలతో చెప్పి వారల వెంటనిడుకొని
మహానందముతో గణగాపురము చేరి గురుమూర్తికి సాష్టాంగ వందనము మాచరించి చేతులు
జోడించుకొని ఇటుల స్తోత్రము చేసెను.
ఓం నమోజీ ! చంద్రమౌళి! మీరు త్రిమూర్తి స్వరూపులు. అజ్ఞానుల దృష్టికి మనుష్యులుగ
కనబడుచున్నారు. మీ మహిమ లపారము కాన
ఎవరికిని వర్ణింప తరముకాదు. చకోరమునకు
చంద్ర దర్శనమయినటుల నాకు దయానిధులయిన తమ దర్శనము లభించెను. పూర్వము నాచే చేయబడిన పాపరాసులన్నియు
భస్మమయ్యెను. నేను పపునీతుడనైతిని. గంగా
స్నానముచే పాపము నశించును. చంద్రుడు
తనకిరణములచే తాపమును పోగొట్టును.
కల్పవృక్షము దైన్యమును పోగొట్టును.
సద్గురుచరణ దర్శనముచే పాపములు, తాపములు, దైన్యము గూడ
నశించును. గురునాథుడు తన దర్శనముచే
చతుర్విధ పురుషార్ధముల నీయ సమర్ధుడు. అది
నావిషయమున సార్ధకమయ్యె నని చెప్పి ఈ
క్రింది విధముగ కర్ణాటక భాషలో రాగయుక్తముగ కీర్తించెను.
క|| (1) కండేనిందు భక్తజనర భాగ్య నిధియా
భూమండడ దొళగె నారసింహయతిరాయా!
సం|| భక్తజనసుభాగ్యోదయాకారః
మహీతలే యతీశ్వరః
దృష్టో మయా విశ్వతారః
నరసింహ సరస్వతీ యతీశ్వరః
తా|| భూమండలమున భక్తజనులకు భాగ్యనిధియై అవతరించిన శ్రీ నృసింహ
సరస్వతిని నేడు చూడ గలిగితిని.
(2) కండెనిందు దృష్టి యింద
వారిజాదళ పాదవన్ను
హృదయ కమల దల్లి
భజిసి సుఖవనీవ జగత్పతీయా
(అనుపల్లవి)
(సం) దృష్టొ దృక్కమల యుగేన త్వత్పద కమల ద్వంద్వమనేన
నష్టం స్మదతోఘం క్షణేన, సుఖదోసౌనో జగత్పాతా.
తా|| హృదయమున భక్తితో ధ్యానించు వారికి సుఖమునిచ్చు
జగత్పతియగు మీ చరణ కమలముల నేడు కనులార చూడగలిగితిని.
(3) భక్త జనరిగె కామ్య ఫలగళిత్తు సలహుతిరువ
యోగినియ రొడయ నారసింహ సరస్వతియ పాద. కండె||
(సం) దీనబంధుః పూరయతీష్టం భోజనానాం దయాబ్దిరిష్టం
యోగిజనానాం వందె శిష్టం నృసింహ సరస్వతీ గరిష్టం.
తా|| సంసారమున బాధపడుచున్న భక్తులకు అభీష్టముల నిచ్చి
రక్షించుచు యోగులకు ప్రభువై యోగసిద్ధి ననుగ్రహించెడి నరసింహ సరస్వతీ గరిష్ఠుని
నేడు చూచు భాగ్యము లభించెను.
(4) వాక్య కారణ నాగి జగదొళు దండకమండలను ధరిసి
సగుణ నెనిసి నుజనరిగె బలిద శ్రీ గురుయతివరన్నా. కండె నిందు||
(సం) లక్ష్యో వక్యైరాత్మా దండకమండలు దృక్త్వం స యతిః
సగుణ బ్రహ్మత్వం సత్ప్రీతిః న్యాసి శ్రేష్ఠో వై
గురుమూర్తిః
తా|| మహా వాక్య ప్రతిపాద్యమైన పరతత్వమే సగుణమై దండ
కమండలముల ధరించి సత్పురుషుల ఇట్టి రూపముతో నుద్ధరించుచున్న ఓ నరసింహ సరస్వతీ యతి
సార్వభౌమ నేడు మిమ్ము నేత్రానందముగ పొడగంటిని.
(5) ధరగె గణగాపుర కైలాస
హరిదాస రొడయె నెనిసి
కరుణది వరవిత్తు పొరెవ లనుదిన గురుచరణవన్ను. కండె
నిందు||
(సం) హరిదాస ప్రియ తరుణానిలయ స్వభక్త పాలక ప్రేమాతిశయ
చరణ స్పర్శాత్తే కైలాసో భూద్గంధర్వపురమ్
తా|| మీ చరణ స్పర్శవలన నీ గంధర్వపురము
భూకైలాసమయ్యెను. దయకు సముద్రమై ప్రేమతో
భక్తులను పరిపాలించుటకుగాను అవతరించిన పా పాదముల నేడు కంటిని.
(6) నేపద: కండెనమ్మా
ఇందు కండెనమ్మా భూమండల
దొళగె యతివరరాయచంయ్రన్నా ||పల్లవి||
(సం) భక్తజనసుభాగ్యోదయాకారః మహీతలే యతీశ్వరః
దృష్టో మయా విశ్వతారః
నరసింహ సరస్వతీ యతీశ్వరః
తా|| యతులను నక్షత్రములలో చంద్రుని వలె ప్రకాశించు
మిమ్ముల నేడు కన్నులతో చూచుచున్నాను.
భక్తజనుల భాగ్యమే సాకారమై వెలసినటుల బూమియందు యతీశ్వరుని రూపముననున్న
మిమ్ముల చూచితిని.
(7) తత్వబోధెయ ఉపనిషత్తత్వ చరితనా
వ్యక్త వాద పరబ్రహ్మ మూర్తి ఎనిసువనా ||కండె||
(సం) జయజయ భూమన్ సద్గురుమూర్తే జగద్ధేతో ధృతనరమూర్తే
కృపాఘనస్త్వం భ్రాజత్కీర్తే దయానిధేః పాహి విజూర్తే.
తా|| ఉపనిషత్ప్రతిపాదిత
తత్త్వమునకు ఆదర్శకమైన చరిత్రమును లోకమునకు
ప్రదర్శించే మీ పాదముల నేడు చూచుచున్నాను.
భక్తుల రక్షించుటలో జాగు చేయనటువంటి దయాఘన నీకు జయజయ.
(8) శేయశయన పరవేషకాయకనా!
లేసుకృపేయ నిమేష వెంబ
భాషాపాలంనా! ||కండెనిందు||
తా|| శేషశాయియే మీరు ఇట్టి యతీశ్వర దేహము ధరించితిరి. మీ కృపా కటాక్షము ఎవరియందు ప్రసరించునో వాడే
కడు ధన్యుడు. అట్టి మిమ్ముల నేడు చూచితిని.
(9) గంధపరిమళ దింద శోభితానంద సాగరనా!
ఛందవుళ్ళ యోగీంద్ర గోపీ వీందవల్లభనా. ||కండెనమ్మా||
తా|| ఆనదమునకు సముద్రుడవై
గంధపరిమళములచే శోభిల్లుచు యోగీంద్రులకు
ప్రియమును ఘటింపచేయ నవతరించిన గోపీజన ప్రియుడైన కృష్ణుని ఈ రూపమున
చూచుచున్నాను
(10) కరిరాయెని పంగె వరద గురురాయనా
నదసింహ సరస్వత్యంబ నారీ పురుషనామకనా. ||కండెనమ్మా||
తా|| కరి రాజైన గజేంద్రునికి మోక్షము నొసంగిన శ్రీ
మహావిష్ణువే (స్త్రీ పురుష) ప్రకృతి పురుషుల కభేదమును నరసింహ+సరస్వతి యను పేరుతో
సార్ధక మొనర్చి జగద్గురు రూపమున
సంచరిచుచున్న మిమ్ముల నేత్రానందముగ చూచితిని.
ఇవ్విధమున నో నామధారకా మీ పూర్వీకుడైన సాయందేవుడు గురుమూర్తిని కన్నడ భాషయందు స్తుతించగా
గురుమూర్తి మిక్కిలి సంతసించి అతనిని ఓదార్చిరి. తల్లి పిల్లల దగ్గరకు తీయునటుల
సాయందేవుని కుటుంబమును తన దగ్గర కూర్చుండబెట్టుకొని వారలయందు నిరుపమాన మగు ప్రేమను
కనబరచెను. నామధారకా! ఆదిన మెంత ధన్యమో
గదా! గురుమూర్తి వారల క్షేమసమాచార మడుగసాయందేవుడుక్షేమము చెప్పి తన ఇద్దరు పుత్రుల
వారి పాదములమీద పడవేసెను. ఇద్దరిలో
పెద్దవాడగు నాగనాథుని శిరమున గురుమూర్తి కృపతో తమ దివ్యహస్త ముంచి సాయందేవునితో ఈ
నీ పుత్రుడు పూర్ణాయుష్మంతుడు కాగలడు. మీ వంశము వృద్ధిగాంచును. ఈనా భక్తుడు
లక్ష్మిసంపన్నుడు కాగలడు. ఇక మీద మీరు మ్లేచ్ఛసేవ చేయునవసరములేదు. నాసేవ చేయుచుండుడు. నాయనుగ్రహమువలన మీవంశమునకు
కీర్తిరాగలదు. మీరు సంగమమునకు వెళ్లి స్నానమొనర్చి అశ్వత్థమునకు పూజగావించి రండని
జెప్ప సాయందేవుడటులనే యొనర్చి గురుసమక్షమునకు వచ్చెను. ఆదినము భాద్రపద శుద్ధచతుర్దశిగాన
భక్తులందరు గురుమూర్తి వద్దకు వచ్చివారినే అనంతస్వరూపముగ భావించి పూజలు
చేయుచుండిరి. గురుమూర్తి సాయందేవునితో ఈరోజు అనంతవ్రతము చేయుదినవ. భక్తులందరు అనంతుని పూజించుచున్నారు. నీవును
ఈదినమున అనంతవ్రత మాచరించుమని యన సాయందేవు డిట్లనుచున్నాడు.
స్వామీ! మీరే మాకు అనంతులు. మీ పాదసేవయే మాకు అనంతవ్రతమని
యన గురుమూర్తి ఇట్లు అనుచున్నారు. పూర్వము
కౌండిన్యుడను ఋషి ఆదరముతో నీ వ్రత మాచరించెను. నీవును కౌండిన్య గోత్రము వాడవు గాన
నీ వ్రత మాచరించుము అన సాయందేవుడు గురు
మూర్తితో స్వామీ ఈవ్రతము కౌండిన్యుడేవిధమున ఆచరించెనో ఈ వ్రతాచరణము వలన ఫలమేమియో
దయయుంచి విస్తరముగ సెలవిండని ప్రార్థింప గురుమూర్తి సాయందేవునితో పైఅధ్యాయమున అనంతవ్రతమును చెప్పగలరు.
ఇట్లు గురుచరితమున నలుబది రెండవ అధ్యాయము సమాప్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి