16, మే 2022, సోమవారం

 కుశనాభుని కుమార్తెల వృత్తాంతము

(రామాయణము,బాల కాండ, 32, 33 సర్గలు)

        కుశుడు అను మహానుభావుడు విశ్వామిత్రుని వంశమునకు మూల పురుషుడు. గొప్ప తపస్వి, ధర్మజ్ఞుడు.  ఆయన భార్య వైదర్భి. ఉత్తమ వంశసంజాతురాలు.  పతికి అనుకూలవతి. వారికి కుశాంబుడు, కుశనాభుడు,  అధూర్తరజసుడు, వసువు అను నలుగురు కుమారులు కలిగిరి. వారందరూ సద్గుణ సంపన్నులు, యోగ్యులు. మిగుల తేజస్సంపన్నులు. ధర్మ తత్పరులు, సత్యవచనులు. తండ్రి వారికి క్షత్రియ ధర్మములను బోధించి ధర్మయుతముగా ప్రజాపరిపాలన చేయమని బోధించెను. వారిలో కుశాంబుడు కౌశాంబీ పురమును, కుశనాభుడు మహోదయము అనే పురమునను, అధూర్తరజసుడు ధర్మారణ్యము అనే నగరమును, వసువు గిరివ్రజము అనే నగరమును నిర్మింప చేసి, పరిపాలించుచుండిరి. గిరివ్రజము చుట్టును  ఐదు పెద్ద పర్వతములు విరాజిల్లుచున్నవి. సుమాగధి అను నామాంతరము గల శోణ నదము మగధదేశమునందు ప్రవహించుచున్నది. కుశనాభుడు తన భార్య ఐన ఘృైతాచి యందు నూర్గురు కన్యా రత్నములను సంతానముగా పొందెను. సాటిలేని రూప యవ్వన లావణ్యవంతులైన వారు ఒకనాడు ఉద్యానవనములో సంచరించుచుండగా, సర్వత్ర సంచరించు వాయుదేవుడు ముగ్ధుడై వారలతో  నేను మిమ్ము కోరుకొనుచున్నాను. మానుషభావమును త్యజించి, నన్ను పొంది దీర్ఘాయువును పొందుడు, మీ యవ్వనము అక్షయమగును, మీరు దేవతలగుదురనెను.  అదివిని వారు అయనను గేలిచేసి, ఓ సుర శ్రేష్ఠా నీవు సర్వభూతములలో లోపల బైట సంచరించుచుందువు. నీ ప్రభావము మేమెరుగుదుము. దివ్య శక్తి గల నిన్ను నీ స్థానమునుండి తొలగింపగల సామర్ధ్యము మాకు కలదు. కానీ మ తపశ్శక్తిని కాపాడు కొనుటకై మేమట్లు చేయుటలేదు.  మా తండ్రిగారు నిశ్చయించిన వారినే మేము భర్తగా సేవించెదము. అని అనగా వాయుదేవుడు వారి మాటలకు కుపితుడై,  వారిలో ప్రవేశించి వారిని గూనివారిగా చేసెను. దానితో వారు సిగ్గుతో, సంభ్రాంతులై భూమిపై పడి, శోకముతో తండ్రిని చేరిరి. ఆయన మిమ్ములను  ఇట్లు కుబ్జలుగా చేసి ధర్మమును అవమానించినదెవరు అని ప్రశ్నించెను. అంతవారు సర్వత్ర సంచరించు వాయుదేవుడు, మమ్ములను బలాత్కరింప దలచి, ధర్మమును విస్మరించెను. మేము తండ్రిచాటు బిడ్డలము. మా తండ్రి నీకిచ్చి వివాహము చేయునేమో మా తండ్రిని అడుగుము అని మేము పలికితిమి. అంత ఆయన పాపానుబంధముతో మామాటలను పట్టించుకొనక మమ్ములను బాగుగా కొట్టెను అనిరి. అంత కుశనాభుడు, ఓ పుత్రికలారా, క్షమా శీలురు చేయదగిన పని మీరు చేసిరి. ఐకమత్యముతో మెలగి మన వంశగౌరవమును కాపాడిరి. స్త్రీలకు గానీ,పురుషులకు గానీ, అపరాధులను క్షమించు గుణము కలిగియుండులట మంచి భూషణము. క్షమను కలిగియుండుట అరుదైన విషయము. ఐకమత్యముతో మీరు ప్రదర్శించిన ఈ క్షమాగుణము దేవతలకును దుష్కరము. పాత్రులకు దానము చేయుట వలనను, సత్యప్రవర్తన వలనను, యజ్ఞములను ఆచరించుట వలన కలుగు మహాఫలములన్నియు క్షమాగుణము కలిగియుండుట వలన లభించును. క్షమ యశస్కరము, పరమ ధర్మము. ఈ జగత్తంతయు క్షమపైనే నిలిచియున్నది. ఈవిధముగా పలికి, కుశనాభుడు, తన కుమార్తెలకు తగిన వివాహవిషయముపై తన మంత్రులతో ఆలోచించెను. 

        ఆకాలమునందు చూళి యను ఊర్ధ్వరేతస్కుడు, సదాచార సంపన్నుడైన  ఒక మహాముని బ్రహ్మను గూర్చి తపస్సు చేయుచుండెను. ఆ ఋషికి ఊర్మిళ తనయ యైన సోమద అను గంధర్వ స్త్రీ సపర్యలు చేయుచుండెను. కొంతకాలమునకు ఆమె చేయు సపర్యలకు  ఆ ఋషి సంతుష్ఠుడై ఆ చూళి ఋషి  ఆమెతో నీ సపర్యలకు సంతసించితిని. నీకు శుభమగుగాక. నీకేమి కావలయునో కోరుకొమ్మనెను. ఆమె  ఆయనతో మధురముగా నిట్లనెను. ఓ ధర్మబుద్ధీ! బ్రహ్మజ్ఞానము గల  ఒకపుత్రుని నాకు ప్రసాదించుమనెను. నేను నిష్ఠతొ బ్రహ్మచర్యమును అవలంబించుచున్నదానను. పవిత్రురాలను. నేను  ఎవరికినీ భార్యను కాను. నీ బ్రహ్మతేజస్సు ప్రభావముతో నాకు ఒక పుత్రునిప్రసాదించుము. అందుకు నీవే సమర్ధుడవు అనెను. అంత ఆ ఋషి ఆమెకు ఒక ఉత్తమోత్తముడైన  పుత్రుని ప్రసాదించెను.  చూళి మహర్షియొక్క  ఆ మానస పుత్రుడు బ్రహ్మదత్తుడని ప్రసిద్ధిచెందెను. సోమద కుమారుడైన బ్రహ్మదత్తుడు సిరిసంపదలతో తులతూగుచున్న కాంపిల్య నగరమును పాలించుచుండెను. ధర్మబుద్ధి గల కుశనాభుడు తన కుమార్తెలను బ్రహ్మదత్తునకు ఇచ్చి వివాహము చేయుటకు నిశ్చయించి సంతుష్టాంగతరంగుడై,బ్రహ్మదత్తుని ఆహ్వానించి, తన నూఱుగురు కుమార్తెలను ఇచ్చి వివాహమొనర్చెను. అంత ఆ బ్మహ్మత్తుడు విద్యుక్తముగా ఆ కన్యలను పాణిగ్రహణమొనర్చెను. బ్రహ్మదత్తుని కర స్సర్శ కలిగినంతనే ఆ నూఱ్గురు వధువుల గూని స్థితి మాయమయ్యెను. వారి మనో వ్యథలు మాయమయ్యెను. వారు నిరుపమాన సౌందర్యములతో విరాజిల్లిరి. తన పుత్రికలు వాయుదేవుని బాధనుండి విముక్తునైనందులకు ఆ కుశనాభమహారాజు ఎంతయు సంతసించెను. 

బ్రహ్మదత్తునితో తన కుమార్తెల వివాహమయిన పిదప, కుశనాభుడు, తన కుమార్తెలతో సహా,  ఆయనను కాంపిల్య నగరమునకు పంపెను. బ్రహ్మదత్తుని తల్లియైన సోమద, తన కుమారుడు కుశనాభుని కుమార్తెలను పెండ్లియాడినందులకు, వారి వైరూప్యములను నివారించినందులకు, మిగుల సంతోషపడెను. వరుసగా తన కోడండ్లను సుకుమారముగా నిమురుచూ వారిని అభినందించెను.  వారి తండ్రియైన కుశనాభుని ప్రశంసించెను. 

ఈ రెండు సర్గలలో వేదాంత, యోగ, విషయాలను పక్కన పెడితే, క్షమ యొక్క ప్రభావము వర్ణింప బడినది. ఈలోకములో క్షమయే గొప్పదనీ, క్షమ వలననే మహా యజ్ఞఫలము లభించుననీ తెలియ చేయబడినది. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి