5, ఫిబ్రవరి 2022, శనివారం

 గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః।

గురు స్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః॥

    

వందే వాఙ్మనసాతీతం నిర్గుణం సగుణం గురుం।

దత్తాత్రేయ మానందకందం  భక్తేష్ట పూరకమ్ ॥




1. ఆహార నిద్రా భయ మైధునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణామ్ ।

     ఙ్ఞానం హి తేషామధికో విశేషో ఙ్ఞానేన హీనాః పశుభిస్సమానః॥

అనగా ఆహారం, నిద్ర, భయం, మైధునం అనే ఈ నాలుగు సమస్త ప్రాణుల యొక్క సామాన్య ధర్మాలు.   ఇవి పశువులకు, మనుష్యులకు సమానములే.  కాని,  ఒక విశేషమేమనగా, మానవులకు ఉన్నదీ, పశువులకు లేనిదీ ఙ్ఞానము   ఒక్కటే.  అట్టి ఙ్ఞానము  కూడా లేని వాడు పశువుతో సమానము.

2.స్వగృహే పూజ్యతే మూర్ఱః  స్వగ్రామేపూజ్యతే ప్రభుః ।

   స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే ॥రాజు తన రాజ్యమందే పూజింపబడును.  

అనగా మూర్ఖుడు తన  ఇంటి వద్దే గౌరవింపబడును.  ప్రభువు(గ్రామ పెద్ద) తన గ్రామములోనే ఆదరింపబడును. రాజు తన రాజ్యమందే పూజింపబడును.  విద్వాంసుడు మాత్రము అంతటా, ప్రపంచమంతటా పూజింప బడును. 

3.  న చోర హార్యం, న చ రాజకార్యం, న భ్రాతృభాజ్యం, న చ భారకారి।

      వ్యయో కృతే వర్ధత యేవ నిత్యం, విద్యాధనం సర్వ ధన ప్రధానం॥

అన్ని ధనముల కన్న, విద్యా ధనమే చాలా ముఖ్యమైనది, గొప్పనైనది. ఎందుకనగా, విద్యా ధనమును దొంగలు దోచుకొనలేరు. రాజులకు గానీ, ప్రభుత్వమునకుగానీ, పన్నులు విధించుట కుదరదు.  అన్నదమ్ములు పంచుకోలేరు. అది మోయడానికి బరువైనది కాదు.  మరొక విశేషమేమంటే, ఇతర ధనములను ఖర్చుపెడితే అవి తరిగిపోతాయి. కానీ, వాటికి విరుద్ధంగా విద్యాధనము ఖర్చు పెట్టినకొలదీ వృద్ధి పొందుతుంది. కావున అన్ని ధనముల కన్న విద్యా ధనమే మిన్న. 

    విద్యరానివాడు వింత పశువు.  విద్యగలవాడే మానవులలో అత్యధికుడగును. భూమిలో పాతిపెట్టిన ద్రవ్య నిధి వలె  విద్య తరుగని నిధి. ఎవరికు గొప్ప విద్య ఉండునో, అతనికి సర్వదా సమస్త భోగములు ప్రాప్తించును. అతడు సుఖ సంపదలతో, కీర్తి ప్రతిష్టలతో, లోకమునందు అందరిచేత పూజింప బడును. వయస్సులో ఎంత పెద్దవాడైనా, విద్యాహీనుడు గౌరవింపబడడు.  వయస్సులో ఎంత చిన్నవాడైనను, గొప్ప విద్వాంసుడైనచో అందరిచేత పూజింప బడును. సోదరులు లేనివారికి విద్యయే సోదరుడగును. విద్యయే నిజమైన భ్రాత, బంధువు. విద్యావంతుడు అన్నివిధముల గౌరవింపబడును. విద్వాంసుడు పరదేశము వెళ్ళినా అతడు సమ్మానింప బడును. అతనికు పరదేశముకూడా స్వదేశమే అగును. అపారమైన విద్య గలవాడే నిజమైన ఙ్ఞానవంతుడగును. అచ్చమైన విద్య గలవాడే వినయవంతుడగును. అట్టివానియందు ఈశ్వర విభూతి దేదీప్యమానమై వెలుగుచుండును. ధనహీనునకు విద్యయే ధనము. విద్యా ధనమును మించిన ధనము లేదు. 

కావున ప్రతి ఒక్కరూ ప్రయత్న పూర్వకముగా విద్యనార్జింప వలయును అని పెద్దలు చెప్పెదరు. 

విద్యాకామునకు ఉమావల్లభుడు భజనీయుడగును అని భాగవతము ద్వితీయ స్కంధములో చెప్పబడినది కావున విద్యకోరువారు, ఉమా వల్లభుడైన ఈశ్వరుని సేవించి విద్యబడయగలరు.

                                                


















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి