తత్వ విచారణ
ఆధ్యాత్మ రామాయణము నందు, అరణ్యవాస ప్రారంభములో, శృంగిబేర పురములో, కుశపత్రములపై శయనించిన సీతా రాములను చూచి దుఃఖించిన గుహునితో లక్ష్మణుడు ఈవిధముగా తత్వోపదేశము చేసెను.
సోదరా, నా మాట వినుము. ఒకని సుఖమునకు గానీ దుఃఖమునకు గానీ వేరెవ్వరూ కారణము కాదు. మానవుడు పూర్వ జన్మమున చేసిన కర్మమే ఒకరికి సుఖమునకు కానీ దుఃఖమునకు గానీ కారణము అగును. సుఖదుఃఖములకు వేరెవ్వరూ కారణము కాదు. పరులెవ్వరో సుఖదుఃఖములకు కారణము అని తలచుట తెలివి తక్కువ. నేను చేయుచున్నాను అని ఆనుకొనుట మిథ్యాభిమానము. ఎందుకనగా జనులు తమ తమ కర్మ పాశములచే కట్టబడి ఉన్నారు. మానవుడు స్వయముగా కర్మలు ఆచరించి తద్భావానుసారముగా సుహృత్తు, మిత్రుడు, శత్రువు, ఉదాసీనుడు, ద్వేషి, మధ్యస్థుడు, బంధువు మున్నగు వారిని కల్పించు కొనుచున్నాడు.
కావున మానవుడు ప్రార్తబ్ద కర్మానుసారము సుఖదుఃఖాదులలో ఏది ప్రాప్తించిననూ అనుభవించుచూ ప్రసన్న చిత్తుడై ఉండవలయును. భోగములు వచ్చుట యందు కానీ, పోవుట యందు కానీ ఆపేక్ష ఉండరాదు. భోగములు వచ్చిన రావచ్చు, పోయిన పోవచ్చు. మనము కర్మకు ఆధీనులము. ఏ దేశమున ఏ కాలమున ఎవ్వడు ఏ శుభాశుభ కర్మలను ఆచరించునో వానిని ఆతడు అవశ్యము అదేవిధముగా అనుభవించవలసి ఉండును. దీనిని ఎవ్వరూ తప్పించ లేరు.
కావున శుభాశుభా కర్మ ఫలము ప్రాప్తించగానే హర్షమునో దుఃఖమునో పొందుట నిరర్థకము. విధాత గతిని ఎవరునూ ఉల్లంఘించలేరు. మానవుడు సదా సుఖ దుఃఖములచే చుట్టబడి ఉండును. మనుష్య శరీరము పుణ్య పాప ఫలముగా ఉత్పన్నమగుటచే సుఖ దుఃఖ మయముగానే ఉండును. సుఖము వెంట దుఃఖము, దుఃఖముననుసరించి సుఖము పగలు రేయి వలె జీవులకు అపరిహార్యము. ఈ రెండూ నీరు, బురద వలె సర్వదా కలసియే ఉండును.
కావున విద్వాంసులు అంతా మాయయే అను భావన కలిగి ఇస్తానిష్ట ప్రాప్తి యందు ధైర్యము వహించి హర్ష శోకములను పొందరు.
ఈవిధమైన సుఖదుఃఖముల యెడ ఉపేక్షా భావము ఆచరణలో కష్టమే ఐనా, ఈ విధానము తప్ప మరి యే ఇతర పధ్ధతి వల్లనూ జీవుడు ఈ జనన మరణ చక్రములోనుంచి తప్పించుకోలేడు, కావున సుఖదుఃఖములకు ప్రారబ్ద కర్మమే కారణమని తెలిసి, ఉపేక్షా భావముతో తరించగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి