శ్రీ గురుభ్యో నమః
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్త వత్సలం
ప్రపన్నార్తి హరం వందే స్మర్తృగామీ సనోవతు౹౹
గణగాపురమున గురుమూర్తి అనుగ్రహము వలన శ్వేత కుష్టురోగమునుండి విముక్తి పొందిన నంది యను కవి గురుమూర్తి శ్రీనరసింహ సరస్వతీ స్వామివారిని గూర్చి స్తుతించుచు అద్భుతమైన కవిత్వము చెప్పసాగెను. నంది బ్రాహ్మణుడు చెప్పిన కవిత్వసారముః-
స్వామీ! మాయలో పడి సంసార సాగరములో మునిగి తేలుచు మిమ్ము స్మరింపజాలక దూరమైతిని. మందమతినై మీ నామము స్మరింప జాాలనైతిని. అందుచే స్వేదజములు, అండజములుగ పుట్టితిని. పశుజన్మల గూడ నెత్తితిని. అట్టి నీచ జన్మలయందు నిన్ను స్మరించు అవకాశమే లేకపోయెను. అన్ని జన్మలలొనికి మానవ జన్మ దుర్లభమైనది, ఉత్తమమైనది. అందునూ బ్రాహ్మణ జన్మ శ్రేష్టమైనది. అప్పుడునూ సద్గురువును భజింపక మూర్ఖుడై కాలము గడిపినచో అదియును వ్యర్ధమే కదా! జీవుడు పైలోకములోనుండి వర్షధారల ద్వారా అన్నమై తండ్రియందు రేతో రూపమై ఋతుకాలమున తల్లి గర్భములో ప్రవేశించి ఆమె రక్తములో కలసి అయిదు దినములకు ఒక బుడగ రూపమునొందును. పదునైదు దినములకు అది గట్టిపడును. ఒకమాసమునకు మాంసపిండాకారము నొందును. రెండు నెలలకు శిరస్సు, రెండు పాదములు ఏర్పడును. కానీ ఇట్టి స్తితిలో జీువుడు నిన్ను స్మరింపజాలకున్నాడు. మూడు నెలలకు సర్వావయవములు, నవద్వారములు ఏర్పడును. ప్రాణము కూడ అందు ప్రవేశించును. కానీ అప్పుడు కూడ మిమ్ములను స్మరింప సామర్ధ్యము లేనివాడుగనే యుండును. అయిదవ నెలలో చర్మము, రోమములు ఏర్పడును. అరవ నెలలో ఉచ్ఛ్వాస నిశ్వాసముల విడుచును. ఏడవ నెలలో శ్రోత్రమును, జిహ్వ, ముక్కు ఏర్పడి తొమ్మిది నెలలవరకు తల్లి గర్భములో మలమూత్రముల మధ్య కష్ట పడును.
తల్లి భుజించిన కారము మొదలగు తీక్షణ పదార్ధముల వలన గర్భములో జీవుడు మితి లేని బాధనొందును. ఆబాధలో జీవుడు నిన్ను స్మరింపజాలడు. ప్రసవ కాలము రాగా ఎంతయో కష్టముతో తల్లి గర్భమునుండి జన్మించును. జన్మించిన తరువాత కూడా మానవుని జీవితములో సగభాగము నిద్రలో వ్యర్ధమగుచున్నది. మిగిలిన సగము బాల్యము, యౌవనము, వార్ధక్యముగా మూడు విధముల విభజింప బడుచున్నది. బాల్యావస్థలోని కష్టముల చెప్పనెవరి తరము?
తల్లి ఊయలలో పరుండ బెట్టును. బాలుడు మలమూత్రములలో పొరలచు అజ్ఙానముతో తన మలమునే తాను భక్షించుచుండును. బాల్యములో పడిన బాధ స్మరించిన ఎంతవారికి హృదయము కంపించును. ఉదరబాధతో బాలుడు బాధనొందుచుండ, తల్లి తెలిసికొనజాలక ఆకలి అయ్యెనని పాలనిచ్చును. ఆకలితో నేడ్చుచుండ, కడుపునొప్పితో బాధపడుచున్నాడని లేనిపోని మందులనుపోయును. అప్పటికినీ ఏడ్చుచుండ ఊయలలో పరుండబెట్టి ఊపుచు నిద్రపుచ్చ ప్రయత్నించునుగానీ, వాని ఆకలి బాధ గుర్తించదు. భయపడెనేమోయని రక్షల గట్టించును. ఒకసమయమున పక్కలో తేలుకుట్టి బాలుడు ఏడ్చుచుండ తల్లి తెలిసికొనలేక పాలిచ్చి ఏడ్పు మాన్ప ప్రయత్నించును. కానీ తేలు కుట్టినట్లు తెలిసికొనలేదు. పైపెచ్చు ఆ తేలుగల ఊయలలోనే పరుండబెట్టును. బాలుడు ప్రాణాంతక బాధనొందును గానీ చెప్పజాలడు. ఇట్టి బాల్యములో జీవుడు నిన్నెట్లు స్మరింపగలడు?
క్రమముగ జీవుడు బాల్యము దాటి ఎంతో కష్టము అనుభవించి నిన్ను స్మరింపక ఆటపాటలతో కాలము జరుగ యౌవనదశలో నడుగిడును. కామాంధకారములో పడి తల్లిదండ్రుల మరచును. పెద్దల తిరస్కరించును. వారవనితల కామించును. వృద్ధుల వెక్కిరించును. ఇంద్రియలోలుడై మిడుత దీపము మీద పడినట్లు స్త్రీల రూపము చూసి భ్రమించి వ్యభిచరించును. పరద్రవ్యమపహరించును. పెద్దల బోధ చెవిన పెట్టడు. మహాత్ముల నిందించును. ఇట్లు నిన్ను స్మరించక కాలము వ్యర్ధము చేయును. ఇంతలో వృద్ధాప్యము వచ్చి మీద పడును. అప్పుడు భార్యాపుత్రులకు కూడా భారమై శరీరము వణక సాగును. దంతములు ఊడిపోవును. చెవులు వినబడవు.
స్వామీ! ఈవిధమున మానవుని జీవితము నిన్న స్మరింపు భాగ్యములేక నానా కష్టముల పాలగుచున్నది. ప్రభో నాయందు దయయుంచి నన్ను సంసార సాగరము నుండి దరిచేర్చుడు. మంద మతినై మీ చరణ సత్త నెరుగనైతిని. మీరు కేవలము నారాయణావతారమై యున్నారు. నరవేషము ధరించి విశ్వమును తరింపచేయ నవతరించిరి. మీురు విశ్వపాలకులు. పామరులు దివాంధుల వలె మిమ్ముల గుర్తింపజాలరు. నేను మీ కింకరుడ. సంసార సాగరమునుండి నన్ను తరింపచేయుడు అని నంది యను కవి అద్భతముగా కవిత్వముచెప్పుచుండెను.
నంది తిరిగి ఇట్లనుచున్నాడు. ఓ జనులారా! వినుడు ఈ గురుమూర్తి కేవలము పరబ్రహ్మము. వీరి దర్శనమాత్రముననే నా పాపములన్నియు నశించెను. దావాగ్నిచే తృణము దగ్ధమగు రీతిని గురు కృప ఎవ్వరియందు ప్రసరించునో వారి పాపములన్నియు నటుల నిస్సంశయముగ నశించును. గురువు కన్న వేరే దేవుడు లేడు. కాన సద్గురు చరణముల భక్తితో భజించుడు. గురు చరణము కడు పవిత్రము. గురుచరణ స్పర్శచే బ్రహ్మచే లిఖింపబడిన ఫాలమందలి దుష్టాక్షర పంక్తియు మారిపోగలదు. నిధివలె గురుమూర్తి మన ససమక్షమున నున్ననూ మనము గుర్తింపజాలకున్నాము. శ్రీనృసింహ సరస్వతీ స్వామి మన పాలిటి కామధేనువు. కాన భజించి ధన్యులు కండు. గురుమూర్తి ఇహలోకమున సౌఖ్యము, పరత్ర సద్గతి అనుగ్రహించ సమర్ధడు. ఈ మాట సత్యము, ముమ్మాటికీ సత్యము. నమ్ముడు.
కావున తరింపదలచిన వారు సమయము వృధా చేయక సద్గురువును భజించి ధన్యులు కావలసినది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి