30, అక్టోబర్ 2022, ఆదివారం

ఆశ్రమ ధర్మములు

ఆశ్రమ ధర్మములు

శ్రీమద్భాగవతము,సప్తమ స్కంధము

ధర్మరాజు నారదుని ప్రశ్నించుట.

పుణ్యాత్మా! నీవు సాక్షాత్తు పద్మసంభువుడైన బ్రహ్మదేవుని మానస పుత్రుడవు. స్వచ్ఛమైన నడవడిక కలవాడవు. సర్వదా నారాయణ చరణ స్మరణ పరాయణుడవు. శాంతమూర్తివి. దయాహృదయుడవు. సర్వజ్ఞుడవు. సకల ధర్మాలూ, ఆచార వ్యవహారాలూ నీకు తెలుసు. నీవు ఎరుగని ధర్మం లేదు. అన్ని వర్ణాల వారికి పనికివచ్చే ఉత్తమమైన ధర్మం ఏది? ఏ ధర్మం ఆచరిస్తే మానవునికి నిర్మలమైన భక్తి జ్ఞానాలు ప్రాప్తం అవుతాయి? తమ వంటి వారు ఏది ఉత్తమ ధర్మం అని భావిస్తారు? అటువంటి ధర్మస్వరూపాన్ని వివరంగా చెప్పండి. నాకు వినాలని కుతూహలంగా ఉంది. అని ధర్మరాజు నారదుడిని అడిగాడు. అంతట నారదమహర్షి ఇలా చెప్పాడు “పూర్వం దక్షప్రజాపతికి నారాయణుడు తన అంశతో అవతరించాడు. లోకక్షేమం కోసం బదరికా వనంలో తపోదీక్షలో ఉండగా నారాయణుడు ఈ సనాతన ధర్మమును నాకు వివరించాడు. అలా విన్నది నీకు వివరిస్తాను. అవి:-

సకల జనుల త్రింశతి లక్షణములు (30)

సత్యము దయ

ఉపవాసాది తపము శౌచము

సైరణ సదసద్వివేకము

మనోనియమము బహిరింద్రియ జయము

హింస లేమి బ్రహ్మచర్యము

దానము యథోచిత జపము

సంతోషము మార్దవము

సమదర్శనము మహాజన సేవ

గ్రామ్యకోరికలు నిష్ఫల క్రియలు విడుచుట

మితభాషిత్వము దేహముగాని తన్ను వెదకికొనుట

అన్నోదకంబులు ప్రాణులకు పంచి యిచ్చుట ప్రాణులందు దైవత్వ బుద్ధి

యాత్మబుద్ధి చేయుట శ్రీనారాయణచరణ స్మరణకీర్తనము, శ్రవణము,సేవ

అర్చన నమస్కారము

దాస్యము ఆత్మసమర్పణము

సఖ్యము చెలిమి కలిగి ఉండుట

బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మములు

శ్రద్ధగా విను ధర్మరాజా! ముందుగా బ్రహ్మచర్య లక్షణాలు చెప్తాను. బ్రహ్మచారి మౌంజీ, కౌపీనం, యజ్ఞోపవీతం, కృష్ణాజినం, పలాశదండం, కమండలం, దర్భలు ధరించాలి; కేశసంస్కారం చేసుకొనరాదు; శీలవంతుడై ప్రవర్తించాలి; మౌనంగా మూడుపూటలూ బ్రహ్మగాయత్రిని జపించాలి; ప్రాతఃకాల, సాయంకాలలో సూర్యోపసనం, ఆగ్ని ఆరాధన, గురువందనం, దేవతార్చన చేస్తుండాలి; గురువు గారి గృహంలో దాసుని వలె భక్తిగా, వినయంగా, సౌమ్యంగా ఉంటూ వేదాలు వల్లెవేయాలి; అధ్యయానికి ఆరంభంలోనూ, చివరా ఆచార్యదేవులకు పాదాభివందనం చేయాలి; ఉదయం సాయంకాలం మంచి గృహస్థుల నుంచి భిక్షాన్నం గ్రహించి గురువులకు నివేదించి; వారి అనుజ్ఞతో మితంగా భుజించాలి; నియమిత దినాలలో ఉపవాసాలు ఉండాలి; స్త్రీలతోనూ, స్త్రీలోలురతోనూ అనవసరంగా సంభాషించ రాదు; బ్రహ్మచారి గురుపత్నులతో, పరాంగనలతో తల అంటించుకోవటం, తల దువ్వించుకోవటం, శరీరం పట్టించుకోవటం, స్నాన సపర్యలు చేయించుకోవటం, ఏకాంతంగా ఉండటం పనికిరాదు; ఎల్లప్పుడూ ఇంటిలోనే ఉండక జితేంద్రియుడై సత్యభాషణుడై మెలగాలి.స్త్రీ సాంగత్యం ఏమాత్రం తగదు; స్త్రీ దావాగ్ని వంటిది;. పురుషుడు నేతి పాత్ర వంటివాడు; సెగ తగలగానే పాత్రలోని నెయ్యిలా కరిగిపోతాడు; బ్రహ్మదేవుడు అంతటి వాడు తన కూతురిపై వ్యామోహంతో పట్టుకున్నాడు కదా! కాబట్టి, బ్రహ్మచారికి ఆడవారి సాన్నిహిత్యం పనికి రాదు.

గృహస్థ ఆశ్రమ ధర్మములు

ధర్మరాజా! ఆలకించు! ఆత్మసాక్షాత్కారం పొంది, ఇంద్రియాలకు కనిపించే బాహ్య ప్రపంచం అంతా స్వప్నమాత్రమే నని ఎరిగి, తనకూ పరబ్రహ్మకూ భేదం లేదని ఎప్పటివరకూ గ్రహించడో, అప్పటివరకూ స్త్రీ, పురుష భేదభావం వదలుట భావ్యం కాదు. కాబట్టి, బ్రహ్మచారి, యతి, గృహస్థుడు ఎవరైనా సరే మనస్సు పరిపక్వం చెందకుండా అద్వైతాను సంధానం చేసుకోవటం మూర్ఖత్వం అవుతుంది. కనుక, కన్న కుమార్తెతో కూడా రహస్యంగా ఏకాంతంగా మెలగరాదు.

రాజా! ధర్మరాజా! శిరోజసంస్కారాలు, అభ్యంగనాదిసంస్కారాలు మానుట; చందనం, భూషణాలు మున్నగు అలంకారాలు విడిచిపెట్టుట; తన భార్యను ఋజువైన సమయంలో మాత్రమే పొందుట; ఇతర స్త్రీలను చూసి మోహం చెందకుండా ఉండుట; చక్కని మన స్థైర్యం కలిగి ఉండుట; మధు మాంస విసర్జన; మిక్కిలి ఉత్తమమైన నడవడికతో మెలగుట కలిగి తన ధర్మం నిర్వర్తించు కోవిదుడే ఉత్తమ గృహస్థుడు.

మరియు, బ్రాహ్మణుడైన గృహస్థుడు గురువులు వలన షడంగాలు అనే వేదాంగాలైన ఉపనిషత్తులు, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషము లను వాటితో సహా ఋక్, యజు, స్సామ వేదాలనే వేదత్రయాన్ని పఠించాలి. తన స్థాయికి తగినట్లు వాటి అర్థ విచారణ చేయాలి. యథాశక్తి గురువులు అభీష్టాలు తీర్చాలి. ఇంటిలో ఉన్నా, వనంలో ఉన్నా నిష్ఠాగరిష్ఠుడై ఉండాలి. ఇతర జీవాలతో సహజీవనం సాగిస్తూ, ముఖ్యంగా గురువుల, అగ్నుల యందు, తన యందు, సర్వ భూతము లందు అచ్యుతుడైన పరమాత్మను దర్శించాలి. అట్టి గృహస్థుడు ఆత్మజ్ఞానంతో, ఇంద్రియ లోలత్వం లేకుండా జీవించి పరబ్రహ్మమును చేరుకుంటాడు.

వానప్రస్థ ఆశ్రమ ధర్మములు

వినవయ్యా నరనాథా! ధర్మజా! ఇక వానప్రస్థాశ్రమ ధర్మాలు చెప్తాను. వానప్రస్థాశ్రమం స్వీకరించిన వాడు అడవులకు వెళ్ళి మునివృత్తి అవలంబించాలి. ఋషీశ్వరులు నియమించిన నియమాలు పాటించిన పుణ్యాత్ముడు మహర్లోకం చేరతాడు.

గృహస్థాశ్రమ ధర్మాలు చక్కగా నిర్వర్తించిన పిమ్మట వానప్రస్థాశ్రమం ఆరంభించాలి; అరణ్యాలలో నివసించాలి; అక్కడ దున్నకుండా దొరికే తృణ ధాన్యాలు ఉడకబెట్టినవి కానీ, పచ్చివి కానీ, ఎండలో ఎండిన ఫలాలు కానీ భుజిస్తూ జీవించాలి; అడవిలో లభించే ఆహారాలతో హవిస్సు పురోడాంశాదులు చేస్తూ, ప్రతి నిత్యం యజ్ఞం నిర్వహించాలి; నిన్నటి రోజు మిగిలిన పదార్థాలను పారేసి, ఏ రోజు కా రోజు క్రొత్తవి సంపాదించుకోవాలి; అగ్నిని కాపాడుకోవటం కోసం పర్ణశాలను కాని, కొండగుహను కానీ ఆశ్రయించ వచ్చును; గాలీ, చలీ, ఎండా, వానా మున్నగు వాటిని సహించాలి; గడ్డం గీసుకోరాదు; క్షౌరం పనికిరాదు; తల దువ్వుకోరాదు; కేవలం జటిలుడై జీవించాలి; దండం, కమండలం, జింకచర్మాలు, నారబట్టలూ ధరించాలి; పన్నెండేళ్లు కానీ, ఎనిమదేళ్ళు కానీ, నాలుగేళ్లు కానీ, రెండేళ్లు కానీ, ఒక సంవత్సరం కానీ ఏకాగ్రచిత్తంతో తపస్సు చేయాలి; బుద్ధిని చలించనీయకుండా మౌనియై జీవించాలి.
దైవవశాత్తూ కానీ, వృద్ధాప్యం వల్ల కానీ, రోగం వల్ల కానీ తన ధర్మాలూ, అనుష్ఠానాలు చేయలేని పరిస్థితులలో నిరాహార వ్రతం పూనాలి. ఆత్మ యందు అగ్నులను ఆరోపణ చేసి సన్యసించాలి. శరీర రంధ్రాలను ఆకాశంలోనూ, నిశ్వాసం గాలిలోనూ, శరీరంలోని వేడిని తేజస్సులోనూ, రసం జలంలోనూ, శల్య మాం సాదులను మట్టిలోనూ విలీనం చేయాలి. వాక్కును వక్తృత్వంతో పాటూ అగ్ని యందూ, హస్త ద్వయాన్ని శిల్పంతో పాటూ ఇంద్రుని యందూ, పాద ద్వయాన్ని నడకతో పాటు మృత్యువు నందూ, శ్రోత్రద్వయాన్ని శబ్దంతోపాటు దిక్కుల యందూ, చర్మాన్ని స్పర్శతో పాటూ వాయువు నందూ, కళ్ళను రూపంతో పాటు సూర్యుని యందూ అనుసంధానం చేయాలి. జిహ్వను వరుణ సహితంగా నీటి యందూ, నాసికను గంధ సహితంగా భూమి యందూ, మనస్సును మనోరథంతో పాటు చంద్రుని యందూ, బుద్ధిని బోధంతో పాటు కవియైన బ్రహ్మ యందూ, మమత్వమును అహంకారంతో పాటు రుద్రుని యందూ, మనస్సును సత్యంతో పాటు క్షేత్రజ్ఞుని యందూ, వికారం పొందిన క్షేత్రజ్ఞుని గుణాలతో పాటు పరబ్రహ్మము నందూ విలీనం చేయాలి. ఈ విధంగా ఆయా విషయేంద్రియాలను ఆయా అధిదేవతలతో ఐక్యం కావించాలి.
అటు పిమ్మట పృథ్విని జలంలోనూ, జలమును తేజస్సులోనూ, తేజస్సును వాయువు లోనూ, వాయువును గగనంలోనూ, గగనమును అహంకార తత్త్వములోనూ, అహంకారాన్ని మహత్తత్త్వంలోనూ, మహత్తత్త్వమును ప్రకృతిలోనూ, ప్రకృతిని శాశ్వతుడైన పరమాత్మలోనూ లయం చేయాలి. అపుడు కేవలం చిన్మయుడుగా మిగిలిన క్షేత్రజ్ఞుడిని జ్ఞానంతో తెలుసుకుని, అద్వైతుడై కట్టెలను దహించిన అగ్నివలె పరమాత్మ అయిన నిర్వికార బ్రహ్మములో విలీనం కావాలి.

సన్యాస ఆశ్రమ ధర్మములు

పుణ్యుడా! ధర్మజ్ఞా! మానవుడు వానప్రస్థాశ్రమం స్వీకరించి, ఆ ధర్మాలు పాటిస్తూ జీవించి, పిమ్మట ముక్తసంగుడై సన్న్యాసాశ్రమం తీసుకోవచ్చు.

సన్న్యాసాశ్రమం స్వీకరించిన సన్న్యాసి దేహమాత్రావశిష్టుడై ఉండాలి. సర్వభూతము లందూ నిరపేక్షుడుగా, క్షుకుడుగా, ఆత్మారాముడుగా, సర్వప్రాణి సమ భావం కలవాడిగా, శాంతుడుగా, సమచిత్తుడుగా ఉండి, సదా నారాయణ పరాయణుడై తేజరిల్లుతూ ఉండాలి. సన్న్యాసి శరీరం మీద గోచీ మాత్రమే ధరించాలి. దండ, కమండలాలు విసర్జించాలి. ఆత్మపరములు కానట్టి శాస్త్రాలను విసర్జించాలి. జ్యోతిషం మొదలైన లౌకిక విద్యలు పరిత్యజించాలి. కుతర్కాలకు పోకుండా, ఎట్టి పక్షపాతం పెట్టుకోకుండా, ఆత్మచింతనలోనే నిమగ్నమైన సమాధి నిష్ఠలో ఉండాలి. శిష్యులకు వంచనతో గ్రంథాలు బోధించరాదు. రకరకాల విద్యలు ప్రదర్శింప రాదు. మత్తతలో నిమగ్నుడు కారాదు. పెక్కుదినాలు ఒకేచోట నివసించ కూడదు. ఒక ఊరిలో ఒక రాత్రి మాత్రమే గడపవచ్చు. కార్యకారణాలకు అతీతమైన పరమాత్మలో విశ్వాన్ని దర్శిస్తూ, సత్ అసత్ పదార్థాలతో నిర్మతమైన ఈ విశాల విశ్వంలో పరబ్రహ్మమైన ఆత్మను సందర్శిస్తూ ఉండాలి. జాగరణ, స్వప్న, సంధి సమయాలలో ఆత్మనిరీక్షణ చేయాలి. ఆత్మకు బంధమోక్షణాలు మాయామాత్రాలు కాని, వాస్తవంగా లేవు అని భావించాలి. జన్మకు జీవితం స్థిరం కాదనీ, మృత్యువు నిశ్చయం అని తెలుసుకొని ప్రవర్తించాలి. సకల జీవకోటి పుట్టుకలకూ, నాశములకు కాలం మూలం అని గ్రహించి, అట్టి కాలం కోసం నిరీక్షిస్తూ ఉండాలి. ఈ విధంగా జ్ఞానోత్పత్తి వరకూ ప్రవర్తించి, అటు పిమ్మట విజ్ఞాన విశేషం ప్రాప్తిస్తే “పరమహంస” అయి దండాది చిహ్నాలు ధరించికానీ, ధరించకుండా కానీ అంతరంగంలో ఆత్మను అనుసంధానం చేయగలిగి, విజ్ఞానియై ప్రకాశించాలి. బాహ్యానుసంధానాలు వలన ఇతరులకు పిచ్చివాని లాగ, అమాయక బాలుని లాగ, మూగవాడి లాగా కనిపించాలి.

సనాతన (వేద) ధర్మము ఈ విధంగా చెప్పుచుండగా, నేడు పైన వివరించిన అన్ని ఆశ్రమాలూ, చెడిపోయి, వ్యవస్థలు అన్నీ అస్తవ్యస్తములయ్యాయి. మోక్షమే పరమ ధర్మముగా ఉండవలసిన సన్యాస ఆశ్మరము ఏవిధంగా నేడు భ్రష్టు పట్టిందో, సన్యాసులు పీఠాధిపతులు ఎలా వేద విరుద్ధముగా ప్రవర్తిస్తున్నారో చూచుచున్నాము. కాబట్టి వీరిని జాగ్రత్తగా కనిపెట్టి, జనులు తగు జాగరూకతతో మెలగవలెను.  

సనాతన (వేద) ధర్మము చెప్పిన ప్రకారము జనులు ప్రవర్తించినచో శాంతి, సౌభాగ్యములు లభించి, సుఖించెదరు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి